Thursday, March 10, 2022

అభినందనలు

 అభినందనలు

తమ్ముడా.....అని ఆశీర్వదించే అన్నగారి వాత్సల్యానికి సదా వినమ్రచిత్తుడను.....
ధన్యవాదములు సర్... మీ ప్రేమపూర్వ ఆశీస్సులకు... ఈ నాలుగువాక్యాలు చాలా విలువైనవి,
మా నాన్నగారి ప్రస్తావనను గుండెల్లో దాచుకొంటాను...
Madhunapantula Satyanarayanamurthy గారికి ధన్యవాదములతో
బొల్లోజు బాబా
****
పద్యం.
తెలుగున వేళ యేండ్లుగ గతించిన గాథలపెంపు కొండ గు
ర్తుల పెనుగుంపు గాని 'యిది రూఢిగ నిట్టిది"నాగ దెల్ప నె
వ్వలన నసాధ్య, మైన నొకపాటి చరిత్రము నేడు నేర్పుదీ
ర్పుల బరిశీలకుల్ తడవి ప్రోవులు వెట్టిరి పుణ్య బుద్ధులై.
తెలుగు నేలలో వేల సంవత్సరాల కథల అభివృద్ధి సాధారణ మైన గుర్తులు యొక్క పెద్ద గుంపు మాత్రమే. ఇది ఇటువంటిది. దీనిపుట్టుక ఇది అని చెప్పడానికి వీలు కానిది. ఐనా ఒకపాటి చరిత్రను పరిశీలించారు కొందరు పుణ్య బుద్ధులు.
ఇది ఆంధ్రపురాణం అవతారిక లో సత్యనారాయణ శాస్త్రి గారి అభిప్రాయ ప్రకటన.
కొందరు పుణ్య బుద్ధులై న వారివల్ల చరిత్ర నమోదై భవిష్యత్తరాలకి అందుతోంది.
చరిత్ర రచన మామూలు సంగతి కాదు. అధ్యయనం చేయాలి. ఆకళింపు చేసుకోవాలి. వ్యక్తిగతమైన ప్రేమలూ పక్షపాతాలూ పక్కన బెట్టాలి.
ఇంతా చేసాక తారీఖు లు, దస్తావేజులు, శాసనాలూ, కైఫియతులూ గా రచన చేస్తే చప్పగా వుండి చదివేవాడు చప్పున పక్కన పెట్టేస్తాడు.
ఇదంతా ఎందుకంటే బాబా అనగా బొల్లోజు బాబా ఇటీవలే ప్రచురించిన ప్రాచీన పట్టణాలు (తూర్పుగోదావరి జిల్లా) గ్రంథం.
అతడు ఎప్పటిలాగే తనరచన ప్రేమతో ఇచ్చారు.
ఆసక్తి కరమైన శైలి బాబాది. ఇలాంటి రచన చదవాలంటే శైలి ముఖ్యం. కవిత్వ భాష తెలిసిన బాబాకి శైలెందుకు తెలియదు.?
నేను పుట్టిన ఊరు పిఠాపురం. మాతామహస్థానం.
ఎప్పటి నుంచో దీని చరిత్ర, నేపథ్యం లాంటి వి తెలుసుకోవాలనే ఆసక్తి. చిన్నప్పుడు మేనమామ లతో సన్యాసిరాళ్ల సంగతులు. కుంతీమాధవ, కుక్కుటేశ్వరుల సంగతులు గుర్తొచ్చింది. ఎంత పౌరాతన్యమేచికొనెనో తెలియచెప్పిన బాబా కి థాంక్స్.
శాతవాహన, మాధరులు పరిపాలన చేసిన సంగతి తెలియని తెలియదు. నాకు పిఠాపురం చరిత్రంటే గంగాధర రామారావు గారి పిఠాపురం చరిత్రే. అదికూడా కవిజన పోషకుడు ఆంధ్రభోజుడు సూర్యారావు బహద్దూర్ గారి నుండే తెలుసు వీరి ఆస్థానకవి ఓలేటి వేంకట రామశాస్త్రి గారు
రాజా వారి సంగతులు మా ముత్తాత గారి సంగతులు ఆనాటి సాహిత్య వైభవం పెద్దల వల్ల వినడమే.
బాబా నిజానికి సైన్స్ రంగానికి చెందిన వాడు. ఆతని ప్రాధాన్యత, పరిశీలన చరిత్ర కి సంబంధించినది.
బాబా తండ్రి గారు బసవ లింగం గారు మంచి కవి, రచయిత, ఫ్రెంచి పండితుడు. నాకు ఆత్మీయ మిత్రుడు. ఆయన దగ్గర ఫ్రైంచ్ నేర్వాలని వుండేది.
రాజీ ధోరణి కాకుండా దీక్ష తో పట్టుదలతో పుణ్య బుద్ధితో
రచించారు.
అభినందనలు
తమ్ముడా.
Madhunapantula Satyanarayanamurthy



