Tuesday, March 1, 2022

ఆర్థ్రకవిత్వపు చిరునామా శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

 ఆర్థ్రకవిత్వపు చిరునామా శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

.
శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ బహుముఖీన ప్రజ్ఞకలిగిన వారు. కవిగా, కథకునిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా వారు చేసిన సాహిత్యప్రయాణం ఎంతో ఫలవంతమైనది.
సుమకవితాంజలి (1997), ప్రకృతి గీసిన వికృత చిత్రం (2002), సెలవ రోజు (2003), కలల పెదవుల నవ్వుల్లోకి (2009), సామెతకో పద్యం (2009), పాపికొండల్లో పడవ పాట (2011), ఆమె (2012), తడితడిగా ఆలోచించే (2013), నాకు నేను దొరికిన క్షణాలు (2016). అనేకులుగా (2019) అనే పేర్లతో పది కవిత్వ సంపుటాలు వెలువరించారు శ్రీ మాకినీడి. ఇవి కాక హైకు చిత్రాలు, ప్రకృతి, రాలిన పుప్పొడి, రుతురాగాలు అనే ఐదు హైకూ కవితా సంపుటులను కూడా తీసుకొచ్చారు.
కవిగా మాకినీడి ఏ తాత్విక భావజాలానికి బంధీకాకుండా స్వేచ్ఛగా కవిత్వాన్ని వెలువరించారు. కవిత్వానికి జీవితమే ప్రమాణమని నమ్మిన వ్యక్తి శ్రీ మాకినీడి. పరాయీకరణకు గురవుతున్న ఆధునిక జీవనం, మానవసంబంధాల పట్ల విశ్వాసం, ప్రాపంచిక సంఘటనలపట్ల స్పందించే తత్వం, అంతర్లీనంగా ప్రవహించే మానవ దుఃఖం లాంటి అంశాలు శ్రీ మాకినీడి కవిత్వానికి భూమిక. వీరి కవిత్వంలో ఆధునిక జీవితం గొప్ప పదచిత్రాలతో, ఆర్థ్రం గా ఆవిష్కరించబడుతుంది.
శ్రీ మాకినీడి రచించిన సుమకవితాంజలి పుస్తకంలోని వీరి పద్యాల గురించి శ్రీ నాగభైరవ కోటేశ్వర రావు “ఈ పద్య ప్రసూనాలకి మంచి రంగు ఉంది, మంచి రుచీ ఉంది. మంచి వాసన ఉంది. చిత్రకారుడు కాబట్టి రంగును అద్దాడు. రుషీత్వం ఆవహించి రుచిని అద్దాడు. వాక్సతీ కటాక్షవీక్షణంలో తడిసి వాసననూ రుద్దాడు” అంటారు. ఈ కితాబు శ్రీ మాకినీడి కవిత్వానికి, సాహితీ కృషికి అక్షరాలా సరిపోతుంది.
***
మాకినీడి కవిత్వంలో సామాజిక గమనింపు
మన జీవన విధానం, అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, భాష, సాహిత్యం, కళలు అన్నింటిని కలిపి సంస్కృతి అంటాం. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఇవన్నీ మార్కెట్ సరుకులుగా మారిపోతున్నాయి. ఇది మన అస్థిత్వం పై జరిగే దాడి. దీన్ని కవులు గుర్తించి, తమ నిరసనను కవిత్వంలోకి తీసుకొస్తారు. శ్రీ మాకినీడి తన కవిత్వంలో ప్రపంచీకరణ దుష్పరిణామాలను లోతైన ప్రతీకలతో ఆవిష్కరించారు.
రెండుదశాబ్దాల క్రితం భారతదేశానికి చెందిన స్త్రీలు అంతర్జాతీయ అందాలపోటీలలో విజేతలుగా రావటం వెనుక, భారతదేశంలో అందాలను పెంచే ఉత్పత్తుల మార్కెట్టు 80 వేలకోట్ల మేరకు పెరగడం వెనుకా ఉండే సంబంధమే ప్రపంచీకరణ.
