Tuesday, September 23, 2008

ఆకుపచ్చని తడిగీతం



మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వాన కురుస్తానే ఉంది.

నల్లని మంచుగడ్డ కరిగిపోయింది.

ప్రశాంత తరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేశించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది.

సూర్యకిరణాల కిలకిలారావానికి
లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది.

తీగమొక్కలు జారిపోయిన పట్టును
మళ్లా వెతుక్కొంటున్నాయి.

తడినేలపై పడి పరావర్తనం చెందిన
లేకిరణాలు, ఆకుల క్రింద దాక్కొన్న
చీకటిని తరిమేస్తున్నాయి.

చెట్ల ధూళి వాన గుంటలలో చేరి
ఆకుల అందాలను చూస్తూ విస్తుపోతోంది.

మబ్బు అంచుల జరీ మెరుపులతో
పోటీ పడే ఈకల కోసమై
ఓ పక్షి శ్రద్ధగా ప్రీనింగ్ చేసుకొంటూంది.

తలంటుకొన్న యవ్వనిలా శోభిస్తున్న
పొగడ చెట్టు గాలికిరణాలలో
పత్రాలను ఆరబెట్టుకొంటూంది.

ఉదయపు గొంతులోంచి
ఆకుపచ్చని తడిగీతం
రెక్కలుకట్టి ఎగురుతూంది.
మేఘాలవతల వరకూ
సౌందర్యం పరచుకొంది.

తటాకం అంతవరకూ భద్రంగా
దాచుకొన్న తామరదుంపకు
కొత్తచిగుళ్లు లేస్తున్నాయి
నేల ఆలపించే ప్రాచీన గీతాన్ని చిత్రించటానికై.
************


తడిచిన సీతాకోకచిలుక
కవిత్వంపై వాలి రెక్కలల్లార్చింది.

బొల్లోజు బాబా

19 comments:

  1. అసలు ఈ పద చిత్రాలు,భావకల్పలూ మీకు ఎలాతోస్తాయండీ బాబూ!అహ...బాబా!
    నల్లని మంచుగడ్డ కరిగిపోవడం,వందగుమ్మాల వెదురుపొద,సూర్యకిరణాల కిలకిల,తలంటుకున్న యవ్వనిలాంటి చెట్టు ఒక్కొక్కటి అక్షరలక్షలు అంతే!

    ReplyDelete
  2. బాబా గారు,
    అధ్బుతం .....నిజంగా ఎంత బావుందో.

    ప్రకృతి మాత ఒడిలో కూర్చుని తదేకంగా ఆ తల్లి చేసే వింతలు, విడ్డూరాలు చూపే బాలుడిలా......
    ప్రకృతి కన్యను చాటు నుంచి చూసి ఆమె చూపే హోయలు, అందాలకు పరవశించే రసికుడిలా.....

    నిజంగా మీ కవితా దృష్టికి జోహార్లు. అందుకే అన్నారు "రవి కాంచని చోటు కూడా కవి కాంచునట" అని.

    "సూర్యకిరణాల కిలకిలారావానికి
    లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది."

    "వందగుమ్మాలతో వెదురు పొద
    స్వాగతం పలికింది."

    "సూర్యకిరణాల కిలకిలారావానికి
    లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది."

    ఎంత రమణీయమైన ద్రుశ్యీకరణలో....వావ్.

    ReplyDelete
  3. మళ్ళీ నా collection websiteలోకి వెళ్లి పోయింది మీ కవిత. అనుమతి ఉంది అని assume చేసేసి పెట్టేసుకున్నాను.

    ReplyDelete
  4. మబ్బు అంచుల జరీ మెరుపులతో పోటీపడే ఈకలకోసం ఓపక్షి శ్రద్దగా ప్రీనింగ్ చేసికుంటుంది.....ఈలైన్లు చాలా బావున్నాయ్....జంతుశాస్త్రం తో పరిచయం వుంటే "ప్రీనింగ్" వెంటనే వెలుగుతుంది కదూ...

    ReplyDelete
  5. కవిత పేరే చాలా బావుంది.. ఇంక కవిత గురించి చెప్పడానికి మాటలు లేవు నా దగ్గర!!
    అసలు ఎలా రాయగలరండీ మీరు ఇంత ఫ్రీక్వెంట్ గా ఇంత అద్భుతమైన కవితల్ని!!

