Sunday, February 9, 2020

a Comment

(Saradhi Motamarri gaaru జమిందారీ వ్యవస్థ గురించి నన్ను టాగ్ చేసినందుకు ఒక చోట నేను చేసిన కామెంటు ఇది. కామెంటు కనుక ఈ రాతను విహంగ వీక్షణంగా భావించాలి)

చోళుల కాలంలో గ్రామాలు ఒక యూనిట్ గా ఉండి పండించిన పంటలో రాజుగారికి పన్ను రూపంలో సగభాగం కట్టేవారు (సంగోరు భాగం). కొన్ని గ్రామాలను కలిపి నాడులు అని పిలిచేవారు. వీటికి పన్ను వసూలు అధికారులుగా రాజ ప్రతినిధులు ఉండేవారు (వీరిని సామంతులు అనుకోవచ్చు)

కృష్ణదేవరాయలి కాలంలో పాలెగార్లు ఉండేవారు. వీరు కొన్ని గ్రామాలకు గాను రాజునుండి అధికారం పొంది పండించుకొని నిర్ణయించిన శిస్తు కట్టేవారు. మరొక విశేషం ఏమిటంటే వీరు సొంతసైన్యం కలిగి ఉండి రాజుకు అవసరమైనప్పుడు యుద్ధాలకు తమ సైన్యాన్ని పంపించి సహాయపడేవారు.

ముఘలుల కాలంలో కొన్ని గ్రామాలను కలిపి జాగీరులుగా విభజించి వీటికి జాగీరు దారులను నియమించి పన్ను వసూలు చేసేవారు. ఈ జాగీరు దారులు తిరిగి భూమిని కొద్దిమంది జమీన్ దారులకు కౌలుకి ఇచ్చి పండించేవారు. వీరు కూడా సంగోరు భాగాన్ని సుల్తానుకు పన్నుగా చెల్లించేవారు.

ఈ వ్యవస్థలలో రైతు పాత్ర ఎక్కడా లేదు. భూమి అంతా రాజుగారి పేరుపై ఉండేది. పండించుకొనేవారికి కానీ కౌలుకు తీసుకొన్నవారికి గానీ భూమిని అమ్ముకొనే హక్కు ఉండేది కాదు. ఎవరైనా పన్నులు కట్టకపోతే (కరువు కాలంలో కూడా) వారి జమిందారీని మరొకరికి ఇచ్చేసి శిక్షించేవారు రాజు లేదా రాజ ప్రతినిధులు.

శ్రీనాధుడు అంతటి కవే శిస్తుకట్టనందుకు శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. "పురవీధి నెదురెండ పొగడదండ" అంటాడు. పొగడదండ అంటే రాతిగుండులతో చేసిన దండ. దానిని మెడలో వేసి రోడ్డుపైన ఎండలో నడిపించేవారు.

కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె దిలలు బెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు లేడు నూర్లు ... అని వాపోతాడు. ఇదీ ఆనాటి రైతుల స్థితి.
****

ఈస్ట్ ఇండియా కంపనీకి భారతదేశం అంతా దఖలు పడ్డాక ఈ భూమిని అప్పటి బ్రిటన్ లో ఉన్న పద్దతి లాగ రాజు స్వాధీనం నుంచి ప్రజల పరం చేసారు. భారత దేశానికి సంబంధించి భూమి విషయంలో ఇదొక విప్లవాత్మక మార్పు

అంతవరకూ ఉండిన జమిందార్లు వారు పండించుకొంటున్న భూమికి శాశ్వత హక్కుదారులు కాదు. పన్నుకట్టకపోతే తొలగించి వేరేవారికి ఇచ్చేసేవారు. కానీ బ్రిటిష్ వారు చేసింది శాశ్వత సెటిల్ మెంటు.

నార్త్ ఇండియాలో పైన చెప్పిన జమిందారులకు "సెటిల్ మెంట్" చేసారు. అంటే ఆ భూమిపై వారికి అమ్ముకొనే, వంశపారంపర్య, శాస్వత హక్కులను ధఖలు చేసారు.

ఇక మన ప్రాంతానికి వచ్చేసరికి థామస్ మన్రో అనే మహానుభావుడు 1800 లో, కంపనీ అధికారులను వారిని ఒప్పించి రైత్వారీ పద్దతిని ప్రవేశ పెట్టాడు. అంటే పండించే రైతుకే భూమిని కట్టపెట్టటం అన్నమాట. అలా అప్పటికి భూమిని పండిస్తున్న సామాజిక వర్గాల చేతులలోకి వేల ఎకరాల భూమి చేరింది.

మన్రో ఉద్దేశం మంచిదే అయినా తదనంతర పరిణామాలు భూమి విషయంలో సామాజిక అసమతుల్యతకు దారితీసింది. నిజంగా భూమిని పండించే దళిత, బహుజనులకు భూమి దక్కలేదు.

అయినప్పటికీ మన్రో చేసిన పని అప్పటికి విప్లవాత్మకమైనది, గొప్ప సామాజిక కోణం కలిగి ఉన్నది. జమిందారులు అనే మధ్యవర్తులు లేకుండా నిజంగా కష్టపడే రైతులకే భూమిని అప్పగించాడు. ఒక జమిందారు మాత్రమే ఉండాల్సిన భూమికి వందలమంది వ్యక్తులను యజమానుల్ని చేసాడు.

