Thursday, March 3, 2016

“నన్ను ప్రభావితం చేసిన పుస్తకం”


ఈ రోజు కాకినాడ పుస్తకమహోత్సవం లో “నన్ను ప్రభావితం చేసిన పుస్తకం” అనే అంశంపై మాట్లాడాను. సభకు శ్రీ మిడియం బాబురావుగారు అద్యక్ష్యత వహించారు. శ్రీమతి పద్మజావాణి, శ్రీ జెవి తదితరులు పాల్గొన్నారు. 
ఆ ప్రసంగ పూర్తిపాఠం.

నన్ను ప్రభావితం చేసిన పుస్తకం

నాకు నచ్చిన, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. మనం చదివే అనేక పుస్తకాలలో కొన్ని కాలక్షేపంగా మిగులుతాయి, కొన్ని అందమైన పఠనానుభవాన్ని కలిగిస్తాయి, కొన్ని మన ఆలోచనా పరిధిని విస్తరింపచేస్తాయి, మరికొన్ని మాత్రం మనల్ని వెంటాడతాయి. అలాంటి పుస్తకాలు మనకు తెలియకుండానే మన హృదయంలోకి ఇంకిపోతాయి. కొంతకాలం తరువాత ఆ పుస్తకం తాలుకు ప్రబావం మన జీవితం పైనో లేక మన రచనలపైనో పడుతున్నదన్న విషయాన్ని గ్రహిస్తాం. అలా తొంబయ్యవ దశక ఆరంభంలో నేను చదివిన చిలక్కొయ్య అనే పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇది 1993 లో ప్రముఖ కవి శ్రీ శిఖామణి గారి రెండవ కవిత్వ సంపుటి.
నేను కవిత్వంవైపు బుడిబుడి అడుగులు వేస్తున్న రోజులవి. నా ముందు అనేక దారులు. ఉద్యమ కవిత్వం, సామాజిక స్పృహ కవిత్వం, అప్పుడప్పుడే వేళ్ళూనుకొంటున్న అస్తిత్వవాద కవిత్వం, రంగులు వెలసిపోతున్న భావకవిత్వం, అధివాస్తవిక కవిత్వం అంటూ వివిధ రకాల కవితా రీతులు ఉండేవి. అలా క్రాస్ రోడ్స్ వద్ద నుంచున్న నన్ను కవిత్వ పరంగా ప్రభావితం చేసి నాకొక కవితా మార్గాన్ని చూపించిన చిలక్కొయ్య పుస్తకం గురించి ఈ రోజు కొన్ని మాటలు మీతో పంచుకొంటాను.
“మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి. 

అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు.ఎందుకంటే కొన్ని అనుభూతులను వ్యక్తీకరించటానికి భాష సరిపోదు. ఈ రెంటినీ సమన్వయపరచి, ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి నేర్పరి.
ఈ సంపుటిలో మొదటి కవిత పేరు చిలక్కొయ్య. గోడకు ఉండే చిలక్కొయ్యపై వ్రాసిన వస్తుకవితైనప్పటికీ, ఒక సంపూర్ణజీవితాన్ని అంతర్లీనంగా చెపుతూంటుంది. కవి బాల్యంలో చిలక్కొయ్యతో తనకు గల అనుభవాలతో కవిత మొదలౌతుంది.
చిలక్కొయ్యపై పిచ్చుకలు వాలటం, కవి తల్లిగారు ఉత్త పసుపు పుస్తెలతాడు వేలాడదీయటం, దానికి తగిలించిన సీమవెండి కేరేజీలో చప్పరింపు చప్పరింపుకు రంగులు మారే బిళ్లలను వారి అమ్మగారు దాయటం, మూడో పురుషార్థ సాధనలో ఉన్న దంపతులను ఆ చిలక్కొయ్య నిర్వికారంగా చూడటం, ఈ ఒంటరి ప్రయాణంలో ఈదలేక నిష్క్రమిస్తూ అదే చిలక్కొయ్యకు ఆత్మను తగిలించటం -ఇవీ ఈ కవితలో కనిపించే వివిధ దృశ్యచిత్రాలు. అతి సామాన్యంగా కనిపించే వాక్యాలతో కవిత మొదలై ముగింపుకు వచ్చేసరికి అవే పదాలు మరో గొప్ప అర్థాన్నిచ్చే విధంగా మారతాయి. కవిత ప్రారంభంలో కనిపించిన కొయ్య చిలుక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, ఓ జీవితం కనిపించటం మొదలవుతుంది.
వీధిలో నగ్నంగా తిరిగే పిచ్చివాని గురించి వ్రాసిన “దిశమొల” అనే కవితలో అతనలా నగ్నంగా తిరగటాన్ని అనేక పదచిత్రాలలో హృదయానికి హత్తుకొనేలా వర్ణిస్తారు శిఖామణి.
దిగంబరంగా తిరుగుతున్న ఆ వ్యక్తి దేహాన్ని కప్పలేనందుకు, దుస్తుల తో సంబందం ఉన్న వివిధ నేపథ్యాల్ని ఈ కవితలో గొప్ప ప్రతిభతో ఇముడ్చుతాడు కవి.
- పల్లెల్లో పూతకొచ్చిన పత్తితోట తనమొదళ్లను తనే నరుక్కొంటుందట.
- మగ్గంలో అటూ ఇటూ తిరుగుతున్న కండె నిలువునా రెండుగా చీలుతుందట
- పట్టుపురుగు పట్టుగూడులో ఆత్మబలిదానం చేసుకొంటుందట
- దేవదేవుని శేషవస్త్రపు కొంగుకు నిప్పంటుకొంటుందట
- సాలెపురుగు దీపపు కొస శూలాగ్రం మీద శిరచ్ఛేదనం చేసుకొంటుందట
- ఎవరికి వారు రహస్యంగా తమతమ మర్మావయవాలను మనసుల్లోనే తడిమిచూసుకొంటారట
- కన్నీళ్లను ఒత్తవలసిన చేతిరుమాలు జేబులోనే చెమరుస్తుందట
ఒక్కో పదచిత్రమూ ఆ దృశ్యాన్ని సన్నగా వర్షించటం మొదలెట్టి నెమ్మదినెమ్మదిగా కరుణార్ద్ర కుంభవృష్టిలో పాఠకుణ్ణి తడిచేట్లు చేస్తుంది. అందమైన గూడును అల్లుకొనే సాలెపురుగును కూడా వాడుకోవటంద్వారా ఈ కవి దృష్టి ఎంత నిశితమో అర్థమవుతుంది. సునిశిత దృష్టి, కరుణ, మానవత్వాలు అంతర్లీనంగా ప్రవహించే ఈ కవిత, శిఖామణి కవిత్వ తత్వానికి ఒక మినియేచర్ రూపమనవచ్చు.
ఒక పదచిత్రంలోనే రెండుమూడు చిత్రాల్ని ఇమడ్చటం చాలా కష్టం. శిఖామణి తన కవిత్వంలో ఇలాంటివి అలవోకగా సాధిస్తాడు. పల్లెటూరివ్యక్తి చేసే పట్నవాసాన్ని వస్తువుగా తీసుకొని వ్రాసిన “ఆంతరంగికుని ఉత్తరం” లో ఒకచోట
“అక్కడ చలిపెట్టే అధికారులుండవచ్చు
వినయపు ఉన్ని శాలువా మర్చిపోలేదు కదా”
అంటాడు. ఇక్కడ చలికి ఉన్నిశాలువా, అధికారులకు వినయం అనే రెండు భిన్న విషయాల్ని ఒకే చిత్రంద్వారా సాధించాడు. చలిపెట్టే అధికారులు అనటం కూడా ఒక వ్యంగ్యం. దీనివల్ల గాఢత, క్లుప్తత వచ్చి చెప్పాలనుకొన్న విషయం వెన్నుకు చలిచలిగ తగిలేట్టు చేస్తుంది.
“మేఘనా” అనే మరో కవితలో

“వెన్నెల మబ్బుల మెట్లమీదుగా నేలకు దిగే సమయాన
పూలగొంతుల్లో పరిమళపు పాట కూనిరాగాలు తీసేవేళ ”
వంటి వాక్యాలలో కూడా ఇలాంటి ప్రతిభే కనిపిస్తుంది.
పేవ్ మెంట్ పై బతికే వృద్ధవనిత గురించి వ్రాసిన “వెన్నెల దుప్పటి” అనే కవిత శ్రీశ్రీ బిక్షువర్షీయసీ కవితను జ్ఞప్తికి తెస్తుంది. లోతైన పదచిత్రాలతో ఈ కవిత చదువరి హృదయాన్ని బరువెక్కిస్తుంది.

