Saturday, May 3, 2025

ఎవరు చొరబాటు దారులు?


భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇంట్రూడర్స్ (చొరబాటుదారులు) అంటూ ముస్లిమ్స్ ని హిందుత్వ వాదులు పదే పదే పేర్కొంటారు. సాక్షాత్తూ ‘పెద్దాయనే’---- “ప్రత్యర్ధులు ఎన్నికలలో నెగ్గితే ఈ ‘చొరబాటుదారులకు’ ప్రజల సంపదను పంచిపెడతారని, మీ మంగళసూత్రాలను కూడా వదలరని”--- పలకటం గమనార్హం. ఈ దేశంలో దాదాపు ఆరేడు శతాబ్దాలుగా జీవిస్తూ, ఇక్కడే పుట్టి ఇక్కడే మరణిస్తున్న సాటి మనిషిని ఈదేశానికి చొరబాటుదారుడు అని మాట్లాడటం మనచుట్టూ జరుగుతున్న కమ్యునల్ విభజన రాజకీయాలకు అద్దంపడుతుంది.
నిజానికి చారిత్రికంగా మధ్య ఆసియా స్టెప్పీ గడ్డి భూములనుంచి గుర్రాలపై గత 3000 సంవత్సరాలలో భారతదేశంలోకి మూడు దఫాలుగా ప్రవేశించిన చొరబాటుదారులు భారతీయసమాజాన్ని ప్రభావితం చేసారు. సనాతనులు ఆరేడు వందలేళ్ల క్రితం వచ్చిన ముస్లిమ్స్ గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప వారికంటే ముందు రెండుదఫాలుగా వచ్చిన ఇతరజాతులకు చెందిన చొరబాటుదారుల గురించి మాట్లాడరు.

1. మొదటి దశ, ఆర్యుల చొరబాటు

• మధ్య ఆసియనుంచి BCE 1500 ప్రాంతంలో ఆర్యులు అనే యోధ జాతి భారత ఉపఖండానికి వలస వచ్చి ఈ ప్రాంతంపై ఆధిపత్యం పొందారు. వీరు తమతో పాటు వేదసంస్కృతి, సంస్కృత భాషను తెచ్చారు ఇవి ఆనాటి భారత ఉపఖండంలోని స్థానిక సంస్కృతులపై ప్రభావం చూపాయి.

• ఈ రోజు జన్యుశాస్త్రంలో DNA Sequencing పద్దతి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది. దీని ఆధారంగా ఒక జన్యువు వివిధ జనాభాలలో, వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు. ఈ అధ్యయనాలద్వారా, మధ్య ఆసియా నుండి కొన్ని జన్యువులు భరతఖండంవైపు కాలానుగుణంగా కదులుతూ వచ్చాయని కొన్ని పదుల సైంటిఫిక్ పేపర్లు నిర్ధారించాయి. అవే ఆర్యజనువులు. అలా వలసవచ్చిన వారే ఆర్యులు.

• మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- ఆర్యులలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బెంగాలు బ్రాహ్మణులలో అత్యధికంగా 72.22 శాతం, ఇతర రాష్ట్రాల బ్రాహ్మణులలో 70-30% మధ్యలో కనిపించింది.

• ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ ఆర్య జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.

• ఈ గమనింపు ద్వారా నేటి బ్రాహ్మణులు మధ్య ఆసియా నుంచి వచ్చిన విదేశీ ఆర్యులని, దళిత బహుజన గిరిజన ప్రజలు భరతఖండంలో సింధునాగరికతా కాలంనుండి జీవిస్తున్న స్థానికులని భావించవచ్చు.

• ఆర్యులు వర్ణవ్యవస్థను ఏర్పరచారు. సమాజాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ నాలుగు శ్రేణులుగా విభజించారు. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతులుగాను, మిగిలిన మూడు వర్ణాలు వారికి సేవచేయాలని ధర్మశాస్త్రాల ద్వారా నిర్ణయించారు. ధర్మశాస్త్రాలనేవి ఒకనాటి రాజ్యాంగం. ఇక వీరికి వెలుపల అతిశూద్రులు ఉండేవారు అతిశూద్రులు వూరివెలుపల నివసించే అంటరానివారు. ధర్మ శాస్త్రాలప్రకారం వీరసలు మనుషులే కారు.

• ఆర్యులు వారి స్త్రీలతో కాకుండా పురుషులు ఒక్కరే భరతఖండానికి వచ్చి స్థానిక అనార్య స్త్రీలను పెళ్ళాడారు. ఈ సందర్భంగా స్థానిక పురుషులను ఓడించి లేదా నిర్మూలించటం ద్వారా వారి స్త్రీలను గ్రహించటం జరిగి ఉండాలి.

• ఆర్యులు ప్రవేశపెట్టిన జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ (కులవ్యవస్థ), బ్రాహ్మణాధిక్యత, మంత్రాలు, క్రతువులు, స్వర్గనరకాలు, పాపం పుణ్యం లాంటి అభౌతిక భావనలు నేటికీ సమాజంలో తమప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.

• ఆర్యులు భారతదేశానికి చెందిన స్థానికులే అని సనాతనులు వాదిస్తారు కానీ అలా నిరూపించే జన్యు ఆధారాలు లేవు. ఇదొక సంకట స్థితిగా మారింది సనాతన హిందూ చరిత్రకారులకు.

2. రెండవ దశ యవనులు, శకులు, పార్థియన్లు, కుషాణులు చొరబాటు

• BCE 300 – CE 100 మధ్యలో యవనులు (ఇండో గ్రీక్స్), శకులు (సిథియన్స్) పార్థియన్స్, కుషాణులు మధ్య ఆసియానుంచి భారతదేశంలోకి చొరబడిన యోధులు.

• అలెగ్జాండర్ మరణం తరువాత అతని సైన్యంలో కొంతమంది గ్రీకులు BCE 300 లలో ఇక్కడే ఉండిపోయి పంజాబ్, గాంధార ప్రాంతాలను పాలించారు. వీరిని ఇండో గ్రీక్స్ (యవనులు అని పిలిచారు). వీరు బౌద్ధాన్ని స్వీకరించారు. గాంధారకళలో బౌద్ధ శిల్పాలను చెక్కించారు. మనుస్మృతి వీరిని మ్లేచ్చులగా పరిగణించి, “తక్కువరకం క్షత్రియులు”గా గుర్తించింది.

• శకులు (సిథియన్స్) BCE 100 లో మధ్య ఆసియా స్టెప్పీలనుండి గుర్రాలపై వచ్చిన సంచార తెగలు. వీరు గాంధార, పంజాబ్, ఉజ్జయిని ప్రాంతాలను పాలించారు. వీరు బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించారు. వీరిలో ప్రముఖుడైన రుద్రదమనుడు సంస్కృతాన్ని ఆదరించాడు. వీరిని పతనమైన క్షత్రియులు (Second class kshatriyas) గా మనుస్మృతి పరిగణించింది.

• పార్థియన్స్, BCE 100 లో ఇరాన్ నుంచి వచ్చిన యోధులు. వీరు ఇండో పార్థియన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు సింధ్ పంజాబ్ ప్రాంతాలను (ప్రస్తుత పాకిస్తాన్) పాలించారు. ఈ వంశంలో గోండో ఫరిస్ ప్రసిద్ధిగాంచిన రాజు. వీరి పాలనలో గాంధార శిల్పకళ అభివృద్ధిచెందింది. వీరు జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించినా, క్రమేపీ భారతీయమతాలతో విలీనం అయిపోయారు. పార్థియన్లను కూడా మనుస్మృతి పతనమైన క్షత్రియులుగా గుర్తించింది.

• కుషాణులు, CE 100 మధ్య ఆసియానుంచి వచ్చారు. కనిష్కుడు పేరుగాంచిన రాజు. కుషాణులు బౌద్ధమతాన్ని వ్యాప్తిచేసారు. వీరినాణాలపై బుద్ధుడు, శివుడు, గ్రీకుదేవతల చిహ్నాలు ఉండటం వీరి మతసహనాన్ని చూఫుతుంది. వీరు వాసుదేవవంటి భారతీయ కల్ట్ పేర్లను ఉపయోగించారు. వీరు కూడా క్షత్రియులుగానే గుర్తింపబడ్డారు.

మధ్యఆసియానుంచి భారతఖండంలోకి చొరబడిన స్టెప్పీ యోధులైన, యవనులు శకులు, పార్థియన్లు, కుషాణులు భారతదేశంలో స్థిరపడి, స్థానిక బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించి క్రమేపీ భారతదేశ సమాజంలో మమేకం అయిపోయారు. కాలక్రమేణా వీరు స్థానిక కులాలుగా విలీనమయ్యారు. ఉదాహరణకు శకులు గుజరాత్ మధ్యప్రదేశ్ లోని క్షత్రియకులాలలోకి (రాజ్ పుత్రులు) కుషాణులు ఉత్తరదేశ రాజవంశాలలోకి కలిసిపోయారు.
.
3. మూడవ దశ చొరబాటు , ఐబక్, ఖిల్జి, తుగ్లక్, సయ్యద్, లోడి, ముఘల్స్

• CE 12-15 శతాబ్దాలమధ్య మధ్యఆసియా నుంచి కుతుబుద్ధీన్ ఐబక్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు వచ్చి భారతదేశాన్ని పాలించాయి. వీరి రాజ్యాలు ఉత్తరభారతదేశానికే పరిమితం అయిన బలహీనమైన రాజ్యాలు. 1526 లో మధ్య ఆసియాకు చెందిన బాబర్ పానిపట్టు యుద్ధంద్వారా ఇబ్రహిం లోడీని ఓడించి భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని మేవాడ్ రాజపుత్రరాజు రాణా సంగా, లోడిని గద్దెదించటానికి ఇండియాకు ఆహ్వానించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు.

బాబర్ బలమైన కేంద్రీకృతపాలన కలిగిన విశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీన్ని అక్బర్ విస్తరించాడు. ఔరంగజేబు ముఘల్ సామ్రాజ్యాన్ని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళి ఈ రోజు మనం దేన్నైతే అఖండ భారతదేశం అంటున్నామో దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఇతని పాలనలో ముఘల్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిని పొందింది. అశోకుని మౌర్యసామ్రాజ్యం ఎంతైతే విస్తరించి ఉండేదో దాదాపు అంత భూభాగాన్ని ఔరంగజేబు తిరిగి సాధించగలిగాడు. ఇది అంతకు పూర్వ ఢిల్లి సుల్తానేట్, హిందూ రాజవంశాలకు సాధ్యం కానిది.

• ముఘలులు హిందూ ముస్లిమ్ సమాజాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా అక్బరు ద్వారా సూఫీ సాధువులైన చిస్టీ, భక్తి సంప్రదాయ గాయకులు ఐన కబీర్ నానక్ వంటివారు ఈ సంగమానికి దోహదపడ్డారు. అక్బర్ యొక దీన్ ఇ ఇలాహీ సిద్ధాంతం సమస్త మతాల ఐక్యతను కోరుకొంది.

• ముఘల్ పాలకులు రాజపుత్రులు, హిందూ జమిందారులు, ఇతర స్థానిక నాయకులను పరిపాలనలో భాగస్వామ్యం చేసారు.

• బ్రిటిష్ వారి రాకతో ఒత్తిడి, అంతర్గత అస్థిరతలు ఆర్ధిక సంక్షోభం కారణంగా ముఘల్ సామ్రాజ్యం క్షీణించింది. 1857 సైనికుల తిరుగుబాటు తరువాత చివరి ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ను గద్దె దించి, సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు అధికారికంగా తీసుకోవటం జరిగింది.
నేటి భారతదేశంలోని ముస్లిములు చివరగా గత ఐదారు వందల ఏళ్ళ క్రితం భారతదేశంలోకి ప్రవేశించినవారు. నిజానికి వీరిలో ఎక్కువశాతం హిందూమతంలో స్థానికదళిత బహుజనులపట్ల ఊపిరాడనివ్వని ఆంక్షల వలన ఇస్లామ్ లోకి మారినవాళ్ళే ఎక్కువమంది ఉండొచ్చు.

ఎవరు చొరబాటు దారులు?

ఆర్యులు, యవనులు, ముస్లిములు భారతదేశంలోకి చొరబాటుదారులుగా వచ్చినప్పటికీ, వారు స్థానిక సంస్కృతులతో కలిసిపోయి, భారతీయ సమాజ బహుళతను రూపొందించారు.
ఆర్యులు బ్రాహ్మణ సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు జన్యు ఆధారాలు చెబుతున్నాయి. యవనులు శకులు, కుషాణులు ఉత్తరభారత రాజపుత్రులుగా ఈ దేశ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మధ్య ఆసియానుండి వచ్చిన ముస్లిములతో పాటు స్థానిక దళిత, బహుజన సమూహాల నుండి ఇస్లాంలోకి మారినవారై ఉండవచ్చని ఒక అభిప్రాయం ఉంది.

