బకించంద్ర చటోపాధ్యాయ వందేమాతర గీతం రాసి 150 ఏళ్ళఅయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటున్నాం. ఈ రోజు మనం పాడుకొంటున్న పాటలో రెండు చరణాల అర్ధం ఇది.
తల్లీ నీకు వందనం!
మధురమైన జలాలతో, ఫలాలతో, పంటలతో
చల్లని మలయమారుతాలతో సుభిక్షంగా ఉండే
తల్లీ నీకు వందనం!
చంద్రకాంతులలో పులకించే రాత్రులతో
పుష్పాలతో శోభిల్లే వనాలతో
నవ్వులతో, స్నేహపూర్వక మాటలతో
సంతోషాలను, వరాలను ఇచ్చే
తల్లీ నీకు వందనం!
పై చరణాలు భరతమాత సౌందర్యం, సంపద, సుభిక్షతలగురించి చెబుతాయి. మిగిలిన చరణాలలో భారతమాతను దుర్గాదేవికి, లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ప్రతిరూపంగా చిత్రించారు. (ఈ గీతాన్ని ఆనందమఠ్ అనే నవలనుంచి తీసుకొన్నారు కనుక ఈ పోలికలు అక్కడ సందర్బోచితం)
.
నీవు దుర్గాదేవి శక్తివి
కమలదళాలమధ్య విహరించే లక్ష్మీదేవివి
జ్ఞానమును ప్రసరించే సరస్వతీ దేవివి
తల్లీ నీకు వందనం!
లక్షల కంఠాలతో గర్జించే తల్లీ!
లక్షలచేతులతో ఆయుధాలు ధరించిన తల్లీ
నీవు అబలవు కావు, మహాబలశాలివి
శత్రుసంహారిణీ
తల్లీ నీకు వందనం!
.
1896 జాతీయ కాంగ్రెస్ మహాసభలలో మొదటిసారిగా రవీంద్రనాథ్ టాగోర్ వందేమాతర గీతాన్ని ఆలపించాడు. అది మొదలు భారతస్వాతంత్ర్య పోరాటంలో వందేమాతర గీతం ఒక ఉద్యమ గీతంలా ప్రజలు సొంతం చేసుకొన్నారు. వందేమాతరం అనేది బలమైన బ్రిటిష్ శక్తులను ఎదిరించే ఒక నినాదంగా నిలిచింది.
కానీ ఈ గీతంలో ఉండే హిందూదేవతల ప్రస్తావనలున్న చరణాలపట్ల హైందవేతరులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ముఖ్యంగా మహమ్మద్ ఆలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, ఈ గీతాన్ని బలవంతంగా అందరిచేతా పాడించటాన్ని తప్పు పడుతూ ఈ గీతం "positively anti-Islamic and idolatrous” అని పేర్కొంది. ఆమేరకు 1937 లో లక్నో లో జరిగిన ముస్లిం లీగ్ సెషన్ లో తీర్మానం చేసారు.
1937 అక్టోబరు లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ వివాదాన్ని గుర్తించి, హైందవేతరుల మనోభావాలు గాయపడకుండా ఏం చేయాలనేది చర్చించింది.
ఈ చర్చలలో- జవహర్ లాల్ నెహ్రూ అందరకూ ఆమోదయోగ్యమైన మధ్యే మార్గాన్ని సూచించమని కమిటీ సభ్యులను కోరాడు
-మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ముస్లిముల మనోభావాలను గుర్తించమని అందరినీ కోరాడు
-సుభాష్ చంద్రబోస్, వందేమాతర గీతం యధాతధంగా ఉండాలని వాదించాడు. (చంద్ర బోసు తన అజాద్ హింద్ ఫౌజ్ కు Anthem గా Abid Hasan Safrani రచించిన "Subh Sukh Chain ki Barkha Barse" అనే గీతం ఉండటం గమనార్హం)
-రవీంద్రనాథ్ టాగోర్ వందేమాతర గీతంలోని మొదటి రెండు చరణాలలో ఏ రకమైన మతప్రస్తావనలు లేవు కనుక వాటిని ఉంచి మిగిలినవి తొలగించటం ద్వారా ఈ వివాదాన్ని ముగించవచ్చునని సలహా ఇచ్చాడు.
రవీంద్రుని సూచన మేరకు వందేమాతర గీతంలో మొదటి రెండు చరణాలను మాత్రమే అప్పటినుంచి మన జాతీయ గేయంగా పాడుకొంటూ వస్తూన్నాం.
***
ఈ వందేమాతర వివాదం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మరొక్క సారి చర్చకు వచ్చింది. స్వతంత్ర్య భారతదేశానికి ఒక జాతీయ గీతం (National Anthem) కావలసి వచ్చింది. ఆ హోదా కొరకు జనగణమన, వందేమాతరం మధ్య టై పడింది. ఏ పాటకు National Anthem హోదా ఇవ్వాలి అనే అంశాన్ని 1946-1950 మధ్యలో జరిగిన constituent Assembly Debates లో కమిటీ సభ్యులు చర్చించారు. ఆ చర్చలు ఇలా ఉన్నాయి.
1. 31st July 1947 న H. V. Kamath అనే సభ్యుడు “వందేమాతర గీతాన్ని ఆగస్టు 15, 1947 అధికారబదిలీ వేడుకలలో ప్రారంభగీతంగా పాడాలి అని కోరాడు. (ఆ విధంగానే శ్రీమతి సుచేత క్రిపాలాని ఆ రోజున వందేమాతరంలోని మొదటి చరణాన్ని పాడటం జరిగింది)
.
