Monday, February 7, 2022

బుద్ధిజం – కొన్ని ఆలోచనలు

 1. కులవ్యవస్థ – బౌద్ధమతం – పార్ట్ 1 

తెరవాద బుద్ధిజానికి చెందిన త్రిపిటక పాళీ రచనలలో - చాతుర్వర్ణాలు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అనే వరుసక్రమంలో ఉంటాయి. బ్రాహ్మణ వర్ణానికి మొదటిస్థానం లేదు. ఈ నాలుగు వర్ణాలు అన్నీ పవిత్రమైనవేనని ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదని, అన్నీ సమానం అని చెప్పబడింది[1]

బుద్ధుడు మానవులందరూ సమానం అని ప్రవచించి, కులవ్యవస్థలోని ఎక్కువతక్కువలను నిరసించాడు. ఒక వ్యక్తి జన్మ వలన కాక కమ్మ/కర్మ కారణంగా మాత్రమే బ్రాహ్మణుడు లేదా చండాలుడుగా నిర్ణయించబడుతున్నాడని అన్నాడు.

కమ్మ/కర్మ అంటే ఒకవ్యక్తి చేతనతో చేసే పనులు. ఒక వ్యక్తి నీతిగా ప్రవర్తిస్తే (కమ్మ) బ్రాహ్మణుడిగాను, అనైతికంగా ఉంటే వసల (చండాలుడు/outcaste) గా జీవించవలసి ఉంటుందని బుద్ధిజం బోధించింది.[2]

పై వాక్యాల ఆధారంగా బుద్ధుడు కులవ్యవస్థను సమర్ధించాడని కొంతమంది అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ కర్మ/కమ్మ సిద్ధాంతం బౌద్ధం కన్నా ప్రాచీనమైనది అయిన జైనమతానికి చెందినది. కర్మను జైనులు పదార్ధంగా భావించారు. మంచి పనులు చేస్తే మంచికర్మ పదార్ధం ఆత్మకు పట్టుకొంటుందని, చెడ్డ/అనైతిక కర్మలు చేస్తే చెడ్డకర్మ పదార్ధం పట్టుకొంటుందని జైన కర్మ సిద్ధాంతం చెబుతుంది.

జైన మతం పాపపుణ్యాలను, కర్మ సంచయాన్ని, పునర్జన్మను, మోక్షాన్ని విస్త్రుతంగా చర్చించింది. బౌద్ధం ఈ కమ్మ/కర్మ బావనలను జైనం నుంచి స్వీకరించింది. అప్పట్లో జైన సంఘాలలో కులవివక్ష ఉండేది. అస్పృశ్యులకు జైన సంఘారామంలోకి ప్రవేశం ఉండేది కాదు[3].

ఆ తరువాత వచ్చిన హిందూమతం ఈ కర్మ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళింది.

***

బౌద్ధం చాతుర్వర్ణాలలోని హెచ్చుతగ్గులను తీవ్రంగా ఖండించింది. బౌద్ధధమ్మాన్ని స్వీకరించిన అందరూ అంతకుపూర్వం బ్రాహ్మణ, క్షత్రియ శూద్ర ఎదోఒక వర్ణానికి చెందినవారే. వీరిలో బ్రాహ్మణ, క్షత్రియ వ్యక్తులే ఎక్కువ శాతం కాగా ఇతర తక్కువ వర్ణస్థులు కూడా గణనీయంగానే ఉండేవారు.

వీరందరిని ఉద్దేశించి - గంగ, యమున సరయు, మహి లాంటి నదులు సముద్రాన్ని చేరగానే తమ పేర్లను, అస్తిత్వాలను ఎలాగైతే కోల్పోతాయో అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన వారెవరైనప్పటికీ దమ్మాన్ని ఆచరించటం మొదలుపెట్టగానే వారి వారి వర్ణాలను కోల్పోతారు అని వినయపిటక లో బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు.

బుద్ధుని ముఖ్య అనుచరులలో చాలామంది శూద్ర, అతిశూద్ర కులాలకు చెందిన క్షురకులు, పాకీపని చేసేవారు, చండాలురు లాంటి వారు ఉండేవారు. వీరు అందరితో సమానంగా అర్హంత (ముక్తి) స్థాయిని పొందారు. బౌద్ధ సంఘలో బుద్ధుని తరువాత గొప్ప స్థానాన్ని పొందిన వినయ అనే సన్యాసి క్షౌరవృత్తికి చెందినవాడు.

***

వాసెత్త సుత్త, సుత్త నిపాత గ్రంధాలలో –పురుగులు, మృగాలు మొక్కల లాగా మనుషులకు ఏ రకమైన శరీరనిర్మాణ సంబంధమైన తేడాలు లేవు కనుక మనుషులందరూ ఒకటే అని బుద్ధుడు శాస్త్రీయంగా చెప్పటానికి ప్రయత్నించాడు[4].

అస్సలాయనసుత్త, మజ్జిమనికాయ గ్రంధాలలో బుద్ధుడు బ్రాహ్మణులు చెప్పుకొనే ఉత్తమజన్మ భావనను విమర్శించాడు. తెల్లగా ఉన్నామని, స్వచ్చమైనవారమని, బ్రహ్మ నోటిలోంచి రావటం ద్వారా ఉత్తమజన్మ పొందినవారిమని బ్రాహ్మణులు చెప్పుకొంటారుకానీ- వారు నవమాసాలు మోసిన స్త్రీ గర్భం నుంచి ఇతరులలాగే జన్మించారని, పాలు తాగి పెరిగారని, వారు కూడా మామూలు మనుషులేనని అన్నాడు.

***

హిందు ధర్మశాస్త్రాలు ఒకే రకమైన నేరానికి వివిధ వర్ణాలకు వివిధ రకాల శిక్షలు చెప్పాయి. బ్రాహ్మణుడు దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం, శూద్రుడు చేస్తే కొరడా దెబ్బలు, చండాలుడు దొంగతనానికి పాల్పడితే మరణ దండనలు ఉండేవి. ఈ అంశంపై బౌద్ధ సన్యాసులైన మహాకచ్చన, అవంతి పుత్త మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

ప్ర. ఒక బ్రాహ్మణుడు దొంగతనం చేస్తే అతనికి ఎలాంటి శిక్ష విధించాలి?

జ. అతని ఆస్తులు లాక్కొని, దేశబహిష్కరణ లేదా నేరాన్ని బట్టి సముచిత శిక్ష విధించాలి.

ప్ర. అదే దొంగతనం ఇతర వర్ణాలవారు చేస్తే?

జ. వారికి అదే శిక్ష. ఎలాంటి తేడాలు ఉండకూడదు.

ప్ర. తక్కువ వర్ణాలవారు కష్టపడి ధనం సంపాదించుకొని, బ్రాహ్మణులని తమ వద్ద దశ్యులు/పనివాళ్లుగా పెట్టుకొనవచ్చునా? (శూద్రులు పై మూడు వర్ణాలవారికి సేవలు చేయాలి అని ధర్మశాస్త్రాలు చెప్పాయి)

జ. నిస్సందేహంగా పెట్టుకోవచ్చు. అలా జరిగినప్పుడే నాలుగు వర్ణాలవారు సమాన స్థాయిలో ఉన్నట్లు [5].

***

ప్రాచీన బౌద్ధ సాహిత్యం కుల వ్యవస్థలోని ఈ అంశాల గురించి మాట్లాడింది.

1. కుల వ్యవస్థలోని వ్యక్తుల మధ్య హెచ్చుతగ్గులు అశాస్త్రీయం అని; శారీరిక క్రియలద్వారానే మానవులు జన్మిస్తారేే తప్ప దైవసంబంధ పుట్టుక ఎవరికీ లేదని; భిన్నవర్ణాలమధ్య వివాహం వలన ధర్మశాస్త్రాలు చెప్పినట్లు కొత్త మానవజాతి ఉద్భవించదు అని చెప్పింది.

2. కులం అనేది శాశ్వతం కాదని, గుణకర్మల ఆధారంగా మార్పుకు గురవుతుందని చెప్పింది.

3. జీవులందరూ సమానం అని, వారు చేసే పనులు/కర్మలు ఆధారంగా వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయని చెప్పింది

4. సమాజంలో ఉత్తమ స్థానాలు పొందాలంటే మంచి కర్మలు, జ్జాన సముపార్జన అవసరం అని ప్రభోదించింది

5. దిగువ వర్ణాలకు చెందిన వ్యక్తులకు విద్యను నిరాకరించటం అనైతికం, అన్యాయమని చెప్పింది 

ప్రాచీన బౌద్ధ సాహిత్యం కులంలోని ఈ అంశాలపై మౌనంగా ఉంది

1. కుల ఆధారిత వివక్ష, పీడనల గురించి

2. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం ల గురించి, వాటిని ఎలా సాధించాలో అనే విషయం.

3. నిచ్చెనమెట్ల వ్యవస్థ మూలాలు

***

బుద్ధుడు నిర్వాణం చెందాకా కాలక్రమేణా తదుపరి పాళిరచనలలో-ఈ శూద్ర అతి శూద్రవర్ణాలు తక్కువ స్థాయి మనుషులుగా చెప్పబడ్డారు. ఒక జాతకకథలో చండాలుడు నగరంలోకి ప్రవేశించినందుకు ప్రజలు అతనిపై పిడిగుద్దులు కురిపించి స్పృహకోల్పోయేలా చేసారని ఉన్నది. మరొక జాతక కథలో చండాలునిపై వీచిన గాలిని తాకటం అంటే మైలపడినట్లు అని చెప్పబడింది. చండాలుడిని చూస్తే చాలు కళ్ళను మంత్రజలంతో శుభ్రపరచుకోవాలని ఇంకో జాతకకథలో ఉంది.[4]

బుద్ధుని కాలంలో అందరూసమానమని చెప్పినప్పటికీ క్రమేపీ అతిశూద్ర వర్గాలను దూరంపెట్టటానికి కారణం బౌద్ధంలోకి వచ్చిన బ్రాహ్మణ వర్ణం కారణమని ఒక వాదన కలదు.

***

బుద్ధుడు కులవ్యవస్థపై తన వ్యతిరేకతను ఇలా స్పష్టపరిచాడు.

1. కులవ్యవస్థను సృష్టించి, పోషించే ధర్మశాస్త్రాలను నిరసించాడు. శాస్త్రీయంగా అవి తప్పు అని నిరూపించటానికి ప్రయత్నించాడు.

2. కులవ్యవస్థ సృష్టించే అసమానతలు ఎంతటి అసంబద్దమో తార్కికంగా వివరించటానికి ప్రయత్నించాడు.

3. సన్యసించటం ద్వారా గత జీవితపు కుల/వర్ణ ఆధారిత హెచ్చుతగ్గులను వదిలించుకొని అందరూ సమాన హోదాలతో జీవించే సంఘాన్ని ఏర్పరచాడు.

4 వర్ణాంతర వివాహాలను బుద్ధుడు అంగీకరించాడు. విముఖత లేదు [5]

రెండున్నరవేల ఏండ్లతరువాత కులవ్యవస్థపై చేసిన పోరాటంలో డా. అంబేద్కర్ కూడా ఇవే మార్గాలను ఆశ్రయించటం ఆశ్చర్యం కలిగించకమానదు.

1. మనుధర్మశాస్త్రాన్ని దహనం చేసాడు

2. కులవ్యవస్థ ఎంతటి అమానుషమో అనేక వ్యాసాలు, పుస్తకాల ద్వారా చెప్పాడు.

3. తన అనుయాయిలతో హిందూమతాన్ని త్యజించి కులవ్యవస్థలేని బౌద్ధాన్ని స్వీకరించాడు.

4. కులనిర్మూలనకు కులాంతరవివాహాలు పరిష్కారమని చెప్పాడు.

కులవ్యవస్థ పై మహాత్మాగాంధి అభిప్రాయాలుకూడా ఇదే క్రమంలో ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించకమానదు.

1. వర్ణ వ్యవస్థపట్ల మొదట్లో సానుకూలంగా ఉన్నప్పటికీ, క్రమేపీ మనుషులు అందరూ సమానం అని గుర్తించి, వివిధ వర్ణాల/కులాల ఎక్కువతక్కువలను తీవ్రంగా ఖండించాడు.

