Friday, November 28, 2025

హరప్పానుంచి నేటివరకూ ..... ముందుమాట

పుస్తకం చదివి చాలామంది ఫోనులు, మెసేజులు చేసి అభినందిస్తున్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. ఈ పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది. థాంక్యూ ఆల్.
.
మనవి మాటలు

దేవానాం ప్రియుడు సమస్త (మత) శాఖల వారిని సన్యాసులైనా, గృహస్థులైనా, దానములు ఇచ్చి, ఇతర సత్కారములు చేసి గౌరవించుచున్నాడు. ఒక శాఖకు (మతానికి) చెందిన వ్యక్తులు అసందర్భంగా తమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖలను నిందించడం చేయరాదు. పరశాఖల వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన శాఖను అభివృద్ధి చేసుకోవటమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయ్యెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. తన శాఖవారు, ఇతరశాఖలవారు ఒకరితో ఒకరు పొత్తు కలిగి ఉండడమే శ్రేయోదాయకము. సమస్త జనులకు ధర్మాభివృద్ధి ముఖ్యము. (అశోకుని XII వ శిలాశాసనం, BCE 256)

అశోకుని కాలంలో వైదికం, బౌద్ధం, జైనం, ఆజీవికం, చార్వాకం, శాక్తేయంవంటి భిన్న మతాలు (విశ్వాసాలు) ఉండేవి. ఇవికాక స్థానిక గిరిజన విశ్వాసాలు. ప్రజలు భిన్నమతాలపట్ల సహిష్ణుతతో మెలగటం, రాజ్యం అన్ని మతాలను సమాదరించటం మన ప్రాచీనభారతదేశపు జీవనవిధానం. ఈ దేశభిన్నత్వపు మూలాలు అక్కడివి. సెక్యులరిజం అనే భావన పుట్టిందే ఈ నేలపైన.

బౌద్ధం, జైనం, ఆజీవికం, చార్వాకం లాంటి మతాలు వెనుకకు మళ్లి వైదికమతం రూపం మార్చుకొని హిందూమతంగా ముందుకురావటం భారతదేశ మతాల చరిత్రలో ఒక మైలురాయి. ఇది సుమారు ఆరు ఏడు శతాబ్దాలలో ప్రారంభమై పదో శతాబ్దం నాటికి స్పష్టమైన రూపాన్ని తీసుకొంది.

హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ, కర్మ, మోక్షం, బహుదేవతారాధన, యజ్ఞయాగాదులు, వేదాలు ఉపనిషత్తులపై అంగీకారం, ద్విజుడే ఉత్తమమానవుడు లాంటి భావనలను జీవనవిధానంగా కలిగి ఉండటాన్ని హిందూమతంగా చెబుతారు. చారిత్రకంగా పాలకులు వేరేమతాలకు చెందినవారైనప్పటికీ హిందూమతం తన అస్తిత్వాన్ని నిలుపుకొని, భారతదేశం బహుళఅస్తిత్వ సమాహారంగా రూపుదిద్దుకొంది. భిన్న భాషలు, ఆరాధనలు, సంస్కృతులు, ఆహారపుటలవాట్ల ద్వారా వైవిధ్యమైన సమాజంగా నిలిచింది. ఈ బహుళత్వం ఈ దేశ భౌగోళిక వైవిధ్యం, ఎక్కడినుంచో దఫదఫాలుగా వచ్చి ఈ దేశప్రజలతో సాంస్కృతికంగా మమేకమైన వలసకారులవల్లా ఏర్పడింది.

స్వతంత్ర భారతదేశ నాయకులు భారతదేశ బహుళత్వాన్ని ప్రతిబింబించే భిన్న భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లను గౌరవిస్తూ అన్ని సమాజవర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించే లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.
***
డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తన అసమాన ప్రతిభతో, తర్కంతో, సాక్ష్యాధారాలతో భారతదేశ చారిత్రక నెరేటివ్‌ను గొప్ప మలుపు తిప్పారు. ఆయన దృక్పథంతో సమకాలీన అంశాలను ఒక బహుజనవాదిగా పరిశీలించినపుడు అవి నాకు ఎలా కనిపించాయో, ఎలా అనిపించాయో విశ్లేషిస్తూ గత మూడు నాలుగేళ్ళు గా రాసిన వ్యాసాలు ఇవి. ఒకే అంశానికి భిన్న పెర్‌స్పెక్టివ్స్‌గా చూస్తాను వీటిని.