Tuesday, March 8, 2022

The Orange - Wendy Cope

 The Orange - Wendy Cope

.
అల్పాహార సమయంలో
ఒక పెద్ద కమలాపండు కొన్నాను
దాని సైజు చూసి అందరూ నవ్వారు
తొక్క వలిచి రాబర్ట్ కి, దేవ్ కి పంచి
నేను తిన్నాను
వారికి చెరో పావు, నాకు సగం
చిన్నచిన్న విషయాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి
ఆ కమలాపండు ఇచ్చినట్లు.
సాయింత్రమయ్యాకా కొద్దిగా షాపింగ్ చేసాను
పార్క్ లో కాసేపు నడిచాను
ఇదే శాంతి, ఇదే సంతృప్తి.
ఆ రోజంతా నిమ్మళంగా నడిచింది
నేను చేయాల్సిన పనులన్నీ ఆస్వాదిస్తూ పూర్తిచేసాను
ఇంకా కొద్దిసమయం మిగిలింది
జీవించి ఉన్నందుకు సంతోషం
నీ ప్రేమకు ధన్యురాలను
.
Source: The Orange by Wendy Cope
అనువాదం: బొల్లోజు బాబా

పెన్నా సాహిత్య పురస్కారం 2020

 పెన్నారచయితల సంఘం వారు ప్రతి ఏటా ఇచ్చే పెన్నా సాహిత్య పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను నేను రచించిన "మూడో కన్నీటి చుక్క" కవిత్వ సంపుటానికి ప్రకటించారు. ఈ అరుదైన గౌరవానికి పాత్రుణ్ణి చేసిన పెన్నారచయితల సంఘం వారికి కృతజ్ఞతలు.

18 డిసెంబరున ఏర్పాటు చేసిన వారిసభకు నెలకొని ఉండిన పరిస్థితుల కారణంగా ప్రయాణాలు చేసే ధైర్యం సరిపోక వెళ్ళలేకపోయాను. వారికి క్షమాపణలు చెప్పుకొన్నాను.
నెల్లూరు, పెన్నారచయితల సంఘంవారు నా కొరకు తయారుచేసిన మెమెంటో, అభినందనపత్రం, శాలువాలను ఈరోజు కాకినాడ వచ్చిన డా.సుంకర గోపాల్ ద్వారా అందచేసారు.
సభకు వెళ్లకుండా వాటిని తీసుకోవటానికి సిగ్గుగా అనిపించినా, వారి అభిమానానికి, ప్రేమకు నేను పాత్రుడిని కావటం చాలా సంతోషంగా అనిపించింది.
శ్రీ మోపూరు పెంచల నరసింహం, శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు, శ్రీమతి తోట సులోచన, శ్రీ సుంకర గోపాల్ మరియు కార్యవర్గం అందరకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
సన్మానపత్ర రచన చేసిన శ్రీ నల్లు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.
ఇప్పుడిప్పుడే ప్రపంచం కలుగులోంచి బయటపడి సమూహాల్లోకి తెరుచుకొంటోంది... వీరందరినీ భౌతికంగా కలిసే అవకాశం భవిష్యత్తులో కలుగుతుందంది ఆశిస్తున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా




Saturday, March 5, 2022

‘కవిత్వ భాష’లో విహారయాత్ర (Book Review)

thank you Lenin Babu gaaru

మీ క్లోజ్ రీడింగ్ కు థాంక్యూ అన్నమాట చాలా చిన్నది. మీ పఠనాశక్తి గొప్పది. ఈ నాలుగు ప్రశంసాపూర్వక వాక్యాలకు ధన్యుడను
ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba


భవదీయుడు
బొల్లోజు బాబా


.
‘కవిత్వ భాష’లో విహారయాత్ర

“చాలా కాలం తరువాత ఒక పుస్తకంలోకి దూకి ప్రతీ పదాన్నీ కౌగిలించుకుంటున్నాను…ఒడ్డుకు చేరాక ఇంకోసారి మిమ్మల్ని పలకరిస్తాను ” అని శ్రీ బొల్లోజు బాబా గారికి facebookలో కామెంట్ పెట్టాను…దానికి పూర్వరంగం ఏమిటంటే, “కవిత్వ లక్షణాలు ఏమిటి?…కవితాత్మక గద్యానికీ, కవిత్వానికీ తేడా ఏమిటి?…ఈ రెంటినీ గుర్తించటం ఎలా?…” అని నేను facebookలో అడిగిన ఒక ప్రశ్నకి వారు ఈ పుస్తకం పంపి, అందులో ఫలానా చోట మీ ప్రశ్నకి సమాదానం లభిస్తుంది అని చెప్పటం…నేను పుస్తకంలో వారు చెప్పిన భాగం చదివి తక్షణ స్పందనగా పై కామెంట్ పెట్టాను… పుస్తకం చదివాక,వారికి కృతజ్ఞతగా ఈ పోస్టు రాయకుండా ఉండలేకపోయాను…