నేటి రాజకీయ సందర్భంలో, “చొరబాటుదారులు” అనే పదం ముస్లిములను లక్ష్యంగా చేస్తూ, వారిని విదేశీయులుగా చిత్రీకరించడానికి ఉపయోగించబడుతుంది. ఇది చరిత్రను ఏకపక్షంగా వక్రీకరించే ప్రయత్నం, ఎందుకంటే ఇది ఆర్యులు, యవనులు, శకులు ఇతర జాతుల చొరబాట్లను విస్మరిస్తుంది.

భారతదేశంలోని ముస్లిములు గత 700 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఈ మట్టిలోనే కలిసిపోతున్నారు. వారిలో ఎక్కువ మంది స్థానిక మూలాలు కలిగినవారే.

“చొరబాటుదారులు” అనేది చారిత్రక సంఘటనలను వివరించే పదం, కానీ ఆధునిక సమాజంలో దీనిని విభజనాత్మక రాజకీయాలకు ఉపయోగించడం తప్పుదారి పట్టిస్తుంది. విభజన, ద్వేషం కాకుండా ఐక్యత సామరస్యం వైపు మనం ప్రయాణం చేయాలి.

బొల్లోజు బాబా

Sunday, April 20, 2025

ప్రాచీనభారతదేశ విద్యావిధానం

ప్రాచీన భారతదేశ విశ్వవిద్యాలయాలు అంటూ కాషాయ రంగు అఖండభారతదేశపు ఫొటో ఒకటి సనాతన హిందూ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. దానిపై 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 11 విశ్వవిద్యాలయాలు బౌద్ధులకు చెందినవి కాగా 1 జైనులకు చెందినది. విశ్వవిద్యాలయాలంటే కులమతాలకు అతీతంగా విద్యనందించే కేంద్రాలు. ఇవి కాక ఇంకా సుమారు 15 వివిధ విద్యా కేంద్రాల పేర్లు కలవు. ఇవి హిందూమతానికి చెందిన గురుకులాలు, మఠాలు,. వీటిలో బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

I. ఆ ఫోటోలోఉన్న బౌద్ధ విశ్వవిద్యాలయాలు

1. తక్షశిల (BCE 6వ శతాబ్దం – CE 5వ శతాబ్దం): ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోని పురాతన ఉన్నత విద్యా కేంద్రాలలో ఒకటి. ఇది బౌద్ధ కేంద్రంగా చక్రవర్తి అశోకునిచే అభివృద్ధి చేయబడింది. (తక్షశిల BCE15 వ శతాబ్దంలో స్తాపించబడింది అని ఫొటోలో ఉంది. అది తప్పు)

2. నలందా (CE 5 –CE 12 వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న నలందా ఒక ప్రఖ్యాత బౌద్ధ విహారంతో కూడిన విశ్వవిద్యాలయం. బౌద్ధ తత్వశాస్త్రం, తర్కం, ఇతర విభాగాల అధ్యయనానికి ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనిని గుప్త చక్రవర్తి కుమారగుప్త I ఐదవ శతాబ్దంలో స్థాపించాడు. ఇది 10,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. హ్యుయాన్ త్సాంగ్ ఇక్కడ చదువుకొన్నాడు.

3. తెల్హారా (CE 1 –CE 12 వ శతాబ్దం): నలందా సమీపంలో ఉన్న మరో బౌద్ధ విద్యాకేంద్రం. 1వ శతాబ్దం CE నుంచి ఉన్నదని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది పాలరాజుల పోషణలో ఉంది.

4. పుష్పగిరి (BCE 3 –CE 12 వ శతాబ్దం): ఒడిశాలోని పుష్పగిరి, పురాతన కళింగ రాజ్యంలో ఒక ప్రముఖ బౌద్ధ విశ్వవిద్యాలయం. అశోకచక్రవర్తి దీనికి పోషకుడిగా ఉన్నాడు.

5. విక్రమశీల (CE 8 - 12 శతాబ్దం). స్థాపకుడు: పాల చక్రవర్తి ధర్మపాలుడు. ఇదిముఖ్యంగా వజ్రయాన బౌద్ధ విద్యకు ప్రసిద్ధి. టిబెట్ విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకొనేవారు.

6. రత్నగిరి (CE 6– 12 శతాబ్దం): ఒడిశాలోని రత్నగిరి, ఒక బౌద్ధ విహారంతో కూడిన ప్రముఖ విద్యా కేంద్రం. దీనిని అశోకుడు స్థాపించి ఉండొచ్చని ఒక అభిప్రాయం కలదు, అయితే 6వ శతాబ్దం నుండి భౌమకర వంశం పాలకుల పోషణలో ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది.

7. ఓదంతపురి (CE 8–12వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న ఓదంతపురి ఒక ముఖ్యమైన బౌద్ధ మహావిహారం. ఇది బౌద్ధ విద్యకు ప్రముఖ కేంద్రంగా ఉండి, గరిష్ఠంగా 12,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. దీనిని పాల చక్రవర్తి గోపాల I, 8 వ శతాబ్దంలో స్థాపించాడు.
8. సోమపుర (CE 8 – 12 వ శతాబ్దం): ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న సోమపుర మహావిహారం ఒక పెద్ద బౌద్ధ విద్యా కేంద్రం, దీనిని పాల రాజు ధర్మపాలుడు 8వ శతాబ్దం చివరలో స్థాపించాడు.

9. నాగార్జునకొండ (CE 2– 6వ శతాబ్దం): ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాగార్జునకొండ, ఇక్ష్వాకు వంశం (2వ నుండి 4వ శతాబ్దం వరకు) కాలంలో ఒక ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రంగా ఉంది. బౌద్ధ తత్వవేత్త నాగార్జున పేరు మీద దీనిని నామకరణం చేశారు. ఇది మహాయాన బౌద్ధానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఆచార్యనాగార్జునుడు ఆధ్వరంలో నెలకొల్పిన బౌద్ధవిద్యాలయం 5 అంతస్థులతో 1500 గదులు కలిగి ఉన్నదని చైనా యాత్రికుడు ఫాహియాన్ (ఐదో శతాబ్దం) పేర్కొన్నాడు.

10. జగద్దాల: 11వ శతాబ్దంలో పాల వంశాధిపతులచే స్థాపించబడిన బౌద్ధ విద్యాలయం.

11. బిక్రమపురా: బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాచీన బౌద్ధ విద్యాలయం. సమాచారం తక్కువ. పాల వంశ పాలనలో అభివృద్ధి చెందింది.

12. వల్లభి (CE 6– 12 శతాబ్దం): గుజరాత్‌లోని వల్లభి, జైన అధ్యయనాలకు కీలక కేంద్రంగా ఉండేది. దీనిని మైత్రక వంశ రాజు భట్టారకుడు 6వ శతాబ్దంలో స్థాపించాడు.

ఇవి కాక ఆ ఫొటోలో ఉన్న మిగిలినవి అన్నీ హిందూ మతానికి చెందిన వేదాధ్యయన కేంద్రాలు. వీటిలో తర్కం, వేదాలు ఉపనిషత్తులు, సంస్కృతవ్యాకరణం, వేదాంతబోధన, జ్యోతిషం, ధర్మశాస్త్రాలు బోధించబడేవి. ఇవి బ్రాహ్మణులకొరకు, బ్రాహ్మణులచే నడపబడిన విద్యాకేంద్రాలు. వీటిలో శూద్రులకు కానీ అతి శూద్రులకు కానీ ప్రవేశం లేదు.

వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయం చుట్టుపక్కల ఉండే గురుకులాలు; కాశ్మీర్ లో శంకరాచార్యులు ప్రతిష్టించిన శారదాపీఠం; ఉజ్జయినిలో ఖగోళశాస్త్రాధ్యయన కేంద్రం; భోజుడు స్థాపించిన భోజ్ శాల; వేదాంత బోధన కొరకు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రింగేరి పీఠం; శైవ వైష్ణవ వేదాంత కేంద్రమైన కాంచిపురం; కేరళలోని సంస్కృత విద్యలు గరిపే త్రిస్సూర్; ద్వైత సిద్ధాంతాన్ని బోధించే ఉడిపి వైష్ణవ మఠం; తమిళనాడులోని వేద వాఙ్మయానికి కేంద్రమైన ఎన్నాయిరం.; హిందూ ధర్మశాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కేరళ లోని కంథల్లార్ శాల; రాష్ట్రకూటుల కాలంలో వేదాధ్యయనం కొరకు స్థాపించబడిన మన్యఖేత మొదలగునవి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో విస్తరించిన హిందూ విద్యాకేంద్రాలు ఇవి చాలామట్టుకు గురుకులాలు మిగిలినవి సన్యాసి మఠాలు.
***
.
II. ప్రాచీన భారతదేశ విద్యా వ్యవస్థ

ప్రాచీనభారతదేశంలో శ్రమణ సంస్కృతితో బౌద్ధ, జైనాలు ఒకవైపు బ్రాహ్మణమతం (హిందూ) మరోవైపు ప్రజల జీవనవిధానాన్ని శాసించాయి. ఈ రెండు మార్గాలు భిన్న తాత్వికపునాదులు కలిగినవి. వాటి విద్యావ్యవస్థలు కూడా భిన్నమైన లక్ష్యాలతో పనిచేసాయి.

1. బౌద్ధమతంలో విద్యావ్యవస్థ:

దీనిలో బుద్ధుని బోధనలు, అష్టాంగమార్గం, బౌద్ధ గ్రంథాలు, తర్క శాస్త్రం, వైద్యం, ఆయుర్వేదం, తత్త్వశాస్త్రం, నీతి, ఆచరణాత్మక జ్ఞానం, పాళి భాష, వ్యాకరణం వంటి అంశాలను విద్యార్ధులకు నేర్పేవారు.

నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకొని, నిర్ధిష్ట పాఠ్యాంశాలు, లక్షలాది పుస్తకాలు కలిగిన గ్రంథాలయాలతో బౌద్ధ విద్యాసంస్థలు అంతర్జాతీయ విద్యార్ధులను ఆకర్షించేవి. నలందాలో చైనా, టిబెట్, కొరియా, మంగోలియా దేశాలనుంచి విద్యార్ధులు వచ్చి విద్యను అభ్యసించేవారు. ఫాయియాన్, హ్యుయాన్ త్సాంగ్, ఇ-త్సింగ్ (Yijing) వంటి వారు ఎందరో అలా నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.

ఈ విశ్వవిద్యాలయాలు ప్రధానంగా బౌద్ధపాఠ్యాంశాలు బోధించినప్పటికీ, వైదిక, జైన మతాలకు చెందిన అంశాలను కూడా అందిస్తూ సెక్యులర్ గా వ్యవహరించేవి.

నలందాలో విద్య ఉచితంగా అందించబడేదని; విద్యార్ధుల ప్రతిభను బౌద్ధగురువులు క్షుణ్ణంగా పరీక్ష చేసి ప్రవేశం ఇచ్చేవారని; ఈ పరీక్షలో పదిమందిలో 8/9 మంది విఫలమయ్యేవారని హ్యుయాన్ త్సాంగ్ రాతలద్వారా అర్ధమౌతుంది. విశ్వవిద్యాలయాలను రాజులు పోషించేవారు.
బౌద్ధం చాతుర్వర్ణాలలోని హెచ్చుతగ్గులను తీవ్రంగా ఖండించింది. గంగ, యమున సరయు, మహి లాంటి నదులు సముద్రాన్ని చేరగానే తమ పేర్లను, అస్తిత్వాలను ఎలాగైతే కోల్పోతాయో అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన వారెవరైనప్పటికీ దమ్మాన్ని ఆచరించటం మొదలుపెట్టగానే వారి వారి వర్ణాలను కోల్పోతారు అని వినయపిటక లో బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు.

బౌద్ధ విద్యావ్యవస్థలో కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా ప్రజాస్వామిక పద్దతులలో అందరనూ చేర్చుకొనేవారు. విద్యార్ధులను బౌద్ధికంగా, నైతికంగా, శారీరికంగా ధృఢంగా, సంపూర్ణంగా అభివృద్ధి చెందేలా చేయటం బౌద్ధవిద్యయొక్క లక్ష్యంగా ఉండేది.

ఉపాలి (క్షురక), సునీత (చండాల), సోపాక (చండాల), శివాలి (శూద్ర) ఆనంద, మాతంగ (చండాల) లాంటి శూద్ర, అతి శూద్ర జాతులకు చెందిన పలువురు విద్యనభ్యసించి గొప్ప బౌద్ధ గురువులుగా పేరు తెచ్చుకొన్నారు.