ప్రపంచీకరణ వల్ల మనిషితనం పోయి వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది. గుంపులో ఏకాకితనం, అమానవీకరణ, హిపొక్రిసి, నగరంలో ఉంటూనే నగరం పట్ల విముఖత, పల్లె, లేదా బాల్యజ్ఞాపకాలను తలచుకోవటం, నిరాశ వంటివి పరాయికరణ స్థాయీ భావాలు. నేడు మనిషెంత పరాయీకరణకు గురయ్యాడో చెప్పకుండా ఆధునిక జీవనాన్ని కవిత్వీకరించటం సాధ్యపడదు. శ్రీ మాకినీడి 2000 వ సంవత్సరంలో వ్రాసిన అందాల అందలం అనే కవిత ద్వారా, ప్రపంచీకరణపై శ్రీ మాకినీడి కి ఉన్న దృక్ఫథాన్ని అర్ధం చేసుకొనవచ్చును.
అందాల అందలం
విశ్వమేథస్సులో
నాలుగోవంతు భారతీయం...
అందచందాల్లోను!
భారత మహిళ అందం
సుస్మితం... సౌందర్య ఐశ్వర్యం!
అయినా, అయిదేళ్ళుగానే
అయిపు కొచ్చిందెందుకనో?
కానీ, అయితే
భారతీయ సౌందర్యం
ప్రపంచ అందాల అందలానికి
మహరాణిత్వం అందిస్తోంది...
ఈ మధ్యీ మధ్యే
అందాలపోటీలకు మన అందమూ
యుక్తాముఖ మవుతోంది!
ఇపుడు లా(ధా)రాదత్త మైంది కదా,
అందాల అందలం ఇకపై మనదే!
ఆలోచిస్తే తెలుస్తుంది.
గ్లోబలీకరణ మాయాజాలం
ఆర్ధిక సంస్కరణల అమలులో
రూపొందిన భామాకలాపం
అయిదేళ్లలో రెట్టింపైన బ్యూటీ బిజినెస్
లావోరెల్, మేబెలైన్, ఎలియన్స్, గార్నియర్
ఎక్స్ క్లూజివ్ షో రూంల
సంపన్న దేశాల బ్యూటీ మార్కెట్ తరలింపు
వీధి వీధినా వెలుస్తున్న బ్యూటీ పార్లర్లు
అంటూ సాగుతుంది కవిత... ఇందులో గ్లోబలైజేషన్ వల్ల మనిషి ఏ విధంగా ఒక వస్తువుగా మారిపోతున్నాడో ఆ క్రమం చెప్పబడింది. ఇంతవరకూ ఇది విశ్లేషణకు సంబంధించిన అంశం. దీనికి వివేచనకు సంబంధించిన అంశాన్ని జోడించినపుడే ఇది కవిత్వమౌతుంది. ఆ విషయం తెలిసిన వాడు శ్రీ మాకినీడి. అందుకనే జీవితానికి చదువు, సంస్కారం, హృదయ నిర్మాలిన్యం లాంటివి నిజమైన అందాలు అంటూ కవితను ముగిస్తాడు.
అందం కాదు..
డబ్బూ కాదు, జీవితం
జీవితం అందగించాలి
చదువుతో... సంస్కారంతో
నందనవనిగా విరబూయాలి
అందమైన హృదయ నిర్మాలిన్యంతో
అచ్చమైన...స్వచ్చమైన
అందాల అందలం అదే
అందుకొనే ప్రయత్నం మీదే. (అందాల అందలం – సెలవ రోజు)
మాకినీడి కవిత్వంలో తాత్వికత
మాకినీడి కవిత్వంలో కరుణ తాత్వికతలు అంతర్జలలై ప్రవహిస్తూంటాయి.
శీర్షాసనం
లోనికి
లోలోనికి…నీలోనికి
శీర్షాసనం వేస్తేనే
కని, పాలిచ్చి
కని రక్షించే
పశుధర్మం ముఖ్యమే!
కానీ-
అంతకు మించిన
కని, ఆనందించే
కని, సంస్కృతిగా మిగిలిపోయే
కళలున్నయ్…కలున్నయ్!
పువ్వుల్లో శీర్షాసనం వేస్తేనే
తేనెటీగలకు మధువు దొరికేది
తలకిందులై ముక్కుతో
జలగర్భం చీలిస్తేనే
కింగ్ ఫిషర్లకు చేపలు దొరికేది
మనిషీ!
నువ్వూ, లోనికి
లోలోనికి…నీలోనికి
శీర్షాసనం వెయ్యాలి (శీర్షాసనం- సెలవు రోజు)
మనిషికి పశువుకు ఉండే తేడా కళలు, సంస్కృతి అని చెపుతున్నాడు కవి. ఒక కల కళగా మారాలంటే లోనికి ప్రయాణించాలి అని సూచిస్తున్నాడు. తేనెటీగా, కింగ్ ఫిషరు అనే రెండు దుష్టాంతాలను చూపుతున్నాడు. బాహ్యదృష్టే ప్రధానమనీ అంతర్ దృష్టి పనికిమాలినిదిగా స్థిరపడుతున్న ఆధునిక సంస్కృతికి ఈ వాక్యాలు చెంపపెట్టు.
అంతర్యానం ద్వారా మనిషి ఆలోచనలు సంస్కరించబడతాయి. అలా సంస్కరించబడిన ఆలోచనలే సాహిత్యం. ఈ సాహిత్యమే మన సంస్కృతిగా మిగిలిపోతుంది అనే లోతైన తాత్వికత ఈ చిన్ని కవితలో ఇమిడిపోయింది.
పౌత్రపు మొలకలు
బాల్యం నుండీ యౌవనం వరకూ
ఒకటే దిగులు
వృద్ధాప్యం మీద పడుతుందని
పడనే పడింది
వసంతం నుండి
హేమంతం దాకా
ఎంతభయపడినా రానే వచ్చింది శిశిరం
శిశిరం తిరిగి
చిగురించింది వసంతమై
పండిన వృద్ధాప్యం
మోసులెత్తింది పౌత్రపు మొలకలై (పౌత్రపు మొలకలు).
భారతీయ తాత్విక చింతన జీవితం యొక్క అవిచ్ఛిన్నతను చెబుతుంది. పునరపి జననం, పునరపి మరణం అర్ధమిదే. తాత పేరు మనవడికి పెట్టడం అనేది ఆ అవిఛ్ఛిన్నతను ప్రతిబింబించటానికే. అందుకే చరిత్ర నిండా రాజ్యాలేలిన రాజులలో మొదటి, రెండు, మూడు అంటూ వివిధ సంఖ్యలు ఉంటాయి. ఇదంతా మన సంస్కృతి. మన తాత్విక చింతన. పై కవితలో పండిన వృద్ధాప్యం మనవడి రూపంలో మొలకలెత్తింది అనటం ఆ అవిచ్ఛిన్నతను చెప్పటమే.
***
అన్నివేళలా అందరూ విజయాలు సాధించలేరు. జయాపజయాల జమిలినేతే ఈ జీవన యానం. ఆధునిక ప్రపంచం దృష్టి ఎపుడూ విజయాలపైనే. విజయం సాధిస్తేనే నువ్వు బ్రతికున్నట్లు అంటూ జీవితాలను ప్రభావితం చేస్తూంటాయి వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు. ఇలాంటి నేపథ్యంలో అపజయం కూడా నీ భవిష్యత్ విజయాలకు సోపానం అని చెప్పటం మనిషికి ఒక కవి ఇచ్చే భరోసా.
చింతేల?
తప్పానని చింతేల?
తప్పాలి, తప్పే తీరాలి
అప్పుడే
కొత్తదారులు కొలుస్తావు
క్రొంగొత్త తీరాలు చేరతావు
గహనాటవుల్లోనైనా… మనః
కుహరాంధకార గుహల్లోనైనా (చింతేల?)
***
ఇలాంటిదే మరో కవిత….
నువ్వూ-నీ నీడా
నీడ
నీ వెంట పడితే
నువ్వు బతికున్నట్టే
మానిసిత్వం హసిస్తుంది
నువ్వు
నీడవెంట పడితే
నువ్వు చచ్చినట్టే!
బానిసత్వం హరిస్తుంది. (నువ్వూ-నీ నీడా)
లోతైన చింతన కలిగిన కవిత ఇది. ఇది ఆత్మ విశ్వాసానికి సంబంధించిన అంశం. నీడ అనేది మన అస్తిత్వంగా భావించుకొంటే మనం ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. అలా కాక మనం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీడల్లాంటి ఎండమావుల వెంట పరిగెడితే అది బానిసత్వం తో సమానం… అది నీ మృత్యువు అని చెబుతున్నాడు కవి. తక్కువ వాక్యాలలో భిన్న అర్ధాలు ఒదిగిపోయాయీ కవితలో.
