Thursday, April 10, 2025

ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?



ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?

సుమారు 9.4 లక్షల ఎకరాలతో వక్ఫ్ భూములు, ఆర్మీ (18 లక్షల ఎకరాలు) రైల్వేల (12 లక్షల ఎకరాలు) తరువాత దేశంలో మూడవ అతిపెద్ద మొత్తానికి చెందిన ఆస్తిగా నిలిచింది.

ఈ 9.4 లక్షల ఎకరాల వక్ఫ్ భూములలో సుమారు 2 లక్షల ఎకరాలలో స్మశానాలు, 1 లక్ష ఎకరాలలో మసీదు, దర్గాలు, యాభైవేల ఎకరాలలో స్కూళ్ళు, 5.9 లక్షల ఎకరాలు వ్యవసాయ సంబంధ, ఇతర భూములు గాను ఉన్నాయి.

ఈ భూములలో సుమారు 18 వేల మదరాస స్కూల్స్, 350 వరకూ కాలేజీలు, 100 వరకూ హాస్పటల్స్ నడుస్తున్నాయి.

ఇతరమతాలు కలిగి ఉన్న భూముల వివరాలు ఇలా ఉన్నాయి.

వక్ఫ్ భూములు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఆధీనంలో ఉంటాయి కనుక వాటి లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. హిందూమతానికి చెందిన ఆలయభూములు అలాకాక వివిధ రాష్ట్రాల ఆధీనంలో ఉంటాయి. కనుక ఆయా రాష్ట్రాల లెక్కల ఆధారంగా దేశంలో హిందు ఆలయాలకు చెందిన భూములు సుమారు 15 నుండి 20 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇదే నిజమైతే దేశంలోనే అథ్యధికంగా భూములు కలిగి ఉండటంలో హిందూమతం మొదటి స్థానంలో ఉంటుంది.

తమిళనాడులో 4.78 లక్షల ఎకరాల ఆలయ భూములు కలవు. ఆంధ్ర ప్రదేష్ లో 4 లక్షల ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాలు, కర్ణాటకలో 15 వేల ఎకరాలు, ఒడిసాలో 12 వేల ఎకరాలు, బీహార్ లో 22 ఎకరాల భూములు కలిగి ఉన్నాయి. పెద్దరాష్ట్రాలైన ఉత్తర ప్రదేష్, రాజస్తాన్, మహరాష్ట్రాలలో దేవాలయ భూములు ఏ మేరకు ఉన్నాయో అధికారిక గణాంకాలు లేవు. దేశవ్యాప్తంగా మొత్తంమీద 15 నుండి 20 లక్షల ఎకరాల హిందూ ఆలయభూములు ఉన్నాయని భావించవచ్చు.

హిందూ ఆలయభూములలో 13 వేల స్కూల్స్, 800 వరకూ కాలేజీలు, 300 వరకూ హాస్పటల్స్ నడపబడుతున్నాయి.

క్రిస్టియన్ మతానికి చెందిన భూములు దేశంలో సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇది ప్రధానంగా వ్యవసాయేతర భూమి. దేశంలో భారతప్రభుత్వం తరువాత అత్యధిక వ్యవసాయేతర భూమి కలిగిన వ్యవస్థగా చర్చ్ ని చెబుతారు.

చర్చ్ కి చెందిన భూములలో చర్చ్ లు, సెమెటరీలు కాక 14 వేల స్కూళ్ళు, 300 కాలేజీలు, 2500 హాస్పటల్స్ ఉన్నాయి.
ఇదే విధంగా బౌద్ధులకు 50,000 ఎకరాల వరకు భూములు, సిక్కుల వద్ద 2 లక్షల ఎకరాల వరకూ భూములు ఉన్నాయి.

ఇక వ్యక్తులవద్ద చూసినట్లయితే ఆదాని గ్రూప్ కు 16 వేల ఎకరాలు, DLF వద్ద 15 వేల ఎకరాలు, రిలయన్స్ వద్ద 9 వేల ఎకరాల భూములు ఉన్నాయి.

***

కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. కేంద్ర వక్ఫ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

ఇక వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ కమిటీలో తప్పనిసరిగా హిందువులు కూడా ఉండాలని ఇటీవల పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం రాజకీయ ప్రేరేపిత చర్య కావచ్చు. దేశంలో మరే ఇతర మతసంస్థల ఆస్థులకు సంబంధించిన కమిటీలలో అన్యమతానికి చెందిన సభ్యులు ఉండరు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాధికారులైన కలక్టరు కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఆ ఆలయ కమిటీకి ఎక్స్ అఫిషియో మెంబరుగా ఉన్నప్పుడు- ఒకవేళ ఆ అధికారులు వేరే మతానికి చెందినవారైనప్పటికీ కమిటీలో ఉంటారు తప్ప కావాలని “కొందరు సభ్యులు తప్పని సరిగా వేరేమతానికి చెందిన వారై ఉండాలి” అనే క్లాజ్ తో ఏ ఆలయ బోర్డు కానీ ఎండో మెంటు కమిటీ కానీ ఏర్పడదు. ఉదాహరణ టిటిడి బోర్డులో అందరూ హిందువులే మెంబర్లుగా ఉంటారు. ఇతరులకు స్థానం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఒక్క క్లాజుతోనే వక్ఫ్ బోర్డ్ సవరణలు వివాదాస్పదం అవుతున్నాయి.

బొల్లోజు బాబా

(పై గణాంకాలు ఎఐ ద్వారా సేకరించినవి. సరైన ఆధారాలతో విభేదించవచ్చు)

1 comment:

  1. You are not going to win this argument. If you compare this land based on the population of these religions in India.

    ReplyDelete