2. కుల పీడన అస్పృశ్యతలను ఖండించి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు. కులవ్యవస్థపై గాంధి వ్రాసిన వ్రాతలలో ఎక్కువభాగం అస్పృశ్యత గురించే

3. గాంధి 1946 లో కాంగ్రెస్ లో చేరే యువతీయువకులు కులాంతరవివాహాలు చేసుకోవాల్సింది అని పిలుపు ఇచ్చాడు.

కులవ్యవస్థపై గాంధి 1920 లలో వెలిబుచ్చిన అభిప్రాయాలకు జీవిత చరమాంకానికి చేరాకా ఏర్పరచుకొన్న అభిప్రాయాలకు హస్తిమశకాంతర వ్యత్యాసం కనిపిస్తుంది.

కుల వ్యవస్థలోని లోపాలను సంస్కరించటంలో అంబేద్కర్ ది ఆచరణాత్మక పంథా అయితే, గాంధీది ఆదర్శాలను నింపుకొన్న మార్గం.

***

బౌద్ధసంఘం వెలుపల ఆనాటి సమాజంలో కుల వ్యవస్థ

బౌద్ధం వర్ణ/జాతి వ్యవస్థను నిర్ధ్వంద్వంగా తిరస్కరించిందని బౌద్ధసాహిత్యంలో అనేక ఆధారాలు లభిస్తాయి.  ఈ  కులవ్యవస్థ నిర్మూలన అనేది సన్యాసులవరకే పరిమితమనే భావన కలుగుతుంది.

ఆరో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన హ్యుయాన్ త్సాంగ్ భారతదేశం నలుమూలలా సుమారు 20 పైగా వివిధ పట్టణాలలో వేలకొలదిగా విస్తరించి ఉన్న బౌద్ధసంఘాల  వివరాలను పొందుపరచాడు.  బౌద్ధ సంఘానికి వెలుపల సమాజం ఏ విధంగా ఉండేదో, అక్కడ సామాన్యప్రజలలో ఏ విధమైన స్తరీకరణ ఉన్నదో బౌద్ధరచనలద్వారా తెలుసుకొనవచ్చును.

ఆనాటి బౌద్ధ సమాజంలో దమ్మాన్ని స్వీకరించి ఆరామాలలో నివసించే సన్యాసులు/శ్రమణులు ఒకవైపు; సంసారిక జీవనాన్ని సాగిస్తూ బౌద్ధదమ్మం పట్ల విశ్వాసం కలిగి ఉండే సాంఘిక సమూహం మరొకవైపు ఉండేవి. 

ఈ సాంఘిక సమూహంలో, క్షత్రియులు, బ్రాహ్మణులు, గాహపతి (ఇంటియజమాని) అంటూ మూడురకాల వ్యక్తులు ఉండేవారు.  పరిపాలనా వ్యవహారాలు క్షత్రియులు, ఆద్యాత్మిక వ్యవహారాలు బ్రాహ్మణులు చూసేవారు.

ఆనాటి సమాజంలో గాహాపతులు చాలా ముఖ్యమైన వర్గం.  వీరు వ్యవసాయం, వ్యాపారం చేస్తూ సంపదలు సృష్టించి, రాజుకు పన్నులు కట్టి సమాజాన్ని ఆర్ధికంగా ముందుకు నడిపించేవారు.

2. బౌద్ధమతం ఎందుకు క్షీణించింది?  పార్టు 2

ఆర్కియాలజీ, సాహిత్యాల ఆధారంగా బౌద్ధం భారతదేశ నలుమూలలా బలంగా విస్తరించిందని తెలుస్తుంది. ఆరవశతాబ్దపు చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఆనాటి బౌద్ధ ఆరామాల విస్తరణ, ఇతర ఆరాధనా పద్దతులతో తులనాత్మకత లాంటి వివరాలు లభిస్తాయి.

  •  నేటి ఉత్తరప్రదేశ్ లోని కానౌజ్/కన్యాకుబ్జ లో బౌద్ధులు, ఇతర విశ్వాసులు సమాన సంఖ్యలో ఉన్నారు; వెయ్య ఆరామాలు, పదివేల బిక్షుకులు, 200 (హిందూ) దేవాలయాలు, కొన్ని వేలమంది దేవభక్తులు ఉన్నారు.
  • వారణాసిలో ముప్పై ఆరామాలు 3000 మంది భిక్షుకులు, 100 (హిందూ) దేవాలయాలు పదివేలమంది భక్తులు ఉన్నారు, వీరిలో ముఖ్యంగా పశుపతులు, జైనులు ఎక్కువ.
  • మగధలో 50 ఆరామాలు, పదివేలమంది భిక్షుకులు ఉన్నారు.
  • వైశాలి లో కొన్ని వందల ఆరామాలు ఉన్నాయని కానీ అవన్నీ శిథిలమైపోయాయని, బౌద్ధ భిక్షుకులు కొద్దిమంది మినహా చాలామంది వైశాలిని విడిచివెళ్ళిపోయారని, కొన్ని పదుల దేవ ఆలయాలు ఉన్నట్లు తెలిపాడు.
  • పుండ్రవర్ధన (బెంగాల్) లో 3000 భిక్షకులతో ఇరవై ఆరామాలు, కొన్ని వందల ఆలయాలు ముఖ్యంగా జైనులు ఉన్నారు.
  • సముద్రతీర పట్టణమైన Samatata లో 30 ఆరామాలు, 2000 మంది భిక్షకులు ఉన్నారు.
  • తామ్రలిప్తి లో 10 ఆరామాలు, 50 దేవ ఆలయాలు ఉన్నాయి.
  • ఓడ్ర (ఒరిస్సా) దేశంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్నారని, 100 ఆరామాలతో 10 వేల భిక్షుకులు నివసిస్తున్నారని చెప్పాడు
  • కోశల (ఉత్తరప్రదేష్) లో 100 ఆరామాలు 10 వేలమంది భిక్షుకులు, 70 దేవ ఆలయాలు ఉన్నాయని చెప్పాడు.
  • పిఠాపురం (వేంగి?) 30 కి పైగా బౌద్ధారామాలు, చాలామట్టుకు శిథిలస్థితిలో ఉన్నాయి. 3000 మంది భిక్షుకులు, 100 కు పైగా దేవ ఆలయాలు ఉన్నాయని వాటికి శైవ, జైన విశ్వాసులు ఉన్నారు.
  • తమిళనాడు కాంచిపురంలో 100 కు పైగా ఆరామాలు, 10 వేలకు పైగా భిక్షుకులు ఉన్నారని, 80 కి పైగా దేవ ఆలయాలు అసంఖ్యాకంగా జైనులు ఉన్నట్లు చెప్పాడు.
  • మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో వందకు పైగా సంఘారామములు పదివేల భిక్షుకులు ఉన్నట్లు చెప్పాడు.
  • నాసిక్ లో 100 ఆరామాలు, 5000 మంది భిక్షుకులు, 100 కు పైగా దేవ ఆలయాలు ఉన్నాయని చెప్పాడు. అజంతా గుహలగురించి కూడా వర్ణించాడు.
  • మాలవా (మాళ్వా) పంజాబ్ లో 100 ఆరామాలు, 2000 భిక్షుకులు ఇంకా ఎక్కువసంఖ్యలో ఇతర విశ్వాసులు ఉన్నారు ముఖ్యంగా శైవులు.
  • వలాభి (గుజరాత్ ) వంద వరకూ ఆరామాలు, 6000 మంది భిక్షకులు ముఖ్యంగా థెరెవాద బౌద్దులు. అనేక వందల దేవ ఆలయాలు ఉన్నాయి.
  • గుర్జర (రాజస్థాన్) లో ఉన్న ఆరామాలు శిథిలస్థితిలో ఉన్నాయని, శైవం ప్రముఖంగా ఉందని చెప్పాదు.
  • సింధ్ (పాకిస్తాన్) వందలకొలదీ ఆరామాలు ఉన్నాయని 10000 మంది భిక్షక పూజారులున్నారని. వీరు ఎక్కువగా థెరెవాద బౌద్ధులని చెప్పాడు. శైవులు కూడా గణనీయంగా ఉన్నారు [6].

