Friday, November 28, 2025

మతవాదులు పదే పదే ప్రచారంలో ఉంచే కొన్ని అంశాలు….


1. ప్రచారం: బ్రిటిష్ వారికి కావలసిన బానిసలను తయారుచేయడానికి మెకాలే అంతవరకూ అద్భుతంగా నడిచిన గురుకులాలను తొలగించి ఇంగ్లీషు చదువులను ప్రవేశపెట్టాడు. ఈ మెకాలే విద్య వలన బానిస మనస్తత్వం పెరిగింది.

వాస్తవం: మెకాలే శాస్త్రీయ విద్యను ప్రవేశపెట్టాడు. దాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరకూ అందుబాటులోకి తెచ్చాడు. దీనివల్ల శతాబ్దాలుగా విద్యకు దూరంగా ఉన్న శూద్ర, అతి శూద్ర వర్గాలు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను పొందారు. అలా వచ్చినవారిలో మహాత్మా పూలే, డా. అంబేడ్కర్ లు నేటికి సమాజానికి వేగుచుక్కలే.

గురుకులాలు బ్రాహ్మణులకు మాత్రమే విద్యనందించేవి. వర్ణవ్యవస్థలో శూద్ర అతిశూద్ర వర్ణాలకు, స్త్రీలకు విద్య నిషేదం. సమాజంలో సుమారు 90 శాతం ఉండే ఈ ప్రజలు 10% ఉండే ఉన్నత వర్ణాలకు జీవితపర్యంతం సేవలు చేయాలని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఈ బానిసత్వాన్ని మెకాలే విద్యావిధానం బద్ధలుకొట్టి శూద్ర అతిశూద్రులకు స్వేచ్చనిచ్చింది. కులానికి విద్యకు ఉన్న బంధాన్ని తుంచేసింది. అలా జరగటం ఇష్టం లేని వ్యక్తులే ఇంకా మెకాలేని ఆడిపోసుకొంటారు.
.
2. ప్రచారం: బ్రిటిష్ వారు కులాన్ని సృష్టించి, ప్రజలను కులాలుగా విభజించారు

వాస్తవం: ధర్మశాస్త్రాల ప్రకారం సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణాలుగా విభజింపబడి ఉండేది. క్రమేపీ పై మూడు వర్ణాలు ఒక్కోకులంగా స్థిరపడగా శూద్రవర్ణం మాత్రం వృత్తులు ఎండోగమీ కారణంగా భిన్నకులాలుగా c100 CE అంటే సుమారు రెండువేల సంవత్సరాల క్రితం స్థిరపడ్డాయని ఆధునిక జన్యుశోధనలు తెలియచేసాయి. పదకొండోశతాబ్దం నుంచీ వేయబడిన అనేక శాసనాలలో వివిధ కులాల పేర్లు కనిపిస్తాయి. అప్పటికి ముస్లిములు (పూర్తిస్థాయిలో), బ్రిటిష్ వారు లేరు.

పోనీ బ్రిటిష్ వారు కులగణన చేసి అప్పటికి ఉన్న కులాలను స్థిరీకరించారా అనుకొంటే, భారతదేశంలో మొదటిసారిగా కులగణన 1658-1664 మధ్య హిందూ పాలిత మార్వాడ్ రాజ్యంలో మహరాజా జస్వంత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది.

బ్రిటిష్ వారికి ఏ సంబంధమూ లేని కులవిభజనను వారికి ఆపాదించటం అంతకు ముందు సమాజం గొప్ప సమానత్వంతోను, ఐకమత్యంతోను, ఏ హెచ్చుతగ్గులు లేకుండా నడిచిందని ప్రచారించటానికే.
.
3. ప్రచారం: బ్రిటిష్ వారు మనలను విభజించి పాలించారు

వాస్తవం: నిజానికి శతాబ్దాలుగా ప్రజలను ఎక్కువతక్కువ వర్ణాలుగా విభజించి ఆధిపత్యంతో 90 శాతం ప్రజలను బానిసలుగా చేసుకొని పాలించింది మనుధర్మమే. తాము చేసిన పనిని బ్రిటిష్ వారు చేసారని చెప్పటం కాపట్యం.
.
4. ప్రచారం: ముస్లిమ్ దండయాత్రలనుండి కాపాడుకోవటానికే స్త్రీ స్వేచ్చను కట్టడి చేయటం, సతి ఆచారం, బాల్యవివాహాలు వంటివి వచ్చాయి.

