Friday, November 28, 2025

ఇస్మాయిల్ ఒక స్కూల్ ఆఫ్ థాట్ కు తెలుగునాట ప్రతినిధి

అందరు సాహితీ వేత్తలకు ఒక్కో స్కూల్ ఉన్నట్లే ఇస్మాయిల్ కి కూడా కవిత్వం పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇస్మాయిల్ కవిత్వాన్ని పొయెట్రీ ఆఫ్ ఐడియాస్, పొయెట్రీ ఆఫ్ ఎక్స్పిరియన్స్ అని విభజించారు. రాజకీయ ఐడియాకు కట్టుబడి రాసేవారి కవిత్వంలో పునరుక్తి అనివార్యంగా దొర్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ కవిత్వం శుష్క నినాదప్రాయంగా మిగిలిపోతుందని, దానివల్ల కవిత్వ ప్రయోజనం సిద్ధించదు అని ఆయన విశ్వసించారు. కవిత్వం అనేది “హృదయ సంబంధి” అని బలంగా నమ్మారు. ఈ అభిప్రాయాలపై అప్పట్లో లోతుగానే చర్చలు జరిగాయి. ఇస్మాయిల్ కవిత్వం “కర్రల అడితి” కవిత్వం అన్నారు. (అంటే కవిత్వం అనే అరణ్యాన్ని నరికి సైజులవారిగా కోసి అడుగుల లెక్క అమ్మే దుకాణం అనే వ్యంగ్యం). చిలకపలుకుల కవిత్వం అని ఎద్దేవాచేసారు. సామాజిక ప్రయోజనం లేని వ్యర్ధసృజన అని బ్రాండ్ చేసారు. ఇంకా మరికొందరు విమర్శకులు ఇస్మాయిల్ కవిత్వం దోపిడీశక్తులకు దోహదపడిందని అభియోగించారు.
 
వీటన్నిటినీ ఇస్మాయిల్ ఎదుర్కొన్నారు. తన మార్గాన్ని మార్చుకోలేదు, తాను రాయాల్సిందేదో రాసారు ఆయనే ఓ కవితలో అన్నట్లు
 
కీర్తి శేషుడైన కవి
కాలతీరాన
కాసేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్లిపోయాడు

.... కవిగా గుప్పెడు అక్షరాల్ని మనకు మిగిల్చి వెళ్లిపోయాడు.
 
కవిగా ఇస్మాయిల్ వెలువరించిన కవిత్వం కానీ, వెలిబుచ్చిన అభిప్రాయాలు కానీ, అతనికి మాత్రమే చెందినవి కావు. అదొక స్కూలు ఆఫ్ థాట్.
 
ఇస్మాయిల్ ను విమర్శించదలచుకొన్నవారు అతని స్కూల్ ఆఫ్ థాట్ ను విమర్శించాలి కాని, అతన్ని వ్యక్తిగతంగా విమర్శించటం అకడమిక్ విమర్శ అనిపించుకోదు. ఇస్మాయిల్ వలె ఆలోచించేవారు, అతని లాంటి అభిప్రాయాలను వెలువరించినవారు ప్రపంచ సాహిత్య చరిత్రలో అనేకమంది కనిపిస్తారు

1. “క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ… ఇవి కాక కవిత్వానికేవీ అర్హం? “కవి అనుభవాల్ని తనలో ఇంకించుకుని అంతర్దర్శి ఐనప్పుడు మంచి కవిత్వం జనిస్తుంది.” -- ఇస్మాయిల్

ఇవే అభిప్రాయాలను “Go into yourself. Find the reason that commands you to write అని Rilke; “My poetry springs from a personal, inward source.” అని Neruda అన్నారు.
 
