Monday, March 28, 2022

అతని కవిత్వమొక అనుభూతి

 (శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ ఇటీవల వెలువరించిన “నేనొక అనుభూతి” కవిత్వ సంపుటి పరిచయ వ్యాసం మార్చ్ 2022 ప్రస్థానం సంచికలో ప్రచురించబడింది. ఎడిటర్ గారికి కృతజ్ఞతలు)

.
అతని కవిత్వమొక అనుభూతి
.
కవి స్వీయ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసిన కవిత్వాన్ని అనుభూతి కవిత్వం అంటారు.
క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం? అని ఇస్మాయిల్ ప్రశ్నిస్తారు.
బాహ్యదృశ్యాలు అంతరంగప్రపంచంలో దృశ్యత్వాన్ని కోల్పోయి కేవల అనుభూతిగా మిగుల్తాయని శ్రీకాంత శర్మ అభిప్రాయపడ్డారు.
ఆధునిక కవిత్వంలో అనుభూతి కవిగా గుర్తింపబడిన వాడు బాలగంగాధర తిలక్. ఆ తరువాత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, శేషేంద్ర శర్మ, వేగుంట మోహన ప్రసాద్, ఇస్మాయిల్, కొత్తపల్లి శ్రీమన్నారాయణ లాంటివారు ఈ అనుభూతికవిత్వాన్ని వెలిగింపచేసారు. ఇదేక్రమంలో సమకాలీనంగా బి.వి.వి. ప్రసాద్, నామాడి శ్రీధర్, ఎమ్మెస్ సూర్యనారాయణ లాంటివారు రాజకీయ దృక్ఫథాలతో ప్రమేయం లేకుండా జీవనానుభవాలను పరిగణలోకి తీసుకొని కవిత్వాన్ని రచిస్తున్నారు.
తెలుగు సాహిత్యంలో అనుభూతి కవిత్వంపై డబ్బైలలో గొప్ప చర్చ జరిగింది. సాహిత్యమంతా మానవానుభవంలోంచి పుట్టుకొచ్చినదే కనుక అనుభూతి కవిత్వాన్ని ఒక సాహిత్య ధోరణిగా భావించవచ్చు తప్ప సిద్ధాంతంగా అంగీకరించలేం-అంటూ మార్స్కిస్టు విమర్శకులు చేసిన వాదన సహేతుకంగానే అనిపించినా; అనుభూతి కవిత్వంలో సామాజిక స్పృహ ఉండదని, సామాజిక ప్రయోజనం లేని కవిత్వం ప్రగతినిరోధమని అంటూ చేసిన విమర్శను అంగీకరించలేం.
ప్రజలను గొప్ప గొప్ప కార్యాలకు ప్రేరేపించటం ఒక్కటే సామాజిక ప్రయోజనంగా భావిస్తారు కానీ, “పఠిత హృదయంలో దీపం వెలిగించటం” కూడా సామాజిక ప్రయోజనమే. సాటి మనిషిపట్ల కరుణను, ప్రకృతి పట్ల ప్రేమను, కలిగించటం నేటి యాంత్రిక ప్రపంచానికి ఎంతో అవసరం. ఎమ్మెస్ కవిత్వం ఆ పనిచేస్తుందని, ఇటీవల వెలువరించిన “నేనొక అనుభూతి” కవిత్వ సంపుటిలోని అనేక కవితలు నిరూపిస్తాయి. .
***
ఎంతైనా రైతు… ప్రాణాలు పోసి, పెంచిన వరి కంకుల కలలు
బతుకు కుప్పపోసి….నూర్చి ఎగరబోసిన బంగారు క్షణాలు
జీవితం పణంగా పెట్టి… పరిరక్షించిన ధాన్యపురాశులు
కృషి పరిపూర్ణతకు ధన్యత చెందే జీవరాశులు
ఒక్క ఈవియమ్ బీప్ సౌండ్ లో గల్లంతైపోవడం
ఈ శతాబ్దపు విషాదం…//
ప్రభుత్వం తీసుకొచ్చిన రైతువ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధానిలో పెద్దఎత్తున ఉద్యమం సాగింది. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. తాము ఎన్నుకొన్న ప్రభుత్వాలు తమ గొంతుకలనే కోయటాన్ని ఎంతో పదునుగా చెబుతున్నాడు.
వరికంకుల కలలు, బంగారు క్షణాలు, ధాన్యపురాశులు అంటూ రైతుజీవితాన్ని కళ్లముందు నిలిపి… అదంతా ఒక్క ఈవియం బీప్ సౌండ్ లో గల్లంతైంది అనటం గొప్ప శక్తివంతమైన అభివ్యక్తి.
