Monday, February 14, 2022

సమతామూర్తి - శ్రీ రామానుజాచార్యుడు

సమతామూర్తి - శ్రీ రామానుజాచార్యుడు
.
శ్రీ రామానుజాచార్యుడు (సా.శ. 1017-1137) తమిళనాడులోని శ్రీపెరుంబుదుర్ లో జన్మించారు. రామానుజాచార్యుడు విశిష్టాద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చాడు. విశిష్టాద్వైతం అంటే వైష్ణవమే. ఈ సిద్ధాంతం ప్రకారం దేవుడు ఒక్కడే. అతడే నారాయణుడు. జీవాత్మ పరమాత్మను చేరటమే మోక్షం. మోక్షం సిద్ధించాలంటే గొప్ప విష్ణుభక్తితో జీవించాలి. మనసావాచాకర్మణా విష్ణువుని శరణువేడాలి. రామానుజాచార్యుడు తన జీవితమంతా ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటానికే వెచ్చించాడు. అనేక ఆలయాలను సందర్శించి ఆక్కడ స్పష్టమైన పూజావిధానాలను, పద్దతులను ఏర్పరచాడు. తన సిద్ధాంతాన్ని కులబేధాలకు అతీతంగా ప్రజలందరికీ చేరువచేసాడు.
.
ఆంధ్రదేశంలో రామానుజాచార్యుడు
.
రామానుజాచార్యుడు ఆంధ్రదేశంలో విస్తృతంగా సంచరించాడు. ముఖ్యంగా తిరుమలతో రామానుజాచార్యుని అనుబంధం బలమైనది. రామానుజాచార్యుని మేనమామ శ్ఱీశైలపూర్ణుడు తిరుమలలో నివసించటం దీనికి కారణం కావొచ్చు.
చిదంబరం ఆలయంలో తొలగించిన గోవిందరాజ స్వామి విగ్రహాన్ని తీసుకొని వచ్చి తిరుపతిలో ప్రతిష్టింపచేసాడు శ్రీ రామానుజాచార్యుడు. తిరుపతి పన్నెండోశతాబ్దానికి పూర్వం కొత్తూరు అనే పేరుతో పిలువబడిన ఒక చిన్న ఊరు. శ్రీ రామానుజాచార్యుడు సా.శ 1130 లో గోవిందరాజస్వామి ఆలయనిర్మాణం గావించిన ఆ కొత్తూరు చుట్టూ రామానుజపురం, ఆ తరువాత అచ్యుతాపురం, శ్రీనివాసపురంలు ఏర్పడి క్రమేపీ అది తిరుపతి పట్టణంగా వృద్దిచెందింది.
తిరుమల మూలవిరాట్టు శివుడా, విష్ణువా అనే వివాదం రేగినపుడు శ్రీ రామానుజాచార్యుడు అది విష్ణు స్వరూపమని నిష్కర్ష చేసాడని అంటారు. అదే విధంగా శ్రీ కూర్మ ఆలయం, సింహాచల ఆలయాలను కూడా కూడా ప్రముఖ వైష్ణవ క్షేత్రాలుగా తీర్చిదిద్దడంలో రామానుజాచార్యుని పాత్ర ప్రముఖమైనది.
రామానుజాచార్యుని బోధనల ప్రభావంతో పన్నెండో శతాబ్దంలో ఆంధ్రదేశంలో వీరవైష్ణవ ఉద్యమం ఒక కెరటంలా ఉవ్వెత్తున ఎగసింది. పల్నాడు (గుంటూరు) లో బ్రహ్మనాయుడు అన్ని కులాలను ఏకం చేయాలనే ఉద్దేశంతో చాపకూడు (సహపంక్తిభోజనం) ఉద్యమాన్ని చేసాడు.
నెల్లూరులో రంగనాథస్వామి , మాచెర్లలో చెన్నకేశవ స్వామి, కోరుకొండ నరసింహస్వామి ఆలయాలు ఆంధ్రలో వైష్ణవం విస్తరించిన విధానాన్ని తెలుపుతాయి.
రామానుజాచార్యుని బోధనలవల్ల భూస్వామ్యవర్గాలు ఆలయానికి చేరువై గొప్ప ఆథ్యాత్మిక సేవలందించటం ఆంధ్రదేశ చరిత్రలో గొప్ప పరిణామం. వీరి పేర్లు వీరు చేసిన కైంకర్యాలు అనేక శాసనాలలో కనిపించటం మొదలైంది ఈ కాలంలోనే.
 
1. సత్ శూద్రులు

పన్నెండు, పదమూడు శతాబ్దాలకు చెందిన శాసనాలలో వ్యవసాయ రంగానికి చెందిన కాంపులు, రెడ్లు, వెలమలు తమని తాము సత్ శూద్రులు, శ్రీ వైష్ణవులుగా చెప్పుకొన్నారు. వీరిలో ఆలయాలుకు అంకితమైన వారిని దాసులుగా పిలుచుకొన్నారు. ఈ సత్ శూద్రులు 12 సంవత్సరాలు మంచి నడవడిక ప్రదర్శించితే ఆలయ కార్యక్రమాలలో ప్రధాన పాత్ర వహించవచ్చునని పంచరాత్ర, పరమసంహిత గ్రంథం ఆమోదించింది. ఆ విధంగా పల్నాటి బ్రహ్మనాయుడు “ఆచార్య” స్థానాన్ని పొందాడు
దాస నంబిలు ఆలయానికి చెందిన బృందావనాలను సాకుతూ, ఆలయంలోని వివిధ అర్చనలకు అవసరమైన దండలను, పూలను అందించేవారు. వీరి పోషణ కొరకు భక్తులు భూములు దానంగా ఇచ్చేవారు. (శాసన సంఖ్య 1238 SII V- శాసన వాక్యము- తోట దాసరులు ఇద్దరకు కూడుజీతమునకు//)
కప్పరం దాసరుల పేరుతో ఆలయంలో ఉత్సవ విగ్రహాలను సంరంక్షించే ప్రత్యేకమైన దాసులు ఉండేవారని సా.శ.1637 నాటి నంద్యాల తామ్రశాసనం ద్వారా తెలుస్తున్నది.
.
2. దాసరులు

