ఈ సంవత్సరం అజో-విభో కందాళం ఫౌండేషన్ వారి పురస్కారాలు శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి, శ్రీ శిఖామణి, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ లు అందుకొన్నారు. వారి సాహితీ కృషిని పురస్కరించుకొని విడుదలచేసిన సావనీర్లలో ఆ ముగ్గురిపైనా వ్యాసాలు రాసే అదృష్టం నాకు ఇచ్చిన ఆ యా సావనీర్ల సంపాదకులైన శ్రీ రెంటాల వెంకటేశ్వరరావు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అద్దేపల్లి ప్రభు గార్లకు ధన్యవాదములు. ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు.
శ్రీ తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి గారు అడివిపూలు పేరిట అనువదించిన గాథాసప్తశతి పై వ్రాసిన వ్యాసం ఇది.
****
అడవిపూల అందాలు, పరిమళాలు
గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే శాతవాహన రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల ప్రాకృత గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు.
ఈ గాథలలో పల్లెజీవనము, ఆనాటిప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు, ప్రకృతి వర్ణణలు కనపడతాయి. స్వేచ్చగా, అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల జీవనానుభవాలు అవి. గోదావరి, నర్మద నదీతీరాలలో వికసించిన కవిత్వమది. ఈ కావ్యం అమృతమధురం అని హాలుడే స్వయంగా చెప్పాడు. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది. ఈ గాథలలో పొంగిపొరలే కవిత్వం వల్లే అవి రెండువేల సంవత్సరాలుగా సజీవంగా నిలిచిఉన్నాయి అనిపించకమానదు.
Arvind Krishna Mehrotra 1991 లో The Absent Traveller పేరిట సప్తశతి గాథలను ఇంగ్లీషులోకి అనువాదం చేసాడు. శ్రీ తల్లావఝుల పతంజలిశాస్త్రి గారు ఆ సహస్రాబ్దాల కవిత్వ వనంలో ఒక “Absent Traveller” గా సంచరించి వివశులై ఓ వైశాఖమాసపు మధ్యాహ్నం వేళ వాటిని తెలుగులోకి అనువదించటం మొదలుపెట్టారు. అలా మొత్తం 100 సప్తశతి గాథలకు శాస్త్రిగారు చేసిన అనువాదాలు “అడవిపూలు” పేరుతో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో అక్టోబరు, 1993 నుండి ఫిబ్రవరి 1994 మధ్య సీరియల్ గా వచ్చాయి. ప్రతీవారం ఎంతో అందమైన భావస్ఫోరక చిత్రాలను ఆర్టిస్టు చంద్ర వేసారు.
శాస్త్రిగారికి వాచ్యంగా చెప్పటం ఇష్టం ఉండదు అవి కథలైనా, కవిత్వమైనా. ధ్వని ప్రధానంగా సాగుతాయి వీరి రచనలు. సప్తశతి గాథలు కూడా ధ్వన్యాత్మకం. అందుకనే అవి శాస్త్రిగారిని ఆకర్షించి ఉంటాయి. ఎంతెలా అంటే అనువదించి హృదయభారాన్ని దింపుకునేంత.
.
1. అడవి పూల పరిమళాలు
.
అడవిపూలు పేరిట శాస్త్రిగారు తెనిగించిన ఈ గాథలలో మానవసంబంధాలకు వ్యక్తీకరించే గాథలు ప్రధానంగా ఉన్నాయి. జాగ్రత్తగా తరచి చూస్తే మానవసంబంధాలలోని చీకటివెలుగులను రెండింటిని ప్రతిబింబించే గాథలను సమంగా ఎంపికచేసుకొని అనువదించినట్లు అర్ధమౌతుంది. ఇది శాస్త్రిగారి ఇతర రచనలలో కనిపించే- జీవన సామస్త్యాన్ని పొదువుకోవటం, జీవితంలోని బహుళతకు పెద్దపీటవేయటం లాంటి లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
కాళ్లకు మొక్కిన కోడలి గాజులు
పాదం మీద జారి పడ్డాయి
అత్తగారి కరుకు కళ్ళు సైతం
అశ్రుపూరాలైనాయి
భర్త దేశాంతరం వెళ్ళగా అతని రాకకోసం ఎదురుచూస్తూ, చిక్కిశల్యమౌతూ ఉండే నాయికను ప్రాచీన కవులు ప్రోషిత పతిక అని వర్ణించారు. అలాంటి ఒక ప్రోషితపతిక చిక్కి సగమయ్యింది అనే విషయాన్ని అన్యాపదేశంగా గాజులు వదులుగా మారాయి అని చెప్పటం అనేక గాథలలో కనిపిస్తుంది. పై గాథలో అలాంటి స్థితిలో ఉన్న కోడలిని చూసి కఠినాత్మురాలైన అత్తగారు బాధపడి కన్నీరు కార్చినట్లు చెప్పటం రెండువేల ఏండ్లనాటి మానవ సంబంధాలలోని ఆర్థ్రతను తెలియచేస్తుంది.
అనేక సప్తశతి గాథలలో దూరదేశమేగిన భర్తలకొరకు ఎదురుచూసే భార్యలు కనిపిస్తారు. అప్పట్లో భార్యా పిల్లలను గ్రామాలలో విడిచిపెట్టి మగవారు నగరాలకు వెళ్ళి తమ ఉత్పత్తులను అమ్ముకోవటమో లేక అక్కడ వ్యాపారం చేయటమో లేదా తమ వృత్తిపరమైన సేవలు అందించి ధనం సంపాదించటమో చేసేవారని అనుకోవాలి.
అలా దూరదేశం వెళ్ళిన భర్త రాక కొరకు భార్యలు రోజులు లెక్కపెట్టుకొంటూ గడిపేవారు.
వియోగ దినాల్ని
వేళ్లకి మించి లెక్కించ లేక
గొల్లు మంది చదువురాని చిన్నది
పై గాథలో స్వచ్ఛమైన పల్లెటూరి అమాయకత్వం కనిపిస్తుంది. పరదేశం వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడో చేతి వేళ్లతో లెక్కించుకొంటున్నదట ఒక చదువురాని చిన్నది. పదిరోజులకు చేతి వేళ్లు అయిపోయాయి. ఇరవై రోజులు అయ్యే సరికి కాలి వేళ్లు కూడా అయిపోయాయి. ఆ తరువాత రోజుల్ని ఎలా లెక్కించాలో తెలియక గొల్లుమందట ఆ అమ్మాయి. ఈ చిన్ని గాథలో ఒకనాటి ప్రజలు ఒకరిపై ఒకరు చూపుకొన్న అనురాగము ద్యోతకమౌతుంది. ఆధునికప్రపంచాన్ని ఓదార్చటానికి ఇట్లాంటి నిష్కాపట్యము అవసరపడుతుందేమో ఆలోచించాలి.
పొలానికి పోనే పోను
పిట్టల్ని తిననీ పంటని
బాటలెరిగిన బాటసారులు
ఎటువెళ్ళాలని అడుగుతూనే ఉంటారు
ఒక చిన్నది ఇంట్లో అమ్మతో చెప్పుకొంటున్న ఒక పిర్యాదు కాబోలు ఇది. పంటపోతే పోనే అనటం అమాయకత్వం అనుకోవచ్చు, కానీ ఒక మగవాడు ఎందుకు మాటలు కలపాలనుకొంటున్నాడో అర్ధంకాకపోవటం స్వచ్ఛమైన ముగ్దత్వం. అమ్మాయిలతో మాటలు కలపి మెల్లమెల్లగా ముగ్గులోకి దింపాలని యత్నించే వ్యక్తులుండటం ఒక పురాతన సలపరింత ఈ సమాజానికి. ఈ గాథలో కూడా ఆనాటి పల్లెజీవుల మధ్య నడచిన సంబంధ బాంధవ్యాలు తెలుస్తాయి.
