కళ్ళు తెరచి చూసే సరికి
నేనో సమూహంలో నడుస్తూ ఉన్నాను.
ఇరుకైన బాట గుండా ప్రయాణం బాగానే సాగుతుంది.
కనుచూపు మేరలో బాట పొడవునా జనమే.
నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది.
ముందూ వెనుకా నాలానే చాలామంది
కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.
అలాగని పెద్ద కష్టంగా ఏమీ లేదు.
నలుగురి మధ్యలో నడక ఆట్టే
అలసట అనిపించటం లేదు.
ఇంతలో ఒక సందేహం కలిగింది.
నా ముందాయన్ని అడిగాను
"ఈ బాట ఎక్కడికి పోతుంది?" అని
నా వైపు అనుమానంగా చూసాడతను.
"మరో పెద్ద బాటలో కలుస్తుంది" అన్నాడు తాపీగా.
"అదెక్కడికి పోతుంది?"
"తెలీదు" అన్నాడతను అసహనంగా.
అదిరి పడ్డాను.
గమ్యం తెలియని ప్రయాణం
అర్ధరహిత మనిపించింది.
ఎక్కడకు వెళ్తున్నామో కూడా తెలియనితనం
ఫక్తు అవివేకమనిపించింది.
సహజాతంగా కదలిపోతున్న సమూహం
మూర్తీభవించిన మూఢత్వం లా అనిపించింది.
గమ్యం తెలియని గమనం చెయాలనిపించలేదు.
"ఈ సమూహం నుండి బయట పడేదెలా?" అనడిగా.
మరో బాటన ప్రయాణం చేస్తున్న వాళ్లను చూపుతూ
"ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకునే వాళ్ల సమూహం అది" అన్నాడు.
నేనా సమూహంలో కలిసాను.
ఇరుకైన బాట గుండా ప్రయాణం బాగానే సాగుతుంది.
కనుచూపు మేరలో బాట పొడవునా జనమే.
నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది.
బొల్లోజు బాబా
(Life is nothing but skipping from one routine to another - అంటూ ఓ రాత్రంతా వాదించిన నా బాల్యస్నేహితుడిచ్చిన స్పూర్తితో)
Subscribe to:
Post Comments (Atom)
నిజమే అంతకన్నా ఏమీలేదు.కొంతమంది జీవితం ఏమీ తెలియకుండానే అయిపోతుంది.కొంతమందికి ఏమి జరుగుతుందా అని ఆలోచనలతో గడిచిపోతుంది.ఇంకొంత మందికి ప్రశ్నించడంలోనే జీవితం అయిపోతుంది.ఇంకొంత మందికి కొత్త బాటను కనిపెట్టే పనిలో అయిపోతుంది....................
ReplyDeleteఆ! అక్కడే ఉంది కీలక మంతా! ఏదో గమ్యం ఉంది, దానికేదో దారి ఉండే ఊంటుంది అన్న ఊహ .. అహ, ఊహ కాదు, ఆ స్పృహ కలిగినప్పుడే అసలైన వెదుకులాట మొదలవుతుంది! అదే జీవిత పరమార్ధం.
ReplyDeleteఇలా ప్రశ్నిస్తూ, ప్రతిదారికీ ఒక (తనదైన) గమ్యం కావాలనుకోవడమే మనిషి వ్యక్తిత్వానికి చిహ్నం. అలాకాకుండా, సమూహం వెళ్తోంది కాబట్టి ప్రశ్నించకుండా ఫాలో అయిపోతే ఆ మనిషొక "గుంపులో గోవింద". అంతే తేడా! అదే తేడా! ఆతేడా ఉంటేనే మనిషి జీవితానికొక అర్థం,పరమార్థం.
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteఏ దారిలో వెళ్ళినా ఒక పెద్దబాటకో, మరో చిన్న బాటకో కలుస్తుంది. కలవకపోయినా నష్టం లేదు. ప్రయాణిస్తున్నామన్న స్పృహ,సంతృప్తి కోల్పోయి, అటూ ఇటూ బాటలు మారుతూ గడిపేసామంటేనే ఇబ్బంది.
మంచి ఆలోచనాత్మకమైన టపా.