వాస్తవం: ఇస్లామ్ మతం పుట్టకముందే రాసుకొన్న మహాభారతంలో సతి సహగమన ఉదంతం ఉంది. విష్ణుపురాణంలో శ్రీకృష్ణుని అష్టభార్యలు సతీసహగమనం ఆచరించినట్లు ఉంది.
సతీసహగమనం గురించి విష్ణుస్మృతి (25.14), పరాశర స్మృతి (4.29-31, అగ్నిపురాణం (222:19-23), గరుడపురాణం (1.107.29) లలో చెప్పబడింది.

మనుధర్మ శాస్త్రంలో బాల్యవివాహ ప్రస్తావన ఉంది. స్త్రీ విశ్వసించదగిన వ్యక్తి కాదు అంటుంది.
ఈ హిందూ గ్రంథాలేవీ ముస్లిం పాలనలో రాసినవి కావు. ఈ ప్రచారం ఒక వర్గంపై ద్వేషాన్ని నూరిపోయడానికే
.
5. ప్రచారం: వేదాలలో విమాన నిర్మాణం, అటమిక్ బాంబ్ తయారీ, ప్లాస్టిక్ సర్జరీ, (వినాయకుడు) క్వాంటమ్ థీరీ, టెస్ట్యూబ్ బేబీ (కర్ణుడు) లాంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక శాస్త్రాలు ఉన్నాయి.

వాస్తవం: ఇది పురాణాలను చరిత్ర/సైన్సు ను కలగాబులగం చేయడం. పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారే ఇలా మాట్లాడటం శోచనీయం. వేదాలను అనువదించిన మాక్స్ ముల్లర్ ఇలాంటి గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణల కనీస ప్రస్తావన తేలేదు. అందుకే మాక్స్ ముల్లర్ అంటే నేటికీ మతవాదులకు ద్వేషం.

పోనీ ఈ పండితులు వేదాలలో ఉన్నట్లు చెబుతున్న ఈ అంశాలపై సైంటిఫిక్ జర్నల్స్ లో పేపర్లు రాసి అంతర్జాతీయ శాస్త్రవేత్తల అంగీకారం పొందారా అంటే అదీ లేదు. ఈ నాటికీ కూడా వేదాలలో అన్నీ ఉన్నాయి అంటూ మాటలు చెబుతారు. ఆధారాలు చూపటం మనపద్దతి కాదు అని బండగా వాదిస్తారు.

ఖగోళశాస్త్రం, వైద్యం, గణితం లాంటి రంగాలలో ప్రాచీనభారతీయుల కృషి ఎన్నదగ్గది. ఆయా శాస్త్రాల పురోగతిలో బౌద్ధ, జైన, చార్వాక మతస్థుల ప్రమేయాన్ని కొట్టిపడేయలేం. ఆరోశతాబ్దంలో హిందుమతం అన్ని మతాలపై పైచేయి సాగించిన పిదప పై రంగాలలో పెద్దగా ఆవిష్కరణలు కనిపించవు. పైపెచ్చు ఖగోళశాస్త్రం అశాస్త్రీయ జోతిష శాస్త్రంగా మారి కొందరికి ఉపాధిగా మిగలటం చారిత్రక విషాదం.
.
6. ప్రచారం: ఆర్యుల వలస జరగలేదు. ఇది బ్రిటిష్ చరిత్రకారుల సృష్టి. ఆర్యులు ఇక్కడి వారే. ఇక్కడనుంచి ప్రపంచదేశాలకు వలసలు వెళ్ళారు (out of india theory)

వాస్తవం: ఆర్యులు అనబడే యోధజాతి Eurasian Steppe (మధ్య ఆసియా) ప్రాంతాలనుండి c1900-1500 BCE మధ్య భరతఖండానికి వలస వచ్చినట్లు నేడు జన్యు పరిశోధనలద్వారా నిరూపించబడింది. ఇంకా… ఈ ఆర్యుల జన్యువులు (R1 haplogroup) నేటి బ్రాహ్మణులలో ఎక్కువగాను, lower castes లో తక్కువగాను ఉన్నట్లు గుర్తించారు.