“ఆర్ధ్రత నీరెండిన నగరం నదిలో
ఆమె ఓ శిధిల నౌక …..
అర్ధరాత్రి దాటాకా
ఏ శీతలపవనమో ఆమెను ఒణికిస్తే
ముడుచుకుపడుకొన్న ఆమె దేహంమీద
చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పి
చెట్టుకొమ్మకు లాంతరు దీపమై వేలాడుతాడు.”...........వంటి వర్ణనల వల్ల, శ్రీశ్రీ కవితలో కనిపించని లక్షణమేదో ఈ కవితలో ఉన్నట్టనిపిస్తుంది.

కర్ణాటకలో దేవాలయ ప్రవేశం చేసిన ఓ దళితునిచే మలం తినిపించారన్న వార్తకు శిఖామణి ఎంతో తీవ్రంగా స్పందించి వ్రాసిన “వాడే అశుద్ధమానవుడు ” అన్న కవితనిండా ఆవేశం భుగభుగలాడుతూ, చదువరి రక్తాన్ని మరిగించేలా చేస్తుంది.

“వాణ్ని కన్న నేరానికి
నిన్ను తూలనాడుతున్నాను క్షమించుతల్లీ.
….
ఒరే లంజా కొడకా
నీ పేరు మనిషా?”
అని మొత్తం మానవత్వాన్నే ప్రశ్నిస్తాడు. ఈ కవిత వ్రాసిన సమయానికి (1989) తెలుగు సాహిత్యంలో దళితకవిత్వం ఇంకా ఉద్యమస్థాయిలో మొదలవలేదు. ఈ కవితలో కులస్పృహకంటే మానవత్వమే కనిపిస్తుంది. ఒక సాటిమానవునికి జరిగిన అమానుషావమానాన్ని, ఈ కవిత అంతే ఫెరోషియస్‌గా ఎత్తి చూపుతుంది.
శిఖామణి కొన్ని కవితలలో తన గ్రామీణనేపథ్యం, బాల్యం తాలూకు జ్ఞాపకాలు కనిపిస్తూ ‘ఈయన తన బాల్యపు ముగ్ధత్వాన్ని ఎంత అందంగా దాచుకొన్నాడూ!’ అనిపిస్తాయి. ఉదాహరణకు, తుమ్మచెట్టునీడలు, బొరియల్లో పీతలు, పాతబడ్డ టైరుని దొర్లించుకొంటూ సాగడాలు, మట్టిని పిసికి చేసే బళ్లూ, కొత్తనీటికి ఎదురెక్కి కిలకలు వేసే చేపపిల్లలు, కొలను గర్భంలో తామరతూడు తెగిన శబ్ధాలు, జామెట్రీ బాక్సులో దొంగిలించిన రబ్బరుముక్కలు మొదలైనవి.
ఇంకా ఈ కవితా సంపుటిలో
-బాల్యాన్ని ఈతాకుల చీపురు చేసి రైలు పెట్టి ఊడ్చే కుర్రాళ్లు (పాటల బండి),
-బాల్యాన్ని మూరమూరచొప్పున కోసి అమ్ముకొనే పూలబ్బాయిలు (పూలబ్బాయి),
-చీకటి ఆకాశపు ఆసుపత్రిలో చందమామలా వెలిగే నైట్ డ్యూటీ నర్సులు (ప్రమిదక్రింది చీకటి),
-చీకటి కొండచిలువ నగరం చెట్టుకు చుట్టుకోవటం (వెన్నెల దుప్పటి),
-నిద్రతో ప్రమేయం లేకుండానే ఒక మండే స్వప్నం కొరడాలతో హింసించటం (కలలనెమలి)
వంటి పదునైన అభివ్యక్తులెన్నో ఉన్నాయి.
పూలకుర్రాడు, కలలనెమలి, దేహి, పాటలబండి, మేఘనా, వెన్నెల దుప్పటి, ఆంతరంగికుని ఉత్తరం వంటి కవితలలో ఈ కవి ఎంతైతే భావుకతా, సున్నితత్వం చూపిస్తారో.. నిషేధాజ్ఞ, జలసర్పం, వాడే అశుద్ధమానవుడు, మాట డైనమైట్ అవుతుంది, కక్కుళ్లు, యుద్ధమూ అనివార్యమే వంటి కవితల్లో అంతకు మించిన వాస్తవికత, ఉద్వేగాన్ని ప్రతిబింబిస్తారు. అంటే రియాలిటీ తో తలపడవలసివచ్చినపుడు ఊహల్లోకి జారిపోయే తత్వం కాదీ కవిది.