కారుమేఘా లాకాశంలో
కాలిదారుల్లో చెట్లు పెరిగేయి
ఏరులేమో పొంగి పొర్లేయి, అయినా
అమాయకురాలా, కిటికీలో కూచుని
అతని కోసం ఎదురుచూస్తున్నావు
పొరుగూరు వెళ్ళిన భర్తలు వానాకాలం సమీపించేలోగా సొంత ఊర్లకు చేరుకొనేవారు ఎందుకంటే వానాకాలంలో వాగులు, నదులూ పొంగి దారులన్నీ మూసుకుపోతాయి. అలా రాలేకపోతే వరదలు తగ్గేదాకా కనీసం రెండు మూడు నెలలు ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సి వచ్చేది. పై గాథలో వర్షాకాలం మొదలయ్యాకా కూడా భర్త రాకకోసం ఇంకా ఎదురుచూసే ఒక స్త్రీ ని సముదాయిస్తూ, చిరుకోపం ప్రదర్శించటంలో ఉన్న ఆనాటి మానవ సంబంధాలను "ఫ్రీజ్ షాట్" తీసిన పురా కవిని అభినందించకుండా ఉండలేం.
దప్పికతో నీటి ఒడ్డున
దుప్పీ జింకా
జింక ముందని దుప్పి
దుప్పి ముందని జింకా
అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల, అరణ్యాలలో నివసించే పుళిందుల జీవనానుభవాలు ఈ గాథలలో అందంగా ఒదిగిపోయాయి. సాటిమనిషికొరకు తన అవసరాలను త్యాగం చేయటం అనేది ఒక ఉదాత్తమైన చర్య. దాంపత్యంలో ఉండే వ్యక్తులు కూడా ఒకరి కొరకు మరొకరు అన్నట్లుగా కలిసిమెలసి జీవించాలని పై గాథ చెపుతూంది. జంతువులే అలా ఉంటున్నాయి మనుషులు మరెంతగా ఉన్నతంగా ఉండాలి అనే స్ఫూర్తిని నింపే గాథ ఇది.
***
మానవ సంబంధాలు అన్నీ నలుపు తెలుపులలో ఉండవు. గ్రేషేడ్స్ కూడా ఉంటాయి. విలువలు సాపేక్షం. ఒకకాలపు మంచి మరో కాలానికి చెడుగా రూపాంతరం చెందవచ్చు. గాథాసప్తశతిలో అనేక గాథలు ఆనాటి ప్రజల జీవితాలలోని గ్రేషేడ్స్ ను అద్భుతంగా నిక్షిప్తం చేసాయి. శాస్త్రిగారి అడివిపూల అనువాదంలో కూడా అది ప్రతిబింబించింది.
సప్తశతి గాథలలో ఎక్కువ భాగం ప్రేమానుభవాలే. అందులో కూడా రహస్యసమాగమములు, స్వైరిణీ సంయోగాలు, వివాహం వెలుపలి ప్రేమోదంతాలు వంటి అంశాలు ఎక్కువ. ఇవి ఆ కాలంలో అసహజం కాకపోవచ్చు. ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా అనుభవించారు, మాట్లాడు కొన్నారు, అందమైన కవిత్వరూపంలో వ్రాసుకొన్నారని భావించాలి. ఈ క్రింది గాథలో ఒక గృహిణికి తేలుకుట్టిందనే వంకతో భర్తముందే ఆమెను ప్రియుడువద్దకు చేర్చారట చెలికత్తెలు
దీన్ని తేలు కుట్టిందని గోల చేశారు
గిలగిల కొట్టుకుందామె
మొగుడి ముందునుంచే చెలులు
చేరవేశారామెను వెజ్జు ప్రియుడికి!
.
