Wednesday, August 20, 2008

ఎంత హాయి ........

వేళ్ల అందాలని మట్టి క్రింద
కప్పెట్టేసిన చెట్టు దెంత స్వార్ధం!

పక్షిపిల్ల సౌందర్యాన్ని
జిగురుజిగురుగా తనలొ దాచేసుకొన్న
గుడ్డుదెంత జాణ తనం.

అద్భుత శిల్పాలను గర్భంలో ధరిస్తూ
బండగా కనిపించే రాళ్లెంత మొండివి !

రాత్రెంత మోసకత్తె కాకపోతే
వేకువని సూచనగానైనా తెలుపుతుందా !

అంతెందుకు నువ్వు మాత్రం
మదినిండా నన్ను నింపుకొని
ఒక్క చిరునవ్వు చాక్లెట్టైనా ఇచ్చావా?


***************************


కలల కర్చీఫ్ తో గుండె కన్నీళ్లు
తుడుచుకోవటమెంత హాయి ......


బొల్లోజు బాబా

8 comments:

 1. కలల కర్చీఫ్ తో గుండె కన్నీళ్లు
  తుడుచుకోవటమెంత హాయి ......

  Wah.. Wah!!

  ReplyDelete
 2. చిరునవ్వుని చాక్లెట్ తో పోల్చటం--బాగుంది.మొదటిసారిగా విన్నాను ఈ పోలిక.

  ReplyDelete
 3. కలల కర్చీఫ్ తో గుండె కన్నీళ్లు
  తుడుచుకోవటమెంత హాయి ......

  చాలా బాగుందండి.

  ReplyDelete
 4. హమ్మయ్య! ఇన్ని రోజులకి, చదివిన వెంటనే నేను ఒక వ్యాఖ్య వ్రాయాలనిపించేలా ఉంది మీ కవిత.

  తెలుగు కవితా బ్లాగ్లోకంలో మీ కవితలకు ఓ ప్రత్యేకత, విశిష్టత ఉంది. మీ కవితలలో ప్రతిఫలించే ఆవేశం, ఆవేదన, ఆర్తి, సమస్య దృక్కోణం, వ్యక్తపరిచే శైలి లాంటి వాటిని విశ్లేషించటం, నిర్వచించటం అనేది మాటలలో చెప్పటానికి ప్రయత్నించటం అంత తేలికైన/తెలివైన పని కాదు

  అంత బాగుంటాయి మీ కవితలు ..

  అలాగే నేను మీ కవితలన్నీ చదువుతాను కానీ ఇప్పటి దాకా వ్యాఖ్యానించకపోవటానికి కారణం మీ కవితల్లో కొంచెం ఎక్కువగా దొర్లే అంగ్ల పదాలు ... (ఈ కవితలో ఉన్న చాక్లెట్, కర్ఛీఫ్ లాంటివి ఉన్నా flow కి అడ్డంగా అనిపించలేదు) .. వీలుంటే, మీకు ఇష్టమైతే/నచ్చితే వాటిపై కొంచెం దృష్టి పెట్టండి. కవిత వ్రాసేటప్పుడు కాకపోయినా(ఈ సమయంలో కొంచెం కష్టమైన పనే ఎందుకంటే మనకి ఆ పద/భావ ప్రవాహంలో అలవోకగా అలవాటైన ఆ ఆంగ్ల పదాలు దొర్లటం చాలా సహజం కనుక), తరువాత కొన్ని రోజులకు అయినా మీరు తిరిగి చూసుకున్నప్పుడో/చదువుకుంటున్నప్పుడో అయినా సరే. అప్పుడు అందరూ నచ్చాయి లేదా/మరియు (చాలా) బాగున్నాయి అని చెప్పే స్థాయి నుంచి, మీ బ్లాగును అందులోని టపాలను సోదాహరణంగా ఉటంకించే స్థాయికి ఎదిగి ఒక విధమైన అజరామరంగా నిలిచిపోయే స్థానాన్ని పొందగలుగుతుంది.

  అవి చాలా వరకు అత్యంత ఇష్టమై తినే చాక్లెట్/పటిక బెల్లం/తాటి చాప/మామిడి తాండ్ర లలో తగిలే కంకర/గులక రాళ్ల లాగా తగులుతాయి (ఇసుక పొలుకులు అయితే వదిలేయగలిగేవాడిని). అలాగని వాటి స్థానంలో సంక్లిష్టమైన/మీకు నచ్చని పదాలు పెట్టటం అంత మంచి పధ్ధతి కాదనుకోండి.

