Friday, November 28, 2025

ఆర్ద్రత, ఆగ్రహం, తాత్వికతలను "చిగురించే పేజీలు"


.
శ్రీమతి నాగజ్యోతి శేఖర్ “రెప్పవాల్చని స్వప్నం” కవితా సంపుటితో తెలుగు సాహిత్యలోకంలో తనదైన స్థానాన్ని సంపాదించుకొన్నారు. “చిగురించే పేజీలు” వీరి రెండవ కవిత్వ సంపుటి. ఈ పుస్తకంలో కవితలు సామాజిక స్పృహ, మానవసంబంధాల గాఢత, ప్రకృతి పట్ల ప్రేమ, స్త్రీవాద దృక్పథాలను గాఢంగా ప్రతిబింబిస్తాయి. వీరి వస్తువైవిధ్యం విస్తారమైనది. అభివ్యక్తి నవ్యం. కవితను నడిపించే శైలి వినూత్నం.

నాగజ్యోతి తన కవిత్వాన్ని కేవలం భావవ్యక్తీకరణగా మాత్రమే కాక, సామాజిక మార్పుకు, ముఖ్యంగా బడుగు జీవన చిత్రణకు, వ్యవస్థీకృత నిరసనకు ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఆమె మలచుకున్నారు.

నాగజ్యోతి కవితా ప్రపంచాన్ని నాలుగు ప్రధాన కోణాలలోంచి దర్శించవచ్చు.

1. సామాజిక స్పృహ, సహానుభూతి

ఈమె సమాజంలోని అణగారిన వర్గాలు, బాధితుల పక్షాన నిలబడి వారి స్వరాన్ని తన కవిత్వంలో శక్తివంతంగా పలికిస్తారు.

"బర్త్ మార్క్" కవితలో,

"వాడెవడో
పాదాల నుండి పుట్టావని
రాసిన / బర్త్ సర్టిఫికెట్
ఇంకా తగుల బెట్టడు ఎందుకో" - అని ప్రశ్నిస్తూ, కుల వ్యవస్థలోని అమానవీయతను నిలదీస్తారు.
"భూమి మింగిన సూరీడు" కవితలో, అప్పుల భారంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకొన్న రైతు కథను ప్రతీకాత్మకంగా చెబుతారు.

వెతుక్కుంటూ వెళ్ళిన లాంతరు
వెక్కుతూ వచ్చింది
కూడా వచ్చిన
ఖాళీపురుగుమందు డబ్బా
ఆ ఇంటి పచ్చని చేనును
అప్పుల పురుగు/ తినేసిందని
ఎర్రని కుంకుమ బొట్టుతో
చెప్పి కూలబడింది – (భూమి మింగిన సూరీడు). ఎక్కడా అస్పష్టత ఉండదు. బరువైన దృశ్య చిత్రాలద్వారా పదునైన విషాదం హృదయానికి గుచ్చుకొనేలా పలికించారు.

“వాక్సినేషన్” అనే కవితలో-
“ఏ ఊరి బయటి మందారమో
చదువుల నూతిలో నీళ్ళు తోడుకుంటుంది
తక్షణమే ఓ తక్షకుడు కులం కోరలతో కాటేసి
నీళ్ళు తాగాలన్న కోరికను మసి చేస్తాడు//”
“గిట్టుబాటు ధర కోల్డ్ స్టోరేజిలో శవమౌతుంది//”
“భూమితల్లి గుండెల్లో మైనింగ్ చేసి ఓ పలుగు పెత్తందారీ అవుతుంది”
- లాంటి వాక్యాలు సమాజంలో వేళ్ళూనుకుపోయిన కులవివక్ష, దళారీ వ్యవస్థ, సహజవనరుల దోపిడి లాంటి వివిధ రకాల అవినీతి స్వరూపాలను తీవ్రంగా ఎత్తిచూపుతాయి.

2. స్త్రీవాద దృక్పథం:

నాగజ్యోతి కవిత్వంలో స్త్రీల అణచివేత, అంతర్గత సంఘర్షణ, వారి స్వేచ్ఛా కాంక్ష బలంగా ధ్వనిస్తాయి.

"ఆమెనలా వదిలేయండి" కవితలో, స్త్రీని నదిగా, చెట్టుగా అభివర్ణిస్తూ, “నది సర్దుకుపోవడం అంటే జీవాన్ని కోల్పోవడమే” అని హెచ్చరిస్తారు.

