Friday, August 17, 2012

అంతే ....

ఒక చిన్న తీయని కూత చాలు
తనిక్కడ ఉంటున్నానని చెప్పటానికి

ఒక రాలిన ఈక
తనిక్కడ ఉండినట్లు చెపుతుంది.

మట్టులోని వెచ్చదనం
తనిక్కడ ఉంటుందని చెపుతుంది.

ఎంత సింపుల్ గా జీవితాలని
గానం చేయ గలుగుతున్నాయీ - పక్షులు.

సోర్సు:THE SIMPLE P.P. Ramachandran

Friday, July 20, 2012

పర్యావరణం


కప్ప దమనీ వ్యవస్థ డిసెక్షన్
విద్యార్ధులకు డిమానుస్ట్రేషన్ క్లాసది.
క్లోరోఫాం ఇచ్చిన కప్పను
డిసెక్షన్ చెక్కపై ఉంచి
కదలకుండా కాళ్ళకు మేకులు కొట్టాను.
నా చుట్టూ విద్యార్ధులు నిల్చొని
శ్రద్ధగా గమనిస్తున్నారు.
సిజర్ తో చర్మాన్ని కొద్దికొద్దిగా తొలగిస్తూ
స్టెర్నమ్ ఎముకను కత్తిరించి
ఉరఃకుహరాన్ని బయల్పరిచాను.

“మీ చేతులు వణుకుతున్నాయి సార్”
అన్నాడో విద్యార్ధి.
అప్పుడు గమనించాను
నా చేతులు విపరీతంగా వణుకుతున్నాయి.
మిగిలిన డిసెక్షన్ వెంటవెంటనే ముగించి
వచ్చేవారం మీరు చేద్దురుగాని అని చెప్పి
డిపార్ట్ మెంటుకు వచ్చేసాను.
భయమేసింది జబ్బేదైనానా అని.
కాగితం తీసుకొని నా పేరు వ్రాసుకొన్నాను
ముత్యాల్లాంటి అక్షరాలు
కొంచెం ధైర్యం వచ్చింది.
*****
విద్యార్ధుల ఒక్కొక్కరి ట్రేలో ఒక్కో కప్ప
వాళ్ళు జాగ్రత్తగా డిసెక్షన్ మొదలుపెట్టారు.
కాసేపయ్యాకా చూద్దును కదా
ప్రతి ఒక్కరి చేతులూ వణుకుతున్నాయి
అలా వణుకుతున్న చేతులతోనే
అందరూ డిసెక్షన్ చేస్తున్నారు – ఆశ్చర్యంగా!
*****
నిన్నరాత్రి
చెరువుగట్టుపై మిడతలు వాలినపుడు
గరికపూలు అలానే వణికుంటాయి.

బొల్లోజు బాబా

Friday, July 13, 2012



రావిశాస్త్రిగారి రచనాసాగరం చదూతున్నాను.  చాలా బాగుంది.  మూడార్ల గూఢచారి పేరుతో రావిశాస్త్రి గారు స్వాతి లో వ్రాసిన చిన్న చిన్న పిట్టకథలు ఒక్కొక్కటి ఒక్కో కవితలా అనిపించాయి నాకు.  మచ్చుకు రెండు.......

మహాత్మాగాంధీగారు మనకి మరీమరీ
చెప్పిన మూడు చీనా కోతుల్లోనూ,
ఒకటి పాపం చూడదు,
మరొకటి పాపపుమాట వినదు,
ఇంకొకటి పాపాన్ని పలుకదు!!!!
బాగానే ఉంది, కానీ చిన్న పేచీ ఉంది-
చూడనిది వినొచ్చు, పలకొచ్చు,
విననిది చూడొచ్చు, పలకొచ్చు
పలకనిది కళ్ళారా చూడొచ్చు, చెవులురిక్కించి వినొచ్చు.
పాపం చూడనిదీ, విననిదీ, పలకనిదీ కూడా పాపం చెయ్యొచ్చు.

