Sunday, August 17, 2008
జాగ్రత్త జాగ్రత్త తొడుగుకు గానా...........
అటు పారదర్శకమూ కాదు,
ఇటు కాంతి నిరోధకము కానటువంటి
తొడుగువెనుక, దేహాన్ని కుదించుకొని
నిష్ఫల స్కలనాలవంటి కలల్ని స్రవిస్తూ,
అవ్యక్త ఆలోచనలలో ఈదులాడుతూ,
అస్ఫష్ట దృశ్యానికి తోచిన భాష్యం చెప్పేసుకొని
సరిపెట్టేసుకొంటున్నాం.
జీవితం కలల తాలూకు శకలమైనపుడు
మాట , చూపు, స్పర్శ ప్రతీదీ,
అస్ఫష్టంగానే ఉండాలి.
అదే ఇక్కడి లౌక్య నీతి.
అందుకనే కదా పుట్టిన వెంటనే
ఉమ్మనీటి సంచిని తీసేసి
తొడుగు తగిలించేస్తున్నాం.
నీకూ నా స్పర్శకూ మద్య
నీకూ నా మాటకు మద్య
నీకూ నా చూపుకూ మద్య
ఈ తొడుగు
అమానవీకరణ వృక్షాన్ని మొలిపించే విత్తవుతుంది.
నిన్నూ నన్ను వేలుపట్టుకొని
హిపోక్రిసీ ప్రపంచంలోకి నడిపిస్తుంది.
అంతా మంచి గానే ఉందన్న భ్రమ కలిగిస్తుంది.
అదేకదా మనమందరం వాంచించేది.
దాన్నే కదా ఇళ్లల్లో, పాఠశాలల్లో, ఆలయాల్లో
నిర్భందించి ఇచ్చిన "పాలోవ్ కండిషనింగ్."
అబ్బా చుట్టూ ఎన్నిరకాల తొడుగులో
ప్రతీదీ జీవితాన్ని సుఖమయం చేయటానికే!
జాగ్రత, జాగ్రత,
తొడుగుకు గానా చిల్లు పడిందా
నిజాలు బయటపడిపోతాయి
అబద్దాల సుందరి కాస్తా కురూపి అవుతుంది.
రువ్వే నవ్వులు కాస్తా ప్లాస్టిక్ పువ్వులైపోతాయి.
కరచాలనాల,కౌగిలింతల వెనుక
దాగిన కుట్రలు కనబడిపోతాయ్.
సంభాషణల్లోని అంతరార్ధాలు తెలిసిపోతూంటాయ్.
అనుబంధాలు, ఆప్యాయతల, అభినందనల వెనుక నక్కిన
అవసరత , సౌలభ్యం, కాంక్షలు బయట పడిపోతాయ్.
జాగ్రత, జాగ్రత,
సుఖమయ సహజజీవనం కాస్తా
అసహజమైపోతుంది.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
ఏం చెప్పను, కవిత లోని భావం మాత్రం వెన్నులో చలి పుట్టించేలా ఉంది.
ReplyDeleteఎవరు ఎవరో, ముందర వెనుకా గోతులు తీసేదేవరో..
ఎవరు ఎవరో, ముందర వెనుకా కుట్రలు పన్నేదేవరో..
ఎవరు ఎవరో, ముందర వెనుకా మాటల వ్యంగాలు విసిరేదెవరో..
తెలుసుకోవడం కష్టమే మరి.
మీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాదు కానీ అది జాగ్రత్త అని అనుకొంటాను.
pratap gaaru
ReplyDeletethaaMksaMDI
bollojubaba