***
ఈ కాలం
పచ్చిగాయాలు రేగిన
క్షతగాత్ర యవనిక
దీనికి ఒక సరికొత్త పాత పేరు
వికారి--- అనే వాక్యాల ద్వారా వగరు అనే కవితను ఒక ఉగాది కవితగా పోల్చుకోవచ్చును.
ఈ కవితలో వగరును రుచిరాజంగా ప్రకటిస్తాడు. ఆరింటిలో నాది వగరు దారి అంటాడు. వసంతపు గాలులన్నీ వగరుగా వీచాలి/పొద్దుటే కోకిలను వగరుగా కూయమని అడగాలి.. (వగరు) అంటాడు. చాలా చిత్రమైన ప్రతిపాదన. ఇంతవరకూ మనం విన్న ఉగాదికవితలలోకెల్లా విలక్షణమైన ఊహతో కూడుకొని ఉన్న కవిత ఇది. . ఇదే ఎమ్మెస్ కవితామార్గం.
***
చాన్నాళ్ళ క్రితం రాధేయ పురస్కారం కోసం అనంతపురం వెళ్ళాడు ఎమ్మెస్. సస్యశ్యామల కోనసీమనుండి కరువుప్రాంతంగా చెప్పబడే రాయలసీమకు ఒక కవి ఎలా వెళతాడు? అసలు ఎలా వెళ్ళాలి? అనేదానికి “మబ్బుల్లేని ఆకాశంలోకి… అనేకవితలో సమాధానం దొరుకుతుంది.
పక్షిలా వచ్చివాలాను! రెక్కలు దులిపాను!
ఏమో! రెండుదుక్కుల వానౌదామనుకొన్నాను
ఈ శప్తభూమిపై తప్త హృదయంతో దొర్లాలనుకొన్నాను//
గుండెలో గోదారి నింపుకొచ్చాను//
కార్మొయిళ్ళని దుస్తులుగా కుట్టించుకొని
ధరించి వచ్చాను
ఈ మట్టిపొరల్లోకి దూకి
వరికంకునై నాట్యమాడాలని వచ్చాను//
సంచిలో పట్టినన్ను మబ్బులేసుకొచ్చా… అంటాడు ఎమ్మెస్. ఇక్కడనుంచి నీటిని, నదులని పట్టుకెళ్ళాలని ఉంది అన్న ఊహే హృదయాన్ని కదిలింపచేస్తుంది.
***
చిత్రకొండ గంగాధర్ కవి, రచయిత. చెరువుగట్టుపై చెప్పులు, రాసుకొన్న డైరీలు విడిచి చెరువులోకి నడుచుకొంటూ వెళ్ళి ఆత్మహత్యచేసుకొన్న ధీరచిత్తుడు. ఈ సంపుటిలో ఎచటికి పోగలవు అనే కవిత చిత్రకొండ గంగాధర్ పై వ్రాసినది. ఈ కవితలోని శిల్పవిన్యాసం ఉత్కృష్టమైన స్థాయిలో కనిపిస్తుంది.
నిద్రిస్తున్న తటాకపు
రహస్యనీటిపొరల అరలు తెరిచి
చిత్రంగా ఎక్కడకు మాయమయ్యావు?— రాత్రిపూట, లోతైన చెరువునీళ్ళలోకి అదృశ్యమైపోయిన చిత్రకొండను ఒక దృశ్యంగా కళ్ళముందు నిలుపుతాడు.
చెరువుగట్టున ఆత్మదీపాన్ని వెలిగించి
ఎచటికి పోగలవు… ఒకానొక రాత్రి …. అంటూ కవిత ముగుస్తుంది. ఆత్మదీపం అంటే
అతను చెరువుగట్టున మిగిల్చిన డైరీలలోని సాహిత్యంగా భావించాలి.
గంగాధర్ కవిత్వాన్ని పత్రశకలం పేరుతో ఒక సంపుటిగా, మృతనగరం అనే ఒక నవలను నామాడి శ్రీధర్ పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు. అలా సాహిత్య రూపంలో ఆత్మదీపంగా వెలుగుతున్నప్పుడు గంగాధర్ ఎచటికి పోగలడు?
