Wednesday, December 31, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు - బొల్లోజు బాబా


నా మిత్రులకూ, వారి మిత్రులకూ

నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ స్నేహానికి ధన్యవాదములు.
*******

ఈ క్రింద మరి కొన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు*


నీ కొరకై నా ఆకాంక్ష.
ఈ నూతన సంవత్సర దినాన నీ కోసం నేను కోరే కోర్కెలు.

నీ హృదయంలో శాంతి
కుటుంబము, మిత్రుల నుండి ప్రేమ
నీ మార్గాన్ని నడిపించే విశ్వాసం నిరంతరమూ వెన్నాడే ఆశ
రోజుల్ని వెలిగించే సూర్యకాంతి
దేవలోకపు
తారల అనుగ్రహం.
రేపున్నదని తెలిపే ఇంద్రధనస్సులు.
కరుణను పలికించే కన్నీటి చుక్కా
ప్రేమను నింపుకొనే హృదయం
అన్నింటినీ మించి
నీచేయిలో నాచేతి స్పర్శా
నీవు తడబడినపుడు,
నీకు ఆనందం అందించటానికి
ప్రేమనందించటానికి,
నాతో పంచుకొన్న నీ స్నేహపు మధురిమల్ని
తిరిగి ఇవ్వటానికి నేనున్నాను అనే జ్ఞానం

సదా నీవెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ
*******



మరొక కొత్త సంవత్సరం మనముందుంది

మరొక సంవత్సర ఆనందం తెచ్చింది.
బాధల్నీ, భయాల్నీ, అనుమానాల్నీ విడనాడి
ప్రేమించుకుందాం, ఆనందిద్దాం, పంచుకుందాం.
*******


ఈ కొత్తసంవత్సరాన్ని ఈశ్వరుడు మనకు ప్రసాదించాడు.
ప్రతీదినమూ నూత్నోత్సాహంతో జీవించటానికై
ఎత్తులకు ఎదుగుతూ, ఉత్తమంగా ఉండటానికై.

*******



ఈ నూతన సంవత్సర దినాన.
నీ ప్రేమ నీడలో ఊయలలూగుతూ
నీ పెదవుల మృధుత్వాన్ని స్పర్శిస్తూ
నిన్ను నా హృదయానికి దగ్గరగా తీసుకొంటూ
నీ సమక్షంలో నేను ఒక అనంత స్వప్నాన్ని
స్వప్నిస్తున్నాను,

*******


నీవు స్వప్నించాలనుకొన్న ప్రపంచాలను స్వప్నించు
నీవు ప్రయాణించాలనుకొన్న దూరాలను సాగించు.
నీవెలా ఉండాలనుకొన్నావో అలానే ఆవిష్కరించుకో
ఎందుకంటే
నీ చేతిలో ఉన్నది ఒక్క జీవితమే
నీవు ఏపని చేయాలనుకొన్నా
ఉన్నది ఒక్క అవకాశం మాత్రమే.

*******


రాబోయే సంవత్సరంలో నీ కలలన్నీ
నిజంకావాలని ............
*******


శుభాశీస్సుల కవాతు
మిమ్ములను వెతుక్కూంటూ వస్తున్నది.
*******


ఒక నూతన సంవత్సరం విచ్చుకొంటూంది
-- ఇంకా పూర్తిగా విచ్చుకోని రేకల వెనుక సౌందర్యాన్ని దాచుకొన్న కుసుమంలా.
*******


ఓ పుస్తకాన్ని మనం తెరుస్తాం.
దానిపై కొన్ని మాటల్ని వ్రాసుకుంటాం.
ఆ పుస్తకం పేరు అవకాశం.
దాని మొదటి పేజీ నూతన సంవత్సర దినం
*******


మరో అవకాసం వచ్చింది.
తప్పులను సరిదిద్దుకోవటానికై
శాంతిని పెంపొందించుకోవటానికై
ఒక సంతోష తరువుని నాటటానికై
మరిన్ని ఆనందగీతాల్ని ఆలపించటానికై.
*******


ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం
వెలుగులు చిమ్మే బాణాసంచా కాంతులలో
పాత సంవత్సరానికి ముద్దులతో వీడ్కోలు పలికి
కొత్త సంవత్సరాన్ని సాదరంగా పిలుద్దాం
*******


విషాదం రేపటి బాధల్ని తగ్గించలేదు.
నేటి ఆనందాల్ని మింగేస్తుంది.
మిత్రమా,
నీ బాధల్ని తరిమికొట్టే
నూతన సంవత్సరాన్ని కాంతులతో
సంగీతంతో అహ్వానిద్దాం రా.
*******


ఈ కొత్త సంవత్సరం
నీవు నడిచిన అన్ని సంవత్సరాలలో కెల్లా
ఉత్తమమైనది గా ఉండాలనీ
ప్రతీ క్షణం గతించిన ఘడియ కన్నా మెరుగ్గా సాగాలనీ
నీ తీయని స్వప్నాలు ఫలించాలనీ
ప్రతి దీవననూ గుర్తించి, ఆనందించగలిగే
అవకాసం కలగాలనీ
ఆకాంక్షిస్తున్నాను.