బౌద్ధ విశ్వవిద్యాలయాలు భారీస్థాయిలో ఉండేవి. నలందాలో ఏకకాలంలో రెండువేలమంది గురువులు బోధించటానికి, పదివేలమంది విద్యార్ధులు చదువుకోవటానికి సరిపడా తరగతి గదులు, నివాసగదులు, వంటగదులు ఉండేవంటే అది ఎంత పెద్దదో అర్ధం చేసుకొనవచ్చును. లక్షలకొలది రాతప్రతులు కలిగిన గ్రంథాలయాలు ఉండేవి.

2. బ్రాహ్మణమతంలో విద్యావ్యవస్థ:

బ్రాహ్మణమతం విద్యను బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం చేసింది. వైశ్యులు, క్షత్రియులు కొన్ని మినహాయింపులతో కొంతమేరకు నేర్చుకొనవచ్చును కానీ వేదాధ్యయనం చేయటానికి బ్రాహ్మణులకు మాత్రమే అర్హత. శూద్రులు కనీసం వేదాలను వినరాదని, వింటే చెవిలో కరిగించిన సీసం పోయాలంటూ అతి క్రూరమైన ఆంక్షలను బ్రాహ్మణులు స్మృతులరూపంలో రాసుకొన్నారు. శూద్రులు విద్యను నేర్చుకోకూడదని ఆంక్షలు విధించారు. అతిశూద్రులైతే స్మృతులప్రకారం అసలు మనుషులేకారు. ఏకలవ్యుడు, శంబుకుని కథలు ఆనాటి సమాజంలో శూద్రులు విద్యనేర్చుకొంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుపుతాయి.

వేదాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, తత్త్వశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ధర్మశాస్త్రాలు మొదలగునవి హిందూ విద్యాసంస్థలలో పాఠ్యాంశాలుగా ఉండేవి.

గురుకులాలు (ఒక బ్రాహ్మణ గురువు నేతృత్వంలో నడపబడే పాఠశాల), మఠాలలో (సన్యాస కేంద్రాలు) హిందూ వేదాంత విద్య నేర్పబడేది. బట్టీవేయడం ద్వారా వేదాలను అధ్యయనం చేసేవారు. హిందూ విద్య బౌద్ధవిద్య వలే కేంద్రీకృతమై ఉండేది కాదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఒక గురువు గురుదక్షిణ తీసుకొని విద్యను అందించే చిన్నచిన్న పాఠశాలలు. ఇవి బౌద్ధ విశ్వవిద్యాలయాలయాల వలే వ్యవస్థీకృతంగా విశాలమైనవి కావు.

హిందూ విద్యాకేంద్రాలు బ్రాహ్మణులచే బ్రాహ్మణులకొరకు ఏర్పాటుచేసుకొని, విద్య అనేది సమాజంలో బ్రాహ్మణ వర్గానికి మాత్రమే పరిమితంచేసి, శూద్రవర్గానికి విద్యను దూరం చేసిన ఒక దుర్మార్గ వ్యవస్థ.

III. ముగింపు

ప్రాచీన భారతదేశంలోని బౌద్ధ విశ్వవిద్యాలయాలు సామాజిక సమానత్వం, జ్ఞాన ప్రసరణ ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులను కలిపే కేంద్రాలుగా నిలిచాయి. కాగా బ్రాహ్మణ విద్యావ్యవస్థ కుల ఆధారిత ఆంక్షలతో సామాజిక విభజనను మరింత బలపరిచింది. ఈ రెండు వ్యవస్థల చారిత్రక భిన్నత్వాన్ని గుర్తించాలి. చరిత్రను నిజాయితీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బౌద్ధ విశ్వవిద్యాలయాలు సర్వసమాజ సమైక్యతకు చిహ్నాలుగా నిలిచి అందరూ సమానమేనని నిరూపించగా హిందూ గురుకులాలు ప్రత్యేక వర్గ ప్రయోజనాలను కాపాడాయి.

ఎనిమిదవ శతాబ్దంలో ఉద్యోతన సూరి అనే జైనాచార్యుడు రాసిన కువలయమాల అనే గ్రంథంలో వేదాధ్యయనం చేస్తున్న కొద్దిమంది విద్యార్ధులను ఎద్దేవా చేస్తూ…......"వీరు వేదాలను భట్టీయం వేస్తున్నారు; బలమైన కండలు తిరిగిన దేహంతో నిత్యం వ్యాయామం చేస్తూ లెక్కలేనితనంతో హింసాత్మక ధోరణితో జీవిస్తున్నారు; వీళ్ళంతా నైతికవిలువలు లేని మూర్ఖుల సమూహం" అని అన్నాడు ----- హిందూమతం ఇంకా పూర్తిగా స్థిరీకరింపబడని కాలంలో వేదాలను అధ్యయనం చేస్తున్న హిందు విద్యార్ధుల పట్ల జైనుడైన ఉద్యోదనసూరి చేసిన ఈ వ్యాఖ్యలు చారిత్రికంగా విలువైనవి. (రి. Kuvalayamala, Part II, A.N. Upadhye, Pn. 124)

బ్రాహ్మణులకు తప్ప సమాజంలో ఎవరికీ ఉపయోగపడని హిందూ విద్యాకేంద్రాలను, కుల లింగ బేధాలకు అతీతంగా ప్రపంచంలోని అందరికీ సమానంగా విద్యను అందించిన బౌద్ధ విశ్వవిద్యాలయాలతో కలిపి చెబుతూ సనాతనవాదులు గొప్పలు పోవటం, ఎవరికో పుట్టిన బిడ్డను సొంతబిడ్డగా చెప్పుకోవటంలాంటిది. చరిత్రను వక్రీకరించటమే.

బొల్లోజు బాబా



Thursday, April 10, 2025

ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?



ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?

సుమారు 9.4 లక్షల ఎకరాలతో వక్ఫ్ భూములు, ఆర్మీ (18 లక్షల ఎకరాలు) రైల్వేల (12 లక్షల ఎకరాలు) తరువాత దేశంలో మూడవ అతిపెద్ద మొత్తానికి చెందిన ఆస్తిగా నిలిచింది.

ఈ 9.4 లక్షల ఎకరాల వక్ఫ్ భూములలో సుమారు 2 లక్షల ఎకరాలలో స్మశానాలు, 1 లక్ష ఎకరాలలో మసీదు, దర్గాలు, యాభైవేల ఎకరాలలో స్కూళ్ళు, 5.9 లక్షల ఎకరాలు వ్యవసాయ సంబంధ, ఇతర భూములు గాను ఉన్నాయి.

ఈ భూములలో సుమారు 18 వేల మదరాస స్కూల్స్, 350 వరకూ కాలేజీలు, 100 వరకూ హాస్పటల్స్ నడుస్తున్నాయి.

ఇతరమతాలు కలిగి ఉన్న భూముల వివరాలు ఇలా ఉన్నాయి.

వక్ఫ్ భూములు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఆధీనంలో ఉంటాయి కనుక వాటి లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. హిందూమతానికి చెందిన ఆలయభూములు అలాకాక వివిధ రాష్ట్రాల ఆధీనంలో ఉంటాయి. కనుక ఆయా రాష్ట్రాల లెక్కల ఆధారంగా దేశంలో హిందు ఆలయాలకు చెందిన భూములు సుమారు 15 నుండి 20 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇదే నిజమైతే దేశంలోనే అథ్యధికంగా భూములు కలిగి ఉండటంలో హిందూమతం మొదటి స్థానంలో ఉంటుంది.

తమిళనాడులో 4.78 లక్షల ఎకరాల ఆలయ భూములు కలవు. ఆంధ్ర ప్రదేష్ లో 4 లక్షల ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాలు, కర్ణాటకలో 15 వేల ఎకరాలు, ఒడిసాలో 12 వేల ఎకరాలు, బీహార్ లో 22 ఎకరాల భూములు కలిగి ఉన్నాయి. పెద్దరాష్ట్రాలైన ఉత్తర ప్రదేష్, రాజస్తాన్, మహరాష్ట్రాలలో దేవాలయ భూములు ఏ మేరకు ఉన్నాయో అధికారిక గణాంకాలు లేవు. దేశవ్యాప్తంగా మొత్తంమీద 15 నుండి 20 లక్షల ఎకరాల హిందూ ఆలయభూములు ఉన్నాయని భావించవచ్చు.

హిందూ ఆలయభూములలో 13 వేల స్కూల్స్, 800 వరకూ కాలేజీలు, 300 వరకూ హాస్పటల్స్ నడపబడుతున్నాయి.

క్రిస్టియన్ మతానికి చెందిన భూములు దేశంలో సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇది ప్రధానంగా వ్యవసాయేతర భూమి. దేశంలో భారతప్రభుత్వం తరువాత అత్యధిక వ్యవసాయేతర భూమి కలిగిన వ్యవస్థగా చర్చ్ ని చెబుతారు.

చర్చ్ కి చెందిన భూములలో చర్చ్ లు, సెమెటరీలు కాక 14 వేల స్కూళ్ళు, 300 కాలేజీలు, 2500 హాస్పటల్స్ ఉన్నాయి.
ఇదే విధంగా బౌద్ధులకు 50,000 ఎకరాల వరకు భూములు, సిక్కుల వద్ద 2 లక్షల ఎకరాల వరకూ భూములు ఉన్నాయి.

ఇక వ్యక్తులవద్ద చూసినట్లయితే ఆదాని గ్రూప్ కు 16 వేల ఎకరాలు, DLF వద్ద 15 వేల ఎకరాలు, రిలయన్స్ వద్ద 9 వేల ఎకరాల భూములు ఉన్నాయి.

***

కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. కేంద్ర వక్ఫ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

ఇక వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ కమిటీలో తప్పనిసరిగా హిందువులు కూడా ఉండాలని ఇటీవల పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం రాజకీయ ప్రేరేపిత చర్య కావచ్చు. దేశంలో మరే ఇతర మతసంస్థల ఆస్థులకు సంబంధించిన కమిటీలలో అన్యమతానికి చెందిన సభ్యులు ఉండరు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాధికారులైన కలక్టరు కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఆ ఆలయ కమిటీకి ఎక్స్ అఫిషియో మెంబరుగా ఉన్నప్పుడు- ఒకవేళ ఆ అధికారులు వేరే మతానికి చెందినవారైనప్పటికీ కమిటీలో ఉంటారు తప్ప కావాలని “కొందరు సభ్యులు తప్పని సరిగా వేరేమతానికి చెందిన వారై ఉండాలి” అనే క్లాజ్ తో ఏ ఆలయ బోర్డు కానీ ఎండో మెంటు కమిటీ కానీ ఏర్పడదు. ఉదాహరణ టిటిడి బోర్డులో అందరూ హిందువులే మెంబర్లుగా ఉంటారు. ఇతరులకు స్థానం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఒక్క క్లాజుతోనే వక్ఫ్ బోర్డ్ సవరణలు వివాదాస్పదం అవుతున్నాయి.

బొల్లోజు బాబా

(పై గణాంకాలు ఎఐ ద్వారా సేకరించినవి. సరైన ఆధారాలతో విభేదించవచ్చు)

Wednesday, April 9, 2025

ప్రాచీనగాథలు ముందుమాట



“ప్రాచీనగాథలు” పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట. ఇవి వివిధ కావ్యాలలోంచి తీసుకొన్న మొత్తం 500 పైన గాథలకు తెలుగు అనువాదం. ఇటీవల కొన్ని గాథలను రీల్స్ గా పోస్ట్ చేసినపుడు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తకాన్ని ఛాయావారు ప్రచురించారు. ప్రాచీన గాథలు పుస్తకం అమజాన్ లో లభిస్తుంది. లింక్ మొదటి కామెంటులో ఉంది. దయచేసి ఆదరించగలరు

బొల్లోజు బాబా

*****

మనవి మాటలు

గాథ అనగా ఉత్తమమై, ఉదాత్తమై, రసానుకూలమైన ఒక సంఘటన అని నిర్వచించారు గాథాసప్తశతిని తెలుగుచేసిన శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఈ పదాన్ని వివిధ ముక్తక కావ్యాలలోని పద్యాలకు కూడా వర్తింపచేయటం ఆక్షేపణీయం కాదని తలచి, ఈ పుస్తకంలోని వివిధ పద్యాలను గాథలుగా పేర్కొనటం జరిగింది.

