Sunday, February 9, 2020

తుపాకి మాట్లాడితే



చరిత్రను రికార్డు చేయటం కూడా కవిత్వానికి బాధ్యతే.

ప్రశాంతతలో జ్ఞాపకం చేసుకొనే ఉద్వేగాలలోంచి కవిత్వం పుడుతుందన్న వర్డ్స్ వర్త్ మాట – నిత్యం జాతి వివక్షతో ప్రజలు సామూహిక ఊచకోతకు బలి అయ్యే సందర్భాలలో వర్తించదనే విషయం, జీన్ అరసనాయగం బ్లాక్ జులై గురించి వ్రాసిన Apocalypse 83 సంపుటిలోని కవిత్వం చదివితే అర్ధమౌతుంది.

శ్రీలంకలో తమిళులపై జులై, 1983 లో జరిగిన మూక దాడులను ‘బ్లాక్ జులై’ అంటున్నారు చరిత్రకారులు. ఈ దాడులలో దాదాపు మూడువేలమంది ప్రాణాలు కోల్పోయారు. తమిళులకు చెందిన సుమారు ఎనిమిదివేల ఇళ్ళను, ఆరువేలకుపైగా షాపులను తగలబెట్టారు. లక్షా యాభైవేలమంది నిర్వాసితులయ్యారు. ఇదంతా చరిత్ర. చరిత్రపుస్తకాలలో పైన చెప్పిన తారీఖులు, లెక్కలు, కారణాలు మాత్రమే ఉంటాయి. ఆనాటి బాధితుల మనోద్వేగాలు, హంతకుల ఉన్మత్తత, తటస్థుల ప్రవర్తన లాంటివి ఒక్క కవిత్వంలో మాత్రమే లభిస్తాయి. జీన్ అరసనాయగం ఆ దాడులలో ఒక బాధితురాలు కనుక అవన్నీ ఆమె కవిత్వంలో ప్రతిబింబించాయి. చివరి వూపిరిదాకా శ్రీలంక వ్యథని కవిత్వం చేస్తూనే వున్న ఆమె ఈ నెలలో కన్నుమూశారు. ఆమెకి నివాళిగా ఈ అనువాదాలు.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగ ఎక్కడ వివక్షతో ఊచకోత జరిగినా అరసనాయగం కవిత్వాన్ని గుర్తుచేసుకొనే పరిస్థితి ఉంది.

*
తుపాకి మాట్లాడితే – If the gun speaks

తుపాకి మట్లాడితే
అంతా నిశ్శబ్దమే
భయం తాలూకు నిశ్శబ్దం
రక్తంతో, బుల్లెట్లతో తుపాకి మాట్లాడితే.

గణేష్ విగ్రహ తొండానికి గుచ్చిన
ఎర్ర మందారం
ఒక రక్తవాంతులా ఉంది

చేతులపై, కాళ్ళవద్దా ఉంచిన
ప్రతీ పువ్వూ
ఒక తెరిచిన గాయం

నల్లూరు ఆలయవీధిలో బంగారు రథాన్ని
తాళ్ళతో లాగుతున్నారు మనుషులు
ఇసుకలో మెల్లగా కదులుతోందది

ఠాప్ మనే శబ్దాలు
ఓ వేయి కొబ్బరికాయలు పగిలుంటాయి
వాటి తీయని నీరు
అనాచ్ఛాదిత దేహాలపై, తలలపై
ప్రవహించింది

తుపాకుల శబ్దాలు నిలచిపోయాకా
అంతా నిశ్శబ్దం
మంటల చిటపటలు
అగ్నిసముద్రంలా వ్యాపించాయి

చిధ్రమైన బూడిద నేలపై
ఓ వేయి చితులు కాల్తున్నాయి.

(నల్లూరు- ఊరిపేరు. ఇక్కడ పోలీసుల ఫైరింగ్ లో అనేకమంది చనిపోయారు.

అరసనాయకం కవిత్వంలో భక్తిని, మనిషి చేస్తున్న హింసను పారలల్ గా నిలపటం చాలాకవితల్లో కనిపిస్తుంది. నువ్వు సృష్తించిన మానవుడు ఇంత హింసను చేస్తుంటే అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది)

భయం Fear

గొంతులో భయం అడ్డుపడుతుంది
మాటలు బయటకు రావు
అల్లరి మూకల భయం

రాత్రి భయం
వెలుగు భయం
శత్రువుని చూపించే,
పగలంటే భయం
గజగజ వణుకుతూన్న దేహం మొత్తం
భయంగా మారుతుంది

మంటలు, మంటలు, మంటలు.

మృత్యు దృశ్యాలతో కిక్కిరిసిన నేత్రాలు
జ్వరంతో, దిగ్భ్రమతో
రాయిలా అంధత్వం పొందుతాయి.

నిద్రలో భయం, కలల్లో భయం
మాట్లాడితే భయం
వీధులో నడిస్తే భయం
మనవైపు ఎవరైనా
తేరిపార చూస్తే భయం
ప్రతి చూపులో, భంగిమలో భయం,
అడుగువేయాలంటే భయం
వాళ్ళు మమ్మల్ని చంపటానికి
వస్తున్నారంటే భయం
పారిపోవాలంటే భయం

మోకరిల్లటానికి ఇంకేమాత్రమూ శక్తి లేని దేహంతో
ఇంకా ఇక్కడే ఉంటున్నందుకు
నా ఆత్మలో ఏ కొంతైనా సారం మిగిలి ఉంటుందా?

శరణార్ధి శిబిరం – Refugee camp 1983

నేను ధరించిన ఒకే బట్ట
అది భరిస్తోన్న నా చమట, మురికి
నాకొక గుర్తింపు, హోదాను ఇస్తోంది

నేనెవరినో నాకు తెలిసింది

నేనెవరితో ఉన్నానో, మాట్లాడుతున్నానో
కలిసి దుఃఖపడుతున్నానో
మా అందరకూ ఒకటే పేరు
-శరణార్థి-

ఈ స్కూలు ఆవరణలో
రెండు చేతులు ముందుకు చాచి
ఈ ప్లేటులో వేయించుకొన్న గుప్పెడు మెతుకులు
నా ఆకలిని శాంతింప చేయొచ్చు
బహుసా నీది కూడా.
ఇదోరకమైన ఆకలి, తొందరగానే తీరుతుంది
ఏ భయము, ఏ అపాయమూ లేకుండా
జీవించాలనే ఆకలి అలా కాదు.