ఆ విధంగా మన్రో రాయలసీమ వాసులకు ఆరాధ్యుడయ్యాడు. అక్కడి ప్రజలు మన్రోకి గుడి కూడా కట్టారని అంటారు. .
ఈ సెటిల్ మెంటులు రాయలసీమలో జరిగినంత పారదర్శకంగా ఇతర జిల్లాలలో జరగలేదు.

అలా అమ్ముకొనే, వంశపారంపర్య హక్కులతో భూమిని దక్కించుకొన్న రైతులు జమిందారులుగా అవతరించారు.

భూమి అందరికీ చెందాలి అనే ఉద్దేశంతో దేశమంతటా తిరిగి వినోభాభావే భూదాన్ ఉద్యమం చేసాడు. వేల ఎకరాలు కలిగిన జమిందారుల నుంచి కొంత భూమిని దానంగా తీసుకొని దానిని భూమి లేనివారికి పంచటం దీని ఉద్దేశం . ఇది ఆచరణలో విఫలమైంది. ఎలాగంటే తండ్రో తాతో ఇచ్చిన భూమిని వారి వారసులు ఆ దానం చెల్లదని కోర్టులకు వెళ్ళి తిరిగి స్వాధీనం చేసేసు కొన్నారు. ఇప్పటికీ ఇంకా కోర్టు కేసులు జరుగుతున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం లాండ్ సీలింగ్ ఆక్ట్ పెట్టి ఈ జమిందారీలను రద్దు చేసింది. ఆ భూములన్నీ తిరిగి ప్రభుత్వపరం అయ్యాయి.

తిరిగి ఈరోజు పరిశ్రమల స్థాపన/ఉపాధి కల్పన పేరుతో వేల ఎకరాలు సేకరిస్తూ/తీసుకొంటూ/లాక్కొంటూ కొత్తరకం జమిందారీతనం నడుస్తోంది ఇప్పుడు.

ప్రపంచాన్ని నడింపించేది ఒకటే సూత్రం ఎవరివద్ద భూమి ఉంటుందో అక్కడ డబ్బు, అధికారం ఉంటుంది. వాటి బై ప్రొడక్ట్ దోపిడీ ... ఇదే చరిత్ర మొత్తం.

బొల్లోజు బాబా

Kanupriya Dhingra, Subhash Mukhopadhyay poems

1. Hibernation by Kanupriya Dhingra

ప్రతీ శీతాకాలం
ఐస్ క్రీమ్ అబ్బాయి
పల్లీల అబ్బాయి
అవుతుంటాడు.
పాపం
అతనికి శీతాకాల నిద్ర ఉండదు.
***

2. వ్యూహ కర్తలకు - To the Game Planners by Subhash Mukhopadhyay

ఎప్పుడైనా
నేను చెస్ ఆడదామని కూర్చొంటే
లక్షలాది వ్యూహకర్తలు
వాళ్ళ వాళ్ళ పనులు మానుకొని
నా భుజాలపై ఒంగి నేనేం ఎత్తు వెయ్యాలో
వాళ్ళే చెప్పేస్తుంటారు

చాలా గందరగోళంగా ఉంటోంది.
చేతులు జోడించి వారితో చెప్పనా?

ప్రియమైన పెద్దలారా
దయచేసి ఒద్దికగా కూర్చొని
నా ఆట చూడండి లేదా
మీ పనులు మీరు చూసుకోండి

నన్ను మన్నించండి
నేటినుంచి నా ఆట నన్ను
ఆడుకోనివ్వండి

అనువాదం: బొల్లోజు బాబా

యాకూబ్ కవిత్వ “తీగలచింత’


కవిత్వం జీవితాన్ని ప్రతిబింబించాలి అనేది అందరూ అంగీకరించే విషయం. ఏ కవికైనా ఇది కాస్త సాధన చేస్తే అబ్బే విద్యే. కవిత్వాన్ని జీవితంగా చేసుకొని జీవించటం ఒక యోగం. దానికి సాధన ఒకటే సరిపోదు తపస్సు చేయాలి. అలాంటి తపోసంపన్నుడే యాకూబ్. సమకాలీన తెలుగు కవిత్వరంగాన్ని కవిసంగమానికి ముందు తరువాతా అని భవిష్యత్ సాహిత్యచరిత్రకారులు సరిహద్దులు గీస్తారు. డిజిటల్ యుగానికి తగ్గట్టుగా తెలుగు కవిత్వరంగాన్ని సమాయుత్తం చేసి, మెరికల్లాంటి యువకవులకు ఒక వేదికను ఏర్పాటుచేసిన యాకూబ్ మేలు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక ప్లాట్ ఫామ్ లేక ప్రతీ తరంలో ఎంతోమంది కవులు పాఠకపాత్రలలోకి ఇమిడిపోవటం అనాదిగా జరిగేదే.

ఇప్పుడు పిట్టలన్నీ వచ్చి వాలాయి. ఈరోజు అంతర్జాలంలో లేని కవి, బయటా లేనట్టే. ఇది కాలమార్పు. అంగీకరిద్దాం. తెలుగు కవిత్వానికి సంబంధించి ఆ మార్పుకు దోహదపడిన వ్యక్తులలో యాకూబ్ ఒకడని గుర్తుంచుకొందాం.