చాన్నాళ్ళక్రితం సప్తశతిగాథలను చదివినపుడు వాటిలోని కవిత్వానికి ఆకర్షితుడనై కొన్ని గాథలను అంశాలవారిగా విభజిస్తూ అనువదించాను. ఆ తరువాత సప్తశతి గాథలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ కొన్ని వ్యాసాలు రాసాను. చరిత్రపట్ల ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ప్రాచీన సాహిత్యం కొత్తకొత్త కోణాలలో దర్శనమివ్వటం మొదలైంది, ముఖ్యంగా ప్రాకృత సాహిత్యం. గౌడవహో, వజ్జాలగ్గం, కువలయమాల, లీలావాయీ, సేతుబంధ లాంటి వివిధ ప్రాకృత కావ్యాలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాసాను. రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం రాసిన థేరీగాథలు, వాటి చారిత్రిక నేపథ్యం పట్టి కుదిపాయి. వాటిని అనువదించి 2022 లో పుస్తకరూపంలో తెచ్చాను.

ఇదే క్రమంలో ప్రేమస్వరాలు పేరుతో తిరుక్కురల్‌ నుంచి కొన్ని, అమరశతకం నుంచి కొన్ని గాథలను అనువదించాను. ప్రాచీన సాహిత్యంలో ఋతువర్ణనలు పేరుతో వ్యాసపరంపర రాస్తున్న సమయంలో నాకు ‘సంగం కవిత్వం’ పరిచయం అయింది. స్వచ్ఛమైన మానవానుభవాలు అవి. ఆ గాథలలోని చరిత్ర, ఉద్వేగాలు గొప్ప ఊహాతీత లోకంలోకి తీసుకొని వెళతాయి. సంగం కవిత్వం ఈ పుస్తకపు మొదటి అధ్యాయం, నా సరికొత్త మోహం.

చివరి అధ్యాయం ‘నానావిధ’ పేరుతో వివిధ సందర్భాలలో చేసిన ప్రాచీన గాథల అనువాదాలు. వీటిలో కొన్ని పదహారవ శతాబ్దానికి చెందిన గాథలు కూడా ఉన్నాయి.

నిజానికి సప్తశతి, ఇతర కావ్యాలపై నేను రాసినవి వాటిలోని చరిత్రను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు. కానీ ఈ పుస్తకంలో గాథలన్ని ఒకచోటికి చేర్చి, విశ్లేషణా అంశాలను పుస్తకం చివర నోట్సు రూపంలో ఇచ్చాను. కవిత్వాన్ని, వచనాన్ని వేరుచేయాలనే ఉద్దేశంతో.

***

కవి తను జీవించిన కాలానికి ప్రతినిధి. ఈ ప్రాచీన కవులు తమ కాలాన్ని ఇలా నిక్షిప్తం చేసారు. శాసనాలలో దొరికే చరిత్రలో పేర్లు, తారీఖులు మాత్రమే ఉంటాయి. సాహిత్యంలో కనిపించే చరిత్రలో ప్రజలు రక్తమాంసాలతో సంచరించటం గమనించవచ్చు. ఈ గాథలలో ఎక్కువ భాగం శతాబ్దాల క్రితం జీవించిన సామాన్యుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి కష్టాలు సుఖాలు, ఆశలు నిరాశలు, సమాజం, సంస్కృతి, ఆచార వ్యవహారాలను తెలియచేస్తాయి. ఈ రచనలో కొంతమేరకు ఆనాటి subaltern జీవితాన్ని కూడా గుర్తించవచ్చు. సాధారణత్వమే ఈ గాథలకు అంతస్సూత్రం.

ఏ అనువాదము అంతిమం కాదని విశ్వసిస్తాను. ఈ అనువాదాలను మూల విధేయంగా ఉంటూనే భాషాంతరం చేయటంలో శక్తిమేరకు ప్రయత్నించానని అనుకొంటాను. సహృదయులు అర్థం చేసుకొంటారని ఆశిస్తాను.

ఈ పుస్తకరచనలో శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్‌ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, సవరణలు ఈ రచనను మెరుగుపరిచాయి. వారికి నేను ఋణపడి ఉన్నాను. వారు ఈ పుస్తకానికి రాసిన చక్కని విశ్లేషణాత్మక ముందుమాటకు ఎంతో కృతజ్ఞుడను.


లభించు చోటు



భవదీయుడు

బొల్లోజు బాబా



Friday, March 21, 2025

Please subscribe to my YouTube channel

 Please kindly subscribe my YouTube channel. Please


https://www.youtube.com/@bolloju

Sunday, February 23, 2025

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది. ఆ పోస్టుకు కొనసాగింపుగా ఆ కామెంట్లను ఒక పోస్టుగా పెడుతున్నాను.
.
మీరు పారమార్ధిక ప్లేన్ లోంచి మాట్లాడుతున్నారు. భౌతికంగా అలా లేదు. శంకరుడే స్వయంగా చెప్పాడు శూద్రుడు విద్యకు అనర్హుడు అని. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడుండాలని. బౌద్ధ జైనాల్ని నిర్మూలించటంలో పాపం లేదని.
వీటిని మినహాయించి చేసే ఏ వాదనైనా, చెప్పే ఏ అన్వయమైనా నేటికీ సాగిస్తున్న మోసం అని భావిస్తాను.
.
బౌద్ధజైన సిద్ధాంతాలు కనుమరుగు అయ్యాయని చెప్పలేదు. అవి హిందూమతంలోకి అస్సిమిలేట్ అయ్యాయని పంచాయత ఆరాధన పారాగ్రాఫులో చెప్పాను.
అద్వైతాన్ని సిద్ధాంతపరంగా బౌతికవాదులు ఎదుర్కోలేరు. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని , బౌద్ధులు ప్రత్యక్ష మరియు అనుమాన ప్రమాణాలను మాత్రమే అంగీకరించిన భౌతికవాదులు.
వీటితో పాటు ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ది లాంటి ప్రమాణాలను కూడా అంగీకరిస్తారు అద్వైతులు.
వీరిద్దరి మధ్యా శాస్త్ర చర్చలో అద్వైతులే విజయం సాధిస్తారు. ఎందుకంటే శబ్ద, ఉపమాన అర్ధాపత్తి లాంటి వాటికి ఆధారాలు చూపక్కరలేదు. అభౌతికమైన అంశాలను కూడా వాటిసాయంతో సత్యాలుగా చలామణీ చేయించవచ్చు.
కనుక వారిరువురి పోటీలో అద్వైతులు నెగ్గటం మోసపూరితమైనది.
శంకరుడు చేసిన పని అది. ఈ పని ద్వారా బ్రాహ్మణాధిక్యత వచ్చి, బ్రాహ్మణుడినే ఈ ఆథ్యాత్మిక క్రతువులలో అధిపతిగా నిలిపినపుడు- శతాబ్దాలుగా పండితులు ఈ మోసాన్ని అనేక తలతిక్క అన్వయాలతో సమర్ధిస్తూనే ఉన్నారు.
వ్యాసంలో ఎక్కడో చెప్పినట్టు ఈ పురాణపురుషులు చెప్పినది ఏమిటి అని కాక, దానివల్ల సమాజం ఏ ఏ మలుపులు తీసుకొంది అనేది ముఖ్యం. నాకు కనిపించేది ఏమిటో స్పష్టంగా చెప్పాను. ఈ శంకరాచార్యుని నిర్వాకం వల్ల అశాస్త్రీయత, మూఢత్వం, బ్రాహ్మణాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటి అవలక్షణాల వైపు సమాజం ప్రయాణించింది. అది పండితులకు మేలు చేసింది కనుక శంకరుడిని భక్తితో నేటికీ పూజిస్తారు.
నేను అలా చూస్తున్నాను. అలా గతం నాకు కనపడుతుంది. మీకు మరోలా కనిపించవచ్చుననే అవకాశాన్ని కాదనను.
.
తత్వం నాశనం అయిందని ఎవరన్నారు. ఎందుకు పదే పదే అంటారు ఆ మాట. నేను స్పష్టంగా చెప్పాను. తత్వాలు అస్సిమిలేట్ అయ్యాయని. ఏటా శంకరజయంతులు ఎవరు చేస్తున్నారు?
వైవిధ్యం శంకరుడితో వచ్చిందా? హాస్యాస్పదం. శంకరుని కాలానికే భిన్న పాయలు ఉన్నాయి.
మీరు భౌతిక స్థాయిలో మాట్లాడండి. శంకరనిర్వాకం వల్ల సమాజంలో ఏం జరిగి ఉంటుందో చెప్పాను. అలా జరగలేదని ఉపపత్తులు ఇవ్వండి. ఏ వేవో మాట్లాడితే ఎలా?
ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని గానీ గౌరవించటం, సూఫీ దర్గా కల్చర్ ని ఆదరించటం అనేది బౌద్ధజైన కాపాలికాదుల్ని నిర్మూలించిన శంకరాచార్యుని వల్ల వచ్చింది అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
నిజానికి ఈ సమాదరణ అనేది భారతదేశ ఆత్మ. అశోకుని 12 వ శాసనంలో ఇలా ఉంది.
///ఒక పాషండ శాఖ/మతం కి చెందిన వ్యక్తులు అసందర్భంగాతమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖ/మతాలను నిందించడం చేయరాదు. పరశాఖల/మతం వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన మతాన్ని అభివృద్ధి చేసుకోవటంమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు// సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము తప్ప దానం కాని, పూజ కాని అంత ముఖ్యాలు కావు అని దేవానాం ప్రియుడు తలుస్తున్నాడు. (XII శిలాశాసనము)///
క్రీపూ 3 వ శతాబ్దానికి శంకరాచార్యుడు ఎక్కడున్నాడు. సమత, సహిష్ణుతలను ఈ నేలకు నేర్పిందే బౌద్ధ, జైనాలు. వాటిని నిర్మూలించి ఈ రోజు మనందరినీ అన్యమతాలను పీక్కుతినే జాంబీలుగా చేసింది ఎవరు? యూట్యూబ్ తెరవండి ఒకసారి అర్ధమౌతుంది.

బొల్లోజు బాబా

Saturday, February 8, 2025

ఆది శంకరాచార్యుడు - ఆథ్యాత్మిక దండయాత్ర


వైదికమతంలోని వర్ణవ్యవస్థ, యజ్ఞయాగాదులు, బ్రాహ్మణాధిక్యతను నిరసిస్తూ బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. వైదికమతాన్ని (బ్రాహ్మణమతం) ధిక్కరించి బౌద్ధం ఒక ప్రత్యామ్నాయ ఆథ్యాత్మికమార్గాన్ని ఏర్పరచింది. బ్రాహ్మణులను అత్యున్నతవర్గంగా పరిగణించే కులవ్యవస్థను బుద్ధుడు ఖండించాడు. మనుషులందరూ సమానమేనని, జన్మత హెచ్చుతగ్గులు ఉండవని ప్రకటించాడు. ఆత్మ, దేవుడు ఉనికిని అంగీకరించలేదు. మౌర్యులు, కుషానులు, కొంతమేరకు గుప్తులు బౌద్ధమతాన్ని ఆదరించటంతో బౌద్ధం సుమారు వెయ్యేళ్లకుపైన (BCE 6 నుండి CE 8 వ శతాబ్దం) భారతదేశంలో అప్రతిహతంగా మనుగడ సాగించింది. క్రతువులు జంతుబలులు కాక ధ్యానం అంతఃచేతన ద్వారా ప్రజలు నైతిక వర్తనను, మెరుగైన జీవితాన్ని పొందాలని బౌద్ధం ప్రవచించింది. ధర్మకీర్తి, శాంతిరక్షిత, నాగార్జునుడు వంటి వారు బౌద్ధబోధనలను సర్వోత్కృష్ట స్థాయికి తిర్చిదిద్దారు.

బౌద్ధమతం వర్ణాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూడటంతో సామాన్యప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జనాభాలో అధికశాతం బౌద్ధం ఆచరించారు. ఇది ఒకరకంగా వైదిక/బ్రాహ్మణ మతానికి సైద్ధాంతిక సవాలు. జీవన్మరణ సమస్య.

బ్రాహ్మణమతానికి బౌద్ధం విసిరిన ఈ సవాలును మొదటగా స్వీకరించింది ఆదిశంకరాచార్యుడు. చరిత్రకారులు ఇతను c. 788-820 CE మధ్య జీవించిన వ్యక్తి అని నిర్ణయించారు. కోటవెంకటాచలం లాంటి వారు శంకరాచార్యుని కాలం BCE 509-477 గా చెబుతారు. నిజానికి శంకరాచార్యుని ప్రచ్ఛన్న బౌద్ధుడని (crypto buddha) అందరూ అన్నారు కనుక బుద్ధుని తరువాత పెట్టవలసి వచ్చింది కానీ లేకపోతే తీసుకువెళ్ళి బుద్ధుడికన్నా పూర్వుడని చెప్పేవారే ఈ పండితులు.
 