2. 5th November 1948 న Seth Govind Das అనే సభ్యుడు ఇలా అన్నాడు
జాతీయ గీతం విషయానికి వస్తే, నేను చెప్పేది — “వందే మాతరం” మన జాతీయ గీతంగా ఉండవచ్చు.
మన స్వాతంత్ర్య పోరాట చరిత్ర వందే మాతరంతో విడదీయలేని బంధం కలిగి ఉంది.
ఎవరైనా ఇది సంగీత వాద్యములకు (orchestration) అనుకూలంగా లేదని చెబితే - అది చిన్న సమస్య మాత్రమే.
మహాకవి సూరదాస్, మీరాబాయి గారి గీతాలు ఒకే రాగంలో కాదు —అనేక రాగాల్లో పాడవచ్చు. కాబట్టి “వందే మాతరం” ను వాద్యరూపంలో స్వరపరచలేం అనడం సరైంది కాదు.
రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పట్ల అందరకూ గౌరవమే. ఆయన నిజంగా కవులలో రాజు.
అయితే ఆయన రాసిన “జన గణ మన” కవిత 1911లో బ్రిటన్ చక్రవర్తి జార్జ్ V భారతదేశానికి వచ్చిన సందర్భంగా రాయబడింది.
ఆ కవితలోని భావాలు భారతమాతకు అంకితం చేయబడినవి కావు — అవి ఆ కాలంలోని రాజాధిరాజు (ఎంపరర్)కు అంకితం చేయబడ్డవి. “భారత భాగ్య విధాత” అనే పదబంధంలో పేర్కొన్నది ఆ చక్రవర్తినే అని “జయ రాజేశ్వర్” (రాజాధిరాజుకు జయం) అనే వాక్యంతో స్పష్టమవుతుంది.
అందువల్ల — మన దేశం ఒక ప్రజాస్వామ్య రాజ్యంగా (Republic) ఉన్నప్పుడు, ఎవ్వరైనా రాజాధిరాజుకు జయగానం చేసే పాటను జాతీయ గీతంగా ఉపయోగించలేము. అందుచేత “వందే మాతరం” మాత్రమే మన జాతీయ గీతం కావాలి
.
3. 9th November, 1948 న Shri Vishwambar Dayal Tripathi అనే సభ్యుడు ఇలా అన్నాడు
“వందే మాతరం” మరియు “జన గణ మన” మధ్య జాతీయ గీతం గురించి కొంత వివాదం ఉంది. నా అభిప్రాయం ప్రకారం, గత యాభై సంవత్సరాలుగా మన దేశ ప్రజల హృదయాలలో నిండిపోయి, మన స్వాతంత్ర్య పోరాటానికి దీపస్తంభంలా మారిన “వందే మాతరం” మన దేశపు జాతీయ గీతం కావాలి.
.
4. 24th January 1950 న Dr. Rajendra Prasad అధ్యక్షత స్థానంలో ఉండి ఇలా ప్రకటించి వందేమాతర వివాదానికి ముగింపు పలికారు.
జాతీయ గీతం (National Anthem) విషయం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని సభ ముందు ఉంచి, ఒక ప్రతిపాదన (resolution) ద్వారా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే అలా ప్రతిపాదన తీసుకోవడం కంటే, నేను జాతీయ గీతం గురించి ఒక ప్రకటన చేయడం మంచిదని భావించి నేను ఇప్పుడు ఈ ప్రకటన చేస్తున్నాను:
“జన గణ మన” అనే పదాలతో, స్వరంతో కూడిన కృతి భారత దేశ జాతీయ గీతంగా నిర్ణయించబడింది, అవసరమైతే ప్రభుత్వం కొన్ని పదాలను మార్చే అధికారాన్ని కలిగి ఉంటుంది.
అలాగే — భారత స్వాతంత్ర్య పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన “వందే మాతరం” పాటను కూడా జన గణ మనతో సమాన గౌరవం, స్థానం కలిగినదిగా గుర్తించాలి”
(అభినందనలు — సభలో చప్పట్లు)
***
వందేమాతర గీతం జాతీయగేయంగా చేయటం వెనుక చరిత్ర ఇది. మొదటిదశలో మతపరమైన అంశాలున్న కారణంగా కొన్ని చరణాలను తొలగించారు. ఆనాటి నాయకులు దార్శనికులు. ఈ దేశవైవిధ్యాన్ని, బహుళతను గౌరవించారు. భిన్నవర్గాల మధ్య సయోధ్య కుదిర్చి అన్నిటినీ ఒకే జాతీయభావన కిందకు తీసుకురావటానికి కృషిచేసారు.
రెండవ దశలో జనగణమన గీతాన్ని National Anthom గా ఆమోదిస్తూనే, వందేమాతరగీతానికి ఉన్న ప్రజాదరణ రీత్యా దానికి కూడా సమాన స్థాయి కల్పించారు.
ఈ రోజు వందేమాతరం "పూర్తి గీతం" అంటూ పాట ఒకటి వాట్సప్పులలో చక్కర్లు కొడుతుంది. – “తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది” అని సినారే ఏనాడో రాసారు.
.
బొల్లోజు బాబా

No comments:
Post a Comment