Tuesday, July 14, 2020

breach of contract


"ఐ కాన్ట్ బ్రీత్ ఆఫిసర్ ఐ కాన్ట్ బ్రీత్"
"నాకు తెలుసు నాకు తెలుసు
నువ్వు దొంగవు
నల్లగా ఉన్నావు కనుక నువ్వే దొంగవు
నాకు తెలుసు నాకు తెలుసు"
***
విధేయుడిగా ఉంటానని వాడు
రక్షిస్తానని నువ్వూ చేసుకొన్న
ఒప్పందం ఉల్లంఘించబడింది.
పాపం చివరి వరకూ
"ఐ కాన్ట్ బ్రీత్ ఆఫిసర్ ఐ కాన్ట్ బ్రీత్" అంటూ
విధేయుడై వేడుకొంటూనే ఉన్నాడు వాడు
***
"వాళ్ళు దొంగలన్న సంగతి
వాళ్ళే నిరూపించుకొంటున్నారు చూడండి
షాపులు దోచుకొంటూ
వస్తువుల్ని మోసుకొంటూ
వాళ్ళు దొంగలే.... వాళ్ళే దొంగలు
నల్లవాళ్ళందరూ దొంగలే" .... ఇంక ఆపు నీ వాచాలత్వం.
***
అది లూటింగ్ కాదు....
శతాబ్దాల చరిత్ర చేస్తున్న ప్రకటన
నువ్వు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతీసారీ
మేము కూడా ఉల్లంఘిస్తామని
వాళ్ళు ప్రకటిస్తున్నారు....
అందరి రక్తమూ ఒకటే కన్నీరని
చేసుకొన్న ఒప్పందం
గుర్తుందా?
బొల్లోజు బాబా

dedicate this translation to the Veteran Poet, activist who is in confinement. Bolloju Baba ***


రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు - మీనా కందసామి ( The End of Tomorrow)
ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు. నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం. ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం. ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.
ప్రముఖ కవయిత్రి, మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం.
అదీ ఈ కవితకు నేపథ్యం.
ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది. ఆ ‘నువ్వు’ లో ‘నేను’ లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే.
చివర్లో నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.
****
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు
.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు. నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు. పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. పిటిషన్ పై వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నీ చిట్టితల్లి UAPA అంటే ఏమిటో తెలుసుకొంటుంది. నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి, లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి. ఎవరూ మాట్లాడరు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు. ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నిన్ను హెచ్చరిస్తారు. నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు- కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు. నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు. మాట్లాడకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది. మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు
రేపు ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు. నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు. ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.
నిశ్శబ్దమా వర్ధిల్లు!
.
మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా
APRIL 21, 2016
Published in Saranga Magazine.

ఒక మిత్రుని వాల్ పై చేసిన కామెంటు


మంచి అంశం.
కులాన్ని మనం చారిత్రికంగా కూడా చూడాలి
1. రెండువేల సంవత్సరాల క్రితంనాటి గాథాసప్తశతిలో కులం ప్రస్తావన లేదు.
2. పన్నెండో శతాబ్దం వరకూ శూద్రులు చతుర్ధాన్వయులుగానే శాసనాలులో చెప్పబడ్డారు కులాలుగా కాదు.
3. కుల వ్యవస్థ అనేది ఒకప్పుడు ఒక ఇంటర్ లింక్డ్ వ్యవస్థగా ఉండేది. నిచ్చెనమెట్లలో క్రిందివాని అవసరం పైవారి కి తప్పని సరిగా ఉండేటట్లు సాంస్కృతికంగా ముడివేయబడ్డారు. అన్ని కులాల ఇండ్లలో (బ్రాహ్మణులతో సహా) శుభ, అశుభకార్యాలకు ఇతరకులస్థుల ప్రమేయం లేనిదే జరపించలేని ఒక వ్యవస్థ అది. అదంతా ఒక క్లోజ్ నెట్ వర్క్. ఒకరి అవసరం ఒకరికి పడే అతిచిన్న లోకం ఎక్కడికక్కడ. పారిశ్రామిక విప్లవంతో అది విచ్చిన్నమైంది మంచికో చెడుకో ఎవరూ చెప్పలేం. (హరారె సెపియన్ పుస్తకం)
4. ఇక నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉండే "ఆధిపత్యభావన" అనేది ఒక సార్వజనీన మానవలక్షణం/ఇన్ స్టింక్ట్. రకరకాల ప్రాంతాలలో, సందర్భాలలో రకరకాల పేర్లు. ఇది ప్రతిఒక్కరి మనుగడకూ చాలా సందర్భాలలో అవసరపడుతుంది. నేను వాడికన్నా తెలివైనవాడిననో, మర్యాదస్తుడననో, విశాలహృదయం కలిగినవాడిననో అనుకోకుండా ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేరు. ఆ వీక్ పాయింటుమీద ఆధారపడి పనిచేస్తుంది కులవ్యవస్థ. దీన్ని కొట్టటం అంత సులభం కాదు. ఆలోచనాక్రమంలోనే సమూలమైన మార్పు రావాలి.
5. ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి పీష్వాల పాలనలో జరిగిన క్రౌర్యాలను, కుల దాష్టీకాలను భారతదేశం అంతటా జరిగినట్లు చెప్పటం వల్ల చాలా నష్టం జరిగింది. అప్పటికి 60 శాతం భూభాగాన్నికలిగి ఉన్న బ్రిటిష్ ప్రాంతాలలో వివక్ష ఉండేది కానీ చెవుల్లో సీసాలు వేసేంత, ముంతలు, తాటాకులు కట్టేంత లేదు. (ఎవరైనా చెపితే సవరించుకోగలవాడను). బ్రిటిష్ ప్రాంతాలలో చట్టాలు బలంగా ఉండేవి. సమాన హక్కులను వాడుకొని చాలామంది నిమ్నవర్గీయులు వివక్షను తప్పించుకోలేకపోయినా ప్రతిభ ఆధారిత గౌరవాలను పొందారు.
6. నిజానికి హిందూ మతం చాలా తెలివైన మతం. అన్నింటిని తనలో కలుపుకోగలగటం దాని లక్షణం. ఒకప్పటి శాక్తేయం, కాపాలికం, సౌర, గాణాపత్య, పశుపతిఆరాధన, చార్వాక లాంటి శాఖలను తనలో కలిపేసుకొంది. బౌద్ధ, జైన సిక్కు సంప్రదాయాలను తన అనుయాయి శాఖలుగా మార్చుకొంది.
ఈ రోజు మనకళ్లముందే గ్రామదేవతలు, వనదేవతలు కూడా హైందవీకరణ చెందుతున్నారు క్రమక్రమంగా.... హిందూ మతం పరిణామ శీలత అది. ఇప్పటికే చూస్తున్నాం శ్రీరామ నవమికి మజ్జిగలు పంచిపెడుతున్న ముస్లిములు అంటూ, వెసులుబాట్లు ఎక్కడపోతాయో అని హిందూ పేర్లతో కొనసాగే క్రిష్టియన్లు అంటూ .... ఇదే ధోరణులు సాగితే కొంతకాలానికి వీరిని కూడా హిందూ మతం తనలో కలిపేసుకొని అల్లాని పదకొండో అవతారంగానూ, జీసస్ ని పన్నెండో అవతారం గానూ సముచిత స్థానం ఇచ్చినా ఇచ్చీగల్దు...... ఓ వెయ్యేళ్ళకు.... 