ఈ పుస్తకం నన్నెంతగానో ప్రబావితం చేసింది. ఇస్మాయిల్ గారు కవిత్వం హృదయ సంబంధి అంటారు. ఆ విషయం ఈ పుస్తకం ద్వారా అర్ధమయ్యింది నాకు. ఈ పుస్తకం నన్నే కాదు, తొంభైలలో నాలాగ అనేక దారులమధ్య ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చిన అనేక మందిని వర్ధమాన కవుల్ని ప్రభావితం చేసి ఉంటుంది.
ఎందుకంటే ఈ పుస్తకం లో
కవిత్వం అంటే - జీవితపు రణగొణధ్వనుల మధ్య జారిపోయే సున్నితానుభవాలను నేర్పుగా ఒడిసిపట్టుకోవటమని
కవిత్వం అంటే – నడచి వచ్చేసిన మార్గంలోని రాలుపూల పరిమళాల్ని నెమరువేసుకొంటూ కలల మాలలల్లటమనీ
కవిత్వం అంటే – మనిషితనం తగలకపోతుందా అంటూ లోలోపలికి తవ్వుకుంటూ పోయేతత్వమనీ
కవిత్వం అంటే – కాస్త అమాయకత్వం, లోకం మీద ఇంత దయా తప్ప మరే అలంకారాలూ లేకపోవటమనీ
కవిత్వం అంటే – కరుణ, తాత్వికతలు అంతర్జలలై ప్రవహించటమనీ
కవిత్వం అంటే – సామాజిక వాస్తవాల్ని ధైర్యంగా ఎదుర్కొని సాటి మనిషికి నమ్మకాన్నివటమనీ
కవిత్వం అంటే – మనచుట్టూ జరుగుతున్న అన్యాయాలపట్ల ధర్మాగ్రహం ప్రకటించటమనీ
కవిత్వం అంటే– స్వప్నాన్ని కమ్మిచ్చుగుండా సాగదీసి సాగదీసి బంగారు తీగలాంటి ఓ వాక్య చిత్రాన్ని నిర్మించటమనీ– వంటి అనేక సూత్రీకరణలకు “చిలక్కొయ్య” లోని వివిధ కవితలు సాక్ష్యాలుగా, ఉదాహరణలుగా నిలుస్తాయి.
చిలక్కొయ్య కవిత్వ సంపుటి తరువాత శిఖామణి గారు అనేక పుస్తకాల్ని వెలువరించారు. తెలుగు సాహిత్యంలో, ఆర్థ్రత, తాత్వికత, సామాజిక బాధ్యత తో రచనలు సాగించే కవిగా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొన్నారు. ఆధునిక కవిత్వంలో ఉపమ, రూపక అలంకారాల్ని ప్రతిభావంతంగా ప్రయోగించే కవిగా ప్రసిద్ధికెక్కారు.
ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించి, ఆనందించి, ప్రభావితమైన ఎంతో మందిలో నేనొకణ్ణి అని చెప్పుకోవటానికి గర్వపడతాను.
బొల్లోజు బాబా

2 comments:

  1. అక్కడ చలిపెట్టే అధికారులుండవచ్చు
    వినయపు ఉన్ని శాలువా మర్చిపోలేదు కదా”- very good lines

    ReplyDelete
  2. "ఎవరికి వారు రహస్యంగా తమతమ మర్మావయవాలను మనసుల్లోనే తడిమిచూసుకొంటారట"-బాబోయ్ ఏంటిదీ? ఇటువంటి వాక్యలు రాస్తారు. మళ్ళా విమర్శించవద్దు అంటారు. ఏందిసార్ ఇది.

    కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ పంక్తులు ఎంతో బాగున్నాయి సార్.
    “ఆర్ధ్రత నీరెండిన నగరం నదిలో
    ఆమె ఓ శిధిల నౌక …..
    అర్ధరాత్రి దాటాకా
    ఏ శీతలపవనమో ఆమెను ఒణికిస్తే
    ముడుచుకుపడుకొన్న ఆమె దేహంమీద
    చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పి
    చెట్టుకొమ్మకు లాంతరు దీపమై వేలాడుతాడు.”.

    ReplyDelete