కొన్ని గుడ్డలేవో మడతపెట్టుకొని
తలగడగా చేసుకొని సిమెంటు నేలపై పడుకొంటాను
స్కూలు డెస్క్ లే నా పొలిమేరలు.
సురక్షిత ప్రాంతపు అంచుల్లో ఉండేదాన్ని
తటస్థ భూమి.

లక్షమందో ఇంకా ఎక్కువమందో ప్రజలతో పాటూ
నేనూ నిర్వాసితమయ్యాను
-అందరూ శరణార్థులే-

అనువాదం: బొల్లోజు బాబా

(ఈ వ్యాసం సారంగ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)

నిశ్శబ్దం పై రూమీ



1
పదాలింక చాలు మిత్రమా
చెవులను చూడనియ్యి,
నీ మిగతా కవితను
ఆ భాషలో మాట్లాడించు

2.
ఈ కవిత నిడివి తగ్గిస్తాను
ఎందుకంటే
అదంతా ఈ ప్రపంచంలో
మన కళ్ళముందు కనిపిస్తూనే ఉంది.

3.
ఈ నిశ్శబ్దాన్ని గుర్తించావా?
అది నువ్వు నీ గదిలో ఒంటరిగా
మాట్లాడటానికి ఎవరూ లేనప్పటి
నిశ్శబ్దం లాంటిది కాదు.

4.
ఇది స్వచ్ఛమైన నిశ్శబ్దం
ఇది
బ్రతికున్న కుక్కలు చచ్చిన కుక్కను
పీక్కు తింటున్నప్పటి నిశ్శబ్దం కాదు.

5.
నిర్మలమైన ఖాళీగా మారు
అందులో ఏముంటుంది? అని నువ్వు అడిగితే
నిశ్శబ్దం మాత్రమే అని చెప్పగలను.

6.
నిశ్శబ్దం
నువ్వు సాధన చేయాల్సిన కళ

మూలం: జలాలుద్దీన్ రూమీ
అనువాదం: బొల్లోజు బాబా

పురావస్తు తవ్వకాల చోటు వద్ద - At an Archaelogical Site by Yahuda Amichai



ఒక పురావస్తు తవ్వకాల చోటు వద్ద
శుభ్రంగా తుడిచి, వరుసలలో పేర్చిన
విలువైన వస్తువుల, పాత్రల శకలాలను చూసాను
ఆ పక్కనే
వ్యర్ధమని పారబోసిన ధూళి గుట్ట ఉంది.
దానిపై ముళ్ళ మొక్కలు కూడా మొలవవు

లోతుల్లోంచి తవ్వి, అణువణువూ గాలించి,
హింసించి, వేరుచేసి కుమ్మరించిన
ఈ ధూళి గుట్ట ఏమై ఉంటుందా అని
నాలో నేను తర్కించుకొన్నాను.

సమాధానం దొరికింది

ఈ ధూళి అంతా మనలాంటి ప్రజలే
వెండి, బంగారం, చలువరాయి
ఇంకా విలువైన వస్తువులనుండి
జీవితకాలమంతా దూరం చేయబడి
చనిపోయి నేటికీ ఇంకా ధూళిగానే
మిగిలిపోయిన మనమే

ఈ ధూళి కుప్పే మనం,
మన శరీరాలు,
మన ఆత్మలు
మన నోటి మాటలు
మన అన్ని ఆశలు.

Source: At an Archaelogical Site by Yahuda Amichai
అనువాదం: బొల్లోజు బాబా

"ఒక… " లో అనేకత్వమే సిద్దార్థ కవిత్వం





(సిద్దార్థ కట్టా కవిత్వ సంపుటి “ఒక…” రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్న సందర్భంగా అభినందనలు తెలుపుతూ )

సిద్ధార్థ కట్టా కవిత్వం జీవితంలోని మల్టిప్లిసిటీని ప్రతిబింబిస్తుంది. అందుకే ఇతని కవిత్వంలో కాషాయమయమైన రాజకీయాలు; సానిటరీ పాడ్ల మీడ పన్నులు వేసే రాజ్యం పట్ల ధిక్కారం; గాయాలగేయాలతో రాజ్యానికి ఉరితాళ్లు పేనటం; విప్లవాన్ని స్వప్నించే తూనీగలు; నేలను లాక్కెళ్ళి నేలమీద పడేసే పసిపాప పాదాలు; పూలను మొక్కలకే ఉంచవా, నేను అమ్మవద్దే ఉన్నట్టు అని అభ్యర్ధించే పసిహృదయాలు; చీరమడతల్లో వెయ్యో అరవెయ్యో దాచిపెట్టే అమ్మలు; నోటుపై గాంధిబొమ్మ బదులు నాన్న బొమ్మ ఉండాలనేంతగా ప్రేమించబడే నాన్నలు; error 404 page not found లాంటి అత్యాధునిక పరిభాషలో పలికే వీడ్కోలు గీతాలు; మాట్లాడే సీతాకోకలు; ప్రేమలో ప్రతీదీ ప్రాణం పోసుకొంటుందన్న ఎరుకా; ….. లాంటి భిన్న జీవన పార్శ్వాలు అద్భుతంగా పలికాయి.

వస్తు విస్త్రుతి సిద్ధార్థ కవిత్వానికి గొప్ప బలం. చంద్రికల నుంచి ఉరికొయ్యలదాకా ఇతని కవిత్వం విస్తరించి ఉంది. యువకవుల్లో ఇది అరుదుగా కనిపించే లక్షణం. మంచి కవినుండి గొప్పకవిని వేరుచేసేది ఈ లక్షణమే.