సప్తశతి గాథలలో మత ప్రస్తావనలు – పార్ట్ 2


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
***
.
మనసులో ఏదో ఉంచుకొని
తనవెనుకే పదే పదే తిరుగుతున్న మరిదికి
ఆ సుగుణవంతురాలైన ఇల్లాలు
గోడపై చిత్రించిన రామాయణ దృశ్యాలను చూపిస్తూ
రామ లక్ష్మణుల అనుబంధాన్ని ఒక రోజంతా భోదించింది. (135)
.
సప్తశతి కాలానికి రామాయణం ఇంకా మతగ్రంథ స్థాయికి చేరనప్పటికీ ఆ కావ్య సారాంసాన్ని గ్రామీణులు కూడా గ్రహించగలిగారని పైగాథ ద్వారా అర్ధమౌతుంది. గాథాసప్తశతి అనగానే జనబాహుళ్యంలో శృంగారరాతలనే అపప్రథ ఉంది. కొన్ని గాథలలో విచ్చలవిడి శృంగారేచ్ఛ ప్రకటించబడినప్పటికీ, చాలాగాథలు అలా ఉండవు.
పై గాథలో రామాయణంలోని రామలక్ష్మణుల అనుబంధాన్ని ఆదర్శంగా తీసుకొమ్మని, లక్ష్మణుడు సీతాదేవిల అనుబంధం ఎలాంటిదో మనమధ్య అనుబంధం కూడా అంతటి పవిత్రమైనదేనని ఒక వదిన మరిదికి చెప్పటం ఆనాటి కుటుంబ సంబంధాలను కళ్ళకు కడుతుంది.
వెసూవియస్ అగ్నిపర్వతం వల్ల ధ్వంశమైన పాంపే శిథిలాలలో ఆనాటి అనేక కుడ్య చిత్రాలు బయటపడ్డాయి. దాదాపు అదేకాలంలో ఇక్కడి ఇండ్లలోకూడా కుడ్యచిత్రాలు ఉండేవి అనే సంగతి పైగాథ ద్వారా అర్ధం చేసుకొనవచ్చును.
***
ప్రియమైన ఎనుబోతు చనిపోగా
దాని మెడను వేలాడిన గంటల పట్టీని
ఇంటికాపు చాన్నాళ్ళు దాచుకొని చివరకు
అజ్జ దేవళానికి సమర్పించుకొన్నాడు. (272)
.
సప్తశతి గాథలలో గౌరిదేవి, లక్ష్మిదేవి వర్ణణలు చాలా చోట్ల కనిపిస్తాయి. పై గాథలో “అజ్జ” దేవి (అజ్జా-ఘరే) ప్రస్తావించబడింది. అజ్జ దేవి దుర్గామాత సాత్విక రూపం. ఈ స్వరూపం సమస్త వృక్ష, జంతు జాతులను సంరక్షిస్తుందని ఒక విశ్వాసం. అజ్జ మాతను వనదేవతగా నేటికీ ఒరిస్సాలో పూజిస్తారు (ఆఫ్రికా వనదేవత పేరు కూడా Aja నే). పైగాథలో చెప్పబడిన అజ్జాదేవిని ఒక గ్రామదేవతగా ఊహించుకోవచ్చు.
గాథలు వ్రాసిన సమయానికి హైందవ సంప్రదాయాలు ఇంకా బలపడలేదు. భిన్న మతసంప్రదాయాలు పక్కపక్కనే సహజీవనం చేసాయి. గ్రామదేవతల సంప్రదాయం కూడా అప్పటినుంచే ఉన్నదనే విషయాన్ని పై గాథ నిరూపిస్తుంది. దేవతలకు చెందిన దేవాలయం గురించి ఈ ఒక్క గాథ మాత్రమే చెబుతుంది. అదికూడా ఒక వనదేవత ఆలయం కావటం విశేషం.
పై గాథలోని విషయానికి వివిధ వ్యాఖ్యానకారులు- అక్కడ చనిపోయింది భార్య అని ఆమె నగల్ని ఆ మగడు గుడిలో ఇచ్చేసాడని అంటూ ఒకరు; కొత్తభార్యకు పాతభార్య నగలు నచ్చనందుకు వాటిని గుడిలో ఇచ్చాసాడని మరొకరు - స్త్రీపురుష కోణంలోంచి చుస్తూ రకరకాల భాష్యాలు చెప్పారు. ఎందుకో పై గాథను అర్ధం చేసుకోవటానికి అత్యంత సరళమైన మానవోద్వేగాన్ని అన్ని ఒంకర్లు తిప్పక్కరలేదనిపిస్తుంది. My dog has died./I buried him in the garden/ Some day I'll join him right there// అనె Pablo Neruda కవితావాక్యం పలికిన ఉద్వేగం లాంటి స్వచ్చమైన ఉద్వేగమే పై గాథలో కూడా కనిపిస్తుంది.
***
చిలుకముక్కు ఆకారంలో ఉండే మోదుగపూలు
రాలి నేలంతా పరచుకొని
బుద్ధుని పాదాలవద్ద మోకరిల్లిన
బౌద్ధభిక్షుకుల సమూహంలా
పరిసరాలను ప్రకాశింపచేస్తున్నాయి (308)
.
సప్తశతి గాథలలో బుద్ధుని ప్రస్తావించే ఒకే ఒక గాథ ఇది. నిజానికి ఆనాటి సమాజంలో బౌద్ధమతం ఉచ్ఛస్థితిలో ఉన్నది. అయినప్పటికీ ఒకే ఒక గాథలో బుద్ధదేవుని ప్రస్తావన అదికూడా నేరుగా కాక పరోక్షంగా ఉండటం ఆశ్చర్యం కలిగించకమానదు.
మోదుగపూలు ఎర్రగా ఉంటాయి. వాటి ఆకారం చిలుకముక్కులా ఒంపుతిరిగి ఉంటుంది. బౌద్ధభిక్షుకులు కాషాయవస్త్రాలు ధరిస్తారు. ఒక భిక్షకుడు ఒంగొని తలనునేలకు ఆన్చి సాగిలపడినపుడు దూరంనించి చూస్తే చిలుకముక్కులా, ఎర్రని మోదుగుపువ్వులా అనిపించటం ఒక మామూలు దృశ్యం.
ఆ దృశ్యాన్ని ఒక పువ్వు చెట్టుకు చేసే వందనంగాను, వినమ్రత ఈ సమాజాన్ని ప్రకాశింపచేసే అంశంగాను చేసిన ఊహ ఆ గాథలోని అవాచ్య దర్శనం. (ఇంకా ఉంది)Image may contain: outdoor and food
బొల్లోజు బాబా