    ReplyDelete
  6. బాగుంది, బాబా గారు!

    ReplyDelete
  7. మీ మనసనే భావ సముద్రానికి శతకోటి వందనాలు! మీ బ్లాగు పేరు కనపడితే చాలు ఆత్రుత గా చదివేయాలన్నంత ఆరాటం!

    మేఘాలు, నేలా చుంబించుకున్నట్లున్నాయి...!

    వంద గుమ్మాల వెదురుపొద..

    చెట్ల ధూళి....ఈ లైను మరీ బాగుంది.

    మబ్బు అంచుల జరీ మెరుపులతో...

    తలంటుకున్న యవ్వనిలా శోభితున్న పొగడ చెట్టు,

    తడిచిన సీతాకోకచిలుక.....

    ఏదని చెప్పను! ఇంత అందమైన భావాలు మీకెలా తోస్తాయి? మాకెందుకు తోచవు!

    కవి హృదయం ఇంత లోతైనదా? ఇంత అందమైనదా? ఇంత గొప్పదా?

    ReplyDelete
  8. సూర్యకిరణాల కిలకిలారావానికి
    లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది.

    తడినేలపై పడి పరావర్తనం చెందిన
    లేకిరణాలు, ఆకుల క్రింద దాక్కొన్న
    చీకటిని తరిమేస్తున్నాయి.

    నిజానికి ఆకులమాటున దాక్కొన్న చీకటిని ఆ రవి తొలగించాడో లేదో గానీ, బాబాగారూ మీ లోని కవి ఆ అధ్బుతాన్ని ఆవిస్కరించాడు. చాలా బాగున్నాయి మీ భావనలు.కొన్ని వందల జోహార్లు, కొన్ని వేల హ్యాట్సాఫ్ లు.

    ReplyDelete
  9. ఈ ఉదయం కొత్త ఉత్సాహం వేయి గుమ్మాల వెదురు పొదల్లోంచి దూసుకొని వచ్చి నన్ను కమ్మేసింది.
    చాలా భావాలు, అనుభావలు తుమ్మెదలై ఎగురుతున్నాయి.
    కొంతసమయం మౌనంగా ఆనందించడం తప్ప ఏమీ చెయ్యలేను.


    అభినందనలు

    ReplyDelete
  10. మహేష్ గారు
    అంతే నంటారా? థాంక్సండీ.

    భావకుడున్ గారు
    మీవివరణాత్మక వర్ణన చాలా చాలా బాగుందండీ. మీకెప్పుడూ అనుమతి ప్రశ్నే ఉదయించకూడదు. మీరు నా కవితకు పట్టం కట్టి, మీబ్లాగులో స్థానం కల్పిస్తాననటం అదృష్టం కాక మరేమిటి?

    థాంక్యూ.
    భగవాన్ గారూ,
    ఈ కవితలో మన జూవాలజీ వాసన తగిలింది కదూ? ప్రీనింగ్ అనే మాట అందరికీ అర్ధమవుతాదనే భావంతో ధైర్యంగా వాడేసాను. ఎవరూ అడగలేదంటే అర్ధమయందనే భావిస్తున్నాను. నిజానికి ప్రీనింగ్ ను శ్రద్ధగా చూస్తే ఎంత రమణీయంగా ఉంటుందండీ?

    నిషిగంధ గారు,
    థాంక్సండీ. మీరందరూ ఇచ్చే పాట్టింగే మేడం.
    ఈ కవితకు స్పూర్తి, చానాళ్ల క్రితం ఒక బ్లాగరిని (గుర్తులేదు మిమ్ములనే అనుకుంటాను) సూర్యోదయం పై కవిత వ్రాయండి అని ఎవరో కామెంటరు కోరారు. ఆ బ్లాగరి వ్రాయలేదనుకుంటా. సరే ప్రయత్నిద్దాం అని మొదలుపెడితే ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్లి పోయింది ఈ కవిత.


    నరసింహ గారు,
    థాంక్సండీ.

    నెటిజన్ గారు,
    థాంక్సండీ.

    సుజాత గారు,
    :-) :-) :-) :-) :-) :-) :-) :-) :-) :-) :-) :-)

    అంతకు మించి నేనేమి చెప్పగలను మేడం గారూ.

    పూర్ణిమ గారు,
    థాంక్సండీ.

    మురళి గారు,
    భావాల బట్వాడా సరిగానే జరిగినందుకు చాలా ఆనందంగా ఉందండీ.