ఇతని వ్యక్తీకరణ పరిధి చాలా విశాలమైనది. “రాత్రికి పెరుగన్నంలోకి చందమామను నంజి పెట్టేది” అని అమ్మగురించి ఎంత సౌకుమార్యంగా వర్ణిస్తాడో “పురుషాంగాలకు కత్తులు /మొలిచినపుడే మీ జాతి అంతరించింది” అంటూ పసిపిల్లలను అత్యాచారాలు చేయటం పట్ల తీవ్రంగా ఆక్షేపణ చేయగలడు.
నేడు మనుషులను మనుషులుగా కాక సమూహాలుగా మాత్రమే గుర్తించుకొంటున్న కాలం. సిద్ధార్థ కవిత్వం మనుషులను ప్రేమించటంలోని సౌందర్యాన్ని పట్టిచూపుతుంది. ఇది మానవసంబంధాలను వ్యక్తీకరించే అంశం. మానవసంబంధాలకవిత్వం కాలం ఉన్నంత వరకూ నిలిచిఉంటుంది.

ఎవరైనా జ్ఞాపకం వస్తే
ఒక దీపాన్ని వెలిగించి
చుట్టూతా చేతులను ఉంచండి
స్పర్శతడి సజీవంగా ఉన్న
మీ చర్మాలకు అతుక్కు పోతారు//
మీరో పూలవనాన్ని నిర్మించుకోండి
ఆప్తుల మాటలన్నీ
అత్తరులో మునిగిన తూనీగలై
తచ్చాడుతాయి (జ్ఞాపకమొస్తే) …. లాంటి వాక్యాలలోని ఆర్థ్రత మనుషులు ప్రేమైక జీవులని, ఇచ్చిపుచ్చుకోవటంలోనే జీవితపు అత్తరుపరిమళాలు ఉంటాయని చెపుతాడు సిద్ధార్థ.

కవిత్వంలో సౌందర్యవర్ణణలు ఆక్షేపణకు గురవుతున్న సందర్భమిది. సామాజిక ఘర్షణే కలిగిఉన్నదే ఉత్తమ కవిత్వమని తీర్మానించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాసిన ఈ వాక్యాలు- జీవితంలోని అన్ని పార్శ్వాలను కవిత్వం స్పృశించినపుడు అది సంపూర్ణమౌతుందన్న సత్యాన్ని ఆవిష్కరిస్తాయి.

ఒక రోజు ఎలా వస్తుందో తెలుసా
నీ అరచేతుల మీద సీతాకోక చిలుకలు వాలినట్లు
నల్లటి చెరువులో చంద్రుడు బంతిపువ్వై ఈదుతున్నట్టూ
ఒకపూట తన హంసపాదాలతో వెతుకుతుంది నిన్ను
పాల మీద మీగడ కట్టుకున్నట్టు భలే నవ్వుతావప్పుడు మెత్తగా
నీ నోరు 32 నక్షత్రాల ఆకాశం మరి// (ఎలా వస్తుందో తెల్సా) వాక్యాలలో - చంద్రుడుని నల్లటి చెరువులో బంతిపువ్వుగా పోల్చటం గొప్ప ఊహ. ముత్యాల లాంటి పళ్ళు అనటం ఒకనాటి కవిసమయం. నోరారా నవ్వటాన్ని 32 నక్షత్రాల ఆకాశం అనటం బహుసా ఏ పూర్వకవీ చేయని ప్రయోగం. మనల్ని, మనజీవితాల్ని ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరిచేసి, నిలువనీయని జీవనసౌందర్యపు అనుభూతులు ఇవన్నీ. అందంగా, ప్రతిభావంతంగా చెప్పినప్పుడు ఇవికూడా కవిత్వానికి అర్హమే!

మనిషి ఒక అద్భుతం అనేకవితలో ఒక అద్భుతాన్ని చూపిస్తాడు సిద్ధార్థ. మానవ జన్మ ఉత్తమమైనదని ప్రవచన కారులు చెప్పొచ్చు. వాటి అర్ధాలు వేరు, వాటి ఉద్దేసాలు వేరు. మనిషి ఎందుకు అద్భుతమయ్యాడో ఒక కవిగా ఇలా అంటాడు సిద్ధార్థ.
నువ్వు ఊహించు
బతకటం ఎంత అద్భుతం//
ఎండకి గొంతెండిన పావురం
దాహాన్ని గ్రహించగలవు
కిటికీ చివర
రెండు దోసిళ్ల నీటిని పూయగలవు

అవన్నీ కాదు గానీ
ఓ పొడిగుండెని నువ్వు కనిపెట్టలేవా?
దానిని తడి చేసే మాయ నీలో ఇంక లేదా?
మనిషివి కదా
తడి చేయటం నీ లక్షణం
ఇప్పుడు చెప్పూ మనిషెంత అద్భుతం (మనిషి ఒక అద్భుతం) ఏ వాక్యమూ వాచ్యం కాదు. ప్రతీ వాక్యమూ ధ్వన్యాత్మకమే. మనిషి జన్మ రహస్యం, దాహాన్ని గుర్తించటం, తడిచేయటం….. అంతే ఈ రెండే. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా ఇదే అంతిమ సత్యం. దాన్ని గుప్పెడు వాక్యాల్లోకి కుదించిన సిద్ధార్థను కవి అని ఎలా అనగలం? ఒక అద్భుతమని కాక.

పిల్లలంటే సిద్ధార్థకు ప్రేమ. పసిపాపల ప్రస్తావన అనేక కవితల్లో వస్తుంది. వచ్చిన చోటల్లా ఆల్చిప్పలో కృత్రిమ ముత్యాన్ని పెట్టినట్లు కాక సహజంగా అమరిపోవటం కవి ప్రతిభ.