2. సాహిత్యంలో రాజకీయ కాలుష్యాన్ని మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను – ఇస్మాయిల్
“When a writer allows himself to be guided by politics, he kills his poetry.” అన్న Czesław Miłosz (Nobel) మాటల ద్వారా ఇస్మాయిల్ ఎందుకు రాజకీయ కవిత్వాన్ని విమర్శించాడో అర్ధం చేసుకోవాలి. అంతే తప్ప ఇస్మాయిల్ రాజకీయకవిత్వాన్ని ఇష్టపడకపోవటం ద్వారా ఈ సమాజానికి ద్రోహం చేసాడని చెప్పటం సహృదయ విమర్శ అనిపించుకోదు.
 
Poetry makes nothing happen.” అంటాడు WH Auden కవిత్వ విలువ సౌందర్యం, ఆథ్యాత్మికత తప్ప రాజకీయం కాదు అనే ఉద్దేశంలో.
 
3. “జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని.” – ఇస్మాయిల్
“To feel the love of people… is the most beautiful of all poetry.” నెరుడా.
 
ఇస్మాయిల్ స్కూల్ ఆఫ్ థాట్ ను కలిగి ఉండే మరికొందరు కవుల అభిప్రాయాలు
4. We make out of the quarrel with others, rhetoric, but of the quarrel with ourselves, poetry.” -- WB Yeats

స్వీయాన్వేషణ, లోలోనికి ప్రయాణించి మనతో మనం ప్రశ్నించుకోవటం ద్వారా కవిత్వం పుడుతుంది. బాహ్యంగా ఇతరులతో రాజకీయ వాదప్రతివాదనలు ద్వారా ఉపన్యాసాలు, తర్కం, మాటలు, వాదనలు పుడతాయి. (ఇస్మాయిల్ శుష్కవచనం అన్నది దీనిగురించే)

5. “Poetry is the scholar’s art… not a vehicle for moral or political instruction.” -- Wallace Stevens
కవిత్వం మేధోపరమైన కళ అది రాజకీయసందేశాలకోసం కాదు అంటాడు స్టీవెన్స్. ఇతని దృష్టిలో కవిత్వం రాజకీయవేదికగా కాకుండా అనుభూతి ప్రధానం. ఇది Art for Art’s Sake సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది.
 
6. “Poetry is more a mode of being than a way of arguing.” Seamus Heaney (Nobel Laureate)
సీమస్ తనను “రాజకీయకవి” అని లేబుల్ చేయడాన్ని ఇష్టపడలేదు. కవిత్వం అనేది వాదప్రతివాదనలు కాదు. అదొక జీవనవిధానం. అనుభూతుల ఆవిష్కరణ అంటాడు. (ఇస్మాయిల్ కూడా తనకు లేబుళ్ళు అతికించుకోవటం ఇష్టం లేదు అన్నాడు.)

7. I am not politically minded. I am aesthetically minded, philosophically perhaps. I don't belong to any party. In fact, I disbelieve in politics..."… “All political passion is a kind of blindness.” --Jorge Luis Borges (Argentina)
నాకు రాజకీయాలు ఇష్టం ఉండదు. రాజకీయాలపై తీవ్రమైన అభిమానం మనిషి చూపును, తీర్పును, సత్య దృష్టిని కబళించి, అతన్ని అంధుడిలా మార్చేస్తుందని బోర్జెస్ అభిప్రాయపడ్డాడు. ఇస్మాయిల్ జీవితాంతం పోరాడింది ఈ అంశంపైనే.

8. “We hate poetry that has a palpable design upon us.” -- John Keats (“Palpable design” means political or moral intention)
కవిత్వం అనేది సహజంగా, స్వతంత్రంగ ఉండాలి. కళ సొంత శక్తితో మనసులను తాకాలి. (అరువుతెచ్చుకొన్న ఐడియాలజీతో కాదు). పాఠకుడిని నైతికంగానో, రాజకీయంగానో ప్రభావితం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు దానిని ఆస్వాదించలేం అంటాడు కీట్స్.
.
ముగింపు

ఇవన్నీ ఇస్మాయిల్ స్కూల్ ఆఫ్ థాట్ ను ప్రతిబింబించే వివిధ కవుల అభిప్రాయాలు. కవిగా ఇస్మాయిల్‌ను విమర్శించదలచినవారు ముందుగా గ్రహించవలసిన ప్రధాన విషయం ఏమంటే—అతని వ్యక్తిత్వం, రాజకీయాలు విమర్శించే విషయాలు కావు. అతని ‘స్కూల్ ఆఫ్ థాట్’—కవిత్వ స్వరూపం, అనుభూతి ప్రాధాన్యం, రాజకీయాల నుండి కళను దూరంగా ఉంచాలనే అతని నమ్మకాలు—ఇవే చర్చనీయాంశాలు. ఏ శాస్త్రీయ విమర్శకుడైనా వ్యక్తిని కాక, ఆలోచనలను విశ్లేషించాలి.

అనుభూతి ప్రధానత, అంతర్ముఖ ప్రయాణం, కళకి ఉండాల్సిన స్వతంత్రం, రాజకీయాల వల్ల కవిత్వ స్వభావం కలుషితం అవుతుందనే హెచ్చరికలు—ఇవి అన్నీ ఇస్మాయిల్‌ ఒక్కరికి మాత్రమే ప్రత్యేకమైనవి కావు; ఇవి ప్రపంచ కవులలో సుస్పష్టంగా కనిపించే పెద్ద ధార. ప్రపంచ కవిత్వ పరంపరలో ఒక స్కూల్ ఆఫ్ థాట్ కు తెలుగునాట ప్రతినిధిగా ఇస్మాయిల్ ను చూడాలి.
అదే సమయంలో -- రాజకీయ కవిత్వాన్ని పూర్తిగా తిరస్కరించటం వల్ల సామాజిక అనుభవాలు, సమూహ పీడనలు, చరిత్ర లాంటి అంశాలు కవిత్వానికి దూరమౌతాయనే ఎరుకను కూడా కలిగి ఉండాలి. ఇస్మాయిల్ తిరస్కరించిన రాజకీయ పంథాలో గొప్ప సాహిత్యం పుట్టిందనేది కూడా సత్యమే కావొచ్చు. అది ఇస్మాయిల్ దారిని వ్యతిరేకించేది కాదు. ఆయనకు సమాంతరంగా ఉన్న మరొక సృజనపథం. అంతే. దాన్ని మరొక స్కూల్ ఆఫ్ థాట్ గా తీసుకోవాలి తప్ప ఒక్కదాన్నే అంతిమ సత్యంగా చెప్పటం సమదృష్టికాదు. అలా చెప్పటం బౌద్ధిక బహుళతను విచ్చిన్నంచేయటమే.
 
ఇస్మాయిల్ రాజకీయకవిత్వాన్ని దూరంగా ఉంచాలన్న తన సిద్ధాంతాన్ని నిర్మలంగా ఆచరించాడు. ఇస్మాయిల్ పై వ్యక్తిగత దాడి విమర్శకాబోదు, ఆనాడూ ఈనాడూ కూడా. అతని కవిత్వ ఐడియాలజీని బౌద్ధిక బహుళతలో భాగంగా చూడాలి.
 
పదిహేనేళ్ళ కాల వ్యవ్యధిలో ఇస్మాయిల్ కవిత్వం జీవితంపై మొత్తం 5 వ్యాసాలు రాసాను. అవన్నీ ఒకచోట ఉంటే బాగుంటుందని ఇలా ఇ బుక్ గా విడుదల చేస్తున్నాను.
ధన్యవాదములతో
భవదీయుడు
బొల్లోజు బాబా
25, నవంబరు 2025

(ఇస్మాయిల్ కవిత్వం, జీవితం పేరుతో 36 పేజీల పిడిఎఫ్ డౌన్ లోడ్ లింకు మొదటి కామెంటులో కలదు)
https://archive.org/details/20251125_20251125_1720

No comments:

Post a Comment