  నాకు చెప్పాలి అనిపించినంతలో వివరంగా చెప్పాలి అనే ఓపిక/సమయం లేకపోతే నేను సహజంగా అసలు వ్యాఖ్య/టపా వ్రాయను (ఇది అస్సలంటే అస్సలు మంచి పధ్ధతి కాదు ముఖ్యంగా వ్యాఖ్యల విషయంలో కానీ అదో బలహీనత ... అందుకే ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది ఇక్కడ నా వ్యాఖ్యకు .. ఏమీ అనుకోకండి ...

  [ ఇంకా ఇలా నాకు నచ్చి కూడా వ్యాఖ్యలు వ్రాయని వాటికి(పూర్ణిమ, మీనాక్షి, శ్రీవిద్య, ఏ.దిలీప్, నిషిగంధ మొదలగునవి) ఎప్పుడు మోక్షమో ] ...

  ReplyDelete
 5. బావుందండి మీ కవిత..
  చక్కని భావం... :)

  ReplyDelete
 6. పూర్ణిమ గారికి, నరసింహ గారికి, మురళి గారికి, శ్రీవిధ్య గారికి, కల గారికి, మహేష్ గారికి స్పందించి నందుకు చాలా చాలా ధన్య వాదములు.

  తెలుగు వాడిని గారికి,
  మీ కామెంటుకు కృతజ్ఞుడను.
  నాకవితలపై మీ అభిప్రాయాలు నాకు చాలా ఆనందం కలిగించాయి. ధన్య వాదములు.

  నాకవితలలో కొన్ని ఇంగ్లీషు పదాలు దొర్లుతూంటాయి.
  ఇది వరలో ప్రతాప్ గారు (యూజర్ నేమ్ - పాస్ వర్డ్ కవితకు ) కూడా ఆక్షేపించారు. వారికి సమాధానంగా it happens like that అని బుకాయించేసాను. అంతకన్నా ముందు దిలీప్ గారు కూడా ఇదే విషయం ప్రస్తావించారు. (తెలుగు మోనాలిసా కవితకు) ఆయనకు కూడా దాదాపు ఇదే విధమైన జారుడు సమాధానమిచ్చి సరిపుచ్చాను.

  now comes the bolt from you
  ఇంగ్లీషు పదాలెందుకో ఒకసారి ఫ్లో లో పడిపోయినతరువాత చాలా సార్లు మార్చాలని ప్రయత్నించినా నచ్చక అలా ఉంచేయటం జరిగింది. అంటే ఆ సందర్భంలో తెలుగు పదం కన్నా వాడిన ఇంగ్లీషు పదమే ఎక్కువ ఫీల్ ని ఇస్తుందన్న అభిప్రాయంతో (ఇది నా అభిప్రాయమే సుమా). కొన్ని ఉదా: యూజర్ నేమ్ = వాడుక నామం
  బటర్ ఫ్లై : పైన చెప్పిన దిలీప్ గారి ఆక్షేపణ
  చాక్లెట్ : ఇది మీకు కూడా నచ్చిందన్నారు కనుక దీనికి గౌరవప్రదమైన మినహాయింపు వచ్చేసిందనుకుంటున్నాను.
  హిపోక్రిసీ: నిజానికి ఈ పదం నాకు ఇంగ్లీషు లోనే పరిచయం అయ్యింది. దీని సమానార్ధకం క్షమించాలి నాకు తెలియదు.
  టైరు: చక్రం అనికూడా అనొచ్చని ఇప్పుడు తెలుస్తూంది.

  ఇంకా చాలా పదాలు దొర్లుతున్నాయి.

  ఈ సందర్భంగా నాకర్ధమయ్యిందేమిటంటే ఒక ప్రవాహంలో కవితను చదువుతున్న చదువరికి, మధ్యమధ్యలో తగిలె ఇంగ్లీషు పదాలు కాలిలోముల్లు లాగా గుచ్చుకుంటాయని.

  ఈ విషయాన్ని చాలా వివరంగా తెలిపినందుకు, మీకు సదా సదా కృతజ్ఞ తలు తెలియచేసుకొంటున్నాను.

  ఇకపై రాసే కవితలలో తప్పనిసరైతే తప్ప ఇంగ్లీషు పదాలను ప్రయోగించకూడదనే అభిప్రాయానికి వచ్చాను.

  ఎంతో సమయం వెచ్చించి మీ అభిప్రాయాలను తెలిపినందుకు ధన్యవాదములు.

  బొల్లోజు బాబా

  ReplyDelete