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మరెన్నో.

*******


నీకివే నా శుభాకాంక్షలు
నూతన ఆశయాలు గుభాళించే క్షణాలు అన్నీ ఫలించాలి నీ ప్రతీ నడకలో
నూతన సంవత్సర శుభాకాంక్షలు
*******


ఈ కొత్త సంవత్సరపు ప్రతీరోజూ
అష్టైశ్వరపు దీప కాంతులలో ప్రకాశించాలని
ఆకాంక్షిస్తూ
*******


నూతన సంవత్సరపు ఈ పచ్చని క్షణాన
ఆకుల వర్ణాలు భువంతా పరచుకోనీ.
*******


కొత్త ప్రమాణాలు,
కొత్త వాగ్ధానాలు
కొత్త నిర్ణయాలు
*******


అరవిరిసిన సుమాల అద్భుత స్ఫూర్తితో
నూతన సంవత్సర శుభాకాంక్షలు
*******


మేల్కొను, ఉదయించు, ఒక కొత్త ప్రపంచంలోకి
ఐశ్వర్యాలు ఆనందాలూ వర్షించనీ.
*******


నీ భవిష్య దినాలలో శాంతి పల్లవించుగాక!
*******


మన స్నేహం ఒక గులాబీ వంటిది.
మృధురేకల క్షణాలెన్నో
ఈ సమయంలో గుభాళిస్తున్నాయి.
ఒకటే తేడా, గులాబీ వాడిపోతుంది.
*******



జీవించటానికి వేడుక చెయ్యి లేదా వేడుక కోసమే జీవించు.

*******


ఈ సంవత్సరం
జీవనాద్భుతాలను ఆస్వాదించే అదృష్టం కలుగుతుందని ఆశిస్తూ......
*******


మార్గాన్ని కాంతిమయం చేస్తున్న కొత్త సంవత్సరానికి
ఆహ్వానం
*******



బొల్లోజు బాబా

*
వెబ్ లో దొరికిన కొన్ని గ్రీటింగులకు తెలుగు అనువాదం మాత్రమే నా స్వంతం కావు

Monday, December 29, 2008

స్వేచ్ఛ

1. స్వేచ్ఛ

చీకటి గదిలో కూర్చొని
సీసాలో బంధించిన
మిణుగురులను చూస్తూ
మురిసిపోతుంది మా అమ్మాయి.

ఆరు బయటకు వచ్చి
సీసా మూత తీసాను.
ఆకాశం సీసా నిండా మిణుగురులే!
చిన్నారి కళ్లల్లో వెన్నెల మెరుపు.



2. వెన్నెల సీమ

కొబ్బరాకుల వెనుక
నిశ్శబ్ధ చంద్రోదయం.
వెన్నెల చక్కిలి గిలికి
రాలిన కొబ్బరి పూత.



బొల్లోజు బాబా

Tuesday, December 23, 2008

నాచుట్టూ రెండు దేశాలు

బజారులన్నీ జనాలతో బలిసినయ్.
డబ్బు, డబ్బు, డబ్బు
కుంభవృష్టి గా కురుస్తూంది.
కొనుగోలు శక్తి మధ్యాహ్నపు టెండై
ప్రకాశిస్తోంది.

భాషతో నిమిత్తం లేకుండా
సర్వాంగాలతో సంభాషించే ఆటకత్తెలా
మూలాలకు దూరమైన ధనం
వింతైన నృత్యం చేస్తూంటుంది.