అరచేతుల్లో గోరింట పూయించాలని
పుట్టింటికి వెళ్ళా
పాత జ్ఞాపకాల పరిమళం గుప్పుమంది
అమ్మ నా గదిలో గతాన్ని సర్దుతున్నది (అలిఖిత ఆస్తి)
పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చినప్పుడు పొందే అనుభూతుల్ని ఈ కవిత బంధిస్తుంది. “గదిలో గతాన్ని సర్దటం” అనే వర్ణన అత్యద్బుతంగా సందర్భాన్ని కళ్ళకు కడుతుంది.

“పుట్టింట్లో కూతురికి తనదైన ఓ గది ఉంచడం
హృదయ రాజ్యాంగం కల్పించాల్సిన
ఆస్తిహక్కు” అంటూ ఈ కవిత ముగుస్తుంది. స్త్రీల మానసిక హక్కుల పట్ల కవయిత్రికి ఉన్న స్పష్టతను ఆ వాక్యాలు పట్టిచూపుతాయి. “అలిఖిత ఆస్తి” అనే కవితా శీర్షికకు గొప్ప ఉదాత్తమైన ముగింపు అది.

మణిపూర్ ఘటనల నేపథ్యంలో రాసిన "నగ్నత్వం" కవిత స్త్రీలపై జరిగే హింసను అత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తుంది.

“ఇప్పుడిక నగ్నత్వానికి సంస్కారం నేర్పక్కరలేదు
కొత్త రాజ్యాంగం బట్టలిప్పడాన్ని శాసనం చేసింది
ఊరావలి పుష్పాలను దిగంబరంగా
ఊరేగించడానికి చట్టం చేసింది
ఇక్కడంతా స’మ్మతమే” అనే వాక్యాలలో మతం పేరిట జరుగుతోన్న ఉన్మాద ఊరేగింపులకు ఎవరు బలవుతున్నారో, వాటి వెనుక ఎవరున్నారో స్పష్టపరుస్తారు.

"నువ్వు గొంతు విప్పకపోతే కుకీల నగ్నదేహాలు
శాశ్వత తీతువులై
నీ చరిత శిరస్సుపై నిత్యం ఎగురుతూనే ఉంటాయి
వారి ఆర్తనాదాలు అగ్నిపూలయి
నిన్ను దహిస్తూనే ఉంటాయి" అని హెచ్చరించడం, ఈ అన్యాయాలపై మౌనంగా ఉండకూడదన్న ఆమె తిరుగుబాటు తత్వాన్ని చూపుతుంది.

3. యుద్ధ వ్యతిరేకత, శాంతి కాంక్ష

ఈ కవయిత్రి శాంతిని, సామరస్యజీవనాన్ని అమితంగా ప్రేమిస్తారని వివిధ కవితల ద్వారా స్పష్టమవుతుంది. "రెండు సత్యాలు" "మూడవ ప్రపంచం" కవితల్లో యుద్ధం మిగిల్చే విధ్వంసాన్ని వర్ణించారు.

యుద్ధం ముగిసినా దాని బీభత్సం మానవజీవితాన్ని వెంటాడుతూనే ఉంటుందని, యుద్ధం ముగియటం అనేది విరామం మాత్రమే అనే రెండు పరమసత్యాలను “రెండు సత్యాలు” అనే కవితలో ఆవిష్కరిస్తారు కవయిత్రి.

“అస్థిపంజరాల నదీ
రక్తపు సంద్రం/ సంగమిస్తాయి
తేలుతున్న పడవలనిండా
తెగిపడ్డ అవయవ శకలాలు
పూచిన పూలనిండా విరిగిన పాల
నీచువాసన
అప్పుడే పుట్టిన పిట్టనోట్లో
గాయాల రొమ్ము (రెండు సత్యాలు)” లాంటి పదచిత్రాలు యుద్ధబీభత్సాన్ని ఎంతో భయావహంగా వర్ణిస్తాయి.

ఈరోజు జరుగుతున్న యుద్ధంలో చిన్నపిల్లలు టార్గెట్స్ గా ఉంటున్నారు. ఇది అత్యంత హేయం. ఈ అంశాన్ని స్పృశిస్తూ రాసిన "శిథిల స్వప్నాలు" కవితలో

“తెగిపడ్డ ఆ చిన్ని చేతులు
ఎన్ని పున్నములు పుట్టించేవో
ఆ లేత కాళ్ళు ఏ గెలుపు గ్రహంపై అడుగుపెట్టేవో” అనే వాక్యాలు యుద్ధం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనమవడం పట్ల తీవ్ర ఆవేదనను పలికిస్తాయి. "యుద్దానికి గర్భసంచి ఉంటే తెలిసేది గర్భస్రావమెంత నరకమో" అనడం హింస పట్ల కవయిత్రికున్న తీవ్ర వ్యతిరేకతకు పరాకాష్ట

4. అంతర్యానం, జీవన తాత్వికత

ఈ కవయిత్రి సామాజిక అంశాలపై ఎంత బలంగా స్పందిస్తారో, వ్యక్తిగత భావోద్వేగాలను, దుఃఖాన్ని, ఏకాంతాన్ని కూడా అంతే లోతుగా విశ్లేషించుకుంటారు. “దుఃఖానికో గది” కవితలో
“లోలోపల ఎక్కడో వాన
గుండెను నిలబెట్టిన గుప్పెడంత నేలపై
ఆరని తడి
నాలుగు గదుల్లోనూ అల్పపీడనం// అనే ప్రారంభ వాక్యాలు మనసులోని లోతైన బాధను, ఒంటరితనాన్ని, నిస్సహాయతను కళ్ళకు కడతాయి. మానవజీవితంలో దుఃఖం అనివార్యతను చెబుతూ “గుండె బరువు తీర్చుకొనేందుకు/ దుఃఖానికో గది కావాలి” అంటూ ముగుస్తుందీ కవిత.
ఈ కవిత కేవలం బాధను వర్ణించే కవిత కాదు. దుఃఖాన్ని గౌరవించమని, దాన్ని అంగీకరించమని, ఆ బరువును దించుకోవడానికి మనకు మనమే ఒక "గది"ని (ఏకాంతాన్ని) ఇచ్చుకోవాలని చెప్పే ఒక తాత్విక విశ్లేషణ.

‘పట్టాలు తప్పిన రాత్రి’ కవిత మొత్తం సృజనాత్మక ప్రక్రియ (creative process) గురించిన అంతర్మథనం.

"పొద్దు పొద్దున్నే ప్రయాణం మొదలు పెడతాను" , కానీ "రాత్రైనా రావాల్సిన రైలు రాదు" అంటారు.
ఆ "రైలు" మరేదో కాదు, ఆమె రాయాలనుకుంటున్న "వాక్యం" లేదా "కవిత". సృజన కోసం పడే నిరీక్షణ ఇది. సృజన సామాజికం కావొచ్చు, కానీ ఆ సృజన చేసే క్షణంలో సృజనకారుడు ఒంటరి. ఎంత ఒంటరి అంటే “రైలు ఎక్కేటప్పుడో/ దిగేటప్పుడో/ జారిపడ్డ చెప్పు” అంత ఒంటరి అని ఉపమిస్తారు కవయిత్రి.

"ఉదయపు బుగ్గపై సిరా చుక్క పెడతాను” అనటం ద్వారా సృజన పూర్తయింది అని సూచిస్తారు. ఇంత అంతర్మథనం, ఒంటరితనం, నిరీక్షణ... ఇవన్నీ ఆమె "కవిత్వం" కొరకు చెల్లించిన మూల్యం.

కెటలిస్ట్" కవితకూడా సృజనకు సంబంధించినదే. దీనిలో
"నలిగిన గుండెను కాగితం చేసి మడతల మధ్య నన్ను నేను పరుచుకుంటాను" అనే వాక్యం ద్వారా, బాధ నుండే సృజన పుడుతుందని సూచిస్తారు.
“నేల హృదయపు లోతులు
చెప్పుల్లేని పాదాలకే తెలుస్తాయి (డార్వినిజం)” ఇది కేవలం నేల గురించి కాదు, జీవితం గురించి చెప్పిన తాత్విక వాక్యం. నిజమైన అనుభవం, జ్ఞానం ఆడంబరాలకు దూరంగా, నేలతో మూలాలతో మమేకమైనప్పుడే తెలుస్తాయని ఈ పదచిత్రం చెబుతుంది.

“దుఃఖాన్ని పూడ్చిపెట్టి
ఓ నవ్వుగా చిగురించాలంటే
చెట్టుకెంతటి
ప్రసవ వేదన (ఇంకెవరికి….?)” చెట్టు చిగురించడానికి ఎంత అంతర్గత శక్తి అవసరమో, మనిషి కూడా దుఃఖాన్ని దాచుకుని నవ్వడానికి అంతటి "వేదనా" అనుభవిస్తాడని చెప్పడం చాలా ఆర్ద్రమైన పోలిక.
“దుఃఖాన్ని పూడ్చిపెట్టి
నవ్వుగా మొలకెత్తడం
“ఆమెకు”
తప్పా ఎవరికి సాధ్యం?” అంటూ ఈ కవిత ముగుస్తుంది. చెట్టుకి స్త్రీని ప్రతీకగా చేయటం ఒక బలమైన వ్యక్తీకరణ.

