Saturday, August 2, 2008

ఈ రథాన్ని వెనక్కు లాగొద్దు

చమట సంద్రం లో ప్రాణవాయువుకై
ఈదులాడి ఈదులాడి
దొరికిన ఆధారంతోనే
ఆ క్షారజలాల్ని మధించి
సాధించిన అమృతాన్ని తాగేవేళ
అబ్బే రిజర్వేషను బాపతురా
వీడి దగ్గర సరుకెక్కడుంటుంది
అనే మాటల ఘాతానికి హృదయం
కరంటు తీగలను తాకిన
గబ్బిలమై విలవిలలాడుతుంది.

ఆలోచనలు, ఆశయాలు మనసులూ
ముప్పేటల హారంలోని ముత్యాల్లా
పెనవేసుకుపోయినపుడు
తనువులు పరిణయ లాంఛనాన్ని పూర్తి చేసుకుంటే
"వర్ణ సంకరం, వర్ణ సంకరం" అనె గుసగుసలకు
గుండె దిగులు చెట్టై గుబులు
పుష్పాలు పూస్తూంటుంది.

బి. సి. అంటే ఎవరు నాన్నా?
అని కన్న కూతురడిగినపుడు ఏమని చెప్పను?

అద్దకం పనిలో రంగుల్లోని సీసం
బొట్లు బొట్లు గా ఎముకల్లో చేరి
నిర్వీర్యమయినవాడని చెప్పనా? లేక

బంగారాన్ని కొట్టి కొట్టి భుజం బంతిగిన్ని కీలు
అరిగిపోగా చేయి ఎత్తలేని స్థితిలో
పస్తులుంటున్న వాడని చెప్పనా?

ఆస్బెస్టాస్ రేణువులు ఊపిరితిత్తులను
తూట్లు పొడవగా దగ్గుతూ రొప్పుతూ
వాటినే తోలు తిత్తులుగా చేసి
కొలిమిని మండిస్తున్నవాడని చెప్పనా?

లోహ పాత్రల ఇంద్రజాలంలో
తన జీవనాధారం మాయమవగా
మట్టిగరుస్తున్న మృత్తిక కళాకరుడని చెప్పనా? లేక

సాయింత్రం తిరిగొస్తేనే బతికున్నట్టుగా
లెక్కింపబడే సముద్ర జాలరి దినదిన గండ జీవితానికి
పొడిగింపుగా మిగిలిన వారసుడని చెప్పనా?

ద్రోణాచార్యుడు ఒక వేలే అడిగాడు
కానీపారిశ్రామిక విప్లవాచార్యుడు కోరిన
వేల వేళ్ల యొక్క దేహాల సంతతి అని చెప్పనా?

ఏమని చెప్పాలి నాకూతురికి
బి.సి. అంటే ఎవరని చెప్పాలి?
నేనెవరు అంటే ఏమని ఆవిష్కరించాలి?

శ్మశానంలా తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీని ఈ సమాజానికి
తరతరాలుగా అందిస్తూనే ఉన్న ఈ జీవి
ఇపుడిపుడే రొట్టెలో భాగానికై చేయి చాచినందుకు ............

బొల్లోజు బాబా



(---నేనింతవరకూ తీసుకువచ్చిన ఈ రధాన్ని ముందుకు నడపండి. కనీసం ఉన్నచోటైన ఉంచండి తప్ప వెనక్కు మాత్రం నడిపించకండి -- అన్న డా. బి. ఆర్. అంబేద్కర్ మాటల స్ఫూర్తితో )

20 comments:

  1. కవిగారు నమస్కారము. తెలుగు భాషమీద ఆభిమానం, ప్రీతి వున్న ప్రతిఒక్కరికీ మీకవిత ప్రశంసనీయం. చక్కటి తెలుగును మీ కవితల్లో చూస్తున్నాను. చాలా బావుంది. కవితభావం స్పూర్తిదాయకం. భావప్రకటన అద్బుతం.

    ReplyDelete
  2. ఇంకా పొడిగించాలి కవి గారు,ఇక్కడ క్లుప్తత కూడదు

    ReplyDelete
  3. చేయి చాచినందుకు and?

    ReplyDelete
  4. చాలా శక్తివంతమైన అభివ్యక్తి!!!

    "శ్మశానంలా తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీని ఈ సమాజానికి" - ఈ ఒక్క పోలికా చాలు, మీకు నేను శిరసువంచి పాదాభివందనం చెయ్యడానికి.