సామాజిక మాధ్యమాలలో ఒకరి వీపు ఒకరు చరుచుకుంటూ ఉండే కవికూటములలోని కవుల లక్షణం బొల్లోజు బాబాగారికి  లేదు అని అనిపిస్తోంది …పొగడ్తలు ఆశించే చోట ప్రశ్నలు ఎదురైతే,చూసీ చూడనట్టు తప్పుకుపోవటమో, ప్రశ్న వేసిన వారిని ‘మీ తలం వేరు, మా తలం వేరు’ అని జవాబు ఇచ్చినట్లే ఇచ్చి,అసలు ప్రశ్నకి జవాబు దాటవేసి తమ భద్రజీవితపు బావులలోకి మునిగి పోవటమో వీరు చెయ్యలేదు …ఒక పాఠకుడికి మేలు చేసే సంకల్పాన్ని చూపించారు… సులక్షణాలు లేకుంటే, అభినందిస్తూ నెత్తిన ప్రేమతో నిమిరినా, మొట్టికాయలూ వెయ్యటానికి  మొహమాటపడని శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు గారిని ఈ పుస్తకంలోకి పెద్దపీట వేసి ఆహ్వానించి ఉండేవారు కాదు …ఆ నిజాయితీతో కూడిన  ఒద్దిక నాచేత వీరికీ, వారికీ  నమస్కారం చేయించింది…వారి మధ్య అవ్యక్త గురుశిష్య భావనా వీచికలు నా  హృదయానికి వెచ్చదనపు హాయినిచ్చాయి…’కవిత్వ భాష’లో నా విహార యాత్రకి ఆత్మీయంగా పొద్దు పొడిచింది…

బాలుడినైన నన్ను చెయ్యి పట్టి నడిపించే కవిత్వ గైడ్ లాగా అనిపించారు శ్రీ బొల్లోజు బాబా…

ఒక గదిలో కొండేపూడి నిర్మలగారు ‘మేకులు వంగాయి’ అంటుంటే, ‘మేకులే వంగితే, మానవ హృదయం ఎంత?’ అని గుసగుసలాడారు నా విభ్రమం సంబ్రమంగా మారేటట్టు…

ఇంకాస్త ముందుకు నడిపించి కరెన్సీ నోటులో కత్తిని చూస్తున్న అలిశెట్టి ప్రభాకర్ గారి చూపులో నా చూపుని సంలీనం చేయించారు…

అడవిలో చెట్టు దుంగల్లో తల లేని మొండాలను చూపించే అరణ్యకృష్ణ గారి ఆవేదనా ప్రకంపనలకు నా  హృదయాన్ని శృతి చేశారు…

ఒక చోట పాటిబండ్ల రజని గారు మనస్సు ఇంకిపోయే మందుకై తపించడాన్ని చూపించారు…

ఎండ్లూరి సుధాకర్ గారు తమ గుప్పిట్లో దాచుకున్న బొటనవేలిలో, దాచేస్తే దాగని  వివక్షాచరిత చీకటిలా విస్ఫోటించడాన్ని విప్పార్చిన నా కళ్ళకు సాక్షాత్కరింపచేశారు …

కొందరు పుట్టుకతోనే కొన్ని పుట్టుమచ్చల అమానవీయ బరువును మొయ్యవలసిన పరిస్థితిని చూపించే ఖాదర్ మోహిద్దీన్ గారిని పరిచయం చేశారు…ఇంకొన్ని అడుగులు వేశాక, ఇస్మాయిల్ గారు ఎండా, నీడలతో చిత్రించిన ఆకుని పరిశీలించమన్నారు…

అంతలో,తనంటే ఇష్టపడే పాపని ఎత్తుకున్న వానై వచ్చిన తెలుగు వెంకటేష్ గారిలో తడిచేలా చేశారు…

ఆ తరువాత మండే గుండెతో ఉన్న కలేకూరి ప్రసాద్ గారి ఎగిరే ధిక్కార పతాకంలా ఉన్న కవిత్వాన్ని తలవంచి చదవమన్నారు…

కాస్త ముందుకు కదిలి, అత్యాచార బాధితురాలికి ధైర్యాన్ని కలిగిస్తూ కవన ఖడ్గం అందించే కె.క్యూబ్ వర్మ గారిని చూపిస్తూనే, నగలు పెట్టుకుని నడిచే గాయాలని చూపించే కొండేపూడి నిర్మల గారినీ వినమన్నారు…

జయప్రభ గారు, జూపాక సుభద్ర గారు పైట/కొంగు ని చూసిన విధానాన్ని తరిచి చూపిస్తూ, శవపేటికలను తుపాకులతో కొలిచి తాలిబన్లపై కాల్పులు జరిపిన అనంతు గారినీ  చూపించారు…

చూపుడు వేలినుండి వెలిగించే ఖడ్గాలను మొలిపించిన సరికొండ నరసింహ రాజు గారిని, పిల్లలను నీలిగోళ్ళ దగ్గరితనం గురించి హెచ్చరించే నిరంతర గారిని, గతాన్ని చదివించే కొప్పర్తిగారినీ,తరాల పాటు స్థిరంగా ఉన్న  కుడి ఎడమలని తిరగేస్తున్న శివసాగర్ గారినీ చూపించారు…

కొంచెం ముందుకు నడిచి చీకటి చరిత్ర మీద చెరగని వెలుగు పాదముద్రలతో నడుస్తూ మినుములు మొలిపిస్తున్న  శిఖామణి గారినీ,కూలీలు వేసుకున్న స్వేదబిందువుల దండలను చూపించే గుంటూరు శేషేంద్రశర్మ గారినీ చూశాను…

ఆ పక్కనే,రాత్రి వేళ మిణుగురుల సంగీతాన్ని వాయించే సూర్యుడిని చూపించే డాక్టర్ ఎన్.గోపి గారు, ప్రతీ మనిషీ ఊరికొయ్యే అని ఉచ్చ స్వరంలో అరుస్తున్న భగ్వాన్ గారు, పిడికిలి బిగించి, “నాక్కొంచెం నమ్మకమివ్వు” అంటున్న ఆలూరి భైరాగి గారూ  కనపడ్డారు…

అక్కడినుండి సముద్ర తీరానికి వస్తే , “ఈ సముద్రపు నీరు ఇంత ఉప్పగా ఉందేమిటి?ఈ జలసానువుల మీద తెల్లగుడ్డ కప్పింది ఎవరు?”అని నిలదీస్తూ సిరికి స్వామినాయుడు గారు కనిపించారు…

అటుచూస్తే, దేవుని కన్నీళ్లను తుడుస్తున్న తిలక్ గారు… ఇటు చూస్తే, పాపుల్ని కరుణించేవరకూ నువ్వు నిదురించవు కదా అని ప్రపంచీకరణపై వక్రోక్తులు విసురుతూ అద్దేపల్లి ప్రభు గారు కనిపించారు…

సముద్రాన్నే,ఆస్తి అనుకున్న ఏమీలేని అమాయకపు అమ్మని చూపిస్తూ ఎం.వెంకట్ గారు,కాగితాలపై పెరిగే అభయారణ్యాల గుట్టుని పట్టిస్తూ యశస్వి సతీష్ గారు, పొలాలకు తాళాలు వేస్తూ దర్భశయనం శ్రీనివాసాచార్య గారు సంచలిస్తున్నారు…

అంతేనా,స్వీట్ డిస్టర్బెన్స్ మధ్య పాఠాలు చెబుతూ గోదావరి శర్మ గారు, కనుకొనుకులలో నిప్పుకణికలతో ఎదురుచూస్తూ నారాయణస్వామి గారు, ఏమీ లేకపోవటాన్ని కాపలా కాస్తున్న హెచ్చార్కే గారు, వానలకు తడిసిన కొన్ని ఎండలను చూపిస్తూ త్రిపురనేని శ్రీనివాస్ గారు మనస్సులో అలజడి రేపుతూ కనిపించారు…

వీటన్నిటి మధ్యలో నా చేతులు తన చేతుల నుండి విడివడిన క్షణాలూ,జతపడిన క్షణాలూ ఉన్నాయి… ఇమేజరీ,సినక్డకి,అల్లిగొరి మొదలైన తూకపు రాళ్ళు నా హృదయంలో పెడుతూ భుజం తడుతూ శ్రీ బొల్లోజు బాబా నన్ను ముందుకు నడిపించారు…

 భూగోళానికి అటూ ఇటూ ఉన్న కవులు చేసిన కృషినీ, పూర్వపు సిద్ధాంత  తరకలను రుచి చూపించారు…వాటి నడుమ సామ్యాల, వైవిధ్యాల  అధ్యయన సారాలను చవి చూపించారు…పాత పనిముట్లను,కవిత్వ తూకపు రాళ్ళను  ఆధునీకరించుకోవలసిన ఆవశ్యకతను చెప్పడం నాకు వ్యక్తిగతంగా నచ్చింది…

ఆ పక్కనే, ఆత్మకు లంగరు వేస్తూ కలవరిస్తున్నాడేమో అని అనుమానం కలిగిస్తూ వేగుంట మోహన ప్రసాద్ గారు…ఆయనను చూస్తూ తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమించేస్తాం అని సాలోచనగా అంటూ, చేరా గారు కనిపించారు…

కొంచెం ముందుకు నడిపించి, పదాలతో కవితా ప్రహేళికలు సృష్టిస్తున్న  ఎమ్మెస్ నాయుడు మరియు బి.ఎస్.ఎం కుమార్ గార్లను చూపించారు …వారిని ఓరకంట చూస్తూ ”కవిత రాయటం పూర్తయ్యింది…ఇక అర్థం చేసుకోవటమే మిగిలుంది” అంటూ తమ్మినేని యదుకుల భూషణ్ గారు అంటున్న మాటలనూ వినమని సైగ చేశారు…

కాస్త దూరంలో “దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం” అంటూ కాళోజీ గారు కన్నెర్ర చేస్తూ కనిపించారు…అటుపక్కనే, ఆ నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని భావన గారి బాధని మన భాషలోకి తర్జుమా చేసి వివరించే వాడ్రేవు చినవీరభద్రుడు గారు…కవిత్వం చదవటం ఒక performing art అని చెబుతూ శివారెడ్డి గారు గంభీరంగా కవితాలీనులై ఉండటం చూపించారు…అలంకార రహితులై  నిరాడంబరంగా వెలగటం చూపించారు…

“నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరిపోతే ” అంటున్న శ్రీ శ్రీ గారు, “పంజరంలో ఇమడలేని విశ్వనరుడను నేను ” అంటూ జాషువా గారు, ‘ప్రపంచమే ఒకటి ’  అంటూ దాశరధి గారు, ఎంకిని ముద్దు చేస్తూ నండూరి గారు,’బండరాళ్ళ పై మొక్కలు ఎదగవంటూ ’ భైరాగి గారూ కనిపించారు…

