Wednesday, September 10, 2008
మా అమ్మాయి
నా భార్య స్వెటర్ అల్లుతోంది
రాబోయే బిడ్డకోసం.
*******
ఇంట్లోకి వసంతం ప్రవేశించింది.
పూవుల్నీ, సీతాకోక చిలుకల్ని,
సుగంధాల్నీ వెంటేసుకొచ్చింది.
ఆకాశం రాల్చిన పారిజాత సుమంలా
మా నట్టింట పాపాయి చందమామై వెలుగుతాది.
ఎదపై నడయాడిన మెత్తని పాదాలు
నెమలీక స్పర్శలను, గజ్జల కవిత్వాన్ని
హృదయంపై వదిలిపోతాయి.
ముద్దుముద్దు మాటలు
హృదయాన్ని చుంబించే వెన్నెల చినుకుల్లా
హాయి కాంతులు చిమ్ముతాయి.
చిన్నారి దేహం పుష్పించిన నాటినుండీ
పూడిక తీయని బావిలా
మా గుండె బరువెక్కుతూనే ఉంటాది.
ఏనుగాటలు, ఉప్పుమూటలు ఆడిన బాల్యం
హఠాత్తుగా అదృశ్యమై
నిలువెత్తు యవ్వనం ప్రత్యక్షమౌతాది.
అది వాళ్ళమ్మనడిగి
స్వెటర్ ఎలా అల్లాలో నేర్చుకొంటా ఉంటాది.
ఇల్లునిర్మించుకొమ్మని పంపించివేసే వేడుకలో
అవసరాతీతంగా హర్షం వర్షిస్తుంది.
కలల రెక్కలు తొడుక్కున్న పిల్లలకు
గూడు వీడ్కోలు పలుకుతుంది.
జననమప్పుడు తల్లి గర్భసంచి లోపొరను
గుంజుకుపోయిన బొడ్డుతాడులా
హృదయంలోకి చొచ్చుకుపోయిన
వేళ్ళని పెరుక్కొని పోతాది పసుపుతాడు.
ఏకాంతంలోకి లాక్కోబడ్డ వర్తమానం
పల్లేరుకాయలా గుచ్చుకొంటూ ఉంటాది.
పెట్టిలోని అత్తరు అద్దిన శాలువా
తెరచినప్పుడల్లా జ్ఞాపకాల పరిమళాలు
కువకువ లాడుతూ ఎగురుతుంటాయి.
స్వప్న దారులలో గజ్జల సవ్వడి
ఎంత ప్రయత్నించినా నిద్ర పోనివ్వదు.
********
ఇంతలో ఒక శుభవార్త
మా అమ్మాయి స్వెటర్ అల్లుతోందట.
బొల్లోజు బాబా
Labels:
కవిత,
కవిత్వం,
మా అమ్మాయి.,
సాహిత్యం
Subscribe to:
Post Comments (Atom)
ఎంత బాగుందో చెప్పలేను. ఇవన్నీ ఊహించుకుంటుంటే ఇప్పుడె అప్పగింతలు చేస్తున్నట్టు గుండే బరువెక్కుతోంది.
ReplyDeleteజననమప్పుడు తల్లి గర్భ సంచి లో పొరను
గుంజుకుపోయిన బొడ్డు తాడులా,
హృదయంలోకి చొచ్చుకుపోయిన
వేళ్లను పెరుక్కొని పోతాది పసుపుతాడు....
నా పెళ్ళప్పుడు ఎన్నడూ కంటతడి పెట్టని నాన్నగారు
ఏడ్చింది ఇందుకేనేమో!
idi prati amma naannala gunde chappudu.. bhavani
ReplyDeleteఆడపిల్లను కన్న ప్రతి తల్లితండ్రులకు ఈ బాధ తప్పదేమో...
ReplyDeleteపెట్టిలోని అత్తరు అద్దిన శాలువా
ReplyDeleteతెరచినప్పుడల్లా జ్ఞాపకాల పరిమళాలు
కువకువ లాడుతూ ఎగురుతుంటాయి.