కరుణ కన్నా గొప్ప మహిమ లేదు!

సూఫీల గొడుగు నీడలో

తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం సమీపంలో ఉన్న కొత్తలంకలో హజరత్ సయ్యద్ అహ్మదలీషా ఖాదర్ వలీబాబా గారి దర్గాతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి కొన్ని సంగతులు పంచుకోవాలనుకొంటున్నాను.

 

అవి 1930ల నాటి రోజులు.

మా మాతామహుని పేరు దొంతాభక్తుని సోమలింగం. యానాంలో నివసించేవారు. వీరికి సంతానం లేదు. ఎన్నిపూజలు చేసినా ఫలించలేదు. “రేవు అవతల ఎవరో యోగీశ్వరుడు వచ్చారట, ఆయన అనేక మహిమలు చూపుతున్నారట. వారిని దర్శించుకొన్నవారికి అనుకొన్నవి జరుగుతున్నాయట” అంటూ వారూ వీరూ చెప్పుకొనే మాటలను నమ్మి “సరే చూద్దాం ఏంజరుగుతుందో” అనుకొని ఒక రోజు మా తాతగారు కొత్తలంక వెళ్ళారు.

కొబ్బరితోట మధ్యలో ఓ చెట్టునీడన దిగంబరంగా కూర్చొని, బక్కపలచని శరీరంతో ఒక సాధువు, ఆయన చుట్టూ పది పదిహేను మంది భక్తులు. అరటిపళ్ళు, తీపితినుబండారాలు ప్రసాదంగా సమర్పించుకొని ఒక్కొక్కరు ఆయనపాదాలను తాకి నమస్కరించుకొని వెళిపోతున్నారు. కొంతమందితో ఆ సాధువు మాట్లాడుతున్నారు. మరికొందరిని వెళ్ళిపొమ్మని సైగలు చేస్తున్నారు. తెచ్చిన ప్రసాదాలను అక్కడక్కడా తీసుకొని ఎంగిలిచేస్తున్నారు, మరికొందరివి వారికే ఇచ్చేస్తున్నారు.

మా తాతగారి వంతు వచ్చింది. అరటిపళ్ళు ఆయన ముందు ఉంచి పాదాలకు నమస్కరించి లేస్తుండగా “ఏరా బ్రహ్మం, నీకు సంతానం ఉందిలే…. ఆడసంతానం” అని పలికి తలతిప్పి మరో వైపుకు చూస్తూ ఉండిపోయారట.
ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు మా అమ్మ పుట్టింది. నెలల బిడ్డను తిరిగి బాబాగారి వద్దకు తీసుకు వెళ్ళారట మా తాతయ్య, అమ్మమ్మలు. ఎవరో తన ఒంటిపై కప్పిన శాలువాను బాబా గారు పొత్తిలిగా చేసి పసిగుడ్డుగా ఉన్న మా అమ్మను ఎత్తుకొన్నారట. సపోటా పండును వలిచి తొనలు నోటిలో పెడితే మా అమ్మ చప్పరించిందట. “ఏంపేరు పెట్టమంటారు బాబా” అని మా తాతగారు అడగ్గా ” అమ్మాజి అని పెట్టరా” అన్నారట. కప్పిన శాలువాను తిరిగి ఇచ్చేయబోతే పట్టుకొనిపొండి అని బాబాగారు సైగ చేసారట. ఆ తరువాత 1948 లో కొత్తలంక బాబాగారు స్వర్గస్తులైనారు. కొత్తలంకలో వారి సమాధి వద్ద దర్గా నిర్మించారు.
అలా మా అమ్మ పేరు అమ్మాజి. మా అమ్మకు తోబుట్టువులు లేరు. మా అమ్మ జీవితాంతం ఒక వైపు హిందువుగా అన్ని పూజలు, పండగలు, వ్రతాలూ ఆచరిస్తూనే, బాబాగారిని కూడా ఎంతో భక్తితో పూజించేది. అందరి దేవుడిపటాల సరసనా కొత్తలంక బాబాగారి ఫొటో కూడా ఉండేది. మేం ఆరుగురుం సంతానం. మా అన్నయ్యలు ముగ్గురికీ హిందూ పేర్లు పెట్టారు. నాకు మాత్రం మా అమ్మ పట్టు పట్టి కొత్తలంక బాబా గారి పేరు పెట్టించింది. నా పూర్తి పేరు బొల్లోజు అహ్మదలీబాబా. మా అందరికీ పుట్టువెంట్రుకలు కొత్తలంక దర్గావద్దే తీయించారు.
నాకు బాగా చిన్నప్పుడు కొత్తలంక వెళ్లాలంటే యానాంలో పడవకట్టించుకొని ముమ్మిడివరం రేవులో దిగి, అక్కడనుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలవగట్టుపై నడుచుకొంటూ వెళ్ళేవాళ్ళం.
***
బాబాగారు ఇచ్చిన శాలువాని ఒక చెక్క పెట్టెలో వెండిపళ్ళెంలో ఉంచి పూజించేది మా అమ్మ. మాకెవరికైనా జ్వరాలొచ్చినా, చదువులకనో, పనులమీదో పొరుగూర్లు వెళుతున్నప్పుడూ బాబాగారి శాలువాని తీసి మా తలపై ఉంచి అంతా మంచి జరగాలని ప్రార్ధించేది.

ఏడాదికి రెండు మూడు సార్లు రోజంతా ఉపవాసం ఉండి, ఆ శాలువాను బయటకు తీసి, దాని ఎదురుగా కొవ్వత్తులు, అగరొత్తులు వెలిగించి, సెంటు, గంధం పూసి “కొత్తలంక బాబా నిను కోరి భజింతును, నిను చేరి సేవింతును” అనే పాటను పాడుకొంటూ పూజచేసుకొనేది మా అమ్మ. అలాగని మా అమ్మ బేల కాదు. మాహె, కారైకాల్ లాంటి సుదూరప్రాంతాలకు బదిలీలకారణంగా మా నాన్నగారు దాదాపు పన్నిండేళ్ళ పాటు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, బంధువుల సాయం అర్ధించకుండా ఆరుగురుసంతానం ఉన్న కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. పాలు అమ్మి, కోళ్ళను పెంచి కోడిగుడ్లు అమ్మి, పెరట్లో కూరగాయలు పెంచి సంసారం నడిపి ఆర్ధిక ఇబ్బందులు తప్పించేది. ఆ లోపలిధైర్యమేదో బాబాగారి నుంచి పొందిందనుకొంటాను.
***
మా నాన్నగారి సంవత్సరీకాలు అయిపోయాకా “కొత్తలంక వెళ్ళాలని ఉంది నువ్వు తీసుకెళ్తావా” అని ఒకటి రెండు సార్లు అడిగింది నన్ను. అప్పటికి మా అమ్మ వయసు డబ్బై సంవత్సరాలు. అప్పట్లో నేను ఏలేశ్వరంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. పరీక్షల హడావిడి తగ్గాక వస్తానే అని చెప్పాను. ఆ తరువాత ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ గుండుతో ఉండటం చూసి ఆశ్చర్యపడి, ఎప్పుడు వెళ్లావే దర్గాకు అని అడిగితే, “ఏమోరా నేను ఇక వెళ్లగలనో లేదో అని- దర్గా ఉన్నదిక్కుకు తిరిగి జుత్తు బాబాగారికి అర్పించేసుకొన్నాను” అన్నది. ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మా అమ్మ కూడా గతించిపోయింది. ఇది జరిగి పదిహేనేళ్లయినా నా జీవితంలో మిగుల్చుకొన్న పెద్ద వెలితి అది ఏనాటికీ.

నేను పదో తరగతి నుంచి కొత్తలంక దర్గాకు సొంతంగా వెళ్లటం మొదలు పెట్టాను. పడవపై యానాం గోదావరి దాటి, ఎదుర్లంకలో బ్రాంచ్ సైకిల్ అద్దెకు తీసుకొని మురమళ్ళవరకూ తొక్కుకుంటూ వెళ్ళి అక్కడ దాన్ని ఇచ్చేసి నడుచుకొంటూ కొత్తలంక వెళ్ళేవాడిని అప్పట్లో.

నేడు మా ఇంట్లో అందరి దేవుళ్లపటాలతో పాటు కొత్తలంక బాబాగారి పటంకూడా ఉంటుంది. నేటికీ ఏటా రెండు మూడుసార్లు కొత్తలంక దర్గాను దర్శించుకొంటాను సకుటుంబంగా. రకరకాల చిక్కుముళ్ళలో చిక్కుకున్నప్పుడు, పెద్దపనులు ఏమైనా తలపెట్టినపుడు దర్గావద్దకు వెళ్ళి ప్రార్ధించుకొని రెండుమూడుగంటలు కూర్చొని వస్తూంటాం. మా పిల్లలిద్దరి పుట్టువెంట్రుకలు కొత్తలంక బాబాగారి దర్గా వద్ద తీయించాము. రెండో సారి కేశాలు తిరుపతిలో ఇచ్చాం.


నేను డిగ్రీ చదివేటపుడు ఏ కల్మషమూ లేని ఒక మిత్రుడు “ఒరేయ్ మీరు కొత్తలంక బాబాగారిని ఇంతగా ఆరాధిస్తారు. మా తాతగారిది కోనసీమే. ఆయన బాబాగారి సమకాలీనుడు. ఎప్పుడైనా బాబాగారు మా ఇంటి అరుగుమీద కూర్చుంటే వెళ్ళిపో ఇక్కడనుంచి అని విసుక్కొనేవారట ఆయన. ఒక వ్యక్తిని కొందరు దైవంలా పూజించటం, మరికొందరు తృణీకరించటం ఎందుకు జరుగుతుందీ?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం నావద్ద అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు.

చుట్టూ ఉన్న విశాలమైన గోదావరి కారణంగా కోనసీమ ప్రధానస్రవంతి చరిత్రకు కొంచెం ఎడంగానే ఉంది. అలాగని చరిత్రలేని సీమకాదు. అశోకుని పుత్రిక సంఘమిత్ర నిర్మింపచేసిన ఆదుర్రు బౌద్ధ క్షేత్రం ఘనమైన గతకీర్తికి చిహ్నం. షాజహాను ఆస్థానపండితుడైన జగన్నాధపండితరాయలు ఇక్కడివాడే. ఇతను షాజహాను కూతురు లవంగికను పెండ్లాడాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఎన్నోశతాబ్దాల క్రితం గోదావరిపై పడవలలో పెద్దమొత్తంలో ముస్లిం వ్యక్తులు వచ్చి ఇక్కడి ప్రజలలో కలిసిపోయి జీవించసాగారు అని చెపుతారు. లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకంలో ప్రధాన పాత్ర తన ముస్లిమ్ మిత్రుడిని సమాదరణతో చూస్తుంది. దళిత యోగిపుంగవుడైన ముమ్మిడివరం బాలయోగీశ్వరుని, కొత్తలంకబాబాగారిని పూజించినట్లుగానే కులమతాలకు అతీతంగా ఆనాటి కోనసీమ వాసులు ఆరాధించారు.

నా మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఒక్కటి మాత్రం చెప్పగలను. పశుపక్ష్యాదుల్ని సమాదరించటం, మనుషుల బాధల్ని తొలగించటం లాంటి విషయాలలో కొత్తలంక బాబా గారు చూపిన మహిమలను ఈ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటారు.

ఈ సృష్టిలోని జీవరాశి అంతా ఒకటేనని, సాటిమనిషి పట్ల కరుణ కలిగి ఉండాలి అనే మౌలిక జీవన సూత్రాలను కొత్తలంక బాబాగారు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అనుచరిస్తూ, వెళ్ళిపోతూ మనకు ఇచ్చిన దైవసందేశం అనుకొంటాను.

బొల్లోజు బాబా

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 4


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
సప్తశతీ గాథలు వ్రాయబడిన కాలంలో రాజ్యం అనేక రాష్ట్రాలు/ఆహార లుగా విభజింపబడి పాలన జరిగేది. ప్రతి రాష్ట్రానికి కొన్ని నిగమాలు (నగరాలు) వాటికి అనుబంధంగా అనేక గ్రామాలు ఉండేవి. ఈ రాష్ట్రాలను మహారధి, మహాభోజ పేర్లు కల సామంతులు పాలించేవారు. ఉత్పత్తిలో ఆరోభాగం రాజుకు కప్పంగా చెల్లించాలి. ఈ నిగమాలు, గ్రామాలలో అమాత్య పేరుగల అధికారులు ఉంటూ పర్యవేక్షణ చేసేవారు. గ్రామాలు, నిగమాలు అత్యంత క్రిందిస్థాయి పరిపాలనా విభాగాలు కనుక చాలామేరకు స్వతంత్రతను కలిగి ఉండేవి.
ఆర్యుల రాకతో నగరాలు అభివృద్ది చెందాయి. వ్యాపారాల విస్తరణ జరిగింది. అడవులను నరికి భూములను వ్యవసాయానికి అనుగుణంగా మార్చటంతో కొత్త కొత్త గ్రామాలు వృద్దినొందాయి. వ్యాపారాల నిమిత్తం ప్రజలు నిత్యం సంచరిస్తూ ఉండేవారు. అలా సంచరించే బాటసారుల, దేశాంతరాలు వెళ్ళే భర్తల గాథలు అనేకం కనిపిస్తాయి. గ్రామాలు ఇచ్చే సంపదతో నగరాలు బలపడి వ్యాపారాలను విస్తరించుకొన్నాయి. వివిధ వృత్తికారులు నైపుణ్యాలు పెంపొందించుకొని ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారుచేసారు. వాటిని వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేసేవారు.
***
సప్తశతి గాథలు ఆనాటి గ్రామీణ ప్రజల సాంఘిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. వ్యవసాయం ప్రధానవృత్తి. దీని ప్రస్తావన సుమారు ముప్పై గాథలలో ఉంది.
1. వ్యవసాయం
వరి, పత్తి, బార్లీ పంటలసాగు ఎక్కువగా జరిగేది. పంట కోసేవరకు రైతు దాన్ని సాకుతూ ఉండాలి. నీరుపెట్టటం, పక్షులను అదిలించటం, అడవి జంతువులనుండి పంటను కాపాడుకోవటం చెయ్యాలి. ఇంతచేస్తేకానీ పంట చేతికిరాదు. అతని భార్య ఈ పనులలో సహాయం చేసేది. తొలకరిలో నేలను మొదటిసారిగా దున్నుతున్నప్పుడు రైతు భార్య నాగలికి, బొట్లు పెట్టి పూజచేసినట్లు ఒక గాథలో ఉంది. ఇది నేటికీ నిలిచిఉన్న ఒక ఆచారం. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు. ఇంటిలో దొరకని ఏకాంతమేదో ఆనాటి రైతులకు పంటచేలవద్ద దొరికేదేమో! పొలంవద్ద జరిగే శృంగారవిషయాలు అనేక గాథలలో కనిపిస్తాయి.
***
ఇదే చోట్లో కొన్నాళ్ళలో ఆమెతో జరపబోయే శృంగారాన్ని
ఊహించుకొంటూ విత్తనాలు జల్లుతున్నాడా రైతు
చెమర్చిన చేతులకు అతుక్కున్న విత్తనాలు
జారిపడటం లేదు పాపం [358]
పై గాథలో ఒక రైతు విత్తనాలు జల్లే నాడే, మునుముందు తాను పొందబోయే ఆనందాల్ని తలచుకొని ఉద్రేకపడుతున్నాడు. చేతులు చెమర్చటం అనే క్రియ అనేక గాథలలో శృంగార ఉద్దీపనను సూచించేందుకు వాడబడింది. మరోగాథలో మధ్యాహ్నం భోజనం తీసుకొస్తున్న భార్యను చూడగానే, కంగారులో ఓ కొత్తరైతు ఎద్దుకి పలుపుతాడు బదులు ముక్కుతాడు విప్పేసినట్లు చెప్పబడింది. ఇలాంటి గాథలు ఉత్త చమత్కారమే కావొచ్చు కానీ వాటిలో రెండువేలేండ్లనాటి సమాజం, ఆనాటి ప్రజల రోజువారి జీవనము కనిపిస్తాయి.
***
పంటబోదిలో పాదాలను ఉంచి
నీటిని మళ్ళిస్తోంది కాపు వనిత.
నిశ్చలంగా ఉన్న ఆమె పాదాల చుట్టూ తుమ్మెదలు
తిరుగాడుతున్నాయి. (692)
ఇదొక అందమైన దృశ్యం. కొన్ని అత్యవసర సందర్భాలలో చేలో నీరు బయటకు పోకుండానో లేక లోపలకు రాకుండానో కాసేపు అడ్డుగా నిల్చుని నిలువరిస్తారు రైతులు. భర్త బోది మరమ్మత్తు చేస్తుండగా భార్య బోదిలో నిలబడి నీటిని మళ్ళిస్తున్న దృశ్యాన్ని ఊహించుకోవచ్చు పై గాథలో. ఆనాటి సమాజంలో సంపదఉత్పత్తిలో స్త్రీపురుషులు కలిసి పనిచేసారని అనుకోవచ్చుకూడా.
ఆమె పాదాలు కలువల వలె ఉన్నాయని ఎంతో రమ్యంగా, ధ్వన్యాత్మకంగా చెబుతుందీ గాథ.
***
వింద్యపర్వతాల అడవి వరిమొక్కలని విడిచిపెట్టి
గుప్పెడు కంకుల కొరకు వరిచేనులో పడే ఏనుగు
ఏనాటికైనా మందకు నాయకత్వం వహించగలదా? (788)
రైతులు తమ పంటలను అడవి జంతువులనుండి కాపాడుకోవటం నాటినుంచి నేటివరకూ జరుగుతున్నదే. నిజానికి నేడు చూస్తున్నంత వన్యప్రాణి ఆవాసాల ధ్వంసం ఆనాడు ఉండకపోవచ్చు. వింధ్య అడవిలో గ్రాసం పుష్కలంగా లభిస్తుండగా వరిచేలో కక్కుర్తి పడే ఖర్మ ఎందుకూ? అని ఈ గాథాకారుడు ఆశ్చర్యం ప్రకటిస్తున్నాడు. అల్పవిషయాలకు ప్రలోభపడితే అర్హమైన విషయాలకు దూరమౌతామనే సూచన పై గాథలో కనిపిస్తుంది.
***
నేను పొలం వెళ్ళను
చిలుకలు పంట తినేస్తే తినేయనీ
అక్కడ ఉంటే
దారిన పోయే ప్రతీ బాటసారీ
ఈ దారెటు పోతుందని అడుగుతున్నారు
వారికి తెలిసినప్పటికీ. [821]
ఒక చిన్నది ఇంట్లో అమ్మతో చెప్పుకొంటున్న ఒక పిర్యాదు కాబోలు ఇది. పంటపోతే పోనే అనటం అమాయకత్వం అనుకోవచ్చు, కానీ ఒక మగవాడు ఎందుకు మాటలు కలపాలనుకొంటున్నాడో అర్ధంకాకపోవటం స్వచ్ఛమైన ముగ్దత్వం.
అమ్మాయిలతో మాటలు కలపి మెల్లమెల్లగా ముగ్గులోకి దింపాలని యత్నించే వ్యక్తులుండటం ఒక పురాతన సలపరింత ఈ సమాజానికి.
***
ప్రియమైన భార్యగతించాకా
ఆమె లేక పాడుపడిన ఇంటికి వెళ్ళాలనిపించక
పనేం లేకపోయినా పొలం వద్దే ఉంటున్నాడా రైతు. (169)
ఇల్లాలు లేక ఇల్లుపాడుపడిందనటం ఒక ఉదాత్తమైన భావన. ఫలవంతంగా నడచిన అన్యోన్య దాంపత్యానికి సంకేతమది.
అప్పట్లో బహుభార్యత్వం ఉన్నట్లు అనేక గాథలలో చెప్పబడింది. బహుసా అది కులీనవర్గాలకు పరిమితమై ఉండొచ్చు. పై గాథలో ఆ రైతు ఇంటికి వెళ్ళలేకపోవటానికి చెపుతున్న కారణం ఒక నిర్మలమైన మానవోద్వేగం. కలయిక, వియోగం అనేవి ప్రేమ అనే నాణానికి రెండు పార్శ్వాలు. (ఇంకా ఉంది)
బొల్లోజు బాబా

culture of suspicion and fear


.
ఆఫీసులోకి ప్రవేశిస్తుంటే
కూర్చున్న ఒక్కొక్కరూ తమ మాస్కులను సర్దుకొన్నారు.
మిత్రుడొకరు కుర్చీ దూరంగా లాక్కొని కూర్చొని
"మా ఏరియాకూడా కంటైన్మెంట్ చేసారు తెలుసా" అన్నాడు
అతని ఫేస్ షీల్డ్ తెరపై
నా మొఖమే పొడుగ్గా సాగిపోయి కనిపిస్తోంది.
ఏది బింబం? ఏది ప్రతిబింబం?
***
ఇంటికొచ్చేటపుడు
కాసేపు ఆగి కబుర్లు చెప్పుకొనే ఓ షాపు
పద్నాలుగురోజులు దాటి నెలవుతున్నా
ఇంకాతీయలేదు.
పక్క షాపు షట్టర్ కి
"తాత్కాలికంగా మూసివేయటమైనది" బోర్డు వేలాడుతోంది.
ఏది తాత్కాలికం? ఏది శాశ్వతం?
***
పిట్టగోడకు తలాన్చి
సన్నగా పడుతోన్న వర్షాన్ని చూస్తున్నాను.
అంబులెన్స్ ఒకటి సైరన్ మోగించుకొంటూ
పక్కవీధిలో ఆగింది.
ఏడుపులు తుంపర్లు తుంపర్లుగా వినిపిస్తున్నాయి.
అంబులెన్స్ వెళిపోయింది వాన హోరు పెరిగింది
ఏది వాననీరు? ఏది కన్నీరు.
***
గొడుగు చేత ధరించిన ఓ వ్యక్తి
రెడ్ జోన్ బారికేడ్ల పైకెక్కిదూకి
వానలో పరిగెట్టుకొంటూ వెళిపోతున్నాడు ఎక్కడికో.
పిట్టగోడపై వాలిన పిచ్చుక
రెక్కల తడిని విదిలించుకొంటూంది
ఇటుకలమధ్యలోంచి ఫెర్న్ మొక్క మొలకెత్తుతోంది
ఏది భయం? ఏది అభయం?
.
బొల్లోజు బాబా

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 7


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
వివాహవ్యవస్థ
.
పరిణామక్రమంలో పురుషజీవికి తనసంతానం ఎవరో తెలుసుకోవాలనే కోర్కె వివాహవ్యవస్థకు బీజం వేసింది. ఈ క్రమంలో ఆనాటి సమాజం Polygamy, Polyandry లను తొలగించుకొంది. ధార్మికవిధులు నిర్వర్తించటం, సంతానం పొందటం సహజీవనానికి పరమార్ధాలుగా గుర్తించి monogamy ని ఎంచుకొంది. ఫలితంగా స్త్రీ అంతవరకూ మాతృస్వామిక సమాజంలో అనుభవించిన స్వేచ్ఛనుకోల్పోయింది. పురుషాధిక్య సమాజంలో పురుషుని సంరక్షణలో నిరంతరం అణిగి ఉండేలా స్మృతులు సరిహద్దులు ఏర్పరచాయి. సప్తశతి కాలం ఈ పరిణామదశను సాహిత్యంలో నిక్షిప్తం చేసింది. ఈ గాథలలో స్వేచ్ఛగా విహరించే స్త్రీలు, భర్తచాటు స్త్రీలు ఇద్దరూ ఉంటారు. అదే సమయంలో స్త్రీపురుషుల మధ్య తళుక్కుమనే అనాది మానవోద్వేగాల అద్భుత ఆవిష్కరణ జరిగింది.
.
బాల్యవివాహాలు అప్పట్లో లేవు; బహుభార్యత్వం ఉండేది. అత్తాకోడళ్ళ విరసాలు ఉన్నాయి. దూరదేశాలు వెళ్లిన భర్తకోసం ఎదురుచూసే ప్రోషితపతికలు ఉన్నారు; భర్త పరదేశంలో ఉన్నప్పుడు భార్య రోజులు లెక్కపెట్టుకొంటుంది. బక్క చిక్కిపోతుంది. అలాంటి కోడల్ని ఓదార్చే అత్తలున్నారు; దూరదేశమేగిన భర్తకు ఉత్తరం రాద్దామని కూర్చుంటే కన్నీళ్ళతో అక్షరాలు తడిచిపోతుంటాయి; భర్త ఊర్లోలేడు, అత్తపొరుగూరెళ్ళింది దొంగలభయం ఉంది అంటూ ఆహ్వానాన్ని నర్మగర్భంగా చెప్పే రసికమనోరమణులు ఉన్నారు; పొరుగింటావిడ భర్త లేనప్పుడు, ఆమె బాధలో పాలుపంచుకొని తానుకూడా పండగఅలంకరణ చేసుకోకుండా ఉంటుందో ఇల్లాలు; వానాకాలంలోపులో (వాగులు నదులు పొంగి దారులు మూసుకుపోతాయికనుక) ఇంటికి చేరాలని వడివడిగా అడుగులు వేసే భర్తలు ఉన్నారు; భర్త పేదవాడైనా, ముసలివాడైనా గుణాన్ని ప్రేమించే భార్యలున్నారు; భర్త ఆర్ధిక స్థితి ఎరిగిన ఒక భార్య శ్రీమంతం రోజున నీకేం కావాలి అని కోరినప్పుడు మంచినీళ్ళు కావాలి అని భర్తగౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తుందో ఇల్లాలు అమాయకంగా: తనతో శృంగారం చేస్తూ మరొక స్త్రీ పేరు ఉచ్ఛరించినపుడు దుఃఖపడిన ఇల్లాండ్రు ఉన్నారు, భర్త బాధచూడలేక స్వయంగా అన్యస్త్రీ ఇంటికి తీసుకు వెళ్ళే భార్యలూ ఉన్నారు; మగడు చనిపోయాకా సతీసహగమనం చేసే స్త్రీలు ఉన్నట్లుగానే, భార్యచనిపోయాక ఆ దుఃఖంతో విరాగి అయిన భర్తలూ ఉన్నారు. ఇన్నివైరుధ్యాలతో సప్తశతి గాథలలోని వివాహవ్యవస్థ చిత్రమైన స్వప్నలోకంగా అనిపించకమానదు. రకరకాల ఉద్వేగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
.
తామంతా పితృస్వామిక వ్యవస్థ అనే విషపుకోరలలో చిక్కుకొని బ్రతుకుతున్నామనే ఎరుక లేకుండానే వాళ్లంతా సుఖించి, దుఃఖించి, ఏడ్చుకొని, నవ్వుకొని, గొప్పగానో, బీదగానో జీవించేసారు. "మేమెలా జీవించామో చూడండి" అంటూ ఇన్నేళ్ల తరువాతకూడా మనకు కొన్ని జ్ఞాపకాల్ని మిగిల్చిపోయారు.
***
ముత్తైదువులు పెండ్లిపాటలు ఎత్తుకోగానే
పెండ్లికూతురి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి
పెండ్లికొడుకు పేరు తాముకూడా వినాలని కాబోలు. (644)
పై గాథలో పెండ్లికూతురు యుక్తవయసుకు చెందిన అమ్మాయి అని, ఆమెకు పెండ్లిరోజునాటికి కూడా భర్త పేరు తెలియదని, పెద్దలే అన్నీ చూసి పెళ్ళి నిశ్చయం చేసి ఉండవచ్చని అర్ధమౌతుంది. “తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి” అన్నట్లు పెండ్లికూతురు ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్ళిల్లు చేసే ఆనాటి సంప్రదాయం నిన్నమొన్నటి వరకూ కొనసాగింది.
***
.
నా పెండ్లి సమయంలో పలికిన
పవిత్ర మంగళాసీస్సులను విన్న
ఏటి ఒడ్డునవెదురుపొద ఇంకా ఊరి కుర్రకారు
లోలోపల నవ్వుకొన్నారేమోనని అనుమానంగా ఉంది. (645)
.
ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా ఆనందించారు, ఆ విషయాన్ని అందమైన గాథలలో అరమరికలు లేకుండా చెప్పుకొన్నారు. ముందుచెప్పుకొన్న గాథ ఒక అమాయకమైన పెండ్లికూతురు గురించయితే రెండో గాథలో ప్రేమ మధురిమల్ని అనుభవించిన వలపులాడి గురించి. బహుసా “కన్యా”దాన సమయమందు చెప్పే మంత్రాలేవో ఆ విలాసవతికి నవ్వుతెప్పించి ఉంటాయి.
వెదురు గుబుర్లు ప్రేయసీప్రియులు కలుసుకొనే సంకేత స్థలాలుగా ఉండేవని అనేక గాథలలో కనిపిస్తుంది. మరో గాథలో ఓ అభిసారిక తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్న ఒక సన్యాసితో “ ఓయీ! నిన్ను రోజూ భయపెట్టే కుక్కను ఈ రోజు సింహం వచ్చి తినేసింది, రేపటినుంచి నీవు ధైర్యంగా ఇక్కడ సంచరించవచ్చు” అంటుంది. అంటే నువ్వు కుక్కకే భయపడుతున్నావు ఇక్కడ సింహం సంచరిస్తుంది, ఇకపై ఇక్కడ తిరగకు అని ధ్వన్యాత్మకంగా చెప్పటం.
***
వీటన్నిటినీ మించి భార్యభర్తల అన్యోన్యత అనేక గాథలలో అందంగా చెప్పబడింది.
.
పాదాలు పట్టుకొని
బతిమాలుతున్న భర్త వీపునెక్కి
చిన్నకొడుకు తైతెక్కలాడుతుంటే
అంత కోపంలోనూ ఆమెకు నవ్వాగలేదు. (11)
పై గాథద్వారా ఎన్ని గొడవలు పడ్డా చివరకు భార్యాభర్తలు కలిసి సంసారాన్ని సుఖమయంచేసుకొన్నారని, హాయిగా జీవితాల్ని పండించుకొన్నారని తెలుస్తుంది.
***
సుదీర్ఘకాల సహజీవనం లో కష్టసుఖాలు పంచుకొని
ప్రేమ అర్ధాన్ని కనుగొన్నదంపతులలో
మొదటచనిపోయినవారు బ్రతికినట్లు
రెండవవ్యక్తి ఉన్నా చచ్చినట్లే. (142)
చాన్నాళ్ళు కలిసున్న దంపతులలో ఒకరు మరణిస్తే మరుకొరు చనిపోయిన వ్యక్తిని తన జ్ఞాపకాలలో నిత్యం బ్రతికించుకొంటూ క్షోభపడుతూండటం ఒక పాతవిలువ. దాన్ని వివాహబంధం అనేకన్నా విశాలమైన మానవీయవిలువల ఔన్నత్యంగా అనుకోవచ్చు.
(ఇంకా ఉంది)
బొల్లోజు బాబా
(పై గాథలు Poems on Life and Love in Ancient India, Translated from the Prakrit and Introduced by Peter Khoroche and Herman Tieken నుండి చేసినవ్యాసకర్త చేసిన స్వేచ్ఛానువాదాలు. బ్రాకట్స్ లో ఇచ్చినది గాథల సంఖ్య)