ప్రపంచ కుబేరుల జాబితాలో మనవాళ్ళు .
ఏటా పెరుగుతున్న కోటీశ్వరుల సంఖ్య.
లక్షల ఎల్కేజీ చదువులకై బారులు తీరిన జనం.
కొత్తకారు టెస్ట్ డ్రైవ్ కై పోటీ.
అక్షయ తృతీయనాడు స్వర్ణ విస్ఫోటనం.
రాడో వాచీలు, రేబాన్ అద్దాలు, పెద్ద తెర టీవీలు, కోట్లు పలికే విల్లాలు
రవ్వల దుద్దులూ, డిజైనర్ దుస్తులూ, డిజిటల్ దినాలు.
పబ్బులూ, డిస్కోతెక్ లూ, ఏరోడ్రోములు, హెలికాప్టర్లు,
చలువరాతి హర్మ్యాలు , ఇంద్ర భోగాలు, చంద్రయానాలు. .

నా దేశపు దరిద్రమంతా ఎక్కడకు పోయింది?

చేటలోని రోజుల శిశువు ఎర్రని ఎండలో భయం భయంగా చూస్తుంటూంది.
బోరుబావిలో పడిన గ్రీజు మరకల బాల్యానికి ఊపిరాడదు.
కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది.
సెంటు స్థలం కోసమై పోరాడే ప్రాణాన్ని తూటా తన్నుకు పోతాది.
అమ్మకానికి శిశువులు, ఇక్కడ స్త్రీ గర్భాగారం.
రోడ్డు పక్క డేరాలనిండా నిర్వాసిత గిరిజనులు.
హైవే పక్క మెరుపుల చీర చెయ్యూపుతూంటుంది.
"బ్లడీ బెగ్గెర్స్ బ్లడీ ఇండియా" BMW కారు అద్దం పైకి లేచింది.
ద్రావకం మింగిన కంసాలి , నూలు పోగుకు ఉరేసుకొన్న నేతకాడు,
పురుగుమందూ-పత్తిరైతూ, లాడ్జీలో కుటుంబం సెన్సెక్స్ హత్య
ఇక్కడ చావంటే ఎక్స్ గ్రేషియా - ఎక్స్ గ్రేషియా కోసమే చస్తారు.

నా దేశపు సౌభాగ్యమంతా ఎక్కడికి పోయింది?

ఇక్కడ రెండు దేశాలు కనపడుతున్నాయి
ఒకటి సంపన్న భారతం
మరోటి దరిద్ర భారతం.

బొల్లోజు బాబా

Thursday, December 18, 2008

సంవత్సరీకాలు


నీవిక లేవన్న వాస్తవానికి
చెట్టుతొర్రలో పక్షిపిల్ల ఆర్తనాదంలా
హృదయం కీచుమంది.

మెతుకు వృధా, బతుకు వృధా అంటూ
తీతువు పిట్ట అరుచుకుంటూ సాగింది.

ఆ లోహ క్షణాల రంపపు కోతకు
నిలువెత్తు జీవన వృక్షమూ
కన్నీరు చిమ్ముకుంటూ నేలకొరిగింది.

కాలం ఎంత చిత్రమైనది!
నీవులేవన్న వాస్తవం
ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది.

కలలూ, కన్నీళ్లు
ధరలు, దరిద్రాల వంటి
దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ
ఎంతదూరం నడిచేసాను!


బొల్లోజు బాబా

Sunday, December 14, 2008

బుల్లి కవితలు పార్ట్ II

ఆవకాయ్.కాంలో ప్రచురింపబడిన నా కవితలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
http://www.aavakaaya.com/articles.aspx?a=l&categoryId=1


1. వాయిదా

నెలవంకా నేలా
ముచ్చట్లాడుకొంటున్నాయి.

ఎందుకనో నెలవంక గొంతు
పున్నమినాటంత బలంగా లేదు.
నేల తన గాలి ఊసులతో
ఊదర కొడుతుంది.

చీకటి చాపను మడుచుకొంటూ
పొద్దుపొడిచింది

చర్చలు వాయిదా పడ్డాయి.

By బొల్లోజు బాబా, Nov 5 2008 7:28PM



2. సాఫల్యం

ఏం బుద్ది పుడుతుందో
కొద్దికొద్దిగా నన్ను శ్వాసించటం
మొదలు పెడతావు.
నెమ్మది నెమ్మదిగా నన్ను
ప్రేమించానని తెలుసుకొంటావు.

ఆ క్షణమొక పుష్పమై
నీ మది కిటికీలోంచి తొంగిచూసి
నాకై వెతుకుతుంది.

నీ జీవితంతో నాస్వప్నాలు ఫలించాయి.

By బొల్లోజు బాబా, Nov 12 2008 4:09PM


3. మార్పు

చాలా కాలం తరువాత కలిసాం.
నా హృదయంలో ముద్రించుకొన్న
ఆ "నువ్వుని" నీలో ఎంత
శోధించినా కనిపించలేదు.