ఈ సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక హింసను, దుఃఖాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసిన వేదనాత్మక కవిత “కొత్త కాన్పు”. ఈ కవిత ముగింపు ఆలోచింపచేస్తుంది
“క్షేత్రాన్ని కన్న తల్లుల్లారా
కలలతో పాటు కత్తులనూ కనండి
బీజాన్ని కన్న తల్లుల్లారా
వంశంతో పాటు
శవమవ్వని సంస్కారాన్ని
కూడా ప్రసవించండి. (కొత్తకాన్పు)”. నేటి వివక్షాపూరిత సమాజానికి అవసరమైన ఒక కొత్తతరం కోసం కవయిత్రి చేసిన ప్రకటన ఇది.

***
ఈ సంపుటిలో రచయిత్రి అనేక విభిన్నమైన వస్తువులను ఎంచుకున్నారు. వ్యక్తిగత అనుభూతుల నుండి ప్రపంచ యుద్ధాల వరకు, అమ్మ ప్రేమ నుండి విద్యార్థుల ఆత్మహత్యల వరకు కవితావస్తువులో వైవిధ్యం కనిపిస్తుంది. తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని, దానిలోని వైరుధ్యాలను, సంఘర్షణలను చాలా లోతుగా పరిశీలించి తనదైన తాత్విక డైమెన్షన్ ను జోడించి కవిత్వీకరించారు.

కొన్ని కవితలను భాషాపరంగా మరింత సరళంగా చెప్పటం, భావోద్వేగ తీవ్రత వల్ల నిర్మాణం తడబడకుండా చూసుకోవటం లాంటివి చేసిఉంటే అవి మరింత ప్రకాశించేవి అనిపిస్తుంది.
"ఎక్కడ ఏం జరిగినా అందులో జ్యోతి తనను తాను వెతుక్కుంటుంది. లేదూ తనలో అదుందేమోనని వెతుక్కుంటుంది" అని ముందుమాటలో ప్రసేన్ అన్నట్లు, ఆమె ప్రతి వాస్తవంతో మమేకమవుతారు. ఈ తాదాత్మ్యతే ఆమె కవిత్వానికి జీవం పోసింది.

చాలా పదచిత్రాలు ఏకకాలంలో హృద్యంగా, శక్తివంతమైన పొయెటిక్ ఎక్స్ ప్రెషన్స్ గా ఉండటం గొప్ప అరుదైన లక్షణం. మార్చురీబోయ్ ని వర్ణిస్తూ అతను “నగ్నంగా నిద్రపోయే చెట్లకు తోటమాలి” అంటారు.

"జెండా కర్ర మూల్గుతూనే ఉంది ఒక్క వర్ణాన్నే మోయలేక" ("అటే పోవాలి") అంటూ కాషాయీకరణను నిరసిస్తారు. ఈ ఒక్క వాక్యం ఒక పూర్తి రాజకీయ వ్యాసంతో సమానం.
నాగజ్యోతిశేఖర్ గారి కవిత్వం ఆలోచింపజేస్తుంది, ఆర్ద్రతతో కదిలిస్తుంది, కొన్నిసార్లు నిద్రపోతున్న మనస్సాక్షిని తట్టిలేపుతుంది. చాలా కవితలలో నేడు జడలువిప్పి తాండవం చేస్తున్న మతోన్మాదాన్ని దళితబహుజన కోణంలోంచి ఎత్తిచూపారు. స్త్రీల ఆత్మవిశ్వాసం స్వేచ్ఛాకాంక్ష వంటి అంశాలను ఈ సంపుటిలో బలంగా వినిపించారు. మొత్తం మీద, "చిగురించే పేజీలు" కేవలం ఒక కవితా సంపుటి మాత్రమే కాదు, మన కాలపు సామాజిక, మానసిక చిత్రణ. తెలుగు కవిత్వాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

బొల్లోజు బాబా

(ఈ వ్యాసం " నడుస్తున్న తెలంగాణ" పత్రికలో ప్రచురింపబడింది. శ్రీ చందు శివన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను)









No comments:

Post a Comment