Tuesday, July 14, 2020

సర్కారు జిల్లాల నుంచి ఫ్రెంచివారి నిష్క్రమణ

ఫ్రెంచి సేనాని Marquis de Bussy 1751 లో సలాబద్ జంగుకి సైనిక సహకారం అందించి అతడిని నిజాం రాజుని చేసాడు. దానికి ప్రతిగా సలాబత్ జంగు ఫ్రెంచి సేనల పోషణ నిమిత్తం 1753 లో శ్రీకాకుళం నుండి ఏలూరు వరకూ ఉన్న ఉత్తర సర్కారు ప్రాంతాలను ఫ్రెంచివారికి అప్పగించాడు. అలా సుమారు 470 కిలోమీటర్లు పొడవున్న అత్యంత సారవంతమైన కోస్తా భూములు ఫ్రెంచి వారి పరమయ్యాయి. అప్పట్లో ఇవి రెండులక్షల రూపాయిల పన్ను ఆదాయం కలిగి ఉండేవి. అంతవరకూ ఈ పరగణాలకు గవర్నరుగా ఉన్న జాఫర్ అల్లీఖాన్ ఈ ప్రాంతాలను ఫ్రెంచివారికి ఇవ్వటాన్ని ఇష్టపడలేదు. అదే విధంగా విజయనగరం రాజైన విజయరామ గజపతికి కూడా ఈ ప్రాంతాలను ఫ్రెంచివారికి స్వాధీనపరచటం నచ్చలేదు. ఈ విషయం తెలుసుకొన్న ఫ్రెంచి అధికారి Moracin, ఇదివరకు నిజాం ప్రభువుకు చెల్లించిన కౌలు కంటే తక్కువ మొత్తానికే భూములను ఇస్తానని చెప్పటంతో విజయరామ రాజు ఫ్రెంచివారి పక్షాన చేరిపోయాడు . ఫ్రెంచి సైన్యం మద్దతుతో 1757 లో ఈ విజయరామరాజు బొబ్బిలి వంశస్థులను అంతమొందించి తుదకు తాండ్రపాపారాయుని చేతిలో హతమయ్యాడు.
విజయరామరాజు అనంతరం విజయనగర సంస్థానాధీశునిగా వచ్చిన ఆనందగజపతి రాజు ఫ్రెంచివారి పట్ల విముఖత కలిగి వారిని ఎలాగైనా కోస్తా జిల్లాలనుండి తరిమేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీషు వారితో చేతులు కలిపాడు. అదేసమయంలో కలకత్తా నుండి విస్తరిస్తూ వస్తున్న బ్రిటిష్ వారికి ఆనందగజపతి రాజు మద్దతు వెతుకుతున్నతీగ కాలికి తగిలినట్లయింది.
కోస్తా జిల్లాలనుండి ఫ్రెంచివారిని పారద్రోలటానికి చేసిన యుద్ధాలలో తూర్పుగోదావరి జిల్లాలోని చందుర్తి అనే చోట 1759 డిసెంబరు 9 న ఫ్రెంచి, ఇంగ్లీషు సేనల మధ్య జరిగిన “చందుర్తి యుద్ధం” నిర్ణయాత్మకమైనదిగా; మొత్తం భారతదేశంలోనే ఫ్రెంచి వారి విస్తరణకు అడ్డుకట్టవేసిన ముఖ్యమైన యుద్ధాలలో ఒకటిగా చరిత్రకారులు భావిస్తారు. ఈ యుద్ధంలో ఫ్రెంచి సేనలు పరాజయంపొంది తొలుత రాజమండ్రి, అక్కడనుండి మచిలిపట్నం పారిపోగా బ్రిటిష్ సేనలు వెంబడించి వారిని ఓడించి పాండిచేరీకి తరిమేసాయి. ఆ విధంగా ఒకప్పుడు శ్రీకాకుళం నుంచి కృష్ణానది వరకూ కల కోస్తాజిల్లాలలో ఏడేళ్ళపాటు అధికారం చెలాయించిన ఫ్రెంచి వారు తమ ఉనికిని పూర్తిగా కోల్పోయారు. కాలక్రమేణా ఫ్రెంచి వారు పాండిచేరి ఇంకా పెద్దగా ప్రాధాన్యత లేని ఇతర ప్రాంతాలకు పరిమితమై తమ వ్యాపారాలను చేసుకొన్నారు.
చారిత్రికంగా అంతటి ప్రాముఖ్యత కలిగిన “చందుర్తి యుద్ధం” గురించి కైఫియత్తులలో పెద్దగా సమాచారం లభించదు. దీనికి కారణం కైఫియత్తులు రాసే సమయానికి, చందుర్తి యుద్ధం వలన భారతదేశాన్ని ఫ్రెంచివలసరాజ్యంగా మార్చగలిగే అవకాశాన్ని ఫ్రాన్స్ చేజార్చుకొన్నదనే సంగతి ఇంకా పూర్తిగా స్పష్టపడలేదని అనుకోవచ్చు.
***
చందుర్తి యుద్ధం
చందుర్తి యుద్ధం గురించిన ప్రస్తావన నేరుగా లేకపోయినా తదనంతరం జరిగిన కొన్ని స్థానిక పరిణామాలు సామర్లకోట కైఫీయత్తులో ఇలా ఉన్నాయి.
“//పూసపాటి ఆనందగజపతి సైన్యముతో వచ్చి చామర్లకోట మీద పోట్లాడగా, మహీపతిరాయనింగారు, నీలాద్రిరాయనింగారు కోటలో ఉండి కాకినాడ జగన్నాధపురంలో మందుగుండు కొని, తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చారు. కోటను వశపరచుకొనుట సాధ్యం కాలేదు. తదనంతరం ఆనంద గజపతికి నీలాద్రిరాయనింగారికి మధ్య ఒప్పందము జరిగింది. దీనిప్రకారము - నీలాద్రిరాయనింగారు చామర్లకోట ఖాళీచేసి సైన్యసహాయం అందించిన ఇంగ్లీషువారికి ఇచ్చివేసి తను పిఠాపురం కోటలో నివాసముండేటట్లు; జమిందారీ ఆదాయంలో నూటికి అయిదువరహాల వాటా ఇచ్చేటట్లు; వెలమలు, ఒంటర్లు ఎక్కడైనా వ్యవసాయం చేసుకొనేందుకు కావలసినన్ని భూములు ఇచ్చి పండినపంటలో సగభాగము ఇచ్చేలాగ; ఆనంద గజపతి వారి మనుషులు ఈ ప్రాంతములో అధికారము చెలాయించేటట్లు- ఉభయులు అంగీకారానికి వచ్చారు.
ఆనందగజపతి, నీలాద్రిరాయనింగారు ఇలా ఒప్పందానికి రావటం నచ్చని ఇంగ్లీషువారు గజపతివారిపై అలిగి వెళ్ళిపోయారు. ఆనందగజపతి కంపనీవారిని జగ్గంపేటవద్ద కలిసి ఒప్పించి వారి జండాను చామర్లకోట కోటబురుజుపై ఎగరేయించాడు.//” (సామర్లకోట కైఫీయత్తు నుంచి)
పై వాక్యాలలో ఎక్కడా చందుర్తి యుద్ధ ప్రస్తావన కానీ, ఫ్రెంచి వారి గురించి కానీ లేదు. ఆ యుద్ధానంతరం జరిగిన కొన్ని సంఘటనలను మాత్రమే ఉన్నాయి. చందుర్తి యుద్ధాన్ని పేజీలకొద్దీ వర్ణించి విశ్లేషించిన A History of military transactions of British Nation in Indostan by Robert Orme, A descriptive and historical account of the Godavery District in the presidency of Madras by Morris Henry, Records of Fort St. George Publications, History Of The French In India by Malleson లాంటి చరిత్ర పుస్తకాలలో పైన చెప్పిన సంగతులు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే ఇవి పూర్తిగా స్థానీయ విషయాలు. కైఫియత్తుల లాంటి స్థానిక చరిత్రలలోనే లభిస్తాయి.
కైఫియత్తు వర్ణనలో ఇంగ్లీషు వారు గజపతివారిపై అలిగి వెళ్ళిపోయారు అన్న వాక్యంలో “అలిగి వెళ్ళిపోవటం” గురించి మెయిన్ స్ట్రీమ్ చరిత్రలో కొన్ని ఆధారాలు లభిస్తాయి.
ఆనందగజపతిరాజు కోస్తా జిల్లాల నుంచి ఫ్రెంచి వారిని వెళ్లగొట్టాలని ఇంగ్లీషు వారితో చేతులుకలిపి ఇరువురూ 1758, నవంబరు 2 న ఒక ఒప్పందం చేసుకొన్నారు. దీనిప్రకారం కల్నల్ ఫోర్డ్, ఆనందగజపతిరాజు కలిసి చేయబోయే యుద్ధంలో - కొల్లకొట్టిన సంపదలను చెరిసమానంగా పంచుకోవాలని; యుద్ధం ముగిసాకా ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న కోస్తాజిల్లాలపై పన్ను వసూలు అధికారం ఆనందరాజుకు, ఓడరేవులు ఇంగ్లీషు వారికి దక్కాలని; బ్రిటిష్ సైన్యం ఖర్చుల కొరకు నెలకు రూ. 50,000, సైనికాధికారులకు రూ.6000 చొప్పున ఆనంద గజపతి ఇవ్వాలని అంగీకారానికి వచ్చారు.
చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఆనందగజపతిరాజు డబ్బు సక్రమంగా చెల్లించకపోవటంతో కల్నల్ ఫోర్డ్ అసహనంతో ఉండేవాడు. చందుర్తి యుద్ధం ముగిసేనాటికి ఆనందగజపతి రాజు 56,000 రూపాయలు బకాయి పడటమే కాక ఫోర్డ్ నుండి వ్యక్తిగత అవసరాలకొరకు 20,000 రూపాయిలను అప్పుగా తీసుకొన్నాడు కూడా.
చందుర్తి యుద్ధం ముగిసికా ఆనందగజపతి సామర్లకోటలోనే ఉండి నీలాద్రిరావుతో ఒప్పందం చేసుకొని తీరిగ్గా రాజమహేంద్రవరం వెళ్ళేసరికి అప్పటికే అక్కడ అంతవరకూ ఫ్రెంచివారి చేతుల్లో ఉన్న రాజమహేంద్రవరపు కోటను బ్రిటిష్ సైన్యం స్వాధీనపరుచుకొని ఉండటంతో ఆశ్చర్యపోతాడు. ఒప్పందం ప్రకారం కోటను తనకు అప్పగించమని అడగగా, బకాయిలు చెల్లిస్తేకాని కోటను ఇచ్చేది లేదంటాడు కల్నల్ ఫోర్డ్.
రాజమండ్రి నుంచి ఇంగ్లీషు సేనలు మచిలీపట్నంపై దాడికి బయలుదేరుతున్నప్పుడు కల్నల్ ఫోర్డ్ ఆనందగజపతిరాజును కూడా అతని సైన్యంతో రమ్మన్నప్పుడు ఆనందగజపతిరాజు అంగీకరించడు.
ఈ సందర్భంగా వీరిద్దరి మధ్యా ఘర్షణ జరిగి ఉంటుంది. ఆనందగజపతి రాజు రాజవొమ్మంగి అడవులలోకి పోయి కొంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయాడు .
ఆనంద గజపతి రాజు 1758 డిసంబరు 7 న మద్రాసులోని బ్రిటిష్ ఉన్నతాధికారులకు వ్రాసిన ఒక లేఖలో ”రాజమహేంద్రవరం కోటను స్వాధీనపరచని కారణంగా తాను శిస్తులు చేయలేకపోయానని అందువల్ల కంపనీ సైన్యానికి బాకీ పడ్డానని” సంజాయిషీ ఇచ్చుకోవటం ఆసక్తికలిగిస్తుంది.
ఇంగ్లీషు సేనలు ఒంటరిగానే 1759 ఏప్రిల్ లో మచిలీపట్నాన్ని వశపరచుకొన్నాయి.
అంతిమంగా విజేతగా నిలిచిన ఇంగ్లీషు వారి మద్దతు ముందుముందు అవసరముంటుందని తలచిన నిజాం ప్రభువు సలాబత్ జంగ్ 1759 మే 14 న ఒక దానపత్రం ద్వారా ఈ కోస్తా జిల్లాలను బ్రిటిష్ వారికి “ఈనాం” గా ఇచ్చాడు. వాటిని "సర్కారు జిల్లాలు" అని పిలిచేవారు. అవి ఇప్పటి విభజన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలు. ఆ దానపత్రంలో అంతవరకూ ఈ ప్రాంతాలలో ఉంటున్న ఫ్రెంచి వారు వారి వారి సరంజామాను సర్దుకొని పదిహేను రోజుల్లో ఖాళీచేసి వెళిపోవాలి కూడా ఉండటం గమనార్హం. అలా కోస్తాజిల్లాలలో ఫ్రెంచివారి భవిష్యత్తు ముగిసిపోయింది.
ఆ విధంగా సామర్లకోట కైఫియత్తులో కనిపించే “ఇంగ్లీషు వారి అలక” వెనుక ఆర్ధిక, రాజకీయ కారణాలెన్నో కనిపిస్తాయి. ఈ ఉదంతంలో ఇంగ్లీషు వారు, ఆనందగజపతిరాజు ఇద్దరిలో ఎవరు ఎవరిని వాడుకొన్నారో ఇతమిద్దంగా తేల్చలేం. నిజాం ప్రభువు దృష్టిలో ఆనందగజపతి రాజు చాన్నాళ్ళుగా శిస్తులు బకాయి పడటంతో ఒక “రెబల్ జమిందారు” గా చెడ్డపేరు తెచ్చుకొన్నాడు. బ్రిటిష్ వారు నిజాం ప్రభువును ఒప్పించి, పాతబాకీలన్నీ రద్దుచేయించి తిరిగి ఆనందగజపతి రాజుకే ఈ ప్రాంతాల జమిందారీ ఇప్పించటం కొసమెరుపు.
***
సామర్లకోట కైఫీయత్తులో ఫ్రెంచి వారి గురించిన ఒక ప్రస్తావన ఇలా ఉంది.
//“అవమాన భారంతో కుంగిపోయిన పిఠాపురం జమిందారు నీలాద్రిరాయినింగారు, పెద్దాపురం జమిందారు జగపతిరాజులు ఎలాగైనా పగతీర్చుకోవాలని జట్టుకట్టారు. కాకినాడ జగన్నాధపురం రేవులో ఫ్రెంచివారి ఓడ ఒకటి వచ్చి ఆగింది. వీరిద్దరు ఒక డచ్చివ్యాపారిని మధ్యవర్తిగా పెట్టుకొని- చామర్లకోటనుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు ఫ్రెంచివారితో నాలుగులక్షలరూపాయిలకు ఒక ఒప్పందం చేసుకొని లక్షరూపాయిలు బయానాగా ఇచ్చారు. రెండువందలమంది ఫ్రెంచి సైన్యాన్ని ఓడదింపి, చామర్లకోటకు నావలమీద తీసుకొచ్చారు. నీలాద్రిరాయనింగారు మొత్తం వ్యవహారంపై నమ్మకం కుదరక ఊగిసలాడుతుంటే జగపతిరాజు అతడిని ఉత్సాహపరచి, అయిదారువందలమంది సైనికులతో వెంటవేసుకొని, ఆనందగజపతి సైన్యంపై యుద్ధం చేయనారంభించారు. ఆ యుద్ధంలో వత్సవాయి జగపతికి తుపాకిగుండు తగిలి చనిపోయాడు. రావునీలాద్రిరాయనింగారు పారిపోయి జూపల్లెవారి సంస్థానంలో తలదాచుకొన్నాడు. నీలాద్రిరాయనింగారు పరారీ అయినాడని గ్రహించి, ఆనందగజపతి చామర్లకోటవచ్చి కోటలో తొలగించబడిన ఇంగ్లీషువారి జండాను తిరిగి నిలబెట్టి, అక్కడ కాపలా కాస్తున్న ఫ్రెంచివారిని తరిమేసాడు. వారు తిరిగి కాకినాడ ఓడమీదకు పోయారు”.// (సామర్లకోట కైఫీయత్తు నుంచి)
ఆనందగజపతి రాజుకు మద్దతుగా బ్రిటిష్ వారు నిలవగా, ఫ్రెంచివారికి అండగా రెడ్డి పోలవరం రాజా, మంగపతి దేవు, నూజివీడు అప్పారావు, మొగల్తూరు వెంకట రాజా, పెద్దాపురం జగపతి రాజు, పిఠాపురం నీలాద్రిరావు లాంటి జమీందారులు నిలిచారు . చందుర్తి యుద్ధంలో ఫ్రెంచి వారు ఓడిపోయి నిష్క్రమించటంతో ఈ జమిందారులందరూ చెల్లాచెదురైపోయారు. వీరిలో పిఠాపురం జమిందారు నీలాద్రిరావుగారు, పెద్దాపురం జమిందారు జగపతిరాజులు ఈ అవమానభారాన్ని తట్టుకోలేకపోయారు. వీరికి అప్పటికే ఆనందగజపతిరాజుతో పాత శత్రుత్వాలు ఉన్నాయి. అతన్ని దెబ్బతీయటానికి వీరిద్దరూ తమ సర్వశక్తులూ కూడదీసుకొని ఒక చివరిప్రయత్నం చేసినట్లు పై ఉదంతం ద్వారా అర్ధమౌతుంది.
దీనికి సంబంధించి ఆధారాలు Robert Orme వ్రాసిన A History of military transactions of British Nation in Indostan by Robert అనే పుస్తకంలోకనిపిస్తాయి. గంజాంనుంచి తిరిగి వస్తున్న Moracin అనే ఫ్రెంచి సైనికాధికారిని 1759 డిసెంబరు నెలలో పెద్దాపురం జమిందారైన జగపతిరాజు కలిసి, సైనిక సహాయం కోరగా అతను కొంతమంది ఫ్రెంచి సైనికులను జగపతిరాజుకు తోడు ఇచ్చి పంపించాడు. ఈ సంగతి తెలిసిన ఆనందగజపతి రాజు ఈ తిరుగుబాటును అణచివేయమని తన సైన్యాన్ని సామర్లకోట పంపాడు. అదేసమయంలో మచిలీపట్నం వెళుతున్న బ్రిటిష్ సైన్యం కూడా వీరితో కలిసింది. పెద్దాపురం జమిందారు జగపతి రాజు, పిఠాపురం జమిందారు నీలాద్రిరావు లు ఫ్రెంచి సైనికులతో కలిసి ఆనందగజపతిరాజు సైన్యానికి తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చారు. ఈ పోరాటంలో మొరాసిన్ పంపిన ఫ్రెంచి సైనికులు తట్టుకోలేక వెనక్కి వచ్చేసారు. జగపతిరాజు చనిపోగా, నీలాద్రిరావు పారిపోయాడు.
Orme కథనానికి కైఫియత్తు కథనానికి చాలా తేడా కనిపిస్తుంది. జగపతిరాజు మొరాసిన్ కు లక్షరూపాయలు బయానాగా ఇచ్చి సైనిక సహాయం కోరిన సంగతి Orme పుస్తకంలో కనిపించదు. అంతే కాక సామర్లకోట కోటపై ఫ్రెంచి సైనికులను తరిమివేసి తిరిగి అక్కడ ఇంగ్లీషువారి జండాను ఎగరేసిన సంగతి కూడా. అంటే బహుసా జగపతిరాజు మద్దతుతో ఫ్రెంచి వారు ఈ ప్రాంతంలో తిరిగి ప్రవేశించి అక్కడి బ్రిటిష్ జండాను తొలగించి, తమ సైనికులను కాపలా ఉంచి ఈ ప్రాంతం ఇంకా మా ఆధీనంలోనే ఉంది అని ప్రకటించుకొన్నారని ఊహించుకోవచ్చు. ఇది కోస్తా జిల్లాలలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి ఫ్రెంచివారు చేసిన చివరి విఫలయత్నమని అనుకోవాలి.
***
ముగింపు
ఆనందగజపతిరాజు ఇంగ్లీషు వారిని ఆహ్వానించి సైనిక సహాయం అందించినందుకు నెలకు అరవై వేలు ఇవ్వటానికి ఒప్పందం చేసుకోవటం; అదే విధంగా ఫ్రెంచి వారు సైనిక సహాయం అందించేలా జగపతి రాజు నాలుగు లక్షలకు బేరం కుదుర్చుకోవటం ఆసక్తికరంగా అనిపిస్తాయి. అప్పట్లో యూరోపియన్స్ వద్ద తుపాకులు, ఫిరంగులు ఎక్కువగా ఉండేవి. వాటి సహాయంతో స్థానిక శత్రువులను నిర్మూలించవచ్చుననే దురాశ జమిందార్లలో కనిపిస్తుంది. మొదట్లో యూరోపియన్ల దృష్టి వ్యాపారావసరాలకు ఉపయోగపడే ఓడరేవులపైనే ఉన్నప్పటికీ, కాలక్రమేణా అది సైన్యాన్ని పోషించటం కొరకు భూములను ఈనాములుగా పొందటం వరకూ వెళ్ళింది.
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మెకంజీ కైఫియత్తులలో ఎంతో చారిత్రిక ప్రాధాన్యత కలిగిన చందుర్తి యుద్ధ ప్రస్తావన లేకపోవటం ఆశ్చర్యం కలిగించకమానదు. బహుసా అప్పటి ప్రజలు ఈ యుద్ధాన్ని ఇంగ్లీషు, ఫ్రెంచి రాజ్యాలమధ్య యుద్ధంగా కాక రెండు సంస్థానల మధ్య యుద్ధంగా భావించి ఉంటారు. అందుకనే విజయనగర సంస్థానాధీశుడైన ఆనందగజపతిరాజు గురించి, పెద్దాపురం సంస్థానానికి చెందిన జగపతిరాజు గురించిన సమాచారమే ఎక్కువగా ఉంటుంది. ఒక గొప్ప సంఘటన జరిగేటపుడు ఆ సంఘటనలో పాలుపంచుకొనే వ్యక్తులకు అది తెలియదు. కాలం నిర్ణయిస్తుంది.
ఆనందగజపతిరాజుతో చేసిన యుద్ధంలో జగపతిరాజు చనిపోయినపుడు అతని భార్య సతీసహగమనానికి సిద్ధపడింది. ఆ సందర్భంగా ఆనందగజపతి రాజు భార్య ఆమెకు పసుపుకుంకుమలు పంపించిందట. ఆ చర్యకు అవమానపడిన జగపతిరాజు భార్య “మాది కూడా దేశమే ఇక్కడా పసుపుకుంకుమలు లభిస్తాయి, భవిష్యత్తులో మీ దేశానికీ అవసరపడొచ్చు మీరే ఉంచుకోండి” అని తిరిగి పంపించేసిందట. “నా భర్తమరణానికి కారణమైన ఆనందగజపతి రాజు భార్యకూడా వైధవ్యాన్ని పొందుగాక” అని శాపం ఇచ్చి సతీసహగమనం చేసిందామె. ఈ సంఘటన జరిగి మూడునెలలు తిరక్కుండా 1760 లో ఆనందగజపతిరాజు రాజమండ్రిలో మసూచి సోకి చనిపోవటం కాకతాళీయమే.
జగపతిరాజు భార్య శాపం పెట్టటం కైఫియత్తు అయితే, 1760 లో ఆనందగజపతిరాజు చనిపోవటం చరిత్ర. రెండిటినీ విడదీయలేం.
(రానున్న నా తదుపరి పుస్తకం “తూర్పుగోదావరి జిల్లా-మెకంజీ కైఫియత్తులు” పుస్తకం నుండి)
బొల్లోజు బాబా

