1. డా. అంబేడ్కర్ విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 10 ఏళ్లకే పరిమితం చేసారు. ఆ తరువాత పాలకులు దానిని స్వప్రయోజనాలకొరకు పెంచుకొంటూ వస్తున్నారు
2. డా.అంబేడ్కర్ విభజనానంతరం భారతదేశంలో ఉండిపోయిన ముస్లిములను వారికి ఇచ్చిన దేశానికి వెళిపొమ్మని అన్నారు.
చాలా సాధారణ అంశాలలాగ కనిపించే పై విషయాల వెనుక బహుముఖాలతో లోతైన ద్వేషం, అసూయ, విషం ఉన్నాయని ఇట్టే అర్ధమైపోతుంది.
వివరణ:
రాజ్యాంగం పొలిటికల్ రిజర్వేషన్లకు మాత్రమే 10 ఏళ్ళ పరిమితి విధించింది. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు ఏ రకమైన పరిమితులు విధించలేదు. డా. అంబేడ్కర్ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పదేళ్లకు మాత్రమే ఇచ్చారు అని చెప్పటం వక్రీకరణ.
1932 పూనా ఒడంబడిక ద్వారా దళితులు మాత్రమే పోటీ చేసే Reserved Constituency లు ఏర్పరచారు.
దళితులకు Reserved Constituency ల ద్వారా అప్పటివరకూ ఇస్తున్న పొలిటికల్ రిజర్వేషన్లు కొనసాగించాలా వద్దా అనే అంశం మరలా రాజ్యాంగ పరిషత్ చర్చలలో వచ్చింది. (constituent assembly debates). ఆనాటి మేధావులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి….
1. ఈ దేశంలోని ప్రతి దళితుడుకి పది ఎకరాల భూమి ఇచ్చి ఈ పొలిటికల్ రిజర్వేషన్లను తీసివేయడానికి నాకు అభ్యంతరం లేదు - S. Nagappa (Madras) పే: 3214
2. మీరు మాకు పదేళ్లపాటు పొలిటికల్ రిజర్వేషన్లు ఇచ్చి మీకు చేయాల్సిందంతా చేసామని చేతులు దులుపుకుంటే కుదరదు. మమ్మలను విద్యాపరంగా, ఆర్ధికంగా పైకి తీసుకురావడానికి మీవద్ద ఏ ప్రణాళికలు ఉన్నాయో కూడా చెప్పండి. -- Shri H.J. Khandekar, పే:4589)
3. పొలిటికల్ రిజర్వేషన్లు పది సంవత్సరాల పాటు అనేది చాలా తక్కువ వ్యవధి -- Shri Chandrika Ram పే 4609.
4. దళితులకు పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించటం మనం వారికి చేయగలిగే అత్యుత్తమ పని – జవహర్ లాల్ నెహ్రూ పే. 3216
5. “పదేళ్ళ వరకు" అనే పదం తరువాత “అవసరమైతే మరికొంతకాలం పొడిగించవచ్చు” అనే వాక్యాన్ని ప్రవేశపెట్టండి భవిష్యత్తులో పార్లమెంటుకు ఆమేరకు వెసులుబాటు ఉండే విధంగా. (Shri V.I. Muniswamy Pillay) పే 4600
6. పొలిటికల్ రిజర్వేషన్లను సంపూర్ణంగా రద్దు పరచాలి. కులమతాలకు అతీతంగా ఎన్నికలు జరగాలి-- Prof. Shibban Lal Saksena, పే2789
పొలిటికల్ రిజర్వేషన్లకు పరిమితి విధించినట్లుగానే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు కూడా పదేళ్ల తరువాత కొనసాగించకూడదని Pandit Hirday Nath Kunzru ఒక సవరణను ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనను రాజ్యాంగ సభ తిరస్కరించింది. పే 2123. అలా పదేళ్ల పరిమితి అనేది పొలిటికల్ రిజర్వేషన్ల కొరకే తప్ప , విద్యా ఉద్యోగాల కొరకు కాదు అని రాజ్యాంగ సభ తీర్మానించింది.
డా. అంబేడ్కర్ ఎక్కడా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పదేళ్ళ వరకే ఉండాలని చెప్పకపోయినా అలా చెప్పారని అనటం విష ప్రచారం.
దళిత ఆదీవాసిలకు ఇస్తున్న పొలిటికల్ రిజర్వేషన్ల వలన ప్రస్తుత పార్లమెంటులో - 84 మంది ఎస్సీ ఎంపీలు (16%), 47 ఎస్టీ ఎంపీ (9%) లతో వారి రాజకీయ ప్రాతినిధ్యం వారి జనాభాతో సరిపోతుంది. ఇది పొలిటికల్ రిజర్వేషన్లు సాధించిన ప్రగతి. ఇవే లేకుంటే- ఈ సంఖ్యలు అసంభవం. బహుజనుల పొలిటికల్ రిజర్వేషన్లు ఏనాటికైన గమ్యం కావాలి.