మాకినీడి కవిత్వంలో పదచిత్రాలు
ఒక ఆలోచననో, దృశ్యాన్నో, అనుభూతినో లేక అన్నింటినో క్లుప్తతతో చేసే వర్ణననే పద/భావచిత్రమని అంటారు. వైయక్తికమైన అనుభూతిని కళాత్మకంగా, ప్రయోజనవంతంగా వ్యక్తీకరించటానికి పదచిత్రాలు అత్యున్నతమైన సాధనాలు. ఈ సంకలనంలో అనేక పదచిత్రాలు ఆయా కవితావస్తువులను ప్రకాశవంతం చేస్తూంటాయి.
1.
నుదుట మూగే చినుకుల ఈగల్ని
వైపరు ముంగురుల్తో తోలుకుంటూ
చక్రాల తెడ్లతో ఈదే వాహనాలు (జీవాణువులై)
2.
అంతవరకూ మసిబారిన
ఆకాశపు కారడవిలో చిక్కిన సూర్యుడు
తడి ఆకుల మాటునుంచి
తడి, సడి గా తొంగి పలకరిస్తాడు
3.
కాలువల్లోకి ప్రవహించే ఇంద్రచాపాలై
పెట్రోలు కంపుతో వర్షం ముగుస్తుండగా (జీవాణువులై)
4.
రైతుల కళ్ల మేఘాలు వర్షిస్తయ్
వానరాని కాలంలో సైతం! (రైతు ఆత్మహత్య)
5.
చెట్టు
మొదట్లో
రాళ్ళ గుట్ట
బాగా
కాచిందనటానికి
సాక్ష్యం (సాక్ష్యం)
6.
మెల్లగా కిటికీ రెక్కని తోసి
సన్నగా పరదా తెరని తీసి
ప్రవేశిస్తుంది చిరుగాలి//
తోడ్కొని వచ్చిన తొలికిరణం
నేరుగా చీకటి గుప్పట్లు పరచిన
మూసిన కనురెప్పలను తాకుతుంది
సుతారంగా… తారంగంలా (మెలకువ- తడితడిగా)
7.
నిద్రపక్షులు జంటగా
గూళ్ళువెతుక్కుంటూ వచ్చి
చెరోకంటిమీదా వాల్తాయి ( కలల పిల్లలు). నిద్రని ధ్వంద్వంగా చెప్పటం వినూత్నమైన ప్రయోగం.
8.
మండే ఎండను తాగి
నీడను కక్కడమే నైజం (చెట్టు చెట్టే) అంటూ చెట్టు లక్షణాన్ని వ్యక్తీకరిస్తారు.
9.
బ్రతికిన క్షణాలు
సందిట చేరి
పొందుతాయి విశ్రాంతి
అందుకేనేమో
మట్టికి
ఆ జీవ పరీమళం (జీవ పరీమళం)
10.
హఠాత్తుగా ఇసుకనీటి నది
ధడధడధడధడ లాడుతూ
చక్రాల కింద పారుతుంది (వీడ్కోలు).
రాజమండ్రి వద్ద రైలులో గోదావరి బ్రిడ్జిని దాటడం అందరకీ అనుభవైకవేద్యమే. ఆ అనుభవం అద్భుతమైన పదచిత్రంగా ఒదిగిపోయింది.
11.
ప్రాణం లేని బాట
రాలిన పూలను
మేనున దాల్చిన పారవశ్యాన్ని
గమకాలుగా అనువదించుకొని
సుగంధగానం చేస్తోంది
అటు ఇటూ పోయేవారిని ఆహ్లాదపరుస్తూ! (బాటతో బాటే) ఇక్కడ సుగంధగానం అనే మాట కీలకమైనది, పదచిత్రానికి లోతైన గాఢతను ఇస్తోంది.
12.
బాల్యం పుప్పొడి రాలిన
వృద్ధాప్యపు పుష్పాలు
వంగి ప్రశ్నలుగా మిగిలిపోయిన
ఆశ్చర్యార్ధకాలు! (వృద్ధాప్యపు పుష్పాలు) వృద్దాప్యాన్ని వర్ణించే చక్కని పదచిత్రం. దీనిలోని ఆర్ధ్రత, వ్యంజన కదిలిస్తాయి.
ప్రతిభావంతమైన పదచిత్రాలు గొప్ప కవిత్వానికి చిహ్నాలు. ఉత్తమ కవి పదచిత్రాల ద్వారా తాను చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా మూర్తవంతంగా చెప్పగలుగుతాడు. పైన చెప్పినవి శ్రీమాకినీడి కవిత్వంలో కనిపించే అసంఖ్యాకమైన పదచిత్రాలలో కొన్ని మచ్చుతునకలు. ఇవి మాకినీడి చక్కని ప్రతిభ వ్యుత్పత్తి కలిగిన కవి అని నిరూపిస్తాయి.