దాచుకున్న బొమ్మకు స్నానం చేయించినట్టు
నేల బుగ్గపై పసిపిల్ల ముగ్గురాసింది
ఆకాశం ఆశపడి నీళ్ల ముద్దు పెట్టింది
ఒక నాన్న చెంపలు తడిచిపోయాయి (ఐదు రెక్కలు) కూతురు వేసిన ముగ్గు వానకు కొట్టుకుపోతే నాన్న ఏడ్చాడట. ఎంత ఉదాత్త ఊహ. ఆ ఊహను కవిత్వీకరించిన విధానం ఎంత దీప్తిమంతంగా ఉందీ! ఇక్కడ వానకు కూడా పాపంటే ఇష్టమేనని ఎంత గడుసుగా అంటున్నాడూ కవి.

//పూలమొక్కను
నన్నుగా పరిగణించి
కొద్దిగా నీళ్ళను ఇవ్వండి
మీ పిల్లల అలంకరణకు
కొన్ని పూలను ఇస్తాను// (Error 404) ఇదొక వీడ్కోలు గీతం. నాకోసం వెతక్కండి అంటున్నాడు కవి. ఇక్కడ “నేను” లో ఉన్నది జీవన పరాజితుడో, రాజ్యం మాయం చేసిన అమరుడో ఎవరైనా కావొచ్చు. ఈ సందర్భానికి పిల్లల అలంకరణ ప్రస్తావనలో కవి ప్రేమే కనిపిస్తుంది.

//పక్కింటి పసిపిల్ల జ్వరం వాసన
పక్కింటి పూలతోటను రాతిరెవరో ఖాళీ చేశారట మరి// (పసి పిల్లకు జ్వరమొచ్చింది) వాక్యంలో కవి ఆడుకొనే పసి పిల్లలను పూలతోటగా వర్ణించటం ఒక రమణీయ ప్రతిపాదన.
Our kid కవిత ఒక భీభత్సరసప్రధాన మోదాంత మహాకావ్యం. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి తెచ్చిన విషాదాన్ని అక్షరీకరిస్తుంది. ఈ కవితలో వివిధ ఇంగ్లీషు వాక్యాలవాడటం కూడా చెపుతున్న వస్తువుకు బలం చేకూర్చటానికే. “Every school is a corporate prostitute, //
Do you know how much I do for you,//
Really no one loves me except this bubbly bus driver// సంజయ్ రిమెంబెర్ ఇట్/ ఇఫ్ యు గెట్ ఎ బెటర్ రాంక్, డాడ్ విల్ బై ఎ ప్లే స్టేషన్ ఫర్ యు//
Sanjay kumar roll num: 532/Got caught by squad while copying” లాంటి వాక్యాలు నేటి విద్యా వ్యవస్థలో పిల్లలు గురవుతున్న హింస తాలూకు బీభత్సాన్ని కళ్లకు కడతాయి. మనం ఇంతటి అమానవీయతకు అలవాటుపడిపోయామా అని జలదరింపచేస్తాడు.
కవితను అలా నడిపించి మనం ఏం చేయటంలేదో ఒక్కొక్కటీ గుర్తుచేస్తాడు సిద్ధార్థ కవిత మిగిలిన సగభాగంలో. “ఒంటికి వెన్న పూసుకున్న పాపాయి ఒక మెత్తని రహస్యమట”, "దూది చేతులు చాచి ఇక ఎత్తుకోమని అడుగుతాయట", "ఒక పాప భూజాల గూటిలోకి దప్పిక పిచ్చుకలా చేరుతుందట". ఆ కవిత చివర్లో ఇలా ముగిసి మనల్ని రకరకాల ఆలోచనల్లోకి నెట్టేస్తుంది.
బావి చుట్టూ చేరి
లోపలి చంద్రుణ్ణి చూపిస్తూ
వాళ్ళకోసమే రాలాడని
అబద్దం చెప్పండి//

మీలాంటి వాళ్ళనీ, మీమీ నాన్నల వంటి వాళ్ళనీ
అచ్చూ అలాంటి పోలికే అని
వాళ్ళలోకి ప్రవహించకండి
పిల్లలు మీ వారసత్వం కాదు
వాళ్ళు మీ అనుచరులూ కారు
పిల్లలు వట్టి పిల్లలే…… (our kid). మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ కవిత, జిబ్రాన్ పిల్లలపై వ్రాసిన కవితకు ఒక పొడిగింపుగా అనుకొంటాను.

సిద్ధార్థ కవిత్వంలో సౌందర్యం ఎంత తేటగా పలుకుతుందో సమకాలీన రాజకీయాల పట్ల ఆవేదన, కోపం కూడా అంతే నిజాయితీగా పలుకుతాయి.
//రాజ్యమిపుడు
ఆవులా ఉంది, కాషాయంలా ఉందీ
పోలీసు బూటు కాలంత బలంగా ఉంది
రంగురంగుల గూండాల చేతిలాఠీలాను ఉంది
మొన్నటి వరకూ నాకో అనుమానం ఉండేది
ఇప్పుడు నివృత్తి అయింది
తూటాలదిప్పుడు కాషాయపు రంగే// (ప్రశ్న అనుకొని) -- గౌరీలంకేష్ హత్యపై రాసిన ఈ కవిత నేటి మత రాజకీయాలను స్పష్టపరుస్తుంది.

చివరగా అన్నీ దాటుకుని
ఓ చిన్నారి తూనీగ
సూర్యుని నెత్తిమీద వాలుతుంది
అప్పుడు నీకూ అనిపిస్తుంది
విప్లవం ప్రకృతి ధర్మమని. -- (విప్లవ ప్రకృతి ధర్మం). ఎన్ కౌంటర్ల పేరిట ఎంతమందిని చంపినా అంతిమంగా విప్లవమే జయిస్తుందని, ఎందుకంటే విప్లవం అనేది ప్రకృతి ధర్మమని అంటాడు. ఈ తరహా కవిత్వంలో ఇదొక నవ్యమైన ఊహ.

ఆధునిక జీవన సారాంసాన్ని కవిత్వం చేయటం సిద్ధార్థ కవిత్వలక్షణం. మంచి పదచిత్రాలను అలవోకగా సృష్టించగలిగే ప్రతిభకలిగినవాడు సిద్ధార్థ. జీవితంలోని మల్టిప్లిసిటీని అర్ధం చేసుకొన్నవాడు. జీవితం పట్ల తనకున్న నిర్ధిష్టమైన ఆలోచనలను సౌందర్యాత్మకంగాను, శక్తివంతంగానూ కవిత్వంలోకి ఒంపగలిగిన నేర్పు కలిగినవాడు.