బాగుంది. గమ్యం లేని ప్రయాణం! ఎటు వెళుతున్నామో తెలియని అలాంటి దారిలోనే మన గమ్యం తటస్థపడుతుందేమో! "ఈ బాట ఎక్కడికెళుతుంది" అని మనకంటే ముందున్న వారిని ప్రశ్నించాల్సిందే! ప్రశ్నించకుండా నడిస్తే "గుంపులో గోవింద" మహేష్ చెప్పింది కరక్టు!
ReplyDeleteఏం జరిగిందో తెలియకుండా పుర్తిజీవితాన్ని గడిపేసినవారెందరో? రీటైర్ అయ్యి వాలుకుర్చీ తో నెరవేరని కలల్ని చెప్పుకు భాదపడేవారెందరో?
ReplyDeleteప్రశ్నించడం జీవిత పరమార్ధమా? ఆనందాన్ని అనుభవించడం(?) లేదా వెతుక్కోవడం జీవిత పరమార్ధమా? ప్రశ్నించడం నేర్చుకొంటూ, జీవితాలని శోధించుకొంటూ, అందరూ నడిచే దారిలో కాక మనదైన దారిలో మనం సర్వ స్వతంత్రంగా నడవడం జీవిత పరమార్ధమా? అస్సలింతకీ జీవిత పరమార్ధమేమిటి? ప్రశ్నించడమేనా? "అసమర్ధుని జీవితయాత్ర" పుస్తకం ముండుమ్మతలో, గోపీచంద్ అంటారు, "ఎందుకు అన్నా ప్రశ్న నేర్పిన నాన్న గారికి ప్రేమతో అంకితం". అంటే ప్రశ్నించడమే పరమావధా? లేదా దాని ద్వారా వచ్చే జ్ఞానసంపద(?) పరమావధా?
ReplyDeleteఏంటో నాకెప్పుడు ఇలాంటి సందేహాలే వస్తాయి మీ కవితలు చదివాకా !!
@ప్రతాప్: చాలా అమూల్యమైన ప్రశ్నలు సంధించారు. ఈ కవిత చదివి ఈ సందేహాలు వచ్చాయంటే బాబాగారు రాసిందానికి సాఫల్యం కలిగినట్లే!
ReplyDeleteనామట్టుకు ఆనందం జీవితపరమావధి. అయితే,ప్రశ్నించి శోధించి మనదైన మార్గంలో ఆ ఆనందాన్ని పొందడంద్వారా గమ్యంతోపాటూ,ప్రయాణాన్నీ దారినీకూడా అర్థవంతం చేసుకోవచ్చు. అలా జరిగితేనే ఆనందాన్ని మించిన ఆత్మసంతృప్తి దక్కుతుంది.
చాలా బావుంది కవిత. మీ కవితల్లోని వస్తు వైవిధ్యం నన్ను విస్మయుణ్ణి చేస్తోంది!
ReplyDeleteఇక్కడ కామేంటినవాళ్ళు కవిత చివరి పేరా చదివారా అన్న అనుమానం వచ్చింది. మొత్తం సారం అందులోనే ఉంది. ఒక సమూహం నుంచి బయట పడ్డామనుకుంటే మళ్ళీ మరో సమూహంలోకి (అచ్చం మొదటి సమూహంలాంటిదే!) వెళ్ళిపోవడం, అదే అసలు నిజం. ఎన్ని గుంపులు మారినా, మనిషి ఏదో ఒక గుంపులో గోవిందానే! అదే గమ్యం తెలియని ప్రయాణం, అదే మూఢత్వం.
జీవితానికొక పరమార్థం ఉందనుకోవడమే ఓ పెద్ద మూఢత్వం అని నాకనిపిస్తుంది.
మనిషికి దీన్నుంచి విముక్తి లేదు...
i will speak. i will speak
ReplyDeletelet me enjoy it.
bolloju baba
[చివరి లైను] "నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది" అంటే సరిగ్గా పోతున్నాం అని అర్ధం (మనం ఆగినా జనాలు ముందుకు తోస్తారు గనుక)
ReplyDeleteబాగుంది బాబా గారు.