***
వాచ్యంగా కాక శబ్దప్రధానంగా ఉండే కవిత్వాన్ని అందుకోలేని అరసికులతోను, రసజ్ఞతలోపించిన విమర్శకులతో ఎమ్మెస్ కవిత్వ యుద్ధం చేస్తున్నాడు చాన్నాళ్ళుగా. అలాంటి వారిని ఉద్దేసించి రాసిన “అజ్ఞానులు” అనే కవితలో
ఉంటారుంటారు! సర్వత్రా ఉంటారు…
ఉండాలి కూడా
రోడ్డుపై వేలాది బాతులు
వయ్యారంగా నడుస్తున్న అపురూప దృశ్యంలో
ఒక మోటారు బైకు నిస్సిగ్గు అసహన చక్రాలకింద పడి
అదాటుగా -నువ్వొక బాతై మరణించి
తిరిగి అక్షరమై లేచిన క్షణాల్లో
పుట్టుకొస్తారు వాళ్ళు!
నీ కస్సలు బోధపడని లెక్కలేవో పట్టుకొస్తారు
వాళ్ళుండాలి సుమా! ఉంటేనే నీ ఉనికి! -- అంటాడు
పై కవితలో చెప్పిన “ఒక మోటారు బైకు నిస్సిగ్గు అసహన చక్రాలంటే” ఏమిటి? మోటరు బైకు చక్రాలు అనొచ్చు కదా. నిస్సిగ్గు, అసహనం విశేషణాలు మన యాంత్రిక జీవనాన్ని సూచిస్తాయి. మన యాంత్రిక జీవనం మనం జీవించే క్షణాలను నిస్సిగ్గుగా, అసహనంతో చిదిమేస్తున్నదనే సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాడిక్కడ కవి.
ఒక అందమైన సంధ్య మనకు పట్టదు. చలం అన్నట్లు ఎవరా అమ్మాయి అని ప్రశ్నిస్తాం.
మన యాంత్రిక జీవన రణగొణల మధ్య మనచుట్టూ ఉన్న అనేక అనుభవాలకు మనం అంధులమై పోతాం, మోటార్ బైకు కింద పడే బాతులమై పోతాం. వాటిని ఎమ్మెస్ లాంటి సున్నిత హృదయులు పట్టుకొని, గొప్ప పదాలతో నిర్వచించి దివ్యత్వాన్ని అద్ది కవిత్వంలోకి తీసుకొని వస్తారు. ఉదాహరణకు-సస్యరహస్యం నింపుకొన్న పంటకాలువ, పున్నమిపడవ-సరంగు కవి, తమ అందంతో మూర్చలు ప్రసాదించే సీతాకోక చిలుకలు, పడవ సరంగు గెడపై అదాటున దర్శనమిచ్చిన పాలపిట్ట, గోవా మోహిని, చంద్రకలశం, చిమ్మచీకట్లో స్కూటీకి అడ్డుపడే తాబేలు, వర్షరుతు రాయభారి, పుప్పొడి దుప్పటి, పుణ్యక్షేత్రం ఒక రెక్కల లోకం – లాంటి అనేక వ్యక్తీకరణలు మనం అంధులమైపోయిన అలాంటి కొన్ని సందర్భాలను పునరుజ్జీవింపచేస్తాయి ఈ పుస్తకంలో.
***
అనువాదకులు వివిధ భాషలనుంచి సాహిత్యాన్ని అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇతరభాషలలోని సాహిత్యాన్ని చదువుకోవటానికి అనువాదకుల సహాయం తప్పనిసరి. ఒక పాఠకుడు అనువాదకుల పట్ల చూపించాల్సిన ప్రేమ కృతజ్ఞతలు లోపలి ఆకాశాలు అనే కవితలో ఇలా అంటాడు ఎమ్మెస్.
ఈ నా హృదయాకాశంలోకి
ఎన్ని పక్షులు
తమ రెక్కల్ని అనువదించి
ఎన్ని ఆకాశాలను దులపరించాయో!
నా లోపలి మట్టిప్రమిదను తుడిచి
ఎన్నెన్ని తప్త దగ్ధ విశ్వగానాల ఘోషను
చమురుగా నింపాయో….
ఒక అనువాదకుడు ఒక పాఠకుని హృదయాకాశంలోకి ఎన్ని ఆకాశాలను దులపరించాడో అన్న ఊహే ఎంతో గాఢమైనది. అపూర్వమైనది.
***
జీవనగాథాకవిత్వం పేరుతో ప్రముఖుల జీవనరేఖలను కవితలుగా పోతపోయటం ఒక నూతన ప్రక్రియ కాకపోవచ్చు. అలా రాసిన కవితలు ఆయావ్యక్తుల జీవితాలలోని మంచి చెడులను అద్భుతంగా వ్యక్తీకరిస్తున్నాయి.
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పై వ్రాసిన కవిత శీర్షిక తపతి…శుభలక్ష్మి. సుబ్బలక్ష్మిని శుభలక్ష్మిగా సంబోధించటం ద్వారా పెద్దబొట్టుతో ఆమె నిండైన విగ్రహాన్ని కళ్ళముందు నిలుపుతాడు.