మానవ సంబంధాలు
మానవ సంబంధాలను వ్యక్తీకరించే సాహిత్యం ఉత్తమసాహిత్యంగా నిలిచిపోతుంది. సంక్లిష్ట సమాజానికి అద్దంపట్టేది దాని మారుతున్న మానవవిలువలే. ఈ ప్రక్రియను సాహిత్యంలోకి తీసుకురావటం సాహిత్యకారుల బాధ్యత. శ్రీమాకినీడి కవిత్వంలో మానవసంబంధాలు ఉదాత్తంగా ఆవిష్కరించబడ్డాయి.
కూతురు స్వరంలోంచి శ్రీమాకినీడి చెప్పిన అనేక కవితలు వ్రాసారు. నిజానికి చిన్నారులు పలికిన పలుకులుగా చెప్పే సంగతులన్నీ ఆ కవి పసిహృదయం పలుకుతున్న వాక్కులుగా గ్రహించాలి. పిల్లలను వాడుకోవటం ఒక వంక అంతే. పిల్లలు మాటలలో ఆ కవి ఒక నిష్కల్మష ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. దానిలోకి అందరినీ ఆహ్వానిస్తాడు.
నిద్రపోకుండా పెద్దారిందాలా, రాత్రంతా మేలుకుని
చేతుల్లోంచి మెత్తగా చేతుల్లోకి జారుతూ
మొఖమల్ నవ్వుల కాంతులతో
కళ్యాణ మండపాన్ని వెలిగించింది (చాందినీ) ఒక అందమైన సంఘటనని, చిన్నారి మెత్తని నవ్వులని మించిన సౌకుమార్యంతో వర్ణించారు.
అమ్మనీకెందుకు నచ్చింది అని అమాంతంగా, అమాయికంగా అడిగిన పాపాయికి “ అమ్మ నీకు అమ్మయినందుకు” అని సమాధానం ఇవ్వటంలో లౌక్యం కన్నా మానవ బంధాలను దృఢం చేసుకొనే సంకల్పమే కనిపిస్తుంది.
చిన్నపిల్లలకు జ్వరం వచ్చి, ఆ జ్వరతీవ్రతలో వారు బాధపడుతుంటే ఇంట్లో ఉన్నవారంతా బెంగటిల్లుతాం. ఆ అనుభవాన్ని ఒక కవితలో ఇలా వర్ణించారు
మూడు వత్సరాల బాల్య నిత్యచైతన్యం
మూడంకేసి ముసుగేసి పడుకొంది
అందుకే
మా ఇంటికంతకీ జ్వరమొచ్చింది
ఇంటిల్లిపాదీ వణుకుతోంది
బెంగచలిలో ముణగదీసుకుని
వజవజ గిజగిజలాడుతోంది ఇల్లు (ఇంటికి జ్వరమొచ్చింది)
చాలా తేటగా అనిపిస్తున్నా, ఈ కవితలోని ఉద్వేగాన్ని ప్రతిఒక్కరో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటాం. దానిని అక్షరాలలో బంధించటానికి శ్రీమాకినీడికి మానవసంబంధాలపట్ల ఉన్న అచంచలమైన అనురక్తే కారణం.
***
మనచుట్టూ ఉండే చిన్నపిల్లల మాటలలో ఒక ఇంద్రజాలిక లోకం ఉంటుంది. ఈ లోకం హఠాత్తుగా అలాంటి అకలుషిత ప్రపంచంగా మారిపోవాలని కవులు కోరుకుంటారు. శ్రీమాకినీడి సుద్దుల మూటలు అనే కవితలో తన చుట్టూ ఉండే సన్నిహితుల పిల్లలు పలికిన అమాయికమైన మాటలను అద్భుతంగా అక్షరీకరించారు.
అమ్మస్నానం చేస్తూ
పొయ్యిమీద పాలకి కాపలా పెడితే
మూడేళ్ళ పిల్లాడి ముద్దుమాట
“పాలు డాబా ఎక్కేస్తున్నాయి”
ఈ మాటముందు వేణునాదం వెలవెలబోదా?
రెండో తరగతికి ప్రమోట్ అయిన
అమ్మాయి దిగులు
టీచర్ ఒకటో తరగతిలోనే ఉండిపోయిందనే
ఈ మాటముందు
వీణా నాదం విలవిల లాడదా?
చీమలు మూగడం చూసి
ప్రసాదాన్ని చీమలు కరిచేస్తున్నాయంటే
ఈ మాటముందు గిటారుగేయం గిల గిల లాడదా?
క్యాలెండరు అంకెలన్నింటినీ
ఎర్రరంగుతో చుడుతున్న చిన్నారినడిగితే
రోజులన్నీ ముఖ్యమైనవే కదా’ని విస్మయపడితే
ఈ మాటముందు సితారగీతం చిన్నబోదా? (సుద్దుల మూటలు)
జీవం తొణికిసలాడే అనుభవాలు అనేకం శ్రీ మాకినీడి కవిత్వంలో పోతలు పోసుకొన్నాయి. ఏదో మాటల సందర్భంలో మణీబాబు తన అమ్మాయి ముద్దుమాటల్ని చెబితే వాటిని కవిత్వీకరించారు, బొల్లోజు బాబా ఈ కవిని కలిసి తన పుస్తకాల్ని ఇచ్చిన సందర్భాన్ని కవితగా మలచారు. వారి అమ్మాయి సౌమ్య పడుకొన్నతీరు, వారి పెద్దమ్మ గారు దివంగతులైనసందర్భమూ, ఆత్మీయమిత్రుడు నాగరాజు గురించీ – ఇలా అనేక జీవనానుభవాలకు సాహిత్యగౌరవం కల్పించారు శ్రీ మాకినీడి. ఇవన్నీ వీరిని జీవనానుభవాల కవిగా నిరూపిస్తాయి.
తాను నడచిన మార్గపు ఆనవాళ్ళని కవి తన కవిత్వంలో జారవిడిచి జీవన సందర్భాలపై వెలుగును ప్రసరింపచేస్తాడు అనటానికి ఆ యా కవితలే చక్కని ఉదాహరణలు.
చివరగా శ్రీ మాకినీడి రచించిన కొన్ని హైకూలు
1. అద్దం మీద పిచ్చుక
పొడుస్తోంది తన నీడని
విడిచి వెళ్ళిన ప్రియురాలి జ్ఞాపకం
2. పాప ఏడ్చింది నిద్దట్లో
జోకొడుతూ
నిద్దరోయాను నేనూ!
3. పాపకు రంగు బొమ్మలిచ్చాను
రంగురంగుల పూలెందుకు
విరుస్తాయో అర్ధమైంది.
4. చీకట్లో పథికుడు
పోతున్నాడు పాడుతూ
నిశీధికి బాటగా ఆ పాట
హైకూ నిర్మాణం పై తెలుగులో మొట్ట మొదటి విమర్శనా పుస్తకం వెలువరించింది శ్రీ మాకినీడి. హైకూ అంటేనే క్లుప్తత, గాఢత. ఆ లక్షణాలను పుణికిపుచ్చుకొని సాగుతాయి పై హైకూలు.
***
శ్రీ మాకినీడి సుమకవితాంజలి నుండి “అనేకులుగా” వరకూ చేసిన ప్రయాణంలో వీరు -సామాజిక స్పృహ, మానవసంబంధాలు, తన లోలోపలకి చేసుకొన్న తవ్వకం- అనే మూడు అంశాలను ఒక అంతర్లయలా చేసుకొని మంచి కవిత్వాన్ని సృజించారు.
ఈ సంపుటాలలోని కవిత్వం ఒక ఆధునిక మానవుని జ్ఞాపకాలను, వర్తమాన సంక్షోభాలను గానం చేస్తుంది. అనుభూతి, మానవత, తాత్వికతలు శ్రీ మాకినీడి కవిత్వంలో పుష్కలంగా పొటమరించే అందాలు
అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారం అందుకొంటున్న సందర్భంగా శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, రానున్నకాలంలో మరిన్ని కవిత్వసంపుటులుగా విస్తరించాలని కోరుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా


(ఈ సంవత్సరం అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారాలు శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి, శ్రీ శిఖామణి, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ లు అందుకొన్నారు. వారి సాహితీ కృషిని పురస్కరించుకొని విడుదలచేసిన సావనీర్లలో ఆ ముగ్గురిపైనా వ్యాసాలు రాసే అదృష్టం నాకు ఇచ్చిన ఆ యా సావనీర్ల సంపాదకులైన శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అద్దేపల్లి ప్రభు గార్లకు ధన్యవాదములు. ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు.)

No comments:

Post a Comment