కరోనా పద్యం - 2


ఉలిక్కిపడి నిద్రలేచాను... ఏదో పీడకల
మంచం మీంచి లెగిసి హాల్ లోకి వచ్చాను
అద్దంలో నా ప్రతిబింబం నన్ను చూసి నవ్వుతోంది
ఆశ్చర్యపడుతూ దగ్గరకు వెళ్ళాను
"భయపడ్డావ్ కదూ.... భయం వేసింది కదూ"
అంటూ ఇంకా బిగ్గరగా నవ్వుతోంది.
మెల్లగా నడుచుకొంటూ బయటకు వచ్చాను
తెల తెల వారుతోంది అప్పుడే
అంతా నిశ్శబ్దం.... ఏ రణగొణ ధ్వనులూ లేవు
పక్షుల శబ్దాలు మొదలయ్యాయి
ఎన్ని యుగాల క్రిందట ఈ నగరం వాటిని
విని ఉంటుందో అంత స్పష్టంగా!
గాయపడ్డ నగరానికి గాయపడ్డ గానం గొప్ప ఉపశమనం
మరణాల్ని యాచించే భిక్షపాత్ర
ఎర్రెర్రగా ఉదయిస్తోంది
భయమేసింది లోపలకు వచ్చేసాను
రాత్రి ఫ్లాస్కులోంచి కషాయం ఒంపుకొని
కప్పులో వేసుకొని తాగుతూ గమనించాను
నా నీడ నాతో లేదు.
ఎప్పుడు నన్ను విడిచిపోయిందో గుర్తురావటం లేదు.
ఒక్కసారిగా ఏకాకినైపోయానన్న స్పృహ
జలదరింపచేసింది
ఒంటరితనం నా చుట్టూ పంజరంలా బిగుసుకొంది.
నా ప్రతిబింబం నన్ను చూస్తూ
గేలిచేస్తూ ఇంకా నవ్వుతోంది.
దాని దగ్గరకు వెళ్ళి
అద్దంలోని నా మొఖాన్ని చేతుల్లోకి తీసుకొని
దాని నుదిటిపై మెత్తగా ముద్దుపెట్టి
"అనూహ్యతలకు అనాదిగా
భయపడూతూనే ఉన్నాడు మానవుడు
కానీ ఏనాడూ ఓడిపోలేదు" అన్నాను
బొల్లోజు బాబా

