భారత్ లోని ఫ్రెంచి కాలనీల చరిత్రను గమనిస్తే, వీరు మొదటగా 1668 లో సూరత్ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలను
మొదలెట్టారు. ఆ తరువాత మచిలీపట్నం, ఢాకా, కాసింబజార్, బాలాసోర్, కాలికట్, పాట్నా లలో చిన్న
చిన్న వ్యాపార గిడ్డంగులను నెలకొల్పారు. 1673/74 లో పాండిచేరీ, 1721 లో మాహే, 1723 లో యానాం, 1738 లో కారైకాల్, 1774 లో చంద్రనాగూర్ లను తమ స్థావరాలుగా చేసుకొన్నారు.
పాండిచేరీ, మాహె, కారైకాల్, చంద్రనాగూర్ మరియు యానాం లు మినహా
మిగిలిన చిన్న చిన్న ప్రాంతాలను ఫ్రెంచి గవర్నర్ బారన్ 1947 అక్టోబరు 6 న
స్వతంత్య్ర భారతదేశానికి అప్పగించేసాడు.
1. ఫ్రాన్స్‌కు
సెంటిమెంటు ‘భారత్’ కు అవసరం
మిగిలిన ప్రాంతాలు ఫ్రెంచి పాలననుండి
విమోచనం చెంది భారతావనిలో విలీనం చెందటంలో అనేక నాటకీయపరిణామాలు చోటుచేసుకొన్నాయి.
ఫ్రెంచి కాలనీలన్నీ దూర దూరంగా ఉండటం వల్ల వీటిని నియంత్రించటం ఫ్రెంచి వారికి
కష్టంగా ఉండేది. భారతావని సుమారు 10 లక్షల చదరపు
మైళ్ళు ఉంటే, ఈ కాలనీలన్నీ కలిపి రెండువేల చదరపు
మైళ్ళ విస్తీర్ణం మాత్రమే. అంతే కాక ఈ ప్రాంతాలకు స్పష్టమైన సరిహద్దులు లేవు. ఉదాహరణకు పాండిచేరీలోని చాలా ప్రాంతాలు పాండీతో
విభక్తమై అన్నివైపులా భారత భూభాగాన్ని కలిగి
ఉన్నాయి. పాండీనుంచి ఈ ప్రాంతాలకు
వెళ్లాలంటే భారత భూభాగాన్ని దాటి పోవాల్సిందే.
ఈ ప్రాంతాలను సంరంక్షించుకొనేందుకు అవసరమైన మిలటరీ శక్తి కూడా ఈ ఫ్రెంచి
కాలనీలలో లేదు. అయినప్పటికీ భారత్ లోని తన కాలనీలతో ఫ్రాన్స్ కు ఉన్న అనుబంధం
వలసరాజ్య భావనలకు అతీతంగా ఉండేది. ఇవి తమ దేశ అంతర్భాగాలని ఫ్రాన్స్ ఏనాడో
ప్రకటించింది. అందుకనే ఫ్రాన్స్ లో చేపట్టే ప్రతీ సంస్కరణనూ పాండిచేరీలో కూడా
అమలు పరచేది. 1882 లో తొలిసారి మున్సిపల్ ఎలక్షన్లు
జరుపుతున్న సమయంలో ‘‘ఈ ఎలక్షన్ల ద్వారా ప్రజలు ఫ్రెంచి దేశంతో తమకున్న బంధాన్ని
బలోపేతం చేసుకొంటారని ఆశిస్తున్నామని’’ గవర్నరు వ్యాఖ్యానించాడు.
1881 లో ఒక డిక్రీ ద్వారా స్థానిక ప్రజలు తమ భారతీయతను
త్యజించినట్లయితే వారు కూడా ప్రాన్స్‌లోని పౌరులవలే ఫ్రెంచిచట్టాల పరిధిలోకి
వస్తారని ప్రకటించింది. ఆ విధంగా పాండిచేరీనుంచి అనేక వేల మంది తమ భారతీయతను
త్యజించి ఫ్రెంచి సంస్కృతి సాంప్రదాయాల పట్ల తమ కున్న అభిమానాన్ని చాటుకొన్నారు.
తద్వారా ఈ కాలనీ ప్రజలు ఫ్రాన్స్ లో నివసించే ఫ్రెంచి పౌరులతో సమాన రాజకీయ, పౌరహక్కులను కలిగి ఫ్రెంచి సెనేట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని
పొందటం మొదలైంది. అందుకనే 1954 లో ఈ ప్రాంతాలను
భారతదేశంలో విలీనం చేయమంటే ` సుమారు 8 దశాబ్దాల పాటు
ఫ్రెంచి పౌరులుగా ఉన్న ఈ ప్రజల అభిప్రాయం రిఫరెండం ద్వారా తెలుసుకోవాల్సిన
అవసరం ఎంతైనా ఉందని ప్రాన్స్ వాదించింది.
ఇక భారత్ విషయానికి వస్తే, భౌగోళికంగా ఐక్యంగా ఉండటమనేది స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారతదేశం
ముందున్న ప్రధమ లక్ష్యం. అందుకనే అప్పటికి దేశమంతా చెల్లాచెదురుగా ఉన్న కొన్ని
వందల ప్రిన్స్‌లీ స్టేట్ లను ఒక్కొక్కటినీ నయానా భయానా ఒప్పించి విలీనం
చేసుకోవటంలో కృతకృత్యమైంది. (ఆనాడు విలీనం కాకుండా మిగిలిపోయిన కాశ్మీర్ నేటికీ
ఒక సమస్యగానే మిగిలిపోయింది). పోర్చుగీస్
మరియు ఫ్రెంచి దేశాలు 1947 నాటికి భారతదేశంలో
ఇంకా తమ కాలనీలను కలిగిఉన్నాయి. వీటిని కూడా కలుపుకోగలిగినట్లయితే భారతదేశం
అవిచ్ఛిన్నమైన భూభాగంగా అవతరిస్తుంది. అలా చేయలేక పోయినట్లయితే ఈ ప్రాంతాల వల్ల
దేశ సమగ్రత, అంతర్గత భద్రతలకు ముప్పువాటిల్లే
అవకాశముంటుందని భారత్ భావించింది.
పోర్చుగీస్ కాలనీలైన
గోవా, డయ్యు, డామన్, దాద్రా మరియు నగర్ హవేలీ లను
భారతావనిలో వీలీనం చేసే ప్రక్రియలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం
ఒకానొక దశలో పట్టుమని మూడువేల మంది కూడాలేని పోర్చుగీసు బలగాలపై ముప్పయివేల మంది
సైనికులను, భారీ వాయుసేనలను రంగంలోకి దింపవలసి
వచ్చింది. భారత్ చర్యలకు వ్యతిరేకంగా పోర్చుగల్, భద్రతా మండలిని ఆశ్రయించగా రష్యా తనకున్న వీటో పవర్ ను ఉపయోగించి భారత
ఉద్దేశ్యాలు నెరవేరేలా సహకరించింది. అలా 1961లో పోర్చుగీసు కాలనీలు భారతదేశపు
అంతర్భాగాలైనాయి.