బాబా గారు చాలా బాగుంది. జీవితంలోని ప్రతి కోణాన్ని మీరు స్పృశిస్తూన్నారు.
"ఆకాశం రాల్చిన పారిజాత సుమంలా" ఇంతకంటే అందంగా ఆడపిల్లని పోల్చలేమేమో!! చాలా బావుంది బాబా గారు!
ReplyDeleteజననమప్పుడు తల్లి గర్భసంచి లోపొరను
ReplyDeleteగుంజుకుపోయిన బొడ్డుతాడులా
హృదయంలోకి చొచ్చుకుపోయిన
వేళ్ళని పెరుక్కొని పోతాది పసుపుతాడు.
ఇది ప్రతి కన్నతల్లి ఆక్రోశమేమో, ఆవేదనేమో..
ఒకప్పుడు ఇవే దృశ్యాలు సినిమాల్లో చూసినప్పుడు ఎంత నవ్వు కొనేవాడినో. కానీ మా అక్క పెళ్ళప్పుడు ఎంతగా ఏడ్చానో. తర్వాత సినిమాల్లో ఇటువంటి సన్నివేశాలు చూసినప్పుడల్లా అప్పటి సన్నివేశమే గుర్తుకు వచ్చి గుండె బరువెక్కుతుంది, కన్ను చెమర్చుతుంది.
నేను కామెంట్ రాయలేను బాబాగారూ...చాలా బాగుంది అంతే!
ReplyDeleteజననమప్పుడు తల్లి గర్భసంచి లోపొరను
ReplyDeleteగుంజుకుపోయిన బొడ్డుతాడులా
హృదయంలోకి చొచ్చుకుపోయిన
వేళ్ళని పెరుక్కొని పోతాది పసుపుతాడు
"ఆకాశం రాల్చిన పారిజాత సుమంలా"
పెట్టిలోని అత్తరు అద్దిన శాలువా
తెరచినప్పుడల్లా జ్ఞాపకాల పరిమళాలు
కువకువ లాడుతూ ఎగురుతుంటాయి.
ఇటువంటి అందమైన భావనలు--ఎటుల కనుగొంటి వయ్య, నీ కెవరు చెప్పిరయ్య!
మరి నాకెప్పుడో ఆ అదృష్టం.....
ReplyDeleteచాలా బాగా రాసారు.
ReplyDelete"ఎదపై నడయాడిన మెత్తని పాదాలు
నెమలీక స్పర్శలను, గజ్జల కవిత్వాన్ని
హృదయంపై వదిలిపోతాయి."
కవిత అంతా బాగుంది. ఈ లైన్లు ఇంకా బాగా నచ్చాయ్.
/ఉమాశంకర్
Very very beautiful.
ReplyDeleteఇంచుమించు ఇలాంటి పద్యమే ఒకటి ఇటీవల ఈమాట పత్రికలో వచ్చింది.
http://www.eemaata.com/em/issues/200803/1225.html
అవస్రాతీతం, స్వప్న దారులు లాంటి వాడుకలు కాస్థ ఎబ్బెట్టుగా ఉన్నాయి.
no words sir.ur great
ReplyDeleteసుజాత గారికి
ReplyDeleteమీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీ స్పందనను తెలియచేసినందుకు థాంక్సండి.
దేవి గారు
మీరు దేవి గారా భవాని గారా. లేక దేవీభవాని గారా. మీబ్లాగు లో పోష్టులేమీ లేవు. త్వరలో వ్రాస్తారని ఆనందింపచేస్తారని భావిస్తాను.
జ్యోతి గారు
తప్పదేమో నండీ.
మురళి గారు
థాంక్సండి. అవునా?