తెలుగు కవిత్వరాజకీయాలు



కవిత్వం రెండు విధాలుగా వ్రాయబడుతుంది. కవి తన లోపలకు చేసే ప్రయాణంలో కనుగొనే విషయాలను వ్యక్తీకరించటం ఒక పద్దతి అయితే బయట ప్రపంచంతో తను సాగించే ప్రయాణంలోని అనుభవాలను ఆవిష్కరించే పద్దతి మరొకటి.
లో లోపలికి చేసే ప్రయాణం ద్వారా వ్రాసే కవిత్వంలో ప్రేమ, వేదన, అర్పణ, తాత్విక చింతన, మానవసంబంధాలు, జీవితానికి దొరికే నిర్వచనాలు, జీవనానుభవాల దర్శనం లాంటి ఉద్వేగాలు ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. దురదృష్టవశాత్తు ఇలాంటి కవిత్వాన్ని విమర్శకులు వైయక్తిక కవిత్వమనీ, తీరిక వర్గాల కవిత్వమని తీర్మానాలు చేస్తారు.
ఇక వెలుపలి ప్రపంచంలోకి చేసే ప్రయాణం ద్వారా సృజించే కవిత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రకృతి సౌందర్యము, పిల్లలు, నాస్టాల్జియా లాంటి అంశాలకు వివశత్వంతో, ప్రేమ నిండిన ఉద్వేగాలతో అల్లిన కవిత్వం. ఈ రకపు కవిత్వాన్ని చెట్టు, పుట్టా కవిత్వమనీ, కడుపునిండిన వ్యవహారమని విమర్శకులు లెక్కలోకి తీసుకోరు.
సమాజంలో ఉండే అసమానతలు, రాజకీయాలపట్ల ఆగ్రహంతో, సహానుభూతితో, ఈ సమాజం మెరుగుపడాలి అనే ఆశయంతో వ్రాసే కవిత్వం మరొకరకం. కొంతమంది తెలుగు విమర్శకుల దృష్టిలో సామాజిక స్పృహకలిగిన కవిత్వమే ఉత్తమ కవిత్వం. మిగిలినదంతా ప్రగతినిరోధక, దోపిడీవర్గాలకు దోహదపడే కవిత్వంగా పరిగణించి జారీచేసిన ఫత్వాలు ఇప్పటికీ చలామణీలో ఉన్నాయి.
మరికొంత విమర్శకులు కొంచెం రిఫైన్డ్ గా సమాజాన్ని ప్రతిబింబిస్తూ, ఘర్షణ కలిగి ఉన్నకవిత్వమే ఉత్తమ స్థాయి కవిత్వమనీ మిగిలినదంతా సెకండ్ గ్రేడ్ కవిత్వమనీ తీర్మానాలు చేస్తారు. ఘర్షణ లేని రచనా రూపం ఉండదు. కవిత్వమే కానక్కరలేదు అది కథకావొచ్చు, వ్యాసం కావొచ్చు ఘర్షణ ఉన్నప్పుడే ఉద్వేగాలు పలుకుతాయి, చదువరిని ఆలోచింపచేస్తాయి. పైన చెప్పిన హృదయసంబంధ కవిత్వంలో కూడా అంతర్ బహిర్ సంఘర్షణ ఉంటుంది. అది ఏ తూనికరాళ్ల ఆధారంగా సెకండ్ గ్రేడ్ కవిత్వమయ్యిందో మాత్రం చెప్పలేరు.
***
మానవుడు మౌలికంగా అన్వేషకుడు, ఆరాధకుడు. తన జీవితపరమార్థం ఏమిటనేదాన్ని నిత్యం అన్వేషణ చేస్తూంటాడు, తన అనుభవాల సారం వడబోస్తాడు, తన చుట్టూ ఉన్న ప్రకృతిని, సన్నిహితులను ఆరాధిస్తాడు. ఇవి అతని ప్రధాన వ్యాపకాలై ఉంటాయి. ఆ తరువాత అతను సమాజం గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. మొదటి రెండు క్రియలలో అతను నిత్యం అనేక అంతర్ధర్శనాలను పొందుతూంటాడు. వాటిని కవిత్వంలోకి తీసుకొస్తాడు. అదే మిమాంసలో ఉండే ఇతరులు అలాంటి కవిత్వాన్ని చదివినపుడు గొప్ప అనుభూతిని, ఆనందాన్ని, ఉపదేశాన్ని పొందుతారు. కవిత్వానికి ప్రయోజనం ఆనందోపదేశాలన్నది ఇందుకే. దీన్ని విమర్శకులు చవకరకం కవిత్వంగా జమకట్టటం దుర్మార్గమైన కుట్ర.
***
ఆధునిక కాలం ప్రజాస్వామ్యయుగం. పేద, ధనిక బేధాలు, శ్రామిక వర్గాల దోపిడి చర్చనీయాంశాలుగా మారాయి. వీటిని ప్రధానంగా చర్చించే సాహిత్యం ఇరవయ్యో శతాబ్దంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. సిద్ధాంతాలు, సూత్రీకరణలు జరిగాయి. ఈ దోపిడీని అరికట్టటం, అసమానతలను తొలగించటం, సాటిమానవుల పట్ల సహానుభూతిని ప్రదర్శించటం ప్రధాన ఇతివృత్తాలుగా మారాయి. మానవజాతికి ఇవే ప్రధాన ప్రయారిటీ అంశాలయ్యాయి. ఈ కారణంగానే సామాజిక స్పృహ గురించిన కవిత్వాన్ని ఉత్తమమైన కవిత్వంగా భావించటం జరిగింది. అలాంటి రాజకీయ కవిత్వం ముందు అందమైన సీతాకోక చిలుక మెత్తగా గాలిలో ఎగరటాన్ని వర్ణించే కవితో లేదా సహచరుని సమక్షంలో తనకు కలిగిన అద్భుతమైన అనుభవాన్ని వర్ణించే కవితో ఉత్త నాన్సెన్స్ గా తోచాయి చాలామందికి.
ఇరవయ్యో శతాబ్దం ముగిసేసమయానికి, మనిషిని సంఘంలో ఒక యంత్రంలా పరిగణించటం "మానవ స్వేచ్ఛ" కి విఘాతమని జనబాహుళ్యం భావించటం వల్ల ఈ రోజు క్రమక్రమంగా ఆ సిద్ధాంతాలు కనుమరుగవుతున్నాయి. నేటికీ ఇంకా అవే పడికట్టు పదాలను పట్టుకొని వేలాడటం అర్ధరహితం.
***
మానవ సమాజం సమాజ శ్రేయస్సును పర్యవేక్షించటానికని వివిధ వ్యవస్థలను ఏర్పరచుకొన్నది. అవే మనం ఎన్నుకొనే ప్రభుత్వం, అది తప్పుచేసినప్పుడు ప్రశ్నించటానికి ప్రతిపక్షం, ప్రజలను-ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే చట్ట వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినపుడు సంబధిత వ్యవస్థలను సంప్రదించి పరిష్కరించుకోవటం అనేది సరైన మార్గమని అందరూ అంగీకరించే విషయం. ఎందుకంటే ఈ వ్యవస్థలను అన్నింటినీ మనమే రూపొందించుకొని మనమే నడుపుకొంటున్నాం కనుక. అందుకనే తను చేయాల్సిన పనులు మరొకరు చేయటాన్ని సహించని రాజ్యం ఎన్ కౌంటర్లుచేసి, జైల్లో పెట్టీ తన చర్యలను సమర్ధించుకొంటుంది.
అమలులో ఉన్న ఈ మొత్తం వ్యవస్థను కాదని సమస్యను ఉత్త కవిత్వీకరించటమో, సమస్య పరిష్కారానికి తుపాకులు పట్టుకోవాలనటమో, లేక జీపుక్రింద మందుపాతరలు పెట్టటమో ఏమేరకు పరిష్కారానికి దోహదపడతాయనేది ఆలోచించాల్సిన విషయం.
చిన్న ఉదాహరణ. ఈ రోజు కరోనా వలస కార్మికులు మైళ్లకొలదీ నడుచుకురావటం పట్ల పుంఖానుపుంఖాలుగా కవిత్వం వచ్చింది. చాలామంది ఆహా ఓహో అంటూ మెచ్చుకొన్నారు. ఎంతమంది కవులు అలాంటి బాధితులకు తమ ఇండ్లలో ఆశ్రయమిచ్చి ఉంటారు అనేది సందర్బోచిత ప్రశ్నే. ఈ రోజు అలాంటి వారికి ఆశ్రయం ఇస్తున్నది, పోషిస్తున్నది మనం ఏర్పరుచుకొన్న పటిష్టమైన వ్యవస్థలోని అంగాలైన అధికారులు, స్థానిక నాయకులు ఇంకా మనలోని వితరణశీలులు. ఈ సామాజిక స్పృహ కవిత్వం రాసిన కవులెక్కడా కనిపించలేదు. అంటే రాసేదంతా కపట సహానుభూతి అని భావించొచ్చా? ఇది హిపోక్రిసి క్రిందకు రాదా? ఈ సందర్భంలో తాగిపడేసిన సీసాలు కాదు రాసిపడేసిన కవిత్వాన్ని చూడండి అన్న ఒకనాటి కామెంటు లోతుగా చూస్తే ఉపరితల వ్యాఖ్యగానే మిగిలిపోతుంది.
రాజకీయకవిత్వంలో నిజాయితీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మొదటి రెండురకాల (వైయక్తిక, ప్రకృతి) కవిత్వాలలో నిజాయితీ ఉంటుంది. చింతనాశీలత ఉంటుంది. మానవజీవితాన్ని ఉద్దీపింపచేసే ఆనందోపదేశాలు ఉంటాయి.
***
కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండితీరాలన్న కొన్ని రంగుటద్దాలు పెట్టుకొని కవిత్వ విమర్శ చేయటం వల్ల రాజకీయేతర కవిత్వాన్ని కడుపునిండిన కవిత్వమనీ, శృంగారము తిండియావా తప్ప ఎలాంటి సాహిత్య విలువా లేదని, ఈ సాహిత్యమంతా తీరికవర్గాల కూనిరాగాలగా తేల్చేసారు విమర్శకులు.
కవిత్వంపై జరిగిన ఈ రంగుటద్దాల దాడిని "సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబించాలనీ, రాజకీయాలు జీవితంలో ఒక భాగమనీ" అంటూ శేషేంద్ర శర్మ;
"సిద్ధాంతాలను కవిత్వంలో చొప్పించటం అంటే తిరగళ్ళు కట్టుకొని నడవటం లాంటిదని" ఇస్మాయిల్;
"రాజకీయేతరమైన మరే అనుభవం కవిత్వంగా ప్రతిపాదించడమే నేరంగా చెలామణీ చేయటం ఒక దుర్మార్గం" అని ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
కవిత్వానికి కవిత్వమే ప్రమాణమని మరికొందరూ ఎదుర్కొన్నారు. కాని వారి వాదన, వేదనా సామాజిక స్పృహమాత్రమే కవిత్వం అని ఢంకా భజాయించి చెప్పే డమడమ శబ్దాలలో వినిపించకుండా పోయాయి.
ఈ రకపు విమర్శనా చట్రం వలన తెలుగు నాట ప్రకృతి, భక్తి, మానవసంబంధాలు, తాత్వికత, ప్రేమ, జీవనానుభూతులు, నాస్టాల్జియా లాంటి అనేక కవిత్వ పాయలు దాదాపు ఎండిపోయాయి. ఎందుకంటే అలాంటి కవిత్వాన్ని తెలుగువిమర్శకులు ద్వితీయశ్రేణి కవిత్వంగా ముద్రలు వేస్తున్నారు నేటికీ కూడా.
***
ఈ ధోరణి వల్ల మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కృష్ణశాస్త్రికి, ఇస్మాయిల్ కి, ఇంద్రగంటికి, గోదావరి శర్మకు, మధునాపంతుల కు దక్కాల్సిన స్థానాలు దక్కలేదు. సోమసుందర్ కి, అద్దేపల్లికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డులు రాకపోవటం కూడా కేంద్రీకృతమైన ఆనాటి రంగుటద్దాల సాహిత్యపీఠాధిపతుల వివక్షే కారణం. ఎందుకంటే వీరు కవిత్వానికి కవిత్వమే ప్రమాణమని వ్యాసంగం సాగించారు. వీరందరూ ప్రజల నాల్కలపై ఉండవచ్చు గాక. అవార్డులు కొలమానం కాకపోవచ్చు గాక, కానీ అవి అర్హులైనవారికి దక్కకపోవటం అన్యాయం అనే అనాలి.
ఇతర భారతీయ భాషలలో కానీ అంతర్జాతీయంగా కానీ అన్నిరకాల కవిత్వమూ విరివిగా వస్తున్నది. మరీముఖ్యంగా జీవనానుభవాల కవిత్వం. కవిత్వం ఒకటే ప్రామాణికం గా ఉంటోంది ప్రతీ చోటా, మన తెలుగునేలపై ఉన్నట్లు రంగుటద్దాలు లేవు.
కవిత్వంలో కవి తనదైన అనుభవాన్ని చెప్పాలి. ఎంగిలి సంఘటనలు కవిత్వానికి శోభనివ్వవు. ఇటీవల కరోనా సందర్భంగా రీపోస్ట్ చేసిన ఒక కవిత చూడండి. ఒక వైయక్తిక అనుభవాన్ని తాత్వికముక్తాయింపులోకి మార్చిన వైనం కనిపిస్తుంది.
What Issa Heard ---- by David Budbill
Two hundred years ago Issa heard the morning birds
singing sutras to this suffering world.
I heard them too, this morning, which must mean,
since we will always have a suffering world,
we must also always have a song.
***
సమాజంలో ఉన్న దోపిడి, దాని రూపాలను అర్ధం చేసుకోవటంలో ఇరవయ్యో శతాబ్దం గడచిపోయింది. ఇపుడు అధికారము అది సమాజంలో కలిగించే ప్రభావాలను అర్ధం చేసుకోవాల్సి ఉంది.
తొంభైలనుండీ మన జీవితాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి. సరళీకరణ ఆర్ధికవిధానాల తరువాత దోపిడీ దాని రూపం మార్చుకొంది. ప్రత్యక్ష దోపిడీకి బదులు పరోక్షదోపిడీ రాజ్యం ఏలుతుంది. ఒకప్పుడు పద్దెనిమిది గంటల పనిచేసే పరిస్థితులనుండి ఎనిమిది గంటల పనికాలాన్ని సాధించుకోవటం కొరకు కొన్ని వందల ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ రోజు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగో, లేక ఏదో షాపులో పనిచేసే వర్కరో రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయటానికి ఐచ్చికంగానే ముందుకు వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మానవజీవితం సంక్లిష్టభరితమైపోయింది. సంస్కృతి అనేది కేంద్రీకృత నిర్వహణతో పరిశ్రమ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి సమయంలోనే వ్యక్తి జీవితాన్ని, అతని జీవితానుభవాలలో ఉండే సంక్లిష్టతనూ, సుఖ,దుఃఖాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడుకూడా రాజకీయేతరమైన కవిత్వాన్ని రాయటం అనాగరికమని తీర్మానాలు చేయటం బాధ్యతా రాహిత్యమే కాదు సాహిత్య ద్రోహం కూడా.
కవి జీవితంలో రాజకీయాలు, సామాజిక స్పృహా ఒక భాగమే తప్ప అవే సర్వస్వం కావు. జీవనానుభవాలను ఆవిష్కరించే ఏ కవిత్వమైనా ఉత్తమమైనదే. అంతే తప్ప రాజకీయాలు కలిగి ఉన్నది మాత్రమే ఉత్తమ కవిత్వం అనటం సహేతుకం కాదు. కవిత్వం అనేది ఆల్ ఇంక్లూజివ్ గా ఉండాలి.
బొల్లోజు బాబా

మెకంజీసేకరించిన తూర్పుగోదావరి శాసనాలు

మెకంజీసేకరించిన తూర్పుగోదావరి శాసనాలను పరిశీలిస్తున్నప్పుడు చాలా చిత్రమైన చోట్లలో లభించిన శాసనాల వివరాలు అందులో కనిపించాయి. దేవాలయాల శాసనాలు సరే కొన్ని వందల ఆలయశాసనాల ప్రతులను తీసారు.
అవికాక గోదావరి గట్టున లభించినవి అంటూ కొన్ని, జైలు లోపల నేలపై పడి ఉన్నవి అంటూ మరికొన్ని, పేపర్లు సాపుచేసే రాయిమీద ఉన్న శాసనం అంటూ ఒకటి అనపర్తి ఊరి మధ్యలో పాతుకుపోయిన శాసనమూ అంటూ మరొకటి ఇలా అనేక శాసనాల పాఠాలు కనిపించాయి.
పాపం మెకంజీ అనుచరులు శాసనాల కొరకు అప్పట్లో నేలను దాదాపు జల్లెడ పట్టారని అర్ధమైంది.
అలా రాజమండ్రి సివిల్ జడ్జి గారైన శ్రీ ఆసిస్క్యూ దొరగారి ఇంటి గుమ్మంలోపల ఉత్తరం వైపున పాతి ఉన్న శాసనమట ఇది.
గణపతిదేవుడు క్రీశ 1247 లో వేయించిన శాసనం ఇది.
ఇందులో గణపతి దేవరాజులు తమ "జలరు" మహాదేవరాజు పేరున గజ్జరాన (రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామం గజ్జరం) ఒక విగ్రహప్రతిష్టగావించినట్లు, ఆ ఆలయ అంగరంగ భోగాల కొరకు అంగడి సుంకాలలో మార్పులు తెచ్చి నట్లు అర్ధమౌతుంది. (ఆలయ నూనె ఖర్చులకొరకు GST స్లాబులేవో పెంచారన్నమాట)
ఇక్కడ "జలరు" అన్నమాటకు అర్ధం లభించలేదు. ఎవరైనా చెపితే తెలుసుకోవాలని ఉంది.
ఇకపోతే అలా వివిధ ప్రాంతాలలో ఉన్నాయని చెప్పబడిన శాసనాలు ఎక్కడైనా భద్రపరచారా లేక అలాగే నేలలోకప్పడిపోయాయో తెలియదు. ఒక వేళ నిజ శాసనాలు లేకపోతే అలా చెదురుమదురుగా పడిఉన్న కొన్ని వందల అలాంటి శాసనాలకు కైఫియత్తులే దిక్కు. ఇవి నేను గమనించినంత మేరకు ఆర్కియాలాజికల్ సర్వే పుస్తకాలలోకి ఎక్కినట్లు లేవు. ఆర్కియలాజికల్ శాసన సర్వేలు మొదలవ్వటానికి ఎనభైఏళ్ల క్రితం నాటివి మెకంజీ రికార్డులు.
(పై ఫొటో రాజమండ్రి గౌతమీ గ్రంధాలయంలో ఉన్న శిధిలావస్థకు చేరుకొన్న 500 పేజీల మెకంజీ వ్రాతప్రతి లోనిది)
బొల్లోజు బాబాNo photo description available.