ఇక స్వాతంత్రపూర్వం ముస్లిములకు కూడా పొలిటికల్ రిజర్వేషన్లు ఉండేవి. (ముస్లిములు మాత్రమే తమ ప్రతినిధులను ఎన్నుకొనే కొన్ని నియోజకవర్గాలు). స్వాతంత్రం వచ్చాక అవి తొలగించారు.
దేశజనాభాలో దాదాపు 15% జనాభా ఉన్న ముస్లిముల ప్రాతినిధ్యం నేటి పార్లమెంటులో 24 మంది. ఇది 4.4% మాత్రమే. అంటే ప్రస్తుత పార్లమెంటులో జనాభాప్రకారం 77 మంది ఎంపీల ప్రాతినిధ్యం ఉండాల్సిన ముస్లిమ్ ఎంపీలు 24 మంది మాత్రమే ఉండటానికి కారణం వారికి తొలగించబడిన పొలిటికల్ రిజర్వేషన్ లు కారణం కావొచ్చు.
***
Pakistan or Partition of India (1947) పుస్తకంలో డా. అంబేడ్కర్ ఆనాటికి సామాజిక ఆర్ధిక రాజకీయ అంశాలను చర్చిస్తూ దేశవిభజన పట్ల తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. దీనిలో డా. అంబేడ్కర్ హిందూ ముస్లిమ్ మతరాజకీయాలను నిరసించారు. అవి అలాగే కొనసాగితే హిందూ ముస్లిములు ఒక దేశంగా జీవించలేరని దేశవిభజన అనివార్యం అని అభిప్రాయపడ్డారు.
మతప్రాతిపదికన దేశ విభజనకు, ద్విజాతి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు. దేశం ఒకటిగా ఉండాలని కోరుకున్నారు.
దేశ విభజన పర్యవసానాలైన – భారీ వలసలు, హింస, లక్షల ముస్లిములు కాందిశీకులుగా మారిపోవటం గురించి ఈ పుస్తకంలో చర్చించారు తప్ప విభజన జరిగితే ఇక్కడి ముస్లిములందరూ వారికివ్వబడిన దేశానికి వెళ్ళిపోవాలని ఎక్కడా అనలేదు. పార్టిషన్ పై డా. అంబేడ్కర్ ది శాస్త్రీయ విశ్లేషణ.
విభజనానంతరం ఇక్కడ ఉండిపోయిన ముస్లిముల పట్ల డా. అంబేడ్కర్ సహానుభూతితో వ్యవహరించారు. రాజ్యాంగంలో- ఇస్లామిక్ పర్సనల్ లా, ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుని, విద్యా వ్యవస్థను కాపాడుకొనే హక్కు, మైనారిటీ హక్కులు, మెజారిటేరియన్ మత ఆధిపత్యం నుండి రక్షణ, మతస్వేచ్ఛ లాంటి రక్షణలను ఆర్టికిల్స్ 25–30 లలో పొందుపరచారు. ఇవన్నీ డా. అంబేడ్కర్ ముస్లిములను తన సహోదరులగా భావించి కల్పించిన రాజ్యాంగ హక్కులు.
డా. అంబేద్కర్ ఈ దేశ ముస్లిములను విభజన పూర్వం కానీ, అనంతరంకానీ ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లమని అనలేదు. అది వక్రీకరణ.
బొల్లోజు బాబా
పోస్ట్ స్క్రిప్ట్.
శ్రీ Srinivas Vuruputuri గారి తో జరిపిన చర్చలో ఈ అంశంపై మరికొన్ని చేర్పులు ఇవి.....
డా. అంబేడ్కర్ జిన్నా, సావార్కర్ లాంటి భావజాలంతో దేశ విభజనకు, ద్విజాతి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు. డా. అంబేడ్కర్ Pakistan or the Partition of India పుస్తకంలో ముస్లిములు, దేశవిభజనపై వెలిబుచ్చిన అభిప్రాయాలు పూర్తిగా అకడమిక్, డెమొక్రటిక్ గా సాగుతాయి తప్ప మతకోణం లోంచి కాదు. కొన్ని వాక్యాల ఉటంకింపులు ఇవి.
1. డా. అంబేడ్కర్ భారతదేశ విభజనను సమర్ధించారా?
కొన్ని షరతులకు లోబడి సమర్ధించారు. ముస్లింలు పాకిస్తాన్ కావాలని నిశ్చయించుకుంటే, దేశరక్షణ, భద్రత కొరకు విభజనను అంగీకరించాలని డా. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. బలవంతపు ఐక్యత ప్రమాదకరమని అన్నారు. అది స్కాలర్లీ అకడమిక్ అభిప్రాయం తప్ప, మతోన్మాదంతో జిన్నా సావార్కర్ ల ద్విజాతి సిద్ధాంతానికి సమర్ధింపుగా కాదు.