అంతేనా, ఇంకా ఎందరో కనిపించారు…ఎన్ని వెలిగే హృదయాలో!…ఎన్ని నివురుగప్పిన మాణిక్యాలో!… కవిత్వాన్ని పలు విధాలుగా వాడిన ఎన్ని మచ్చుతునకలో!…ఇవి కాక,కాలంతో పాటు కవిత్వంలో వచ్చిన మార్పులు, తారీఖులు దస్తావేజుల జోలికి పోకుండా వివరించారు…

చాలా కొత్త పదాలు పరిచయమయ్యాయి…పాఠకుల ఆస్వాదనా శక్తిని పెంచే పుస్తకమిది…చిన్నప్పుడు మిత్రులతో ఆటలలో పడితే ఆకలి తెలిసేది కాదు…పెద్దయ్యాక, క్లాసులో పాఠం చెప్పటానికి నోట్సు తయారు చేసుకోవటానికి మంచి ముడి సరుకు దొరికితే ఆకలి అయ్యేది కాదు…అలా,చదవటం మొదలయ్యాక  ఆకలిని దూరం చేసి, మరొక ఆకలిని తీర్చిన పుస్తకం ఇది…

పత్రికలలో ప్రచురితమయ్యే, చాలా కవితలను చూసి, ఇదేమి కవిత్వం? గద్యాన్ని శకలాలుగా చేసి కవిత్వంగా చలామణి చేస్తున్నారు…అని చిరాకు పడే నేను ఇప్పుడు కాస్త educated పాఠకుడిని అయ్యానని అనిపిస్తుంది…ఇందుకు కారకులు శ్రీ బొల్లోజు బాబాగారు…ఇటువంటి వ్యాసాలు వ్రాయాలంటే,ఎంతటి అధ్యయనం,జ్వలన కావాలో కొంత ఊహించగలను…వారికి చాలా కృతజ్ఞతలు…నా ప్రశ్నకి సమాధానాన్ని మించి చాలా ఇచ్చిన పుస్తకం ‘కవిత్వ భాష’…నాబోటి వారు చదవవలసిన పుస్తకం…

***లెనిన్ బాబు***




Friday, March 4, 2022

జీవితమనే దుఃఖ సందర్భానికి పది వెర్షన్స్ రాసిచ్చిన కవిగారు


.
1.
జీవితం
చెట్టుకొమ్మల్లో చిక్కుకొన్న
సాయింత్రపు గాలిపటం
2.
వాన చినుకుల్లో తడిచే
నల్లగేదెపై తెల్లకొంగ
3
మృత్యులోయకు నలగని దారిపై
భుజం తొక్కే ప్రయాణం
4.
బొగ్గులపై మాంసం ముక్కల్ని
పైకి క్రిందకీ కదపటం
5.
కబోది అంధకారంలోకి
కూలిపోయే వందల నల్లని కాకులు
6.
డ్రింకు సీసాలో చిక్కుకొన్న
మిణుగురుల దుఃఖ కాంతి
7.
కాలివేలు నోటిలో పెట్టుకొని
వటపత్రంపై శయనించే ఎలక్షన్లు
8.
శిథిలాలయంలో దుండగులు
చెక్కేసిన శాసన వాక్యాలు
9.
శవపేటికలో ఊపిరాడని
ఉక్కపోత
10.
జీవితం
తొలగించినా మరలా మరలా
పుట్టుకొచ్చే కాన్సర్ కణితి
.
బొల్లోజు బాబా

Tuesday, March 1, 2022

ఎవరికీ పట్టని విషాదం .


ఈ సంవత్సరం
ఒక్క వలసపక్షీ రాలేదని
స్థానిక పత్రికలో
ఒక మూల చిన్న వార్త.
రేపు
గూడకొంగల రెక్కలనీడలో
విచ్చుకొనే వసంతం కూడా రాదని
సారసపక్షుల దేహకాంతులను
ధరించే శరత్తు కూడా కనిపించదని
ఉల్లంకి పిట్టలు విడిచివెళ్ళే
పసిడి వెలుగుల
హేమంతం కూడా కరుణించబోదని
ఎవ్వరూ
మాట్లాడుకోవటం లేదు
ఆశ్చర్యంగా
బొల్లోజు బాబా

అతని కవిత్వమొక అనుభూతి

 ప్రముఖ కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ తాజా కవిత్వ సంకలనం "నేనొక అనుభూతి" ఆవిష్కరణ నిన్న కాకినాడ సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సభతాలూకు ప్రెస్ కవరేజ్...