ఇనుప ఎడ్లు


.
కాలిన్ మెకంజి సేకరణలలో 8076 శాసనాలు ఉన్నట్లు వాటిని కేటలాగ్ చేసిన H H Wilson గుర్తించాడు. వీటిలో ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి సంబంధీంచిన 243 శాసనాలు కలవు. పదకొండవ శతాబ్దంనుంచి పదిహేనవ శతాబ్దాంతం వరకూ ఆనాటి రాజులు, అధికారులు, వ్యాపారులు, సామాన్యులు అనేకమంది ఈ ఆలయానికి విశేషమైన దానాలు సమర్పించుకొన్నారు. ఈ దానాలలో భీమేశ్వరునికి అఖండ దీపారాధన జరిపించటం కొరకు ఇచ్చిన పశువుల దానాలు అనేకం కలవు.
భీమేశ్వర ఆలయానికి సొంత కిలారము (పశువుల కొట్టాం) ఉండేది. పశువులను సాకటానికి అనేకమంది బోయ వాండ్రు ఉండేవారు. ఆలయానికి దానంగా ఇచ్చిన పశువులను ఈ బోయవాండ్రు మేపటం; ఆలయ పూజాదికాలకు అవసరమైన దీపారాధనకొరకు నేయి, అభిషేకాలకొరకు పాలను అందించటం వీరి పని. అనేక శాసనాలలో పశువులను ఈ బోయలకు అప్పగించినట్లు ఉంది. (శా.నం. 1156 of South Indian Inscriptions, Vol IV). ఇక్కడ బోయ అన్నది బహుసా యాదవులయి ఉండవచ్చు. క్రీశ. 1259 నాటి ఒక శాసనములో దేవనబోయ అనే పేరుగలిన వ్యక్తి, కులనిధి గోపాన్వయుడు (యాదవకులస్థుడు) గా చెప్పబడ్డాడు (శా.నం 1370).
ఈ రకపు దానములలో “ఇనుప ఎడ్లు” పేరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది ఆలయంలో నిత్య దీపారాధన జరిపించటానికి ఇచ్చిన దానమని, “పాలు ఇచ్చే పశువులు” అనే అర్ధంలో “ఇనపఎడ్లు” అనే పదం వాడబడిందని అర్ధమౌతుంది. ఎడ్లు కి నైఘంటికార్ధం ఎద్దులు, ఆవులు లేక గొర్రెలు (తెలుగు వ్యుత్పత్తి కోశం 1978 – ఆంధ్రభారతి). ఎడ్లు అంటే అంటే ఎద్దులు అనే అర్ధమే జనసామాన్యంలో స్థిరపడింది. “ఇనుప ఎడ్లు” పదం వాడిక నేడు వింతగా అనిపిస్తుంది.
***
ద్రాక్షారామ భీమేశ్వరునికి అఖండదీపారాధన, అభిషేకాలకొరకు సమర్పించుకొన్న వివిధరకాల పశువుల సంఖ్య వివిధ శతాబ్దాలలో ఒక్కో విధంగా ఉంది. 11 వ శతాబ్దంలో వేయి పశువులను దానం ఇవ్వగా, ఇది 12 వ శతాబ్దంలో ఈ 9470 గాను(వెలనాటి చోళుల పాలన) , 13 వ శతాబ్దానికి ఇది 1105 గానూ ఉండటం గమనార్హం. 14, 15 శతాబ్దాలకు సంబంధించి దానం చేయబడిన పశువుల సంఖ్య 50 మరియు 221 కావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తరువాతి శతాబ్దాలలో అలాంటి దానాలకు సంబంధించిన వివరాలు లేవు. ఈ మార్పులు ఆనాటి పాలకుల రాజకీయ ప్రాధాన్యతలను లేదా ఒడిదుడుకులను సూచిస్తాయి.
ఆలయంలో స్థానికంగా కొంతమంది యాదవులు ఉంటూ ఈ పశువుల దానాలను స్వీకరించేవారు. వాటి నిర్వహణా బాధ్యతను మరొకరికి అప్పగించవలసి వచ్చినప్పుడు, స్థానిక యాదవులు హామీ ఇచ్చి ఆ పశువులను బయటవ్యక్తులకు అప్పగించినట్లు కొన్ని శాసనముల ద్వారా తెలుస్తున్నది.
***
క్రీశ. 1166 లో చోడమహాదేవి 10 కులోత్తుంగ మాడలతో 50 ఇనుప ఎడ్లను బహుకరించింది. అంటే ఒక మాడ (అర వరహా) అయిదు ఇనుపఎడ్లకు సమాన విలువ అని అర్ధమౌతుంది. (శా. నం. 1052)
ఇనుపఎడ్లు అనే పదం “ఆవు” పదానికి ప్రాకృత రూపం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే అదే సమయంలో ఆవులను మొదవులని (మొదవు=పాడియావు) పేర్కొంటూ ఉన్న కొన్ని శాసనాలు కలవు. 1158 నంబరు కలిగిన ఒక శాసనములో- ఒక్కెత్తు గండయ సోదరి అయిన మేడసాని అనే ఆమె ద్రాక్షారామ భీమేశ్వర దేవరకు అఖండ దీపారాధన నిమిత్తము 50 “మొదవులు” (ఆవులు) దానం ఇచ్చినట్లు ఉన్నది. అదే విధంగా మొదటి కులోత్తుంగుని పాలనాకాలంలో చేసిన ఒక శాసనములో, ఒక మణుగు నెయ్యిని (సుమారు 11 కేజీలు) ఇచ్చేలాగ 35 “సురభిలు” (ఆవులు) దానం ఇచ్చినట్లు తెలుస్తున్నది. (నం. 1288).
ఈ పదం నిఘంటువులో చెప్పిన విధంగా గొర్రెలు అనుకోవటానికి కూడా వీలుచిక్కదు, ఎందుకంటే కొన్ని శాసనాలలో గొర్రెలను “గొఱియలని” పేర్కొనటం జరిగింది. క్రీశ 1038 నాటి శాసనములో క్షేత్రపాలకుని సంధ్యదివ్వెల కొరకు ఒక మానిక (సుమారు లీటరు) నెయ్యి ఇచ్చేలాగ 50 గొఱియలు, అర మానిక నెయ్యి ఇచ్చేలాగ 25 గొఱియలు దానంగా ఇవ్వబడ్డాయి. (శా.నం 1014)
క్రీశ. 1084 లో వేసిన ఒక శాసనములో ఆలయములో ఉన్న కులోత్తుంగ సత్రమునకు ముప్పది పుట్ల భూమితో (ఒక గరిసె లేదా 60 ఎకరములు) పాటు 300 యెడ్లను కూడా దానం ఇచ్చినట్లు ఉంది. 300 ఎడ్లు అనేది చాలా పెద్ద సంఖ్య. ఇది అరవై ఎకరముల పంట భూమితో పాటు ఇస్తున్న దానం కనుక ఆ భూమిని సాగుచేయటానికి అవసరపడే ఎద్దులుని ఊహించాలి. ఆ నేలను సాగుచేయగా వచ్చిన ఫలధాన్యాలను సత్రంలో భోజనాదులకు వినియోగించేవారని అనుకోవాలి. (నం. 1015). దీనిని బట్టి “ఎడ్లు” అనే పదం వాడిక నేడు ఉన్నట్లుగానే అప్పట్లోకూడా ఉందనే భావించాలి.
***
28 మార్చ్, 2018 ఆంధ్రభూమి పత్రికలో “తెలుగు భాషకిదో ‘ప్రాకృతిక’ బాంధవ్యం” అనే వ్యాసంలో శ్రీ చీమకుర్తి శేషగిరి రావు “ఇనపఎడ్లు” అన్న పదానికి దేవర ఆంబోతులు/దేవరెద్దులు అన్న అర్ధం చెప్పారు. కానీ ఈ పదానికి ఆ అర్ధం అనుకూలించదు. ఎందుకంటే…
ఇనుపఎడ్ల సంఖ్య దాదాపు అన్ని శాసనాలలోను 25 నుంచి 50 వరకూ ఉండటాన్ని గమనించవచ్చు.
ఇనుప ఎడ్లకు “దేవర ఆంబోతు” అన్న అర్ధం తీసుకొన్నప్పుడు అంత పెద్ద సంఖ్యలలో ఆంబోతులను దానం చేయటం జరగదు. అప్పట్లో వ్యవసాయానికి ఎద్దుల అవసరం ఎక్కువ. కనుక ఒక ఊరికి రెండో మూడో దేవర ఆంబోతులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది తప్ప, ఇంత భారీ సంఖ్యలలో ఆంబోతులను ఇవ్వటానికి వీలుపడకపోవచ్చు.
అనేక శాసనాలలో భీమేశ్వరుని “దీపారాధన” కొరకు ఇనుపఎడ్లను దానం చేస్తున్నట్లు స్పష్టంగా ఉంది.
రెండవ గొంకరాజు వద్ద ప్రధాని, సమస్త సేనాధిపతిగా పనిచేసిన వాసనపెగ్గడ కూతురు గుండమ భీమేశ్వరునికి “అఖండదీప నిర్వహణ” కొరకు 50 ఇనపఎడ్లను దానం ఇచ్చినట్లు ఆమె వేయించిన శాసనంలో స్పష్టంగా ఉంది. (నం. 1089). ఈ అవసరం దృష్ట్యా ఇనుపఎడ్లు అన్న పదానికి ఆంబోతులు అన్న అర్ధం పొసగదు.
***
ఇనుప ఎడ్లు అంటే గేదెలా?
ఈ శాసనాలను పరిశీలించగా, ఇనుప ఎడ్లు అన్నపదానికి అర్ధం ఆంబోతులు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు కాదు అనే విషయం అర్ధం అవుతుంది. ఇవి కాకుండా పశువులలో పాలు ఇచ్చేటివి బర్రెలు మాత్రమే.
కనుక ద్రాక్షారామ శాసనాలలో ఇనపఎడ్ల పేరుతో పిలువబడిన పశువు బర్రెలు గా (గేదె) నిర్ధారణ చేయవచ్చును. శ్రీ కానూరి బదిరీనాథ్, ద్రాక్షారామ శాసనాలను తమ “తణుకు తళుకులు” అనే పుస్తకంలో ఉటంకిస్తూ “ఇనుప ఎడ్లు అనగా గేదెలు” అని అన్వయించారు. (పేనం 144). గేదెలు నల్లగా ఉంటాయి కనుక “ఇనుప” అన్న విశేషణం చేరి ఉండవచ్చు.
ఉపసంహారం
నేటి సమాజంలో దేవుని పూజకు ఆవు పాలు, ఆవు నెయ్యి తప్ప ఇతరజీవుల ఉత్పత్తులను వినియోగించరు. అదొక అపవిత్ర చర్యగా కూడా భావిస్తారు. కానీ సుమారు వెయ్యేళ్ల క్రితం గేదెల, గొర్రెల ఉత్పత్తులను దేవతార్చనకు వాడటం పట్ల ఏ రకమైన నిషేదం లేదని పై శాసనాల ద్వారా తెలుస్తుంది.
సమకాలీనంగా ఆవుకు ఎనలేని పవిత్రత ఉంది. గోమూత్రం ఒక సర్వరోగనివారిణిలాగ ప్రచారించటం కూడా చూస్తున్నాం. వెయ్యేళ్ళ క్రితంనాటి సమాజం గోవును ఇతరపశువులతో సమానంగా చూసింది తప్ప ఏ రకమైన ప్రత్యేకతను ఇచ్చినట్లు ద్రాక్షారామ ఆలయ శాసనాలలో కనిపించదు. పన్నెండో శతాబ్దపు మూడవ కులోత్తుంగచోళుడు ఆలయాలకు అనుసంధానంగా గోశాలలు ప్రారంభించాడు.
ఆధునిక కాలంలో గోరక్షణ అనేది మొదటి సారిగా 1870 లో పంజాబ్ లో గోరక్షణ ఉద్యమం ద్వారా, 1882 లో దయానంద సరస్వతి గోరక్షణ సభను స్థాపించటంద్వారా మొదలయ్యింది. Mother cow is in many ways better than the mother who gave us birth అన్న మహాత్మ గాంధీ మాటలు ఆశ్చర్యం కలిగించకమానవు. ఇది నాటినుంచి నేటివరకూ రాజకీయ ఏకీకరణ కొరకు ఉపయోగపడుతూందనే విషయాన్ని త్రోసిపుచ్చలేం. భారతదేశంలో జరిగిన చాలా మతకలహాలలో గోవధ అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక కారణమే. నేడు గోరక్షణ అనేది ఒక సామాజిక బాధ్యతగా పరిణమించింది. ఒక మత అస్తిత్వానికి చిహ్నంగా మారింది. మనిషిని చంపైనా సరే గోవును రక్షించాలనేంత దూరం వెళుతోంది.
.
వైదిక క్రతువులలో సాగించిన గోవధ నుండి క్రమక్రమంగా దేవతలకు బర్రెలను, గొర్రెలను బలులుగా ఇవ్వటం వరకూ హిందూ సమాజం సాగించిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఆవులతో సమాన హోదా కలిగిన బర్రెలు, గొర్రెలు కాలక్రమేణా పవిత్రతను పొందలేకపోవటమే హిందూదేశ చరిత్ర.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. Epigraphica Indica Vol 4
2. ద్రాక్షారామ శాసనాలు, మెకంజీ సేకరణ
3. వికిపీడియా
4. A Topographical List of the Inscriptions of the Madras Presidency, vol II

తెలుగు వికిపిడియాలో నా గురించి


వ్యాసం క్రింద ఇవ్వబడిన లింకులలో బొల్లోజు బాబా ముద్రిత, అముద్రిత రచనలను డౌన్ లోడ్ చేసుకొనవచ్చును

ముళ్లకంప లాంటి దుఃఖ కవిత్వం – ప్రభు “దుఃఖపు ఎరుక”