• ముస్లిములు పాకిస్తాన్ కావాలని గట్టిగా పట్టుబడితే, దానిని వారికి ఇవ్వాల్సిందే అని నేను గట్టిగా నమ్ముతున్నాను." పే. 363
• “ముస్లిం ఇండియా మరియు ముస్లిమేతర ఇండియాగా భారతదేశాన్ని విభజించడం అనేది రక్షణ పరంగా ఇరువురికి క్షేమదాయకం అని భావిస్తున్నాను." పే.367 (non muslim India అంటారు తప్ప హిందూ ఇండియా అనలేదు)
• "పాకిస్తాన్ అనేది ఒక సమస్యగా అనుకొన్నప్పుడు, తప్పించుకోవడానికి మార్గం కనిపించదు, దానికి పరిష్కారం కనుగొనబడాలి అని నమ్మేవారిలో నేను ఒకడిని." పే. 385
.
2. అంబేద్కర్ భారతదేశ ద్వి-జాతి సిద్ధాంతాన్ని (Two-Nation Theory) సమర్థించారా?
ముస్లింలు తమను తాము ఒక ప్రత్యేక జాతిగా చెప్పుకోవడాన్ని అంగీకరించారు. హిందువులతో కలిసి జీవించటం అనేది వారి సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తుందని నమ్మటం వలన వారు రాజకీయంగా సాంస్కృతికంగా ఒక జాతిగా అర్హత పొందారని డా. అంబేద్కర్ భావించారు.
• "ముస్లింలు 'ఒక జాతిగా జీవించాలనే సంకల్పాన్ని' పెంపొందించుకున్నారు. వారు కెనడాలో ఫ్రెంచివారిలాగో, సౌత్ ఆఫ్రికాలో ఇంగ్లీషువారిలాగో (ద్వితీయపౌరులుగా) బతకటానికి ఇష్టపడటం లేదు. వారు మాకంటూ ఒక దేశం కావాలని కోరుకొంటున్నారు. పే.39
• "మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండి, ఇతరులు అంగీకరించిన దానిని తాము అంగీకరించడానికి నిరాకరించే ప్రజలు ఒక జాతి అవుతారు." పే.336. ఆ విధంగా ముస్లిములు వేరే జాతి అని అంటున్నారు.
.
3. .డా. అంబేడ్కర్ ముస్లింలను భారతదేశం విడిచి వెళ్ళమని అడిగారా?
పాకిస్తాన్ అంటూ ఏర్పడితే, మైనారిటీల బదిలీ (ముస్లింలు పాకిస్తాన్‌కు, హిందువులు/సిక్కులు ఇండియాకు) "ఏకైక శాశ్వత పరిష్కారం" అని డా. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ ఈ బదిలీలు "స్వచ్ఛందంగా" ఉండాలని వాదించారు. ఎవరినీ బలవంతంగా ఒకచోటి నుండి మరొక చోటుకి పంపటాన్ని డా. అంబేద్కర్ అంగీకరించలేదు.
• పాకిస్థాన్, ఇండియాలు తమ తమ ప్రాంతాలలో నివసిస్తున్న మైనారిటీలకు తాము వలసకు వెళ్లాలా వద్దా అనే ఐచ్చికతను ఇవ్వాలి. పే. 381
• బదిలీని బలవంతం చేయకూడదు, మేము వలసవెళతామని ప్రకటించిన వారికి మాత్రమే ఆ అవకాశం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. పే. 382
డా. అంబేద్కర్ ముస్లిములు, దేశవిభజనపై చెప్పిన అభిప్రాయాలన్నీ స్కాలర్లీ అకడమిక్ అభిప్రాయాలు. అవి శాస్త్రీయంగా ఆనాటి జాతీయ అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చేసిన రిమార్కులు.
డా. అంబేద్కర్ ముస్లిములపై వెలిబుచ్చిన అభిప్రాయాలన్నీ విభజనపూర్వమైనవి. అప్పటికి 600 ఏళ్ల పాలకులుగా ముస్లిములు భారతదేశంలోనే ఉన్నారు.
విభజనానంతరం ఇక్కడే మిగిలిపోయిన ముస్లిముల పట్ల డా. అంబేడ్కర్ సహానుభూతితో ఉన్నారు.
విషవాదులు డా. అంబేద్కర్ విభజనపూర్వ వాదనలను తెలివిగా ముందుకు తెస్తారు, ఆయనపై బురదచల్లడానికి. ఇది దుర్బుద్ధి.
విభజన పూర్వ అంబేద్కర్ అభిప్రాయాలు ప్రత్యేక స్థల కాలాదులకు లోబడి చేసినవి అని గ్రహించాలి.
ఈ విచక్షణ ద్వేషవాదులకు ఉండదు.

No comments:
Post a Comment