    ReplyDelete
  5. "శ్మశానంలా తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీని ఈ సమాజానికి...."
    అద్భుతమైన అక్షరీకరణ! జయహో బాబా గారూ!

    ReplyDelete
  6. అక్షరలక్షలు చేసే కవిత.ప్రతి వాక్యంలో లక్ష గుండేల ఆవేదనుంది.ప్రతి పదచిత్రంలో ఒక జాతి ఆక్రోశముంది.

    ఇది చాలదు ఇంకా కావాలి బాబాగారూ!

    ReplyDelete
  7. నర నరాల్లో శక్తిని, ఉత్తేజాన్ని నింపే భావ ప్రకటన!
    నేనూ మళ్లీ చెపుతున్నాను..
    "స్మశానంలా తీసుకోవడం తప్ప ఇవ్వలేని సమాజం" ఈ ఒక్క లైను చాలు గుండెల్లో బాకులా దిగడానికి.

    ReplyDelete
  8. బ్లాగు మిత్రులందరికీ విన్నపం
    ఈ కవితలో ఎక్కడో ఎదో మిస్సింగ్ అవుతున్నట్లు అనిపించి నేను ఇంతకాలంగా పోష్టు చెయ్యలేదు. దయచేసి ఈ కవితను తూకంవేసి రిఫైను చెయ్యటానికి సహకరించగలరు.

    నాకనిపించిన లోపాలు (అవి లోపాలా కాదా కూడా చెప్పండి)
    1. టైటిల్.
    2. కవితమద్యలో ప్రధమ పురుష రావటం,
    3. ముగింపులో స్మశానం ....... పదచిత్రం తరువాత వాక్యాలు మిస్ ఫిట్ అయినట్లనిపిస్తున్నాయి.

    ప్లీజ్. దయచేసి ఈ కవితను విశ్లేషించవలసినది గా కోరుతున్నాను.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. జీవితం అంటే కులం కాదు, జీవితం అంటే జీవించడం,
    రండి రండి కలం పట్టి కులంబూచిని తరిమి కొడుదాం..
    రండి రండి హలం పట్టి కులగజ్జి సమాజాన్ని దున్నేద్దాం..
    రండి రండి శరం ఎక్కుపెట్టి వర్ణరహిత లోకాన్ని నిర్మిద్దాం..
    బాబా గారు మీ కవిత చదవగానే నా మదిలో పొంగిన భావమిది.
    పొతే మీ కవిత విశ్లేషణ దగ్గరికి వస్తే,
    1) టైటిల్ "బి. సి. అంటే ఎవరు నాన్నా?" అని పెడితే ఎలా వుండేదో ఆలోచించండి.
    2) ఈ కవిత నాకు రెండు కవితల సంకలనంగా అనిపిస్తోంది.
    ఇది గమనించండి, "ద్రోణాచార్యుడు ఒక వేలే అడిగాడు
    కానీపారిశ్రామిక విప్లవాచార్యుడు కోరిన
    వేల వేళ్ల యొక్క దేహాల సంతతి అని చెప్పనా?" ఇది ఆధికమని అనిపిస్తోంది. దీని బదులుగా ఇంకేమన్నా మంచి పదచిత్రం ఎన్నుకొని ఉంటే బావుండేదేమో?
    3) ముగింపుని మీరివ్వకుండా, మీ కవితే ఎన్నో లక్ష, యక్ష ప్రశ్నలని పాఠకుడికి కలిగించేలా ఉంటే ఇంకా బావుండేదేమో.
    ఇవన్ని నా అభిప్రాయాలు మాత్రమే. మీలాంటి వాళ్లు రాసిన కవితల్ని విశ్లేషించే శక్తి లేని నాలాంటి సామాన్యుడు చేసిన విశ్లేషణ అని అనుకోండి అంతే.

    ReplyDelete
  10. "శ్మశానం లా తీసుకోవటమే కాని ఇవ్వటం తెలీని ఈ సమాజానికి"-ఇదే సరియైన టైటిలుగా అనిపిస్తోంది నాకు.కామేశ్వర రావు మాష్టారు చెప్పినట్లుగా ఈ ఒక్క పదబంధాన్ని కూర్చినందుకు గాను మీకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను."తరతరాలుగా" కు బదులుగా "ప్రతీ తరం లోనూ" అని ఉంటే బాగుంటుందా?

    ReplyDelete
  11. నేను కవితలమీద అట్టే కామెంటు రాయలేను కానీ మీకవిత చదువుతుంటే మీ ఆర్తీ, తపన చక్కగా స్పష్టమయేయి. చిత్తశుధ్ధితో రాశారు. అభినందనలు, బొల్లోజు బాబాగారూ.

