ప్రాచీన భారతదేశ విశ్వవిద్యాలయాలు అంటూ కాషాయ రంగు అఖండభారతదేశపు ఫొటో ఒకటి సనాతన హిందూ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. దానిపై 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 11 విశ్వవిద్యాలయాలు బౌద్ధులకు చెందినవి కాగా 1 జైనులకు చెందినది. విశ్వవిద్యాలయాలంటే కులమతాలకు అతీతంగా విద్యనందించే కేంద్రాలు. ఇవి కాక ఇంకా సుమారు 15 వివిధ విద్యా కేంద్రాల పేర్లు కలవు. ఇవి హిందూమతానికి చెందిన గురుకులాలు, మఠాలు,. వీటిలో బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
I. ఆ ఫోటోలోఉన్న బౌద్ధ విశ్వవిద్యాలయాలు
1. తక్షశిల (BCE 6వ శతాబ్దం – CE 5వ శతాబ్దం): ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోని పురాతన ఉన్నత విద్యా కేంద్రాలలో ఒకటి. ఇది బౌద్ధ కేంద్రంగా చక్రవర్తి అశోకునిచే అభివృద్ధి చేయబడింది. (తక్షశిల BCE15 వ శతాబ్దంలో స్తాపించబడింది అని ఫొటోలో ఉంది. అది తప్పు)
2. నలందా (CE 5 –CE 12 వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న నలందా ఒక ప్రఖ్యాత బౌద్ధ విహారంతో కూడిన విశ్వవిద్యాలయం. బౌద్ధ తత్వశాస్త్రం, తర్కం, ఇతర విభాగాల అధ్యయనానికి ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనిని గుప్త చక్రవర్తి కుమారగుప్త I ఐదవ శతాబ్దంలో స్థాపించాడు. ఇది 10,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. హ్యుయాన్ త్సాంగ్ ఇక్కడ చదువుకొన్నాడు.
3. తెల్హారా (CE 1 –CE 12 వ శతాబ్దం): నలందా సమీపంలో ఉన్న మరో బౌద్ధ విద్యాకేంద్రం. 1వ శతాబ్దం CE నుంచి ఉన్నదని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది పాలరాజుల పోషణలో ఉంది.
4. పుష్పగిరి (BCE 3 –CE 12 వ శతాబ్దం): ఒడిశాలోని పుష్పగిరి, పురాతన కళింగ రాజ్యంలో ఒక ప్రముఖ బౌద్ధ విశ్వవిద్యాలయం. అశోకచక్రవర్తి దీనికి పోషకుడిగా ఉన్నాడు.
5. విక్రమశీల (CE 8 - 12 శతాబ్దం). స్థాపకుడు: పాల చక్రవర్తి ధర్మపాలుడు. ఇదిముఖ్యంగా వజ్రయాన బౌద్ధ విద్యకు ప్రసిద్ధి. టిబెట్ విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకొనేవారు.
6. రత్నగిరి (CE 6– 12 శతాబ్దం): ఒడిశాలోని రత్నగిరి, ఒక బౌద్ధ విహారంతో కూడిన ప్రముఖ విద్యా కేంద్రం. దీనిని అశోకుడు స్థాపించి ఉండొచ్చని ఒక అభిప్రాయం కలదు, అయితే 6వ శతాబ్దం నుండి భౌమకర వంశం పాలకుల పోషణలో ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది.
7. ఓదంతపురి (CE 8–12వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న ఓదంతపురి ఒక ముఖ్యమైన బౌద్ధ మహావిహారం. ఇది బౌద్ధ విద్యకు ప్రముఖ కేంద్రంగా ఉండి, గరిష్ఠంగా 12,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. దీనిని పాల చక్రవర్తి గోపాల I, 8 వ శతాబ్దంలో స్థాపించాడు.
8. సోమపుర (CE 8 – 12 వ శతాబ్దం): ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న సోమపుర మహావిహారం ఒక పెద్ద బౌద్ధ విద్యా కేంద్రం, దీనిని పాల రాజు ధర్మపాలుడు 8వ శతాబ్దం చివరలో స్థాపించాడు.