“ఒక” ఇతని తొలి కవిత్వసంపుటి. భవిష్యత్తులో ఇతను మరిన్ని సంపుటులుగా విస్తరించి, తెలుగు కవిత్వకిరీటానికి మెరుపుల తురాయిలా వెలగాలని ఆశిస్తున్నాను.
రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్నందుకు అభినందనలు.

బొల్లోజు బాబా

ప్రేమ...



చాన్నాళ్ళ తరువాత
చిన్ననాటి స్నేహితురాల్ని
కలిసాను
ఒకనాటి విఫల ప్రేమికురాలు
ఆమె.

ప్రేమించిన వాడి
పేరును
చేతిపై పచ్చబొట్టు
వేయించుకోవటాన్ని
వింతగా చెప్పుకొనేవాళ్ళం
అప్పట్లో!

హృదయంపై ఉండే
బార్‌ కోడ్‌ గీతలు ఒక్కొక్కటీ
కులానికి
మతానికి
అంతస్తుకి
ప్రతీకలని ఇప్పటికైనా
గ్రహించిందో లేదో!

బొల్లోజు బాబా

ఎవరు వీళ్లంతా?



ఏసుబాబు
వీరాస్వామి
లక్ష్మణరావు
పెంటయ్య
ఇంకా కొంతమందీ.... ఎవరు వీళ్ళంతా!
ఓ ముప్పై నిముషాల వ్యవధిలో
ధరాధిపతులు, నరహంతకులూ అనాదిగా
చేసిన కృత్యాలన్నీ అకృత్యాలేనని
ఒక్క తులసిదళంతో తేల్చిపారేసారు.

అంత చేసీ
ఒడ్డుకు లాక్కొచ్చిన ఇరవైఏడుమందిలో
ముగ్గురి ప్రాణాలు కాపాడలేకపోయామని
బాధపడుతున్నారు చూడు!

ఓ నా చిట్టి మేధావీ!

ఆ కొద్దిక్షణాలూ
బొట్టు, టోపీ, శిలువా, రోలెక్స్ వాచీ
ఏ తారతమ్యం లేదక్కడ
ఆ కొద్దిక్షణాలూ
మనం నిర్మించుకొన్న
గోడలన్నీ కుప్పకూలిపోయాయి

ఓ నా చిట్టి మేధావీ!
మరోసారి చెపుతున్నాను విను.

మానవత్వం ఒకటే
మునిగిపోతున్న ప్రాణానికి ప్రాణం పోసింది
మనిషితనం ఒకటే
మనిషిని మనిషితో బంధించింది.
మనిషి గమ్యం మనిషితనమే ఏనాటికైనా!

ఐస్ ఏజ్ నుంచి డిజిటల్ ఏజ్ దాకా
మానవజాతి నౌకాయానానికి
ఏ చరిత్రా గుర్తించని
కనిపించని తెడ్లు వీళ్ళు.
మనుషులుగా మనం పూర్తి వైఫల్యం
చెందలేదనటానికి మిగిలున్న
ఒకే ఒక సాక్ష్యం వీళ్ళు.

బొల్లోజు బాబా

(ఇటీవలి గోదావరి బోట్ ప్రమాదంలో అనేక ప్రాణాలు కాపాడిన స్థానికజాలరుల కొరకు)

1857 సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర్య పోరాటమా?



సిపాయిల తిరుగుబాటు మొదటిదీ కాదు స్వాతంత్ర్యపోరాటమూ కాదు.

ఈస్ట్ ఇండియా కంపనీ (వ్యాపారుల కూటమి) 31 డిసంబరు, 1600 లో క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఒక రాజపత్రం ద్వారా అనుమతి తీసుకొని భారతదేశంలో వ్యాపారం చేయటానికి అడుగుపెట్టింది. మొదట్లో దీనికి రాజ్యాధికారం చెలాయించాలనే కోరిక లేదు కానీ కాలక్రమేణా స్థానిక రాజకీయాలలో కలగచేసుకొని రాజ్యాలను ఆధీనంలోకి తెచ్చుకోవటం మొదలుపెట్టింది. సొంత సైన్యాన్ని ఏర్పాటుచేసుకొంది.

1803 లో ఈస్ట్ ఇండియా కంపనీ వద్ద రెండున్నరలక్షల "ప్రెవేట్ సైన్యం" ఉండేది. అప్పటి బ్రిటన్ ప్రభుత్వ సైన్యం సంఖ్యకు ఇది రెట్టింపు.

ఈస్ట్ ఇండియా కంపనీ యుద్ధాలు చేసింది. రాజుల్ని ఓడించింది. వారసులు లేని రాజ్యాలను ఆక్రమించుకొంది. తన "ప్రెవేట్ సైన్యం" సహాయంతో కప్పాలను వసూలు చేయటం మొదలెట్టింది. 1850 నాటికి భారతదేశంలోని మూడొంతుల భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొంది.

అలా ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం 1857లో సిపాయిల తిరుగుబాటు వరకూ కొనసాగింది. సిపాయిల తిరుగుబాటు ఉదంతంతో విక్టోరియారాణి ఈస్ట్ ఇండియా కంపనీని రద్దు చేసి బారతదేశాన్ని 1858లో తన పాలనలోకి ( క్రౌన్ పాలనలోకి) తీసుకొంది. అప్పటినుంచి 1947 దాకా సాగిన పాలనను బ్రిటిష్ రాజ్ అని చరిత్రకారులు పిలుస్తారు.

ఈ క్రమంలో భారతదేశంలో 1858 వరకూ జరిగింది - వ్యాపారస్తుల కూటమి ప్రెవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని జరిపిన ఆధిపత్యమే తప్ప ఒక ప్రజాస్వామ్యయుత, రాజ్యపాలన కాదు. అసలు అది ప్రభుత్వమే కాదు.