ఈ కవిత వెనుక చిన్న కధ ఉంది. మా పెద్దన్నయ్య గారి అమ్మాయికి 4 నెలల క్రితం పెళ్ళయింది. ఆ అమ్మాయి గర్భవతైనట్లు ఈ మధ్యే అందిన వార్త. ఆ వార్త, వాటివెనుక భావాలకు కవితా రూపమే ఈ కవిత. నచ్చినందుకు సంతోషంగా ఉంది.
నిషిగంధ గారు
మీరిచ్చిన చేకితాబును చాలా పదిలంగా దాచుకొంటున్నాను.
ప్రతాప్
నిజమే కొన్నికొన్ని వీడ్కోలులు గుండెల్ని పిండేస్తాయి. అప్పుడు ఆ ఫీల్ ను పదాలలో పెట్టగలిగితే మంచి కవిత్వం వస్తుందని (ఈ కామెంటు నా కవిత గురించి కాదు సుమా - కొంచెం మోడెస్టీ అడ్డు వస్తుంది) నా వ్యక్తి గత అభిప్రాయం. కదూ?
మహేష్ గారు
కామెంటు రాయకుండా ఉండలేని మిమ్ములచే కామెంటు రాయలేకుండా చేసిన నా కవిత నిజంగా గొప్పదనే నమ్మకం కలిగింది. థాంక్సండీ.
నరసింహ గారు
నేనిలా వ్రాయక పోతే మీరు చూస్తారా సారు? మీరు చూడాలంటే నేను కూడా మీస్థాయికి తగ్గట్టుగా వ్రాయద్దా? థాంక్సండీ.
అనానిమసు గారు
అదృష్టం అంటె..
అమ్మాయి పుట్టటమా? పెళ్ళి చేయటమా? పెళ్ళిచేసుకోవటమా? మనవరాలు పుట్టటమా?
ఏదైనప్పటికీ అటువంటి అదృష్టం మీకు తప్పక కలగాలని.....
ఉమాశంకర్ గారు
కవితలో మీరు చెప్పిన పాదాలు చాలా సుబ్టిల్ గా, మైల్డ్ అనుభూతులను వ్యక్తీకరిస్తాయి. అవి నాకు కూడా ఎక్కువగా నచ్చిన పాదాలు.
కొత్తపాళీ గారికి
మీకు వ్రాయాలంటే వేళ్ళు తడబడుతున్నాయి.
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.
ఈ మాటలో మీరుటంకించిన కవితను (చందమామ) మరియు పిచ్చినాన్న అనేకవితను ఇది వరలో చదివి ఉన్నాను సారు. అప్పట్లో నా అభిప్రాయాలను అక్కడే తెలియచేసాను కూడా. అవిరెండూ మంచి కవితలు. ఆ రెంటిలో పిచ్చినాన్న అనే కవిత మరింత నచ్చింది. చక్కటి ఇమేజెస్ ఉంటాయి దానిలో.
అవసరాతీతం అనే పదంద్వారా పెళ్లి అనే వేడుకలో హర్షం అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి (ఉదా; తల్లి/తండ్రికి) అది అవసరం కాక పోవచ్చు. ఎందుకంటే కొంత భాధ ఉంటుంది కనుక అందుకనే అవసరానికి అతీతంగా అందరూ ఆనందిస్తారు. (ఎక్కడో కంఫ్యూస్ అవుతున్నట్టున్నాను - బహుసా మీరే కరక్టేమో?)
స్వప్న దారులు : ఈ కవితలో చివర్న అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయినతరువాత ఆమె జ్ఞాపకాలు వేధిస్తూంటాయి అని చెప్పటం.
అందుకనే గజ్జెలు అనే లూప్ తగిలించాను. గజ్జల సవ్వడి గదిలో/మదిలో/మార్గంలో/ అనే కంటే దారులలో అంటే బాగుంటందనిపించింది.
కానీ అవి మామూలు దారులు కాబోవుగా. కనుక మనోదారులు అవ్వాలి. పై పాదంలో జ్ఞాపకాలను వాడేసాను.