సదాశివమేనాడో చెక్కిన మరబొమ్మా// అనే వాక్యంలో ఆ సర్వేశ్వరుడు చెక్కిన బొమ్మ అనే అర్ధం పైకి తెలుస్తున్నా- తరచిచూస్తే సుబ్బలక్ష్మి భర్త అయిన సదాశివం ఆమెను ను ఒక మరబొమ్మలా ఆడించేవాడనే గాసిప్ కూడా ఇమిడిపోవటం ఎమ్మెస్ ప్రతిభకు తార్కాణం.
***
రాసిన ప్రతీదానికి సామాజిక ప్రయోజనం ఉండాలనీ, ఉంటేనే అది ఉత్తమ కవిత్వమనీ, లేకపోతే అది రెండో రకం కవిత్వం అని విమర్శకులు చేసే దాష్టీకం వల్ల ఆధునిక కవిత్వంలో భక్తి, తాత్వికత, శృంగార, నాస్టాల్జియా లాంటి అనేక కవిత్వ పాయలు దాదాపు ఎండిపోయాయి.
ముందుగా చెప్పుకొన్నట్లు ఎమ్మెస్ యోధుడు. చుట్టూ ఎంతో మంది అరసికులతో. రసజ్ఞత లోపించిన విమర్శకులతో యుద్ధం చేస్తున్నాడు. “పొయం ఉంది భయం లేదు” అని సంకల్పం చెప్పుకొన్నవాడు, మనకు ధైర్యం చెప్పినవాడు. అందుకనే భక్తి భావంతో వ్రాసిన శివవచనాలను ఈ సంపుటి చివరలో చేర్చాడు. సమకాలీన కవిత్వ సంపుటులలో భక్తి కవితలకు స్థానం కల్పించటం యోధత్వం కాక మరేమిటి? మన తెలుగు విమర్శకులు మిస్టిక్ కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఏమి ఉంది అని నిస్సిగ్గుగా ప్రశ్నించగలరు కానీ, ప్రపంచవ్యాప్తంగా రూమీ కవిత్వం, అక్కమహాదేవి వచనాలకు ఎందుకు ఆదరణ లభిస్తోందో కనీసం ఊహైనా చేయరు.
పొత్రంలో ఉంటావు
బరువుగా!
పత్రంలో
తేలికగా!
నువ్వు
బరువా?
తేలికా?
ఈ శివవచనం శివుడిని ఉద్దేశించినదైనా, అది ఎమ్మెస్ కవిత్వానికి కూడా అన్వయించుకోవచ్చు.
***
ఎమ్మెస్ కవిత్వం ఎన్నడూ వాచ్యంగా ఉండదు. ఎమ్మెస్ ఏనాడూ ఎంగిలి ప్రయోగాలు చేయలేదు, డెడ్ మెటఫర్స్ వాడలేదు. ఏం చెప్పినా నవ్యంగానే చెప్పాడు, సొంతస్వరంలోనే రాసాడు. కవిత్వం అనేది ధ్వన్యాత్మకంగా, ప్రతీకాత్మకంగా మాత్రమే చెప్పాలని కంకణం కట్టుకొని మూడు దశాబ్దాలుగా కవిత్వాన్ని వెలువరిస్తున్నాడు. ఇతనిది జీవనానుభవాల కవిత్వం. కవిగా ఎమ్మెస్ నిజాయితీపరుడు. తాను చూచినది, తాను అనుభవించినది మాత్రమే కవిత్వంలోకి తీసుకొని వచ్చాడు. తన అనుభవానికి వెలుపల ఉన్నదానిని ఏనాడూ స్పృశించలేదు.
ఇక చివరగా ---
జీవితం
కిటికీపై
వాలిన పిట్ట
ఎగిరిపోయేలోగా
మిగిలిపోయే
నేనొక అనుభూతి…
రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ఒక ఆకారాన్ని ఇస్తే అది రాముడు అని అర్ధం. అదే రీతిగా, అనుభూతికి ఒక ఆకారాన్ని ఇస్తే ఎమ్మెస్ కవిత్వం అని అర్ధం చెప్పుకోవచ్చు. అందుకనే జీవితం కిటికీ పై వాలిన పిట్ట ఎగిరిపోయేలోపు నేనొక అనుభూతిగా మిగిలిపోతాను అని ప్రకటించుకొన్నాడు- మనకున్న గొప్ప కవి శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ.
బొల్లోజు బాబా






No comments:

Post a Comment