1858 నుంచి జరిగినది వ్యవస్థాగతంగా, చట్టాలకు లోబడి జరిగిన రాజ్య/ప్రభుత్వ పాలన.
****

సిపాయిల తిరుగుబాటే దేశంలో జరిగిన మొదటి తిరుగుబాటా?

వేలసంవత్సరాలుగా రాజు పేరుమీద ఉండిన భూమిహక్కులు ఒక్కసారిగా కంపనీకి దఖలు పడ్డాయి. ఆ భూమిని సాగుచేసుకొంటూ ఉన్న భూస్వాములకు పించను ఏర్పాటుచేసి వారిని తొలగించింది కంపనీ. ఈ చర్యతో అంతవరకూ ఒక హార్మొనీతో నడచిన సమాజం పెద్ద కుదుపుకు లోనైంది. నిజానికిది నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఆధారిత ఫ్యూడల్ సమాజం.

ఈస్ట్ ఇండియా కంపనీ వారి దుశ్చర్యలను ప్రతిఘటిస్తూ 1857కు ముందునించీ అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి

కట్ట బొమ్మన తిరుగుబాటు, తమిళనాడు (1792-1799)
పైకుల తిరుగుబాటు, ఒరిస్సా (1804-1806)
వేలు తంబి తిరుగుబాటు, కేరళ (1808 - 1809)
కిట్టూరు తిరుగుబాటు, కర్ణాటక (1824-29)
బుందేల్ తిరుగుబాటు, మధ్య ప్రదేష్ (1842)
వీరభద్రరాజు తిరుగుబాటు, విశాఖపట్నం (1827-1833)
పాలకొండ తిరుగుబాటు, తూర్పుగోదావరి (1831-1832)
పర్లాకిమిడి తిరుగుబాటు, ఒరిస్సా (1829-35)

పై తిరుగుబాట్లన్నీ

తమతమ అధికారాలను నిలుపుకోవటానికి
భూమిపై తమ పెత్తనాన్ని కొనసాగించటానికి
ఇతర వ్యక్తిగతకారణాలతో
స్థానికంగా జరిగాయే తప్ప దేశభక్తి, స్వాతంత్ర్యకాంక్ష లాంటి జాతీయ భావాలతో దేశమంతా విస్తరించి జరగలేదు.

1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వీటన్నిటికన్నా పెద్దది. ఇది బ్రిటిష్ వారిని గడగడలాడించింది. ఇది కూడా వ్యక్తిగత కారణాల కోసమే జరగడం గమనార్హం.

ఈ తిరుగుబాటులో బెంగాల్ సైనిక పటాలం ఒక్కటే పాల్గొంది. మద్రాసు బొంబాయి సైనికులు పాల్గొనలేదు. బ్రిటిష్ సైనికులకు మూడురెట్లు ఎక్కువ జీతం ఇస్తున్నారనే అనే కారణం ప్రధానంగా కనిపిస్తుంది వారి తిరుగుబాటుకు

సిపాయిల తిరుగుబాటుకు మద్దతు పలికిన నాయకులకు కల వ్యక్తిగత కారణాలు ఇలా ఉన్నాయి.

1. బహదూర్ షా II అప్పటికి రాజ్యం లేని మొఘల్ చక్రవర్తి. మొఘల్ రాజ్య పునస్థాపనకొరకు యత్నించాడు.
2. నానాసాహెబ్ కు పించను తగ్గించారు. కంపనీవారితో చేసిన చర్చలు ఫలించలేదు.
3. కంపనీ వారు రాణి లక్ష్మి బాయి దత్తతకుమారుడిని వారసునిగా గుర్తించలేదు
4. బెంగాల్ సైనికులు మొఘల్ రాజ్యాన్ని స్థాపించటం లక్ష్యంగా పెట్టుకొంటే, నానాసాహెబ్, తాంతియాతోపెలు మరాఠా రాజ్యాన్ని స్థాపించాలని తలచారు. ఈ వైరుధ్యం తిరుగుబాటు వైఫల్యానికి ప్రధాన కారణం.
5. సిపాయిల తిరుగుబాటుకు ఆధ్యుడుగా భావించే మంగళ్ పాండే ఒపియం ఎక్కువగా తీసుకొని ఉద్రేకితుడై బ్రిటిష్ అధికారిని చంపాడని రికార్డులద్వారా తెలుస్తుంది.

అందుకనే జవహర్ లాల్ నెహ్రూ 1857 తిరుగుబాటుని ఫ్యూడల్ శక్తులు సమాజంపై తమ పట్టుని నిలుపుకోవటానికి చేసిన ఒక ప్రయత్నమని అన్నాడు.
****

1857 సిపాయిల తిరుగుబాటుని ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం అని మొదట ఎవరు అన్నారు?

The Indian War of Independence (1909) అనే పుస్తకంలో వీర్ సావార్కర్ 1857 నాటి సిపాయిల తిరుగుబాటుని మొదటి స్వాతంత్ర్యపోరాటంగా అభివర్ణించాడు. ఆయన సమకాలీనులు, చరిత్రకారులు ఆ వాదనను అప్పట్లోనే ఖండించారు.

వీరిలో ప్రముఖ చరిత్రకారుడు శ్రీ R.C Majumdar ముఖ్యుడు. భారతీయ మధ్యతరగతి వర్గాలు ఇంగ్లీషు చదువులు చదువుకొని, అంతర్జాతీయ పరిణామాలను అర్ధం చేసుకొని స్వాతంత్ర్య పోరాటానికి దేశాన్ని సమాయుత్తపరిచారని మజుందార్ అంటాడు.

1905 లో బెంగాల్ విభజన జరిగినపుడు దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని "మొదటి స్వాతంత్ర్య సంగ్రామం" అని మజుందార్ అభిప్రాయపడ్డాడు.

