Tuesday, April 12, 2016

20. Tonight I Can Write - poem by Pablo Neruda

ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీతము -- పాబ్లో నెరుడా
20. Tonight I Can Write - poem by Pablo Neruda
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
“దూరంగా వణుకుతోన్న నీలి నక్షత్రాల ఈ రాత్రి” లాంటివి.
రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.
ఇలాంటి రాత్రులలోనే నేన్తనని నా చేతుల్తో చుట్టేసి
అనంత ఆకాశం క్రింద పదే పదే ముద్దులాడేవాడిని.
ఆమె నన్ను ప్రేమించింది. ఒకోసారి నేను కూడా తనను.
తదేకంగా చూసే ఆమె విప్పారిన కళ్ళను ప్రేమించకుండా ఎలా ఉండగలను.
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను
నాకామె లేదనీ, నేనామెను కోల్పోయానని తెలుసుకొనటానికి
ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.
నా ప్రేమ ఆమెనెందుకు నిలువరించలేకపోయిందనేది కాదు సమస్య
ఈ తారల రాత్రి ఆమె నాతో లేకపోవటమే.
అంతే! అంతకు మించేమీ లేదు. దూరంగా ఎవరో పాడుతున్నారు.
తనను పోగొట్టుకున్నందుకు నా మనసుకు అశాంతి మిగిలింది. అంతే!
నా చూపు ఆమెను వెతుకుతోంది, తనను నా దరి చేర్చటానికై.
నా హృదయం ఆమెకై చూస్తోంది. ఆమె నాతో లేదు.
అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము.
ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవచ్చు. నిజంగానే.
కానీ ఆమెను నేను ఎంతెలా ప్రేమించానూ?
నా స్వరం గాలిలో తడుముకొంటోంది, ఆమె చెవుల కోసమై.
మరొకరిది. ఆమె మరొకరిది. నేను తనను ముద్దులు పెట్టుకోకముందు లాగానే
తన స్వరం, తన మేని మిసిమి, తన విప్పారిన కళ్లు అన్నీను.
ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవొచ్చు. అది నిజం. ఏమో ప్రేమించవచ్చేమో!
ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గంగా ఉంటుంది.
ఇలాంటి రాత్రులలో ఒకప్పుడు తను నా కౌగిట ఉన్నందుకేనేమో
తనను కోల్పోయింనందుకు నా హృదయంలో అశాంతి.
బహుశా ఇదే తను నాకు చేసే చివరి గాయం.
ఇవే నేనామెకు వ్రాసే ఆఖరి వాక్యాలు.
స్వేచ్ఛానువాదం: బొల్లోజు బాబా

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete


  2. ఈ రాత్రి నేను వ్రాసా
    నా రాణికి యిచట కావ్య నాయిక యనగన్
    పేరుకు ప్రేమగ యుండెన్
    జోరుగ వదిలెను జిలేబి చోద్యము జూడన్ !

    ReplyDelete
    Replies
    1. ఇంటరెస్టింగ్ సర్. ఇప్పుడే మీ వరూధిని ని చూసి వస్తున్నాను. బ్లాగుల్లో ట్రాఫిక్ లేదని ఎఫ్ బి కి వెళ్ళిపోయాను. ఏదో ఆర్చైవింగ్ కోసం బ్లాగులో కూడా పోస్ట్ చేస్తున్నాను. కానీ మీ బ్లాగు కళ కళ లాడుతున్నది. సంతోషం. థాంక్యూ ఇలా వచ్చినందుకు. :-)

      Delete