.
శ్రీ అద్దేపల్లి ప్రభు గారు కథకునిగా, కవిగా, వక్తగా అందరకూ తెలిసిన వ్యక్తి. ఇంతవరకూ ‘ఆవాహన’, ‘పారిపోలేం’ అనే రెండు కవిత్వసంపుటలను వెలువరించారు. జిల్లాలోని చారిత్రిక ప్రదేశాలను తిరిగినపుడు కలిగిన అనుభూతులను “పర్యావరణ ప్రయాణాలు” పేరుతో చిన్న బులిటన్ గా తీసుకువచ్చారు. ఇది ఇంతవరకూ కవిగా ప్రభు గారి కవిత్వ ప్రయాణం.
ఇటీవల విడుదల చేసిన కవిత్వ సంపుటి పేరు “దుఃఖపు ఎరుక’. చాలా గొప్ప శీర్షిక ఇది. మానవ దుఃఖాన్ని ఆవిష్కరించటం సాహిత్యం చేసే అతి ప్రధానమైన పని. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుస్తకాలలో మానవ దుఃఖమే ప్రధాన ఇతివృత్తంగా ఉండటం గమనించవచ్చు. దుఃఖపు ఎరుక అంటే దుఃఖం గురించిన జ్ఞానం.
ఏదిమనకు దుఃఖాన్ని కలిగిస్తుందో చాలా మంది గుర్తించలేరు.
ప్రముఖ అమెరికన్ కవి చార్లెస్ బుకొవ్ స్కి – రోజు తాగి వచ్చి తల్లిని చితకబాదే తండ్రి గురించి వ్రాసిన ఒక కవితలో ఇలా అంటాడు
మా నాన్న మాత్రం తన ఆరున్నర అడుగుల దేహంతో ఊగిపోతూ
మా అమ్మను, నన్నూ విపరీతంగా కొట్టేవాడు
ఎందుకంటే
ఎవరు అతన్ని లోపలనుంచి హింసిస్తున్నారో
అతనికి అర్ధమయ్యేది కాదు.
అతనిని ఏది హింసిస్తుందో లేక దుఃఖపెడుతుందో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఒక కవి లేదా తత్వవేత్తా ఈ దుఃఖాన్ని గుర్తిస్తాడు దానిగురించి విముక్తమవటానికి మార్గాలు అన్వేషిస్తాడు. దుఃఖ మూలాలు కొరకు తన లోపలా, తనకు వెలుపలా ఉండే ప్రపంచాలను అన్వేషిస్తాడు. తను పొందిన “దుఃఖపు ఎరుక” ఆధారంగా ఇదిగో ఇక్కడ నుంచి మానవ దుఃఖం ఊరుతుంది అని కొన్ని ప్రతిపాదనలను మన ముందుంచుతాడు. ఈ అన్వేషణ గమ్యం అందరికీ ఒక్కటే అవ్వాలని లేదు. ఒకనికి దుఃఖమూలాలు రాజకీయాలలోనో, నాగరికతలోనో కనిపించవచ్చు, మరొకనికి మానవసంబంధాలలో కనిపించవచ్చు, ఇంకొకరికి ఆర్ధికవ్యవస్థలో కనిపించవచ్చు లేదా భక్తిరాహిత్యంలో కనిపించవచ్చు. దుఃఖమూలాలు ఎక్కడ ఉన్నాయి అనే అన్వేషణ నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. ఎవరి అనుభవం వారిది, ఎవరి దుఃఖపు ఎరుక వానిదే.
నిజానికి దుఃఖాన్ని గుర్తించటం కష్టం
నవ్వే పెదాల వెనుక ముళ్లకంప లాంటి దుఃఖం
అలా గీరుతూనే ఉంటుంది -- (దుఃఖపు ఎరుక) – అంటూ ప్రభు దుఃఖ స్వరూపాన్ని కళ్ళకుకడుతున్నాడు.
“దుఃఖపు ఎరుక” పుస్తకంలో ప్రభు చాలా కవితలలో మానవ దుఃఖానికి కారణం పర్యావరణ విధ్వంసం అని చెపుతున్నాడు. అభివృద్ది పేరుతో ప్రకృతిని నాశనం చేయటం దుఃఖదాయకం అంటున్నాడు.
చెట్టంత మనిషి లేడు
డబ్బంత మనిషి
ప్రకృతిలో కాలుష్యంగా వ్యాపిస్తున్నాడు
చెప్పు ఈ వ్యయనామ సంవత్సరంలో
ఎన్ని కొండల్ని వ్యయం చేసి
ఎన్ని డబ్బుల కొండల్ని చేద్దాం
ఎన్ని నదుల్ని పొట్లాలు కట్టి
ఎన్ని రూపాయిల మూటలు కడదాం
ఎన్ని పిట్టలకు మందు పెట్టి
ఎన్ని కట్టలతో చిందులేద్దాం
ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది
అందుకు ప్రణమిల్లాలి
మనం ప్రకృతికి ఏమీ యివ్వలేదు
కనీసం రాబందుకొక కళేబరాన్ని కూడా -- (ఆదికి ముందు).
ప్రకృతిని కలుషితం చేయటం, కొండల్ని, నదుల్ని అమ్ముకొని సొమ్ముచేసుకోవటం ద్వారా ఆధునిక మనిషి చేస్తున్న విధ్వంసాన్ని కళ్ళకు కడుతున్నాడు. మనకు ఎన్నో ఇచ్చే ప్రకృతికి కనీసం ఒక కళేబరాన్ని కూడా ఇవ్వటం లేదు అనటం ద్వారా మొత్తం కవితావస్తువును పరాకాష్టకు తీసుకెళతాడు ప్రభు. మనిషి చేస్తున్న వినాశక చర్యలవల్ల ఈ రోజు రాబందులు ఎండేంజర్డ్ కేటగిరీలోకి చేరాయి.
ఓ పదేళ్ళ క్రితం కోస్తా కారిడార్ పేరిట తీరప్రాంతంలో పారిశ్రామిక జోన్ ను ఏర్పాటు చేసారు. దీనివల్ల పచ్చని ప్రకృతి నాశనం అవుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోంచి వ్రాసిన కారిడార్ అనే కవిత కోస్తా కారిడార్ పేరిట భూములు లాక్కోవటం, కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు స్థాపించటాన్ని ప్రశ్నిస్తుంది.
అటు సముద్రానికీ
ఇటు కనుమలకీ మధ్య
ఉక్కపోత లాంటి సరళ రేఖ.
ఏ అలా పర్వతమోలె ఎగియదు
ఏ పర్వతమూ అలవోలె విరగదు
మధ్య ఒక తాచుపాము విషం కక్కుతూ
మెలికలు తిరుగుతుంది. (కారిడార్).
రాబోతున్న విధ్వంసాన్ని, కాలుష్యాన్ని గుర్తించి వ్రాసిన అద్భుతమైన కవితా వాక్యాలివి. “ఉక్కపోతలాంటి సరళ రేఖ” అన్న మాటలో సరళ రేఖ కోస్తా కారిడార్ భౌగోళిక స్వరూపాన్ని చెపుతుంది. ఉక్కపోత అది కలగచేసే మానవ దుఃఖాన్ని వ్యక్తీకరిస్తుంది. అతి తక్కువ పదాల్లో గంభీరమైన భావం ఇది. అదే సమయంలో ప్రజలలోని నిర్లిప్తతని – తరువాత పాదాలు చెపుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆరులైన్ల హైవే నిర్మాణం జరిగింది. ఆ హైవేని తాచుపాము విషం కక్కూతూ మెలికలు తిరిగుతుంది అంటున్నాడు.
విశాలమైన రోడ్లపట్ల ప్రభు తన వ్యతిరేకతను అనేక వాక్యాలుగా చాలాచోట్ల చెప్పాడు. నిజానికి ఒక్కోసారి ఇదేమిటీ రోడ్లే కదా మన అభివృద్ది సూచికలు వాటిని వద్దంటున్నాడేమిటా అని ఆశ్చర్యం కలుగుతుంది కూడా. కానీ ప్రభు దృష్టి వేరు. రోడ్లు అభివృద్ది సూచికలే కావొచ్చు కానీ ఆ రోడ్ల నిర్మాణం కొరకు మనిషి కొండల్ని, పంటపొలాల్ని, పెద్దపెద్ద వృక్షాలను నాశనం చేస్తున్నాడన్న విషయం స్పష్టంగా మనముందుంచుతాడు. ఈ రోడ్లకు ఇరువైపులా కేటిల్ గార్డ్ లు పెట్టి పశువులను నడవనివ్వరు. పక్కన చెట్లు ఉండవు కనుక ఏ పిట్టా గూడు కట్టుకోలేదు. ఇలా ఒక రోడ్డు చేస్తున్న విధ్వంశాన్ని దర్శించటమే గొప్ప పర్యావరణ ప్రేమ.
రోడ్డు కొండల్ని పేల్చుకుంటూ
నేలమీద పరుచుకుంటుంది//
హైటెక్ కర్మ నున్నటి తారు రోడ్డులా
అన్నం మీంచి దూసుకుపోతుంది//
ఈ రోడ్డు పక్కన చెట్లు మొలవ్వు
పైన పక్షి వాలదు//
కటిక చీకటిలో కూడా
కళ్ళు తెరచి పరుగులు తీసే ఈ రోడ్డు మీద
ఏ జంతువూ నడవదు//
ప్రభు కవిత్వంలో ఆనకట్టల పట్ల వ్యతిరేకత కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ రోజున పర్యావరణ వేత్తలు ఆనకట్టలు కట్టటం పర్యావరణ హితం కాదని చెపుతున్నారు.
వానలు పడ్డ ప్రతిసాలూ
రూపాయిలు కావాల్సిన నది
నీరై సముద్రంలోకి పోతుంది//
ఎక్కడో ఒక చోట దాని
పీక నొక్కి
నీళ్ళని కక్కించాలి
ఆనకట్టల వెనక
నోట్ల కట్టలతో
పొంగి పొర్లిపోవాలి//
అప్పుడు
ఎనిమిది రోడ్ల ప్లై వోవర్లు కట్టుకుని
పటం అక్కర్లేని ప్రపంచీకరణలో
ముఖం అక్కర్లేని మనుషుల్ని పుట్టించవచ్చు. (ఒక నది ఉండటం)
ఆనకట్టలు కట్టి సరిహద్దులు లేని విధంగా ప్రపంచీకరణ అయి, మానవత్వం లేని మనుషులను పుట్టించుకొందాం అంటాడు. ఈ కవితలో ఐరనీ ఉంది. అలాంటి అభివృద్దిలో ముఖంలేని మనుషులే ఉంటారు తప్ప ఇతర జీవరాశి ఉండదు అని సూచన ఉంది.
ఈ రోజు భూసేకరణ అనేది ఒక రాజకీయ క్రీడలా మారిపోయింది. ఉన్నపళంగా ఒక జివొ తెచ్చి తరతరాలుగా నివసిస్తున్న భూమినుంచి అక్కడ నివాసం ఉంటున్నవారిని తొలగించటం జరుగుతుంది. ఇందులో ఉన్న అమానవీయతను భూసేకరణ అనే కవితలో ఇలా పట్టుకొంటాడు ప్రభు.
కూర్చున్న చాపని కుదిపి
లాగేసినట్టు
నిలబడ్డ భూమిని చట్టం చేసి
చుట్టేశారు-
అమ్మకమూ కొనుగోలూ ఉండే
కొత్తగ్లోబులో
నిర్వాసితుడొకడు ప్రశ్నలా
లేచాడు//
నీటి అమ్మకాలూ ఎండిన పెదాలూ ఉండే
కొత్తగ్లోబులో
నిర్వాసితుడొకడు
రెక్కలు పగిలిన పిట్టలా
పడిపోయాడు
పోగుపడుతున్న మహా సంపద ముందు
తెగిపడిన బతుకు తలకోసం
తొక్కిసలాటలో దేవులాడుతున్నాడు
నిర్వాసితుడు (భూసేకరణ)
వస్తువును అలవోకగా కవిత్వం చేస్తారు ప్రభు. చాపని లాగేయడం, భూమిని చట్టం చేయటం, ప్రశ్నలా లేవటం, పగిలిన పిట్ట, బతుకు తల లాంటి వ్యక్తీకరణలు మామూలు వ్యక్తీకరణలు కావు. ఆ యా చర్యల్ని దృశ్యాలుగా నిలబెడతాయి. వాటివెనుక ఉద్వేగాలను శక్తివంతంగా ఆవిష్కరించి కలవరపెడతాయి. ఏ వెలుగులకీ ప్రస్థానం అని ఆలోచింపచేస్తాయి.
“The biggest fraud of History is Agriculture” యువల్ నోవా హరారి అనే రచయిత వ్రాసిన “సెపియన్స్” అనే పుస్తకంలోని ఒక చాప్టర్ పేరు.
ఆ పుస్తకంలోనుంచి కొన్ని వాక్యాలు ఇవి
“వ్యవసాయ విప్లవం మానవులకు ఎక్కువ ఆహారాన్ని అందించిన మాట నిజమే, కానీ అదనంగా దొరికిన ఆ ఆహారం వాళ్లు తినే పదార్ధాలలో మెరుగైన మార్పులు తీసుకురాలేదు. వాళ్ళకి ఎక్కువ విశ్రాంతిని అందించలేదు, పైగా దానివల్ల జనాభాలో విపరీతమైన పెరుగుదల, ధనవంతులను గారాబం చేసి పనికిమాలిన వాళ్ళుగా తయారుచేయటంలాంటివి జరిగాయి. సగటు అటవికుడికన్నా సగటు రైతు ఎక్కువ కష్టపడి పనిచేసేవాడు. దానికి మారుగా అతనికి తక్కువపోషకాలున్న ఆహారం దొరికేది. వ్యవసాయ విప్లవం చరిత్రలో అతిపెద్ద వంచన. // చెట్లు ఎక్కేందుకు, జింకల వెనుక పరిగెట్టేందుకు అనువైన శరీరం మానవునిది. నేలను చదునుచేయటం, నీళ్ళు మొయ్యటం లాంటి వ్యవసాయపనులు చేయవలసి వచ్చినపుడు మానవుల వెన్నెముక, మోకాళ్లు మెడలు దానికి మూల్యం చెల్లించి దెబ్బతిన్నాయి”
పై వాదనను అంగీకరిస్తే మనం ఈరోజు అభివృద్ది అనుకొంటున్నదంతా ఉత్త వంచనగా అంగీకరించకతప్పదు. ప్రభు చెపుతున్నదంతా దాని గురించే.
అభివృద్దిపేరుతో జరుగుతున్న విధ్వంసమే మానవ దుఃఖానికి హేతువు అన్న విషయంలో ప్రభు స్పష్టంగానే ఉన్నాడు. మరి ఈ దుఃఖం నుంచి విముక్తమవ్వాలంటే ఏం చేయాలో కూడా ఒక చోట చెపుతాడు.
పాల పిట్ట అనే కవితలో అందమైన ఆ పిట్ట సౌందర్యాన్ని, స్వేచ్ఛని వర్ణించి చివరలో ఇలా అంటాడు.
జ్ఞానం సబ్బుబుడగలా
ఉబ్బిన మనిషి
ప్రకృతి తక్కెడలో
ఈ పిట్టముందు తేలికయ్యాడా
బుడగ పగిలి విముక్తుడౌతాడు (పాల పిట్ట).
మనిషి జ్ఞానభారం నుంచి విముక్తుడై ప్రకృతి ముందు వినమృడై తలవంచిననాడే అతనికి విముక్తి అంటున్నాడు. ఈ అభివృద్ది పథంలో ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రయాణం చేసి ఇక వెనక్కు వెళ్లలేని స్థితికి చేరుకొన్నాకా ఈ మాటలు వింతగా తోచవచ్చు. కానీ ఇది మాత్రం వాస్తవమని అంగీకరించక తప్పదు.
***
ప్రభు కవిత్వంలో పర్యావరణ విధ్వంసం గురించే కాక మరో రెండు ప్రధానమైన ఇతివృత్తాలు కనిపిస్తాయి. అవి బౌద్ధం పట్ల ఆరాధన, ప్రకృతి సౌందర్యం పట్ల వివశత్వం.
ఇన్ని నాగరికతల్ని దాటి వచ్చాను
యింకా నీ నిమీలిత నేత్రాల
పారవశ్య రహస్యం తెలియనే లేదు (దుఃఖపడ్డం ఎలా నేర్చుకోవాలి) అంటాడు బుద్ధుడను ఉద్దేశించి.
బీహార్ లో బుద్ధుడు సంచరించిన ‘జేతవనం” అనే ప్రదేశాన్ని సందర్శించిన అనుభవాన్ని అద్బుతమైన కవితగా పోతపోస్తాడు ప్రభు.
పట్నం వంతెన మీద, వయా రంగంపేట, పాలపిట్ట, పట్నంలో పున్నాగ, పిచ్చుకల చెట్టు లాంటి కవితలలో ప్రకృతి సౌందర్యం పట్ల తనకు ఉన్న ప్రేమను మనోరంజకంగా ఆవిష్కరిస్తాడు.
ప్రభు మార్క్సిస్టు సిద్దాంతాన్ని నమ్మినవాడు. ఆ వాద ఛాయలు మనకు అమర, అనేక ఓటముల తరువాత, తూత్తుకుడి వేదాంతం లాంటి కవితలలో కనిపిస్తాయి.
***
ప్రభు కవిత్వం క్లుప్తంగా ఉంటూనే అనంతమైన భావాలను పొదువుకొని ఉంటుంది. అలా రాయటం చాలా కష్టం. కవిత్వాంశను మిస్ అవకుండా, వాక్యం వాచ్యం కాకుండ ద్వన్యాత్మకంగా చెప్పటానికి చాలా శక్తి కావాలి. అది ప్రభుకు పుష్కలంగా ఉంది.
ఉడుగ్గంజి కుండలాంటి చెరువు మీద
ఊరెల్తూ ఆగిన దోసిలి (వయా రంగం పేట)
వందలకొద్దీ పిచ్చుకలు చెట్టునిండా
పూసిన పువ్వుల్లా
రెక్కల్ని, తోకల్నీ అల్లాడిస్తూ
కూతల పరిమళాన్ని చుట్టూరా చల్లుతాయి (పిచ్చుకల చెట్టు)
ఈ నిముషం లక్షరూపాయిలు కావొచ్చు
ఎన్ని లక్షల రూపాయిలైనా ఒక్క నిముషం కాలేవు (ఈ వేళ ఒక్కపైసా కూడా సంపాదించలేదు)
ఇంతకీ వాళ్లు పాపం
కాలుష్యం వద్దు
బతకనివ్వండి చాలు అన్నారు (తూత్తుకుడి వేదాంతం)
నిజానికొక లైబ్రేరీ అంటూ లేదు మా నాన్నకి
వందలకొద్దీ పుస్తకాలు
కొమ్మలమీద వాలిన పక్షుల్లా ఉండేవి
జీవిత వృక్షానికి పూసిన పువ్వుల్లానూ ఉండేవి (నిజానికి….) -- లాంటి వాక్యాలు ప్రభుకవిత్వంలోని లోతుల్ని, సారాన్ని ఆవిష్కరిస్తాయి.
ప్రభు తాత్వికుడు. ఆలోచనాశీలి. ఏది దుఃఖహేతువు అంటూ అనాది సందేహాన్ని మోస్తున్న ఆధునిక అన్వేషకుడు. ఏ వస్తువును కథగా రాయాలో ఏ వస్తువును కవితగా చెప్పాలో రహస్యం తెలిసిన వాడు. దుఃఖపు ఎరుక పుస్తకం మంచి పఠనానుభవాన్ని కలిగిస్తుంది.
బొల్లోజు బాబా
(ఈ వ్యాసం ఈ నెల ప్రస్థానం పత్రికలో ప్రచురించబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు )

గుడి సానిలు


ఆరవ శతాబ్దం నుంచి పదిహేనో శతాబ్దం వరకూ ఆంధ్రప్రాంతంలో గుడిసానుల వ్యవస్థ ఉండేది. ఈ సాని అనే పదం స్వామిని అనే పదం నుంచి వచ్చింది. గుడిలో ఉంటూ నాట్యము, సంగీతము లాంటి కళలను ప్రదర్శించే స్త్రీలను సానులు, సాని సంప్రదాయమువారు, గుడిసానులు అని పిలిచేవారు. వంశపారంపర్యంగా నాట్యవృత్తిని కొనసాగిస్తున్న వారిని సాని సంప్రదాయమువారు అంటారు.
వీరు చిన్నతనం నుంచి సంగీత నాట్య విద్యలను నేర్చుకొని దేవుని సేవకు, ఆలయంలో ఇతర కైంకర్య పనులకు భక్తితో అంకితమైనవారు. ఆలయములలో జరిగే అంగరంగ భోగములను గుడిసానులే జరిపించేవారు. (అంగభోగము అంటే దేవతా విగ్రహములకు చేసే అలంకారాలు నివేదనలు. రంగభోగము అంటే గుడిని శుభ్రపరచి ముగ్గులతో అలంకరించటం). నాట్యము, గానము షోడశోపచారాలలో భాగం కనుక ఆ ఉపచారాలకొరకు గుడిసానుల వ్యవస్థ ఆవిర్భవించింది.
***
1. గుడిసానులు వ్యభిచారులు కాదు.
అప్పట్లో వేశ్యావృత్తి వ్యవస్థాగతమైన వేరే పరిశ్రమ. వేశ్యావృత్తిని సాగించే స్త్రీలను వేశ్య, వారాంగన, వెలయాలు లంజియ అనే పేర్లతో వ్యవహరించేవారు. ఈ వృత్తిని చేపట్టిన స్త్రీలు ఊరిలో వేశ్యావాటికల పేరుతో కేటాయించబడిన ప్రాంతాలలో ఉండేవారు. వేశ్యావృత్తిలో ఉన్న వారాంగన నెలలో రెండు రోజుల ఆదాయాన్ని పన్నుగా కట్టేది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజ్యాదాయంలో వేశ్యలు కట్టే పన్నులు పెద్దమొత్తమే.
హనుమకొండలోని వేయిస్తంభాల గుడి శాసనాలలో ఓరుగల్లులో ఉన్న అలాంటి వేశ్యావాటిక వర్ణన కలదు. ప్రతాపరుద్రచరిత్ర లో ఓరుగల్లులోని వేశ్యావాటిక వర్ణన కలదు. వేములవాడ భీమకవి వ్రాసిన ఒక చాటువులో కూడా ద్రాక్షారామంలోని వారాంగనల వర్ణన కనిపిస్తుంది.
ఈ గుడిసానులు, వారాంగన వ్యవస్థలు వేరువేరుగా ఉన్నట్లు అర్ధమౌతుంది.
***
శ్రీనాథుడు భీమేశ్వర ఆలయంలోని గుడిసానులను వర్ణించేటపుడు శృంగారరసం కాక భక్తిరసం పలికించాడు
– “వారంతా తమ అందంతో, చామరసేవలతో, అపురూపమైన నాట్యకౌశలంతో, గానమాధుర్యంతో ప్రతిసంధ్యలో, భోగసమయములలో భీమేశ్వరునిని రంజింపచేస్తున్నారని అంటాడు” .
మరోచోట– “చక్కని వెన్నెల కాయగా దక్షవాటికా వేదికల మీద కూర్చుండి బంగారు వీణలు మీటుతూ అప్సరసలు తీయనిమత్తుతో, మోదంతో, మిక్కిలి నేర్పుతో శివుని మీది పాటలు భువన మోహన విగ్రహుడైన బీమనాథుని గూర్చి పాడారు- అంటాడు శ్రీనాథుడు గొప్ప మైమరపుతో”.(5-103)
***
అప్పట్లో రాజవంశ కన్యలు, కులీనవర్గాల స్త్రీలు స్వచ్చందంగా వచ్చి ఆలయసేవకు అంకితమయ్యేవారు.
క్రీశ 1047 లో కుందరాజ తన సోదరి బిక్కబ్బరసి ని మల్లేశ్వరునికి అంకితమిచ్చాడు.
క్రీశ 1271 లో మంకిశెట్టి అనే వ్యక్తి తన ఇద్దరు మనుమరాండ్రను ఏలేశ్వరుని ముందు నాట్యం చేసే సానులుగా అంకితమిచ్చాడు.
అప్పటి సమాజంలోని రాజులు, ధనవంతులు తాము ఇష్టపడిన ఈ గుడిసానులను వివాహమాడటం కూడా జరిగేది. వెలనాటి గొంక III చందవోలు పాందీశ్వరాలయానికి చెందిన కామిదేవి అనే గుడిసానిని వివాహమాడాడు.
1225 లో వీరశేఖర వర్మ అనే వేనాడు రాజు ఉన్నికాల్త్రం అనే గుడిసానిని వివాహమాడాడు.
పాందీశ్వర ఆలయానికి చెందిన సొక్కమ, బయ్యాంబిక పేర్లు గల గుడిసానిలకు పుట్టిన కొడుకులు గొంక II వద్ద ఉన్నతపదవులలో పనిచేసారు.
***
3. గుడిసానులు ఆలయ ఉద్యోగులు
గుంటూరు జిల్లా కొప్పరం ఊరిలోని కోదండరామస్వామి ఆలయంలో క్రీశ 1114 లో వేసిన ఒక శాసనముద్వారా ఆలయం గుడిసానులు చేసే పన్నెండు విధులను గుర్తించవచ్చు.
అవి వరుసగా నర్తకాచార్య (నట్టువాంగి), నర్తకి, నటీమణి (పాత్ర), గాయని, వేణువు, మృదంగము, శంఖము, నాదస్వరం ఊదుస్త్రీలు, వింజామర వీచే సాని, పరిచారిక, ఎరుకచెప్పే సాని. పై పనులన్నీ నాట్యము, సంగీతము లకు సంబంధించిన విద్యలు. ఆలయానికి వచ్చే భక్తులకు భవిష్యత్తు చెప్పటానికి ఎరుకచెప్పేసాని ఉండేదని అనుకోవచ్చు.
శ్రీకూర్మంలో 1250 నాటి ఒక శాసనములో గుడిసానులకు ఇచ్చే జీతభత్యాల వివరాలు ఉన్నాయి
సాని ఒక్కింటికి = ఏడాదికి 42 పుట్ల ధాన్యం (ఒకపుట్టి = ఇరవై కుంచాలు) ప్రతిరోజు రెండు తాంబూలాలు, మూడు అప్పాలు
నాట్యం నేర్పే సానికి = ఏడాదికి నాలుగు మాడలు, 4 కుంచాల ప్రసాదం, రోజు 1 తాంబూలం, నెలకు నాలుగు అప్పాలు.
వాద్యకారిణికి = ఏడాదికి మూడు మాడలు, రెండున్నరకుంచాల ప్రసాదం, రోజూ 1 తాంబూలం, నెలకు నాలుగు అప్పాలు
మృదంగ, శంఖం, బాకా వాయించే సానులకు ఒక్కింటికి ఏడాదికి రెండుకుంచాల ప్రసాదం, రోజు అర తాంబూలం. (?)
పైనచెప్పినవి వస్తురూపంలో కానీ సమానమైన ధనం రూపంలో కానీ ఆ సానులు పొందవచ్చు.
4. గుడిసానులు గౌరవ పాత్రులు
పదమూడవ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కో పోలో- గుడిసానిలు ప్రతీరోజు దేవునికి ప్రసాదాలు సమర్పించి ఆలయంలో నృత్యం చేస్తూ సంకీర్తనలు ఆలపిస్తారని వీరి గురించి ప్రస్తావించాడు.
మధ్యయుగాలలో ఈ గుడిసాని వ్యవస్థ కళలను పోషించింది. పవిత్రంగా ఉంది. స్వామినులుగా గుడిసానులు సమాజంలో గౌరవం పొందారు. వివాహాలు చేసుకొన్నారు. పిల్లల్ని కన్నారు. ఆలయానికి ఇచ్చిన వివిధ దానాలు అమలు అయ్యేలా చూసే అధికారం కలిగి ఉండేవారు.
కొన్ని శాసనాలలో కనిపించే జ్ఞానసాని, సూరసాని, దొడ్డసాని లాంటి పేర్లలో ఆయా వివాహితుల పేర్లకు చివర సాని అనే పదం స్వామిని (భార్య) అనే అర్ధంలో వాడబడిందని అర్ధం చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు
* వేమారెడ్డి తన తండ్రి కాటమరెడ్డి, తల్లి దొడ్డ“సాని” అమ్మకు శుభం జరగాలని పిఠాపురం కుంతీమాధవ ఆలయంలో క్రీశ. 1391 లో ఒక మండపము కట్టించినట్లు ఆలయ స్తంభంపై శాసనము కలదు. ఈ దొడ్డసాని రాజమాత.
* 1450 ప్రమోదూతనామసంవత్సరం శ్రావణమాసంలో శ్రీకుమారారామ భీమేశ్వర ఆలయంలో దక్షిణపు దిక్కున ఒక భక్తుడు తన తల్లి అన్నయసాని, తండ్రి భీమాభక్తుని పేరిట ఒక గుడి కట్టించి అనభీమలింగమును ప్రతిష్ట చేసాడు.
* 1424 క్రోధినామ సంవత్సరం, కార్తీకమాసమందు వేమారెడ్డి సేవకుడైన భక్తుని కూనయనెనిం తమ తల్లి మనుమసానికి పుణ్యముగాను తిరువళికంభము (దీపస్తంభము) నిర్మించి తిరువళికి చమురుకొరకు తొంభై గోవులను, స్వామివారికి పట్టువస్త్రాలను, కొంతభూమిని, నలభైఒక్క టంకాలను సమర్పణ చేసి ఆ విషయాన్ని దక్షిణ గోడకు శాసనము వ్రాయించాడు.
గుడిసానులకు సమాజంలో గౌరవం ఉండేది. భక్తులు ప్రత్యేకంగా గుడిసానులకొరకు బహుమతులు ఇచ్చేవారు. ఆంధ్రదేశంలో వివిధ ఆలయాలలోని సానులకు ఇచ్చిన దాన శాసనాలు మొత్తం 74 కలవు. వీరి ఆదాయం గణనీయంగా ఉండటంచే వీరు కూడా ఇతర భక్తులలా దేవుడికి అనేక మాన్యాలు, దానాలు సమర్పించుకొన్నట్లు వివిధ శాసనాలలో కన్పిస్తుంది.
1263 లో ద్రాక్షారామ భీమేశ్వరునికి వాససాని అనే మున్నూరు సాని ఒక గ్రామాన్ని దానం చేసింది. అదే విధంగా చందోలు, పాందీశ్వర గుడిసాని అయిన బానమామ్మ ద్రాక్షారామ భీమేశ్వరునికి దానాలు ఇచ్చింది.
తిరుపతిలో ఆలయంలోని తిరువెంకట మానిక్కం అనే గుడిసానికి పల్లకిపై రావటానికి అత్యుతరాయలు అనుమతినిచ్చాడు.
అచ్యుతరాయని కాలంలో తిరుమల గుడిసాని అయిన ముద్దుకుప్పయి తల్లి కుప్పసాని విశేషమైన పాండిత్యప్రతిభ కనబరచి "విద్వత్సభారాయరంజక" అనే బిరుదును పొందింది. తిరుపతి గుడి శాసనాలలో లింగసాని, హనుమసాని, తిప్పసాని, నాగసాని అనే గుడిసానుల పేర్లు కనిపిస్తాయి.
4. కోల్పోయిన ప్రాభవం
పంతొమ్మిదో శతాబ్దంనుండి గుడిసానులంటే వ్యభిచారులన్న అర్ధంలో వాడబడటానికి అన్యమత పాలనలలో హిందూ ఆలయాలకు ఆదరణ తగ్గటమే కారణం.
12 వ శతాబ్దంలో ద్రాక్షారామ ఆలయానికి దీపారాధన నెయ్యి, క్షీరాభిషేకాల కొరకు 9500 పశువులు దానంగా ఇవ్వగా, పదిహేనో శతాబ్దానికి వచ్చేసరికి ఈ సంఖ్య 250 మాత్రమే ఉండటాన్ని బట్టి రాజకీయకారణాలవల్ల ఆలయవ్యవస్థ ఏమేరకు ప్రభావితమైందో అర్ధమౌతుంది.
ఒకప్పటి సమాజానికి ఆర్ధికకేంద్రాలుగా ఉండిన దేవాలయాలు ఎప్పుడైతే పతనమయ్యాయో, అంతవరకూ దేవుని ఎదుటమాత్రమే నాట్యం, గానం చేస్తూ ఆలయాన్ని ఆశ్రయించుకొని ఉండిన గుడిసానిలు ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలు వెతుక్కొనే పనిలో పెళ్ళిళ్ళకు, విందులకు కూడా నాట్యం చేయటం ప్రారంభించారు. అది క్రమేణా గుడిసానులను ఉత్త “Dancing girls” స్థాయికి దిగజార్చింది.
మధ్యయుగానికి చెందిన గుడిసానులకు పంతొమ్మిదో శతాబ్దపు “Dancing girls” మధ్య వ్యత్యాసం తెలియని బ్రిటిష్ చరిత్రకారులు గుడిసానులంటే “Temple Prostitutes” గా జమకట్టారు. Abbé Dubois (1765 – 1848) లాంటి కొంతమంది మాత్రం Professional Prostitutes and Dancing girls అనే విభజనను గుర్తించారు.
జమిందారీ యుగంలో గుడిసానులకు, వేశ్యలకు మధ్య ఉండే సాంస్కృతిక విభజన చెరిగిపోయింది.
గుడిసాని వ్యవస్థకు చెందిన చివరితరపు ప్రతినిధిగా బెంగుళూరు నాగరత్నమ్మ- ముద్దుపళనిని కందుకూరి వీరేశలింగం వేశ్యగా సంబోధించటాన్ని తీవ్రంగా ఖండించింది. దేవదాసీల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడింది.
ఇరవయ్యోశతాబ్దం ప్రారంభంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ Anti Nautch ఉద్యమం ద్వారా పునరుజ్జీవనం పేరిట సాంప్రదాయ నృత్యం, సంగీతం, వేరే సామాజికవర్గాల చేతుల్లోకి పోతున్నాయని వీణా ధనమ్మాల్, నాగరత్నమ్మ, బాలసరస్వతి లాంటి వారు అప్పట్లో ఎలుగెత్తారు
4. ముగింపు
గుడిసానులు సంగీతం, నాట్య శాస్త్రాలను అభ్యసించి పోషించిన వర్గంగా చెప్పుకొంటున్నప్పుడు, నేటికీ దేశవ్యాప్తంగా గ్రామాలలో ఇంకా మనుగడలోనే ఉన్న మాతంగి, బసివిని, జోగిని లాంటి ఆచారాలగురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ ఆచారాలుకూడా ఆరోశతాబ్దం నుంచీ ఉన్నాయి. వీరు ఎక్కువగా శివాలయాలకు, గ్రామదేవతల ఆలయాలకు అనుబంధంగా ఉండే; దేవుడికిచ్చి పెళ్ళిచేయబడిన దళితబహుజన స్త్రీలు. ఒకప్పుడు వీరు నుదుట పెద్దబొట్టుపెట్టుకొని చేతిలో వెదురుకోల, గోపాలం(భిక్షాపాత్ర) తో గ్రామంలో ప్రజలను ఆశీర్వదిస్తూ వారు ఇచ్చినవి స్వీకరిస్తూ జీవించేవారు. ఊరిలో జరిగే శుభకార్యాలలో, ఉత్సవాలలో వీరికి అగ్రపీఠం ఉండేది. ఇది ఒకరకంగా Matriarchial సమాజపు అవశేషంగా బావించవచ్చు. వీరు గ్రామంలో ఆయా గుడుల పూజారిణిలుగా గౌరవం పొందారు.
క్రమక్రమంగా గుడిసానుల లాగే వీరుకూడా వేశ్యలుగా మార్చబడ్డారు. బాలికలను దేవుళ్ళకిచ్చి పెళ్ళి చేసే దేవదాసి వ్యవస్థను 1924 బ్రిటిష్ ప్రభుత్వం రద్దుచేసింది. ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం 1982 లో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసింది.
***
ఓ వెయ్యేళ్ళక్రితం ఏదో ఆలయంలో దేవదేవుని ఎదుట తన్మయత్వంతో గానం చేసిన ఎవరో ఓ గుడిసాని గాత్రమాధుర్యం ఎమ్మెస్ పాడిన సుప్రభాతంలో లీలగా నేటికీ తారాడుతుంది.
తమపూర్వీకులు నృత్యంచేసిన ఆలయానికి ఏడాదిలో ఒకరోజు వెళ్ళి దేవుని ఎదుట నృత్యంచేసి ఆ సంప్రదాయ పరంపరను భక్తితో కొనసాగించే వ్యక్తులు ఇంకా ఈ నేలపై ఉన్నారు.