ఇక ఫ్రెంచి కాలనీల విషయానికి వస్తే భారతదేశం సంయమనం
పాటించింది. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంఅనే
భావనలను ప్రవచించే దేశంగా ప్రాన్స్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతే కాక
భారతదేశంలోని తమ కాలనీలను ఒక వ్యాపార స్థావరాలుగా ఫ్రాన్స్ భావించక తమ దేశ
అంతర్భాగాలుగా పరిగణించి ఇక్కడి పౌరులకు ఫ్రెంచి పౌరులకున్నటువంటి అన్ని రకాల
రాజకీయ పౌర హక్కులను కల్పిస్తూఉండటం కూడా ఈ కాలనీల విషయంలో భారతదేశం ఆచి తూచి
వ్యవహరించటానికి మరో కారణం. అహింస, అలీనతలకు
పెద్దపీట వేసిన వ్యక్తిగా నెహ్రూకు అంతర్జాతీయంగా పెద్ద పేరు ఉంది. ఫ్రెంచి కాలనీల విషయంలో 1947-1954 మధ్య భారత్-ఫ్రాన్స్ లు
చిన్న చిన్న అభిప్రాయభేధాలను వ్యక్త పరచినా, అంతిమంగా విన్-విన్
పరిస్థితులను పరస్పరం కల్పించుకొని ఇరుదేశాలు సమస్యనుంచి గౌరవంగా బయటపడ్డాయి. ఈ
కాలనీల విషయమై భారత్`ఫ్రాన్స్ ల మధ్య యుద్ధం
జరగవచ్చునని అప్పట్లో ఉహాగానాలు ఉండేవని పాండిచేరీ ఆఖరు ఫ్రెంచి గవర్నరుగా
పనిచేసిన André Ménard, August 30, 1985 న Patrick Pitoeff అనే చరిత్రకారునికి ఇచ్చిన ఇంటర్యూలో అనటాన్ని బట్టి ఆనాటి
పరిస్థితులను అర్ధం చేసుకొనవచ్చును. భారతదేశం ఒకవైపు దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు, చేస్తూనే, మరో వైపు ఈ కాలనీలను దిగ్బంధనం చేయటం వంటి చాణుక్యనీతిని
ప్రదర్శించిందన్న విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది.
2. భిన్న
వాదనలు
ఫ్రెంచి కాలనీల విలీనం పట్ల రెండు ప్రధాన వాదనలు ఉన్నాయి.
ప్రాన్సే స్వచ్చందంగా ఈ కాలనీలను భారత్ కు అప్పచెప్పేసిందంటూ ఇండో`ఫ్రెంచి సంబంధాలను బలోపేతం చేసే వాదన ఒకవైపు; ఈ కాలనీల ప్రజలలో జాతీయవాద భావనలు పెరిగి వలస పాలకులకు
వ్యతిరేకంగా పోరాటం జరిపి వారిని పారద్రోలారన్న వాదనలు మరో వైపు
వినిపిస్తాయి. రెండు వాదనలనూ
వాస్తవాలుగానే స్వీకరించాలి. ఈ కాలనీల ప్రజల కోరుకుంటే ఈ ప్రాంతాలను భారతావనికి
అప్పచెప్పేస్తానని ఫ్రాన్స్ ముందునుంచీ చెపుతూనే ఉంది. అలాగే చంద్రనాగూరును 1949 లోనే భారత్ కు ఇచ్చివేసింది. అదే విధంగా ఆనాడు ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా
పోరాడిన వి.సుబ్బయ్య, దడాల రఫేల్ రమణయ్యల
ఆత్మకధలను పరిశీలిస్తే రెండవ వాదనను కూడా అంగీకరించక తప్పదు. ఇక భారతదేశం సంయమనంతో
ఈ రెండు ప్రక్రియలకు ప్రేరణకారిగా వ్యవహరించి, సమస్యను
శాంతియుతంగా, అహింసా పద్ధతులలో
పరిష్కరించుకోగలిగింది.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వబోతున్నట్లు బ్రిటన్
ప్రకటించగానే, ఫ్రెంచ్‌ఇండియా పరిపాలనా వ్యవస్థను 1946 లో ఫ్రాన్స్ సమూలంగా మార్చివేసి, ప్రజా ప్రతినిధులకు విస్త్రుతాధికారాలు కట్టబెట్టి
‘‘స్వయంపాలన’’ జరుపుకొనే విధంగా చేసింది.
ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్య్రం
ప్రకటించి తప్పుకొన్నారో, ఈ కాలనీల ప్రజలలో
కూడా స్వాతంత్ర కాంక్ష పెరిగి ఈ ప్రాంతాలను ఫ్రెంచి పాలననుండి విముక్తి చేయాలన్న
భావనలు పెరగసాగాయి. అదే సమయంలో ఫ్రెంచి పాలన ఉండాలని కోరుకొనే ప్రజలు కూడా
ఉండేవారు. ఈ నేపథ్యంలో 1948 లో భారత్`ఫ్రెంచి ప్రభుత్వాలు ఈ 5 కాలనీల
గురించి ఒక ఒప్పందం చేసుకొన్నాయి. దీని
ప్రకారం ఈ కాలనీల ప్రజలు వారు భారతదేశంలో విలీనం చెందాలా వద్దా అనే విషయాన్ని
ఎన్నికల ద్వారా (రిఫరెండం) తెలియచేయాలి. ఈ
రిఫరెండం కూడా ఏ ప్రాంతంలో జరిగితే దాని ఫలితం ఆ ప్రాంతానికే పరిమితం. తదనుగుణంగా
చంద్రనాగూర్ 1949 లో రిఫరెండం జరుపుకొని సమీప బెంగాల్
లో విలీనం అవుతానన్న తన ఆకాంక్షను తెలియచేసింది. దరిమిలా ఫ్రెంచి ప్రభుత్వం మారు
మాట్లాడక చంద్రనాగూరు ను భారతదేశానికి ఇచ్చివేయటానికి 1951 లో ట్రీటీ ఆఫ్ సిషన్ అనే ఒప్పందాన్ని చేసి, 1952లో దాని సార్వభౌమాధికారాలను భారత ప్రభుత్వానికి
అప్పచెప్పింది.
1948 లో పాండిచేరీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఫ్రెంచి పాలన
ఉండాలని కోరుతున్న సోషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో మిగిలిన ప్రాంతాలలో
జరగాల్సిన ‘రిఫరెండం’ ప్రక్రియ అటకెక్కింది. అప్పట్లో పాండిచేరీ ఎన్నికలలో భారీ
ఎత్తున రిగ్గింగులు జరిగేవి. ఆ కారణంగా
రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు ఫ్రెంచి కాలనీలలో లేవని భారత్ తన
నిరసనను తెలియచేసింది.