కాపు, గొల్ల, బోయి, కురుంబ, మాల కులాలనుంచి వైష్ణవధర్మ ప్రచారం కొరకు సన్యసించిన వారిని దాసరులు అంటారు. వీరిలో బోయ, మాల కులాలనుంచి వచ్చిన దాసరులు సహపంక్తి భోజనానికి అనర్హులు. (Castes and Tribes of southern India, Thurston, pp. 112-118).
ఈ దాసరులు, వైష్ణవ ఆచార్యులను అనుసరిస్తూ, ఊరూరూ తిరుగుతూ వారికి సహాయకులుగా ఉండేవారు. మిగిలిన సమయాలలో భిక్షమెత్తుకొని జీవించేవారు. శంఖము, దీపపు సెమ్మె, గంట లేదా కిన్నెర ధరించి వైష్ణవ గీతాలు పాడుకొంటూ ధర్మ ప్రచారం చేసేవారు. వీరు పరయా (మాలమాదిగ) విష్ణు భక్తులకు తీర్ధప్రసాదాలు అందించేవారు.
.
3. అంత్యజులు

రామానుజాచార్యుడు చేసిన ధార్మిక విప్లవ ఫలితంగా వైష్ణవ సంప్రదాయం సమాజంలో అంత్యజులుగా చెప్పిన చండాలురను కూడా చేరింది. రామానుజుని వద్ద అనేకమంది శూద్ర శిష్యులు ఉండేవారు. పంచములకు ఆలయదర్శనాన్ని కల్పించాడు రామానుజుడు
ఆంధ్రదేశంలో వైష్ణవభక్తులైన పంచములలో బ్రహ్మనాయుడి వద్ద సైన్యాద్యక్షుడిగా పనిచేసిన మాల కన్నమదాసు గొప్ప వీరునిగా, విష్ణుభక్తునిగా చరిత్రలో నిలిచిపోయాడు.
.
4. దొమ్మరులు

వైష్ణవ ప్రభావంచే ఆంధ్రదేశంలో దొమ్మర కులం గౌరవ స్థానాన్ని పొందినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తున్నది. దొమ్మరులు గ్రామాలలో తిరుగుతూ వ్యాయామ విన్యాసాలను ప్రదర్శించి గ్రామస్థులను . ఆనందపరచినందుకు, వారి పోషణకుగాను గ్రామంలోని ప్రజలు కొంత ధనాన్నిగాని, ధాన్యాన్నిగాని వాళ్లకు చెల్లించేవారు. దీనిని దొమ్మరి పన్ను అంటారు.
వైష్ణవభక్తులైన దొమ్మర కులస్థులు తమకు వచ్చే ఈ ఆదాయంలో కొంతభాగాన్ని దేవుడికి సమర్పించుకొన్నట్లు కొన్ని శాసనాలు కలవు.
కడపజిల్లాలోని మోటకట్ల తిరువెంకటనాథునికి - పద్మరాజు కొడుకైన బసవరాజు తనకులానికి వచ్చే దొమ్మరపన్ను సమర్పించుకొన్నట్లు శాసనం వేయించాడు. (A.R.No. 11 of 1968-69.).
అదే విధంగా గుంటూరు జిల్లాలోని గోపినాథ ఆలయంలోని ఒక శాసనంలో – దొమ్మరి కులపెద్దలు అయిన చెంకు రెడ్డి, నరసానేడు, కొమార వీరయ్య లు అయినవోలు గ్రామ ప్రజలు కట్టాల్సిన దొమ్మరి పన్ను ను దేవునికి సమర్పించుకొన్నట్లు ఉన్నది. ఇలాంటి శాసనాల ద్వారా ఆనాటి సమాజంలో దొమ్మరుల సామాజిక హోదాను, ఆర్ధిక స్థితిని, వారి ఆత్మవిశ్వాసాన్ని ఊహించవచ్చును.
ఇది రామానుజాచార్యుని వైష్ణవ బోధనలు తెచ్చిన సామాజిక మార్పుగా భావించాలి.
***
రామానుజాచార్యుని ఉద్యమ ప్రభావంతో భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం లాంటి కావ్యాలు వచ్చాయి. సర్పవరం, భీమవరం, శ్రీకాకుళం, బాపట్ల, అహోబిలం, తిరుమల లాంటి ఆలయాలలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం అంగరంగవైభోగాలు జరగసాగాయి.
 
.
“మనం నాలుగు వర్ణాలకంటే క్రిందకు దిగి చండాలుడిని చేరాలి… వారిలో కూడా నిజమైన విష్ణుభక్తులు ఉన్నారు” అన్న ఆనాటి శ్రీ రామానుజాచార్యుడి సమతా దృష్టి [1] నేడు ఆయనను సమతామూర్తిగా నిలిపాయి.
రామానుజాచార్యుని కార్యక్షేత్రం అంతా ఆంధ్రరాష్ట్రంలో ఉండింది కనుక సమతామూర్తి విగ్రహం ఆంధ్రాలో ఎక్కడైనా నెలకొల్పి ఉన్నట్లయితే మరింత ఔచిత్యవంతంగా ఉండేది.

బొల్లోజు బాబా

[1]Social Mobility and Medieval south Indian Hindu sects Burton Stein

No comments:

Post a Comment