ఆ సందర్భంగా నేను చేసిన ప్రసంగంలోంచి కొన్ని వాక్యాలు ఇవి.
.
అతని కవిత్వమొక అనుభూతి
.
ఎమ్మెస్ కవిత్వం ఎన్నడూ వాచ్యంగా ఉండదు. ఎమ్మెస్ ఏనాడూ ఎంగిలి ప్రయోగాలు చేయలేదు, డెడ్ మెటఫర్స్ వాడలేదు. ఏం చెప్పినా నవ్యంగానే చెప్పాడు, సొంతస్వరంలోనే రాసాడు. కవిత్వం అనేది ధ్వన్యాత్మకంగా, ప్రతీకాత్మకంగా మాత్రమే చెప్పాలని కంకణం కట్టుకొని మూడు దశాబ్దాలుగా కవిత్వాన్ని వెలువరిస్తున్నాడు. ఇతనిది జీవనానుభవాల కవిత్వం. కవిగా ఎమ్మెస్ నిజాయితీపరుడు. తాను చూచినది, తాను అనుభవించినది మాత్రమే కవిత్వంలోకి తీసుకొని వచ్చాడు. తన అనుభవానికి వెలుపల ఉన్నదానిని ఏనాడూ స్పృశించలేదు.
.
జీవితం
కిటికీపై
వాలిన పిట్ట
ఎగిరిపోయేలోగా
మిగిలిపోయే
నేనొక అనుభూతి…
.
రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ఒక ఆకారాన్ని ఇస్తే అది రాముడు అని అర్ధం. అదే రీతిగా, అనుభూతికి ఒక ఆకారాన్ని ఇస్తే ఎమ్మెస్ కవిత్వం అని అర్ధం చెప్పుకోవచ్చు. అందుకనే జీవితం కిటికీ పై వాలిన పిట్ట ఎగిరిపోయేలోపు నేనొక అనుభూతిగా మిగిలిపోతాను అని ప్రకటించుకొన్నాడు- మనకున్న గొప్ప కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ.
.
బొల్లోజు బాబా







ప్రాచీనపట్టణాలు

thank you అంకిత గారు for this wonderful writeup on my book.
thanks alot for the editor.

లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655



















ఒఖడినే....


నా యవ్వనంలో
నన్ను ఉద్రేకపరచి
నేలపై నిలబడనివ్వకుండాచేసిన
కవులందరూ
ఏనాడో చచ్చిపోయారు
ఒకరు ఏదో ఆశ్రమంలో
మరొకరు
తళుకుబెళుకుల సినీగీతాల్లో
ఇంకొకరు మరీ పిచ్చెక్కి
నేనొక్కడినే ఇక్కడ
ఒంటరిగా మిగిలిపోయాను
బొల్లోజు బాబా

కవులను ప్రభావితం చేసే "చిలక్కొయ్య"

 కవులను ప్రభావితం చేసే "చిలక్కొయ్య"