1. జీవిత చరిత్ర

శంకరుని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు పెద్దగా లభించలేదు. అతని పుట్టుక, వ్యక్తిత్వం, అతను చేసిన ఆథ్యాత్మిక దండయాత్ర, మఠాల స్థాపన, అతని మరణం లాంటి విషయాలు – 14 వ శతాబ్దం నుంచి లభించే “శంకరవిజయాలు” పేరిట విద్యారణ్యుడు, ఆనందగిరి, చిద్విలాసుడు లాంటి కవులు రచించిన శంకరుని జీవితచరిత్రలు, ఇంకా శంకర విరచితమని చెప్పబడే వివిధ వ్యాఖ్యాన గ్రంథాల ద్వారా తెలుస్తాయి.

ఆది శంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామంలో సంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు శివగురు, తల్లి పేరు ఆర్యాంబ. చిన్న వయస్సులోనే వేదాలు, ఉపనిషత్తులు మరియు తర్కశాస్త్రంలో ప్రావీణ్యం సాధించాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి, గురువు గోవింద భగవత్పాదుల చెంతకు వెళ్లి వేదాంత విద్యను అభ్యసించారు.

ఆది శంకరాచార్యుడు అద్వైత వేదాంతాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. బ్రహ్మమే పరమ సత్యం, జగత్ మిథ్య (మాయ), జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అనే భావనల్ని అద్వైతతత్వంగా చెబుతారు.
శంకరాచార్యుడు భారతదేశమంతా తిరిగి తన బోధనలను వ్యాప్తి చేశాడు. నాలుగు మఠాలను స్థాపించారు: అవి కర్ణాటకలో శృంగేరి మఠం, గుజరాత్ లో ద్వారకా మఠం, ఉత్తరాఖండ్ లో జ్యోతిర్ మఠం (జోషిమఠం), ఒడిశాలో పూరీ మఠం. శంకరాచార్యుడు ఈ మఠాలను ధార్మిక నాయకత్వం, సనాతన హిందూ ధర్మపరిరక్షణ కొరకు స్థాపించారు. వీటికి అధిపతులుగా వేదాధ్యయనం చేసిన పండితులే ఉంటారు.
 
శంకరాచార్యుడు ఉపనిషత్తుల, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు; భజ గోవిందం, సౌందర్యలహరి, నిర్వాణ షట్కమ్ వంటి రచనలు చేసాడు.  శంకరాచార్యుడు తన 32వ ఏట   హిమాలయాలో కేదారనాథ్ వద్ద వెళ్లి జీవ సమాధిని పొందాడు.
ఇదీ స్థూలంగా శంకరాచార్యుని జీవిత చరిత్ర.

2. బౌద్ధంపై ఆథ్యాత్మిక దండయాత్ర

శంకరాచార్యుడు బౌద్ధ మరియు జైన ప్రభావాలకు వెనుకబడ్డ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు.
 
శంకరాచార్యుని కాలానికి బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఏడో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన యవాన్ చ్వాంగ్ దేశంలో దేవాలయాలతో పాటు బౌద్ధారామాలు, బౌద్ధబిక్కులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు నమోదు చేసాడు. 
****

బౌద్ధులు చార్వాకులు ఈ సమాజంలో హేతుబద్దమైన ఆలోచనలను ప్రోత్సహించారు. వారు ఈ ప్రపంచానికి ఆధారమేమిటని సత్యాన్వేషణ చేసారు. ఈ ప్రపంచం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే సత్యంగా భావించారు.
 
శంకరాచార్యుడు జగత్తు మిథ్య అని ప్రకటించటం వల్ల ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నానికి విలువలేకుండా అయిపోయింది. సత్యాన్వేషణను మొగ్గలోనే తుంచేసాడు. వైద్యం, రసాయిన శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి వివిధ శాస్త్రాల అథ్యయనం శంకరాచార్యుని తరువాత కుంటుపడింది. భారతీయ ప్రాచీన ఆవిష్కరణలు చాలామట్టుకు శంకరాచార్యునికి ముందు బౌద్ధ జైన లేదా వైదిక ఋషులు సాధించినవే. శంకరాచార్యుడు ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతం సమాజాన్ని మిథ్యావాదం, అలౌకిక అంశాలవైపు నడిపించి శాస్త్రీయ ఆవిష్కరణలను తిరోగమింపచేసింది.
 
దుఃఖం వాస్తవమైనది కాబట్టి దానినుండి విముక్తి పొందటమే జీవితలక్ష్యంగా బౌద్ధులు చెప్పారు. దుఃఖాన్ని ఒప్పుకొని దానిని అధిగమించే మార్గాలను సూచించారు. శంకరాచార్యుడు జగత్ మిథ్య అనటం వల్ల దుఃఖం కూడా ఒక అబద్దం అయిపోయింది. ఇది మానవ దుఃఖాన్ని ఒక మాయగా తోసిపుచ్చుతుంది. దీనివల్ల అమానుషమైన వర్ణ వ్యవస్థ లోని నిచ్చెనమెట్లలో కిందనున్న సాటిమానవుడు అత్యంత హేయమైన దుర్భర జీవనాన్ని గడపటం పట్ల ఇతరులకు ఏ రకమైన సహానుభూతి లేకుండా పోవటమే కాక ఈ భావన వర్ణ వ్యవస్థను సమర్ధించటానికి దోహదపడుతుంది. సమాజంలో ఉన్న అసమానతలు, దారిద్ర్యం, వివక్షను పట్టించుకోదు. ఈ జగమేమాయ అయినప్పుడు ఈ వివక్షపట్ల బాధితులు పోరాటం చేయాలన్న స్పృహను కూడా కోల్పోయేలా చేస్తుంది.
****

బౌద్ధసూత్రాలను కొన్నింటిని శంకరాచార్యుడు కాపీ కొట్టటంచేత శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని చెబుతారు. అలా బుద్ధునితో పోలిక తీసుకురావటం ఒక కుట్ర. శంకరాచార్యునికి బుద్ధునికి ఆచరణలో నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. బుద్ధుడు వైదిక క్రతువులను వర్ణ వ్యవస్థను ఖండించగా, శంకరాచార్యుడు వాటికి మసిపూసి మారేడు కాయ చేసి వేదాలను ఉల్లంఘించరాదని, వర్ణ వ్యవస్థ సదా ఆచరణీయం అని చెప్పాడు. బౌద్ధారామాలలో శూద్ర, అతిశూద్ర స్త్రీలకు ప్రవేశం ఉండగా శంకరమఠాల్లో బ్రాహ్మణ పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. నిజానికి బౌద్ధాన్ని నిర్మూలించటంలో శంకరాచార్యుని పాత్ర గణనీయమైనది. అలాంటి శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని అనటం- వ్యాసుడు శూద్రుడు, వాల్మీకి బోయ అనటం లాంటి వక్రీకరణ. వారు చెప్పే మాటలకు లెజిటమసీ కల్పించటం కొరకు పండితులు చెప్పే అసత్యాలు అవి.
****

14 వ శతాబ్దంలో మాధవాచార్యులు (విద్యారణ్యస్వామి) రచించిన శంకర దిగ్విజయ లోని 1.27-56 శ్లోకాల సారాంశం ఇలా ఉంది.
 
“లోకంలో బౌద్ధులు, జైనులు శైవ కాపాలికులు ఎక్కువకావటం చేత వైదిక ధర్మం నిర్లక్ష్యం చేయబడుతున్నదని దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొన్నారట. దానికి శివుడు “నేను ఆది శంకరాచార్యునిగాను, తనకుమారుడైన కార్తికేయుడు కుమారిల భట్టుగాను అవతరించి తర్కశక్తితో ఆ మతాలను ఖంఢిస్తామని అదే విధంగా ఇంద్రుడు సుధన్వ రాజుగా జన్మించి వైదికధర్మ పునరుద్ధరణకు తోడ్పడతాడని” చెప్పాడు. ఈ ఉదంతం ద్వారా శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారం అని, బౌద్ధ, జైన కాపాలికా ధర్మాలను నిర్మూలించటం కొరకే అతను జన్మించాడని అర్ధమౌతుంది
 
ఉజ్జయినిని పాలించిన సుధన్వ రాజు శంకరాచార్యుడు, కుమారిల భట్టుల ప్రోత్సాహంతో హిమాలయాలనుండి రామేశ్వరం వరకూ గల అనేక వేల బౌద్ధారామాలను, బౌద్ధులను నిర్మూలించాడని శంకర దిగ్విజయంలో మాధవాచార్యుడు చెప్పాడు. ఏడవ శతాబ్దపు చైనాయాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఉజ్జయినిని ఒక బ్రాహ్మణ రాజు పాలిస్తున్నాడని ప్రస్తావించాడు. మృచ్చకటిక నాటకంలో ఉజ్జయిని రాజుయొక్క బావమరిది బౌద్ధులను పీడించసాగాడు అనే మాట ఉంటుంది. ఈ రెండు ఆధారాలు శంకరదిగ్విజయ గ్రంథంలో చెప్పిన బ్రాహ్మణ సుధన్వ రాజు చారిత్రికతను తెలియచేస్తాయి .
 
శంకరదిగ్విజయ ఏడో సర్గ లో- కుమారిల భట్టు శంకరునితో "ఈ భూమి బౌద్ధులతో నిండిపోయింది వేదాలను పట్టించుకొనేవారు లేరు. నేను బౌద్ధులను జయించి వేదాలకు పునర్వైభవం తీసుకొని వస్తాను" అనగా దానికి శంకరాచార్యుడు "భట్టా నీవు బౌద్ధులను నిర్మూలించటానికి అవతరించిన కారణ జన్ముడవు. నీకు ఏ పాపము అంటదు" అని అంటాడు. (7- 77-121 Sankara Digvijaya,Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication)

“శంకరాచార్యుడు బౌద్ధసన్యాసులను వాదనలో ఓడించి వారిని సజీవంగా కాల్చి చంపాడు. దీన్ని మత పిచ్చి కాక మరెలా పిలవగలం” అంటాడు స్వామి వివేకానందుడు.
 
శంకరాచార్యుడు దేశం అంతా తిరిగి బౌతికవాదులైన బౌద్ధులతో శాస్త్ర చర్చలు జరిపి – జగం మిథ్య, అహం బ్రహ్మస్మి, జీవాత్మే పరమాత్మ అంటూ పొంతనలేని పారమార్ధిక వాదనలతో ఓడించి వారిని సామూహిక దహనాలలో హతమార్చాడు. ఇది దుర్మార్గమైన క్రూసేడ్లతో సమానం.
శంకరాచార్యుని బృందం ఒక క్రమపద్దతిలో బౌద్ధ, జైన, కాపాలిక లాంటి హైందవేతర మతాలపై దాడి జరిపింది. ఈ రోజు దేశం అంతటా ఎక్కడ తవ్వితే అక్కడ లభించే విరూపమైన బుద్ధుని విగ్రహాలు శంకరాచార్యుని కాలం నాటివే.
 
అప్పటికి ఉన్న బౌద్ధ ఆరామాన్ని శంకరాచార్యుడు తొలగించి శృంగేరి పీఠాన్ని ఏర్పరచాడంటారు. CE రెండు మూడు శతాబ్దాలలో నాగార్జునకొండ వద్ద విజయపురి అనే పట్టణం గొప్ప బౌద్ధఆరామంగా విలసిల్లినట్లు శాసనాధారాలు కలవు. శంకరాచార్యుడు తన అసంఖ్యాకమైన అనుచరులతో నాగార్జున కొండవచ్చి అక్కడి బౌద్ధఆరామాలను ధ్వంసం చేసాడని నాగార్జున కొండ వద్ద జరిపిన తవ్వకాల రిపోర్టులో A.H.Longhurst అన్నాడు . అదే విధంగా బౌద్ధక్షేత్రమైన శ్రీశైలం, బద్రినాథ్, పూరి, శబరిమలై, తిరుపతి లాంటి బౌద్ధ ఆరామాలను హిందూ ఆలయాలుగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
నేడు సంఘీయులు జరుపుతున్నట్లుగా ఒకప్పుడు శంకరాచార్యుడు హైందవేతర మతాలపై జరిపిన ఆథ్యాత్మిక దండయాత్ర ఇది.
 
3. కరడు కట్టిన మనువాది శంకరాచార్యుడు

శంకరాచార్యుడు దేశంనాలుగు వైపులా స్థాపించిన పీఠాలకు ఒక్కో ఆచార్యుని నియమించాడు. ఎవరి పీఠపరిథిలో వారు అక్కడి ప్రజలలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని 26 శ్లోకాల “మహానుశాసనం” ను రచించాడు. దానిలోని కొన్ని శ్లోకాల అర్థాలు ఇవి…..

మేము సాధించిన వర్ణాశ్రమ ధర్మములను తమ పరిధులలోని ప్రజలలో రక్షితములు అగునట్లు చూడవలెను (శ్లోకం నంబరు 3) ఇక్కడ మేము సాధించిన అనే పదం ప్రధానము.
 