పై వివరాల ద్వారా ఒకనాటి అఖండ భారతదేశంలో బౌద్ధం ఏమేరకు విస్తరించిందో స్పష్టంగా అర్ధమౌతుంది. పై వివరాలను గమనిస్తే బౌద్ధానికి ప్రత్యామ్నాయంగా అప్పట్లో జైనం, శైవం ఉన్నట్లు కనిపిస్తుంది. వీటినే దేవాలయాలుగా హ్యుయాన్ త్సాంగ్ చెప్పాడు. ఆరామాలు ఆధ్యాత్మిక బోధనలేకాక వ్యాపార, బాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే కేంద్రాలుగా, వైద్యం[7] , విద్య (ఒకనాటి విశ్వవిద్యాలయలు బౌద్ధులని) అందించే ఉన్నత స్థానాలుగా ఉండేవి.

పై జాబితాలో ఎక్కడా వైష్ణవాలయాలు లేకపోవటాన్ని బట్టి వైష్ణవం ఇంకా వెలుగులోకి వచ్చినట్లు అనిపించదు. భారతదేశ జనాభాలో ఎంతమంది బౌద్ధాన్ని ఒక ధార్మిక జీవన విధానంగా చేసుకొన్నారో అనేదానికి స్పష్టమైన లెక్కలు లేవు.

దేశం నలుచెరగులా విస్తరించిన బౌద్ధం పన్నెండో శతాబ్దానికల్లా దాదాపు క్షీణించింది. అదేకాలంలో ఆదరణకు నోచుకొంటున్న వైష్ణవం బుద్ధుడిని విష్ణుమూర్తి అవతారంగా కలుపుకొని ఒక పురాణపురుషునిగా చేసుకొంది. కానీ ఈ ప్రయత్నం రామ, కృష్ణావతారాలలాగా ప్రసిద్ధిచెందలేదు.

బుద్ధుని తరువాత వ్రాసిన ఉపనిషత్తులు, పురాణాలు, సంస్కృత, ప్రాకృత కావ్యాలు బుద్ధుని గురించి పెద్దగా చెప్పలేదు. బౌద్ధ పండితుల రచనల వ్రాతప్రతులు ఒక్కటీ లభించలేదు, కనీసం ఆయారచనలలోంచి ఆలంకారిక ఉదాహరణలు అలంకార శాస్త్ర గ్రంధాలలోకికూడా ఎక్కలేదు. బుద్ధచరిత, సౌందరానంద, మరి కొన్ని బౌద్ధ గ్రంధాలు తప్ప – బౌద్ధ సన్యాసుల జీవనం, సంఘ నిర్మాణం, బుద్ధిస్ట్ ఆర్ట్, బుద్ధుని బోధనల పై పండిత చర్చలు, బుద్ధుని కాలపు విశేషాలు లాంటివి అన్నీ భారతదేశంలో 12 వ శతాబ్దానికి వచ్చేసరికే కాలగర్భంలో కలిసిపోయాయి.

యూరోపియన్ చరిత్రకారులు James Prinsep, Alexander Cunningham, Henry Olcott లాంటి వారు టిబెట్, సిలోన్, జపాన్ లాంటి దేశాలలోని పాళి భాషలో ఉన్న బుద్ధుని రచనలను సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేసారు. ఆ తరువాత శ్రీలంకు చెందిన Anāgārika Dharmapāla ఇంకా Sarat Chandra Das, Satish Chandra Vudyabhushan, Hara Prasad Sastri, Lakshmi Narasu వంటి భారతీయులు విదేశాలలోఉన్న బౌద్ధ రచనలను సేకరించి అనువదించే మహా క్రతువులో పాలుపంచుకొన్నారు. 1908 లో మెట్రిక్యులేషన్ పాస్ అయినందుకు డా. బి.ఆర్. అంబేద్కర్ కు బుద్ధుని జీవితంపై Krishnaji Arjun Keluskar వ్రాసిన పుస్తకం బహుమతిగా ఇవ్వబడింది. వీరందరి కృషి కారణంగా 12 వ శతాబ్దంలో అంతర్ధానమైన బౌద్ధం 20వ శతాబ్దం వచ్చేసరికి భారతీయులకే కాక మొత్తం ప్రపంచానికి తెలిసింది.