9. నాగార్జునకొండ (CE 2– 6వ శతాబ్దం): ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాగార్జునకొండ, ఇక్ష్వాకు వంశం (2వ నుండి 4వ శతాబ్దం వరకు) కాలంలో ఒక ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రంగా ఉంది. బౌద్ధ తత్వవేత్త నాగార్జున పేరు మీద దీనిని నామకరణం చేశారు. ఇది మహాయాన బౌద్ధానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఆచార్యనాగార్జునుడు ఆధ్వరంలో నెలకొల్పిన బౌద్ధవిద్యాలయం 5 అంతస్థులతో 1500 గదులు కలిగి ఉన్నదని చైనా యాత్రికుడు ఫాహియాన్ (ఐదో శతాబ్దం) పేర్కొన్నాడు.
10. జగద్దాల: 11వ శతాబ్దంలో పాల వంశాధిపతులచే స్థాపించబడిన బౌద్ధ విద్యాలయం.
11. బిక్రమపురా: బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాచీన బౌద్ధ విద్యాలయం. సమాచారం తక్కువ. పాల వంశ పాలనలో అభివృద్ధి చెందింది.
12. వల్లభి (CE 6– 12 శతాబ్దం): గుజరాత్‌లోని వల్లభి, జైన అధ్యయనాలకు కీలక కేంద్రంగా ఉండేది. దీనిని మైత్రక వంశ రాజు భట్టారకుడు 6వ శతాబ్దంలో స్థాపించాడు.
ఇవి కాక ఆ ఫొటోలో ఉన్న మిగిలినవి అన్నీ హిందూ మతానికి చెందిన వేదాధ్యయన కేంద్రాలు. వీటిలో తర్కం, వేదాలు ఉపనిషత్తులు, సంస్కృతవ్యాకరణం, వేదాంతబోధన, జ్యోతిషం, ధర్మశాస్త్రాలు బోధించబడేవి. ఇవి బ్రాహ్మణులకొరకు, బ్రాహ్మణులచే నడపబడిన విద్యాకేంద్రాలు. వీటిలో శూద్రులకు కానీ అతి శూద్రులకు కానీ ప్రవేశం లేదు.
వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయం చుట్టుపక్కల ఉండే గురుకులాలు; కాశ్మీర్ లో శంకరాచార్యులు ప్రతిష్టించిన శారదాపీఠం; ఉజ్జయినిలో ఖగోళశాస్త్రాధ్యయన కేంద్రం; భోజుడు స్థాపించిన భోజ్ శాల; వేదాంత బోధన కొరకు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రింగేరి పీఠం; శైవ వైష్ణవ వేదాంత కేంద్రమైన కాంచిపురం; కేరళలోని సంస్కృత విద్యలు గరిపే త్రిస్సూర్; ద్వైత సిద్ధాంతాన్ని బోధించే ఉడిపి వైష్ణవ మఠం; తమిళనాడులోని వేద వాఙ్మయానికి కేంద్రమైన ఎన్నాయిరం.; హిందూ ధర్మశాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కేరళ లోని కంథల్లార్ శాల; రాష్ట్రకూటుల కాలంలో వేదాధ్యయనం కొరకు స్థాపించబడిన మన్యఖేత మొదలగునవి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో విస్తరించిన హిందూ విద్యాకేంద్రాలు ఇవి చాలామట్టుకు గురుకులాలు మిగిలినవి సన్యాసి మఠాలు.
***
.
II. ప్రాచీన భారతదేశ విద్యా వ్యవస్థ
ప్రాచీనభారతదేశంలో శ్రమణ సంస్కృతితో బౌద్ధ, జైనాలు ఒకవైపు బ్రాహ్మణమతం (హిందూ) మరోవైపు ప్రజల జీవనవిధానాన్ని శాసించాయి. ఈ రెండు మార్గాలు భిన్న తాత్వికపునాదులు కలిగినవి. వాటి విద్యావ్యవస్థలు కూడా భిన్నమైన లక్ష్యాలతో పనిచేసాయి.
1. బౌద్ధమతంలో విద్యావ్యవస్థ:
దీనిలో బుద్ధుని బోధనలు, అష్టాంగమార్గం, బౌద్ధ గ్రంథాలు, తర్క శాస్త్రం, వైద్యం, ఆయుర్వేదం, తత్త్వశాస్త్రం, నీతి, ఆచరణాత్మక జ్ఞానం, పాళి భాష, వ్యాకరణం వంటి అంశాలను విద్యార్ధులకు నేర్పేవారు.
నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకొని, నిర్ధిష్ట పాఠ్యాంశాలు, లక్షలాది పుస్తకాలు కలిగిన గ్రంథాలయాలతో బౌద్ధ విద్యాసంస్థలు అంతర్జాతీయ విద్యార్ధులను ఆకర్షించేవి. నలందాలో చైనా, టిబెట్, కొరియా, మంగోలియా దేశాలనుంచి విద్యార్ధులు వచ్చి విద్యను అభ్యసించేవారు. ఫాయియాన్, హ్యుయాన్ త్సాంగ్, ఇ-త్సింగ్ (Yijing) వంటి వారు ఎందరో అలా నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.
ఈ విశ్వవిద్యాలయాలు ప్రధానంగా బౌద్ధపాఠ్యాంశాలు బోధించినప్పటికీ, వైదిక, జైన మతాలకు చెందిన అంశాలను కూడా అందిస్తూ సెక్యులర్ గా వ్యవహరించేవి.
నలందాలో విద్య ఉచితంగా అందించబడేదని; విద్యార్ధుల ప్రతిభను బౌద్ధగురువులు క్షుణ్ణంగా పరీక్ష చేసి ప్రవేశం ఇచ్చేవారని; ఈ పరీక్షలో పదిమందిలో 8/9 మంది విఫలమయ్యేవారని హ్యుయాన్ త్సాంగ్ రాతలద్వారా అర్ధమౌతుంది. విశ్వవిద్యాలయాలను రాజులు పోషించేవారు.
బౌద్ధం చాతుర్వర్ణాలలోని హెచ్చుతగ్గులను తీవ్రంగా ఖండించింది. గంగ, యమున సరయు, మహి లాంటి నదులు సముద్రాన్ని చేరగానే తమ పేర్లను, అస్తిత్వాలను ఎలాగైతే కోల్పోతాయో అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన వారెవరైనప్పటికీ దమ్మాన్ని ఆచరించటం మొదలుపెట్టగానే వారి వారి వర్ణాలను కోల్పోతారు అని వినయపిటక లో బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు.
బౌద్ధ విద్యావ్యవస్థలో కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా ప్రజాస్వామిక పద్దతులలో అందరనూ చేర్చుకొనేవారు. విద్యార్ధులను బౌద్ధికంగా, నైతికంగా, శారీరికంగా ధృఢంగా, సంపూర్ణంగా అభివృద్ధి చెందేలా చేయటం బౌద్ధవిద్యయొక్క లక్ష్యంగా ఉండేది.
ఉపాలి (క్షురక), సునీత (చండాల), సోపాక (చండాల), శివాలి (శూద్ర) ఆనంద, మాతంగ (చండాల) లాంటి శూద్ర, అతి శూద్ర జాతులకు చెందిన పలువురు విద్యనభ్యసించి గొప్ప బౌద్ధ గురువులుగా పేరు తెచ్చుకొన్నారు.
బౌద్ధ విశ్వవిద్యాలయాలు భారీస్థాయిలో ఉండేవి. నలందాలో ఏకకాలంలో రెండువేలమంది గురువులు బోధించటానికి, పదివేలమంది విద్యార్ధులు చదువుకోవటానికి సరిపడా తరగతి గదులు, నివాసగదులు, వంటగదులు ఉండేవంటే అది ఎంత పెద్దదో అర్ధం చేసుకొనవచ్చును. లక్షలకొలది రాతప్రతులు కలిగిన గ్రంథాలయాలు ఉండేవి.
2. బ్రాహ్మణమతంలో విద్యావ్యవస్థ:
బ్రాహ్మణమతం విద్యను బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం చేసింది. వైశ్యులు, క్షత్రియులు కొన్ని మినహాయింపులతో కొంతమేరకు నేర్చుకొనవచ్చును కానీ వేదాధ్యయనం చేయటానికి బ్రాహ్మణులకు మాత్రమే అర్హత. శూద్రులు కనీసం వేదాలను వినరాదని, వింటే చెవిలో కరిగించిన సీసం పోయాలంటూ అతి క్రూరమైన ఆంక్షలను బ్రాహ్మణులు స్మృతులరూపంలో రాసుకొన్నారు. శూద్రులు విద్యను నేర్చుకోకూడదని ఆంక్షలు విధించారు. అతిశూద్రులైతే స్మృతులప్రకారం అసలు మనుషులేకారు. ఏకలవ్యుడు, శంబుకుని కథలు ఆనాటి సమాజంలో శూద్రులు విద్యనేర్చుకొంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుపుతాయి.
వేదాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, తత్త్వశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ధర్మశాస్త్రాలు మొదలగునవి హిందూ విద్యాసంస్థలలో పాఠ్యాంశాలుగా ఉండేవి.
గురుకులాలు (ఒక బ్రాహ్మణ గురువు నేతృత్వంలో నడపబడే పాఠశాల), మఠాలలో (సన్యాస కేంద్రాలు) హిందూ వేదాంత విద్య నేర్పబడేది. బట్టీవేయడం ద్వారా వేదాలను అధ్యయనం చేసేవారు. హిందూ విద్య బౌద్ధవిద్య వలే కేంద్రీకృతమై ఉండేది కాదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఒక గురువు గురుదక్షిణ తీసుకొని విద్యను అందించే చిన్నచిన్న పాఠశాలలు. ఇవి బౌద్ధ విశ్వవిద్యాలయాలయాల వలే వ్యవస్థీకృతంగా విశాలమైనవి కావు.
హిందూ విద్యాకేంద్రాలు బ్రాహ్మణులచే బ్రాహ్మణులకొరకు ఏర్పాటుచేసుకొని, విద్య అనేది సమాజంలో బ్రాహ్మణ వర్గానికి మాత్రమే పరిమితంచేసి, శూద్రవర్గానికి విద్యను దూరం చేసిన ఒక దుర్మార్గ వ్యవస్థ.
III. ముగింపు
ప్రాచీన భారతదేశంలోని బౌద్ధ విశ్వవిద్యాలయాలు సామాజిక సమానత్వం, జ్ఞాన ప్రసరణ ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులను కలిపే కేంద్రాలుగా నిలిచాయి. కాగా బ్రాహ్మణ విద్యావ్యవస్థ కుల ఆధారిత ఆంక్షలతో సామాజిక విభజనను మరింత బలపరిచింది. ఈ రెండు వ్యవస్థల చారిత్రక భిన్నత్వాన్ని గుర్తించాలి. చరిత్రను నిజాయితీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బౌద్ధ విశ్వవిద్యాలయాలు సర్వసమాజ సమైక్యతకు చిహ్నాలుగా నిలిచి అందరూ సమానమేనని నిరూపించగా హిందూ గురుకులాలు ప్రత్యేక వర్గ ప్రయోజనాలను కాపాడాయి.
ఎనిమిదవ శతాబ్దంలో ఉద్యోతన సూరి అనే జైనాచార్యుడు రాసిన కువలయమాల అనే గ్రంథంలో వేదాధ్యయనం చేస్తున్న కొద్దిమంది విద్యార్ధులను ఎద్దేవా చేస్తూ…......"వీరు వేదాలను భట్టీయం వేస్తున్నారు; బలమైన కండలు తిరిగిన దేహంతో నిత్యం వ్యాయామం చేస్తూ లెక్కలేనితనంతో హింసాత్మక ధోరణితో జీవిస్తున్నారు; వీళ్ళంతా నైతికవిలువలు లేని మూర్ఖుల సమూహం" అని అన్నాడు ----- హిందూమతం ఇంకా పూర్తిగా స్థిరీకరింపబడని కాలంలో వేదాలను అధ్యయనం చేస్తున్న హిందు విద్యార్ధుల పట్ల జైనుడైన ఉద్యోదనసూరి చేసిన ఈ వ్యాఖ్యలు చారిత్రికంగా విలువైనవి. (రి. Kuvalayamala, Part II, A.N. Upadhye, Pn. 124)
బ్రాహ్మణులకు తప్ప సమాజంలో ఎవరికీ ఉపయోగపడని హిందూ విద్యాకేంద్రాలను, కుల లింగ బేధాలకు అతీతంగా ప్రపంచంలోని అందరికీ సమానంగా విద్యను అందించిన బౌద్ధ విశ్వవిద్యాలయాలతో కలిపి చెబుతూ సనాతనవాదులు గొప్పలు పోవటం, ఎవరికో పుట్టిన బిడ్డను సొంతబిడ్డగా చెప్పుకోవటంలాంటిది. చరిత్రను వక్రీకరించటమే.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment