Wednesday, April 13, 2016

"మహర్షి అంబేద్కర్" - శ్రీ గుర్రం ధర్మోజీ గారి పుస్తక పరిచయం

డా. బి.ఆర్.అంబేద్కర్ గారి 125 వ జయంతి సందర్భంగా ....
భారతదేశపు రాజకీయ చిత్రాన్ని, సామాజిక వ్యవస్థను ఒక జ్ఞాన సూర్యునిలా ప్రకాశింపచేసిన అజరామరుడు, ప్రాతఃస్మరణీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్. అలాంటి మహానుభావుని జీవితచరిత్రను "మహర్షి అంబేద్కర్" అనే పేరుతో గేయకావ్యాన్ని వెలువరించారు ప్రముఖ పద్యకవి శ్రీ గుర్రం ధర్మోజీ గారు.
శ్రీ గుర్రం ధర్మోజీ సంస్కృతాంధ్ర భాషలలో అనేక రచనలు చేసిన ప్రముఖ పద్యకవి. తెలుగులో అనేక ఉదాహరణ కావ్యాలు (ప్రత్యేకమైన చందోరీతి) రచించిన పండితుడు. "మహర్షి అంబేద్కర్" కావ్యంలో అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన 275 పద్యాలు ఉన్నాయి. ఇవి చక్కని నడకతో, మాత్రా చందస్సులో ఉంటూ అంబేద్కర్ మహాశయుని జీవితంలోని వివిధ అంశాలను గొప్పగా దృశ్యమానం చేస్తాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితచరిత్రను డా. బోయి భీమన్న, శ్రీ దాసి బసవయ్య, మొదలగు మహాత్తమ పండితులు మనకు వచనంలో అందించారు. ( శ్రీ గుర్రం ధర్మోజీ గారు కూడా ఇదివరలో సంస్కృత శ్లోకాలలో అంబేద్కర్ సుప్రభాతం రచించారు).
"మహర్షి అంబేద్కర్" రచన పాడటానికి లయబద్దంగా, సరళంగా గేయరూపంలో ఉంటుంది. గేయాల్లో కనిపించే చక్కని పదపొహళింపు, లయ, సందర్భోచితంగా పరిమళించే కవిత్వపు సుగంధాలు చకితుల్ని చేస్తాయి. పఠితులను ఆలోచింపచేసి చైతన్య పరుస్తాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ జననాన్ని చిన్న చిన్న పదాలతో వర్ణించే పద్యాలు ఇవి. వీటిలో అంబేద్కర్ ను భారతదేశ జ్ఞాన తిలకంగా, ఒక ఉదయించే సూర్యునిగా అభివర్ణించటం వారు జీవితపర్యంతం నెరపిన సేవకు, తగిన స్థానం కల్పించటంగా అర్ధం చేసుకోవాలి. చిక్కని చీకట్లు చీల్చటం అన్నప్రయోగం భావస్ఫోరకం.
విశాల భారతదేశపు
లలాట ఫలకస్థలాన
చలిత ప్రభాకలితము
జ్వలిత జ్ఞానతిలకము
బానిసత్వ బ్రతుకులందు
చిక్కని చీకట్లు చీల్చ
మహర్లందు మహర్షిగా
అంబేద్కర్ ఉదయించెను.
స్కూల్లో లెక్కల మాస్టారు ఇచ్చిన ఒక లెక్కకు విద్యార్ధులు జవాబు చెప్పలేనప్పుడు, తరగతి గది బయట ఉన్న అంబేద్కర్ దానికి సమాధానం ఇవ్వటానికి ముందుకొచ్చిన సందర్భంలో ధర్మోజీ గారు చెప్పిన ఈ పద్యం లోని పదాల నడక, పోతన 'అడిగెదనని కడువిడుజను' ... పద్యానికేమీ తీసిపోదు.
ఉత్త 'రా'కుమారులట్టులవారలు
ఉత్తరమీయకతత్తరపాటున
బిత్తరపోవుచునిస్సహాయులై
నిరుత్తరులౌచునిలుచుంటే (ఇది గేయ పద్యం, చందో బద్దం కాదు గమనించగలరు)
ఆతను అంటరానివాడు లోనికెట్లా వచ్చెదడని తోటి విద్యార్ధులు అభ్యంతరం పెట్టగా, బాల అంబేద్కర్ మనసులో చెలరేగిన ఆలోచనలు, తగిలిన గాయం ఎలా ఓ గేయంగా మారిందో చూడండి

నేనే? పాపం చేశాననుచు
చిన్నమనస్సునెన్నో ప్రశ్నలు
మెదడును తొలిచే పదునగుబాకులు
నెమ్మనమున ఉమ్మెత్తలగుత్తులు.
మొత్తం పద్యం బరువు అంతా పదునగుబాకులు, (తరువాతకాలంలో జాషువాగారిని గుచ్చిన బాకులే), ఉమ్మెత్తలగుత్తులు అన్న పదాల వద్ద ఉంది. ఆ బాకులు శరీరానికి తగిలినవి కాదు, మెదడుకి తగిలాయట. మనసున ఉమ్మెత్తలగుత్తులు మొలచాయట. ఎంత గొప్ప సందర్భోచిత ప్రయోగాలివి.
ఈ రోజు అసంఖ్యాక దళిత, బహుజన యువత అంబేద్కరిజం తమకు ఆదర్శమని ప్రకటించుకొంటున్నది. ఎందుకు అంటే కారణం ఈ చిన్ని పద్యంలో కనిపిస్తుంది
తనేకదా దళితులకు తలపు
తనేకదా పోరునకు పిలుపు
తనేకదా ఉద్యమపు గెలుపు
గుండెలలో సదా నిలుపు
దళితబహుజనేతరలకు కూడా అంబేద్కర్ ఆదర్శనీయుడే ఎందుకంటే ఈ రోజు ఆయన ఉపన్యాసాలను చదివితే, అంబేద్కర్ యొక్క రాజనీతిజ్ఞత, నిబద్దత, తర్కం, ముక్కుసూటిదనం, పోరాటపటిమ, సహనశీలత వంటి ఉదాత్త లక్షణాలెన్నో ఆశ్చర్యం కలిగించకమానవు. ఒక్క మనిషి ఇన్ని కోణాల్లో, అంతటి వ్యతిరేకతలో తన వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని ఎలా నిలుపుకోగలిగాడా, చివరివరకూ ఎలా కొనసాగించగలిగాడా అని ప్రస్తుతతరమే కాదు భావితరాలు కూడా చేతులుజోడించి నమస్కరించే మూర్తిమత్వం అంబేద్కర్ ది.
అలాంటి అంబేద్కర్ ఉపన్యాసం పై ధర్మోజీ గారు గొప్ప పద్యాలు వ్రాసారు
ఉపన్యాసమన ఉపన్యాసమా?
అంబేద్కరుని ఉపన్యాసము
అద్భుతమైన విన్యాసము
అచ్చెరువొందే ఉపన్యాసము
మాటలు కావవి మంటలు కాని
మాటలు కావవి ఈటెలు కాని
పదములు కావవి పదును కత్తులు
గాధకాదని బాధయెకాని
డా. బి.ఆర్. అంబేద్కర్ బాల్యము, అమెరికా లండన్ లలో ఆయన విద్యాభ్యాసము, మహద్ ఉదంతం, సైమన్ కమిషన్ ఎదుట వాదనలు, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాతినిధ్యం, బౌద్దమతస్వీకరణ, హిందూకోడ్ తిరస్కరణకు నిరసనగా రాజీనామా, రమాభాయి నిష్క్రమణ, రాజ్యాంగనిర్మాణం, మహాభినిష్క్రమణం వంటి అనేక అంశాలతో "మహర్షి అంబేద్కర్" పుస్తకం ఎంతో ఆసక్తికరంగా ఆ మహాశయుని సంపూర్ణ జీవితాన్ని మనకనుల ముందు నిలుపుతుంది.
డా. బి.ఆర్. అంబేద్కర్ 125 జయంతోత్సవాల సందర్భంగా వెలువరించిన ఈ పుస్తకం ఒక చక్కని స్మరణ, నివాళి.
ప్రతిఒక్కరు చదివి ప్రేరణనొంది, మరో పదిమందికి ఈ పుస్తకాన్ని బహూకరించి వారిలో కూడా ఉత్తేజాన్ని నింపాల్సిన సమయం ఇది.
శ్రీశ్రీ బుద్దమతావలంబసహితం, శ్రీభీమరాయం శుభం
శ్రీశ్రీ జ్ఞానవిధాన భాస్కరసమం శ్రీబాబసాహేబునం
శ్రీ సక్పాలసుతంనమామిసతతంసాంబేద్కరం భాసురం
భీమాబాయిసుతం సదా హితకరం శ్రీబుద్ద ధర్మాశ్రితం ..... అంటూ శ్రీ ధర్మోజి అంబేద్కర్ పై వ్రాసిన సంస్కృత శ్లోకంతో ఈ గేయసంపుటి మొదలై, మరో సంస్కృత మంగళాశాసనంతో ముగుస్తుంది.
*******
రచయిత గురించి
పేరు: గుర్రం ధర్మోజి
రచనలు: శ్రీ అంబేద్కర్ సుప్రభాతం (సంస్కృతం), శ్రీ భీమరాయ ప్రభాత గీతి (గేయం), శ్రీ భీమరాయ ఉదాహరణ కావ్యం, ఆంధ్రకేసరి ఉదాహరణ కావ్యం, క్రీస్తు సుప్రభాతం (సంస్కృతం), అయ్యప్ప సుప్రభాతం (సంస్కృతం), నాన్న (గేయకావ్యం), మహర్షి అంబేద్కర్ (గేయ కావ్యం)
వృత్తి: తెలుగు లెక్చరర్, రాజోలు డిగ్రీ కళాశాల
ఫోన్.నం.9949263267
వెల 10 రూ.
దొరకు చోటు
జి. ధర్మోజీ రావు, తెలుగు లెక్చరర్
ప్రభావతి పబ్లికేషన్స్
రాజోలు, తూ.గో.జిల్లా., ఆంధ్రప్రదేష్.
పి.ఎస్. ఈ పోస్టుకు లైకులు కామెంటులు చేయటం బదులు, వీలయితే ధర్మోజి గారికి ఫోన్ చేసి/మెసేజ్ పెట్టి (9949263267/dharmoji92@gmail.com) అభినందనలు తెలపండి.
తనకాలాన్ని, ఆలోచనల్ని కరిగించి కొన్ని వాక్యాల్ని సృష్టించి సమాజానికి ధారవోసే ఒక కవికి అంతకన్నా మనమేం ఇవ్వగలం!
బొల్లోజు బాబా