.
“మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి.
అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు.ఎందుకంటే కొన్ని అనుభూతులను వ్యక్తీకరించటానికి భాష సరిపోదు. ఈ రెంటినీ సమన్వయపరచి, ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి నేర్పరి.
ఈ సంపుటిలో మొదటి కవిత పేరు చిలక్కొయ్య. గోడకు ఉండే చిలక్కొయ్యపై వ్రాసిన వస్తుకవితైనప్పటికీ, ఒక సంపూర్ణజీవితాన్ని అంతర్లీనంగా చెపుతూంటుంది. కవి బాల్యంలో చిలక్కొయ్యతో తనకు గల అనుభవాలతో కవిత మొదలౌతుంది.
చిలక్కొయ్యపై పిచ్చుకలు వాలటం, కవి తల్లిగారు ఉత్త పసుపు పుస్తెలతాడు వేలాడదీయటం, దానికి తగిలించిన సీమవెండి కేరేజీలో చప్పరింపు చప్పరింపుకు రంగులు మారే బిళ్లలను వారి అమ్మగారు దాయటం, మూడో పురుషార్థ సాధనలో ఉన్న దంపతులను ఆ చిలక్కొయ్య నిర్వికారంగా చూడటం, ఈ ఒంటరి ప్రయాణంలో ఈదలేక నిష్క్రమిస్తూ అదే చిలక్కొయ్యకు ఆత్మను తగిలించటం -ఇవీ ఈ కవితలో కనిపించే వివిధ దృశ్యచిత్రాలు. అతి సామాన్యంగా కనిపించే వాక్యాలతో కవిత మొదలై ముగింపుకు వచ్చేసరికి అవే పదాలు మరో గొప్ప అర్థాన్నిచ్చే విధంగా మారతాయి. కవిత ప్రారంభంలో కనిపించిన కొయ్య చిలుక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, ఓ జీవితం కనిపించటం మొదలవుతుంది.
వీధిలో నగ్నంగా తిరిగే పిచ్చివాని గురించి వ్రాసిన “దిశమొల” అనే కవితలో అతనలా నగ్నంగా తిరగటాన్ని అనేక పదచిత్రాలలో హృదయానికి హత్తుకొనేలా వర్ణిస్తారు శిఖామణి.
దిగంబరంగా తిరుగుతున్న ఆ వ్యక్తి దేహాన్ని కప్పలేనందుకు, దుస్తుల తో సంబందం ఉన్న వివిధ నేపథ్యాల్ని ఈ కవితలో గొప్ప ప్రతిభతో ఇముడ్చుతాడు కవి.
- పల్లెల్లో పూతకొచ్చిన పత్తితోట తనమొదళ్లను తనే నరుక్కొంటుందట.
- మగ్గంలో అటూ ఇటూ తిరుగుతున్న కండె నిలువునా రెండుగా చీలుతుందట
- పట్టుపురుగు పట్టుగూడులో ఆత్మబలిదానం చేసుకొంటుందట
- దేవదేవుని శేషవస్త్రపు కొంగుకు నిప్పంటుకొంటుందట
- సాలెపురుగు దీపపు కొస శూలాగ్రం మీద శిరచ్ఛేదనం చేసుకొంటుందట
- ఎవరికి వారు రహస్యంగా తమతమ మర్మావయవాలను మనసుల్లోనే తడిమిచూసుకొంటారట
- కన్నీళ్లను ఒత్తవలసిన చేతిరుమాలు జేబులోనే చెమరుస్తుందట
ఒక్కో పదచిత్రమూ ఆ దృశ్యాన్ని సన్నగా వర్షించటం మొదలెట్టి నెమ్మదినెమ్మదిగా కరుణార్ద్ర కుంభవృష్టిలో పాఠకుణ్ణి తడిచేట్లు చేస్తుంది. అందమైన గూడును అల్లుకొనే సాలెపురుగును కూడా వాడుకోవటంద్వారా ఈ కవి దృష్టి ఎంత నిశితమో అర్థమవుతుంది. సునిశిత దృష్టి, కరుణ, మానవత్వాలు అంతర్లీనంగా ప్రవహించే ఈ కవిత, శిఖామణి కవిత్వ తత్వానికి ఒక మినియేచర్ రూపమనవచ్చు.
ఒక పదచిత్రంలోనే రెండుమూడు చిత్రాల్ని ఇమడ్చటం చాలా కష్టం. శిఖామణి తన కవిత్వంలో ఇలాంటివి అలవోకగా సాధిస్తాడు. పల్లెటూరివ్యక్తి చేసే పట్నవాసాన్ని వస్తువుగా తీసుకొని వ్రాసిన “ఆంతరంగికుని ఉత్తరం” లో ఒకచోట
“అక్కడ చలిపెట్టే అధికారులుండవచ్చు
వినయపు ఉన్ని శాలువా మర్చిపోలేదు కదా”
అంటాడు. ఇక్కడ చలికి ఉన్నిశాలువా, అధికారులకు వినయం అనే రెండు భిన్న విషయాల్ని ఒకే చిత్రంద్వారా సాధించాడు. చలిపెట్టే అధికారులు అనటం కూడా ఒక వ్యంగ్యం. దీనివల్ల గాఢత, క్లుప్తత వచ్చి చెప్పాలనుకొన్న విషయం వెన్నుకు చలిచలిగ తగిలేట్టు చేస్తుంది.
“మేఘనా” అనే మరో కవితలో
“వెన్నెల మబ్బుల మెట్లమీదుగా నేలకు దిగే సమయాన
పూలగొంతుల్లో పరిమళపు పాట కూనిరాగాలు తీసేవేళ ”
వంటి వాక్యాలలో కూడా ఇలాంటి ప్రతిభే కనిపిస్తుంది.
పేవ్ మెంట్ పై బతికే వృద్ధవనిత గురించి వ్రాసిన “వెన్నెల దుప్పటి” అనే కవిత శ్రీశ్రీ బిక్షువర్షీయసీ కవితను జ్ఞప్తికి తెస్తుంది. లోతైన పదచిత్రాలతో ఈ కవిత చదువరి హృదయాన్ని బరువెక్కిస్తుంది.
“ఆర్ధ్రత నీరెండిన నగరం నదిలో
ఆమె ఓ శిధిల నౌక …..
అర్ధరాత్రి దాటాకా
ఏ శీతలపవనమో ఆమెను ఒణికిస్తే
ముడుచుకుపడుకొన్న ఆమె దేహంమీద
చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పి
చెట్టుకొమ్మకు లాంతరు దీపమై వేలాడుతాడు.”...........వంటి వర్ణనల వల్ల, శ్రీశ్రీ కవితలో కనిపించని లక్షణమేదో ఈ కవితలో ఉన్నట్టనిపిస్తుంది.
.
కర్ణాటకలో దేవాలయ ప్రవేశం చేసిన ఓ దళితునిచే మలం తినిపించారన్న వార్తకు శిఖామణి ఎంతో తీవ్రంగా స్పందించి వ్రాసిన “వాడే అశుద్ధమానవుడు ” అన్న కవితనిండా ఆవేశం భుగభుగలాడుతూ, చదువరి రక్తాన్ని మరిగించేలా చేస్తుంది.