బెంగాల్ విభజనను దేశవ్యాప్తంగా జాతీయవాదులు వ్యతిరేకించారు. ఈ విభజన వ్యతిరేక ఉద్యమం/ వందేమాతర ఉద్యమం/స్వదేశీ ఉద్యమంగా మారి భారతదేశ ప్రజలను సంఘటితం చేసి బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విముక్తం చేయాలన్న కోర్కెను వారిలో రగిల్చింది. .

రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జి, సుబ్రహ్మణ్య భారతి, అరవింద్ ఘోష్, ముట్నూరి కృష్ణారావు, చిదంబరం పిళ్లై లాంటి ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పైన పేర్కొన్న ప్రముఖుల పేర్లను గమనిస్తే

1. ఈ ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా జరిగినట్లు అర్ధమౌతుంది.
2. వారికి పరాయిపాలన నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న కోరిక తప్ప మరేవిధమైన వ్యక్తిగత ప్రయోజనాలు కనిపించవు.
****

బ్రిటిష్ పార్లమెంటు 1784 లో చేసిన పిట్స్ ఇండియా యాక్టు ద్వారా కంపనీ మెంబర్లు సివిల్, మిలటరీ, రెవిన్యూ హక్కులు తెచ్చుకొన్నారు. (వీళ్ళే అక్కడ ఎలైట్ వర్గాలు). దాంతో మరింత రెచ్చిపోయారు. ఆ తరువాత వచ్చిన 1813, 1833 ల నాటి చార్టర్ల ద్వారా కంపనీ అతిని కొంతమేరకు నియంత్రించటానికి ప్రయత్నించింది బ్రిటిష్ పార్లమెంటు.

1857 తిరుగుబాటులో 6 వేల మంది బ్రిటిషర్లు చనిపోవడం ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అరాచకాల ఫలితమని బ్రిటష్ పార్లమెంటులో Benjamin Disraeli వాదించిన ఫలితంగా భారతదేశం క్రౌన్ పాలనలోకి వచ్చింది. ఆ రకంగా సిపాయిల తిరుగుబాటుకి ఉన్న చారిత్రక ప్రాధాన్యత తక్కువేమీ కాదు.

1857 నాటి తిరుగుబాటునే ప్రధమ స్వాతంత్ర్య పోరాటంగా అంగీకరించటానికి ఇన్ని మతలబులు ఉన్నప్పుడు .......1847 లో పించను తగ్గించారని చేసిన ఒక ఉక్రోషపు తిరుగుబాటును "తొలి స్వాతంత్ర్యపోరాటం" అని ప్రచారించుకొంటూంటే ఆశ్చర్యంగా ఉంది.

బొల్లోజు బాబా

కనీసం తొలి పాలెగాండ్ర పోరాటం కూడా కాదు


.
నిజాం రాజు తనకు సైనిక సహాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఈస్ట్ ఇండియా కంపనీకి 1800 లో బళ్ళారి, కడప, అనంతపురం ప్రాంతాలను ధారాదత్తం చేసాడు. వీటిని సీడెడ్ జిల్లాలు అంటారు.

కృష్ణదేవరాయల కాలంనుంచీ ఈ ప్రాంతాలలో పాలెగాండ్ర వ్యవస్థ ఉంది. ఒక పాలెగార్ ఆధీనంలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించిన శిస్తులను వసూలు చేయటం, తగాదాలు తీర్చటం అతని విధి. ఇందుకోసం వాళ్ళు సొంత సైన్యం కూడా కలిగిఉండేవారు. వసూలు చేసిన శిస్తులలో కొంతభాగం రాజుగారికి కప్పం రూపంలో చెల్లించాలి.

కప్పాలు సరిగ్గా చెల్లించని పాలెగాళ్లను రాజు తొలగించినపుడు ఆ గ్రామాల హక్కులను ఇతర పాలెగాళ్ళు ధరచెల్లించి పాడుకొనే వారు.

ఈస్ట్ ఇండియా కంపనీకి ఈ ప్రాంతాలు దఖలుపడటంతో ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమనే భాద్యతను థామస్ మన్రో అనే అధికారికి అప్పగించింది కంపనీ. 9, నవంబరు 1800 న థామస్ మన్రో బళ్లారికి వచ్చాడు.

భూమి శిస్తువసూలులో రైతువారి వ్యవస్థను ప్రవేశపెట్టటానికి ఈస్ట్ ఇండియా కంపనీని ఒప్పించాడు థామస్ మన్రో. రైతు వారి వ్యవస్థ అంటే జమిందార్లు, పాలెగాండ్రు లాంటి మధ్యవర్తులకు కాక రైతులకే నేరుగా భూమి అప్పగించి వారినుండి పన్నులు వసూలు చేసే వ్యవస్థ. ఇది అప్పట్లో గొప్ప విప్లవాత్మక భూసంస్కరణ.

1800 లో ఈ సీడెడ్ ప్రాంతాలలోని భూమినంతా స్వాధీనం చేసుకొంది కంపనీ. పాలెగాండ్రులందరూ తమ అధికారాన్ని, పెత్తనాన్ని రాత్రికి రాత్రి కోల్పోయారు.

అంతవరకూ తరతరాలుగా భూమిపై హక్కులు అనుభవిస్తున్న పాలెగాండ్రు దీన్ని వ్యతిరేకించారు. వారినందరనీ చర్చలకు పిలిచి వారి వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి కంపనీనుంచి పించను ఏర్పాటు చేసి చాలా మట్టుకు పాలెగాండ్ర అసంతృప్తిని తొలగించగలిగాడు థామస్ మన్రో. అయినప్పటికీ తాము కోల్పోయిన హక్కుల్ని పునరుద్దరించుకోవటం కొరకు కోటల్ని ఆక్రమించుకొంటూ, గ్రామాల్లో కంపనీ అధికారుల్ని చంపివేస్తూ అనేకమంది పాలెగాండ్రు తిరుగుబాట్లు చేసారు.