బాగుంది బాబా గారూ.మీ కవితల్లోని అంతులేని వైవిధ్యం ఆహా అనిపిస్తుంది.మీ కవితకు వచ్చిన అందమాన వ్యాఖ్యలకి మీ రెస్పాన్సును చూడాలని ఉంది.
ReplyDeleteరామాయణంలో పిడకల వేట. రెడు రోజులక్రితం ఓ కొత్త బ్లాగు శ్రీ వేదుల బాలక్రిష్ణగారి పేరు మీద (నా పాత్ర లేఖకుడు మాత్రమే)ప్రారంభించాను.ఈ బ్లాగు మీకు తృప్తినిస్తుందని నా నమ్మకం.ఎప్పటిలానే మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తున్నాను.బ్లాగు ఎడ్రసు
http://vedula--baala.blogspot.com . వీలైతే ఓ సారి చూడగలరు.
బాబా నాకు మాత్రం మీ కవితలో చక్కటి సందేశం కనబడింది...
ReplyDeleteబాబా గారు...మీ కవిత చదువుతుంటే నాకు బుచ్చిబాబు "చివరికి మిగిలేది" చదివిన్నట్టు ఉంది.
ReplyDeleteకొన్ని కావ్యాలు అలొచిస్తే వస్తాయి
కొన్ని కావ్యాలు అలొచించేల చెస్తాయి...
మీ కవిత రెండొ కొవకు చెందుతుంది.
బాగుంది బాబా గారు, నాకు కూడా మొదటి సారి చదివినప్పుడు కామేశ్వర రావు గారు చెప్పిన భావమే కలిగింది "ఎన్ని గుంపులు మారినా, మనిషి ఏదో ఒక గుంపులో గోవిందానే! అదే గమ్యం తెలియని ప్రయాణం," అని చెప్తున్నారేమొ అని కానీ మిగిలిన వారి వ్యాఖ్యలు చదివాక కాసింత అయోమయానికి గురయ్యాను.
ReplyDeleteరాధిక గారికి
ReplyDeleteఅంతే నండి.
కొత్తపాళీ గారు, మహేష్ గారు కవితను మలుపు తిప్పి గొప్ప అర్ధాన్ని ధ్వనింపచేసారు. ధన్యవాదములు.
సుజాత గారు, థాంక్సండీ.
కృష్ణ మోహన్ గారు మిమ్ములను ఆలోచింపచేసినందుకు ఆనందంగా ఉంది.
మురళి గారు నిజమేనండి.
ప్రతాప్ గారు మీరు చాలా ప్రశ్నలు సంధించారు.
మా ఆవిడకు ఇదే విషయంలో నిత్యం నాపై గుర్రు మంటూ ఉంటుంది.
ఎందుకంటే I usually take the things as they come and try to present my best for the situation. thats all. i cannot plan each and every word/action in before.
అందుచే కొన్ని సార్లు కారీ అవే అయి పోయిన సందర్భాలు కూడా ఉంటాయి.
గోపి చంద్ అన్న ఎందుకు అన్న ప్రశ్న అన్ని సందర్భాలకు వర్తించదని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఎందుకు అని ప్రశ్నించుకొనే కంటే ఎలా అని ప్రశ్నించుకొంటేనే మంచిది.
మహేష్ గారు డబుల్ థాంక్సండి.
కామేశ్వరరావు గారు థాంక్సండీ :-))
నాగన్న గారు కామేశ్వర రావు గారు చెప్పింది కవిత చివరలో ఇచ్చిన ఫుట్ నోట్స్ గురించనుకుంటానండీ. స్పందించినందుకు ధన్యవాదములు.
నరసింహ గారు థాంక్సండీ.
చంద్ర గారు థాంక్సండీ.
శ్రీ కాంత్ గారు :-))
బొల్లోజు బాబా
@ బాబా గారు
ReplyDeleteఇలాంటివి కొందరే రాయగలరు. ఎంత నిజం! ఇప్పటివరకూ నేను దీన్ని చదవకుండా ఎలా ఉన్నాను? ఏ బాటలో, ఏ సమూహంలో ఇరుక్కుపోయాను?!!