Monday, March 21, 2022

ఒకనాటి రెండు మంచి నాటకాలు.....

 ఒకనాటి రెండు మంచి నాటకాలు.....

.
మా నాన్నగారి పేరు శ్రీ బొల్లోజు బసవలింగం. 10 జూలై, 1932 న జన్మించారు వీరు 16 సంవత్సరముల ప్రాయంలో రచించిన "రాణిదుర్గావతి" అనే పద్యకావ్యం పలువురి పండితుల ప్రశంసలు పొందింది. ఎవరు దోషి, వారసుడు, రాధామాధవం, త్యాగజ్వాల, కర్తవ్యం, నిజం దాగదు, సతీ అహల్య, బాగుపడాలంటే, శ్రీకృష్ణ రాయబారం వంటి నాటకాలను రచించారు. డా. అంబేద్కర్ రచనలను కొన్నింటిని అనువదించారు. సువర్ణశ్రీ కలం పేరుతో రచనలు చేసారు. 25 ఏప్రిల్ 2004 న పరమపదించారు.
ఈ మధ్య ఆర్చైవ్ ఆర్గ్ లో పాత పత్రికలు వెదుకుతూంటే ఆంధ్రజ్యోతి 1967, జూలై 16 నాటి పత్రికలో "మూడు మంచి నాటకాలు" పేరుతో ఒక సమీక్షాకథనం కనిపించింది. వాటిలో రెండునాటకాలు మా నాన్నగారు సువర్ణశ్రీ పేరుతో రచించిన వారసుడు, ఎవరుదోషి నాటకాలు (మరొకటి రెంటాల గోపాలకృష్ణ గారి రజని నాటకం).
చాలా ఆనందంగా, గర్వంగా అనిపించింది చదివినపుడు.
***
.
మూడు మంచి నాటకాలు
.
వారసుడు, ఎవరు దోషి
రచన "సువర్ణశ్రీ" అనే కలం పేరుగల బొల్లోజు బసవలింగం, వెల: ఒక్కొక్కటి రెండురూపాయలు, ప్రచురణ, విజిఎస్. పబ్లిషర్స్, అమలాపురం.
***
కాంతాన్ని మినహాయించినా, కనీసం కనకం కోసం మనిషి ఎంత నైచ్యానికి దిగజారగలడో రెండురంగాలకు విస్తరించిన వారసుడు నాటకం వ్యక్తం చేస్తున్నది. స్త్రీ పాత్రలు లేకుండా శ్రీ "సువర్ణశ్రీ" రచించిన ఈ నాటకంలో డబ్బుకోసం మనిషి ఎంత హేయానికి పూనుకోగలడో పూర్తిగా నిరూపించారు.
తాము వారసులు కాకపోయినా, ఒక ధనవంతుడు తన అవసాన దశలో చేసిన ఒక ప్రకటన ఆధారంగా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు మూగుతారు కొందరు. అతని ఆస్తిపాస్తులు కోసం ఆ ధనవంతుని చావుకోరుకోవడమే కాక, అందుకు వారు స్వయంగా ప్రయత్నిస్తారు కూడా. చివరకు తన మిత్రుని సలహాతో తాను అప్పులతో తలమున్కలై ఉన్నట్లు ధనవంతుడు వెల్లడించి, తనకు ఆశ్రయం కోఱగానే అందరూ నిష్క్రమిస్తారు. నౌకరుగా చేరినా ఆ తాత మనుమడు చిరంజీవి తన సుగుణసంపత్తిచే తాత హృదయాన్ని చూరగొని కథానాయకుడావుతాడు. ఈ నాటకం వెనుక కులాలు, మతాలు కంటే మానవత్వమే మిన్న అనే ముఖ్యమైన అంశం నిలిచి వుంటుంది. రచన వ్యంగ్యాత్మకంగా, హాస్యస్ఫోరకంగా కొనసాగుతుంది.
శ్రీ సువర్ణశ్రీ రచించిన మరొక నాటకం "ఎవరుదోషి" కనకానికి ఆశించి దేశద్రోహానికి పాల్పడి, స్వీయ కాంత చేతిలో నిహతుడయిన యువ సైంటిస్ట్ ను పరిచయం చేస్తుంది. సైంటిస్ట్ నరసింహరావు భార్య నిర్మల పాత్ర ఆదర్శప్రాయమైనట్టిది. ద్వితీయరంగంలో ఆమె పాత్ర ధీరోదాత్తమవుతుంది. నరసింహారావును హత్యచేసినదెవరో పోలీస్ ఇన్ స్పెక్టరు జయరామ్ కూపీతీసే సందర్భంగా రచన పగడ్బందీగా సాగినది. ముఖ్యంగా హత్యసమయంలో ప్రయోగించిన "టెక్నిక్" కు రచయిత అభినందనీయులు.
కాగా, ఈ రెండు నాటకాలలో కూడా ఒక పాత్రధారి పూర్తిచేయవలసిన వాక్యాన్ని మరొక పాత్రధారి అందుకొని పూర్తిచేయడం కనిపిస్తుంది. ఉత్తమమైన నాటక రచయితగా శ్రీ సువర్ణశ్రీ ఖ్యాతి గాంచగలరని, ఈ రెండు నాటకాల రచనావిధానం చెప్పకయే చెబుతున్నది
--- ప్రాచేతస
ఆంధ్రజ్యోతి 1967, జూలై 16








No comments:

Post a Comment