ఈ సందర్భంలో విలీనానికి సంబంధించి ఫ్రెంచి ప్రభుత్వం మరియు
భారత ప్రభుత్వాలు ఈ కాలనీల ప్రజలకు ‘అయితే ఫ్రెంచి ప్రభుత్వం లేక భారత ప్రభుత్వం’
అనే తప్ప మరే విధమైన ఎంపిక అవకాశాల్ని ఇవ్వలేదు. రిఫరెండం జరగాలని ఫ్రెంచి
ప్రభుత్వం, రిఫరెండం లేకుండా విలీనం జరగాలనీ
పట్టుపట్టుకొని కూర్చున్నాయి తప్ప “ఈ కాలనీలు
ఫ్రాన్స్ మరియు భారత్ ల ఉమ్మడి సార్వభౌమాధికారాలతో ఉండటమా (Project Ramadier) లేక ఈ కాలనీలన్నీ భారతంలో ఉంటూ స్వయం
ప్రతిపత్తి కలిగిన ఫ్రెంచి ప్రాంతాలుగా ఉండటమా
(Project Coste Floret) లేదా ఫ్రెంచి వారు దశలు దశలుగా ఓ పాతిక ముప్పయి
సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలనుండి వైదొలగటమా లేక వీటిని స్వతంత్య్ర రాజ్యాలుగా
పరిగణించటమా” వంటి అవకాశాలను అన్వేషించలేదన్న విమర్శలు
లేకపోలేదు.
3. దిగ్బంధనం/Blockade
పాండిచేరీలో ఫ్రెంచి పాలనను అంతమొందించాలని ఉద్యమించిన వారిలో వి.సుబ్బయ్య, సెల్లాన్ నాయకర్, బాలసుబ్రమణియన్, ఎ. అరుల్‌రాజ్, ఎమ్. పెరియసామి, దడాల రఫేల్ రమణయ్య వంటివారు ప్రముఖులు. ఫ్రెంచి విధేయుడైన ఎడ్వర్డ్ గుబేర్ (వీరు తరువాత తమ అభిప్రాయాలను మార్చుకోవటం జరిగింది) నాయకత్వంలో కొంతమంది ఫ్రెంచిపాలన కొనసాగాలని పోరాటం జరిపేవారు. మొదట్లో ప్రజలు ఈ ఫ్రెంచి విధేయవర్గానికే మద్దతు పలికారు. ఈ మద్దతు చూసుకొని కొంతమంది ఫ్రెంచి అధికారులు ‘‘ఫ్రెంచి కాలనీలలోని అంగుళం భూమిని కూడా భారతదేశం చేజిక్కించుకోలేదు’’ అని బీరాలు పోయారు. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం రాజకీయ చతురతను ప్రదర్శించి ఫ్రెంచికాలనీలను ఆర్ధికంగా, వ్యాపార రీత్యా, రాకపోకల పరంగా, మౌలిక వసతుల పరంగా ఒక రకమైన దిగ్బంధనానికి గురిచేసి ఫ్రెంచి ప్రభుత్వాన్ని, ప్రజలనూ ఉక్కిరి బిక్కిరి చేసింది. (THE “COLD WAR” FRANCO- INDIAN (1949-1954) By Jacques Weber CIDIF). ఇలాంటి నిర్బంధాలు పాండిచేరీకి కొత్త కాదు. బ్రిటిష్ వారివల్ల అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులకు గురయ్యిన చరిత్ర ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అల్లా ఫ్రెంచి వారిలో లోపించిన నైతికస్థైర్యం మరియు వలసవాదుల పట్ల సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసన.
పాండిచేరీ చుట్టూ ముళ్లతీగె వేయబడి భారతభూభాగంలోకి రాకపోకలు
నియంత్రించబడ్డాయి. పాండిచేరీనుంచి ఎవరైనా
బయటకు రావాలంటే అక్కడి భారత కౌన్సిల్ చే జారీ చేసిన ఫొటోతో కూడుకొన్న ‘‘పాస్‌పోర్ట్’’
ను సరిహద్దు వద్దనున్న చెక్ పోస్ట్ ల వద్ద చూపించవలసి వచ్చేది. ఈ పాస్‌పోర్టును ఒక రూపాయి రుసుముతో (అప్పట్లో
రూపాయి అంటే చాలా పెద్ద మొత్తం) ఒకటి లేదా రెండు నెలల ‘వెలిడిటీ’ తో, కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే
పాండిచేరీలో ఉన్న భారత కౌన్సిల్ జారీ చేసేది.
ఒక్కోసారి అప్లయిచేసిన కొన్ని నెలల తరువాత పాస్‌పోర్ట్ మంజూరు
అయ్యేది. ఈ విధానం వల్ల పాండిచేరీ ఒక
‘‘బంధింపబడిన ప్రజల ప్రాంతం’’ అయిపోయింది.
ఈ విధానం వల్ల నిత్యం పాండిచేరీ నుంచి బయటకు వెళ్లి పనులు
చేసుకొనే కూలీల మనుగడ కష్టమై పస్తులుండే పరిస్థితి వచ్చింది. అంతే కాక పాండిచేరీ
నుంచి ఏ విధమైన వస్తువులను బయటకు/లోపలకు తీసుకువెళ్ల కూడదన్న నిబంధన వల్ల`పాండిచేరీకి చెందిన కూలీలు బయట ప్రాంతాలకు కూలి పనులకు
వెళ్ళేటపుడు వారు తీసుకొని వెళ్ళే అన్నం కేరేజీలను కూడా అనుమతించేవారు కాదు. అందువల్ల వారి
భోజనాన్ని సరిహద్దుల వద్ద తినటమో లేక పారవేయటమో చేయవలసి వచ్చేదట. ఇదే నిబంధన వల్ల
జాలరులు తాము పట్టుకొన్న చేపలను ఇంటికి తీసుకొని వెళ్ళే అవకాశం ఉండేది కాదట.
దీనికి తోడు పాండిచేరీకి రాకపోకలు చేసేవారి వద్ద 50 రూపాయిలకు మించి డబ్బులు ఉండకూడదన్న నియమం కూడా ఉండేది.
వెహికిల్ యజమానులకు భారతభూభాగం/పాండిచేరీ లలో ఏదో ఒక
ప్రాంతాన్ని ఎంచుకోవటానికి భారతప్రభుత్వం 120 రోజుల సమయం ఇచ్చింది. ఆ తరువాత వాటి
రాకపోకలను నియంత్రించటం మొదలెట్టింది. పాండిచేరీకి వెళ్ళే రైళ్లు బస్సులు బయటే నిలిపివేయబడేవి. ఫ్రెంచి
కాలనీ ప్రజలకు స్వేచ్చా రాకపోకలను కల్పిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం 1941 లో బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందాన్ని
భారతప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని ఫ్రెంచిప్రభుత్వం ఆరోపించింది. (UNE HISTOIRE SINGULIÈRE : PONDICHÉRY DE 1947 À 1954 By Stephanie Samy CIDIF)
ఈ సమయంలోనే సందట్లో సడేమియా లాగ, పాండిచేరీకి బంగారం, వజ్రాలు వంటి
విలువైన వస్తువులు విదేశాలనుంచి దిగిమతి అయి, భారతసరిహద్దు
ప్రాంతాలకు స్మగుల్ అయ్యేవి. ఒక్క 1951-1952 మధ్య పాండిచేరీ వ్యాపారులు పదిహేను టన్నుల బంగారాన్ని, పద్నాలుగు కోట్ల ఫ్రాంకుల విలువైన వజ్రాలను విదేశాల నుంచి
దిగుమతి చేసుకొని సమీప భారత పాలిత ప్రాంతాలకు స్మగుల్ చేసి భారీ లాభాలు
మూటకట్టుకొన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన
భారత ప్రభుత్వం పాండిచేరీ చుట్టూ తన పహారాను మరింత కఠినతరం చేసింది.