శ్రీ రాచకొండ విశ్వనాధశాస్త్రి – స్వాతి, మార్చి 1979


పేదరికం కారణంగా చాలా జబ్బులు పుడతాయి- అనిచెప్పి,
ఓ రాజుగారు తన ఒక్కగాని ఒక్క కొడుక్కి
పేదవారి జబ్బులు తగలకుండా
ఆ కుర్రవాణ్ణి ఓ ఒంటిస్తంభం మేడలో ఉంచి పెంచాడు
కాని,
ఆ కుర్రవాణ్ణి కొంతకాలానికి పెద్దరోగం పట్టుకొంది
కారణం?
ఆ పిల్లడి పరిచారిక ఒంటిస్తంభం మేడలో పెరగలేదు
అయితే
కొందరే బాగుండడం కుదరదని రాజుగారికి తెలిసొచ్చిందా?
తెలిసింకా రాలేది అనుకుంటాను

శ్రీ రాచకొండ విశ్వనాధశాస్త్రి – స్వాతి, ఫిబ్రవరి 1979

భవదీయుడు
బొల్లోజు బాబా

రావిశాస్త్రి కవితలు


రావిశాస్త్రిగారి రచనాసాగరం చదూతున్నాను.  చాలా బాగుంది.  మూడార్ల గూఢచారి పేరుతో రావిశాస్త్రి గారు స్వాతి లో వ్రాసిన చిన్న చిన్న పిట్టకథలు ఒక్కొక్కటి ఒక్కో కవితలా అనిపించాయి నాకు.  మచ్చుకు రెండు.......

మహాత్మాగాంధీగారు మనకి మరీమరీ
చెప్పిన మూడు చీనా కోతుల్లోనూ,
ఒకటి పాపం చూడదు,
మరొకటి పాపపుమాట వినదు,
ఇంకొకటి పాపాన్ని పలుకదు!!!!
బాగానే ఉంది, కానీ చిన్న పేచీ ఉంది-
చూడనిది వినొచ్చు, పలకొచ్చు,
విననిది చూడొచ్చు, పలకొచ్చు
పలకనిది కళ్ళారా చూడొచ్చు, చెవులురిక్కించి వినొచ్చు.
పాపం చూడనిదీ, విననిదీ, పలకనిదీ కూడా పాపం చెయ్యొచ్చు.

శ్రీ రాచకొండ విశ్వనాధశాస్త్రి – స్వాతి, మార్చి 1979


పేదరికం కారణంగా చాలా జబ్బులు పుడతాయి- అనిచెప్పి,
ఓ రాజుగారు తన ఒక్కగాని ఒక్క కొడుక్కి
పేదవారి జబ్బులు తగలకుండా
ఆ కుర్రవాణ్ణి ఓ ఒంటిస్తంభం మేడలో ఉంచి పెంచాడు
కాని,
ఆ కుర్రవాణ్ణి కొంతకాలానికి పెద్దరోగం పట్టుకొంది
కారణం?
ఆ పిల్లడి పరిచారిక ఒంటిస్తంభం మేడలో పెరగలేదు
అయితే
కొందరే బాగుండడం కుదరదని రాజుగారికి తెలిసొచ్చిందా?
తెలిసింకా రాలేదనే అనుకుంటాను

శ్రీ రాచకొండ విశ్వనాధశాస్త్రి – స్వాతి, ఫిబ్రవరి 1979
భవదీయుడు
బొల్లోజు బాబా

Wednesday, April 25, 2012

ఫ్రెంచిపాలనలో యానాం పుస్తక సమీక్ష

ఫ్రెంచిపాలనలో యానాం పుస్తక సమీక్ష
జనమిత్ర పత్రిక లో వచ్చిన నా పుస్తక సమీక్ష

భవదీయుడు
బొల్లోజు బాబా

Monday, April 16, 2012


Breakfast - by Jacques Prévert


నాతో ఏమీ మాట్లాడకుండా
అతను డికాక్షన్ ను
కప్ లోకి తీసుకొన్నాడు
అతను ఆ కాఫీ కప్ లోకి
కొంచెం పాలు ఒంపుకొన్నాడు
అతను దానిలో
చక్కెర వేసుకొని
ఒక స్పూనుతో కలయతిప్పి
ఆ వేడి café au lait ని తాగి
కప్పు టేబుల్ పై పెట్టాడు

నాతో ఏమీ మాట్లాడకుండా
అతను ఒక సిగరెట్ వెలిగించి
పొగను రింగులుగా ఒదిలాడు
అతను సిగరెట్ నుసిని
యాష్ ట్రే లోకి విదిలించాడు

నాతో ఏమీ మాట్లాడకుండా
నన్ను కనీసం చూడకుండా
అతను లేచి
టోపీ పెట్టుకొని
బయట వర్షం వస్తున్నందున
రెయిన్ కోట్ వేసుకొని
వానలో అలా నడుచుకొంటూ
వెళిపోయాడు
ఒక్క మాటలేకుండా
నాకేసి అసలు చూడకుండానే....