మనం కలుసుకోకుండా ఉంటే
ఎంత బాగుణ్ణు!

By బొల్లోజు బాబా, Dec 12 2008 5:16PM


బొల్లోజు బాబా


బ్లాగ్మిత్రులకు బ్లాగర్స్ డే శుభాకాంక్షలు


బ్లాగ్మిత్రులకు బ్లాగర్స్ డే శుభాకాంక్షలు

Tuesday, December 9, 2008

బుల్లి కవితలు పార్ట్ I

ఆవకాయ్.కాంలో ప్రచురింపబడిన నా కవితలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ కవితలపై వచ్చిన కామెంట్లను క్రిందఇవ్వబడిన లింకులో చూడగలరు.
http://www.aavakaaya.com/articles.aspx?a=l&categoryId=1


1
దొమ్మరి పిల్ల
మృత్యు తీగపై మోళీ కట్టే బాలిక
అడుగులో అడుగేసుకొంటూ నడుస్తూంది.
ఆమె పట్టుకొన్న వెదురుగడకు
ఒకవైపు జీవిక, మరో వైపు బాల్యం
వేలాడుతున్నాయి.

చిన్న అపశ్రుతి
రోడ్డుపై రక్తపు మరక.

దేముడు
పని ఇంకెప్పటికి నేర్చుకొంటాడూ?

By బొల్లోజు బాబా, Dec 7 2008 7:౫౩


2
సాంగత్యం
బయట
ఉరుములు మెరుపులతో
కుంభవృష్టిగా వాన.
అర్ధ నిమీలిత నేత్రాలతో
ప్రశాంతంగా నిద్రిస్తున్న నీవు .
సన్నిధిలో ఎంతటి
భరోసా ఉంటుంది.

కామెంట్లు 3
By బొల్లోజు బాబా, Nov 30 2008 7:59PM


3
ఆటో లోంచి పాట
మూడు చక్రాల స్పీకరు బాక్సు
ఏదో పాటను మోసుకుంటూ
సాగిపోతోంది.

మద్దెల అడుగుల చప్పుడు
దాని రాకనూ, పోకనూ
చక్కని శబ్దచిత్రంగా లిఖించింది.

పిట్టలు ముసిరిన చెట్టు
సంజెవేళలో వెదచిమ్మే
మువ్వల శబ్దాల్ని
రోడ్డుపై చల్లుకుంటూ పోతోంది ఆటో.

హడావిడిలో పట్టించుకోంగానీ
ఆ పాటకు జ్ఞాపకమేదో రేగుతాది
కలలో మెసలటానికి.

కామెంట్లు 3
By బొల్లోజు బాబా, Nov 25 2008 4:48AM



బొల్లోజు బాబా

Friday, December 5, 2008

ప్రవాసి కలలు


చీకటి పడింది
పగటి వేషం తీసేసి
సుగంధ స్వప్నాల లోతుల్లోకి
నిశ్శబ్ధంగా జారిపోయాను.

కొబ్బరి పుల్ల తో కత్తి యుద్దం చేస్తుండగా
చెడ్డీ జారిన తమ్ముణ్ణి చూస్తూ
" షేమ్ షేమ్ పప్పీ షేమ్" అంటూ
పువ్వులా నవ్వుతుంది పాపాయి.
ఆ నవ్వుల పరిమళంలో తడుస్తూ
నువ్వూ నేనూ.

చెడ్డి పైకి లాక్కొని
కాంతారావు కాస్తా రాజనాలగా మారిపోయాడు.
మనిద్దరి చుట్టూ వాళ్లిద్దరూ
గిర.. గిర.. గిర.. గిర...


పూర్వానుభవాల్ని స్వప్నాల్లో
చూసుకొంటోంది హృదయం
వసంతార్భాటాల్ని విత్తనాల్లో
దాచుకొన్న వనంలా.

బొల్లోజు బాబా



Monday, December 1, 2008

అనుమానప్పక్షి

లేగ దూడ
కట్రాట గుంజుకు పోయింది.
దాచేసుకొన్న పాలను
చేపుతోంది ఆవు.
దూడ మెడలో గంట
దొంగలిద్దరినీ పట్టించేసింది.

మట్టుపైని అణుగుకోడి
ముక్కుతో గుడ్లను మరోసారి
లెక్కెట్టుకొని, దగ్గరకు లాక్కొంది.



బొల్లోజు బాబా