ఇలాంటి యాకూబ్ వ్రాసిన కవిత్వం ఎలా ఉంటుంది.? “ప్రవహించే జ్ఞాపకం” లాగే ఉంటుంది. “నదీమూలంలాంటి ఇల్లు” లాగే ఉంటుంది…. కిరీటాలు, భుజకీర్తులు అతని ఆత్మను తాకలేవని ఇటీవల విడుదలైన “తీగల చింత” నిరూపిస్తుంది. మనిషిగా, కవిగా యాకూబ్ విజయమిది.
***
యాకూబ్ కు తన అస్తిత్వం స్పష్టంగా తెలుసు. తను ఏ ఒడ్డున నిలుచుని ఉన్నాడో తనకు తెలుసు. వ్యక్తిగతమూ రాజకీయమే అన్న స్పృహ అతనిలో ఉంది. అందుకే అతని కవిత్వంలో సహిష్ణుత పుష్కలంగా ఉంటుంది. కాబట్టే ఈ వాక్యాలను ఎంతో ఇష్టంగా రాయగలిగాడు

కాశిరాజు కోటకు వీపునాన్చి
నీళ్లలో పాదాలు ఆడిస్తున్న చిన్నిపాప
పాప ప్రక్షాళన కోసం పరుగులెత్తుతున్న కాలానికి
ఎదురుగా వచ్చి చేయందించే మనిషి

గంగ:
కొన్ని శంఖాలు, కొంత విభూది, పగలుగా మారే రాత్రి
ఎనభైనాలుగు ఘాట్ లు
సందులు గొందులుగా నడిచే కాశిపురి, మరణించిన షెహనాయి
శోకం, మరికొంత హరిశ్చంద్రుని వారణాసి (కాశిగంగ).

కాశిని చూసిన దృష్టిలో కవి ప్రకటించే విశ్వజనీన ప్రేమే కనిపిస్తుంది. నీళ్లలో పాదాలు ఆడిస్తున్న చిన్నిపాపంత హృదయంలా నిర్మలంగా, స్ఫటికంలా మెరుస్తుంది.
***
ఈ దేశ సహిష్ణుతను భగ్నం చేసే ఏ శక్తులనైనా ఛాతీ చూపించి ఎదుర్కొంటాడు. ఈ యుద్ధం భౌతికం కాకపోవచ్చు. కానీ సహిష్ణుత కోరుకొనే ప్రతి పౌరునికీ ఎంతో మానసిక ధైర్యాన్నిచే తెగింపు ఇది.

ఈనాడు ప్రతీ ఒక్కరూ తన అస్తిత్వాన్ని పదిలపరచుకోవాల్సిన సందర్భం. ఒక మహారక్కసి విలయతాండవం చేస్తూ మనుషులను, సంస్కృతులను, విశ్వాసాలను ఊడ్చుకుపోతున్న సమయమిది. ఈ వలయపు అంచులలో ఉండేవారి పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. కాళ్ళను బలంగా ఈ నేలపై ఆన్చి ఇది నా అస్తిత్వం, ఇవి నా మూలాలు అని చెప్పుకోలేకపోతే మనుగడే ప్రశ్నార్ధకం.

సిరియా బాల శరణార్ధి ఐలన్ కుర్దీని
అలలపై మోసుకువచ్చే చీకటి
రోహింగ్యా కళ్లపై ఎండిన చూపులాంటి చీకటి
కాలంలోంచి కాలంలోకి వొత్తిగిలే చీకటి
వెలుగును లోపలికి జొరబడనీయని చీకటి// (కల చెదిరింది)

సిరియా, రోహింగ్యాల సంక్షోభానికి తెలుగునేలపై జీవించే సగటు మనిషికి సంబంధమేమిటని అమాయకంగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ రోజు ప్రపంచం ఒక ఇంటర్ కనెక్టెడ్ సాలెగూడు. ఒకచోట దారం తెగితే గూడంతా కంపిస్తుంది. ఇదొక బటర్ ఫ్లై సిద్ధాంత ప్రభావం. యాకూబ్ కు ఈ ప్రాపంచిక సత్యం తెలుసు. వెలుగును అడ్డుకొంటున్న చీకటి నీడల్ని ఎరుకపరుస్తున్నాడు పై కవితలో. అస్తిత్వ కవిగా ఇది అతని బాధ్యత.
***
కథువా ఒక్కటే కాదు
పసిప్రాణాలపై వేటువేసే కాటువేసే వేటగాళ్లు
వారికి వంతపాడే నేతలు.
ఆవులు భద్రంగా ఇంటికి చేరే లోకంలో
ఆడపిల్లలను మేసే కాలంలో
తల్లులు ఇక తల్లులను కనడానికి వణికిపోతారు (గిరఫ్తార్ హమ్ హువే)

ఈ రోజు ఆవు భక్తి స్థాయినుంచి ఒక రాజకీయ సింబల్ గా మారిపోయింది. మూక హత్యలు, మూక దాడులు వెనుక ఉన్నది భక్తికాదు. ఉన్మాదం. పై కవితలో కథువాలో రేప్ కు గురయి చనిపోయిన ఎనిమిదేళ్ల పసిపాప ప్రస్తావన, ఆ ఉదంతంలో ఉన్న మతకోణాన్ని ప్రస్తావించి చదువరిని ఆలోచింపచేస్తాడు కవి.
***
1.
నీకిక్కడ చోటులేదు పో….
2.
గుర్తింపు పత్రం ఉందా?
నీ బాబెక్కడ పుట్టాడు?
వాడి తాతెక్కడ పుట్టాడు?
పుట్టినప్పుడు ఈ నేల మట్టి ఒక గుప్పెడు
అమ్మకడుపులోంచి తెచ్చావా లేదా?
తెచ్చినట్టు దృవీకరణ పత్రం ఎక్కడ?
లేదా, అయితే …. పో…పో..// (పౌరసత్యం)

నేడు సిటిజన్ షిప్ ఆక్ట్ పై దేశం మొత్తం మతాలకు అతీతంగా ఆందోళనకు గురవుతున్నది. ఇది నిజమైన సెక్యులరిజం. ఆరువందలేళ్లుగా ఈ మట్టి హృదయాలలో పాదుకొన్న మానవీయ పరిమళం అది. నేనున్నాను అనే నమ్మకాన్ని రాజ్యం కలిగించలేకపోవటం నేటికాలపు విషాదం.