Tuesday, April 12, 2016

20. Tonight I Can Write - poem by Pablo Neruda

ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీతము -- పాబ్లో నెరుడా
20. Tonight I Can Write - poem by Pablo Neruda
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
“దూరంగా వణుకుతోన్న నీలి నక్షత్రాల ఈ రాత్రి” లాంటివి.
రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.
ఇలాంటి రాత్రులలోనే నేన్తనని నా చేతుల్తో చుట్టేసి
అనంత ఆకాశం క్రింద పదే పదే ముద్దులాడేవాడిని.
ఆమె నన్ను ప్రేమించింది. ఒకోసారి నేను కూడా తనను.
తదేకంగా చూసే ఆమె విప్పారిన కళ్ళను ప్రేమించకుండా ఎలా ఉండగలను.
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను
నాకామె లేదనీ, నేనామెను కోల్పోయానని తెలుసుకొనటానికి
ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.
నా ప్రేమ ఆమెనెందుకు నిలువరించలేకపోయిందనేది కాదు సమస్య
ఈ తారల రాత్రి ఆమె నాతో లేకపోవటమే.
అంతే! అంతకు మించేమీ లేదు. దూరంగా ఎవరో పాడుతున్నారు.
తనను పోగొట్టుకున్నందుకు నా మనసుకు అశాంతి మిగిలింది. అంతే!
నా చూపు ఆమెను వెతుకుతోంది, తనను నా దరి చేర్చటానికై.
నా హృదయం ఆమెకై చూస్తోంది. ఆమె నాతో లేదు.
అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము.
ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవచ్చు. నిజంగానే.
కానీ ఆమెను నేను ఎంతెలా ప్రేమించానూ?
నా స్వరం గాలిలో తడుముకొంటోంది, ఆమె చెవుల కోసమై.
మరొకరిది. ఆమె మరొకరిది. నేను తనను ముద్దులు పెట్టుకోకముందు లాగానే
తన స్వరం, తన మేని మిసిమి, తన విప్పారిన కళ్లు అన్నీను.
ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవొచ్చు. అది నిజం. ఏమో ప్రేమించవచ్చేమో!
ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గంగా ఉంటుంది.
ఇలాంటి రాత్రులలో ఒకప్పుడు తను నా కౌగిట ఉన్నందుకేనేమో
తనను కోల్పోయింనందుకు నా హృదయంలో అశాంతి.
బహుశా ఇదే తను నాకు చేసే చివరి గాయం.
ఇవే నేనామెకు వ్రాసే ఆఖరి వాక్యాలు.
స్వేచ్ఛానువాదం: బొల్లోజు బాబా

Saturday, April 9, 2016

19. Girl Lithe and Tawny - by Pablo Neruda

ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీతము -- పాబ్లో నెరుడా

19. Girl Lithe and Tawny - by Pablo Neruda

చలాకీ నల్ల పిల్లా
పండ్లకు రూపాన్ని, గింజలకు నిండుతనాన్ని
సముద్రనాచుకు వంపులను ఇచ్చే సూర్యుడు
నీ దేహంనిండా ఆనందాన్ని, కనులలో కాంతిని
పెదవులపై నీటి దరహాసాలనూ నింపాడు.

నీ నల్లని కురుల పాయలలో నలుపు కోర్కెల సూర్యుడు పెనవేసుకొని ఉన్నాడు.
నీవు సెలయేరుతో క్రీడించినట్లే, సూర్యునితోకూడా ఆటలాడతావు.
నీ కనులు రెండు నల్లని సరోవరాలు.

చలాకీ నల్ల పిల్లా
నీ వైపుకు నన్నాకర్షించేదేమీ లేదు.
ప్రతీదీ నన్ను నీనుంచి దూరం చేసేదే. నీవేదో మిట్టమధ్యాహ్నపు వేళైనట్లు.

నీవు తేనెటీగ అవిశ్రాంత యవ్వనానివి
కెరటాల ఉన్మత్త వినోదానివి. వరి కంకుల దాగిన బలానివి

నీ చలాకీ దేహమంటే నాకిష్టం. నీ సన్నని ప్రవహించే స్వరం అంటే నాకిష్టం.
నా దుఃఖిత హృదయం నిన్ను నిత్యం అన్వేషిస్తూనే ఉంటుంది.

నల్లని సీతాకోకచిలుకా!
వరిచేను సూర్యుడు నీరు సారాయిల్లా నీవు చాలా స్పష్టమైనదానవు.

స్వేచ్ఛానువాదం: బొల్లోజు బాబా (Feb - 2010)

Tuesday, March 29, 2016

రూమీ వాక్యాలు - ఫేస్ బుక్ గ్రూప్ లింకు

మిత్రులారా,

జలాలుద్దీన్  రూమి వాక్యాల కోసం ఈ గ్రూపు సృష్టించబడింది. అంతర్జాలంలో అనేక రూమీ వాక్యాలు విహరిస్తూంటాయి. అనేక రూమీ కొటేషన్లు హింది, తమిళం వంటి భాషలలో విస్త్రుతంగా అనువదింపబడి, ధారాళంగా ఫేస్ బుక్ లో పంచుకోబడుతున్నాయి.   వాటిని తెలుగులోకి అనువదించి ఒకచోటికి తీసుకొని వస్తే బాగుంటుందన్నది ఈ ఫేస్ బుక్ గ్రూప్ క్రియేట్ చేసాను.

కొన్ని వాక్యాలు.....

దేన్నీ వ్యక్తిగతంగా తీసుకోకు. నీ గురించి ఇతరులు చెప్పేదంతా నీవు కాదు అది వారి ప్రతిబింబం మాత్రమే --రూమీ

నీ పని ప్రేమను అన్వేషించటం కాదు- దానికి వ్యతిరేకంగా నీలో నిర్మించుకొన్న అన్ని అడ్డంకులనూ వెతుక్కొని పట్టుకోవటం మాత్రమే.  --రూమీ

 ఇతరులకు ఏంజరిగిందో తెలిపే కథలతో తృప్తి చెందకు. నీ గాథను నీవే విప్పుకో –రూమీ

మంచి చేయటం చెడు చేయటం అనే ఆలోచనలకు దూరంగా ఒక మైదానం ఉంటుంది. అక్కడ నిన్ను నేను కలుస్తాను  --రూమీ
పదాలను ఉచ్ఛరించని స్వరమొకటుంది.  జాగ్రత్తగా విను  --రూమీ


మరిన్ని "రూమీ వాక్యాల" కోసం లింకు ఇక్కడ.

https://www.facebook.com/groups/1286654614695032/



భవదీయుడు

బొల్లోజు బాబా

రూమీ వాక్యాలు -- ఫేస్ బుక్ గ్రూప్

మిత్రులారా,

జలాలుద్దీన్  రూమి వాక్యాల కోసం ఈ గ్రూపు సృష్టించబడింది. అంతర్జాలంలో అనేక రూమీ వాక్యాలు విహరిస్తూంటాయి. వాటిని తెలుగులోకి అనువదించి ఒకచోటికి తీసుకొని వస్తే బాగుంటుందన్నది ఈ గ్రూపు ఉద్దేశం. 

కొన్ని వాక్యాలు.....

నీ పని ప్రేమను అన్వేషించటం కాదు- దానికి వ్యతిరేకంగా నీలో నిర్మించుకొన్న అన్ని అడ్డంకులనూ వెతుక్కొని పట్టుకోవటం మాత్రమే.  --రూమీ

దేన్నీ వ్యక్తిగతంగా తీసుకోకు. నీ గురించి ఇతరులు చెప్పేదంతా నీవు కాదు అది వారి ప్రతిబింబం మాత్రమే --రూమీ

ఇతరులకు ఏంజరిగిందో తెలిపే కథలతో తృప్తి చెందకు. నీ గాథను నీవే విప్పుకో –రూమీ

మంచి చేయటం చెడు చేయటం అనే ఆలోచనలకు దూరంగా ఒక మైదానం ఉంటుంది. అక్కడ నిన్ను నేను కలుస్తాను  --రూమీ
పదాలను ఉచ్ఛరించని స్వరమొకటుంది.  జాగ్రత్తగా విను  --రూమీ

మరిన్ని "రూమీ వాక్యాల" కోసం లింకు ఇక్కడ.  

https://www.facebook.com/groups/1286654614695032/


 భవదీయుడు

బొల్లోజు బాబా

Saturday, March 19, 2016

ఆమె మృదువైన చర్మాన్ని కోరుకోవటం లేదు - poem by Sri. Aashish Thakur

అనుక్షణం భయపడే ఉడతలా బతికే ఆమె
ఓ పేదదేశానికి చెందిన అమ్మాయి
సురక్షితంగా ఉండటానికి
ఆమెకు ఒంటినిండా రోమాలు కావాలి.
ప్రతీచోటా
గెట్టోలు, గులాగ్ లు, కాన్సంట్రేషన్ కాంపులు.
మారువేషం వేసుకొన్న ఆమ్లం మరుగుతూంటుంది వేడి టీ గా
ఆమె పరువు ఆమె మౌనం లో ఉంటుంది
సగర్వంగా నడవటానికి ఆమె తలదించుకోవాలి.
గెంతటం నిషేదింపబడిన జింకపిల్ల ఆమె
ఆమెకు స్వేచ్ఛా శృంఖలాలను
బహూకరించాయి హైనాలు.
అంతే కాదు
వీధులనిండా పోస్టర్లు
“ఆడ టెర్రరిస్టు కావలెను... ప్రాణాలతో లేదా శవంగానైనా
ఆమె తన అనాచ్చాదిత చేతులపై, నగ్న పాదాలపై
కోర్కెలు రేకెత్తించే ప్రేలుడు పదార్ధాలతో తిరుగుతూంది”.... అంటో.

Source - She doesn’t want smooth skin by Sri. Aashish Thakur

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Sunday, March 13, 2016

ఈ రాత్రికి ----- poem by Charles Bukowski


“నీ ప్రియురాళ్ళపై నీవు వ్రాసే కవిత్వం 
మరో యాభై ఏళ్ళు నిలుస్తుంది...... 
వాళ్ళు గతించిపోయినప్పటికీ” 
నా ఎడిటర్ ఫోన్ చేసి అంటున్నాడు.

మిత్రమా
వారేనాడో నన్ను విడిచి వెళ్ళిపోయారు

నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.

ఐతే
ఒక్క నిజమైన సజీవ స్త్రీని నాకొరకు ఈ రాత్రికి పంపించు
నా వైపు నడుచుకొంటూ వచ్చే ఒక్క స్త్రీని...
నా కవితలన్నీ నీకిచ్చేస్తాను
మంచివీ, ముతకవీ
ఇకపై నేను వ్రాయబోయేవీ కూడా.

నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.

నేనేమంటున్నానో నీకు అర్ధమైందా?


Source: “Tonight” by Charles Bukowski
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

ఈ రాత్రికి ----- poem by Charles Bukowski


“నీ ప్రియురాళ్ళపై నీవు వ్రాసే కవిత్వం
మరో యాభై ఏళ్ళు నిలుస్తుంది......
వాళ్ళు గతించిపోయినప్పటికీ”
నా ఎడిటర్ ఫోన్ చేసి అంటున్నాడు.
మిత్రమా
వారేనాడో నన్ను విడిచి వెళ్ళిపోయారు
నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.
ఐతే
ఒక్క నిజమైన సజీవ స్త్రీని నాకొరకు ఈ రాత్రికి పంపించు
నా వైపు నడుచుకొంటూ వచ్చే ఒక్క స్త్రీని...
నా కవితలన్నీ నీకిచ్చేస్తాను
మంచివీ, ముతకవీ
ఇకపై నేను వ్రాయబోయేవీ కూడా.
నువ్వేమంటున్నావో నాకు అర్ధమైంది.
నేనేమంటున్నానో నీకు అర్ధమైందా?

Source: “Tonight” by Charles Bukowski
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

కవితను ముగించాకా..... by Wu Pen (779-841 AD)


ఆ రెండు వాక్యాలకై
మూడేళ్ళు వెచ్చించాను.
మరోసారి వాటిని చదివా, 
రెండు కన్నీటి బొట్లు
జల జలా రాలాయి మరలా
మిత్రమా,
అవి నీకు నచ్చకపోతే
నేను ఇక ఇంటికి పోయి
అనాది కొండలపై తిరుగాడే
శరత్తులో శయనిస్తాను.
మూలం: Wu Pen (779-841 AD)
అనువాదం: బొల్లోజు బాబా

Thursday, March 3, 2016

“నన్ను ప్రభావితం చేసిన పుస్తకం”


ఈ రోజు కాకినాడ పుస్తకమహోత్సవం లో “నన్ను ప్రభావితం చేసిన పుస్తకం” అనే అంశంపై మాట్లాడాను. సభకు శ్రీ మిడియం బాబురావుగారు అద్యక్ష్యత వహించారు. శ్రీమతి పద్మజావాణి, శ్రీ జెవి తదితరులు పాల్గొన్నారు. 
ఆ ప్రసంగ పూర్తిపాఠం.

నన్ను ప్రభావితం చేసిన పుస్తకం

నాకు నచ్చిన, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. మనం చదివే అనేక పుస్తకాలలో కొన్ని కాలక్షేపంగా మిగులుతాయి, కొన్ని అందమైన పఠనానుభవాన్ని కలిగిస్తాయి, కొన్ని మన ఆలోచనా పరిధిని విస్తరింపచేస్తాయి, మరికొన్ని మాత్రం మనల్ని వెంటాడతాయి. అలాంటి పుస్తకాలు మనకు తెలియకుండానే మన హృదయంలోకి ఇంకిపోతాయి. కొంతకాలం తరువాత ఆ పుస్తకం తాలుకు ప్రబావం మన జీవితం పైనో లేక మన రచనలపైనో పడుతున్నదన్న విషయాన్ని గ్రహిస్తాం. అలా తొంబయ్యవ దశక ఆరంభంలో నేను చదివిన చిలక్కొయ్య అనే పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇది 1993 లో ప్రముఖ కవి శ్రీ శిఖామణి గారి రెండవ కవిత్వ సంపుటి.
నేను కవిత్వంవైపు బుడిబుడి అడుగులు వేస్తున్న రోజులవి. నా ముందు అనేక దారులు. ఉద్యమ కవిత్వం, సామాజిక స్పృహ కవిత్వం, అప్పుడప్పుడే వేళ్ళూనుకొంటున్న అస్తిత్వవాద కవిత్వం, రంగులు వెలసిపోతున్న భావకవిత్వం, అధివాస్తవిక కవిత్వం అంటూ వివిధ రకాల కవితా రీతులు ఉండేవి. అలా క్రాస్ రోడ్స్ వద్ద నుంచున్న నన్ను కవిత్వ పరంగా ప్రభావితం చేసి నాకొక కవితా మార్గాన్ని చూపించిన చిలక్కొయ్య పుస్తకం గురించి ఈ రోజు కొన్ని మాటలు మీతో పంచుకొంటాను.
“మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి. 

అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు.ఎందుకంటే కొన్ని అనుభూతులను వ్యక్తీకరించటానికి భాష సరిపోదు. ఈ రెంటినీ సమన్వయపరచి, ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి నేర్పరి.
ఈ సంపుటిలో మొదటి కవిత పేరు చిలక్కొయ్య. గోడకు ఉండే చిలక్కొయ్యపై వ్రాసిన వస్తుకవితైనప్పటికీ, ఒక సంపూర్ణజీవితాన్ని అంతర్లీనంగా చెపుతూంటుంది. కవి బాల్యంలో చిలక్కొయ్యతో తనకు గల అనుభవాలతో కవిత మొదలౌతుంది.
చిలక్కొయ్యపై పిచ్చుకలు వాలటం, కవి తల్లిగారు ఉత్త పసుపు పుస్తెలతాడు వేలాడదీయటం, దానికి తగిలించిన సీమవెండి కేరేజీలో చప్పరింపు చప్పరింపుకు రంగులు మారే బిళ్లలను వారి అమ్మగారు దాయటం, మూడో పురుషార్థ సాధనలో ఉన్న దంపతులను ఆ చిలక్కొయ్య నిర్వికారంగా చూడటం, ఈ ఒంటరి ప్రయాణంలో ఈదలేక నిష్క్రమిస్తూ అదే చిలక్కొయ్యకు ఆత్మను తగిలించటం -ఇవీ ఈ కవితలో కనిపించే వివిధ దృశ్యచిత్రాలు. అతి సామాన్యంగా కనిపించే వాక్యాలతో కవిత మొదలై ముగింపుకు వచ్చేసరికి అవే పదాలు మరో గొప్ప అర్థాన్నిచ్చే విధంగా మారతాయి. కవిత ప్రారంభంలో కనిపించిన కొయ్య చిలుక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, ఓ జీవితం కనిపించటం మొదలవుతుంది.
వీధిలో నగ్నంగా తిరిగే పిచ్చివాని గురించి వ్రాసిన “దిశమొల” అనే కవితలో అతనలా నగ్నంగా తిరగటాన్ని అనేక పదచిత్రాలలో హృదయానికి హత్తుకొనేలా వర్ణిస్తారు శిఖామణి.
దిగంబరంగా తిరుగుతున్న ఆ వ్యక్తి దేహాన్ని కప్పలేనందుకు, దుస్తుల తో సంబందం ఉన్న వివిధ నేపథ్యాల్ని ఈ కవితలో గొప్ప ప్రతిభతో ఇముడ్చుతాడు కవి.
- పల్లెల్లో పూతకొచ్చిన పత్తితోట తనమొదళ్లను తనే నరుక్కొంటుందట.
- మగ్గంలో అటూ ఇటూ తిరుగుతున్న కండె నిలువునా రెండుగా చీలుతుందట
- పట్టుపురుగు పట్టుగూడులో ఆత్మబలిదానం చేసుకొంటుందట
- దేవదేవుని శేషవస్త్రపు కొంగుకు నిప్పంటుకొంటుందట
- సాలెపురుగు దీపపు కొస శూలాగ్రం మీద శిరచ్ఛేదనం చేసుకొంటుందట
- ఎవరికి వారు రహస్యంగా తమతమ మర్మావయవాలను మనసుల్లోనే తడిమిచూసుకొంటారట
- కన్నీళ్లను ఒత్తవలసిన చేతిరుమాలు జేబులోనే చెమరుస్తుందట
ఒక్కో పదచిత్రమూ ఆ దృశ్యాన్ని సన్నగా వర్షించటం మొదలెట్టి నెమ్మదినెమ్మదిగా కరుణార్ద్ర కుంభవృష్టిలో పాఠకుణ్ణి తడిచేట్లు చేస్తుంది. అందమైన గూడును అల్లుకొనే సాలెపురుగును కూడా వాడుకోవటంద్వారా ఈ కవి దృష్టి ఎంత నిశితమో అర్థమవుతుంది. సునిశిత దృష్టి, కరుణ, మానవత్వాలు అంతర్లీనంగా ప్రవహించే ఈ కవిత, శిఖామణి కవిత్వ తత్వానికి ఒక మినియేచర్ రూపమనవచ్చు.
ఒక పదచిత్రంలోనే రెండుమూడు చిత్రాల్ని ఇమడ్చటం చాలా కష్టం. శిఖామణి తన కవిత్వంలో ఇలాంటివి అలవోకగా సాధిస్తాడు. పల్లెటూరివ్యక్తి చేసే పట్నవాసాన్ని వస్తువుగా తీసుకొని వ్రాసిన “ఆంతరంగికుని ఉత్తరం” లో ఒకచోట
“అక్కడ చలిపెట్టే అధికారులుండవచ్చు
వినయపు ఉన్ని శాలువా మర్చిపోలేదు కదా”
అంటాడు. ఇక్కడ చలికి ఉన్నిశాలువా, అధికారులకు వినయం అనే రెండు భిన్న విషయాల్ని ఒకే చిత్రంద్వారా సాధించాడు. చలిపెట్టే అధికారులు అనటం కూడా ఒక వ్యంగ్యం. దీనివల్ల గాఢత, క్లుప్తత వచ్చి చెప్పాలనుకొన్న విషయం వెన్నుకు చలిచలిగ తగిలేట్టు చేస్తుంది.
“మేఘనా” అనే మరో కవితలో

