Friday, August 29, 2008
కవిత్వం మా ఇంటి పెద్ద
ప్రశ్నల ఇసకను
కళ్ళల్లో చల్లి పోతుంది ఒక్కో అనుభవం.
అపుడు కలిగే ఆలోచనలను
గ్లాసులు భందించలేవు.
గదులు నిర్భందించలేవు.
హృదయం కట్టి పడేయలేదు.
ఫలితంగా
లోపల్లోకంలో వీచే వెర్రి గాలులకు
చెట్ల కొమ్మలు ఊగిపోతూంటాయి.
అపుడు కవిత్వం
పరామర్శించటానికి వస్తుంది.
అపుడు కవిత్వం
ధైర్యవచనాలు చెప్పి ఓదారుస్తుంది.
అపుడు కవిత్వం
నన్ను మళ్ళా మనిషిని చేస్తుంది.
అందుకే
కవిత్వం మా ఇంటి పెద్ద.
బొల్లోజు బాబా
(నేను కవిత్వాన్ని ఎందుకు పట్టాను అన్న జాన్ హైడ్ కనుమూరి గారి మాటలు చదివి)
http://johnhaidekanumuri.blogspot.com/2007/09/1.html
Subscribe to:
Post Comments (Atom)
cute.
ReplyDeleteHowever, in the contemporary context, I personally like poetry that is a wake up call, that is an empowering energy and an electrifying power - rather than a soothing touch.
మీవంటి పెద్దలు కవులు ఇలాంటి అచ్చు తప్పులు చెయ్యడం భావ్యం కాదు.
బంధం .. నిబంధం ..
కొత్త పాళీ గారికి
ReplyDeleteనచ్చినందుకు ధన్యవాదములు.
అచ్చుతప్పులు కరక్టే. సూచించినందుకు ధన్యవాదములు.
పెద్దలు,కవులు అంటూ పెద్ద పెద్ద మాటలు దయచేసి వాడకండి సారు. భయమేస్తుంది.
ఇక పోతే కవిత్వం గురించి-
మీ అభిప్రాయాలు ఉన్నతంగా ఉన్నాయి. ఆదర్శవంతంగా కూడా ఉన్నాయి.
నాకు సంబందించినంతవరకు కవిత్వమనేది కవికి ఒక అవుట్లెట్ గా భావిస్తాను.
అందులో సిద్దాంతాలు, ఇజాలు, సూత్రాలు ఇమడ్చగలగటం ఎందుకో నాకు ఊహకు కూడా అందని ప్రపంచం అది.
అంత సామర్ధ్యం కానీ, సాధికారికత కాని నాకున్నాయని నేను భావించను కూడా.
కనుమూరి గారికి కవిత్వం ఏ విధంగా సహాయపడిందో తెలుసుకొని ఆశ్చర్యపడి, ఈ కవిత వ్రాయటం జరిగింది.
మీకు నచ్చినందుకు సదా కృతజ్ఞుడను.
బొల్లోజు బాబా
బావుందండీ.
ReplyDeleteమద్యపానాన్ని వదిలించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలలో కవిత్వం నన్ను పట్టుకుంది.
ReplyDeleteచదువుతూ, ఆస్వాదిస్తూ నా అలవాటును మానుకోగలిగాను.
ఆ అనుభవాన్ని పంచుకోవాలని నాకు దొరికే ప్రతీ అవకాశంలోనూ ప్రయత్నిస్తుంటాను. అలా రాసిన ఒక టపా మీకు నచ్చినందుకు ప్రతిగా కవిత్వంతో స్పందించినందుకు చాలా సంతోషంగా వుంది.
కవిత్వాన్ని ఇంటికి పెద్దను చేసి కొంత సాన్నిహిత్యాన్ని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు.
కవిత్వం నాకిప్పుడు ఉచ్చ్వాస నిశ్చ్వాస మాతమే
ధన్యవాదాలు