పాండిచేరీకి చెరాల్సిన పోస్టల్ కవర్లు మద్రాసులో
నిలిచిపోయేవి. 1954 నాటికి ఇవి 8 వేలకు పైగా
పేరుకు పోయాయి. 1937 నుంచి పాండిచేరీకి విద్యుత్తును సరఫరా చేస్తున్న కావేరీ
విద్యుదుత్పత్తి కేంద్రంను రిపేరుల నిమిత్తం
మూసివేస్తున్నందున, ఇకపై సరఫరా చేయలేదని
భారతప్రభుత్వం 1953 లో ఒక లేఖ ద్వారా ఫ్రెంచి గవర్నరుకు
తెలిపింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో పాండిచేరీలోని తక్కువ ఉత్పత్తి
సామర్ధ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రం సహాయంతో మరియు అవసరాన్ని బట్టి
జెనరేటర్‌లను ఏర్పాటు చేసుకొని ఫ్రెంచి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు పరిమితంగా
విద్యుత్ ను సరఫరా చేయటం మొదలెట్టింది. పాండిచేరీకి దిగుమతి చేసుకొనే పెట్రోల్, కూరగాయలు, దుస్తులు, పండ్లు వంటి వస్తువుల నిలుపుదల జరిగింది. నిత్యావసరాలైన
బియ్యం,
నూనెలు వంటి వాటిని ఫ్రెంచిప్రభుత్వం ఇండోచైనా పాకిస్తాన్ వంటి దేశాలనుంచి
షిప్పులలో దిగుమతి చేసుకోవలసి వచ్చేది.
పాండిచేరీ కి నీటిని సరఫరా చేసే పంట కాలువ 1954 లో మూసివేయబడిరది. పాండిచేరీలోని బాహూరు చెరువుకు
నీటినందించే కాలువ లాకులు మూతపడటంతో, పంటలకు
నీరందక నాశనం అయ్యాయి. 1949 లో మొదలైన ఈ
దిగ్బంధన ప్రక్రియ 1954 నాటికి పాండిచేరీని
ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఫ్రాన్స్ వెలుపలి నుండి అన్ని విధాల సహాయ
సహకారాలందించినా, పోగా పోగా ప్రజలలో
అసంతృప్తి పెరగసాగింది.
ఈ మొత్తం పరిస్థితులను అవగాహన చేసుకొన్న పాండిచేరీ
ఆర్చిబిషప్, ఫ్రాన్స్ ఫారిన్ మినిస్ట్రీలో
పనిచేస్తున్న తన మిత్రునికి వ్రాసిన లేఖలో ‘‘ఫ్రాన్స్ ఇకపై ఏమాత్రమూ ఇండియాలోని తన
కాలనీలను నిలుపుకోలేదు. తనను నమ్ముకొన్న ప్రజలకు కొన్ని సదుపాయాలు కల్పించి
నవ్వుతో బయటకు వెళ్లటమే ఉత్తమం, గెంటివేయబడటం
కన్నా’’ అని అనటం ఆనాటి ఫ్రెంచివారి ఆలోచనలకు అద్దం పడుతుంది.
(పాండిచేరీ దిగ్బంధం గురించి ఇంతటి సమాచారాన్ని ఈ పుస్తకంలో
పొందు పరచటానికి కారణం` ఆనాటి ఫ్రెంచి పౌరుల
త్యాగాల పట్ల, ఫ్రాన్స్ ప్రదర్శించిన సౌహార్ధ్రత
పట్ల అవగాహన లేకుండా, ఈ ఫ్రెంచికాలనీలకు
ఇంతటి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించటం ద్వారా నెహ్రూ తప్పుచేసాడనీ, ఈ ప్రాంతాలలో ఉన్న ఫ్రెంచ్ ఉనికి వల్ల మనమింకా వలసవాదుల
పాలనలోనే ఉన్నట్లు అనిపిస్తోందనీ, ఈ ప్రాంతాలను సమీప
రాష్ట్రాలలో ఎందుకు విలీనం చేయటం లేదనీ వంటి రకరకాల వాదనలు నేడు అక్కడక్కడా
వినిపిస్తున్నాయి. భారతదేశానికి ఈ ప్రాంతాలను భౌగోళికంగా తనలో కలుపుకోవటం అనేది
దేశ సమగ్రత, ఐక్యత, అంతర్గత భద్రత ల దృష్ట్యా ఒక చారిత్రిక అవసరం. హైదరాబాద్, పోర్చుగీస్ పాలిత ప్రాంతాల విలీనంలో జరిపినట్లు ఫ్రాన్స్
పై సైనిక ప్రయోగానికి భారత్ సాహసించలేకపోవటానికి కారణాలు ప్రత్యేకంగా
చెప్పుకోనక్కరలేదు. అందుకనే దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులూ
ఒకవైపు చేస్తూనే గొప్ప పరిణతి కలిగిన చాణుక్యనీతిని ప్రదర్శించింది. ఆనాడు ఫ్రాన్స్ మరియు ఈ కాలనీలలోని ఫ్రెంచి
పౌరులు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా భారత్ ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి
కల్పించిందన్నది విస్మరించకూడని ఒక చారిత్రిక వాస్తవం `` రచయిత)
ఇక యానాం విషయానికి వస్తే, పాండిచేరీలో జరిగినంత తీవ్రంగా కాకపోయినా ఈ ప్రాంతం కూడా దిగ్బంధనానికి
గురయినట్లు ఆనాటి వార్తాపత్రికల ద్వారా తెలుసుకొనవచ్చును. 20 ఏప్రిల్, 1954 నుండి యానాంకు వచ్చే బస్సులను యానాంకు వెలుపలే నిలువరించటం
మొదలైంది (రి. హిందూ, 22,ఏప్రిల్, 1954). శ్రీ దడాల, భయంకరాచారి, డి.ఎస్.ఆర్.సోమయాజులు, కొంపెన
సుబ్బారావు ల ఆధ్వర్యంలో కాకినాడనుంచి యానాంకు సరుకులు చేరవేస్తున్న బండ్లను, 24 ఏప్రిల్, 1954 న నిలిపివేసి
తిరిగి కాకినాడ పంపించి వేయటం జరిగింది. ఈ
విషయం తెలుసుకొని కాకినాడనుంచి యానాంకు రావాల్సిన బళ్ళు బయలుదేరనే లేదు (రి. 28 ఏప్రిల్, 1954).
యానాంకు నిత్యావసరాలు అందకపోవటంతో ఇక్కడి ప్రజాజీవనం స్థంభించిపోయింది. యానాం
వ్యాపారులకు కాకినాడలో పెట్రోలు, కిరోసిన్, ఇతరనూనెలు అక్కడి వ్యాపారులు నిరాకరించేవారట. బిల్లు
భారతీయుని పేరుపై తీసుకొని అతికష్టం మీద సరుకులను యానానికి రహస్యంగా చేరవేయవలసి
వచ్చేదట. గోదావరి నదిపై జరిగే సరుకుల రవాణాను అడ్డుకొని పడవలను, సరుకులను, వలలను భారత కస్టమ్స్
అధికారులు స్వాధీనం చేసుకొనేవారట.