బొల్లోజు బాబా

ఇలతో అల చేసిన సంభాషణ – మణిబాబు ‘నేనిలా… తానలా’ దీర్ఘకవిత


on:   on: 
Comments: 4 Comments
కొన్నికవితా వస్తువులు కవిజీవితంతో మమేకమైపోతాయి. వాటితో ఆ కవి సుదీర్ఘమైన ఆత్మైకప్రయాణం చేసి ఉంటాడు. ఆ వస్తువుతో కవికి ఉన్నఅనుభవాలతో అతని హృదయం నిండి పొంగిపొర్లుతూ ఉంటుంది. అలాంటి స్థితిని అనువదించటానికి ఓ పాతిక ముప్ఫై పాదాలు సరిపోవు. ఇలాంటినేపథ్యంలోఆ కవి తన ఉద్వేగాలను దీర్ఘకవితగా మలుస్తాడు. అదొక అనివార్యమైన వ్యక్తీకరణరూపం. తీసుకొన్నవస్తువును దాని భిన్నపార్శ్వాలతో కవిత్వీకరించి, తనదైన ఒక దృక్కోణాన్ని ఆ వస్తువుకు ఆపాదిస్తూ వ్రాసిన విస్త్రుతమైన రచననే ‘దీర్ఘకవిత’గా నిర్వచించుకోవచ్చును.
కవి, విమర్శకుడు అవధానుల మణిబాబు సముద్రంతో తనకున్న అనుబంధాన్ని ఒక దీర్ఘకవితగా మలచి ‘నేనిలా… తానలా’ పేరుతో ఇటీవల వెలువరించారు. దీర్ఘకవితను వ్రాసేటపుడు ప్రణాళిక అవసరం. లేనట్లయితే అతివిస్తరణ, శాఖాచక్రభ్రమణం కావ్యాత్మను పాడుచేస్తాయి. మణిబాబు ఈ దీర్ఘకవితను చక్కని ప్రణాళికతో నడిపించాడు.
ఈ దీర్ఘకవితను మూడు భాగాలుగా విభజించుకొంటే మొదటిభాగంలో తన బాల్యంనుండి సముద్రంతో తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాడు. రెండవభాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుంది. మూడవభాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణస్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది. నాస్టాల్జియా, సమకాలీనత, అన్యాపదేశంగా చెప్పిన హెచ్చరికా ఈ దీర్ఘకావ్యానికి సమగ్రతను తెచ్చిపెట్టాయి. దీర్ఘకవితలకు సమగ్రత ఆత్మవంటిది.
దండి “కావ్యాదర్శం”లో కావ్యానికి అష్టాదశవర్ణనలు ఉండాలంటాడు. “నేనిలా… తానలా” దీర్ఘకవితలో వివిధ సందర్భాలలోచేసిన – నగరం, సముద్రం, రుతువు, సూర్యోదయం, సలిలక్రీడ, విప్రలంభం, వివాహం, కుమారోదయం, దూత్యం, నాయకాభ్యుదయం అనే పదిరకాల వర్ణనలను పోల్చుకోవచ్చును. సముద్రాన్నివస్తువుగా స్వీకరించి రచనలుచేసిన శ్రీఅద్దేపల్లి, శ్రీగరికపాటి, శ్రీరామకృష్ణశ్రీవత్స, శ్రీగనారా వంటి తన “పూర్వకవుల/రచయితల ప్రస్తావన” చేయటం గమనించవచ్చు. ఇవికాక, ఆధునిక కావ్యలక్షణాలైన సామాజికచైతన్యం, పర్యావరణకాలుష్యం పట్ల వ్యాకులత, చారిత్రిక స్పృహలు అద్భుతంగా పలికాయి. వీటన్నింటినీ దృష్టిలోఉంచుకొన్నప్పుడు “నేనిలా… తానలా” దీర్ఘకవిత అటు సాంప్రదాయక, ఇటుఆధునికలక్షణాలను పొదువుకొన్న ఒక “మినికావ్యం”గా అనిపించకమానదు. .
***
“నేనిలా…తానలా” కావ్యంలో పైకి కవి తన ఎదుటగా ఉన్న సముద్రంతో చేసిన సంభాషణలా కనిపిస్తున్నప్పటికీ అది మానవజాతికి, ఆద్యంతరహితమైన సాగరానికి ఉన్న అనాది అనుబంధానికి అక్షరరూపం.
“ఎందుకు నీవంటే అపేక్ష” అని కవి సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా సమాధానం ఇచ్చిందట
వెర్రివాడా!
నువ్వునాసంక్షిప్తరూపానివి
నేనునీసమగ్ర స్వరూపాన్ని
నేనుఅర్ణవం
నువ్వుఅక్వేరియం.
నీభాషలో
త్వమేవాహం-అంతే.
మనిషి సముద్రానికి సంక్షిప్తరూపం అనటం నవ్యమైన ఊహ. పడిలేచే లేదా లేచిపడే కెరటాలు, బడబాగ్నులు, ఉప్పెనలు, నిర్జన ఒంటరితనాలు, నిగూఢతా, నిర్మలతా మనిషి లేదా మానవ జాతి లక్షణాలుకూడాను.
సముద్రఘోషను కవులు భిన్నసందర్భాలకు భిన్నరకాలుగా భాష్యంచెప్పి తమ ఊహలకు ఊతంగా, ఆయా సందర్భాలను ఉన్మీలనంచేసేలా వాడుకొన్నారు. ఈ దీర్ఘకవితలో “మేము తీరంపై రాసిన రాతల్ని, ముద్రల్ని ఎందుకు చెరిపేస్తావు నువ్వు” అనిసముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా బదులిచ్చిందట
చెరిపిపోవటం కాదు
వాటిని నాలో దాచుకోవటం
భాష తెలియక ఘోషనుకొంటారు గానీ
నాశబ్దాలన్నీమీరాతల కలవరింతలే
మీ ఆటల తలపోతలే. — ఇదొక నవ్యమైన ఊహ. సముద్రఘోష అనేది, సముద్రతీరంపై మనం రాసుకొన్న రాతలు, ఆడుకొన్న ఆటలే అనటం చక్కని సందర్భోచిత నిర్వచనం. చెప్పే విషయాలలో అన్వయసారళ్యత ఎంత తేటగాఉంటే ఆ కవిత అంత బిగిగా ఉంటుందనటానికి చక్కని ఉదాహరణ ఇది.
ధనుష్కోటిలో
తేలుతున్నరాయిని చూసి
ప్రత్యేకత రాయిదా? నీటిదా?
ఆలోచిస్తూ
కిటికీలోంచి చీకటిని చూస్తూ
నిదరోతున్న రైలులో
ఒక్కడినే మెలకువగా ఉన్నపుడు
“సాంద్రమైనదేదో వీడగలిగితే
తేలడం నీకైనాసాధ్యమే
బెండులా తేలిక కావాలంటే
గుండె మెత్తబరచుకో”
చెవిదగ్గరకొచ్చి చెప్పిపోయావు గుర్తుందా …! అంటూ సముద్రం తనతో చేసిన సంభాషణను తలపోసుకొంటాడు కవి ఒకచోట. హృదయ కాఠిన్యాన్నితొలగించుకొంటే తేలికపడతాం, మార్దవంగా మారతాం అనే ఒక గొప్ప ప్రాపంచిక సత్యాన్నిచెప్పటానికి “ధనుష్కోటిలో తేలుతున్నరాయి” అంటూ అంతే గొప్పసాదృశ్యాన్నితీసుకొన్నాడిక్కడ కవి. ప్రభోధాలను నేరుగా కాక పరోక్షంగా చెప్పటం సమకాలీన కవిత్వలక్షణం. అందుకే ఆ పాఠాన్ని వాచ్యంగా కాక ప్రతీకాత్మకంగా సముద్రం బోధపరచినట్లుగా చెపుతున్నాడు. చక్కటి శిల్పవ్యూహంఇది.
నువ్వో వ్యాపారకేంద్రం
రణరంగం
కార్యక్షేత్రం
విలాసస్థానం
ఏంకావాలోపట్టుకెళ్లడం వచ్చినవాడి సత్తా
చెంబుడు నీళ్లా
ఇన్నిగులకరాళ్ళా?
ఖనిజాలా? ఇంధనాలా?
మరోదేశంపైపెత్తనమా?//
నాడైనానేడైనా
నీటినినెగ్గినవాడే
నేలకురాజు — పైవాక్యాలలోకవి చారిత్రికదృష్టి ద్యోతకమౌతుంది. అవి చదివినపుడు అనేకానేక దృశ్యాలు మదిలో మెదులుతాయి. జలగండానికి భయపడి చెంబుడు నీళ్ళు తీసుకొని ఒడ్డునే పవిత్రస్నానం చేసే భక్తుడో; //గజ ఈతగాళ్ళు ముత్యాలను శోధిస్తూంటారు. ఓడల్లోవ్యాపారం జరుతూంటుంది. పిల్లగాండ్రు మాత్రం గులకరాళ్ళను సేకరించి మరలా విసిరేస్తూంటారు// అనే టాగూర్ వాక్యాలో; “ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయి” అంటూభారతదేశానికి బ్రిటిష్ వారి రాకను వర్ణించిన కొప్పర్తి వాక్యాలో; భవిష్యత్తులో నీటికొరకు యుద్ధాలు జరుగుతాయన్నహెచ్చరికలో గుర్తుకురాక మానవు. తక్కువఖర్చుతో లవణజలాల్ని త్రాగునీరుగా మార్చే ఆవిష్కరణకు నోబుల్ బహుమతి ఇవ్వటానికి ప్రపంచమిపుడు ఎదురుచూస్తోంది. “నీటిని నెగ్గినవాడే నేలకు రాజు” వాక్యాలు కవి చారిత్రిక అవగాహనకు, సమకాలీన వాస్తవాలకు, భవిష్యద్దర్శనానికి అద్దంపడతాయి.
కడుపులోప్లాస్టిక్ నింపుకున్న
షార్క్‌ల మృతదేహాలు
వలలనిండా జీవంలేని తాబేళ్ళు//
వేల అడుగుల క్రిందచేరిన
వ్యర్ధాలనుతొలగించేది ఎవరు?
సరిదిద్దుకోలేని నీకు
తప్పుచేసే హక్కెవరిచ్చారు? – అంటూ సముద్రం పలికిన మాటలు ఈమొత్తం దీర్ఘకావ్యానికి ఆయువుపట్టు. నేడు తెలుగులో పర్యావరణ విధ్వంసంపై వచ్చే కవిత్వం చాలా తక్కువ. దీర్ఘకవితలకు సంబంధించి కొల్లేరు విధ్వంసంపై ఎస్.ఆర్. భల్లం వ్రాసిన “కొల్లేరు” దీర్ఘకవిత, అంతరించిపోతున్న పక్షులపై అద్దేపల్లిప్రభు వ్రాసిన “పిట్టలేనిలోకం” ఈ సందర్భంలో ప్రస్తావించుకోదగినవి. మణిబాబు వ్రాసిన “నేనిలా…తానలా” దీర్ఘకావ్యంలో సింహభాగం సాగరకాలుష్యాన్ని దానివల్ల కలిగిన దుష్పరిణామాలను శక్తివంతంగా ఆవిష్కరించింది. కనుక ఈ దీర్ఘకావ్యాన్నిపర్యావరణకవిత్వంగా భావించవచ్చు.
ఆధునిక మానవుడు చేస్తున్నకాలుష్యంవలన మానవజాతి మనుగడ ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ వలన హిమశిఖరాలు కరిగి, సముద్రమట్టాలు పెరిగి, భూమి అంతా జలమయం అయ్యే అవకాసం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇదొక సాంకేతిక అంశం. ఇలాంటి వాటిని కవిత్వీకరించటం సులభం కాదు. ఈ అంశాన్నిఇలా అక్షరీకరిస్తాడీ కవి.
ఇదే కొనసాగితే
నానుండి విడివడిన భూమి
మళ్ళీ నాలోకలవడం
మరెంతో దూరంలోలేదు
అపుడు
వేదన వినిపించేందుకు
నాకు మనిషి దొరకడు
తలబాదుకొనేందుకు
ఒడ్డుమిగలదు. — ఒక ప్రాచీన మహాఖండం కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల నేడు ఉన్న భిన్న ఖండాలుగా విడిపోయిందని పాంజియా సిద్ధాంతం చెపుతుంది. ఆ సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా స్పృశిస్తున్నాడిక్కడ కవి. మానవులు ఇలాగే పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగించినట్లయితే నానుండి విడిపడిన భూమి నాలో కలిసిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇంతవరకూ వ్రాసి వదిలేస్తే అదేమంత గొప్పవిషయం కాబోదు. ఆ తరువాతి వాక్యాలే మణిబాబుని ఉత్తమకవి అని నిరూపిస్తాయి. జలప్రళయం జరిగాకా సముద్రం మాట్లాడుకోవటానికి మనిషి ఉండడట, ఒడ్డూ మిగలదట. ఈ మాటల్నిసముద్రంతో అనిపించటం లోతైన కల్పన. ఇక్కడ సముద్రాన్ని కవి ఎలా ఊహించుకొంటున్నాడు అని ఆలోచిస్తే- ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గురువు ఇంకా ఒక నైరూప్య అనంత స్వరూపునిగా భిన్నరూపాల్లో దర్శనమౌతుంది.
***
ఈ మొత్తం రచనను
ఇదంతా
నీలో దోసెడు నీళ్ళు తీసి
మరలా నీలోనే విడిచిపెట్టటం – అంటాడు కవి ఒకచోట. ఇది పైకి వినయంగా అనిపించినా త్వమేవాహం అని మొదట్లో అన్నమాటకు అందమైన ముక్తాయింపు. “నేనిలా…తానలా” అనే శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.
శ్రీ అవధానుల మణిబాబు కవిత్వంలో గహనమైన సిద్ధాంతాల చట్రాలుండవు. నిత్యం తనను జ్వలింపచేసే మానవానుభవాలకు తాత్త్విక పరిమళాలు అద్ది కవిత్వంగా మార్చటం ఇతని కవిత్వ రహస్యం. జీవితానుభవాలను గ్రహించటంలో- సున్నితత్వం, కరుణ, అమితమైనప్రేమ, హృదయ నైర్మల్యం ఇతని కవిత్వాన్ని హృద్యమైన అనుభవంలా మార్చుతాయి.
***
నేనిలా… తనలా…
(దీర్ఘకవిత)
రచన: అవధానుల మణిబాబు
పేజీలు: 60
వెల: 80 రూపాయలు
ప్రతులకు: అవధానుల మణిబాబు
#3-62, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర
సర్పవరం, కాకినాడ రూరల్, తూ. గో. జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 533005
ఫోన్ 9948179437