నా చే నిర్మించబడిన ఈ ఆర్యమర్యాద యధావిధిగా నాలుగు మఠములద్వారా రక్షింపబడునట్లు పీఠాధిపతులు తమ శక్తిని వినియోగించవలెను. (8 వ శ్లోకం)

ధర్మసంరక్షణార్ధము సుధన్వ మహారాజునకు గల అధికారమును ఇంద్రాజ్ఞవలె పాలింతురు గాక (14 వ శ్లోకము).
 
చాతుర్వర్ణములవారు యధాశక్తి ఈ గురుపీఠములను అర్చింతురుగాక (17 వ శ్లోకము)

ఈ నియమములన్నియు మనువు, గౌతముడు మొదలైన వారు చెప్పినవే (22 వ శ్లోకము)

కృతయుగమును బ్రహ్మదేవుడును, త్రేతాయుగమందు వశిష్ఠమహర్శియును, ద్వాపరయుగమున వ్యాసమహర్షియును జగద్గురువులై యుండిరి. ఈ కలియుగమున నేనే జగద్గురువునై అవతరించితిని. (శ్లోకం 25)
 
బౌద్ధం వల్ల ఒడిదుడుకులకు గురైన సనాతన హిందూవర్ణ వ్యవస్థను తానే తిరిగి స్థాపించానని; దానిని మీరు కాపాడుకోవాలని; చాతుర్వర్ణాలు ఈ గురుపీఠాలను యధాశక్తి సేవించుకోవాలని “మహానుశాసనం” ద్వారా చెప్పాడు. ఇది ఒకరకంగా ఆయామఠాలను నడిపించటానికి రాసుకొన్న "corporate governance manual" లాంటిది.
 
శంకరమఠాలు నేటికీ ఈ సూత్రాలపైనే నడుస్తున్నాయి. శంకరాచార్యుడు ఈ మఠాలను వర్ణాశ్రమధర్మాన్ని కాపాడటానికి, దానికి ప్రచారం కల్పించటానికి స్థాపించాడు. ఇతను దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగి, మండనమిశ్ర, భాస్కర, కుమారిల భట్ట, భాస్కర వంటి పండితులతో శాస్త్ర చర్చలు జరిపి వారిని ఓడించి తన బోధనలకు విస్త్రుత ప్రచారం కల్పించినట్లు శంకరవిజయాలు చెబుతాయి.
****

బౌద్ధం ప్రభావంచే వేదాలు ఉపనిషత్తులు తీవ్రమైన విమర్శకు గురయ్యాయి. ఆ సమయంలో శంకరాచార్యుడు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చెప్పాడు. వేదాలను తిరిగి చర్చలోకి తీసుకొని వచ్చి వైదిక పునర్వికాసానికి దోహదపడ్డాడు. ఇతను ఈ పని చేయకపోయి ఉన్నట్లయితే బౌద్ధం ఘాతానికి వైదికమతం కాలగర్భంలో కలిసిపోయి ఉండేది.
*****

"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు. శంకరాచార్యుడు చేసిన ఇలాంటి వ్యాఖ్యానాలను అంతవరకు బౌద్ధమతం మనుషులందరూ ఒకటే అంటూ వెయ్యేళ్ళుగా తన బోధనల ద్వారా సాధించిన సమతను కాలరాసి సమాజంలో వర్ణవ్యవస్థను పునర్ ప్రతిష్టించే ప్రయత్నంగా అర్ధం చేసుకోవాలి. శూద్రునికి చదువు నిషిద్ధం అంటూ శంకరాచార్యుని చేసిన ఈ దిశానిర్ధేశం అనంతరం రాసిన అనేక పురాణేతిహాస వ్యాఖ్యానాలలో ప్రతిబింబించింది.

బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అపశూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించాడు.
ప్రాచీనకాలంలో ఆర్య అనార్య జాతులందరికీ ఉపనయన సంస్కారం ఉండేది. క్రమేపీ ఇది శూద్రులకు నిరాకరింపబడింది. ఉపనయనం ఉండటం ఒక గౌరవ సూచనగాను, లేకపోవటం దాసత్వం గాను మారిపోయింది. ఇది సమాజాన్ని నిలువునా చీల్చింది. ఉపనయనం ఉన్న పైమూడు వర్ణాలు అధికులుగాను, ఉపనయనం లేని శూద్రులు వారి సేవకులుగాను మిగిలిపోయారు. ఆ విధంగా శూద్రులు దాదాపు పరాజితులైనారు. ఇక అతిశూద్రులైతే ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా బహిష్కృతులు.
****
 
శంకరాచార్యుడు భగవద్గీతలోని 18.41 శ్లోకానికి ఇచ్చిన వ్యాఖ్యానంలో గత కర్మల ఫలితంగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రుల జన్మలు నిర్ణయమౌతాయని కర్మ సిద్ధాంతాన్ని సమర్ధిస్తాడు. కర్మ భావన అనేది ఈ జన్మలో జరుగుతున్న విషయాలకు గతజన్మలో చేసిన కర్మలే కారణం అనే వాదన. ఇది జాతిలో స్వేచ్ఛా సంకల్పం, వ్యక్తిగత ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రజల మధ్య విభజనలు, హెచ్చుతగ్గుల పట్ల వారు ఏ పోరాటమూ చేయక అన్యాయాన్ని నిష్క్రియంగా స్వీకరించేలా చేస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే నిరాశావాద ధోరణి ప్రబలుతుంది. నిజానికి వర్ణవ్యవస్థ ద్వారా 80% ప్రజలను బానిసలుగా రెండువేల సంవత్సరాలుగా కిక్కురుమనకుండా తొక్కిపెట్టటానికి దోహదపడిన మంత్రాంగంలో కర్మ సిద్ధాంతం ఒకటి.
 
భగవద్గీతలో “చాతుర్వర్ణం మయా సృష్టం….4.13 అనే శ్లోకంలో కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రవర్ణాలను వారి వారి గుణములు, కర్మలను బట్టి నాచే సృష్టించబడ్డాయి అంటాడు. ఈ శ్లోకానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో తమోగుణము కలిగిన శూద్రులు పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య వర్ణాలకు అవసరమగు సేవలు చేస్తూ జీవించాలని అన్వయం చెప్పాడు. ఇది మనుధర్మాన్ని సమాజంలో స్థిరపరచటం.
****

3. హిందూమత ఆవిర్భావం

1500–500 BCE మధ్య కాలంలో ఇంద్రుడు, అగ్ని వరుణుడు, సోముడు వంటి దేవతలు, యజ్ఞయాగాదులు, వేదాలు, ఉపనిషత్తులు ప్రభావంతో నడిచిన మతాన్ని వైదికమతం గా చెబుతారు. 600 BCE లో ఈ వైదికమతంలో విచ్చలవిడిగా సాగిన యజ్ఞయాగాదులు, బలులకు నిరసనగా బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక లాంటి అనేక మతాలు పురుడుపోసుకొన్నాయి. వీటిలో బౌద్ధం సామాజిక సమానత్వం కలిగిఉండటం, కర్మకాండల ఒత్తిడి, జాతి ఆధిపత్యం లేకపోవటం, సరళమైన నైతిక జీవనం లాంటి అంశాలతో ప్రజలను ఆకట్టుకొంది. ఎక్కువమంది సామాన్యులు బౌద్ధంలో చేరారు. బౌద్ధం తాకిడికి వైదికమతం తన ప్రాభవాన్ని కోల్పోయింది. 600 CE నాటికి వైదిక మతం శైవం, వైష్ణవం, శాక్తేయం (శక్తి ఆరాధన), సౌర్యం (సూర్యారాధన), గణాపత్యం (గణపతి ఆరాధన), స్కంద (కార్తికేయ ఆరాధన) ఇంకా కాపాలిక, పాశుపత అంటూ శాఖోపశాఖలుగా చీలిపోయింది. అనైక్యత ఆవరించింది. శంకరుని కాలానికి 72 రకాల మతాలు ఉండేవని అంటారు.
ఇలాంటి నేపథ్యంలో శంకరాచార్యుడు తెరపైకి వచ్చాడు. బౌద్ధాన్ని మాయావాదనలతో కర్కశంగా అణచివేసాడు. వేదాలకు ఉపనిషత్తులకు భాష్యాలు రచించి వాటికి పునర్వైభవం కల్పించాడు. చీలిపోయిన వైదిక మతశాఖలన్నింటిని ఒక్కటిగా చేసి “పంచాయతన ఆరాధన” విధానాన్ని ప్రవేశపెట్టి దానికి బ్రాహ్మణుడిని అధిపతిని చేసాడు.

శివుడు, సూర్యుడు గణేషుడు, పార్వతీ దేవి, విష్ణువులను ప్రధానదేవతలుగా ఆరాధించటాన్ని పంచాయత పూజావిధానం అంటారు. ఈ విధంగా చేయటం వల్ల వేదాలను అనుసరించే శాఖలన్నీ ఒక్కటి అయ్యి బలంపుంజుకొన్నాయి. బుద్ధుడిని విష్ణువుయొక్క అవతారంగా కట్టుకథలు కల్పించారు. ఈ విధానం ప్రాచీనభారతదేశపు మతపరమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని క్షీణింపచేసింది. ఆథ్యాత్మికామార్గాలలోని భిన్నత్వాన్ని చెరిపేసింది. ఆయా మతాల అవలంబులను బలవంతంగా హిందు ధర్మంలోకి కలిపేయటం లేదా నిర్మూలించటం జరిగింది. ఇదొకరకమైన ఆథ్యాత్మిక క్రూసేడ్.

వైదిక మతం బౌద్ధమతంలోని ధ్యానం, ఆరామసంస్కృతి, విగ్రహారాధనలను స్వీకరించింది. జైనంనుంచి అహింస, సన్యాసి జీవితం, కర్మ సిద్ధాంతం లాంటి అనుకూల అంశాలను గ్రహించింది. వేదాలకు, ధర్మశాస్త్రాలకు సాంస్కృతిక రూపంగా అష్టాదశ పురాణాలను, రామాయణ, మహాభారత పురాణాలను సృష్టించుకొంది. అలా వైదిక మతం క్రమేపీ నేడు మనం చెప్పుకొంటున్న హిందూమతంగా రూపాంతరం చెందింది.

ఈ ప్రక్రియలో శంకరాచార్యుడు పోషించిన పాత్ర రాజకీయమైనది. ఈ క్రమంలో హిందూమతం స్థిరీకరించబడిందని మాట్లాడతారు తప్ప ఏరకమైన అసమానతలు, వివక్ష లేకుండా సమాజాన్ని- సమానత్వం వైపు, శాస్త్రీయతవైపు నడిపించిన బౌద్ధమతం తొలగించబడిందని ఎవరూ మాట్లాడుకోరు. బౌద్ధమతం క్షీణించటానికి ఉన్న అనేక కారణాలలో శంకరాచార్యుడు జరిపిన దాడి కూడా ముఖ్యమైనదే.

4. ముగింపు

శంకరాచార్యుడు 8 వ శతాబ్దపు వ్యక్తి అని మనకు 14వ శతాబ్దంలో వివిధ వ్యక్తులు రాసిన అతని జీవిత చరిత్రల ద్వారా అర్ధమౌతుంది. మధ్యలో ఉండిన ఆరు శతాబ్దాల ఖాళీకి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లభించవు. శంకరాచార్యుడు స్థాపించినట్లు చెబుతున్న మఠాలలో కూడా శాసనాలు 14 వ శతాబ్దం నుండి మాత్రమే లభిస్తాయి. శంకరాచార్యుని సమకాలీన శాసనాలు కానీ ఉటంకింపులు కానీ దొరకలేదు. ఇతను ఒక వ్యక్తా అనేక వ్యక్తులా అనేది కూడా చెప్పలేం. ఇతను చాణుక్యుడిలా కల్పిత పాత్రకావచ్చుననే సందేహం కూడా ఉంది.

సాధారణంగా చారిత్రిక వ్యక్తుల కన్నా పురాణవ్యక్తులే శక్తివంతంగా ఉంటారు. అలా శంకరాచార్యుడు నేడు శ్రీరామచంద్రునిలా పురాణపురుషుడు. పూజనీయుడు. చరిత్రను దాటి పురాణపురుషునిగా ఎదిగిన వ్యక్తి చరిత్రాతీతుడు అయిపోతాడు. ఇక అతనికి ఆపాదించబడ్డ శక్తులను నిరూపించటం చారిత్రికంగా అసాధ్యం. వారిపై చర్చను ఈ మహిమలపైనకాక ఆ మహిమలు సమాజాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనే చారిత్రిక సత్యాలపైనే చెయ్యాల్సి ఉంటుంది. అంతమాత్రానా అతన్నీ అతని మహిమల చారిత్రికతను ఒప్పుకొన్నట్లు కాదు.
****

శంకరాచార్యుడు సామాన్యప్రజలతో సంబంధాలు పెట్టుకోలేదు. ఇతని బుధజనవర్గం వేదపండితులు. వైదికరచనలకు వ్యాఖ్యానాలు రాయటం; వర్ణాశ్రమ ధర్మాలను స్థిరీకరించటం; మఠాలు క్రతువుల ద్వారా బ్రాహ్మణాధిక్యతను స్థాపించటం; స్త్రీలకు శూద్రులకు చదువును నిరాకరించటం; బౌద్ధులను నిర్మూలించి బౌద్ధారామాల ఆక్రమణ చేయటం లాంటివి శంకరాచార్యుడు చేసిన పనులు. వీటిలో ఏవీ 90 శాతం దేశ ప్రజలకు ఉపయోగకరం కావు సరికదా వారిని పీడించేవే.

శంకరాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు చేసిన వ్యాఖ్యానాలు బౌద్ధ జైన మతాల తాకిడికి రెపరెపలాడుతున్న వైదిక ధర్మాన్ని నిలబెట్టిందని పండితులు పదే పదే చెబుతారు. “రాముడు రాక్షసులందరిని నాశనం చేసి సీతను రక్షించినట్లే, శంకరాచార్యుడు వేదాలను దూషించే బౌద్ధులను ఓడించి, ఉపనిషత్తుల సత్యమైన సీతకు పూర్వపు వైభవాన్ని పునరుద్ధరించాడు. మూడు లోకాలకు మేలు చేసిన గొప్ప శంకరునికి విజయం కలుగుగాక!” అని శంకరదిగ్విజయలో మాధవాచార్యుడు శంకరుని వేనోళ్ళ కొనియాడతాడు. (4-110)

శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం సామాన్యప్రజలకు అర్ధం కాదు. నేటికీ దానికి అన్వయం చెప్పటం సులభం కాదు. అయినప్పటికీ పండితులు అదేదో మానవేతిహాసపు మహావిష్కరణ అంటూ ప్రచారం చేసారు. శంకరుని వ్యాఖ్యానాలను చూపి వర్ణవ్యవస్థ, కర్మ సిద్ధాంతం, బ్రాహ్మణాధిక్యతను బతికించుకొని సమాజాన్ని మూఢనమ్మకాలలోకి, అసమానతలలోకి నడిపించి ధర్మం పేరుతో శూద్ర అతి శూద్ర వర్గాలను, వారి శ్రమను దోచుకుతినడానికి తెరలేపారు పండితులు.

ఈ మొత్తం చారిత్రిక మలుపులో పండితులు పోషించినపాత్ర, వారు పొందిన సామాజిక హోదా అత్యంత అమానవీయమైనది.

శంకరాచార్యునిచే ప్రవేశపెట్టబడినదిగా చెప్పే పంచాయతన ఆరాధనా విధానం వల్ల ఈదేశపు సాంస్కృతిక వైవిధ్యం అంతరించింది. బ్రాహ్మణుడు ప్రధానంగా జరిగే రిచువల్స్ కి ప్రాధాన్యత పెరిగింది.

శంకరాచార్యులు కాశీలో గంగానదిలో స్నానం చేసి వస్తుండగా ఒక చండాలుడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారం ప్రకారం శంకరాచార్యులు అతన్ని దూరంగా ఉండమని చెబుతాడు. చండాలుడు శంకరాచార్యుని దేహాన్ని చూసి "మీరు దేహాన్ని దూరంగా ఉండమంటున్నారా లేక ఆత్మను దూరంగా ఉండమంటున్నారా?" అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు శంకరాచార్యులు తన అజ్ఞానాన్ని తెలుసుకొని చండాలుని సాక్షాత్తు శివునిగా గుర్తించి నమస్కరిస్తాడు. శంకర దిగ్విజయంలో చెప్పిన ఈ చండాలుని వృత్తాంతం చూపుతూ శంకరాచార్యుడు అంటరానితనాన్ని నిరసించాడని, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలిచాడని కొందరు పండితులు వాదిస్తారు. నిజానికి పై ఘట్టంలో సమానభావన ఎక్కడ ఉంది? అదే శంకరదిగ్విజయంలో శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారమని చెప్పినప్పుడు చండాలుని రూపంలో వచ్చిన మరొక శివుడు ఎవరు? ఇవన్నీ అన్వయాలపేరుతో పండితులు చేసే మోసాలు.

శంకరాచార్యుని ప్రభావం నేటికీ సమాజంలో ఉంది. ఉదాహరణకు డా. అంబేద్కర్ మహాసయుడు పార్లమెంటులో హిందూకోడ్ బిల్ ప్రవేశపెడుతున్నప్పుడు కర్ణాటకలోని శంకరాచార్యుని స్కూల్ కు చెందిన సంకేశ్వర మఠాధిపతి "గంగాజలం పవిత్రమైనది కావచ్చు, కానీ అది వీధి కుళాయి ద్వారా వస్తే, దానిని పవిత్రంగా పరిగణించలేము. అదేవిధంగా, 'ధర్మశాస్త్రం' (హిందూకోడ్ బిల్) ఎంత ప్రామాణికమైనదైనా, డాక్టర్ అంబేద్కర్ వంటి 'మహర్' నుండి వచ్చినందున దానిని ప్రామాణికంగా పరిగణించలేము" అన్నాడు. శతాబ్దాలతరువాత కూడా శక్తివంతంగా నిలిచిన శంకరాచార్యుని “మహానుశాసనం” అది.

వర్ణవ్యవస్థను సమాజంలో స్థిరపరచి బౌద్ధం వల్ల మసకబారిన బ్రాహ్మణాధిక్యతకు పునర్వైభవం తెప్పించినందుకు నేటికీ పండితులు శంకరాచార్యుడిని “శంకరభగవత్పాదులు” అనీ, సాక్షాత్తూ శివావతారమనీ గొప్ప భక్తి ప్రపత్తులతో, కృతజ్ఞతాపూర్వకంగా పిలుచుకొంటారు. శంకర జయంతి పేరిట ఏటా పెద్దఎత్తున పూజలు, వేడుకలు జరుపుకొంటారు.
***

ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో చదువుకొని గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న బహుజనులు, ఒకప్పుడు తాము బానిసత్వపు చీకటిలోకి ఎలా నెట్టబడ్డారో, శతాబ్దాలుగా అక్కడే ఎలా ఉంచబడ్డారో ఆ మంత్రాంగాన్ని అర్థం చేసుకునే క్రమంలో శంకరాచార్యుడు పోషించిన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. గతమెంతో గొప్పది, అందరినీ అక్కడికే నడిపిస్తాం అంటూ పండితులు ప్రచారిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవగాహన అవసరం.

బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు
1. 1. Brahma Sutra Bhasya Of Shankaracharya by Swami Gambhirananda, pn233
2. శ్రీశంకరావతార చరితము, యఱ్ఱాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి
3. The Buddhist Antiquities of Nagarjunkonda, by A.H.Longhurst, Delhi, 1938, p.6.
4. complete Works of Swami Vivekananda, vol. VII, p.116
5. Tirupati Balaji was a Buddhist Shrine, by K. Jamanadas
6. Sankara Digvijaya, Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication.
7. శ్రీశంకర విజయము, చిలుకూరు వెంకటేశ్వర్లు
8.ఆదిశంకరాచార్య వ్యక్తిత్వం తత్వం – రావిపూడి వెంకటాద్రి
9. Decline and Fall of Buddhism, by Dr.KJamnadas
10. Slavery, Jyothirao Phule
11. On Hinduism, Wendy Doniger
12. వేదబాహ్యులు, బొల్లోజు బాబా



Friday, January 31, 2025

పున్నిక థేరీ గాథ

గతకొద్దిరోజులుగా జరుగుతున్న కుంభమేళా సందర్భంగా రెండు వేల ఏండ్లక్రితం పున్నిక అనే బౌద్ధ భిక్కుణి నదిలో పవిత్రస్నానం చేస్తున్న ఒక బ్రాహ్మణుడితో చేసిన సంవాదన గుర్తుకువస్తోంది పదే పదే.
.
థేరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు
.  
[పున్నిక:]
నేను నీళ్ళు మోయు దాసిని
యజమానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి
ఎంతచలిలోనైనా నేను నదిలో దిగకతప్పదు
ఓ బ్రాహ్మణుడా!
కాళ్ళుచేతులు వణికే ఇంతచలిలో
నీవు దేనికి భయపడి నీటిలో మునుగుతున్నావు?

[ఉదకసుద్ధిక:]
పున్నికా! నీకు అన్నీ తెలుసు
నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది
దుష్కర్మలనుండి విముక్తులను చేస్తుంది

[పున్నిక:]
నీటిలో మునిగితే
పాపవిముక్తి జరుగుతుందని ఎవరన్నారు?
ఒక అంధుడు మరొక అంధునికి దారిచూపినట్లు.
అదే నిజమైతే
కప్పలు, తాబేళ్ళు, నీటిపాములు, మొసళ్లు లాంటి
జలచరాలన్నీ స్వర్గార్హత పొందిన పుణ్యజీవులేనా!.
జంతువులను వధించువారు, వలలు వేసేవారు,
ఉచ్చులు పన్నేవారు, దొంగలు, హంతకులు, దుర్మార్గులు
ఈ నీరు నెత్తిపై చల్లుకొంటే వారి వారి పాపాలు తొలగి
పుణ్యాత్ములౌతారా?
ఈ నీటికే పాపాలను తొలగించే శక్తే ఉంటే
పుణ్యాలను కూడా తీసుకుపోగలదు కదా!
అప్పుడు నీవు రెండిటినుండి విముక్తుడవు అవుతావు.
పాపభీతితో ఎముకలు కొరికే చలిలో స్నానం చేస్తూ
నీ శరీరాన్ని కష్టపెట్టుకోకు

[ఉదకసుద్ధిక:]
ఓ వనితా!
నేను తప్పు మార్గంలో వెళుతున్నాను
నీవు నన్ను ఉత్తమ మార్గం లోకి మళ్ళించావు
ఈ వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు

[పున్నిక:]
వస్త్రాన్ని నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు.
దుఃఖం అంటే భయం ఉన్నప్పుడు
దుష్కర్మలు చేయవద్దు చీకట్లోనైనా లేదా వెలుగులోనైనా
చెడ్డపనులు చేసి వాటినుంచి పారిపోయినప్పటికీ
వాని తాలూకు దుఃఖం నుంచి తప్పించుకోలేవు.
దుఃఖం నుండి విముక్తి పొందాలంటే
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించు
ఉపదేశాలను ఆచరించు. మంచి జరుగుతుంది.
 
[ఉదకసుద్ధిక:]
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించాను
ఉపదేశాలను ఆచరించాను. మంచి జరిగింది.
ఒకప్పుడు నేను బ్రాహ్మణసంతానాన్ని మాత్రమే
నేనీనాడు త్రివిద్యలను అభ్యసించి పరిశుద్ధుడనైన
నిజమైన బ్రాహ్మణుడను.
***
(థేరీగాథలు పుస్తకం నుంచి)
.
పున్నిక ఒక దాసి కూతురు. ప్రతిరోజు నదికి పోయి గృహావసరాలకు నీరు తీసుకొని వచ్చే అంబువాహిని. దాదాపు రెండున్నరవేల ఏండ్లక్రితం పున్నిక, ఉదకశుద్ధిక అనే బ్రాహ్మణుడితో నదీ స్నానం వెనుక ఉండే మూఢత్వాన్ని గురించి చేసిన సంభాషణ పై థేరీగాథలో గమనించవచ్చు. ఇది ఆనాటి ప్రజలలో ఉండిన మత పరమైన అవగాహన.
నీళ్ళలో నివసించే చేపలు, తాబేళ్ళు కూడా పుణ్యజీవులేనా? దుర్మార్గులు ఈ నీళ్ళు చల్లుకొంటే వారి పాపాలు పోతాయా అని వేసిన ప్రశ్నలు నేటికీ విలువైనవి.
అంత తార్కికంగా ఆలోచించిన అదే ప్రజలు నేడు పర్వదినాల పేరిట తొక్కిసలాటకు గురయి మరణిస్తున్నారు. అశోక చక్రవర్తి వేయించిన 1 వ నంబరు శాసనంలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేదించాడు. బహుశా మతం అనేది వ్యక్తిగతంగా సాధన చేయాల్సిన అంతర్యానం తప్ప సామాజికంగా గుంపులు గూడి ఆరాధించాల్సిన విషయం కాదని అశోకుని అభిప్రాయం కావొచ్చు.
అలాంటి ప్రజలలో ఉండిన శాస్త్రీయ ఆలోచనలను చంపేసి, జాతిమొత్తాన్ని నిర్వీర్యం చేసి అంధకారం వైపు, మూఢనమ్మకాలలోకి నడిపించారు గత వెయ్యేళ్ళుగా.
.
బొల్లోజు బాబా



Tuesday, January 28, 2025

రాజ్యాంగ రచన -డా. అంబేద్కర్ మహాసయుడు.