పంటకాలువల రిపేర్లు పనులు చేయిస్తున్నామన్న కారణంచే, యానాంకు వచ్చే మంచినీటి సరఫరాను 28 ఏప్రిల్, 1954న కాకినాడ కలక్టరు
నిలుపుదల చేయించారు. యానాం ప్రజలందరికీ మంచినీటి నందించే నీళ్ళ చెరువులు అప్పటికే
ఖాళీ అయ్యాయి. ఈ విషయంలో ఫ్రెంచి ఎంబసీ
కల్పించుకొంటే తప్ప మే 1 నుండి యానాంకు నీటి సరఫరా
పునరుద్దరణ కాలేదు. (]. The Last Days of Yanam - George Sala published in July 1996,
Lettre du CIDIF)
ఈ నేపథ్యంలో భారతదేశంలో తమ మనుగడ ఇక అసాధ్యమన్న నిర్ణయానికి
ఫ్రాన్స్ వచ్చేసింది. ప్రజలందరూ పాల్గొనే
రిఫరెండం జరపాలని అంతవరకూ వాదించిన ఫ్రెంచిప్రభుత్వం తన పట్టు సడలించి, ప్రజానాయకులు పాల్గొనే రిఫరెండానికి సిద్ధపడిరది. అలా 1954లో పాండిచేరీ సమీపంలోని కీళూరు అనే ప్రాంతంవద్ద జరిగిన ప్రజానాయకుల
అభిప్రాయసేకరణ జరిపింది. దీనిలో 7 ఓట్లు
ఫ్రెంచిపాలనకు అనుకూలంగాను, 164 ఓట్లు
వ్యతిరేకంగాను రావటంతో, ఫ్రెంచిప్రభుత్వం 1954 అక్టోబరు 26న పాండిచేరీ, మాహె, కారైకాల్ మరియు
యానాంలను యథాతథ స్థితిలో భారతదేశానికి అప్పగించుతూ ఒక ఒప్పందం చేసింది. దీనినే ‘డిఫాక్టో ఒప్పందం’ అంటారు. దీనికి అనుగుణంగా 1954 నవంబరు, 1న ఈ ప్రాంతాలనుండి
ఫ్రెంచివారు ఖాళీచేసి వెళిపోయారు. ఈ
రోజును ‘డిఫాక్టో దినం’ గా ఇక్కడి ప్రజలు పాటిస్తారు.
4.
భారత పతాక రెపరెపలు
పాండిచేరీలో అంతవరకూ పనిచేస్తున్న ఫ్రెంచి దేశస్థులు
వెళిపోయే ముందు అట్టహాసంగా అధికారిక సంబరాలు జరిపి వెళ్లాలని యోచించినా, ఫ్రాన్స్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఒక వార్ షిప్పులో పాండిచేరీలోని
ఫ్రెంచివారినందరినీ ఫ్రాన్స్‌కు తరలించాలని మొదట్లో భావించినా ఆ ఆలోచనకూడా
కార్యరూపం దాల్చలేదు. కడకు ఎవరికి వారు
మద్రాసు వెళ్లి ఫ్లయిట్ ద్వారా పారిస్ చేరుకొన్నారు. 1954 నవంబరు 1 నాటికి పాండిచేరీలో
ఫ్రెంచి గవర్నరు ఇంచార్జిగా ఎస్క్వర్‌గుయిల్ (Escargueil) డిప్లొమేటిక్ సలహాదారునిగా P. Landy మరియు
మరికొద్ది మంది ఫ్రెంచి అధికారులు మాత్రమే పాండిచేరీ లో మిగిలారు. ఢల్లీ నుంచి
వచ్చిన భారత విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ జనరల్ RK Nehru నవంబరు 1ఉదయాన పాండిచేరీలో ప్రప్రథమంగా
భారతదేశ జండాను ఎగురవేశారు. పాండిచేరీ చివరి భారత కౌన్సిల్ జనరల్ మరియు మొదటి హై
కమీషనర్ అయిన కేవల్ సింగ్ ను P. Landy ఆహ్వానించి
అధికారాలను బదలాయించారు. ఆ తరువాత జరిగిన
బహిరంగ సభలో, భారత ప్రెసిడెంట్
రాజేంద్ర ప్రసాద్, ప్రధాని నెహ్రూ లు
పంపించిన సందేశాలను RK Nehru ప్రజలకు చదివి
వినిపించారు. ఆ విధంగా మూడు వందల
సంవత్సరాల ఫ్రెంచి పాలనకు తెరపడి భారత పాలనకు తెరలేచింది. 20 జనవరి, 1955 నాటి హిందూ పత్రిక
తన ఎడిటోరియల్ లో ఈ ప్రాంతాలకు కల భౌగోళిక, సాంస్కృతిక
వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని, చంద్రనాగూర్
విషయంలో జరిగినట్లుగా సమీప రాష్ట్రాలలో
విలీనం చేయాలని వ్రాసింది.
5. ఈ
ప్రాంతాల భవిష్యత్తు పై అనేక సందేహాలు
అంతర్జాతీయ చట్టాల ప్రకారం డీఫాక్టో ట్రాన్స్‌ఫర్ జరిగినా
ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలు ఫ్రాన్స్ వద్ద ఉన్నట్లే లెక్క. ఈ రకమైన పరిస్థితి
ఇదివరలో బోస్నియా, సిప్రస్ ప్రాంతాల
విషయంలో వచ్చిందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటే ఈ ప్రాంతాల
సార్వభౌమాధికారాలను ఫ్రాన్స్ భారత్ కు సమర్పించనంతవరకూ భారత్ ఈ ప్రాంతాలలో
అధికారిక పరిపాలన చేపట్టటానికి వీలుండదు.
అందుకనే భారత్ ఫ్రాన్స్‌తో మరో ఒప్పందం చేసుకొనే వరకూ ఇక్కడ ఫ్రెంచి
పరిపాలనా వ్యవస్థను యథాతథంగా కొనసాగించింది.
ఆ మరో ఒప్పందమే 1956 మే, 28న భారతప్రధాని శ్రీపండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరియు
ఫ్రాన్స్ దేశ ప్రతినిధి ఒష్ట్రరాగ్ లు
చేసుకొన్న ట్రీటీ ఆఫ్ సిషన్ (Traité de cession).