అమ్మకడుపులోంచి గుప్పెడు మట్టి తెచ్చావా అని అడగటంలోని సార్కాజం ఒక పతాక స్థాయి నిరసన. ఈ కవిత మూడునెలల క్రితమే రాయటం గమనార్హం.
***
యాకూబ్ మౌలికంగా భావుకుడు. నిర్మల హృదయుడు. అస్తిత్వవేదన, తన సమూహపు దుఃఖగానం ఇతనికి అనివార్యం. అయినప్పటికీ ఇతనిలోని భావుకుడిని అనేక కవితలు ఇట్టే పట్టి చూపుతూంటాయి.

నీటికొమ్మలమీద తేలియాడుతూ
లేత పసుపువర్ణపు పండులా
ఈ తీయటి సూరీడు (ఫ్రాగ్మెంట్స్)

//వర్షం కురిసినందుకు
మొక్క కృతజ్ఞతగా లేచి నిలబడుతుంది
కొమ్మలు కొన్ని చినుకుల్ని తమకోసం వచ్చే
పిల్లలకోసం దాచుకుంటాయి.// (తడి గురించి) – లాంటి కవితా వాక్యాలలోని సౌందర్యం యాకూబ్ కళాదృష్టికి రుజువులు.
***

తీగల చింతలోని కొన్ని కవితలలో పలుచని నైరాశ్యం తారాడుతుంది. చింతలు తీగెలుతీగెలుగా విస్తరించి “ఇక ఎప్పటికీ తెల్లారనే తెల్లారదా?” అని బేలగా ప్రశ్నింపచేస్తాయి.

“అతనొస్తాడు, తప్పక” అనే కవిత వెండి అంచులాగా మెరుస్తుంది. గొప్ప ఆశావహ ముగింపుతో తళుక్కుమంటుంది.

//అతడి రాక అవసరం-
రావాల్సినపుడు, కావాల్సినప్పుడు, కాపాడాల్సినప్పుడు
తప్పక తప్పక తప్పక
అతడొస్తాడు.

అవును అతడొస్తాడు. అతని కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. అంతవరకూ జీవితమొక “వెయిటింగ్ ఫర్ గోడో” నాటకం.

బొల్లోజు బాబా

కవిత్వ కడియం- తగుళ్ల గోపాల్



తగుళ్ల గోపాల్ కల్వకుర్తి ప్రాంత కలకొండకు చెందిన కవి. కవులను ప్రాంతాలకు కుదించటం నాకు ఇష్టం ఉండదు. కానీ గోపాల్ తన ప్రాంతాన్ని, తన కాలాన్ని, తన సమాజాన్ని, తన జీవితాన్ని నోరారా చెప్పుకొన్నాడు. గుండెవిప్పి మనముందు పరిచాడు “దండకడియం” గా. ఈ విషయాన్ని నారాయణ స్వామి ముందుమాటలో “సబ్ ఆల్ట్రన్” అన్నారు. గొప్ప గమనింపు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గొప్పకావ్యాలుగా నిలిచినవాటిలో చాలామట్టుకు సబ్ ఆల్ట్రన్ రచనలే అనేది ఒక సత్యం.
***
ఈ సంపుటిలో నన్ను ప్రధానంగా ఆకర్షించినది భాష. ఒక వింతైన వొడుపుతో సాగే భాష. గోదావరి జిల్లావాడిగా నాకు తెలంగాణ యాసతో పెద్దగా పరిచయంలేదు. ఆ అవసరమూ రాలేదు. సాహిత్యపరంగా ఏదో మిస్ అవుతాను అనుకొన్నప్పుడు బుద్ధిగా కూర్చుని ఆ కథనో, నవలనో, కవితనో చదూకున్నానే తప్ప వంటపట్టించుకోలేక పోయాను. ఇది బహుశా నా దౌర్భల్యమే కావొచ్చు.

గోపాల్ ప్రేమ మళ్ళీ చాన్నాళ్ళకు అలా కూర్చోబెట్టింది నన్ను. ఎసొంటి, ఒడువని, సర్వమీది, నీళ్ళసాకలు, డిల్లెంపల్లెం దరువులు, దగ అల్సుకొని, శనగుగ్గీలు, నాల్గుబుక్కల, చేతిలో వడ్డంక, దీవెనార్తులు, పాడువడ్డ, పొటుకులు, అల్కగా లాంటి పదాలలో ఉండే సౌందర్యం, ఆ పదాలను పైకి చదూకొన్నపుడు గొంతునిండా ఒక హాయైన మెత్తందనం అనుభవానికి వచ్చాయి.
***
ఇక గోపాల్ కవిత్వంనిండా బాల్యం, అమ్మ, నాయిన, అక్క, తాత, మేనత్తలు, ఊరిమనుషులు, బడిసార్లు, మేడమ్ లు. వాక్యవాక్యాన జ్ఞాపకాల ప్రవాహం. జ్ఞాపకాలను కవిత్వం చేయటం అందరూ చేసేదే. వాటిని ఎంత ప్రతిభావంతంగా చేసేడన్నది గమనిస్తే ఒక నాస్టాల్జియా కవికి ఒక “మేలిమి గింజ” కవికి వ్యత్యాసం ఇట్టే తెలిసిపోతుంది. శివారెడ్డి గారు ముందుమాటలో అన్నట్లు గోపాల్ ఒక “మేలిమి గింజ”

