Sunday, September 7, 2008
తిరిగి భవిష్యత్తులోకే ......
నెత్తిన దిగే మేకుల్లాంటి బూతు మిళితపు ఆజ్ఞల్లో
నేల చూపుల కళ్ళు స్రవించే నెత్తుటిబూడిదలో
సముద్రపొడ్డున గవ్వలేరుకోవాల్సిన
బాల్యమంతా క్షతగాత్రుని రోదనయినపుడు....
చందనపు పూతక్రింద చంద్రుని వెన్నెలతో
పోటీ వచ్చే మేని ఛాయై శోభిల్లవలసిన
యవ్వనాన్నంతా గోరింటాకు చేసి
విటుల కండరాల కోరలకు అద్దే పరిస్థితుల్లోనో లేక
కండరాల్ని సముద్రం చేసే ప్రయత్నంలోనో
రొచ్చుగుంటయిన దేహంతో
అంటించబడ్డ క్రొవ్వొత్తిలా (ఎవరంటించారు?)
యవ్వనం రాత్రికి రాత్రి హతమైనప్పుడు......
కాలం ఊయలీకరించాల్సిన జీవితం
బాధల వృక్షానికి శిలువవేయబడి
గాయాల్ని శ్వాసిస్తుంటే......
మీరాశించే పరిణతి మాకెక్కడ సాధ్యం?
మీరు శాసించే నాగరికత మాకెక్కడ లభ్యం
అందుకే పచ్చబొట్ల వలువల్ని ధరించి
తిరిగి భవిష్యత్తులోకే మా పయనం
బొల్లోజు బాబా
(8-11-91 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన నా కవిత.
అందులో ఇంకా కొంచెం ఫ్రెష్ నెస్ ఉన్నట్లు అనిపించి పోష్టు చేస్తున్నాను. )
Subscribe to:
Post Comments (Atom)
కవిత చాలా అర్ద్రంగా ఉంది. కదిలించేలా ఉంది. ఇదే మంచి కవిత లక్షణం కూడాను. కాని మీ శైలిలో ఇప్పటికీ, అప్పటికీ (ఇంకెప్పటికీ కూడా రాదేమో) ఎంటువంటి మార్పులేదు. మీరు అప్పట్లో వాడిన పదాలు కూడా ఇప్పుడు ఉపయోగించే వాటిలానే ఎంతో హృద్యంగా ఉన్నాయి.
ReplyDeleteకాకపొతే నాకు ఒక చిన్న సందేహం (ఏంటో మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, డౌట్స్ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావ్ రా అని) తిరిగి భవిష్యత్తులోకి ఎలా పయనం అవుతారు? అంటే మీరు ఉపయోగించిన సందర్భం వారి భూతకాలాన్ని చూపించేదయితే ఓకే. లేక పొతే?
@బాబా గారు నా బ్లాగులో మీరు రాసిన కామెంట్ ఇప్పుడే చూసాను, ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరికి రావడం వల్ల చాలా బిజీ గా ఉన్నాను. అందుకని అందరి బ్లాగులు చదవటం కుదరడం లేదు. చదివే దానికే తీరిక లేనప్పుడు ఇక ఏం రాయగలను చెప్పండి. కానీ తొందరలోనే రాయగలనని అనుకొంటున్నాను.
ప్రతాప్ గారు
ReplyDeleteనాకూ అదే సందేహం వచ్చింది. సరదాగా
అప్పట్లో back to the future అని ఎదో ఒక పత్రికలో ఒక శీర్షిక చూసినట్లు గుర్తు.
ఇక ఇక్కడ సందర్భం
భవిష్యత్తులో అందరూ వలువలు లేకుండా పచ్చబొట్లు మాత్రమే ధరించి (ఈ నాగరికత అంతా నశించి పోతుంది- ఒక యుద్ధం వల్లో, మితిమీరిన అంతరాలవల్లో) ఒకప్పటి ఆటవిక మనిషులవలే నివసిస్తారని ఒక ఊహ.
అంటే ఇప్పటి గతమే రేపటి భవిష్యత్తు.
కనుక రేపటి భవిష్యత్తులోకే ప్రయాణించటం అన్నమాట.
ఈ కవిత నేపధ్యం: రోడ్డుపై ఒక సంచార బిచ్చగాళ్ల గుంపు దెబ్బలాట చూసాను. దానిలో స్త్రీలు పురుషులు బట్టలు చింపుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకొన్నారు. మనం పాటించే విలువల వలువలు ఊడదీబడ్డాయి. something like that. a weak memory too.
అంతే. ఇంతకు మించి నేనేమీ ఇప్పుడు వివరణ ఇవ్వలేనేమో. ఎందుకంటే ఆ వేవ్ లెంగ్త్ ఇప్పుడు కట్ అయిపోయింది.
అప్పటి భావావేశం పైపైనే తగులుతుంది కానీ లోతుల్లోకి పోలే్క పోతున్నాను.
మీరంటూంటే నాకూ అనిపిస్తుంది అప్పుడూ ఇప్పుడూ ఒకేలా రాస్తున్నానేమో నని. మారలేదేమో. మంచిదే నంటారా?
బొల్లోజు బాబా
good ! But one small doubt why do you always select baba as your pen-name
ReplyDeleteఅశ్వనిశ్రీ గారికి
ReplyDeleteథాంక్యూ
నా పేరు బొల్లోజు అహ్మదలీ బాబా
బొల్లోజు మా ఇంటిపేరు.
అహ్మదలీబాబా అనేది మా వూరికి దగ్గరలో కొత్తలంక అనే గ్రామంలో ఒక ముస్లిం యోగి పేరు. మా తాతగారికి సంతానం లేకపోతే వారి వద్దకు వెళ్లగా, "అబ్బాయ్ నీకు మగసంతానం లేదు ఆడ సంతానమే ఉంది. అని చెప్పారట. అలా మా అమ్మ పుట్టింది అట. అప్పటినుంచి మా ఇంటిలో ఆ యోగి ఫొటో మిగిలిన దేవుళ్ల పక్కన మా ఇంటిలో కొలుస్తూ ఉన్నాం. మా అమ్మ ఆ పేరు నాకు పెట్టింది.
నా పేరును బట్టి నన్ను చాలా మంది ముస్లిం అనుకొంటారు. చాలా సందర్భాలలో నాకు సరదాగానే ఉంటుంది. కొన్ని సార్లు ఇబ్బందులు తప్పవు. :-) ఉదా: నేను లెక్చరర్ ఇంటర్వ్యూకి వెళ్లినపుడు నువ్వు ఉర్దూలో పాఠాలు చెప్పగలవా అని అడిగారు. అవునంటే ఒక భయం. లేనంటే ఉద్యోగం రాదేమోనని అనుమానం. కాదనే చెప్పినా ఉద్యోగం వచ్చింది లెండి. అలా అన్నమాట. ఒక్కోసారి కొంత మంది సడన్ గా వచ్చి ఉర్దూలో ఎవేవో మాట్లాడేస్తారు. హిందీయే సరిగ్గా రాదు నాకు.
but i feel i am blessed more than what i deserve in my life, due to the grace of BABA.
thank you for the interest madam
bollojubaba
అంతే! అంతే!!
ReplyDelete