Tuesday, September 23, 2008
ఆకుపచ్చని తడిగీతం
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వాన కురుస్తానే ఉంది.
నల్లని మంచుగడ్డ కరిగిపోయింది.
ప్రశాంత తరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేశించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది.
సూర్యకిరణాల కిలకిలారావానికి
లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది.
తీగమొక్కలు జారిపోయిన పట్టును
మళ్లా వెతుక్కొంటున్నాయి.
తడినేలపై పడి పరావర్తనం చెందిన
లేకిరణాలు, ఆకుల క్రింద దాక్కొన్న
చీకటిని తరిమేస్తున్నాయి.
చెట్ల ధూళి వాన గుంటలలో చేరి
ఆకుల అందాలను చూస్తూ విస్తుపోతోంది.
మబ్బు అంచుల జరీ మెరుపులతో
పోటీ పడే ఈకల కోసమై
ఓ పక్షి శ్రద్ధగా ప్రీనింగ్ చేసుకొంటూంది.
తలంటుకొన్న యవ్వనిలా శోభిస్తున్న
పొగడ చెట్టు గాలికిరణాలలో
పత్రాలను ఆరబెట్టుకొంటూంది.
ఉదయపు గొంతులోంచి
ఆకుపచ్చని తడిగీతం
రెక్కలుకట్టి ఎగురుతూంది.
మేఘాలవతల వరకూ
సౌందర్యం పరచుకొంది.
తటాకం అంతవరకూ భద్రంగా
దాచుకొన్న తామరదుంపకు
కొత్తచిగుళ్లు లేస్తున్నాయి
నేల ఆలపించే ప్రాచీన గీతాన్ని చిత్రించటానికై.
************
తడిచిన సీతాకోకచిలుక
కవిత్వంపై వాలి రెక్కలల్లార్చింది.
బొల్లోజు బాబా
Monday, September 22, 2008
ఒక అనువాద కవిత
మట్టి ముద్దను పాత్రగా మలచు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
గుమ్మాలు, కిటికీలతో
గృహాన్ని నిర్మించు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
దేన్నో పొందుతూ ఉంటాం కానీ
దాని శూన్యతనే వాడుకుంటూ ఉంటాం.
మూలం: టావో టె షింగ్ (Mould Clay into a vessel)
బొల్లోజు బాబా
Friday, September 19, 2008
అలవాటయిపోయి.........
ఒక బాంబ్ బ్లాస్ట్.
రక్త వర్షంలో దేహశకలాల వడగళ్ళు
హా హాకారాలు, ఆర్తనాదాలకి
ఉలిక్కిపడి నిద్ర లేచింది మృత్యు దేవత.
" ఎంతమంది చచ్చారు?
అలాగా మొన్నటి మీద తక్కువే!
దేహానికో లక్ష నజరానా ప్రకటించండి"
హలో హలో " మీరెలా ఉన్నారు?
ఏం కాలేదా! మీరు భలే లక్కీ.
ఇప్పటికి చాలా తప్పించుకొన్నారు.
ఇది ఎన్నోది?"
ఏమిటీ అంకులు వాళ్ళ ఫామిలీ బలయ్యిందా?
అలాగా! నిజానికి వాళ్ళసలు పోయినేడాది
గోకుల్ చాట్ వద్ద పోయేవాళ్ళే.
ఇప్పుడు పోయారన్న మాట"
ఈ మాంస ఖండంలో
గుండె ఇంకా కొట్టు కుంటూంది.
" జూమ్ చెయ్యి, జూమ్ చెయ్యి"
మైకు దగ్గరగా పెట్టి ప్రేక్షకులకు " లబ్ డబ్ " అందించు.
మొదటగా మా చానెల్ లోనే
వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా
తప్పుకోండి తప్పుకోండి.
మంత్రిగారు శవాలను పరామర్శిస్తారు.
క్లిక్.... క్లిక్.... క్లిక్ .
ఊహా చిత్రాలు గీయండి
చిత్రాలనిండా అభిప్రాయాలు నింపండి.
పాత సామాన్ల వ్యాపారి
పాంఫ్లెట్లు పంచుతున్నాడు.
" ఈ మందులు అర్జంటుగా తెండి"
" ఐ ఆమ్ సారీ. మేం చాలా ప్రయత్నించాం"
"ఇన్సూరెన్స్ క్లైములిప్పిస్తాం. 30% కమీషను."
పదివేలకే శ్మశానం పాకేజీ.
కాల్చాలా? పూడ్చాలా?
************
ఇవ్వాలి ఇవ్వాలి
ఢిల్లీ లో ఇచ్చినట్లు రెండు లక్షలివ్వాలి!
బొల్లోజు బాబా
బాంబు బ్లాస్టులకు అలవాటు పడదామా అని ప్రశ్నించిన మహేష్ గారి పోస్టు చదివి
Monday, September 15, 2008
జీవితం
కళ్ళు తెరచి చూసే సరికి
నేనో సమూహంలో నడుస్తూ ఉన్నాను.
ఇరుకైన బాట గుండా ప్రయాణం బాగానే సాగుతుంది.