    ReplyDelete
  12. "బి.సి అంటే ఎవరు నాన్నా?" అనేదే కదిలించే టైటిలుగా అనిపిస్తోందండీ నాక్కూడా!

    ReplyDelete
  13. కవిత చాలా బాగుందండీ. శక్తివంతమైన పదాలు వాడారు. టైటిలు విషయంలో ప్రతాప్, సుజాత గార్ల అభిప్రాయమే నాదీను.

    - చంద్ర మోహన్

    ReplyDelete
  14. టైటిల్ విషయంలో నేనూ ప్రతాప్,సుజాత,చంద్రమోహన్ లకే నా ఓటు. ఇక మీకు అనిపించిన లోపాలు నాకైతే కనిపించలేదు. మీ కవితా ప్రవాహంలో సింపుల్గా కొట్టుకుపోయానంతే!

    ReplyDelete
  15. చాలా అధ్బుతం
    గుబులు పుష్పాలా(ముళ్ళా ?)
    ప్రతాప్ గారి(2)తో ఏకీభవి్స్తున్నాను.
    మీ ఇమేజ్ లు బొకేల్లోని పువ్వుల్లా చక్కగా అమరి కవితకి మంచి అందాన్నిస్తాయి.

    ReplyDelete
  16. నా కెందుకో ఈ కవితలో మీరు రథాన్ని వెనక్కి లాగినట్టుంది.
    నేను మాట్లాడుతున్నది ఉత్త అంశం గురించే (భాషా మరియు అలంకారాల గురించి కాదు).

    అంబేడ్కర్ ఆదర్శాల ప్రకారం స్వాతంత్రం వచ్చిన అరవై ఏండ్లకు మనమింకా రోజూ కులాన్ని ఏదో సాకుతో తలచుకోవడం తిరోగమనమే అవుతుంది.

    గోడ మీద వ్రాసిన రాతల్లా ఎప్పటికీ అదే విషయం చెబుతూవుంది.
    కాలం మారుతున్నాగానీ ఇంకా, అబే కాదు అలా కాదు, ఇదిగో ఆ గోడ మీద ఎప్పటినుండో వ్రాసివుందే అలానే వుంది, కాదు అలానే వుండాలి పరిస్థితి అన్నట్టుంది.

    అందుకే చాలా సార్లు, పాత తరం వారు ఏం మాట్లాడుతున్నారన్నది కూడా కొత్త తరం వారికి అర్థమవ్వకపోయినా, వెంటనే అర్థంచెప్పడానికి ఇవిగో గోడమీద వ్రాతలు.

    ReplyDelete
  17. బాబా గారు,
    చాలా బాగా రాశారు. మీ కవితల్ని analyze చేసేంత సీన్ మనకు లేదు కాని, మనం ఇంకా 60 ఏళ్ళనాటి పరిస్థితుల్లోనే ఉన్నామంటారా? నాకు తెలిసి అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ఇంకా రావలసిన మార్పు కూడా చాలానే ఉంది. ఎందుకో మరి మీ కవిత నాకు 60 ఏళ్ళనాటి పరిస్థితులని చూపిస్తున్నట్లుంది మరి.

    ReplyDelete
  18. ఈ కవితను విశ్లేషించమని కోరగా స్పందించి తమ అభిప్రాయాలు తెలిపిన భుధజనులందరికీ సదా కృతజ్ఞుడను.

    ఈ కవిత గురించి కొంచెం చెప్పాలి.
    చానాళ్ల క్రితం పోష్టు చివరలో ఉటంకించిన అంబేద్కర్ కొటేషను చదివి స్ఫూర్తినొంది కవిత వ్రాయటం మొదలెట్టాను . ఆ కవితలో నేను చెప్పదలచుకొన్న విషయం సామాజికంగా కులవివక్ష తగ్గినా ఇంకా మానసికంగా తగ్గలేదు అని. ఆ కవితను పరిణయం వరకూ తీసుకు వచ్చిన తరువాత ఎన్నిరకాలుగా ప్రయత్నించినా కొనసాగింపు సాధ్యపడలేదు.

    ఆవిధంగా అక్కడివరకూ అది ఒక అసంపూర్ణ కవిత.

    ఇక ఆ తరువాత ఓ రెండేళ్ల క్రితం మా అమ్మాయి "నాన్నా మనదే కులం" అని అడిగింది. ఆమాటకు స్పందించి వ్రాసుకొన్నది ఈ కవితలోని రెండవ పార్టు.
    ఈ రెంటినీ కలిపి ఒక కవితగా తీసుకొద్దామని నేచేసిన ప్రయత్నం విఫలమైందని తెలుసుకొన్నాను. అందుకనే మిమ్ములను విశ్లేషించమని కోరాను.