***

బౌద్ధం ఎందుకు కనుమరుగైందో తెలిపే చారిత్రిక ఆధారాలు పెద్దగా కనిపించవు. భారతదేశంలో బౌద్ధానికి చెందిన ఒక్క వ్రాతప్రతి లభించలేదు. టిబెట్, చైనా, శ్రీలంకలలో లభించిన వాటి అనువాదాలే నేటి బౌద్ధ సాహిత్యం అంతా. ప్రముఖ ఇండాలజిస్టు A.L. Basham బౌద్ధం క్షీణించటాన్ని ఇలా విశ్లేషించాడు

1. ఊచకోతలు ప్రధానకారణం కాదు

2. అప్పటికి ఉన్న విశ్వాసాలు సంస్కరించబడి “హిందూమతం” పేరిట స్థిరీకరించబడటం

3. వైష్ణవం, శైవం క్రమేపీ ఇతర దేవతారాధనలు అన్నీ ఒకే గొడుగు క్రిందకు తీసుకురావటం

4. విస్త్రుతమైన ప్రచారం, శంకరాచార్యునిచే వ్యవస్థీకృత నిర్మాణం దానికి లభించిన రాజాదరణ

5. అప్పటికే క్షీణిస్తున్న బౌద్ధంపై యుద్ధోన్మాదంలో ముస్లిములు చేసిన దాడులు ఆఖరి అస్త్రంగా పరిణమించాయి.

భారతదేశంలో క్రీపూ. రెండో శతాబ్దంలోని పుష్యమిత్రశుంగుడి నుంచి ఆరోశతాబ్దంలోని తురుష్కరాజైన– Mihirakula వరకూ బౌద్ధమతాన్ని వివిధ దశలలో హింసాత్మకంగా అణచివేసినట్లు పదహారవ శతాబ్దానికి చెందిన టిబెట్ బౌద్ధగురువు తారానాథుని రచనల ద్వారా తెలుస్తున్నది. ఇదే తరహా ఊచకోతలు ఆ తరువాత హిందూమతంపై కూడా జరిగాయి. కనుక ఒక్క ఊచకోతలవల్లే బౌద్ధం కనుమరుగు అయి ఉండకపోవచ్చు.

***

సూర్యుడు, గణేశుడు, పార్వతిదేవి, శివుడు, విష్ణువు మొదలైనవారు పంచదేవతలని, వీరిని ప్రధాన దేవతలుగా ఆరాధించటాన్ని పంచాయతన పూజావిధానం అంటారు. ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు ప్రవేశపెట్టినట్లు చెప్పే, ఈ పంచాయతన పూజావిధానం ద్వారా వివిధ ఆరాధనాపద్దతులు ఏకం అవ్వటంతో బలమైన హిందుమత భావన కలిగింది. శంకరాచార్యుడు అఖండ భారతావని అంతా తిరిగి హిందుధర్మాన్ని ప్రచారం చేసి, అనేకచోట్ల పండిత చర్చలు జరిపి ఆలయాలు స్థాపించి-హిందూమతానికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొచ్చాడు.

***

ఏడో శతాబ్దం వరకూ రాజులు బౌద్ధాన్ని, జైనాన్ని హిందూమతాన్ని సమాదరించారు. క్రమేపీ హిందూమతం పట్ల ఆదరణ పెరిగింది. దీనికి కారణం … రాజ్యానికి కావల్సిన వెట్టిచాకిరీ చేసే వర్గం ఒకటి హిందూమతం ఏర్పరచిన కులవ్యవస్థ వలన చాలా సులువుగా అందుబాటులోకి వచ్చింది. ఉత్పత్తి వర్గాలుగా ఈ బహుజన సమూహం సమాజ ఆర్ధిక అభివృద్ధికి ఉపయోగపడింది. ఇదంతా సంపదను తేరగా అనుభవించే పాలకులకు లాభించే వ్యవహారం.

అంతే కాక హిందూమతం రాజుకి దేవునితో సమానమైన స్థానాన్ని కట్టబెట్టింది. కొన్ని జాతక కథలలో రాజు తప్పు చేస్తే ప్రజలు తిరగబడి అతడిని చంపివేసినట్లు ఉండటాన్ని బట్టి బౌద్ధమతంలో రాజుకు సర్వాధికారాలు లేవని అర్ధమౌతుంది.[10] తమిళ ప్రాచీన కావ్యం శిలపధికారంలో నెడుంజెళియన్ అనే రాజు తప్పుడు తీర్పు ఇచ్చినందుకు మరణించటమే కాక అతని రాజ్యం నాశనమవ్వటం రాజు ధర్మానికి కట్టుబడి లేకపోతే నాశనం అవుతాడు అనే భావనను హిందూవేతర మతాలు ప్రచారంచేసాయి. అంతేకాక బౌద్ధ, జైనాలలో రాజు సర్వస్వంగ పరిత్యాగి. హిందూ రాజుకు అలాంటి పరిమితులు లేవు భోగలాలసుడుగా కూడా ఉండొచ్చు. సర్వశక్తిసంపన్నుడు. అది రజోగుణం. ఈ అంశాలన్నీ కూడా హిందూమతానికి రాజాదరణ లభించటానికి కారణం కావొచ్చు.

***

బుద్ధుని సంఘారామం తమ పోషణ కొరకు ధనికులపై ఎక్కువగా ఆధారపడేది. బౌద్ధమతం పట్టణాలలో బాగా విస్తరించింది. దీనికి పోషకులు వ్యాపారులు. విదేశీవ్యాపారం తగ్గిపోవటంతో వ్యాపారవర్గాల ప్రాభవం తగ్గిపోయింది. క్రమేపీ భూస్వామ్యవాదం పెరిగింది. ఈ క్రమంలో హిందూమతం – పంచాంగం ద్వారా వానలు పడే కాలాన్ని చెబుతూ, విత్తనాలు ఎప్పుడు జల్లాలి, కోతలు ఎప్పుడు కోయాలి అనే అంశాలకు ముహుర్తాలు పెడుతూ వ్యవసాయాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకొంది. ఆ విధంగా హిందుమతం గ్రామీణ ఫ్యూడల్ వ్యవస్థను బలోపేతం చేసి తన అదుపాజ్ఞలలో. ఉంచుకొంది.