కనుచూపు మేరలో బాట పొడవునా జనమే.
నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది.
ముందూ వెనుకా నాలానే చాలామంది
కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.
అలాగని పెద్ద కష్టంగా ఏమీ లేదు.
నలుగురి మధ్యలో నడక ఆట్టే
అలసట అనిపించటం లేదు.
ఇంతలో ఒక సందేహం కలిగింది.
నా ముందాయన్ని అడిగాను
"ఈ బాట ఎక్కడికి పోతుంది?" అని
నా వైపు అనుమానంగా చూసాడతను.
"మరో పెద్ద బాటలో కలుస్తుంది" అన్నాడు తాపీగా.
"అదెక్కడికి పోతుంది?"
"తెలీదు" అన్నాడతను అసహనంగా.
అదిరి పడ్డాను.
గమ్యం తెలియని ప్రయాణం
అర్ధరహిత మనిపించింది.
ఎక్కడకు వెళ్తున్నామో కూడా తెలియనితనం
ఫక్తు అవివేకమనిపించింది.
సహజాతంగా కదలిపోతున్న సమూహం
మూర్తీభవించిన మూఢత్వం లా అనిపించింది.
గమ్యం తెలియని గమనం చెయాలనిపించలేదు.
"ఈ సమూహం నుండి బయట పడేదెలా?" అనడిగా.
మరో బాటన ప్రయాణం చేస్తున్న వాళ్లను చూపుతూ
"ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకునే వాళ్ల సమూహం అది" అన్నాడు.
నేనా సమూహంలో కలిసాను.
ఇరుకైన బాట గుండా ప్రయాణం బాగానే సాగుతుంది.
కనుచూపు మేరలో బాట పొడవునా జనమే.
నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది.
బొల్లోజు బాబా
(Life is nothing but skipping from one routine to another - అంటూ ఓ రాత్రంతా వాదించిన నా బాల్యస్నేహితుడిచ్చిన స్పూర్తితో)
నేనో సమూహంలో నడుస్తూ ఉన్నాను.
ఇరుకైన బాట గుండా ప్రయాణం బాగానే సాగుతుంది.
కనుచూపు మేరలో బాట పొడవునా జనమే.
నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది.
ముందూ వెనుకా నాలానే చాలామంది
కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.
అలాగని పెద్ద కష్టంగా ఏమీ లేదు.
నలుగురి మధ్యలో నడక ఆట్టే
అలసట అనిపించటం లేదు.
ఇంతలో ఒక సందేహం కలిగింది.
నా ముందాయన్ని అడిగాను
"ఈ బాట ఎక్కడికి పోతుంది?" అని
నా వైపు అనుమానంగా చూసాడతను.
"మరో పెద్ద బాటలో కలుస్తుంది" అన్నాడు తాపీగా.
"అదెక్కడికి పోతుంది?"
"తెలీదు" అన్నాడతను అసహనంగా.
అదిరి పడ్డాను.
గమ్యం తెలియని ప్రయాణం
అర్ధరహిత మనిపించింది.
ఎక్కడకు వెళ్తున్నామో కూడా తెలియనితనం
ఫక్తు అవివేకమనిపించింది.
సహజాతంగా కదలిపోతున్న సమూహం
మూర్తీభవించిన మూఢత్వం లా అనిపించింది.
గమ్యం తెలియని గమనం చెయాలనిపించలేదు.
"ఈ సమూహం నుండి బయట పడేదెలా?" అనడిగా.
మరో బాటన ప్రయాణం చేస్తున్న వాళ్లను చూపుతూ
"ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకునే వాళ్ల సమూహం అది" అన్నాడు.
నేనా సమూహంలో కలిసాను.
ఇరుకైన బాట గుండా ప్రయాణం బాగానే సాగుతుంది.
కనుచూపు మేరలో బాట పొడవునా జనమే.
నా వెనుక సమూహం కొద్దికొద్దిగా పెరుగుతూ పోతోంది.
బొల్లోజు బాబా
(Life is nothing but skipping from one routine to another - అంటూ ఓ రాత్రంతా వాదించిన నా బాల్యస్నేహితుడిచ్చిన స్పూర్తితో)
Wednesday, September 10, 2008
మా అమ్మాయి
నా భార్య స్వెటర్ అల్లుతోంది
రాబోయే బిడ్డకోసం.
*******
ఇంట్లోకి వసంతం ప్రవేశించింది.
పూవుల్నీ, సీతాకోక చిలుకల్ని,
సుగంధాల్నీ వెంటేసుకొచ్చింది.
ఆకాశం రాల్చిన పారిజాత సుమంలా
మా నట్టింట పాపాయి చందమామై వెలుగుతాది.
ఎదపై నడయాడిన మెత్తని పాదాలు
నెమలీక స్పర్శలను, గజ్జల కవిత్వాన్ని
హృదయంపై వదిలిపోతాయి.
ముద్దుముద్దు మాటలు
హృదయాన్ని చుంబించే వెన్నెల చినుకుల్లా
హాయి కాంతులు చిమ్ముతాయి.