    రాజేంద్ర గారు
    మీరన్నది కరక్టే. ఈ కవితలోని రెండవ భాగాన్ని విడిగా " నాన్నా బి.సి. అంటే ఎవరు అనే టైటిల్ తో పూర్తి నిడివి కవితగా వ్రాయాలనుకొంటున్నాను. కొన్ని ఊహలున్నాయి కానీ చాలా చిత్రీ అవసరమవుతాది.

    ఇండిపెండెంట్ గారు,
    ........ and? అంటే ........ and?

    కామేశ్వరరావుగారు
    మీ దీవెన కు నేను ధన్యుడనైతిని.

    గిరీష్ గారు
    థాంక్యూ వెరీమచ్

    మహేష్ గారు
    మీఅభి ప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.

    సుజాత గారు
    భావప్రకటన నచ్చినందుకు ధన్యవాదములు. మీసూచనను కూడా కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను.

    ప్రతాప్ గారు
    మీ విశ్లేషణ నాకెంతో సహాయపడుతుంది. మీది అసమాన్య మైన విశ్లేషణే. మీరు సామాన్యులు కాదు. మంచి పటిమ

    కలిగిన వారు. ధన్యవాదములు.
    మీ పాయింటు నంబరు 1 కరక్టే
    మీ పాయింటు నంబరు 2 కి వివరణ పైన ఇచ్చాను.
    మీ పాయింటు నంబరు 3 కోసమే చిత్రీ పడుతున్నాను.

    నరసింహ గారు
    మీరుసూచించిన ప్రతీ తరంలోనూ అనే వాక్యం ఇంకా బాగుంది.
    మీ దీవెనలకు ధన్యుడనైతిని.

    తె.తూలిక గారు
    మీవంటి వారు నా బ్లాగును సందర్శించటం కామెంటు వ్రాయటం నా అదృష్టం గా భావిస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు.

    చంద్రమోహను గారు
    ధన్యవాదములు.

    సాయిసాహితి గారు
    పుష్పాలనే మాటను ప్రిఫర్ చేస్తున్నాను. మన్నించగలరు. నచ్చినందుకు సంతోషంగా ఉంది.

    రాకేశ్వరరావుగారికి
    నా పై సమాధానంలో మీసందేహాలకు కొన్ని సమాధానాలు దొరుకుతాయని భావిస్తాను.
    రథాన్ని వెనక్కి లాగినట్టుంది. అన్న మీ వాఖ్య ద్వారా నేనెక్కడ పొరపాటు చేసానో నాకు స్పష్టమయ్యింది. ఎందుకంటే ఆ టైటిలు పెట్టి, లోపల కవితలో నేను జష్టిఫై చెయ్యలెకపోయానన్న విషయం నాకు అర్ధమయ్యింది.
    ఈ కవితను ఇప్పుడు పొష్టు చేయటనికి కారణం, మరో రెండు బ్లాగులలో కులం పై కొన్ని టపాలు వచ్చిన నేపధ్యంలో చేసాను.
    గోడమీద రాతలు అన్న మీమాటలలోని అంతరార్ధాన్ని గ్రహించాను. మీ అభిప్రాయాలను మనస్పూర్తిగా నేను గౌరవిస్తున్నాను.

    కల గారు
    స్పందించినందుకు ధన్యవాదములు.
    మీరు అనలైజ్ చేయ సమర్ధులే. అందులో నేనేమీ సందేహపడను.
    ఇంకా రావలసిన మార్పు కూడా చాలానే ఉంది. అని మీ తరం కూడా ఒప్పుకోవటం బాధించే అంశమే. కదూ?
    మీ ప్రశ్నలకు కొన్ని జవాబులు రాకేశ్వరరావుగారికిచ్చిన వివరణలో దొరుకుతాయని భావిస్తాను.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  19. గుండె దిగులు చెట్టై గుబులు పుష్పాలు పూస్తూంటుంది.
    శ్మశానంలా తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీని ఈ సమాజానికి.
    ఆ రెండు వాక్యాలు చాలు. మీ భావాల తీవ్రతను అర్దం చేసుకోవడానికి. మనసులు కలిసాక పరిణయం లాంఛనం అన్నటుగా రాసిన వాక్యం కూడా బాగా నచ్చింది.
    Hats off to you.

    ReplyDelete