ఇక పట్టణాలలో బౌద్ధ ఆరామాలకు రాజాదరణ, వ్యాపారుల ఆదరణతగ్గి, నిర్వహణకొరకు నిధులు కరువై రకరకాల హీన పద్దతులకు పాల్పడవలసి వచ్చింది. బుద్ధుని దంతాన్ని ప్రదర్శనకు పెట్టి, తలకు ఒక్కో బంగారు నాణెం చొప్పున వసూలుచేసేవారు. ఇది సామాన్యజనానికి అందుబాటులో లేని రుసుము. బౌద్ధంలో చీలికల కారణంగా ఏర్పడిన వజ్రయానం తాంత్రిక పూజావిధానాలను అవలంబించింది. నగ్నలైంగిక పూజలు ఒక ఆరాధనవిధానంగా బోధించటంతో ప్రజలకు ఏవగింపు కలిగి బౌద్ధం క్రమేపీ ఆదరణ కోల్పోయింది. అందుకనే కొన్నిచోట్ల బౌద్ధ శిథిలాలను లంజల దిబ్బలుగా స్థానికులు పిలుస్తారు.

***

3. ప్రాచీన భారతదేశం బౌద్ధులదా? హిందువులదా? పార్టు 3

క్రీ.పూ మూడవశతాబ్దం నుంచి కనిపిస్తున్న కళలు, కట్టడాలు, శాసనాలు ప్రాచీన భారతదేశం బౌద్ధులకు చెందినదని నిర్ధ్వంద్వంగా నిరూపిస్తాయి. విహారాలు, స్తూపాలు, గుహలు, చైత్యగృహాలు, ఆరామాలు, గాంధారి, అమరావతి శైలి విగ్రహాలు మొదలైన బౌద్ధనిర్మాణాలు ముఖ్యంగా.

బుద్ధుని సమకాలీనరాజులైన బింబిసారుడు, పెసనెది బౌద్ధం పట్ల సానుకూల దృక్ఫథం కలిగి ఉన్నారు. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించాడు. అశోకుని అనంతరం పుష్యమిత్ర శుంగుడు (క్రీపూ 2 వ శతాబ్దం) బౌద్ధాన్ని పక్కనపెట్టి వైదిక క్రతువులను ప్రోత్సహించాడు. ఇతని కాలంలోనే మనుస్మృతి రచింపబడి ఉంటుందని డా.అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత వచ్చిన గుప్తులకాలంనుంచి (క్రీశ. 2-5 వశతాబ్దం) హిందూ ఆలయాలు కనిపించటం మొదలౌతుంది. సాహిత్యానిది కూడా ఇదే ఒరవడి. హిందూ సంస్కృత సాహిత్యంకన్నా బౌద్ధ పాలి సాహిత్యం ప్రాచీనమైనది. వైష్ణవం, శైవం కలిసిపోవటం, ధర్మశాస్త్రాలు ఏర్పడటం లాంటివి హిందూమతం సాంద్రపడటానికి దోహదపడిన అంశాలు.

***

బౌద్ధ, హిందు మతాలలో రాజ్యం ఏడు అంగాలను కలిగి ఉండాలని చెప్పాయి. బౌద్ధం ప్రకారం రాజ్యానికి దమ్మ చక్రం, ఏనుగు, గుర్రం, మణులు, రాణి, మంత్రి, గృహస్థు ఉండాలి. హిందుమతం ప్రకారం ఆ ఏడు అంగాలు ఇలా ఉన్నాయి- రాజు, మంత్రులు, సరిహద్దులు, కోటలు కలిగిన రాజ్యాలు, ఖజానా, సైన్యం, రక్షకభటులు, మిత్రకూటమి. హిందూ రాజ్యలక్షణాలలో కనిపించే హింస, యుద్ధం, రక్షణ లాంటి అంశాలు బౌద్ధం చెప్పిన రాజ్యలక్షణాలలో కనిపించకపోవటం గమనార్హం.

 

బౌద్ధం ప్రకారం వ్యాపారులు, కులవృత్తి సంఘాలు (artisan guilds) ఆనాటి ఆర్ధిక వ్యవస్థని నియంత్రించేవారు. పెద్ద ఎత్తున విదేశీ వ్యాపారం జరిపారు. ఇది ఒకరకంగా స్వేచ్ఛావిఫణి సిద్ధాంతం లాంటిది. పెట్టుబడిదారి వ్యవస్థ. రాజుపాత్ర పరిమితం. హిందూరాజ్యం అలా కాదు. అది ఫ్యూడల్ వ్యవస్థను సమర్ధిస్తుంది. కౌటిల్యుని అర్ధశాస్త్రం వ్యాపారులను దొంగలంటుంది. హిందూ రాజ్యంలో ఆర్ధిక వ్యవస్థను రాజు నియంత్రించేవాడు. రాజు/భూస్వామి సర్వ శక్తివంతుడు.

బౌద్ధ సంఘం రాజు నియంత్రణకు వెలుపల ఉండేది. 

బౌద్ధసమాజంలో సాంఘిక జీవనం

ఆనాటి బౌద్ధ సమాజంలో దమ్మాన్ని స్వీకరించి ఆరామాలలో నివసించే సన్యాసులు/శ్రమణులు ఒకవైపు; సంసారిక జీవనాన్ని సాగిస్తూ బౌద్ధదమ్మం పట్ల విశ్వాసం కలిగి ఉండే సాంఘిక సమూహం మరొకవైపు ఉండేవి. ఈ సాంఘిక సమూహంలో, క్షత్రియులు, బ్రాహ్మణులు, గాహపతి (ఇంటియజమాని) అంటూ మూడురకాల వ్యక్తులు ఉండేవారు. పరిపాలనా వ్యవహారాలు క్షత్రియులు, ఆద్యాత్మిక వ్యవహారాలు బ్రాహ్మణులు చూసేవారు.

ఇక గాహాపతులు ఆనాటి సమాజంలో చాలా ముఖ్యమైన వర్గం. వీరు వ్యవసాయం, వ్యాపారం చేస్తూ సంపదలు సృష్టించి, రాజుకు పన్నులు కట్టి, సమాజాన్ని ఆర్ధికంగా ముందుకు నడిపించేవారు. భూములు, తోటలు, పశువులు, దశ్యులు/బానిసలు, బంగారం వెండి లాంటి సంపదలన్నీ వీరి ఆధీనంలో ఉండేవి. వీరే ఆరామాల నిర్మాణ, నిర్వహణల కొరకు విరాళాలు ఇచ్చేవారు.