గోపాల్ కవిత్వం నిండా తలపోతలనుండి తలపోతలలోకి చేసే ప్రయాణంకనిపిస్తుంది. ఈ ప్రయాణంలో – మనకు ఒక గ్రామీణ సౌందర్యం కనిపిస్తుంది. ఒక ప్రాంత అస్తిత్వంగా రూపుదిద్దుకొన్న భాషతాలూకు సౌరు కనిపిస్తుంది. మానవసంబంధాలలోని ఆర్థ్రత కనిపిస్తుంది. వస్తువును కవిత్వంగా మలచిన విద్య కనిపిస్తుంది. బహుజన జీవన పరిమళం కనిపిస్తుంది.

గోపాల్ మెత్తని హృదయమున్న కవి. అనుబంధాలను ప్రాణంగా పదిలపరచుకొనే మనిషి.
//మా మధ్య ఏ బంధుత్వమూ లేకపోయినా
ఆమె నన్ను నాయనా… అంటది
నేను ఆమెను అమ్మా… అంట
ఒకే ఆకాశాన్ని కప్పుకున్నం
ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం
ఇది చాలదా?
మేం బంధువులం కావటానికి. (ఒకే ఆకాశాన్ని కప్పుకొన్నవాళ్లం).

ఇదంతా హృదయ నైర్మల్యం. ఉత్త పల్లెటూరి స్వచ్ఛత ఇది. మేకపొదుగునుండి నోటిలోకి పిండుకొనే కలుషితం కాని నురుగుల పాలధార.
***
తెలంగాణ కవిత్వంలో చెరువు వస్తువుగా అనేక కవితలు కనిపిస్తాయి. బహుశా ఆ ప్రాంతసాంస్కృతిక, భౌగోళిక నేపథ్యానికి చెరువు ఒక సిగ్నేచర్ అనుకొంటాను. దీనికి కాంట్రాస్ట్ గా ఆంధ్రప్రాంత కవిత్వంలో కాలువల ప్రస్తావన ఉండటం గమనిస్తాం. గోపాల్ చెరువుపై వ్రాసిన కవితలో

//మనిషిని ముట్టుకోకుండా జేసిన
కులంగీతల్ని దాటి
మనుషులంతా ఇక్కడే
తామరపువ్వులైవిచ్చుకుంటారు.//
దూపగొన్న జివ్వాలగుంపుల్ని
చెర్లకు మర్లేస్తుంటే
తువ్వాలలో
పసిపాపై నిద్రవోతున్న సద్దిమూట
కండ్లు తెరిచేది ఈ చెరువుగట్టుపైనే//

ఊరిమైలనంతా కడిగి
గుండెగూట్లో దీపం వెలిగించే
చెరువుకూడా మనింటి ఆడబిడ్డే (చెరువుగట్టు మీద)

చెరువు అనగానే గట్టు, చెట్టు, తామరలు, మనుషులు, పంటనీరు అంటూ దృశ్యాల్ని, పనుల్ని వర్ణించటం సాధారణం. పై కవితలోని మనుషులు తామరపువ్వులవ్వటం, పసిపాపై నిద్రపోయే సద్దిమూట, గుండెగూట్లో దీపం వెలిగించటం లాంటి పోలికలు కవితను నిలిచిపోయే కవితగా చేసాయి.

సామాజిక సంఘటనలు స్పందనగా రాసే కవిత్వంలో ఆగ్రహం బలంగా పలుకుతుంది ఎక్కువగా. కానీ గోపాల్ రాసిన కవితలో కరుణ పలకటం గమనార్హం. ఆసిఫా మరణంపై రాసిన ఈ వాక్యాలు చూడండి

//ఊర్లో కథలు చెప్పెటోళ్లకు
పదిరూపాలిచ్చి నీ పేరు సదివిచ్చుకుంట
నీతోటి దోస్తుల పెండ్లీలైతుంటే
ఏ ముత్యాలపందిరి కింద ఉన్నవో అని వెతుక్కుండ

నువ్వు పట్టుకున్న వస్తువులను
ఇప్పుడు నేను పగలగొట్టుకోలేను
నీకని కుట్టిచ్చిన గౌనులను
పారేయ మనసొస్తలేదు// (అడవిలో పొద్దూకినట్లు)

ఇదంతా దుఃఖం. ఆ దుఃఖోద్వేగంతో మమేకమౌతాం. కథలు చెప్పేటోళ్ళతో పేరు సదివిచ్చుకుంటా అనటంలోని ఆర్థ్రత గుండెల్ని మెలిపెడుతుంది. ఆ సందర్భంతో ఈ కవి హ్రుదయం మమేకమైన తీరులో నిజాయితీ కనిపిస్తుంది. కవికి ఉండాల్సిన మొదటి లక్షణం నిజాయితీ అని కొప్పర్తి అంటారు.