“వాణ్ని కన్న నేరానికి
నిన్ను తూలనాడుతున్నాను క్షమించుతల్లీ.
….
ఒరే లంజా కొడకా
నీ పేరు మనిషా?”
అని మొత్తం మానవత్వాన్నే ప్రశ్నిస్తాడు. ఈ కవిత వ్రాసిన సమయానికి (1989) తెలుగు సాహిత్యంలో దళితకవిత్వం ఇంకా ఉద్యమస్థాయిలో మొదలవలేదు. ఈ కవితలో కులస్పృహకంటే మానవత్వమే కనిపిస్తుంది. ఒక సాటిమానవునికి జరిగిన అమానుషావమానాన్ని, ఈ కవిత అంతే ఫెరోషియస్‌గా ఎత్తి చూపుతుంది.
శిఖామణి కొన్ని కవితలలో తన గ్రామీణనేపథ్యం, బాల్యం తాలూకు జ్ఞాపకాలు కనిపిస్తూ ‘ఈయన తన బాల్యపు ముగ్ధత్వాన్ని ఎంత అందంగా దాచుకొన్నాడూ!’ అనిపిస్తాయి. ఉదాహరణకు, తుమ్మచెట్టునీడలు, బొరియల్లో పీతలు, పాతబడ్డ టైరుని దొర్లించుకొంటూ సాగడాలు, మట్టిని పిసికి చేసే బళ్లూ, కొత్తనీటికి ఎదురెక్కి కిలకలు వేసే చేపపిల్లలు, కొలను గర్భంలో తామరతూడు తెగిన శబ్ధాలు, జామెట్రీ బాక్సులో దొంగిలించిన రబ్బరుముక్కలు మొదలైనవి.
ఇంకా ఈ కవితా సంపుటిలో
-బాల్యాన్ని ఈతాకుల చీపురు చేసి రైలు పెట్టి ఊడ్చే కుర్రాళ్లు (పాటల బండి),
-బాల్యాన్ని మూరమూరచొప్పున కోసి అమ్ముకొనే పూలబ్బాయిలు (పూలబ్బాయి),
-చీకటి ఆకాశపు ఆసుపత్రిలో చందమామలా వెలిగే నైట్ డ్యూటీ నర్సులు (ప్రమిదక్రింది చీకటి),
-చీకటి కొండచిలువ నగరం చెట్టుకు చుట్టుకోవటం (వెన్నెల దుప్పటి),
-నిద్రతో ప్రమేయం లేకుండానే ఒక మండే స్వప్నం కొరడాలతో హింసించటం (కలలనెమలి)
వంటి పదునైన అభివ్యక్తులెన్నో ఉన్నాయి.
పూలకుర్రాడు, కలలనెమలి, దేహి, పాటలబండి, మేఘనా, వెన్నెల దుప్పటి, ఆంతరంగికుని ఉత్తరం వంటి కవితలలో ఈ కవి ఎంతైతే భావుకతా, సున్నితత్వం చూపిస్తారో.. నిషేధాజ్ఞ, జలసర్పం, వాడే అశుద్ధమానవుడు, మాట డైనమైట్ అవుతుంది, కక్కుళ్లు, యుద్ధమూ అనివార్యమే వంటి కవితల్లో అంతకు మించిన వాస్తవికత, ఉద్వేగాన్ని ప్రతిబింబిస్తారు. అంటే రియాలిటీ తో తలపడవలసివచ్చినపుడు ఊహల్లోకి జారిపోయే తత్వం కాదీ కవిది.
ఈ పుస్తకం అనేక దారులమధ్య ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చిన అనేక మందిని వర్ధమాన కవుల్ని ప్రభావితం చేసి ఉంటుంది.
ఎందుకంటే ...
కవిత్వం అంటే - జీవితపు రణగొణధ్వనుల మధ్య జారిపోయే సున్నితానుభవాలను నేర్పుగా ఒడిసిపట్టుకోవటమని
కవిత్వం అంటే – నడచి వచ్చేసిన మార్గంలోని రాలుపూల పరిమళాల్ని నెమరువేసుకొంటూ కలల మాలలల్లటమనీ
కవిత్వం అంటే – మనిషితనం తగలకపోతుందా అంటూ లోలోపలికి తవ్వుకుంటూ పోయేతత్వమనీ
కవిత్వం అంటే – కాస్త అమాయకత్వం, లోకం మీద ఇంత దయా తప్ప మరే అలంకారాలూ లేకపోవటమనీ
కవిత్వం అంటే – కరుణ, తాత్వికతలు అంతర్జలలై ప్రవహించటమనీ
కవిత్వం అంటే – సామాజిక వాస్తవాల్ని ధైర్యంగా ఎదుర్కొని సాటి మనిషికి నమ్మకాన్నివటమనీ
కవిత్వం అంటే – మనచుట్టూ జరుగుతున్న అన్యాయాలపట్ల ధర్మాగ్రహం ప్రకటించటమనీ
కవిత్వం అంటే– స్వప్నాన్ని కమ్మిచ్చుగుండా సాగదీసి సాగదీసి బంగారు తీగలాంటి ఓ వాక్య చిత్రాన్ని నిర్మించటమనీ– వంటి అనేక సూత్రీకరణలకు “చిలక్కొయ్య” లోని వివిధ కవితలు సాక్ష్యాలుగా, ఉదాహరణలుగా నిలుస్తాయి.
చిలక్కొయ్య కవిత్వ సంపుటి తరువాత శిఖామణి గారు అనేక పుస్తకాల్ని వెలువరించారు. తెలుగు సాహిత్యంలో, ఆర్థ్రత, తాత్వికత, సామాజిక బాధ్యత తో రచనలు సాగించే కవిగా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొన్నారు. ఆధునిక కవిత్వంలో ఉపమ, రూపక అలంకారాల్ని ప్రతిభావంతంగా ప్రయోగించే కవిగా ప్రసిద్ధికెక్కారు.
ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించి, ఆనందించి, ప్రభావితమైన ఎంతో మందిలో నేనొకణ్ణి అని చెప్పుకోవటానికి గర్వపడతాను.
***
భవదీయుడు
బొల్లోజు బాబా


.
(ఈ సంవత్సరం అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారాలు శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి, శ్రీ శిఖామణి, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ లు అందుకొన్నారు. వారి సాహితీ కృషిని పురస్కరించుకొని విడుదలచేసిన సావనీర్లలో ఆ ముగ్గురిపైనా వ్యాసాలు రాసే అదృష్టం నాకు ఇచ్చిన ఆ యా సావనీర్ల సంపాదకులైన శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అద్దేపల్లి ప్రభు గార్లకు ధన్యవాదములు. ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు.)