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 9


.
(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
.
గ్రామీణ వ్యవస్థ
ఓ వటరాజమా!
నీ దట్టమైన ఊడలమధ్య చీకటిని బంధించి ఉంచావు
ఊరి కావలిదారుడు ఎంత కఠినాత్ముడైనా
రసికులకు దిగులే లేదు. (656)
.
ఊరి మధ్యలో ఊడలతో విస్తరించి ఉండే మర్రిచెట్టు ప్రేమికులకు చక్కని సంకేత స్థలంగా ఉండేది. పై గాథ ద్వారా ఊరిని కాపలా కాసే కావలిదారుడు ఒకడు ఉండేవాడని తెలుస్తుంది.
ఈ గాథను రెండు విధాలుగా అర్ధం చేసుకొనవచ్చును. ఆ కావలి బహుసా స్వైరణిల వద్దనుండి పన్నులు వసూలు చేసే అధికారి కావొచ్చు ఎందుకంటే వ్యభిచారం అనేది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచీ రాజ్యానికి ఒక ఆదాయమార్గంగా ఉండేది లేదా విచ్చలవిడి శృంగారాన్ని నిరోధించటానికి ఆనాటి సమాజం ఏవో కొన్ని కట్టుబాట్లను ఏర్పరచి వాటిని అమలుచేయటానికి ఏర్పాటు చేసిన కావలి అధికారి కూడా కావొచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఆనాటి గ్రామాలను కావలి కాసే మనుషులుండేవారని పై గాథ తెలియచేస్తుంది.
***
.
ప్రభుత్వం తరపున శిక్షలను అమలుపరిచే తలారి ప్రస్తావన కొన్ని గాథలలో కనిపిస్తుంది. అప్పట్లో శిక్ష విధింపబడినవారిని డప్పులు వాయించుకొంటూ తీసుకువెళ్ళి ఉరితీయటమో లేక కొర్రువేయటమో చేసేవారు.
.
అతనితో సుఖించిన క్షణాలు గుర్తుకొచ్చి
నేడు ఈ వానాకాలపు తొలిమబ్బులు చేసే ఉరుములు
ఉరితీయడానికి ముందు మ్రోగించే
డప్పుల మోతలాగ అనిపిస్తున్నాయి (29)
.
పై గాథలో ఒక ప్రోషితపతిక దూరదేశమేగిన భర్తకొరకు ఎదురుచూస్తోంది. భర్త ఇంకా రాలేదు... వానాకాలం సమీపిస్తోంది. వానాకాలం వస్తే వాగులు వంకలు పొంగి రహదారులు మూసుకుపోయి మూడునాలుగు నెలలపాటు ఎక్కడివారు అక్కడే నిలిచిపోవలసి ఉంటుంది.
తొలిమబ్బులు చేసే ఉరుములు ఆ యువతికి చావుశబ్దాలుగా వినిపించటం వియోగంలోని విషాదానికి అద్భుత వ్యక్తీకరణ.
***
.
వానకు తడిచి కంచెపై కూర్చున్న కాకులు
మురికి ముఖాలతో, సత్తువకోల్పోయిన రెక్కలతో
వేలాడేసిన మెడలతో
కొర్రు వేసినట్టు కనిపిస్తున్నాయి (564)
.
రోజుల తరబడి కురిసే వానాకాలం పక్షులకు గడ్డుకాలం. పై గాథలో ఇంటినీడన ఉంటూ కంచెపై వాలిన కాకుల స్థితిని వర్ణిస్తున్నాడీ గాథాకారుడు.
ఈ గాథలో ఆసక్తికలిగించే ఒక చారిత్రిక సంగతి కొర్రు/కొరత వేయటం. నేరస్థులను ఇనుప మొన కలిగిన ఒక కర్రదూలంపై బంధించి కూర్చోపెట్టగా, దేహం బరువుకి అతను నెమ్మదినెమ్మదిగా క్రిందకి దిగుతూంటే, ఆ దూలం అతని పేగుల్ని చీల్చుకొని చాతీ నుంచో మెడ దగ్గరనుంచో వెలుపలకి వస్తుంది. అప్పటికింకా ఆ నేరస్థుడు పై గాథలో చెప్పినట్లు సత్తువుకోల్పోయిన చేతులతో, వేలాడేసిన మెడతో బ్రతికే ఉండొచ్చు కూడా. అలా కొర్రువేసిన వ్యక్తిని ఆ దూలంనుంచి దింపినవాళ్ళకి కూడా కొర్రుదండనం వేయమని చాణుక్యుని అర్ధశాస్త్రం చెపుతుంది.
బహుశా ఈ గాథాకారుడు కొర్రు వేసిన దృశ్యాన్నేదో చూసేఉంటాడు. ఒక భయానక బౌతిక దృశ్యాన్ని మరో ప్రకృతి దృశ్యానికి జతచేసిన కల్పన ఈ గాథలో కనిపిస్తుంది.
***
గ్రామానికి సంబంధించిన మరో ఉన్నత శ్రేణి వ్యక్తి వైద్యుడు. వైద్యుని ప్రస్తావన కొన్ని గాథలలో కనిపిస్తుంది.
.
తేలు కుట్టిందనే వంకతో
భర్త కళ్ళముందే ఆమెను
తెలివైన చెలులు ఎత్తుకొని తీసుకువెళ్ళి
వైద్యుడైన ప్రియుని ఇంటికి చేర్చారు. (237)
.
పై గాథలో శృంగారేచ్ఛకన్నా మానవసంబంధాలలోని 'గ్రే షేడ్స్ ' చిత్రణ ప్రతిభావంతంగా కనిపిస్తుంది. ఇలాంటి గాథలే తరువాతి కాలంలో స్త్రీల చుట్టూ ఆంక్షలు బిగుసుకు పోవటానికి దోహదపడి ఉంటాయి. (ఇంకా ఉంది)
బొల్లోజు బాబా

kavisandhya zoom meeting