ముల్లును ముల్లుతోనే
తీసిన చేతులు గదా!
అందుకే ఈ పిడికిలికి
ఇంతటి ధిక్కారపు గొంతు // (ముల్లుపాఠం) అన్న శక్తివంతమైన వాక్యాలు కలిగిన కవితనిండా మార్దవతే తప్ప కాఠిన్యం కనిపించకపోవటం గోపాల్ శిల్ప చాతుర్యం. ఇది సాధనతో వచ్చేదికాదు, హృదయగతమై ఉండాలి. ఆ ఆర్ధ్రత, మెత్తదనం, ఊహను స్థానికీకరణ చేసే మంత్రశక్తి గోపాల్ కు గుండె అంచులవరకూ ఉన్నాయి.

తండ్రి వృత్తిలో సహాయపడిన గొడ్డలిని వర్ణిస్తూ రాసిన ఈ వాక్యాలలోని ఐరనీ ఒక జీవితకాల విషాదం

ఈ గొడ్డలితోనే
చిటారు తుమ్మకొమ్మల్ని నరికి
మేకలకు మండ దెచ్చేటోడు//
నాన్న చనిపోతే
ఆ గొడ్డలితోనే పాడెకట్టెలు కొట్టుకొచ్చారట (నాన్న గొడ్డలి).
***

గోపాల్ వస్తువుని కవిత్వం చేసే రహస్యాన్ని తెలుసుకొన్నవాడు. ఊహను పదచిత్రంగా, పదచిత్రాల్ని ఉద్వేగాలుగా చెక్కటంలోని మెళకువల్ని సాధించాడు. “మేలిమి గింజ” కవిగా ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు. ‘దండ కడియం” ఒక గొప్ప ప్రారంభం. సబ్ ఆల్టర్న్ అస్తిత్వ చైతన్యానికి అద్భుతమైన కవిత్వరూపం ఇచ్చాడు.

గుండెలోపలి జ్ఞాపకాల భాస్వరాన్ని బయటకు తీసుకొని వెలిగించుకొంటూ, దారులు వెతుక్కుంటో తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. బయట వెలుగు-లోపలి చీకటి, లోపలి వెలుగు-బయట చీకటులతో మరిన్ని ఘర్షణలు పడాలి. ఆ ఘర్షణలలోంచి బయటపడే మరింత విస్తారమైన రహదారులపైన తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడన్న నమ్మకం నాకుంది.

“దండ కడియం” తగుళ్ళ గోపాల్ కు అభినందనలతో

బొల్లోజు బాబా

పిష్టపురం



చరిత్రలో పిష్టపురం (నేటి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం) ప్రస్తావన మొదటి సారిగా సముద్రగుప్తుని అలహాబాదు జయస్తంభంపై కనిపిస్తుంది. సముద్రగుప్తుడు 360 CE లో దక్షిణాదిగా రాజ్యవిస్తరణ జరిపినపుడు పిష్టపురంలోని మహేంద్రుడనే రాజును జయించాడని ఆ జయస్తంభ శాసనంలో చెప్పబడింది. అంటే అప్పటికే పిఠాపురం రాజధానిగా ఉండిన ఒక గొప్ప పట్టణంగా భావించాలి.


No photo description available.400 CE నాటి రాగోలు తామ్రశాసనం ద్వారా కళింగరాజ్యాన్ని శక్తివర్మ అనే రాజు పిష్టపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలుస్తున్నది. కుమారస్వామి అనే బ్రాహ్మణునికి శ్రీకాకుళం సమీపంలో ఉన్న రాకలువ (నేటి రాగోలు) అనే గ్రామాన్ని శక్తివర్మ తన 14 వ Regnal year లో (పరిపాలనా సంవత్సరం) దానంగా ఇచ్చాడు. ఈ తామ్రశాసనాన్ని అతని మంత్రి అర్జునదత్తుడు రాయించాడు. (రి. The quarterly Journal of Andhra Historical Research Society Vol 2 1927 p.no 161)

481 CE లో పిష్టపురాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్న అనంతవర్మ అనే రాజు ఇచ్చిన ఒక దాన తామ్రశాసనంలో ఆచంటకు చెందిన ఒక వ్యక్తికి కిందెప్ప అనే గ్రామాన్ని పన్నురహితమాన్యంగా ఇచ్చినట్లు ఉన్నది.

పై రెండు శాసనాల ద్వారా అటు శ్రీకాకుళం నుండి ఇటు పశ్చిమగోదావరి ఆచంటవరకూ ఉన్న ప్రాంతానికి పిఠాపురం రాజధానిగా ఉండేది అని అనుకోవచ్చు.

అనంతవర్మ తరువాత పిష్టపురంపై ఆధిపత్యంకోసం కళింగరాజులకు గుంటూరు ప్రాంతపాలకులైన శాలంకయనులకు పోరు నడిచి చివరకు ఏడవ శతాబ్దంలో ఇది బదామి చాళుక్యుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది.

బదామి చాళుక్యుడైన రెండవ పులకేశి (610-642) తన రాజ్యాన్ని దక్షిణాది వరకూ విస్తరించాడు ఆ క్రమంలో వేంగిని జయించి ఈ ప్రాంతానికి పిఠాపురాన్ని రాజధానిగా చేసి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడిని ఇక్కడ నిలిపి తనకు సామంతుగా ఉంటూ పాలించుకొమ్మని అప్పగించాడు.

కుబ్జవిష్ణు వర్ధనుడు (624-641) పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని గోదావరి ప్రాంతాన్ని పాలించాడు.