వివిధ వ్యాపార/వ్యవసాయ కార్యక్రమాలకొరకు అనేకమంది దస్యులు, కూలీలు గాహాపతుల ఆధీనంలో ఉండేవారు. వీరందరికీ గాహపతులు ఉపాధి కల్పిస్తూ పోషణ జరిపేవారు. బుద్ధభగవానుడు ఒకనాడు పుత్త సిగాలా అనే గాహాపతి తో “అతని వద్ద ఉన్న దస్యులను ప్రేమగా చూసుకొమ్మని, వారి శక్తికి అనుగుణంగా పని కేటాయించమని, చక్కని ఆహారము, బత్యములు అందించమని, అనారోగ్యానికి గురయితే అవసరమైన శలవులు ఇవ్వమని” కోరటాన్ని బట్టి ఆనాటి సమాజంలో క్షత్రియులు, బ్రాహ్మణుల సరసన గాహాపతులు పోషించిన పాత్రను అర్ధం చేసుకొనవచ్చు. (Mahavagga, p.255).

బౌద్ధ సమాజంలో ఈ గాహాపతుల ఆస్తులకు నష్టం కలిగించిన వారిని కఠినంగా శిక్షించేవారు. అనంతపిండక, దమ్మదిన్న లాంటి గాహాపతులు వందల కొద్దీ అనుచరులతో వచ్చి బుద్ధుని దర్శించుకొనేవారని అంగుత్తర నికాయ లో చెప్పబడింది.

బౌద్ధసన్యాసులు అవసానదశలో ఉన్నప్పుడు బుద్ధభగవానుడు వచ్చి వారిని పరామర్శించటం ఒక ఆచారం. ఇదే సంప్రదాయం నకులపిత అనే గాహాపతి అస్వస్థుడైనపుడు బుద్ధభగవానుడు సందర్శించడాన్ని బట్టి- గాహాపతులు బౌద్ధ సంఘం వెలుపల ఉన్నప్పటికీ బౌద్ధ సన్యాసులతో సమానమైన గౌరవాన్ని పొందేవారని అర్ధం చేసుకొనవచ్చును.

ప్రస్తుత శ్రీలంక బౌద్ధ సమాజంలో – క్షత్రియులు, బ్రాహ్మణులు లేకపోవటం గమనార్హం. క్షత్రియులు రాజు పాత్రకు పరిమితం కావటంతో వారి సంఖ్యపరిమితం. ఆద్యాత్మిక వ్యవహారాలు చూడటానికి బౌద్ధ భిక్షుకులు సరిపోతారు కనుక బ్రాహ్మణుల పాత్ర లేకపోవటంతో వారి ఉనికి కూడా లేదు. బౌద్ధంలో అస్పృశ్యత లేదు. అందుచేత శ్రీలంక బౌద్ధ సమాజంలో అస్పృశ్యులు లేరు. ఆ సమాజంలో మూడువంతుల మేర వ్యవసాయ, వ్యాపార వృత్తులు నెరపే గోయిగామ అనే వర్గం ఉన్నది. ఇది ప్రాచీనబౌద్ధంలోని గాహాపతులు గా పోల్చుకొనవచ్చును. మిగిలినవారు శ్రామికులు, కూలీలు. నిజానికి చాతుర్వర్ణ వ్యవస్థ, దానికి వెలుపల అస్పృశ్యులను ఏర్పరచిన హిందుభావజాలం భారతీయ సమాజాన్ని ఏ మేరకుప్రభావితం చేసిందో శ్రీలంక బౌద్ధ సమాజాన్ని చూస్తే అర్ధమౌతుంది. (రి. Social Dimentions of Early buddhism by uma chakravarthi p.115-118). బౌద్ధం అంతరించకపోయి ఉన్నట్లయితే భారతదేశ సమాజం ఇలాగే ఉండొచ్చనే ఊహ మరీ విపరీతమైనది కాకపోవచ్చు.

బుద్ధుని బోధనలపట్ల ఆకర్షితులైన ప్రజలలో కొద్దిమంది సంఘంలో చేరి బౌద్ధాన్ని ఆచరించారు, మరికొందరు సంఘం వెలుపల ఉంటూ సంసారిక జీవనాన్ని సాగిస్తూ బుద్ధుని బోధనలను నిజజీవితంలో పాటించారు.

సంఘంలో చేరిన 105 మందిలో బ్రాహ్మణులు 39, క్షత్రియులు 28, పై కులస్థులు 21, (ucca kulas-వణిజులు, శెట్టి, గణిక) క్రింది కులస్థులు 8 మంది (nica kulas చుండ, కమ్మర, కుంభకార) ఉన్నట్లు బౌద్ధరచనలద్వారా అర్ధమౌతుంది. ఈ లెక్కలు ఆనాటి సమాజంలోని స్తరీకరణను అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడతాయి.

సంఘం వెలుపల సామాన్యజీవనం సాగిస్తూ బుద్ధుని బోధనలపట్ల సానుకూలతను ఏర్పరచుకొన్న వారిని ఉపాసకులని పిలిచేవారు. విహారాలు నిర్మించటం, దుస్తులు దానం చేయటం, మందులు, ఆహారము అందించటం లాంటి పనులద్వారా ఉపాసకులు బౌద్ధ సంఘానికి తమ సహాయసహకారాలు అందించేవారు. ఈ పనులు చేసినందుకు ప్రతిఫలంగా బౌద్ధ భిక్షువులు వీరికి దమ్మమార్గాన్ని ప్రభోదించేవారు.

బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో ఇలా ఉపాసకులుగా 175 మంది ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో బ్రాహ్మణులు 76, గాహాపతులు 33, పైకులాల వారు 26, క్షత్రియులు 22, క్రింది కులాలవారు 11 మంది ఉన్నట్లు గుర్తించారు.