ఈ మొత్తం ప్రక్రియపట్ల పాండిచేరీలో నిరసన
వ్యక్తమయింది. Grande Comore, Mohammed
Saeed Sheikh, MP Raymond Dronne దైవశిఖామణి వంటి కొంతమంది ఫ్రెంచి విధేయులు తమ తీవ్ర
అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కాలనీల ప్రజలకు ద్వంధ్వ పౌరసత్వం కల్పించాలనీ, ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం తిరిగి నిర్వహించాలనీ, ఈ ప్రాంతపు ఫ్రెంచి సంస్కృతిని కాపాడమనీ, ఆటోనమీ ని కల్పించాలనీ, కీళూరు లో
ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొన్న రిఫరెండం ఫ్రెంచి రాజ్యాంగ విరుద్దమనీ అంటూ
వీరు ఇరు ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. ఈ
ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేస్తారేమోన్న ప్రజల అనుమానాలను నివృత్తి
చేయటానికి ఆనాటి భారత హైకమీషనరు కృపాలానీ, 1957, ఫిబ్రవరి 9 న ఏర్పాటుచేసిన ఒక ప్రెస్
కాన్ఫరెన్సులో ‘‘ఈ ప్రాంతాలను సమీప
రాష్ట్రాలలో విలీనం చేసే ఉద్దేశాలు భారతప్రభుత్వానికి లేవని, ట్రీటీ ఆఫ్ సిషన్ లో చేసుకొన్న ఒప్పందం ప్రకారం వీటి
ప్రత్యేకతను నిలుపుతుందనీ’’ తెలిపారు.
ఈ ప్రాంతాల భవిష్యత్తు గురించి ప్రజలలో ఉండిన ఆందోళనలు 1955 లో పాండిచేరీలో జరిగిన ఎన్నికలను ప్రభావితం చేసాయి. ఫ్రెంచి కాలనీలను భారతావనిలో విలీనం చేయటంలో
ప్రధాన పాత్రపోషించిన శ్రీగుబేర్ ` ‘పాండిచేరీని ఫ్రాన్స్ కు అప్పగించాలి’ అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన Marcel Valot అనే స్వతంత్ర అభ్యర్ధిచేతిలో ఓడిపోయాడు. ఈ ప్రాంతాలకు ఆటోనమీ కల్పించాలనీ ఇక్కడి
ఫ్రెంచి సంస్కృతిని కాపాడాలన్న డిమాండ్ తో ఎన్నికలలో పోటీ చేసిన పాపులర్ పార్టీ
పాండిచేరీలో ఉన్న 18 అసెంబ్లీ
స్థానాల్లో 12 స్థానాల్ని గెలుచుకోవటం గమనార్హం.
(ఇతర ప్రాంతాలలో గుబేర్ వర్గం ఎక్కువ సీట్లను దక్కించుకొంది). మున్సిపల్ ఎన్నికలలో మూడొంతులు పైగా సీట్లను
పాపులర్ పార్టీ కైవసం చేసుకొంది. పై ఫలితాల ద్వారా పాండిచేరీ ప్రజలలో ఫ్రెంచి
విధేయత ఉన్నట్లు స్పష్టమవటంతో ఈ కాలనీల భవిష్యత్తుపై ఆ తదుపరి జరిగిన చర్చలలో ఈ ప్రాంత ప్రజల ఫ్రెంచి సంస్కృతిని
పరిరక్షించాలన్న వాదనకు బలం చేకూరింది. ఈ ఎన్నికల తరువాత గుబేర్ తన పంథాను
మార్చుకొని, ప్రజాభీష్టం మేరకు ఈ ప్రాంతాలకు
ప్రత్యేకప్రతిపత్తి కల్పించటంలో అవిరళ కృషిచేయటం గమనార్హం. (కోడిపందాలు ఎక్కువగా ఆడతాడు కనుక ఎడ్వర్డ్
గుబేర్ ను ఫ్రెంచివారు కోడి`గుబేర్ అని
పిలిచేవారట. ఫ్రెంచి వారు వెళిపోవటంతో ఇతని పేరు గుబేర్ పిళ్ళై గా
మారిపోయింది. ఈ చిన్న ఉదంతం ఫ్రెంచిపాలనకు`భారత పాలనకు మధ్య మౌలికంగా ఉన్న తేడాను అద్భుతంగా పట్టి
చూపుతుంది. మొదటిదానిలో జాత్యహంకారం రెండవదానిలో సామాజిక మూలాల ప్రదర్శన
కనిపిస్తాయి.)
అంతర్గత కుమ్ములాటల కారణంగా 1955 ఎన్నికల ద్వారా ఏర్పడిన అసెంబ్లీని 1958 లో భారతప్రభుత్వం రద్దు చేసి పాండిచేరీలో రాష్ట్రపతి పాలనను విధించింది. తిరిగి 1959 లో జరిగిన ఎన్నికలలో, ‘ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేయం’ అన్న నినాదంతో
కాంగ్రెస్ ఎన్నికలలోకి దిగి విజయం సాధించింది.
6. ట్రీటీ
ఆఫ్ సిషన్ కల్పించిన హామీలు
డిఫాక్టో ట్రాన్ఫ్‌ర్ ఒప్పందానికి ట్రీటీ ఆఫ్ సిషన్
ఒప్పందానికి మధ్య కల సుమారు రెండేళ్ల వ్యవధిలో ఇరుదేశాలు ఈ ప్రాంతాల భవిష్యత్తుపై
స్పష్టమైన అవగాహనకు వచ్చాయని ఆ ఒప్పందంలో పొందుపరచిన ఈ క్రింది అంశాలను బట్టి
తెలుస్తుంది.
ఎ. పౌరసత్వం:
1956 నాటికి పాండిచేరీలో మూడు రకాలైన ఫ్రెంచి పౌరులుండేవారు.
ఇక్కడకు వచ్చి స్థిరపడిన ఫ్రెంచి దేశస్థులకు పుట్టిన వారు, 1880 లలో తమ భారతీయతను త్యజించి ఫ్రెంచి సివిల్‌కోడ్ ను
ఎంచుకొన్న భారతీయులు మరియు ఈ రెండు వర్గాలకు చెందని వారు. వీరు తమకు ద్వంధ్వ
పౌరసత్వం ఇమ్మని భారత మరియు ఫ్రెంచి ప్రభుత్వాలను కోరారు. అది జరగని పనని
ఇరుదేశాలు తేల్చి చెప్పేసాయి. ఈ ట్రీటీ
ఆఫ్ సిషన్ లో వీరికి పౌరసత్వ ఎంపిక అవకాశం కల్పించబడిరది. దీని ప్రకారం ఈ ట్రీటీ అమలులోకి వచ్చిన (1962) ఆరునెలలలోగా తమ ఫ్రెంచి పౌరసత్వాన్ని నిలుపుకోవటానికి
వ్రాతపూర్వకంగా తెలియచేయవలసి ఉంటుంది. అలా చేసిన వారికి వారు అంతవరకూ కలిగి ఉన్న
ఫ్రెంచి పౌరసత్వాన్ని ఇక ముందు కూడా కలిగి ఉంటారు లేనివారు భారతపౌరసత్వాన్ని
పొందుతారు.
ఫ్రెంచి వారు వెళిపోయేటపుడు ఇచ్చిన “సౌహార్థ్ర పూర్వక పౌరసత్వ ఐచ్చికతను”
ఉపయోగించుకొని పాండిచేరీనుంచి సుమారు 6000 మంది ఫ్రెంచి నేషనాలిటీని నిలుపుకొన్నారు.