పై గాథలో శృంగారేచ్ఛకన్నా మానవసంబంధాలలోని 'గ్రే షేడ్స్ ' చిత్రణ ప్రతిభావంతంగా కనిపిస్తుంది. ఇలాంటి గాథలే తరువాతి కాలంలో స్త్రీల చుట్టూ ఆంక్షలు బిగుసుకు పోవటానికి దోహదపడి ఉంటాయి
***
ఒకప్పుడు బాటసారులకు ఆతిథ్యం ఇవ్వటం గృహస్థుల బాధ్యతగా ఉండేది. మన సంస్కృతిలోని అతిధిదేవోభవ అనే వాక్యానికి ఆచరణరూపమది. ఈ ఆతిథ్యం ఇచ్చే ప్రక్రియమాటున ఇంటి స్త్రీలు ఆ బాటసారులతో లైంగిక బంధాలు పెట్టుకొన్నట్లు కొన్ని గాథలలో కనిపిస్తుంది.
అది అత్తగారి పక్క
ఇదిక్కడ నా పడక
అక్కడేమో పని వాళ్ళు
రే చీకటి యాత్రీ
రాత్రి నా మంచం తట్టుకునేవు
పై గాథ అలాంటిదే. పై గాథలో ఓ గృహణి ఇంటికి వచ్చిన అతిధితో తాను ఎక్కడ పడుకొంటుందో తెలుపుతూ, శృంగారానికి తన సంసిద్ధతను చాలా గడుసుగా చెబుతున్నది. రేచీకటి యాత్రీ (Night-blind traveller) అని సంబోధించటం ద్వారా ఒక వేళ ఆ బాటసారి రాత్రిపూట దొరికిపోయినా “రేచీకటి కనుక తడబడ్డాను” అని చెప్పుకొనే ఎస్కేప్ రూట్ కూడా ఆమె అతనికి అందిస్తోంది తెలివిగా. ఈ గాథ ధ్వన్యాత్మక వ్యక్తీకరణకు చక్కని ఉదాహరణగా ఆలంకారికులు తీసుకొన్నారు.
ఇంకా అలకేనా అతగాడికి?
ఆహా కలుసుకోడ పడదట
ఓసి నీచురాలా,
అందుకేనా నీ అధరం ఎర్రబడింది.
నాయిక తన ప్రేమ సందేశాన్ని నాయకునికి దూతలద్వారా ఎరుకపరచి, సమాగమ స్థలాన్ని, సమయాన్ని స్థిరపరచుకోవటం ఒకనాటి కావ్యసంప్రదాయం. ఇది ఒక్కోసారి వికటించి ప్రియునివద్దకు రాయభారానికి పంపిన దూతిక అతనితో సుఖించి రావటం జరిగినట్లు కొన్ని గాథలలో కనిపిస్తుంది. పై గాథ అలాంటిదే. అలాంటి దూతికను నీచురాలా అని సంబోధిస్తున్నదా నాయిక. ఇలాంటి గాథలలోని విచ్చలవిడితనాన్ని పక్కన పెడితే- ఒక పురుషుని ఇష్టపడిన స్త్రీ (పై గాథలో దూతిక) ఏ మేరకు తెగించి తన కోర్కెను ప్రకటించగలుగుతున్నదో అది అతని మగటిమికి పరోక్ష సూచికగా వర్ణించటం ఈనాటికీ ఒక గొప్ప వ్యక్తీకరణే.
.
2. అడవిపూల అందాలు
.
శాస్త్రిగారు గాథల ఎంపికలో ప్రస్ఫుటంగా కనిపించే మరో ప్రధాన అంశం-సౌందర్యాత్మకత. నిజానికి సప్తశతి గాథలు అందమైన దృశ్య లేదా ఘటనల చిత్రణలు. అదే సౌందర్యాత్మకత అడవిపూలలో కూడా గమనించవచ్చు.
ఊరి చెరువులో పడింది ఆకాశం
ఒక్క తామర తెగలేదు
ఒక్క కొంగ తగ్గలేదు
పై గాథను వివరిస్తూ శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు “ఈ కవితను ఎన్నిభాషల్లోకైనా అనువదించండి, పైనుంచి కిందకు రాసే భాషలు, కుడినుంచి ఎడమకు రాసే భాషలు, ఏ భాషలో కూడా ఈ కవిత నష్టపోదు” అంటారు. చెరువునీటిలో ఆకాశం ప్రతిబింబిస్తోందట, అలా ఆకాశం చెరువులోకి “పడటం” వల్ల ఒక్క కలువా చెదరలేదు, ఒక్క కొంగా బెదరలేదు అన్న పదచిత్రపు తాజాదనం, బహుసా ఈ భూమిపై ఆకాశము, తామరలు, కొంగలు ఉన్నంతకాలమూ నిలిచే ఉంటుంది.
ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటపుడు దేహసౌందర్యం ప్రధాన పాత్రవహించటం, అదే పురుషుని వర్ణించవలసివచ్చినపుడు అది అతనిపట్ల మనసుపడ్డ ఒక స్త్రీ మనోచిత్రణ పరంగా ఉండటం ఈ గాథలలో చాలాచోట్ల కనిపిస్తుంది.
ఒక యువతి తను మనసుపడ్డ యువకుని గురించి తన అత్తతో ఇలా అంటున్నది.
అత్తా!
చూపు సరిపోతుందా?
నీళ్ళు కలగంటే
దాహం తీరుతుందా?
ఎంతసేపు అతనిని చూసినా తనివితీరకపోవటాన్ని కలలో నీళ్ళు తాగితే దాహం తీరుతుందా అనే పోలికతో ముడిపెట్టి ప్రశ్నించటంలోని అసమాన కవిత్వగాఢత కారణంగా- పై గాథాకారుడు ప్రతీ తరంలోనూ మరల మరల జన్మిస్తూఉంటాడనటంలో సందేహం లేదు.
చూపు, పడ్డ చోటి నుంచి చెదరదు
ఆమెనెవరూ
పూర్తిగా చూడలేదింకా.
“కళ్లు తిప్పుకోనివ్వని అందం” అని అందరూ అనే మాటని ఈ గాథకర్త ఎంతదూరం తీసుకెళ్ళాడో తిలకించండి. ఇదొక ఉత్ప్రేక్ష కావొచ్చు. కానీ ఎంత తర్కబద్దమైనదీ! ఆమె శరీరాన్ని పూర్తిగా చూసిన వారే లేరు అనటం ద్వారా ఆమె సౌందర్యాన్ని ఎంత ఎత్తుకు తీసుకెల్లి వదిలాడో కదా ఈ ప్రాచీన గాథాకారుడు.
.
3. అడవిపూల అనువాద సొబగులు
.
హాలుని గాథాసప్తశతి చాలామందినే ఆకర్షించింది. శ్రీనాథుడు తన యౌవనారంభంలో గాథాసప్తశతిని అనువదించాను అని చెప్పుకొన్నాడు. సప్తశతి గాథలను 1870 లో Weber అనే జర్మన్ పండితుడు సేకరించి జర్మన్ భాషలోకి అనువదించి ప్రకటించాడు. 1930 లో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రి 1968 లో వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య లు సప్తశతిని తెనిగించారు. 1993 లో పతంజలి శాస్త్రిగారు కూడా “తలచిన రామునే తలచెద నేనును” అన్న చందాన తనదైన అనుభూతిని “అడవిపూల” రూపంలో మనకు అందించారు. ఆ తరువాత 2012 లో శ్రీ దీవి సుబ్బారావు, శ్రీ నరాల రామారెడ్డి, 2013 లో శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు తదితరులు శాలివాహన గాథాసప్తశతిని తెలుగులోకి అనువదించారు.
పతంజలి శాస్త్రిగారి అనువాదాలను గమనించినపుడు, రెండు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి సరళత, రెండు సజీవత. ఈ రెండు లక్షణాల వల్ల అనువాదం హృద్యంగా ఉంటూ ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ను కలిగి ఉంటుంది.
చూడు, ఎలా పడుతున్నాయో
పగడాలు, పచ్చలు
గగన దేవత తెగిన హారంలా
చిలుకల వరస
ఆకుపచ్చని ఈకలతో, ఎర్రనిముక్కుతో రామచిలుక చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. రామచిలుకలు సాధారణంగా ఒక గుంపుగా ఎగురుతూ ఉంటాయి. అలాంటి ఒక రామచిలుకల గుంపు ఎగురుతూ వచ్చి వాలే దృశ్యాన్ని ఒక అందమైన పదచిత్రంగా ఈ గాథలో దర్శించవచ్చు. పై గాథలో రామచిలుకల గుంపును పగడాలు, పచ్చలు పొదిగిన “గగనదేవత తెగిన హారంలా” అన్న వర్ణన కీలకమైనది.
ఈ ఉపమానాన్ని…
గట్టిలక్ష్మి నరసింహశాస్త్రి “సురపథమ్ము పేరిటి పడతిమిన్న కంఠముననుండి (ఆకాశమనెడి స్త్రీ కంఠమునుండి) అని వర్ణించారు.
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు “గగనలక్ష్మి మెడ బచ్చల కెంపులకంటె” అని తెనిగించారు
దీవి సుబ్బారావు ఆకాశ సుందరి మెడకున్న కెంపు పచ్చల కంఠహారం అన్నారు.
ఏ అనువాదమూ అంతిమం కాదు అనేది సత్యమైనా- అనువాదకుడు, లక్ష్యభాషలో ఆ అనువాదం మరో వందేళ్ళు సజీవంగా ఉండేలా చేయటానికి ఏ మేరకు భాషాపరమైన ముందుచూపును ప్రదర్శించగలిగాడు అనేది పరిగణార్హం. పతంజలి శాస్త్రిగారు ఈ గాథలను అనువదించి ముప్పై ఏండ్లు అవుతున్నా వీటిలోని భాష సమకాలీనత, సరళత్వం విషయంలో నేటికీ తాజాగానే ఉండటం గమనించవచ్చు. అనువాదకునిగా శాస్త్రిగారి ప్రతిభ ఇది
వేసవిలో మూసిన కన్రెప్పల్లా
వేసిన తలుపుల వెనుక
విశ్రాంతిలో ఉంది గ్రామం
ఇళ్ళు పెట్టే గురకలాగ
ఎక్కడో తిరగలి గరగర
In summer, behind doors
Shut, like eyelids,
The village at siesta; somewhere
A hand-mill rumbles,
As if the houses snored.
డబుల్ మెటఫర్స్ చేసే ఇంద్రజాలం ఈ గాథ. అద్భుతమైన దృశ్యమానం. ఇది శాస్త్రిగారి అనువాద పటిమకు అద్దం పడుతుంది. మూలంలో ఉన్న వరుసక్రమాన్ని పైకి కిందకూ సర్ది- మూసిన కన్రెప్పల్లా అంటూ ప్రారంభించటం, తిరగలి గరగరను చివరకు తీసుకురావటం వల్ల గాథను సులభంగా అర్ధం చేయించగలిగారు. hand-mill ను తిరగలి, siesta ను విశ్రాంతి గా అనువదించటం ద్వారా గాథకు, స్థానీయతను, సరళతను అద్దారు. గాథలో వచ్చే అనుప్రాస, తూగు చదువుకొనేటపుడు చక్కని పఠనానుభవాన్ని కలిగిస్తాయి. ఉత్తమ అనువాదకుడు పాఠకునికి విధేయుడై ఉంటాడు అనటానికి ఈ గాథ మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
***
రెండువేల సంవత్సరాలుగా ఎంతోమందిని “దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన అపూర్వ శక్తి” గాథాసప్తశతి కవిత్వం. ఆ అనుభవాన్ని శాస్త్రి గారు ఒక రుబాయీలా ఇలా చెప్పుకొన్నారు. సప్తశతిని ప్రేమించే అసంఖ్యాక రసజ్ఞుల హృదయ నివేదన ఇది.
కొంచెం ఫ్రెంచి వైను
కాసింత గంధలేపనం
ఎర్రతురాయి కింద శయనం
గాథాసప్తశతి పారాయణం.
No comments:
Post a Comment