ఇతని కుమారుడు జయసింహ I పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. ఆ విధంగా పిఠాపురం వేంగి రాజ్యానికి రెండవ రాజధానిగా మారి తన ప్రాభవాన్ని కొంతమేరకు కోల్పోయింది. (రి.Epigraphia Indica Vol 23 p.no 90)
***

ఏడవ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు జైన మతాన్ని ప్రోత్సహించారు. పిఠాపురంలో నేటికి సన్యాసిరాళ్ళు/దేవుళ్ళు పేరుతో జైన విగ్రహాలు ఆరాధనలు అందుకొంటున్నాయి. తపస్సుచేసుకొంటున్న ముని ఆకారంలో ఉన్న రాతివిగ్రహాలన్నీ జైన లేదా బౌద్ధానికి చెందిన ప్రతిమలుగా గుర్తించవచ్చు. జెల్లూరు లో లభించిన కొన్ని జైన విగ్రహాలకు స్థానికులు గుడి కట్టి దీపారాధనలు చేస్తున్నారు. ఆ తరువాత శైవం ప్రచారంలోకి రావటంతో చాలా జైన/బౌద్ధ ఆలయాలు, శివాలయాలుగా రూపాంతరం చెందాయి. నేటి పంచారామాలు ఒకనాటి బౌద్ధారామాలని అంటారు చరిత్రకారులు. వీటిలో నాలుగు ఆలయాలు గోదావరి జిల్లాలలో ఉండటానికి కారణం ఒకప్పుడు ఈ ప్రాంతంలో వెల్లివిరిసిన జైన బౌద్ధాలే కారణం.
***

పిఠాపురం, కుంతీమాధవస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పక్కనే ఉన్న ఒక శాసనం ఆంధ్ర ప్రాంత రాజుల వంశావళిని నిర్మించటానికి చరిత్రకారులకు ఎంతో సహాయపడింది. ఇది నలుపలకలుగా సుమారు పన్నెండు అడుగుల పెద్ద స్తంభంలా ఉండే శాసనం. దీనికి నాలుగువైపులా వ్రాసిన శాసనాలు కలవు. లిపి తెలుగు. భాష సంస్కృత, తెలుగు మిశ్రమము.

ప్రస్తుతం మనం చూస్తున్న పిఠాపురం కుంతీమాధవస్వామి ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు. నిజానికి ఈ ఆలయానికి కనీసం వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పాత ఆలయ అవశేషాలు ఒక్కటీ కనిపించవు. అంతా రాతిసున్నం కట్టుబడి.

పైన చెప్పిన శాసనం మాత్రం పాతదిగా తెలుస్తున్నది. మెకంజి సామర్లకోట కైఫియత్తులో ఈ శాసనంలోని వివరాలు యధాతధంగా స్థానిక చరిత్రగా పొందుపరచబడ్డాయి.

E. Hultzsch అనే చరిత్రకారుడు ఈ శాసనాన్ని పరిష్కరించి వ్రాసిన ముప్పై పేజీల వ్యాసం Epigraphia Indica Vol IV లో ఉన్నది.
.
శాసన విషయం

మూడవ గొంకరాజు భార్య, పృధ్వీశ్వర మహారాజు తల్లి అయిన జయాంబిక నవకండవాడ అనే గ్రామాన్ని నిత్యదీపారాధనకొరకు కుంతీమాధవ స్వామికి సమర్పించుకొన్న సందర్భంగా ఇది 1186 CE లో వ్రాయించిన శాసనము.
ఈమె మాధవదేవరకు, శ్రీ లక్ష్మిదేవి అమ్మవారికి గోపురములు, ప్రాకారములు కట్టించెను.

నవకంఢవాడ నేటి కాండ్రకోటకావొచ్చు. ఈ గ్రామానికి సరిహద్దులుగా – తూర్పువైపున పెరవ, నైరుతి వైపున ఇదురవాము, దక్షిణము వైపున సూరెగుండ, పడమరవైపున కొమ్మినాయకుని చెరువు, ఉత్తరము వైపున పుట్టలత్రోవ ఉన్నవని స్పష్టంగా వివరాలు ఉన్నాయి. కానీ ఈ గ్రామనామాలు నేడు వాడుకలో లేవు. శాసనము దిగువన, చెక్కిన వ్యక్తి పేరు అయ్యపిల్లార్య, కంఠాచారి శ్రీపిఠాపురం అని ఉంది.

ఈ శాసనంలో సుమారు పాతికమంది రాజుల వంశ కాలక్రమణిక లిఖించబడింది. ఇతరప్రాంతాలలో లభించే శాసనాలు, తామ్రఫలకాలలోని వ్యక్తుల వంశావళిని ఈ కుంతీమాధవస్వామి ఆలయశాసనంతో పోల్చి సరిచూసుకొని వాటి కాలాన్ని చరిత్రకారులు నిర్ధారించటం చేస్తున్నారంటే ఈ శాసనం ఎంతవిలువైనదో అర్ధం చేసుకోవచ్చును.

సాధారణంగా దానశాసనాల చివరలో అతిక్రమణలకు పాల్పడినవారు, బ్రాహ్మణ హత్య, తల్లి హత్య చేస్తే వచ్చేలాంటి పాపంమూటకట్టుకొని నరకానికి పోతారంటూ వివిధ రకాల శాపాలు ఉంటాయి.