వీరి సంఖ్య ప్రస్తుతం పదిహేనువేలకు పైమాటే. ఫ్రాన్స్‌లో నివసించే పౌరునికి ఉండే వృద్ధాప్య
పించను,
పేదరికంలో ఉంటే అందే సహాయం, నిరుద్యోగ భృతి, విద్య వైద్యాల కొరకు
రాయతీలు వంటి సోషల్ సెక్యూరిటీ పథకాలన్నీ ఈ ఫ్రెంచినేషనల్స్ కూ ఉన్నాయి. ఆ
కారణంగా వీరందరూ ఆర్ధికంగా, సామాజికంగా సాటి
భారతీయుల (వీరుకూడా ఒకప్పుడు ఫ్రెంచి పాలితులే అయినప్పటికీ ఫ్రెంచినేషనాలిటీని
ఎంచుకోకపోవటం వల్ల భారత పౌరులుగా మిగిలిపోయారు) కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు.
కొన్ని సందర్భాలలో వారి అసూయకు కూడా పాత్రులవుతున్నారు. అందుకనే పాండిచేరీ ఫ్రెంచి పౌరుల అసోషియేషన్
నాయకుడైన పి. ఆరోగ్యసామి ఒకచోట ‘‘ఈనాడు
పాండిచేరీలో రిఫరెండం పెడితే ప్రజలందరూ ఫ్రెంచి పౌరసత్వాన్ని స్వీకరించటం తథ్యం’’
అని వ్యాఖ్యానించాడు. (రి. LES GENS DE NULLE PART Auteur : Author:
Banerji Monideepa CIDIF). 1962 లో ఫ్రాన్స్ తన అప్పటి మరో కాలనీ అయిన అల్జీరియాకు స్వాతంత్య్రం
ప్రకటించినపుడు అక్కడి ఫ్రెంచి పౌరులలో పదిలక్షల మందికి పైన ప్రజలు ఫ్రాన్స్‌తో తమ
అనుబంధాన్ని తుంచుకోలేదు. వీరందరూ
ఫ్రాన్స్ చేరుకోగా, ఫ్రెంచి ప్రభుత్వం
పునరావాసం కల్పించింది. వీరందరినీ
ఇప్పటికీ Pieds-noirs అని పిలుస్తారు.
బి. ఫ్రెంచి
సంస్కృతి పరిరక్షణ: ఈ ఒప్పందంలో ఈ
కాలనీలలో అంతవరకూ పరిఢవిల్లిన ఫ్రెంచి సంస్కృతి పరిరక్షణ కావించబడుతుందని హామీ
ఇవ్వబడిరది. దీనిలో భాగంగా, ఫ్రెంచి అధికారిక భాషగా ఉంటుందని (ప్రజానాయకులు
మార్చనంతవరకూ), స్కూళ్లలో ఫ్రెంచి భోధన కొనసాగుతుందనీ, ఫ్రెంచి సంస్కృతిని పెంపొందించటానికి సంస్థలు నెలకొల్పాలని
వంటి హామీలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.
అప్పట్లో నెహ్రూ ఈ ప్రాంతాలను Windows Open to
France అని వర్ణించాడు
కూడా. కానీ ఫ్రెంచివారు వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాంత అధికారులు ఎక్కువగా బ్రిటిష్
ఇండియాలో పనిచేసిన వారు కావటంతో ఫ్రెంచి అధికారిక భాషగా ఎంతో కాలం కొనసాగలేదు.
అంతే కాక ఇక్కడి ప్రజలు కూడా క్రమక్రమంగా ఇంగ్లీషుకు అలవాటు పడక తప్పలేదు. అంతవరకూ
పనిచేసిన అధికారులు ఫ్రెంచి పౌరసత్వాన్ని
తీసుకొని ఫ్రాన్స్ వెళ్ళిపోవటం కూడా మరో కారణం. అందుకనే 1965 లో అసెంబ్లీ తీర్మానం ద్వారా ఈ కాలనీల లో ఇంగ్లీషు, తమిళ్, మళయాలం మరియు
తెలుగులను అధికార భాషలుగా చేస్తూ చట్టం చేయటంతో, ఫ్రెంచి అధికార భాషగా కనుమరుగైపోయింది. ఇక ఫ్రెంచి భోధన కొరకు ఒక కాలేజీ, సంస్కృతి
పెంపొందించటం కొరకు అలయన్స్ ఫ్రాంకాయిస్ వంటివి నెలకొల్పటం జరిగింది. ఇవి నేటికీ
పనిచేస్తూ ఉన్నాయి. యానానికి సంబంధించి జూనియర్ కాలేజీలో తొంభైల మధ్యవరకూ
ఫ్రెంచి ద్వితీయ భాషగా బోధించబడేది. ఆ తరువాత శ్రీబొల్లోజు బసవలింగం గారి
ఆధ్వర్యంలో యానాంలో కొంతకాలం ఒక ప్రైవేట్ ఫ్రెంచిస్కూలు నడపబడింది.
భారతదేశంలో ఫ్రెంచి రాజ్యస్థాపనకై పాటుపడిన డూప్లే
విగ్రహాన్ని పాండిచేరీ నుంచి
తొలగించవద్దని, ఒకవేళ తొలగించేటట్టయితే దానిని
ఫ్రాన్స్ అప్పగించమనీ ఫ్రెంచి ప్రభుత్వం కోరింది.
ఫ్రెంచి ప్రభుత్వం అంతవరకూ ఇచ్చిన విద్యార్హతలకు సమానమైన
భారత విద్యార్హతలను నిర్ణయించటానికి
ఇరుదేశాల విద్యావేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించాలని నిర్ణయం
తీసుకొన్నారు.
సి. ఫ్రెంచి
చట్టాల కొనసాగింపు: ట్రీటీ ఆఫ్ సిషన్ ఒప్పందంలో 1954 నాటికి ఉన్న కోర్టుకేసులకు ఫ్రెంచి చట్టాలకు అనుగుణంగానే
తీర్పులు చెప్పాలనీ, ఈ చట్టాలను నెమ్మది
నెమ్మదిగా తొలగించి, ఇండియన్ పీనల్
కోడ్ ను ప్రవేశపెట్టుకోవచ్చని వ్రాసుకోవటం జరిగింది. తదనుగుణంగా భారత ప్రభుత్వం 1963 లో ఫ్రెంచి చట్టాల
తొలగింపు మొదలుపెట్టి 1968 నాటికి
పూర్తిచేసింది.
డి. ప్రత్యేక
పరిపాలనా హోదా: చంద్రనాగూర్ అప్పగింత భేషరతుగా జరిగింది కనుక అది సమీప రాష్ట్రమైన
బెంగాలులో విలీనం అయి ఒక మున్సిపాలిటీగా మారిపోయింది. కానీ మిగిలిన
ఫ్రెంచికాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్ మరియు యానాంల విలీనం ట్రీటీ ఆఫ్ సిషన్ ఒప్పందం
ద్వారా విలీనం అయ్యాయి. దానిలోని ఆర్టికల్
రెండు ప్రకారం ఈ ప్రాంతాలకు ‘‘ప్రత్యేక పరిపాలనా హోదా’’ను
కల్పించాలని/కల్పిస్తాననీ ఇరుదేశాలు అంగీకరించుకొన్నాయి. అంతే కాక ప్రజల సమ్మతి
లేకుండా ఈ హోదాను మార్చకూడదని కూడా వ్రాసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా 1962 లో భారతప్రభుత్వం 14 వ రాజ్యాంగ
సవరణ ద్వారా ఈ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసింది. ఈ ప్రాంతాలకు
ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినందుకు మీడియాలో నిరసన రాకపోలేదు. 1962, ఆగస్టు 9 నాటి హిందూ పత్రిక తన ఎడిటోరియల్ లో
ఈ చిన్న ప్రాంతాలకు ఈ విధమైన ప్రత్యేకతను కల్పించటం ఒక ‘‘లగ్జరీ’’ గా పేర్కొనింది.
ది మెయిల్ అనే పత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచింది.
ప్రాంతాలు భారతావనిలో విలీనం అయితే వీటికి ప్రత్యేక హోదాను
కల్పించి కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచుతానని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ, 27 అక్టోబరు, 1949 న వ్రాసిన ఒక లేఖద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతాల విలీనం
ఇంకా ఒక కొలిక్కి రాని సమయంలోనే తాను ఫ్రెంచి ప్రభుత్వానికి ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం ఈ విధంగా
నిలుపుకొంది.
తుది పలుకులు
1957 లో ట్రీటీ ఆఫ్ సిషన్ కు ఆమోద ముద్ర కొరకు ఫ్రాన్స్
ఫారిన్ అఫైర్స్ మినిష్ట్రీ కు పంపించినపుడు (Devinat report) ఈ ఒప్పందం ఫ్రెంచి రాజ్యాంగానికి లోబడి లేదని, ప్రజలు పాల్గొన్న రిఫరెండం జరగలేదనీ వంటి కొరీలు వేసి, దీన్ని ఆమోదించాలంటే ఫ్రెంచి పార్లమెంటు అనుమతి కావాలంటూ
తిరస్కరించింది. (అప్పుడు జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు ప్రతికూలంగా
27 ఓట్లు, అనుకూలంగా 15 ఓట్లు పడ్డాయి)
ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాల అప్పగింతపై జరుగుతున్న జాప్యం
పట్ల అప్పట్లో అనేక మంది నిరసనను తెలియచేసారు.
1958 జూన్, 16 నాటి టైమ్స్ ఆఫ్
ఇండియా పత్రిక ఎడిటోరియల్ లో ‘‘ డిజ్యూర్ ట్రాన్ఫ్‌ర్ (సార్వభౌమాధికారాల
అప్పగింత) జరపటానికి తొందరగా చర్యలు గైకొనకపోయినట్లయితే ఫ్రెంచివిధేయులకు, భారతవిధేయులకు పాండిచేరీ ఒక రణస్థలిగా మారే ప్రమాదం ఉంది’’
అని వ్రాసింది. ఎందుకంటే పాండిచేరీలో “Popular Republican
Movement of French India” అనే పేరిట ఒక సంస్థ ఏర్పడి ఫ్రెంచిపాలన కొనసాగాలని ఆందోళనలు
సాగిస్తున్న సమయమది.
1958 ఆగస్టు, 11న జరిగిన పార్లమెంటు
సమావేశాలలో ఈ ప్రాంతాల బదలాయింపు గురించి
ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నెహ్రూ ‘‘ఈ ప్రాంతాల డిఫాక్టో బదలాయింపు ఎన్నో
సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. ఈ స్థితినుంచి
వెనుకకు మరలే ప్రసక్తే లేదు. కానీ ఈ స్థితికి కొన్ని కొన్ని చట్ట పరమైన చిక్కులు
ఉన్న మాట వాస్తవమే. డిజ్యూర్ ట్రాన్స్‌ఫర్ త్వరలోనే జరుగుతుందని
ఆశిస్తున్నాను. చేసిన ఒప్పందాన్ని
నెరవేర్చమని ఫ్రాన్స్ పై ఒత్తిడి
తీసుకురావటం సబబనిపించుకోదు. అది లేనిపోని అపోహలకు దారితీస్తుంది’’ అనటాన్ని బట్టి
అప్పట్లో భారత ప్రభుత్వం ఎంతటి సహనాన్ని ప్రదర్శించిందో సులువుగానే
అర్థమౌతుంది.
ఫ్రాన్స్ అల్జీరియాలో చేస్తున్న యుద్ధంలో తలమునకలైపోయి
ఉండటం వల్ల ట్రీటీ ఆఫ్ సిషన్ ను ఫ్రెంచి ప్రభుత్వం దాదాపు పక్కన పెట్టేసిందనే
భావించాలి.
ఎట్టకేలకు 1962, జూలై 19 న ట్రీటీ ఆఫ్ సిషన్ బిల్లు ఆమోదం
కొరకు ఫ్రెంచి సెనేట్ కు వచ్చింది. ఈ
బిల్లును ప్రవేశపెట్టినపుడు, ఫిలిఫ్పి అర్జిన్‌ల్యూ
అనే సెనేటర్ చేసిన ప్రసంగపు తుదిపలుకులు
ఈ ప్రాంతాలపై ఫ్రాన్స్ కు ఉన్న అభిప్రాయాలను పట్టిచూపుతాయిThe choice before us left seems strangely small. Or, unable to resist the
feelings of deep regret to see a new tear in what was the French Empire, and
whose institutions namely Pondicherry, Karaikal, Mahe and Yanam, for three
centuries, formed the most beautiful jewels, it is against any acceptance of
such an abandonment. Or, more modestly, but certainly a more realistic way, we
accept the inevitable. we resign ourselves to a factual situation that allows
no alternative, in other words, we agree, regardless of melancholy and sorrow
that embrace the heart, the sensible and dull solution of accepting the treaty
that gives our citizens a few guarantees and benefits, while formally inviting
our diplomacy to resume talks at the earliest promptly to strengthen as far as
possible the position of our country in this region and save up the rights of
former French nationals. …….. (Ref. Le transfer-Part.3(8)-Part.III--La
ratification du traité de cession - Written by Gabriel Piesse, CIDIF letters -
Letter No. 26/27)
1962 జూలై 23 న ఈ బిల్లుకు
ఆమోదముద్ర పడిరది. దరిమిలా 1962 ఆగష్టు, 16 న ఫ్రెంచి ప్రభుత్వం ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలను భారత్
కు బదలాయించటం ద్వారా ఈ ప్రాంతాలపై చట్టపరమైన హక్కులను కల్పించినట్లయింది. ఈ
రోజును ఈ ప్రాంతవాసులు ‘‘డిజ్యూర్ దినం’’ గా సెలిబ్రేట్ చేసుకొంటారు. ఆ తరువాత భారతప్రభుత్వం 30 ఆగష్టు 1962 న పార్లమెంటులో
బిల్లు ప్రవేశపెట్టి పాండిచేరీ, కారైకాల్ మాహే
మరియు యానాంలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించటం ద్వారా ఈ ప్రాంతాలకు ఉన్న మూడు
శతాబ్దాల ‘‘ఫ్రెంచి కనెక్షన్’’ శాశ్వతంగా తెగిపోయింది.
(ఫ్రెంచికాలనీలు
భారతదేశంలో విలీనం అయిన పరిణామ క్రమాన్ని వివరించే సమాచారం ఇంతవరకూ తెలుగులో
పెద్దగా లేని కారణంగా ఈ చాప్టరులో ఆ అంశాన్ని ఎక్కువగా వివరించటం జరిగింది.
గమనించగలరు)

No comments:
Post a Comment