Tuesday, March 15, 2022

రెప్పవాలనివ్వని కవిత్వం

 ఈ రోజు కాకినాడ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శ్రీమతి దొండపాటి నాగజ్యోతిశేఖర్ రచించిన "రెప్పవాల్చని స్వప్నం" కవితాసంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రీ మార్నిజానకిరామ్ గారు ఆవిష్కరించగా, శ్రీమతి పద్మజావాణి, డా. జోశ్యుల కృష్ణబాబుగారు విశ్లేషించారు. ఈ సభకు శ్రీ గనారా గారు అధ్యక్షత వహించారు.

***
.
రెప్పవాలనివ్వని కవిత్వం
.
"రెప్పవాల్చని స్వప్నం" పుస్తకం ద్వారా తెలుగు కవిత్వప్రపంచంలోకి సత్తువకలిగిన వాక్యాన్ని రాయగలిగే కవయిత్రి ప్రవేశించారు.
శ్రీమతి దొండపాటి నాగజ్యోతిశేఖర్ కవిత్వపు పలుకు విభిన్నమైనది. వాక్యవాక్యానా నింపిన మెటాఫర్ కొత్తగా ఉంటోంది. కవిత ముగిసే సరికి గాఢమైన ఉద్వేగం హృదయాన్ని బలంగా తాకుతుంది.
.
నువ్వెళ్ళిపోయాకా ... అనే కవితలో
నువ్వెళ్ళిపోయాక
తేనెపిట్ట ఒకటి పూర్తిగా రాని రెక్కలతో
పొడి ఎదమైదానంలో ఎగరాలని చూస్తున్నది.
సగం విరిగిన కాళ్ళతో స్వప్నాలు
చీకటిని దాటాలని పరిగెడుతున్నాయి.
దిగులు తీతువు ఉండుండి
విసుగురాగం పాడుతుంది.//
అసలు నీతో పరిచయమే లేనికాలం ఎంత తెల్లగా ఉండేది
ఏ భావోద్వేగజ్వాలలూ
ఏ కన్నీటిజాలూ లేని
నిశ్చల నిశ్శబ్దం.
నీ మిణుగురురెక్కల్ని
స్పృశించానో లేదో
వేళ్లకు అంటుకొన్న వెన్నెళ్ళను
విదిలించడం నా వల్ల కాలేదు.
పదం పదంగా నువ్వు కురుస్తుంటే
ఆ చిత్తడిలో మొలుస్తూ నేను//
నువ్వెళ్ళిపోయావు సరే
నేనేంటి
అక్షరమై పుట్టటం మొదలెట్టాను.
.
వియోగ క్షణాలన్నీ కవిత్వంగా మారుతున్నాయి అన్న వస్తువును ఎంత అందంగా, శక్తివంతంగా చెబుతున్నారు నాగజ్యోతి.
కాలం తెల్లగా ఉండటం, వేళ్లకు అంటుకొన్న వెన్నెలల్ని విదిలించలేకపోవటం, రెక్కలు పూర్తిగా రాని తేనెపిట్ట లాంటి వ్యక్తీకరణలు- ఈ కవి చేయబోయే సుదీర్ఘ సాహితీయానాన్ని నా కళ్ళకు కనిపింపచేస్తున్నాయి.
దాదాపు ఇలాంటి వస్తువే ... "మొగ్గ విచ్చుకొంటున్న చప్పుడు" అనే కవితగా పోతపోసుకొంది...
.
గాయాలరాత్రిని భుజానవేసుకొని
గేయఉదయమొకటి ప్రసవించాలని
మౌనతోటలోకి ప్రవేశించా//
// ఇప్పుడు నేను వేకువ శృతుల్ని
భుజాన ఎత్తుకొని
కాంతి పక్షుల్ని ఎగరేస్తూ
కవిత్వపుతోటలో
ఆగని పాటనై ప్రతిధ్వనిస్తున్నా
నా చుట్టూ పచ్చగా నవ్వుతూ
వేల వికసిత మస్తిష్కసుమాలు
ఈ కవయిత్రి బలం నవ్యమైన మెటఫర్లని అలవోకగా సృష్టించగలగటం. ఇది అనేక కవితలలో చూడొచ్చు.
పై కవితలో మరోచోట--
ఓ పద్యపుమొగ్గ
భావపరిమళమద్దుకొని
అల్లనల్లన విచ్చుకొంది---అంటారు. ఆ ఊహాశాలిత ఆశ్చర్యపరచకమానదు.
***
ఈ సంపుటిలోని నాకు బాగా నచ్చిన రెండు కవితలు
ఆమెనో వాక్యంగా రాయాలనుకున్నప్పుడల్లా
ఆమె ఓ నదై వేళ్ళసందుల్లోంచి జారిపోతుంది
పొట్లంచుట్టిన పూలవానై మాయమౌతుంది
ఆకాశాన్ని మోసే ఆమె చేతులను అందుకొని కరచాలనం
చెయ్యాలనుకున్నప్పుడల్లా
ఆమె ఓ వేసవిపాటై సాగిపోతుంది
కరగని మేఘమై కన్నీటికోక చుట్టుకొని దాగుంటుంది//
దుఃఖసంద్రాన్ని నొక్కిపెడుతున్న ఆమె పాదాలను
ముద్దాడాలనుకున్నప్పుడల్లా
ఆమె ఓ నెత్తుటి కావ్యమై జనిస్తుంది
తడుస్తున్న నా ఎదకు ఓ ఓదార్పుగీతం పూసి
వీడ్కోలు పలుకుతుంది// ---- వాఖ్యానం అవసరం లేదు. కవిత మొత్తం తేటగా, లోతుగా, పారదర్శక సరోవరంలా ఉంది.
***
.
ఆ ఒక్కటే
అవును నీ బలమంతా నీ పుట్టుకలోనే ఉంది
పుడుతూనే అహం నీకోట
అణచివేత నీ మొదటిమాట.
నీ బలమంతా నీ పుట్టుకలోనే ఉంది
నీ నెత్తురు కొడవలిగా మారి లేడి కుత్తుకలు తెంచుతుంది//
చమటవాసన నీకు బానిస
నీ బలం
ఆకలిని చెట్టుకు కట్టేసి చంపుతుంది//
నీ బొడ్డుతాడుకోసిన దాసీ
నిన్నెత్తుకున్న నిరుపేద భుజాలు
నీ సంపద పెంచిన నెత్తుటిచుక్కలూ
నీ కాళ్ళకు చెప్పులైన చీల్చబడ్డ చర్మాలూ
నీ కసువుని ఊడ్చి బొబ్బలెక్కిన చేతులు
నీ దాహం తీర్చిన దేహాలూ
పుట్టుకలోనే బలహీనమవ్వటం
నీ బలమైంది
అవును నీ బలమంతా
నీ పుట్టుకలోనే ఉంది --- (ఆ ఒక్కటే)
చాలా శక్తివంతమైన కవిత. కొన్ని కులాలకు పుట్టుకతో వచ్చిపడే సోషల్ కాపిటల్ ని అర్ధవంతంగా వ్యక్తీకరించిన కవిత ఇది. వాడి బలం వాడి పుట్టుక అయితే వీడి పుట్టుకే వీడి బలహీనత కావటం సమకాలీన సామాజిక దొంతరల విషాదం.
***
.
నాగజ్యోతి గారి కవిత్వ వ్యక్తీకరణ సామాన్యమైనది కాదు. చాలా విలక్షణమైన, శక్తివంతమైన అభివ్యక్తి ఈమెది. కొన్ని కవితలలో వస్తువుని శిల్పం మింగేయటం గమనిస్తాం. ఆ మేరకు శ్రద్ధతీసుకోవాల్సి ఉండొచ్చు.
ఈమె సాహిత్య ప్రస్థానం భవిష్యత్తులో మరిన్ని ఎత్తులకు ఎదగాలని, ఎదుగుతుందనే నమ్మకం నాకు ఉంది.
కొత్త కవిత్వ సంపుటి తెస్తున్నందుకు అభినందనలు. సాహితీ ప్రపంచానికి సాదరాహ్వానం పలుకుదాం.
బొల్లోజు బాబా








No comments:

Post a Comment