Tuesday, August 26, 2008

వెన్నెల నావనెక్కి........



హేమంతోత్తరీయాన్ని కప్పుకున్న వనం
ఆకుల కొనల వేలాడే
మంచు బిందువుల భారాన్ని
మోయలేక అలసిపోతోంది.

రాలిన పూలను తురుముకొన్న కాలిబాట
సుగంధాలను గానం చేస్తోంటే
ఇరువైపులా ఉన్న తరువులు
తన్మయత్వంతో తలలూపుతున్నాయ్.

రాత్రి వలలో చిక్కుకున్న పక్షులు
వేకువ జ్ఞాపకాలను స్వప్నిస్తున్నాయి.

నిదురించే లోకం కోసమై
ఆకాశం చుక్కల పహారా పూయించింది.

నిద్రలో శిశువు
పెదాలపై పరచుకొనే నవ్వులా చందమామ,
నిర్మలంగా, స్వచ్ఛంగా, ప్రకాశంగా వెలిగిపోతోంది.
చందమామ చుట్టూ ఉదారంగు వరదగుడి
కాంతి రహస్యాలను నాట్యం చేయిస్తూంది.

సెలయేటి నీరు గులక రాళ్ళతో గలగలా మాట్లాడుతూ
త్రోవ వెంబడి వడివడిగా ప్రవహిస్తూంది.

సముద్రాల కబుర్లనీ, మేఘాల ఊసుల్ని,
వానచినుకుల ముచ్చట్లనీ, కల్మషం లేకుండా
చెప్పుకుపోతూన్న అలల పలుకుల్ని
చెవులు రిక్కించి సంభ్రమంతో వింటోంది
సుమపాత్రిక లోని మకరందం.

గవ్వ గుండెలో గిరికీలు కొట్టినప్పటి వడిని
ఇంకా కోల్పోని గాలి వయ్యారంగా
వనమంతా కలియ తిరుగుతూంది.

వెన్నెల నావనెక్కి
రాత్రి ఒంటరిగా సాగిపోతోంది
వేకువ తీరానికై.


బొల్లోజు బాబా

10 comments:

  1. బాబాగారూ, ఎలా చెప్పాలో తెలియటం లేదు. హ్మ్..మాయాబజార్ సినిమాలో "లాహిరి లాహిరి లాహిరిలో" పాట చూసినట్లుంది. అదొక ఆనందం అంతే!

    ReplyDelete
  2. చాలా బావుంది.

    ReplyDelete
  3. ఇలాంటి అనుభూతుల్ని అనుభవించి చాలా కాలమయ్యింది
    వెన్నెలలో ఆరుబయట పడుకొని చుక్కలు లెక్కపెట్టిన క్షణాలను, మిణుగురుల ప్రేమసందేసాలు, కీచురాళ్ళ శబ్దాలను చెవులు రిక్కిచివిని వాటికోసం వెదికిన గుర్తులను
    కళ్ళముందు కదలాడాయి.
    అభినందనలు

    ReplyDelete
  4. చాలా బావుంది, నేను మీ దగ్గరనుంచి చాలా expect చేస్తున్నాను, అయినా నన్ను మీరు నిరాశ పరచకుండా రాస్తున్నారు.
    "రాత్రి వలలో చిక్కుకున్న పక్షులు
    వేకువ జ్ఞాపకాలను స్వప్నిస్తున్నాయి.

    నిదురించే లోకం కోసమై
    ఆకాశం చుక్కల పహారా పూయించింది."
    ముఖ్యంగా ఈ రెండు చరణాలు అద్భుతం అంతే, అంతకు మించి నా దగ్గర మాటలు లేవు.

    ReplyDelete
  5. మీ కవిత్వం చదివినపుడల్లా 'చాలా బాగుంది ' అనే భావాన్ని కవితాత్మకంగా చెపుదామనుకుంటాను. మనసు మూగబోయాక మాటలెలా వస్తాయి? అందుకే "చాలా బాగుంది" అని ఊరుకోవలసి వస్తుంది.

    ReplyDelete
  6. అప్పుడే మంచు తడియారని గడ్డిపరకల మీదుగా నడిచినట్లుంది,
    అప్పుడే మొదటిసారి నవ్విన పసిపాప బోసినవ్వుని చూసినట్లుంది,
    అప్పుడే కోయిలపాట, నెమలినాట్యం రెండూ ఒకేసారి చూసినట్లుంది,
    మీ ఈ కవిత చదువుతుంటే.

    రాలిన పూలను తురుముకొన్న కాలిబాట
    సుగంధాలను గానం చేస్తోంటే
    ఇరువైపులా ఉన్న తరువులు
    తన్మయత్వంతో తలలూపుతున్నాయ్. నాకైతే ఇది బాగా నచ్చేసింది.

    ReplyDelete
  7. వెన్నెల నావనెక్కి
    రాత్రి ఒంటరిగా సాగిపోతోంది
    వేకువ తీరానికై.....chaala baagundi

    ReplyDelete
  8. మహేష్ గారు అవునా? నాక్కూడా హేపీ గా ఉంది.
    శ్రీవిధ్య గారు నెనర్లు
    కనుమూరి గారు
    మీ ప్రొఫైల్ చాలా బాగున్నదండి.
    మీ కవితా సంకలనంలోని కవితలు అద్బుతంగా ఉన్నాయి. చూస్తున్నాను.
    మీరు చెప్పినట్లు గా మిణుగురులను, కీచురాళ్ళను గురించి కూడా ఇలా వ్రాసాను. వీలైతే వీటిని ఎక్కడ చొప్పిస్తే బాగుంటుందొ సలహా ఇవ్వగలరు.

    కనబడకుండా వినిపించే కీచురాళ్ళ కవిత్వానికి
    నిశ్శబ్ధం మద్య మద్యలో ఆహా, ఓహో అంటోంది.

    మల్లె ఛాయ వెలుగులో తిరుగాడే మిణుగురులు
    పగలు వెలిగే వీధి దీపాల్లా వెల వెల బోతున్నాయి.

    ప్రతాప్ గారు,
    నిజమా? నాకవితలు మిమ్ములను నిజంగా నిరాశ పరచటం లేదా? నాకు ఒకపక్క ఆనందం గాను మరో పక్క అనుమానంగాను ఉంది.
    థాంక్స్

    సుజాత గారు
    మీప్రోత్సాహమే నా కవితలకు బలం.
    థాంక్యూ వెరీ మచ్ మేడమ్ .

    అశ్విన్ గారు
    నెనర్లు
    కలగారు
    అవునా?
    ఈ కవితలో మీరు చెప్పిన పాదం నాకూ బాగా నచ్చింది.
    థాంక్యూ వెరీ మచ్
    చంద్రగారు
    ఆ ఆఖరి పాదం చుట్టు అల్లిన కవితండి ఇది. మొదట ఆ పాదం వ్రాయటం జరిగింది. దానిని పొడిగింపే ఈ కవిత.
    దీనికి కారణభూతమైన అనుభవం ఇదీ.
    అడ్డ తీగల సమీపంలో పింజరికొండ అనే వాగు ను సందర్శించటానికి వెళ్లి బాగా చీకటి పడే వరకూ ఉండి పోయాం ఆ జ్ఞాపకాలకు వీక్ రీకాల్ ఈ కవిత.
    నచ్చినందుకు ధన్యవాదములు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. కొన్ని వ్యక్తీకరణలు చాలా బావున్నాయి. మొత్తంగా కవిత బావుంది.

    ReplyDelete