.
భారతరాజ్యాంగ నిర్మాణంలో 299 మంది సభ్యులు పాల్గొన్నారని వారిలో డా. బి. ఆర్. అంబేద్కరు ఒకరని; నిజానికి రాజ్యాంగాన్ని 1947 లోనే బి.ఎన్. రావు రచించాడని దానినే డా. అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ ముందు ప్రవేశపెట్టాడని; భారత రాజ్యాంగ నిర్మాతగా డా.అంబేద్కర్ పాత్ర పరిమితమని- అంటూ కొంతమంది సనాతనులు ప్రతి రిపబ్లిక్ డే రోజునా అబద్దాలను వండివార్చటం పరిపాటి.
***
రాజ్యాంగ సభ (Constituent Assembly) అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఈ సభ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946లో ఏర్పడింది. దీని ప్రధాన లక్ష్యం స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం. ఈ సభ అధ్యక్షుడైన డా. రాజేంద్రప్రసాద్, భారత ప్రభుత్వ అధికారి, న్యాయకోవిదుడు బి.ఎన్ రావును రాజ్యాంగ ప్రాధమిక డ్రాఫ్ట్ ను/ముసాయిదా తయారు చెయ్యమని కోరాడు.
ఆ మేరకు బి.ఎన్. రావు వివిధ దేశాలు పర్యటించి, ఆ యా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని మంచి అంశాలను క్రోడీకరిస్తూ ఒక నివేదికను తయారు చేసి అక్టోబరు 1947 లో స్వతంత్రభారత ప్రభుత్వానికి సమర్పించాడు. (దీన్ని ఆర్చైవ్స్ లో Constitution in the making పేరుతో చదువుకొనవచ్చును) ఇది ఒకరకంగా రాజ్యాంగానికి ప్రాధమిక ఔట్ లైన్. ఇక్కడితో బిఎన్ రావు పాత్ర ముగిసిపోయింది. 1948 లో బి.ఎన్ రావు యునైటెడ్ నేషన్స్ లో భారత ప్రతినిధిగా, 1952 వరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జ్ గా పని చేసారు. భారతదేశంలోనే లేరు.
బి.ఎన్ రావు తయారు చేసిన నివేదిక ను రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించబడిన డా. అంబేడ్కర్ కు ఇచ్చారు. దీనిని డా. అంబేద్కర్ దాదాపు తిరగ రాసి 299 మంది సభ్యులున్న Constituent Assembly ముందు చర్చించటానికి ప్రవేశపెట్టారు.

రాజ్యాంగాన్ని నిర్మించటం కొరకు జరిగిన చర్చలను Constituent Assembly Debates అంటారు. ఇవి డిశంబరు 9 1946 నుండి నవంబరు 26, 1949 మధ్య జరిగాయి.
.
బి.ఎన్ రావు ప్రతిపాదించిన రాజ్యాంగ ఫ్రేమ్ వర్క్ నివేదికకు (1947) డా. అంబేద్కర్ తుదిరూపు దిద్దిన (1950) రాజ్యాంగానికి గల వ్యత్యాసాలను ఈ విధంగా గుర్తించవచ్చు.
 
1. 240 ఆర్టికిల్స్ ను 390 ఆర్టికిల్స్ గా డా. అంబేద్కర్ విస్తరించారు.
 
2. ప్రజలమధ్య సోదరభావం సమైక్యత పెంపొందించటానికి రాజ్యాంగ ప్రవేశికలో సౌభ్రాతృత్వం అనే పదాన్ని డా. అంబేద్కర్ చేర్చారు

3. బిఎన్ రావు ప్రణాళిక 1935 నాటి భారతప్రభుత్వ చట్టాలపై ఎక్కువగా ఆధారపడింది. డా. అంబేడ్కర్ రాష్ట్రాలు, కేంద్రాల అధికారాలను, పరిధులను స్పష్టంగా నిర్వచించారు. కేంద్రం బలంగా ఉండేందుకు అనేక మార్పులు చేసారు. అత్యవసర సమయంలో దేశంలో ప్రాధమిక హక్కులు రద్దుచేసి ఎమర్జెన్సీ విధించే హక్కు కేంద్రానికి కల్పించారు.

4. బిఎన్ రావు ప్రణాళికలో ప్రాథమిక హక్కులు పరిమితంగా ప్రస్తావించబడ్డాయి. డా.అంబేద్కర్ తుది రాజ్యాంగం వాటిని విస్తరించి పునర్నిర్మించింది, ముఖ్యంగా వివక్షకు వ్యతిరేకంగా రక్షణలు కల్పించింది. అంటరానితనాన్ని రద్దు చేసింది. ప్రాధమిక హక్కుల పునరుద్ధరణ కొరకు ఏ పౌరుడైనా సుప్రీమ్ కోర్టు తలుపు తట్టటం అనే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. (ఆర్టికిల్ 32) దీన్ని రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్ అని డా. అంబేద్కర్ వర్ణించారు.
 
5. డా. అంబేద్కర్ న్యాయవ్యవస్థను స్వతంత్రంగా నిలబెట్టారు. ప్రజల ప్రాధమిక హక్కులను రక్షించటానికి దానికి విస్త్రుతమైన అధికారాలను ఇచ్చారు.
 
6. బిఎన్ రావు ప్రణాళికలో పెద్దల ఓటు హక్కు లేదా ఎన్నికల ప్రక్రియలను స్పష్టంగా నిర్వచించలేదు. అంబేద్కర్ బృందం సార్వత్రిక పెద్దల ఓటు హక్కు మరియు ఎన్నికల యంత్రాంగాల కోసం ఒక బలమైన స్వతంత్ర వ్యవస్థను ప్రతిపాదించింది.
 
7. బిఎన్ రావు ప్రణాళిక భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు స్పష్టమైన నిబంధనలను రూపొందించలేదు. అంబేద్కర్ ఆధ్వర్యంలోని తుది రాజ్యాంగం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఆవశ్యతను, అవకాశాలను గుర్తించింది.

8. ఆర్టికిల్ 39 ద్వారా సమానపనికి సమాన వేతనచట్టాన్ని మరింత విస్త్రుతపరచారు డా. అంబేడ్కర్. అదే విధంగా ఆర్టికిల్ 45 ద్వారా 14 ఏళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటం రాష్ట్రాల బాధ్యత చేసారు.

9. బిఎన్ రావు ప్రణాళికలో వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించమని ఉంది. దీన్ని డా.అంబేద్కర్ మరింత విస్తరించి ఎస్సి, ఎస్టీ లకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు.
 
10. అత్యయిక పరిస్థితులలో దేశం ఏం చెయ్యాలనేది బి.ఎన్ రావు ప్రణాలికలో సూచించలేదు. దీన్ని 352, 356, 360 లాంటి ఆర్టికిల్స్ ద్వారా కేంద్రం దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకొని యుద్ధం, అంతర్గతకల్లోలాలు వంటి అత్యయిక పరిస్థితులను సరిదిద్దే అవకాశం కల్పించారు డా. అంబేద్కర్

11. రాజ్యాంగ సభ ఈ ముసాయిదాను సుమారు మూడేళ్ళపాటు చర్చలు జరిపి తుది రాజ్యాంగాన్ని ఆమోదించింది. దాదాపు ఈ చర్చలన్నిటిలో డా. అంబేద్కర్ పాల్గొన్నారు. సభ్యుల సందేహాలకు వివరణలు ఇచ్చారు. అభ్యంతరాలు చెప్పిన చోట వేల కొలదీ తగిన సవరణలు చేసి ఒప్పించారు. ఆ విధంగా రాజ్యాంగ తుది రూపం డా.అంబేద్కర్ మేధో శ్రమఫలితమే.
 
పై అంశాలను గమనిస్తే- ఈ రోజు ఏదైతే మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం అని అనుకొంటున్నామో దానిని డా. అంబేడ్కర్ రూపొందించినట్లు అర్ధమౌతుంది. ఇది సామాన్యపౌరుడిని వివక్ష, దోపిడి, దౌర్జన్యాలనుండి నుండి రక్షిస్తుంది. ఈ రోజు ఈ హక్కులను కాలరాయటం జరుగుతోంది. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించటం కూడా పైన పొందుపరచిన అంశాలను తొలగించటానికే అని అనుమానించే పరిస్థితులు ఉన్నాయి.
***
రాజ్యాంగ సభ 165 సార్లు కూర్చుని రాజ్యాంగం ఎలా ఉండాలో చర్చించింది. అనారోగ్యంతో ఉండికూడా వీటిలో సుమారు 150 సమావేశాలకు డా.అంబేడ్కర్ హాజరయ్యారు. తుది మెరుగుల కొరకు ముసాయిదాను మూడుసార్లు సభ్యుల ముందు ప్రవేశపెట్టారు.
రాజ్యాంగ సభ సభ్యులు మొత్తం 7635 మార్పులు సూచించగా 2473 మార్పులను డా. అంబేద్కర్ అంగీకరించి తదనుగుణంగా సవరణలు చేసారు. తిరస్కరించిన సూచనలకు, చేసిన మార్పులకు స్వయంగా సమాధానం ఇచ్చారు.
 
ఈ Constituent Assembly చర్చలన్నీ నేడు 6756 పేజీల డాక్యుమెంటుగా లభిస్తున్నాయి. ఈ డాక్యుమెంటులో డా. అంబేడ్కర్ పేరు 4524 సార్లు రాగా బి.ఎన్ రావు పేరు 35 సార్లు మాత్రమే ఉండటాన్ని బట్టి డా. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో పోషించిన పాత్ర స్పష్టమౌతుంది.
రాజ్యాంగ సభలో డా. అంబేద్కర్ రోజూ 9-10 సార్లు లేచి నిలబడి తన అభిప్రాయాలను సమర్ధించుకోవటమో లేక సమాధానం ఇవ్వటమో చేసారని, కొన్ని సార్లు రోజుకు 25-26 సార్లు కూడా సభలో తన గళాన్ని వినిపించేవారని ఈ Constituent Assembly చర్చల ద్వారా అర్ధమౌతుంది.
తుది రాజ్యాంగ ప్రతి 1949 లో కమిటీ సభ్యుల ఆమోదం పొంది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణదశ, దాన్ని ఆమోదించటంలో రాజకీయంగా డా. అంబేడ్కర్ కు జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన మద్దతును విస్మరించలేం.
***
రాజ్యాంగ రచనలో పాల్గొన్న 299 మంది సభ్యులలో డా. అంబేద్కర్ ఒకరని, రాజ్యాంగాన్ని బి.ఎన్ రావు రూపొందించగా డా. అంబేద్కర్ క్రెడిట్ తీసుకొన్నారని సనాతనులు దుష్ప్రచారం చేస్తారు.
రాజ్యాంగ సభ సభ్యులలో ఒకరైన టీ.టీ. కృష్ణమాచారి, ఒక సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంకితభావం గురించి మాట్లాడుతూ ---"రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి ఎంపిక చేసిన ఏడుగురు సభ్యులలో ఒకరు రాజీనామా చేశారు, ఒకరు మరణించారు, ఒకరు అమెరికాకు వెళ్ళారు, ఒకరు స్వరాష్ట్రంలో తన పనితో బిజీగా ఉన్నారు, ఇద్దరు ఢిల్లీ నుండి దూరంగా నివసిస్తున్నారు, మరొకరు ఆరోగ్య కారణాల వల్ల మినహాయించబడ్డారు, డాక్టర్ అంబేద్కర్ ఒక్కరే భారాన్ని మోయవలసి వచ్చింది" అని అన్నారు.
 
డా.అంబేడ్కర్ సమకాలీనుడు, రాజ్యాంగరచనలో పాల్గొన్న ఒక వ్యక్తి అన్నమాటలు. ఇవేవీ ఈ సనాతనులకు కనిపించవు.
 
నేడు వీరు డా. అంబేద్కర్ కృషిని తగ్గించాలని చూడటానికి కారణాలు - డా.అంబేడ్కర్ ప్రాచీన ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా, ప్రజలందరకూ సమాన హక్కులు, విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించటం మరీ ముఖ్యంగా ఈ దేశాన్ని హిందూరాజ్యంగా కాక స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు అనుగుణంగా నిర్మించు కొనేందుకు ఒక బలమైన రాజ్యాంగాన్ని ఇవ్వటం, అది సామాన్యులు, నిరుపేదల పట్ల పక్షపాతంతో ఉండటం. వీటిని జీర్ణించుకోలేక సనాతనులు నిత్యం ఈ శతాబ్దపు దార్శనికుడిపై బురద జల్లుతున్నారు.
 
బొల్లోజు బాబా