ఈ వ్యాసాలు పూర్తిగా అకడమిక్‌ ఆసక్తితో, స్వీయ అన్వేషణలో భాగంగా రాసినవి. ఆయా సందర్భాలకు సంబంధించిన రిఫరెన్సులను ఎక్కడికక్కడ ఇచ్చాను. అయినప్పటికీ నాకు తెలియని, నా దృష్టికి రాని అంశాలు ఎన్నో ఉండవచ్చునన్న ఎరుక, వినమ్రత నాకు ఎన్నడూ ఉంటుంది.

ఈ పుస్తకంలోని వివిధ వ్యాసాలు - హరప్పా నాగరికత నుండి సమకాలీన హిందూత్వ భావనల వరకు భారతదేశ మత వైవిధ్యాన్ని, మత విశ్వాసాల పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తాయి. ఆయా చారిత్రక కాలాల్లో ప్రజలు ఎదుర్కొన్న సామాజిక, సాంస్కృతిక సవాళ్లను చిత్రిస్తాయి. మత వైవిధ్యాన్ని, సాంస్కృతిక భిన్నత్వాన్ని వివిధ కాలాలలో ప్రజలు ఎలా కాపాడుకొంటూ వచ్చారో చెబుతాయి. ఈ ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్ళు, విభేదాలను వివరిస్తాయి.

ఈ రచనలో బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక మతాల ప్రస్తావన ఉండాలి. అయితే వాటిని నేను ఇప్పటికే ‘వేద బాహ్యులు’ (2024) పుస్తకంలో విశదంగా చర్చించినందున, ఇక్కడ వాటి వివరాల్లోకి వెళ్లలేదు. ఇవి భిన్నకాలాలలో రాసిన వ్యాసాలు కనుక అక్కడక్కడా దొర్లే పునరుక్తులను పెద్దమనసుతో చూస్తారని భావిస్తాను.

మెజారిటేరియన్‌ వాదం ఎల్లెడలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ దేశసమైక్యతను, భిన్నత్వాన్ని కాపాడటానికి సామాన్య మానవునికి, స్వేచ్ఛ సమానత్వం కల్పించటం కొరకు ఏ మార్గం అనుసరణీయమో ఎవరికి వారు నిర్ణయించుకోవాలని నమ్ముతాను.
ఈ వ్యాసాలు కేవలం చారిత్రక సామాజిక అంశాలపై ఉండే భిన్నాభిప్రాయాల అకడమిక్‌ చర్చలకొరకు మాత్రమే ఉద్దేశించబడినవి. సహృదయ పాఠకులు అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

***
ఈ పుస్తకరచనలో శ్రీ కల్లూరి భాస్కరం గారు చేసిన సూచనలు విలువైనవి. వారు ఈ పుస్తకానికి గొప్ప నాందీ ప్రస్తావన చేస్తూ రాసిన చక్కని విశ్లేషణాత్మక ముందుమాటకు ఎంతో కృతజ్ఞుడను. విషయసారాన్ని ఈ పుస్తాకానికి బ్లర్బ్ రూపంలో కొద్ది వాక్యాల్లో బంధించిన శ్రీ అద్దేపల్లి ప్రభుకు ధన్యవాదములు.

నా పై అవ్యాజమైన ప్రేమ కురిపించే శ్రీ శిఖామణి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి, శ్రీ గనారా, శ్రీ మార్ని జానకీరామ్‌ చౌదరి, శ్రీ అవధానుల మణిబాబు, శ్రీ ఎస్‌.కె. మోహనరావు ఇంకా నన్ను ప్రోత్సహించే మిత్రులందరకూ...

ధన్యవాదములతో...

భవదీయుడు
బొల్లోజు బాబా

సెప్టెంబరు, 2025
పేజీలు 240. ధర రూ. 275/-

9866115655 నెంబర్ కి రు. 300/-(పోస్టెజ్ తో) ఫోన్ పే చేసి ఎడ్రస్ పంపితే regd book post లో పంపగలరు, పల్లవి పబ్లిషర్స్, శ్రీ ఎస్.వి నారాయణ గారు.
అమజాన్ లింక్ కామెంటులో కలదు. థాంక్యూ.










No comments:

Post a Comment