పైన చెప్పిన 76 మంది బ్రాహ్మణులలో ఎనిమిది మంది సంపన్నులు, పేరు ప్రతిష్టలు కలిగినవారు. వారు పొక్కరసాది, సొనాదన్ద, కుటాదంత, లోహిచ్చ. వీరు కోసల, మగధ లలో బ్రాహ్మణీయ భూములను అనుభవిస్తున్న హిందూ బ్రాహ్మణులు. వీరు బౌద్ధమతం వైపు ఆకర్షితమవటం ఆనాటి సమాజంలో గొప్ప ప్రభావితం చూపిన ఉదంతం అయి ఉండవచ్చు. బౌద్ధం బ్రాహ్మణవర్ణానికి పెద్దపీట వెయ్యకపోయిన వారు ఆద్యాత్మిక అన్వేషణలో భాగంగా బౌద్ధంలోకి చేరి ఉంటారనేది ఒక అభిప్రాయం. (రి. . Social Dimentions of Early buddhism by uma chakravarthi p.130-139)


ముగింపు

మతం అనే భావన ఆధునికమైనది. ఈనాడు మతం దాదాపు అనువంశికంగా పరిణమించింది. స్వేచ్ఛపరిమితం. భారతదేశ చరిత్రలో భిన్న భావజాలాలు కలిసి జీవనం చేసాయి. ఒకే కుటుంబంలో వివిధ వ్యక్తులు భిన్న ఆరాధనా పద్దతులను పాటించేవారు. ఒక ఆరాధనా విధానంనుంచి మరొక విధానంలోకి మారటం సహజంగా జరిగిపోయేది. బౌద్ధ థెరిగాథలలో – జైనం, హిందు, అజీవక జీవన విధానాలనుంచి బౌద్ధంలోకి వచ్చిన స్త్రీల గాథలు అనేకం కనిపిస్తాయి. శాతవాహనులు, ఖారవేలుడు, చాళుక్యులు భిన్న ఆరాధనా విధానాలను ప్రోత్సహించారు. మనపూర్వీకులు అనుభవించిన స్వేచ్ఛ అది.

బౌద్ధం కాలక్రమేణా హీనయాన ( థెరెవాద), మహాయాన, వజ్రయాన అంటూ వివిధ శాఖలుగా చీలిపోయింది. థెరెవాద బౌద్ధంలో ఉపాసకులకు బౌద్ధ సన్యాసులకు మధ్య దూరం ఎక్కువ. ఎందుకంటే థెరెవాద బౌద్ధంలో సంసారజీవితాన్ని త్యజించి సన్యసించటం ముఖ్యం. అందువల్ల ఆ బౌద్ధ విధానంలో సంసారులకు పెద్దగా పాత్ర ఉండేది కాదు.

బుద్ధుని అనంతరం వచ్చిన మహాయాన బౌద్ధశాఖలో సన్యసించటం ముఖ్యం కాదు. కనుక ఉపాసకులు పరిత్యాగంతో సంబంధంలేకుండా బుద్ధుని బోధనలు ఆచరించేవారు. అలా బౌద్ధం సామాన్య ప్రజలలోకి వెళ్ళగలిగింది.

బౌద్ధం దయ, మానవత, సమానత్వాలను బోధించింది. జన్మ ఆధారంగా మనుషుల ఎక్కువతక్కువలను బౌద్ధం ఖండించింది. స్త్రీలకు మతాచారాలలో సమాన పాత్రను ఇచ్చింది. భారతదేశ చరిత్ర హిందూమతానికి, బౌద్ధమతానికి మధ్య జరిగిన సాంస్కృతిక, సామాజిక ఘర్షణగా డా. అంబేద్కర్ చూసాడు.

ఆలోచనలు, సాహిత్యం, శిల్పశైలి, నిర్మాణ విశిష్టలతో కూడిన బౌద్ధమతం- లోతులు ఇంకా తెలియని ఒక జ్ఞాన భాండాగారం. భారతదేశ చరిత్రను, సంస్కృతిని, ఆత్మను నిర్మించటంలో బౌద్ధమతం పోషించిన పాత్ర అపురూపమైనది. మానవజాతి ప్రయాణంలో బౌద్ధం తీసుకొచ్చిన భావజాల విప్లవం గొప్ప మైలురాయి.=


బొల్లోజు బాబా

 [1] ‘Ime cattāro vaṇṇā samasamā honti. Samao Gotamo cātuvaṇṇi suddhi Paññāpeti Majjhima Nikāya II,.

[2] “na jaccā vasalo hoti, na jaccā hoti brāhmao/kammunā vasalo hoti, kammunā hoti brāhmao”

[3] Buddha and Ambedkar on caste by Mahesh A. Deokar

4. Jātaka, (1877–1897) Vol. IV).

5. “brāhmaṇīṃ katriyākanyāṃ vaiśyāṃ sūdrīṃtathaiva ca |yasyā ete guṇā santi tā me kanyāṃ pravedaya || na kulena na gotrea kumāro mama vismita | gue satye ca dharme ca tatrāsya ramate mana ||”

[6] పే. 153 Buddhism in India, Gail Omvedt

[7] బౌద్ధ ఆరామాలు నేటి ఆసుపత్రుల వలే వైద్యసేవలు అందించేవి. నాగార్జునకొండ వద్ద vigatajvar’ālaye (Fever house) పేరుతో దొరికిన ఒక ఫలకముపాటలిపుత్ర లో ఒక ఆరామం వద్ద జరిపిన తవ్వకాలలోī ārogyavihāre (Healing House) అనే ఒక ఫలకముధన్వంతరి అనే పేరుకలిగిన మరోఫలకముశ్రీలంక బౌద్ధ రచనలలో Rogalaya పేరుతో ఆరామంలోని ప్రత్యేక నిర్మాణాలు ఈ దృగ్విషయానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. రి. Health care in Indian Buddhism, Jessica Fish; Ancient Monastic Hospital System in Sri Lanka, Dr. L. Prematilleke

[8]. 136 Buddhism in India, Gail Omvedt).


సంప్రదించిన పుస్తకాలు

1. Classical Buddhism, Neo-Buddhism And The Question Of Caste by Edited by Pradeep P Gokhale

2. Buddhism in India Challenging Brahmanism and Caste, by Gail Omvedt

3.Social Dimentions of Early Buddhism by Uma Chakravarti

4. Social Aspects of Early Buddhism by Devananda

5. Archaeology Of Early Buddhism By Lars Fogelin

6. Buddhism and India by JB Sharma, SP Sharma

7. Health care in Indian Buddhism, Jessica Fish; Ancient Monastic Hospital System in Sri Lanka, Dr. L. Prematilleke

8. Health Care In Indian Buddhism: Representations Of Monks And Medicine In Indian Monastic Law Codes By Jessica Fish, B.A.

 

No comments:

Post a Comment