చిన్నారి దేహం పుష్పించిన నాటినుండీ
పూడిక తీయని బావిలా
మా గుండె బరువెక్కుతూనే ఉంటాది.
ఏనుగాటలు, ఉప్పుమూటలు ఆడిన బాల్యం
హఠాత్తుగా అదృశ్యమై
నిలువెత్తు యవ్వనం ప్రత్యక్షమౌతాది.
అది వాళ్ళమ్మనడిగి
స్వెటర్ ఎలా అల్లాలో నేర్చుకొంటా ఉంటాది.
ఇల్లునిర్మించుకొమ్మని పంపించివేసే వేడుకలో
అవసరాతీతంగా హర్షం వర్షిస్తుంది.
కలల రెక్కలు తొడుక్కున్న పిల్లలకు
గూడు వీడ్కోలు పలుకుతుంది.
జననమప్పుడు తల్లి గర్భసంచి లోపొరను
గుంజుకుపోయిన బొడ్డుతాడులా
హృదయంలోకి చొచ్చుకుపోయిన
వేళ్ళని పెరుక్కొని పోతాది పసుపుతాడు.
ఏకాంతంలోకి లాక్కోబడ్డ వర్తమానం
పల్లేరుకాయలా గుచ్చుకొంటూ ఉంటాది.
పెట్టిలోని అత్తరు అద్దిన శాలువా
తెరచినప్పుడల్లా జ్ఞాపకాల పరిమళాలు
కువకువ లాడుతూ ఎగురుతుంటాయి.
స్వప్న దారులలో గజ్జల సవ్వడి
ఎంత ప్రయత్నించినా నిద్ర పోనివ్వదు.
********
ఇంతలో ఒక శుభవార్త
మా అమ్మాయి స్వెటర్ అల్లుతోందట.
బొల్లోజు బాబా
Sunday, September 7, 2008
తిరిగి భవిష్యత్తులోకే ......
నెత్తిన దిగే మేకుల్లాంటి బూతు మిళితపు ఆజ్ఞల్లో
నేల చూపుల కళ్ళు స్రవించే నెత్తుటిబూడిదలో
సముద్రపొడ్డున గవ్వలేరుకోవాల్సిన
బాల్యమంతా క్షతగాత్రుని రోదనయినపుడు....
చందనపు పూతక్రింద చంద్రుని వెన్నెలతో
పోటీ వచ్చే మేని ఛాయై శోభిల్లవలసిన
యవ్వనాన్నంతా గోరింటాకు చేసి
విటుల కండరాల కోరలకు అద్దే పరిస్థితుల్లోనో లేక
కండరాల్ని సముద్రం చేసే ప్రయత్నంలోనో
రొచ్చుగుంటయిన దేహంతో
అంటించబడ్డ క్రొవ్వొత్తిలా (ఎవరంటించారు?)
యవ్వనం రాత్రికి రాత్రి హతమైనప్పుడు......
కాలం ఊయలీకరించాల్సిన జీవితం
బాధల వృక్షానికి శిలువవేయబడి
గాయాల్ని శ్వాసిస్తుంటే......
మీరాశించే పరిణతి మాకెక్కడ సాధ్యం?
మీరు శాసించే నాగరికత మాకెక్కడ లభ్యం
అందుకే పచ్చబొట్ల వలువల్ని ధరించి
తిరిగి భవిష్యత్తులోకే మా పయనం
బొల్లోజు బాబా
(8-11-91 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన నా కవిత.
అందులో ఇంకా కొంచెం ఫ్రెష్ నెస్ ఉన్నట్లు అనిపించి పోష్టు చేస్తున్నాను. )
Tuesday, September 2, 2008
అన్నీ ఒకేలా ఉంటాయి
ప్రతీదీ ఎక్కడో చూసినట్టే ఉంటుంది.
ఎప్పుడో అనుభవించినట్లే ఉంటుంది.
అన్నీ ఒకేలా ఉంటాయి.
ఉదయాలు, మరణాలు
విజయాలు, వేదనలు
ఎత్తుగడలు, దొరికిపోవటాలు
కలలూ కన్నీళ్లూ, బంధాలూ ప్రేమలూ,
అన్నీ ఒకేలా ఉంటాయి.
ప్రతీదీ ఎప్పుడో ఒకప్పుడు
స్వప్నించినట్లే ఉంటుంది.
అవును, కాదు
కావొచ్చు, అప్పుడప్పుడూ,
లాంటి మాటల మధ్య జీవితం
గానుగెద్దులా తిరుగుతుందన్న విషయం
ఎపుడో ధ్యానించినట్టే ఉంటుంది.
పంజర పక్షి పదే పదే వినిపించే గానంలా
జీవితం కనే కలలు
ఎప్పుడూ ఒకేలా ధ్వనిస్తాయి.
ఏం చదివినా
అవే అక్షరాలు, అవే అర్ధాలు
పునరావృతమైనట్టే అగుపిస్తాయి.
ఆఖరుకు
కాలం దిబ్బపై మొలచిన
పిచ్చిమొక్కలు కూడా
క్లోన్డ్ సంతతిలా అనిపిస్తాయి.
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)