అలా బయటనుంచి వచ్చిన విదేశీ ఆర్యులు భరతఖండంలోకి సంస్కృతాన్ని తీసుకొని వచ్చారు. ఆర్యులు రాసుకొన్న వేదసాహిత్యంలో అప్పటికి ఉన్న నగరాలను ధ్వంసం చేసినట్లు అనేక సూక్తాలు కలవు. వర్ణవ్యవస్థను ఏర్పరచి హరప్పాకాలం నుంచీ అంటే సుమారు 8000 సంవత్సరాలుగా భరతఖండంలో నివస్తున్న అబొరిజినల్ ప్రజలను దిగువశ్రేణి ప్రజలుగా చేసారు.
ఆర్యులు విదేశీయులైతే వారి జన్యువులు కలిగిన ఈ పండితులు కూడా టర్కీ నుంచి వలసవచ్చిన తురకలతో సమానమవటం ఇష్టం లేక, మేము ఇక్కడి వాళ్ళమే అని చెప్పుకోవటానికి ఆర్యుల వలస సిద్ధాంతం తప్పు అని ఇంకా ప్రచారం చేస్తున్నారు. out of india theory అంటూ అతివిశ్వాసపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జన్యు ఆధారాలు చూపలేక ప్రపంచం ముందు నవ్వులపాలయ్యారు.
.
7. ప్రచారం: RSS కులరహితమైనది, సమానత్వాన్ని పాటిస్తుంది (RSS is casteless and egalitarian)

వాస్తవం: కులం/జాతి కాలం చెల్లిన వ్యవస్థ అని దాన్ని తొలగించాలని ఆ సంస్థ పెద్దలు వేదికలపై మాట్లాడతారు. కానీ ఆ సంస్థ అధినాయకత్వం బ్రాహ్మణులతో నిండి ఉంటుంది. దళిత బహుజనులు కిందిస్థాయి, కొంతమేరకు మిడిల్ కేడర్ లో ఉంటారు తప్ప పై స్థాయిలో ఉండరు. వందేళ్ల చరిత్రలో ఒక్కరంటే ఒక్క అబ్రాహ్మణుడు ఆ సంస్థ అధ్యక్షుడు కాలేదు. ఒక్క మహిళ కూడా. ఈ సంస్థ సిద్ధాంతకర్తలకు కులవివక్షను అనుసరించే మనుస్మృతి ఆదర్శనీయం. కాగా ఈ సంస్థ కులరహితమైనదని అనటం వాస్తవాల వక్రీకరణ.
***

ఇవేకాక లాక్డ్ ప్రొఫైల్ పెయిడ్ మనువాదుల పోస్టులలో, కామెంటులలో – రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా మెరిట్ వాదం; మనుస్మృతి ఏనాడు సామాజికంగా అమలులో లేదని; ఏదైనా విమర్శిస్తే బ్రాహ్మణ ద్వేషమని దాడి చేయటం; గుణ కర్మల వలన ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చని దబాయించటం; అహింస గొప్పహిందూ ధర్మమని హింస ఇతరమతాలదనటం; వేదాలలో ఆవుమాంసం తినేవారనే సత్యాన్ని అంగీకరించక అది మాంసం కాదు దుంపలు అంటూ వాదించటం; వారి బ్రాహ్మణ మూలాలను దాచిపెట్టి వాల్మీకి, వ్యాసుడు లాంటి కొందరిని చూపి తక్కువ కులాలవారిపై ఏనాడూ ఆంక్షలు లేవని బుకాయించటం…. లాంటి అనేక అసత్యాలు, వక్రీకరణలు అలవోకగా దొర్లిపోతూంటాయి. చూసి నవ్వుకోవడమే.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment