Friday, November 28, 2025

సార్వత్రిక ఓటుహక్కు ఎలా వచ్చింది?

బ్రిటిష్ పాలనలో భారతీయుల స్వయంపాలనకొరకు పరిమిత ఓటుహక్కుతో ఎన్నికలు జరిగేవి. 1919 లో ప్రొవెన్షియల్, కేంద్ర శాసనసభ్యుల కొరకు జరిగిన ఎన్నికలలో - ఆస్తిపన్ను, ఆదాయపన్ను చెల్లించేవారికి, కొద్దోగొప్పో విద్యార్హత కలిగి ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది.

1921 లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడు, జవహర్ లాల్ నెహ్రూ సెక్రటరీగా పాట్నాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏ కొద్దిమందికో కాక భారతదేశ ప్రజలందరకూ ఓటుహక్కు (Universal Adult Saffrage) కల్పించాలని తీర్మానం చేసారు. దీన్ని “నెహ్రూ రిపోర్టు” అంటారు.

మహాత్మ గాంధి తన Young India పత్రికలో సార్వత్రిక ఓటుహక్కును ఇలా సమర్ధించారు.

“డబ్బు ఉన్న మనిషికి ఓటు హక్కు ఇచ్చి, సంపద లేదా అక్షరాస్యత లేని మనిషికి ఓటు హక్కు ఇవ్వకపోవడం నేను ఎంతమాత్రం సహించలేను. ప్రతిరోజూ కష్టపడి నిజాయితీగా పనిచేసే మనిషికి, కేవలం పేదవాడు అయిన 'నేరం' కారణంగా ఓటు హక్కు ఉండకూడదు అనే ఆలోచనను నేను అంగీకరించలేను."- మహాత్మా గాంధి (1931).

1935 లో నెహ్రు అధ్యక్ష్యతన జరిగిన లక్నో అఖిలభారత కాంగ్రెస్ మహాసభలలో “సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరగాలని” తీర్మానం చేసారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాజ్యాంగం మనం రాసుకొనే క్రమంలొ 1946-1950 మధ్యలో జరిగిన constituent Assembly Debates లో కమిటీ సభ్యులు జాతి, కులం, ధనం, మతం, లింగ భేదం లేకుండా - ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలి అని దాదాపు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సందర్భంగా- సార్వత్రిక ఓటుహక్కు ఆధారంగా ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూన్నదని జవహర్ లాల్ నెహ్రూ గుర్తుచేసారు. చారిత్రకంగా అణగారిన వర్గాలను శక్తివంతం చేయడానికి సార్వత్రిక ఓటుహక్కు తప్పనిసరి అని డా. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.

నెహ్రూ, డా. అంబేద్కర్, శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, శ్రీ వి మునిస్వామి పిళ్లై లాంటి దార్శనికులు రాజ్యాంగ నిర్మాణ సమయంలో 21 సంవత్సరములు నిండిన ప్రతి భారతీయునికి ఓటుహక్కు కల్పించటం ద్వారా ఈ దేశ నిర్మాణంలో సామాన్యుడు కూడా పాలుపంచుకొనే అవకాశం కల్పించారు.
***

స్వతంత్రభారతదేశ భవిష్యత్తును దేశప్రజల భాగస్వామ్యంతో తీర్చిదిద్దటంలో ఆనాటి దార్శనికులు కృషిచేస్తూండగా…. మరో వైపు ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించటాన్ని ఆనాటి సనాతనవాదులు తీవ్రంగా విమర్శించారు.

రాజ్యాంగ సార్వత్రిక ఓటుహక్కు కల్పించిన సందర్భంలో శ్రీ గోల్వాల్కర్ ఒక సభలో ప్రసంగిస్తూ “అందరికీ ఓటు హక్కు కల్పించటం అంటే కుక్కలు పిల్లులకు హక్కులు ఇవ్వడం కంటే మరేమీ కాదు" అని వ్యాఖ్యానించాడు. (రి. Critical analysis of Rastriya Swayamsevak Sangh by Govind Sahai, ex chief parliamentary secy. pn. 39)

గోల్వాల్కర్ దృష్టిలో ముస్లిములు, క్రిష్టియనులు, కమ్యూనిష్టులు లోపలి శత్రువులు. అదే విధంగా వర్ణవ్యవస్థ ద్వారా దళితబహుజనులను దూరంపెట్టే మనుస్మృతిని రచించిన మనువును మానవాళికి గొప్ప శాసనకర్తగా అభివర్ణిస్తాడు. ఇలాంటి అభిప్రాయాలున్న వ్యక్తి కుక్కలు పిల్లులకు హక్కులు కల్పించారు అనటంలో- ఆ కుక్కలు పిల్లులు ముస్లిములు, క్రిష్టియనులు, కమ్యూనిష్టులు, అవర్ణులు అని సులభంగానే పోల్చుకోవచ్చు.

సాటి మనిషిని కుక్కలు పిల్లులుగా చూసే సంస్కృతి మనువాదులది.

ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ January 7, 1952 సంచికలో సార్వత్రిక ఓటుహక్కు ను ఎద్దేవా చేస్తూ "భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు (universal adult franchise) విఫలమైందని పండిట్ నెహ్రూ స్వయంగా ఒప్పుకునే వరకు జీవించే ఉంటారు" అని వ్యాఖ్యానించింది. (Reference: India After Gandhi: The History of the World's Largest Democracy By Ramachandra Guha pn 157)

ఈ అభిప్రాయం, కొత్తగా ఓటు హక్కు పొందిన, నిరక్షరాస్యులైన భారతీయ ప్రజల సామర్థ్యాన్ని వెటకరిస్తుంది. వయోజనులందరకీ ఓటుహక్కును ఇవ్వటం లోని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది.

ప్రజలందరూ సమానంకాదు, ఎక్కువతక్కువలుగా విభజింపబడి ఉన్నారని చెప్పిన మనుస్మృతి సూత్రాలను తిరస్కరించి ప్రజలందరూ సమానమే అని చెప్పింది రాజ్యాంగం. అది కల్పించిన సార్వత్రిక ఓటుహక్కును మనువాదులు విమర్శించిన తీరు ఇది.

దీని వెనుక ఉద్దేశాలు స్పష్టమే. వేల సంవత్సరాలుగా సమాజపు నెత్తిపై కూర్చుని అందరిపై సాగించిన పెత్తనం ఇంకా కొనసాగించాలని.

***
ఈ రోజు విచ్చలవిడిగా జరుపుతోన్న తొలగింపుకు మూలాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీ గోల్వాల్కర్ చెప్పినట్లు కుక్కలకు పిల్లులకు ఓట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోవటం అభ్యంతరకరం. …. పిర్రలు కోయాలి…. ఏ కాలంలోనైనా….

బొల్లోజు బాబా

No comments:

Post a Comment