బంధన ఛాయ – నామాడి శ్రీధర్ (December 11, 2009 న పుస్తకం వెబ్ సైటులో వ్రాసిన సమీక్ష)

బంధన ఛాయ – నామాడి శ్రీధర్
(December 11, 2009 న పుస్తకం వెబ్ సైటులో వ్రాసిన సమీక్ష)
****
తూర్పు గోదావరి అంబాజీపేటకు చెందిన శ్రీధర్, విప్లవోద్యమాలు, సామాజికోద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. పాత్రికేయునిగా రాష్ట్ర రాజధానిలో కొంతకాలం ఉన్నారు. విప్లవ, కళా సాంస్కృతిక కేంద్రీకరణకు రోసి, తిరిగి తన స్వస్థలం చేరుకొని తనలోని “ఆకుపచ్చ లోయ” ని (మొదటి సంకలనం పేరు) కాపాడుకొన్నారు. — నరేష్ నున్నా, కవి సంపాదకుడు.
*****
కవిత్వాన్ని “గరగ” గా చేసి భక్తితో శిరసున ధరించిన కవి జీవితోత్సవ దారులలో నడుస్తూంటాడు, ఈ పుస్తకం పొడవునా. అతని కాలి మువ్వల కదలికలు చదువరి హృదయంలో శబ్దిస్తూంటాయి. అతని అడుగుల లయ పాఠకుని మనోవనంలో ఓ చైత్రగీతంలా వినిపిస్తూంటుంది. అతని నుంచి వచ్చే తేజస్సు చదువరి ఆకాశంపై నీలిమ తెరచాపై విచ్చుకొంటుంది.
ఆ కవి పేరు “నామాడి శ్రీధర్” – పుస్తకం పేరు “బంధన ఛాయ”.
చివరి పేజీ వరకూ పరుచుకొన్న కవిత్వ గాఢత మత్తెక్కించి వదుల్తుంది. “హృదయాన్ని బంధించిన ఛాయా జాలం” మాత్రం చేతిలో పుస్తక రూపంలో రెపరెపలాడుతూంటుంది.
ఈ సంపుటిలో మొత్తం 49 కవితలున్నాయి. ఆరు వివిధ కవుల అనువాదాలు.
కవిత్వానికి రాజకీయాలు, సిద్దాంతాలు అనవసరమని విశ్వసించిన ఇస్మాయిల్ గారి మార్గంలో ఈ కవి ప్రయాణిస్తున్నాడనిపిస్తుంది. పదాల పొహళింపు విషయంలో కృష్ణశాస్త్రిగారు జ్ఞప్తికొచ్చారు చాలా చోట్ల.
వస్తువు ఎంపిక, కవిత ఎత్తుగడ, నడక, క్లుప్తత, భావ గాంభీర్యతల వంటి విషయాలలో శ్రీ నామాడి శ్రీధర్ సంతకం ప్రతీ కవితలో స్పష్టంగా తెలుస్తూంటుంది.
జీవితోత్సవాల్ని గానం చేసే కవులు మనకు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో నామాడి శ్రీధర్ ను “ఎత్తుగా” నిలబెడుతుందీ “బంధన ఛాయ”.
పొటమరించే భావుకత ప్రతీ కవితలో పొంగి పొర్లతూ, అక్షరక్షరం నివ్వెరపరుస్తూ అద్బుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ కవితలలో నిరాశా ధోరణులుకానీ, వాస్తవాల్లోంచి ఊహల్లోకి “ఎస్కేప్” అవ్వటాలు కానీ కనిపించవు. ఈ కవికి జీవితంపైన, అది అందించే అందాలు అనుభవాలపైనా అపారమైన ప్రేమ, గౌరవం, విశ్వాసమూను. అందుకే ఒక చోట ఇలా అంటాడు.
బహుధా వందనీయ దివసాన్ని
అరచేతుల్లో పొదివిపట్టుకొని
పరవశంతో ముద్దుపెట్టుకొన్నాను
(కాన్క)
– ప్రకృతి చూపించే అనేక అందాల్ని అద్బుతమైన నైపుణ్యంతో ఒడిసిపట్టుకొన్నాడీ కవి కొన్ని కవితలలో.
“చంద్రరశ్మి అను శంఖ ధ్వని” అనే కవితలో చీకటి పడటాన్ని వర్ణిస్తూ…
మలిసంజ అలలమీంచి
నునులేత చీకటి
సరుగుడు తోటలో
అడుగిడుతోంది తొలుత.
పనిపాటల తల్లి పిల్లల చెంతకి
లేగదూడలు చెంగున పాల కడలికి
పిట్టలు చెట్టుకి
చెట్టు చైత్ర స్వప్నంలోకి
ఆదరవుతో చేరే
వ్యవధినిచ్చిన కాటుక
వడివడిగా అలముకొంటోంది
ఊరూ వాడా.
ఇక్కడ చైత్రస్వప్నం అనటంద్వారా భవిష్యత్తుపై ఆశనీ, కాటుక అలముకోవటం అనే ప్రతీకతో చీకటి పడటాన్ని సూచిస్తున్న ఈ కవి కల్పనాశక్తి ముచ్చటకొల్పుతుంది.
వ్యక్తులకో, వస్తువులకో, అనుభవాలకో ఇక శలవు అని చెప్పటం కొంతమందికి చాలా సులభంకావొచ్చు. కానీ అలాంటి సందర్భాలు కవులను వెంటాడి వేధిస్తాయి తమని కవిత్వీకరించమని. అలాంటి కొన్ని సందర్భాలకు ఈ కవి కల్పించిన కొన్ని అక్షర రూపాలు….
బహుకాల పక్షి గానం
ఎడబాయని చెట్టుకి ఆనుకొని
తమకంతో తలచుకొన్నాను నిన్ను.
చెల్లా చెదిరిపోయే జ్ఞాపకపుంజం
మృధులకాంతిలో నిదురపోలేదు. (ఛాయా స్పర్శ)
ఈ యవ్వనాంతంలోంచి
ఒక్కమాట మాత్రం విను
’అది ఉత్త రూపాకర్షణ కాదు,
ఇప్పటికీ తలచుకుంటాను నిన్ను
అసంపూర్ణ కవితలో సుడి తిరిగే ఆర్తిలాగ’
(అసంపూర్ణ కవిత)
గతించిన తల్లిగారిపై వ్రాసిన ఓ ఎలిజీ లో…
ప్రాణప్రదాయినీ
ఈ జన్మాంతర పెనుతుఫాను
అల్లకల్లోలంలో కనుగొనలేకున్నాను నిన్ను
—- అనటంలో అంతటి వియోగాన్ని స్వీకరించలేని మనోస్థితి చాలా ఆర్ధ్రంగా, సూటిగా ప్రతిబింబించింది. ఇదే వస్తువుపై (?) వ్రాసిన మరో కవిత అద్బుతమైన ఎత్తుగడతో మొదలవుతుంది ఇలా –
అఖిల ప్రపంచంతో ముక్తసరి సంభాషణ
ఒక్క నీ ఎదట మాత్రమే కబుర్ల పోగుని నేను
ఇక నీకు నాకు మాటల్లేక
దిన దినము పూడుకుపోయే గొంతుక
నీ ఎదుటమాత్రమే కబుర్ల పోగుగా ఉండే నాకు, నీవు లేకపోవటంతో నా గొంతుక పూర్తిగా మూసుకు పోతోంది క్రమక్రమంగా అనటంలో గొప్ప అవ్యాజమైన ప్రేమని, భరించలేని వియోగ తీవ్రతనీ, చైతన్యం నుంచి మౌనచీకట్లలోకి జారిపోతున్న హృదయాన్ని అంతే భావతీవ్రతతో ఆవిష్కరిస్తాడు కవి.
కవి ఎవరికీ జవాబుదారీ కాడు. కవిత్వం అంతకంటే కాదూ. అయినప్పటికీ తాను నడచివచ్చేసిన బాటని తడిమిచూసుకోవటం ఒక్కోసారి అనివార్యమౌతుంది. విప్లవమార్గాన్ని వీడి శుద్దకవిత్వదారులు తొక్కడం పట్ల కవి కున్న సంవేదనో/సంజాయిషీనో ఒక కవితలో ఇలా ప్రతిబింబించింది.
నవ యవ్వన
హృదంతరాళంలోంచి
ఉవ్విళ్లూరుతో ఉప్పొంగిన నినాదం
శుష్కవచనంగా అంతర్ధానమయింది……
(సంజాయిషీ పత్రం)
అద్బుతమైన పదచిత్రాలు ఈ కవితలను ప్రకాశింపచేస్తూంటాయి వశీకరించే సుగంధస్పర్శతో.
మృతపుష్పాల మాదిరి ఊహలు
ఊరక సంచరిస్తాయి
నదితో కలిసి
(అంతలో)
సెలయేటి ఒడిలో పడి కొట్టుకుపోయే
ఎండుకొమ్మల మీద ఏమి స్మరించేను
దూరదేశపు లకుముకి పిట్టల జంట (కలకూజితం)
కాళ రాత్రి నొక
నల్లమందు గుళికమల్లే
మింగిన కోకిల ఈ హృదయం
(పునర్గానం)
ఒక్కొక్క గుక్కతో
నల్ల ద్రాక్ష సాయింత్రం
మిగల పండిపోతోంది
నడి జాము రాత్రికి
ఆమెని ఒంటరి వేళ కమ్ముకొన్నాక
ఆదిమ దేహ వాంఛతో దేబరించి
మొర్రోమని శోకించే కుక్కన్నేను
— వంటి పదచిత్రాలెన్నో ఈ సంపుటి నిండా బంధన ఛాయలై అలముకొని ఉన్నాయి.
కవిత్వంలో విస్తరణ ఎంతైతే దోషమో అతిక్లుప్తత కూడా అంతే దోషం. దీనివల్ల కొన్ని సార్లు కవిత అస్పష్టతలోకి జారిపోతుంది. ఈ సంపుటిలో “మృగయ” అనే కవితలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. దాన్ని ఓ అధివాస్తవిక కవితగా సమర్ధించుకోవచ్చునుగాక, కానీ అనుభూతికి అడ్డంగా నిలిచేది కవిత్వమెలా అవుతుంది? అమూర్త భావనల దుబారా వల్ల కూడా అస్పష్టత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. చాలా చోట్ల వాక్యాలకు ఫుల్ స్టాపులు, కామాలు వాడకపోవటం కూడా ఒక టెక్నిక్ లానే అనిపిస్తోంది.
“నువ్వేనా” అన్న కవిత అత్యద్బుతంగా ఉంది. శరణార్ధ గాయకుడు, మనసులో మాట, అశాంతం-ఒకింత కుంకుమ, అనురక్తి వంటి కవితలలో కనిపించే ప్రేమ సౌందర్యం అబ్బురపరుస్తుంది.
కవితలోని భావాన్ని అంతే నర్మగర్భంగా చెపుతూంటాయి కవితాశీర్షికలు. వీటిపట్ల కవి శ్రద్ధ మెచ్చుకోదగినది.
గురు పూర్ణిమ రాత్రి
నైర్మల్య చంద్రుడిలా
అరచేతుల్లో వాలిన
కొత్త కవితల పుస్తకం
–అంటూ ఇస్మాయిల్ గారి కవిత్వం గురించి వర్ణించిన ఓ కవితలోని పై వాక్యాలు ఈ కవితా సంపుటికి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. నైర్మల్య చంద్రుడంటే ఇజాలు, రాజకీయాలు అంటని కవిత్వమని. నూత్నలోకాల సౌందర్యాల్ని మోసుకొచ్చే సీతాకోకచిలుకే అరచేతిల్లో వాలిన కొత్త కవితల పుస్తకమని భావించవచ్చు.
చక్కని చిక్కని కవిత్వాన్ని అభిమానించే వారికి, నామాడి శ్రీధర్ గారి “బంధన ఛాయ” తప్పక నచ్చుతుంది.
పుస్తకం వివరాలు:
బంధన ఛాయ
వెల:50/-
కాపీలకొరకు: నామాడి శ్రీధర్, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా, ఆం.ప్ర. 533214.
మెయిల్: sridhar_namadi@rediffmail.com