“వెన్నెల మబ్బుల మెట్లమీదుగా నేలకు దిగే సమయాన
పూలగొంతుల్లో పరిమళపు పాట కూనిరాగాలు తీసేవేళ ”
వంటి వాక్యాలలో కూడా ఇలాంటి ప్రతిభే కనిపిస్తుంది.
పేవ్ మెంట్ పై బతికే వృద్ధవనిత గురించి వ్రాసిన “వెన్నెల దుప్పటి” అనే కవిత శ్రీశ్రీ బిక్షువర్షీయసీ కవితను జ్ఞప్తికి తెస్తుంది. లోతైన పదచిత్రాలతో ఈ కవిత చదువరి హృదయాన్ని బరువెక్కిస్తుంది.

“ఆర్ధ్రత నీరెండిన నగరం నదిలో
ఆమె ఓ శిధిల నౌక …..
అర్ధరాత్రి దాటాకా
ఏ శీతలపవనమో ఆమెను ఒణికిస్తే
ముడుచుకుపడుకొన్న ఆమె దేహంమీద
చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పి
చెట్టుకొమ్మకు లాంతరు దీపమై వేలాడుతాడు.”...........వంటి వర్ణనల వల్ల, శ్రీశ్రీ కవితలో కనిపించని లక్షణమేదో ఈ కవితలో ఉన్నట్టనిపిస్తుంది.

కర్ణాటకలో దేవాలయ ప్రవేశం చేసిన ఓ దళితునిచే మలం తినిపించారన్న వార్తకు శిఖామణి ఎంతో తీవ్రంగా స్పందించి వ్రాసిన “వాడే అశుద్ధమానవుడు ” అన్న కవితనిండా ఆవేశం భుగభుగలాడుతూ, చదువరి రక్తాన్ని మరిగించేలా చేస్తుంది.

