Showing posts with label సౌందర్యం. Show all posts
Showing posts with label సౌందర్యం. Show all posts
Tuesday, September 23, 2008
ఆకుపచ్చని తడిగీతం
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వాన కురుస్తానే ఉంది.
నల్లని మంచుగడ్డ కరిగిపోయింది.
ప్రశాంత తరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేశించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది.
సూర్యకిరణాల కిలకిలారావానికి
లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది.
తీగమొక్కలు జారిపోయిన పట్టును
మళ్లా వెతుక్కొంటున్నాయి.
తడినేలపై పడి పరావర్తనం చెందిన
లేకిరణాలు, ఆకుల క్రింద దాక్కొన్న
చీకటిని తరిమేస్తున్నాయి.
చెట్ల ధూళి వాన గుంటలలో చేరి
ఆకుల అందాలను చూస్తూ విస్తుపోతోంది.
మబ్బు అంచుల జరీ మెరుపులతో
పోటీ పడే ఈకల కోసమై
ఓ పక్షి శ్రద్ధగా ప్రీనింగ్ చేసుకొంటూంది.
తలంటుకొన్న యవ్వనిలా శోభిస్తున్న
పొగడ చెట్టు గాలికిరణాలలో
పత్రాలను ఆరబెట్టుకొంటూంది.
ఉదయపు గొంతులోంచి
ఆకుపచ్చని తడిగీతం
రెక్కలుకట్టి ఎగురుతూంది.
మేఘాలవతల వరకూ
సౌందర్యం పరచుకొంది.
తటాకం అంతవరకూ భద్రంగా
దాచుకొన్న తామరదుంపకు
కొత్తచిగుళ్లు లేస్తున్నాయి
నేల ఆలపించే ప్రాచీన గీతాన్ని చిత్రించటానికై.
************
తడిచిన సీతాకోకచిలుక
కవిత్వంపై వాలి రెక్కలల్లార్చింది.
బొల్లోజు బాబా
Tuesday, August 26, 2008
వెన్నెల నావనెక్కి........
హేమంతోత్తరీయాన్ని కప్పుకున్న వనం
ఆకుల కొనల వేలాడే
మంచు బిందువుల భారాన్ని
మోయలేక అలసిపోతోంది.
రాలిన పూలను తురుముకొన్న కాలిబాట
సుగంధాలను గానం చేస్తోంటే
ఇరువైపులా ఉన్న తరువులు
తన్మయత్వంతో తలలూపుతున్నాయ్.
రాత్రి వలలో చిక్కుకున్న పక్షులు
వేకువ జ్ఞాపకాలను స్వప్నిస్తున్నాయి.
నిదురించే లోకం కోసమై
ఆకాశం చుక్కల పహారా పూయించింది.
నిద్రలో శిశువు
పెదాలపై పరచుకొనే నవ్వులా చందమామ,
నిర్మలంగా, స్వచ్ఛంగా, ప్రకాశంగా వెలిగిపోతోంది.
చందమామ చుట్టూ ఉదారంగు వరదగుడి
కాంతి రహస్యాలను నాట్యం చేయిస్తూంది.
సెలయేటి నీరు గులక రాళ్ళతో గలగలా మాట్లాడుతూ
త్రోవ వెంబడి వడివడిగా ప్రవహిస్తూంది.
సముద్రాల కబుర్లనీ, మేఘాల ఊసుల్ని,
వానచినుకుల ముచ్చట్లనీ, కల్మషం లేకుండా
చెప్పుకుపోతూన్న అలల పలుకుల్ని
చెవులు రిక్కించి సంభ్రమంతో వింటోంది
సుమపాత్రిక లోని మకరందం.
గవ్వ గుండెలో గిరికీలు కొట్టినప్పటి వడిని
ఇంకా కోల్పోని గాలి వయ్యారంగా
వనమంతా కలియ తిరుగుతూంది.
వెన్నెల నావనెక్కి
రాత్రి ఒంటరిగా సాగిపోతోంది
వేకువ తీరానికై.
బొల్లోజు బాబా
Wednesday, August 13, 2008
సౌందర్యం
సెలయేటి ఎగువన ఎవరో
నీటిలో వెన్నెల బిందువుల్ని
కలిపారు.
సెలయేరు పొడవునా వెన్నెలే!
నీరుతాగాలని వంగితే
దోసిట్లో చందమామ.
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)