తరువాత వచ్చే నిద్రకోసం అనే భావంతో సింక్ అవ్వటం కోసం స్వప్న దారులని వాడాను.
మీరెత్తిచూపినతరువాత అనిపిస్తుంది నిద్రవచ్చినతరువాత స్వప్నాలు వస్తాయి. వాటిలో గజ్జెల సవ్వడి వినిపిస్తుంది కానీ స్వప్నంలోని గజ్జెల సవ్వడి నిద్రను రానివ్వకుండాచేయలేదుగా!
కరక్టే లాజిక్ మిస్ అయింది సారు.
సూచించినందుకు ధన్యవాదములు.
పూర్ణిమగారు
థాంక్సండీ
రాధిక గారూ
ధన్యవాదములండీ.
బొల్లోజు బాబా
గతం, వర్తమానం, భవిష్యత్తుల మద్య
ReplyDeleteఅనుభవాల దోబూచులాట
గర్భసంచిలోచి పేగు తెంచుకొని పుట్తిన బిడ్డ
ఏదోఒకనాడు తానూ ఓ బిడ్డకు తల్లికావడం విశేషం
వీటినడుమ దోబూచులాడిన కొన్ని క్షణాలను అవిష్కరించినందుకు అభినందనలు.
అయితే చిన్న సందేహం వెంటాడుతూనేవుంది.
అనుమానం ఎక్కువై ప్రింటు తీసుకొని మరీ ఒకటికి నాలుగు సార్లు చదివా.
మీరు మీ అనుభవాన్ని చెప్పాలనుకుంటున్నారా??
లేక సార్వజనీయమైన అనుభవాన్ని చెప్పాలనుకుంటున్నారా???
కనుమూరి గారు
ReplyDeleteఈ కవితలో టెన్స్ (maintenance of the correct verb form) సరిగ్గా లేదేమో నన్న అనుమానం నాకూ వచ్చింది. ఈ ఏంగిల్ లో మీసూచనలను అందించ గోరతాను.
భవదీయుడు
బొల్లోజు బాబా
kavitha bavundi...hrudayalanu melithippeve kakunda phakkumanipinche kavithalu kuuda meenunchi asisthunna. naaku telugu typing vache varaku mimmalni ila khunee chesthune vunta.
ReplyDeleteబాబాగారు,
ReplyDeleteకొత్తపాళీ గారు చెప్పింది లాజిక్ గురించి కాదనుకొంటాను. 'స్వప్న దారులు ' లాంటి మిశ్రసమాసాల గురించి. సంస్కృత పదాలకు తెలుగుపదాలను అంటగట్టితే అంత బాగా ఉండవు.
కవిత చాలా బాగుంది. ఇలాంటి థీమ్ తో చాలా రచనలు వచ్చాయి. విజయవాడలో ఉన్నప్పుడు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచారి గారు (అని గుర్తు) "అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ" అని పాడిన పాటలో ఇలాగే తన కుమార్తె పెళ్ళై వెళ్ళిపోతున్నప్పుడు అనుభవించిన అనుభూతులను చెప్పారు.
గుండె బరువెక్కి మాటలు రావడం లేదు బాబా గారు, చాలా అద్భుతం గా ఉంది.
ReplyDeleteభగవాన్ గారికి
ReplyDeleteమీకు తెలుగు టైపింగ్ వచ్చేసినట్లుంది. పక్కుమనిపించే కవితలా? తంతారేమో సారూ. ఏమో! ఈయనే అడిగారు అని మీమీద కూడా దాడులు జరుగవచ్చు. సరదాగా.
చంద్రమోహన్ గారు,
మీరు చెప్పిన పాటను ఈ మధ్యే చదివాను. అక్కడ కామెంటాను కూడా.
కొత్తపాళీ గారు చెప్పిన విషయం మీరంటున్నట్లు గానే నేమో.
థాంక్సండీ.
వేణూ గారు.
స్పందించినందుకు థాంక్సండీ.
బొల్లోజు బాబా