1800 డిసంబరు నెలలో అయిదువందల మంది అనుచరులతో బళ్ళారిలో హరి నాయకన్ తిరుగుబాటు; నూట డబ్బై మూడు మంది కంపనీ సైనికుల మరణానికి కారణమైన 1801 నవంబరు నాటి పొటేల్ తిరుగుబాటు; 1802 జులై నెలలో ముప్పై ఆరుమంది అనుచరులతో దివాకర్ నాయర్ చేసిన అలజడి; వేలమందిని సమీకరించి 1804 లో కుద్రిత్ ఉల్లాఖాన్, ఇతర పాలెగాండ్రు చేసిన తిరుగుబాటు; అయిదువందల మంది అనుచరులతో 1804 మార్చ్ 27 న కొనకొండ్ల కోటను స్వాధీనంచేసుకొన్న గురువప్ప నాయర్ తిరుగుబాటు లాంటి అనేక పాలెగాండ్ర పోరాటాలను కంపెనీ సైన్యం అణచివేసింది. కొంతమందిని ఉరితీసింది.

గొడికోట పాలెగార్ అయిన బొమట్రాజు 1828 జూన్ 28 న తనకు ఇస్తున్న పించను సరిపోవటం లేదని ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నానని "తిండిలేక మేము చచ్చిపోతున్నాము" అని కంపనీ హవాల్దారు వద్ద చెప్పుకొన్నాడు. అధికారులు స్పందించకపోవటంతో కొంతమంది సేవకుల్ని వెంట వేసుకొని కంపనీ అధికారులపై దాడులు చెస్తే అరెస్టు చేయబడ్డాడు.

నొసుమ్ సంస్థానానికి పాలెగార్ నరసింహారెడ్డి. నొసుమ్ సంస్థానాన్ని కంపనీ స్వాధీనం చేసుకొనే సమయానికి, అంతవరకూ బాకీపడిన శిస్తు నిమిత్తమై వచ్చి వివరణ ఇవ్వాల్సిందని 1800 లో థామస్ మన్రో పిలిచినపుడు నొసుమ్ నరసింహారెడ్డి హాజరు కాలేదు.

క్రమేపీ ఏ ఆదాయవనరులూ లేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తటంతో తన పంతాన్ని వీడి పించను తీసుకొని, ఇంటికే పరిమితమై 4, నవంబరు 1804 లో చనిపోయాడు.

నొసుమ్ నరసింహారెడ్డి మరణానంతరం అంతవరకూ అతనికి ఇస్తున్న 8,323 రూపాయిల పించనును అతని భార్యకు బదలాయించింది కంపనీ.

నొసుమ్ నరసింహారెడ్డి దత్తత కుమారుడు జయరామిరెడ్డి, అతని మనవడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. 1846 నాటికి మూడు తరాలు గడిచిపోవటం; వారసులకు పించను పంచుకొంటూ రావటం వల్ల నరసింహారెడ్డి వాటా పది రూపాయిల పది అణాల ఎనిమిది పైసలకు చేరింది. అది ఇవ్వటానికి కూడా అవమానించే పరిస్థితులు ఏర్పడటం వల్ల నరసింహారెడ్డి కంపనీ అధికారులపై తిరుగుబాటు చేసాడు. నలభై ఆరు సంవత్సరాలలో వేరే ఏదో జీవనోపాధి ఏర్పాటుచేసుకోకుండా కంపనీ ఇచ్చే పించనుపై ఎందుకు ఆధారపడ్డారనేది ఆసక్తి కలిగించే అంశం.

భవిష్యత్తు అద్భుతంగా ఉందని చెప్పిన గోసాయి వెంకన్న అనే ఒక సాధువు మాటతో కంపనీతో యుద్ధానికి దిగాడు నరసింహారెడ్డి. ఊరూరూ తిరిగి మిగిలిన బాధిత పాలెగాండ్రను ఏకం చేయగలిగాడు.

వీరంతా నరసింహారెడ్డి నాయకత్వంలో నడిచి 1846 జూలై లో తాహసిల్దారును, కంపనీ గుమస్తాను చంపేయటంతో తిరుగుబాటు మొదలైంది. ఇతని అనుచరుల సంఖ్య అయిదువేలకు పెరిగింది. వీరిలో ఎక్కువగా బోయలు, యానాదులు, చెంచులు ఉన్నారు. నరసింహారెడ్డి కొంతకాలం కంపనీ పోలీసులను గడగడలాడించి 1846 అక్టోబర్ 6 న కడప కలక్టర్ కాక్రేన్ కుయుక్తులవల్ల అరస్టయి ఉరితీయబడ్డాడు.
****

జమిందార్లు, మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతే శిస్తు కట్టే రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన థామస్ మన్రో ఆలోచనలు ఆధునికమైనవి. అప్పటికి అవి విప్లవాత్మకమైనవి. కార్న్ వాలిస్ 1793 లో బెంగాల్ లో ప్రవేశపెట్టిన జమిందారీ వ్యవస్థ వల్ల జమిందార్లు బలిసిపోతున్నారు తప్ప కంపనీకి పెద్దగా లాభాలు రావటం లేదన్న దూరాలోచనను కూడా కాదనలేం.

పాలెగాండ్ర వ్యవస్థ ఫ్యూడల్ సమాజపు నిర్మాణం. ఇందులో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ దాని తాలూకు పీడన, కులాధారిత వెట్టిచాకిరీ ఉంటుంది. దాన్ని పునఃస్థాపించటానికి చేసిన వ్యక్తిగత పోరాటాన్ని దేశభక్తిగా ప్రొజెక్ట్ చేయటం; కనీసం తొలి పాలెగాండ్ర పోరాటం కూడా కానిదాన్ని తొలి స్వాతంత్ర్యపోరాటంలా ప్రచారించటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

బొల్లోజు బాబా

పట్నం కన్నీరు..


1 October 2019 ·
..

రాత్రి వేసిన
సెమెంటు రోడ్డుపై
ఏ పశువో నడిచిందేమో!

జంట చంద్రవంకల్లా
కాలి గిట్టల గుంటలు.

వాన నీరు చేరి నీలంగా ఉన్నాయి

గోరటి వెంకన్న గుర్తొచ్చాడు

చుట్టూ చూసాను
ఒక్క పిట్టా కనిపించలేదు.

బొల్లోజు బాబా

good discussion