నేను, నేను నా చేతుల్లో
మొఖం పెట్టుకొని
ఏడుస్తూనే ఉన్నాను.

ఫ్రెంచి కవి Jacques Prévert వ్రాసిన Breakfast  (Déjeuner du matin) కు అనుసృజన


ఈ కవితకు దృశ్యరూపాలు కొన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. వాటి లింకులు


పైకి సాదా సీదాగా అనిపించినా ఈ కవితలో ఏదో తెలియని శూన్యతను పరాకాష్టకు చేర్చినట్టు నాకనిపించింది.

రెండో వీడియోలోని వ్యక్తులు ఇద్దరూ మగవాళ్ళు అవ్వటం గమనార్హం (కవితను చదివినప్పుడు నాకొచ్చిన సందేహం అదే. ఇది ఎవరిమధ్య జరిగిఉంటుంది అని)
తెలుగు కవితలు కూడా ఇలా వీడియోల రూపంలో కనిపించే రోజులు ఎప్పటికైనా వస్తాయని ఆశిస్తూ
భవదీయుడు

బొల్లోజు బాబా

Friday, March 30, 2012

మూల్యాంకనం



జవాబు పత్రాన్ని పట్టుకోగానే
ఓ ఏడాది కాలాన్ని
చేతిలోకి తీసుకొన్నట్లుంటుంది.
ఏదో అపరిచిత జీవితాన్ని
తడుముతున్నట్లనిపిస్తుంది.

పాస్ మార్కులు వేయమంటూ
కన్నీటి ప్రార్ధనో, వెయ్యినోటో, ఫోన్ నంబరో
లేక శాపాల బెదిరింపో వంటి చేష్టలు
బిత్తరపరచినా
ఇన్నేళ్ళ చదువులో ఎక్కడా తగలని
ఒక వాక్యమో, కొత్త కోణమో, వివరణో
తళుక్కు మన్నపుడు
కవిత్వం చదివినంత
ఆనందమౌతుంది.

జవాబు పత్రాల్ని మెదడు తూకం వేస్తే
హృదయం మూల్యాంకనం చేస్తుంది.

ఈ స్టూడెంట్ కి
మమ్మీ డాడీ దీబెట్టి బెస్టాఫ్ లక్ చెప్పారో లేదో
హైలైటర్స్, స్కెచ్ పెన్ లు కొనివ్వలేదు కాబోలు
స్కేలు కూడా లేదేమో..
పేపరు మడతే మార్జినయ్యింది.
ఈ అక్షరాలు వ్రాసిన చేయి
పొలంపనులు చేసిందో, రాళ్ళు మోసిందో
పెట్రోలు కొట్టిందో లేక అంట్లే తోమిందో
అక్షరాల నిండా మట్టి వాసన ... మట్టి వాసన...
హృదయానికి మట్టివాసన ఎంతిష్టమో!

జవాబులు సరిగ్గా రాయకపోవటానికి కారణం
ఒక్క చదవకపోవటమేనా... లేక
ఆ సమయంలో జబ్బుచేసిందా?
ముందురోజు తండ్రికి తలకొరివి పెట్టాడా?
పెళ్ళిబట్టలలో నేరుగా పరీక్షహాలుకు వచ్చిందా?
సమస్యలనుంచి రేపు పారిపోవాలనుకొంటున్నాడా?
ఖాళీ జవాబు పత్రం ప్రశ్నల పత్రమౌతుంది

పేపర్లు దిద్దటం అంటే ఒక్కోసారి
పత్రికల్లో పతాక శీర్షికలవటం కూడా
ఆత్మహత్యగానో, అత్యుత్తమ రాంక్ అనో.

బొల్లోజు బాబా