“వాణ్ని కన్న నేరానికి
నిన్ను తూలనాడుతున్నాను క్షమించుతల్లీ.
….
ఒరే లంజా కొడకా
నీ పేరు మనిషా?”
అని మొత్తం మానవత్వాన్నే ప్రశ్నిస్తాడు. ఈ కవిత వ్రాసిన సమయానికి (1989) తెలుగు సాహిత్యంలో దళితకవిత్వం ఇంకా ఉద్యమస్థాయిలో మొదలవలేదు. ఈ కవితలో కులస్పృహకంటే మానవత్వమే కనిపిస్తుంది. ఒక సాటిమానవునికి జరిగిన అమానుషావమానాన్ని, ఈ కవిత అంతే ఫెరోషియస్‌గా ఎత్తి చూపుతుంది.
శిఖామణి కొన్ని కవితలలో తన గ్రామీణనేపథ్యం, బాల్యం తాలూకు జ్ఞాపకాలు కనిపిస్తూ ‘ఈయన తన బాల్యపు ముగ్ధత్వాన్ని ఎంత అందంగా దాచుకొన్నాడూ!’ అనిపిస్తాయి. ఉదాహరణకు, తుమ్మచెట్టునీడలు, బొరియల్లో పీతలు, పాతబడ్డ టైరుని దొర్లించుకొంటూ సాగడాలు, మట్టిని పిసికి చేసే బళ్లూ, కొత్తనీటికి ఎదురెక్కి కిలకలు వేసే చేపపిల్లలు, కొలను గర్భంలో తామరతూడు తెగిన శబ్ధాలు, జామెట్రీ బాక్సులో దొంగిలించిన రబ్బరుముక్కలు మొదలైనవి.
ఇంకా ఈ కవితా సంపుటిలో
-బాల్యాన్ని ఈతాకుల చీపురు చేసి రైలు పెట్టి ఊడ్చే కుర్రాళ్లు (పాటల బండి),
-బాల్యాన్ని మూరమూరచొప్పున కోసి అమ్ముకొనే పూలబ్బాయిలు (పూలబ్బాయి),
-చీకటి ఆకాశపు ఆసుపత్రిలో చందమామలా వెలిగే నైట్ డ్యూటీ నర్సులు (ప్రమిదక్రింది చీకటి),
-చీకటి కొండచిలువ నగరం చెట్టుకు చుట్టుకోవటం (వెన్నెల దుప్పటి),
-నిద్రతో ప్రమేయం లేకుండానే ఒక మండే స్వప్నం కొరడాలతో హింసించటం (కలలనెమలి)
వంటి పదునైన అభివ్యక్తులెన్నో ఉన్నాయి.
పూలకుర్రాడు, కలలనెమలి, దేహి, పాటలబండి, మేఘనా, వెన్నెల దుప్పటి, ఆంతరంగికుని ఉత్తరం వంటి కవితలలో ఈ కవి ఎంతైతే భావుకతా, సున్నితత్వం చూపిస్తారో.. నిషేధాజ్ఞ, జలసర్పం, వాడే అశుద్ధమానవుడు, మాట డైనమైట్ అవుతుంది, కక్కుళ్లు, యుద్ధమూ అనివార్యమే వంటి కవితల్లో అంతకు మించిన వాస్తవికత, ఉద్వేగాన్ని ప్రతిబింబిస్తారు. అంటే రియాలిటీ తో తలపడవలసివచ్చినపుడు ఊహల్లోకి జారిపోయే తత్వం కాదీ కవిది.
ఈ పుస్తకం నన్నెంతగానో ప్రబావితం చేసింది. ఇస్మాయిల్ గారు కవిత్వం హృదయ సంబంధి అంటారు. ఆ విషయం ఈ పుస్తకం ద్వారా అర్ధమయ్యింది నాకు. ఈ పుస్తకం నన్నే కాదు, తొంభైలలో నాలాగ అనేక దారులమధ్య ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చిన అనేక మందిని వర్ధమాన కవుల్ని ప్రభావితం చేసి ఉంటుంది.
ఎందుకంటే ఈ పుస్తకం లో
కవిత్వం అంటే - జీవితపు రణగొణధ్వనుల మధ్య జారిపోయే సున్నితానుభవాలను నేర్పుగా ఒడిసిపట్టుకోవటమని
కవిత్వం అంటే – నడచి వచ్చేసిన మార్గంలోని రాలుపూల పరిమళాల్ని నెమరువేసుకొంటూ కలల మాలలల్లటమనీ
కవిత్వం అంటే – మనిషితనం తగలకపోతుందా అంటూ లోలోపలికి తవ్వుకుంటూ పోయేతత్వమనీ
కవిత్వం అంటే – కాస్త అమాయకత్వం, లోకం మీద ఇంత దయా తప్ప మరే అలంకారాలూ లేకపోవటమనీ
కవిత్వం అంటే – కరుణ, తాత్వికతలు అంతర్జలలై ప్రవహించటమనీ
కవిత్వం అంటే – సామాజిక వాస్తవాల్ని ధైర్యంగా ఎదుర్కొని సాటి మనిషికి నమ్మకాన్నివటమనీ
కవిత్వం అంటే – మనచుట్టూ జరుగుతున్న అన్యాయాలపట్ల ధర్మాగ్రహం ప్రకటించటమనీ
కవిత్వం అంటే– స్వప్నాన్ని కమ్మిచ్చుగుండా సాగదీసి సాగదీసి బంగారు తీగలాంటి ఓ వాక్య చిత్రాన్ని నిర్మించటమనీ– వంటి అనేక సూత్రీకరణలకు “చిలక్కొయ్య” లోని వివిధ కవితలు సాక్ష్యాలుగా, ఉదాహరణలుగా నిలుస్తాయి.
చిలక్కొయ్య కవిత్వ సంపుటి తరువాత శిఖామణి గారు అనేక పుస్తకాల్ని వెలువరించారు. తెలుగు సాహిత్యంలో, ఆర్థ్రత, తాత్వికత, సామాజిక బాధ్యత తో రచనలు సాగించే కవిగా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొన్నారు. ఆధునిక కవిత్వంలో ఉపమ, రూపక అలంకారాల్ని ప్రతిభావంతంగా ప్రయోగించే కవిగా ప్రసిద్ధికెక్కారు.
ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించి, ఆనందించి, ప్రభావితమైన ఎంతో మందిలో నేనొకణ్ణి అని చెప్పుకోవటానికి గర్వపడతాను.
బొల్లోజు బాబా