    జాన్ హైడ్ గారు,
    ప్రకృతి పై కవిత్వానికి మీరు స్పందించే తీరు ఆనందంగా ఉంటుందండీ. (ఇది వరలో నా వెన్నెల నావనెక్కి అనే కవితకు మీస్పందనను బట్టి)

    ఏవైతే కవితలో మిస్ అవుతాయో వాటిని చక్కగా కామెంటు ద్వారా చెప్పి కవితకు సంపూర్ణత ను సంతరించి పెట్టటం, చదూతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో.
    థాంక్సండీ.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  11. బ్లాగుల్లో వస్తున్న కవిత్వంతో ఒక సంకలనం చేయాలని ఓ మిత్రుడు అన్నారు. అయితే ఓ విషయం కార్యరూపం దాల్చలేదు. కానీ మీ "ఆకుపచ్చని తడిగీతం" చదివిన తర్వాత మీ కవితతోనే మొదలపెట్టాలని అనుకుంటున్నాను.

    ReplyDelete
  12. బాబా గారు,

    మీకు అభ్యంతరం లేకపోతే మీ కవితలన్నింటినీ ప్రింట్స్ తీసుకోవాలని ఉంది! నా సాహితీ మిత్రుల గుంపు చాలా పెద్దదే. వాళ్లని కలిసినపుడు మీ బ్లాగుని, కవితలని పరిచయం చెయ్యాలని ఉంది. అనుమతి ఇస్తారుగా!

    మీరు బ్లాగరులకు న్యాయం చేసి పత్రికలకు అన్యాయం చేస్తున్నారని బాధగా ఉందండీ నాకు!

    ReplyDelete
  13. చాలా కృతజ్ఞతలు బాబా గారు- నా కవిత చదివి మెచ్చుకున్నందుకు. మీ కవితలు ఈరోజే చదివాను. జీవితాన్ని మదించి రాసిన ఆ కవితల్లో ఒక్కొక్క అక్షరం చాలా స్ఫూర్తి దాయకంగా వుంది. చాలా సంతోషం.
    - పవన్ గణేష్

    ReplyDelete
  14. సుజాత గారూ
    నా కభ్యంతరం ఎందుకుంటుందండీ. బ్లాగులో పెట్టిందే పదిమందీ చూడటానికి. ఆ పని మీరు కూడా చేస్తానంటే అంటకు మించి ఆనందమేముంటుందండీ.

    గనేష్ గారూ
    థాంక్సండీ.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  15. చాలా బావుందండీ.
    ప్రీనింగ్ చేసుకుంటున్న పిట్టల్ని చూడ్డం మీరన్నట్టు నిజంగానే చాలా సరదాగా ఉంటుంది.

    ReplyDelete
  16. Beauty!!.. I just encountered it.

    chaalaa.. chaalaa.. chaalaa.. .. .. baagundi.
    inta baagaa marevvaroo raayalenattugaa. mee post mitta madhyaahnam chadivinaa sare, vaariki prratah paravasham kalugutundi.

    ReplyDelete
  17. బాబా గారూ,

    కృతజ్ణున్ని.నా "ఆశయాల.." కవిత మీకు నచ్చినందుకు ధన్యున్ని.మీలాంటి సహృదయుల ప్రోత్సాహం, కొత్తపాళీ లాంటి మిత్రుల అభిమానం నన్ను మళ్ళీ కవిత్వం వైపు మరలిస్తున్నాయి.ఈ మధ్య మీ కవితలు రెగ్యులర్ గా చదువుతున్నాను. తిలక్ నూ, చలాన్నీ, ఇస్మాయిల్నీ కలిపి- మీదైన శైలిలో మీరు తయారు చేస్తున్న కవితామృతాన్ని ఆస్వాదిస్తున్నాను. ఆ అనుభూతిని వ్యక్తం చేయలేక
    'బాగుంది, అద్భుతం ' అన్న మాటలు సరిపోక comment రాయకుండా మౌనాన్ని
    ఆశ్రయిస్తున్నాను.
    రోజువారీ యాంత్రిక జీవితపు చెత్తా చెదారాలు అంటకుండా, ప్రతి చిన్న అనుభూతికీ చలించే రసవీణ లాగా ఇంకా హృదయాన్ని నిలుపుకోగలిగిన మీకు Hats off!

    ReplyDelete