ఈ శాసనంలో “దానం శత్రువు చేసినదైనప్పటికీ అది రక్షింపబడాలి. ఎందుకంటే శత్రువు శత్రువే కావచ్చు, కానీ దానం శత్రువు కాదు” అనే గొప్ప వాక్యం ఆకర్షిస్తుంది.
***
బుచ్చి కుమారవెంట్రాయినిం గారు 1775 లో పిఠాపుర సంస్థానాధిపతి అయినపుడు, ఈ కుంతీమాధవస్వామి దేవాలయముకు ముఖమంటప ప్రాకారము కట్టించి, శ్రీస్వామికి ఆభరణములు చేయించి, నూతన చూడిగుదత్త అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపచేసారు. (రి. మెకంజి కైఫియత్తు). బహుశా నేడు చూస్తున్న ఆలయాకారము వీరు నిర్మించినదే కావొచ్చు.

1881 లో పిఠాపురం మహారాజా రావువెంకట మహీపతి గంగాధరరామారయిణిం గారు ఆలయంలో ప్రతిదినము నూరుమంది జనముకు భోజనఏర్పాట్లు చేసినట్లు ఆలయతూర్పుగోడపై ఒక ఫలకము కలదు.
***
పిఠాపురానికి మూడవ శతాబ్దమునుంచి ఘనమైన చరిత్రకలదు కనుక నేటి కుంతీమాధవస్వామి ఆలయం ఆనాటినుంచి ఉన్నదే కావొచ్చు.

ఆరవ శతాబ్దం వరకూ ఆలయాల నిర్మాణంలో పైకప్పు కలపతో నిర్మించటం ఎక్కువగా జరిగేది కనుక ఆనాటి ఆలయం శిధిలమైపోయి ఉండవచ్చు.

ఇది ఒకప్పుడు జైన ఆలయం కావటానికి అవకాశాలు ఎక్కువ. కాలక్రమేణా హిందూ ధర్మం విస్తరించింది.
మెకంజి సేకరించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బోయినపూడి కైఫియత్తులో ముక్కంటి అనేరాజు ఈ ప్రాంతంలో ఉన్న జైనులను గానుగతొక్కించి సామూహికంగా వధించాడని ఉన్నది. ఈ ముక్కంటి లేదా త్రిలోచనపల్లవుడు ఏడో శతాబ్దానికి (660 CE) చెందిన రాజుగా చరిత్రకారుల ఊహ. (రి. Trilochana Pallava and Karikala Chola by N. Venkata Ramanayya P.no 35)

బొల్లోజు బాబా

శ్రీకాంత్ కవిత్వం

Living itself takes a form of Writing for me - Srikanth

“All that is gold does not glitter,
Not all those who wander are lost;
The old that is strong does not wither,
Deep roots are not reached by the frost.– Tolkien

పై వాక్యాలు శ్రీకాంత్ కవిత్వానికి సరిపోతాయి. తెలుగు కవిత్వలోకానికి శ్రీకాంత్ ఒక ఎనిగ్మా. చుట్టూ ప్రలోభపెట్టే ప్రవాహలమధ్య నిలుచుని దేన్నైతే దర్శించాడో, దేన్నైతే అనుభూతి చెందాడో, దేన్నైతే కవిత్వమని నమ్మాడో దాన్నే రాసాడు. నేను ఇంతే ఇదే “శ్రీకాంత్ కవిత్వం” అని నిజాయితీగా నిర్మొహమాటంగా చెప్పుకొన్నాడు.

శ్రీకాంత్ కవిత్వంనిండా మూడువంతులు స్త్రీలే. భార్య, ప్రియురాలు, కూతురు, వృద్ధ తల్లి, “నువ్వు”గానో రకరకాల రూపాలతో. ఒక్కోచోటా ఒక్కో ఉద్వేగాన్ని పలికిస్తూంటారు.

ఆమె
ఆమె నవ్వడాన్ని తరచూ చూడవు నువ్వు
వంటలో నిమగ్నమై, హఠాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేత్తో
తన మొఖాన్ని తుడుచుకుంటూ

నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను

మరి
ఇక ఆ తరువాత, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది
ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా, ఉజ్వలంగా (ఆమె) ఈ కవిత మొదటి భాగం ఒక సప్తశతి గాథను తలపిస్తుంది. రెండవభాగంలో అందమైన జీవన లాలస వెల్లువై పలుకుతుంది. అందం, ఆనందం జీవనేచ్ఛై పరిమళించే పద్యమిది
***
ఇలాంటిదే మరో కవిత

అరచేతుల మధ్య ఒక కప్పును పుచ్చుకుని పొద్దున్నే తేనీరుగా మారుతావు కదా నువ్వు. అప్పుడు అల్లంవాసన వేస్తాయి నీ చేతులు. మరి నీ పెదాల మధ్యనుంచి కొంత ఏలకుల సుగంధం కూడా//

// ఆ మెత్తని నిశ్శబ్దంలో, దుప్పటిలో ముడుచుకుని అస్సలే కదలరు మన పిల్లలు. ఇల్లంతా ఒక శాంతీ, కాంతీ, గోరువెచ్చని నీడలూ, అలంకారిక పింగాణీ వస్తువులపై ఆగే లోకమూ అతి సూక్ష్మంగా వాటిపై పేరుకొనే కాలపు ధూళీనూ! సరిగ్గా అప్పుడే నీ వెనుకగా చేరి నా చేతుల మధ్యకు తీసుకుంటాను నిన్ను, చూడు:
ఇక ఈ ఉదయాన మరో కప్పు తేనీరు త్రాగవచ్చు మనం నింపాదిగా, శాంతిగా, తొలిసారిగా (తేనీరు)

తేనీరు వంకతో శృంగారానుభవాన్ని పండిస్తున్నాడిక్కడ. కవిత్వంలో స్త్రీ గురించి వ్రాయటాన్ని Burden of Women అని అంటారు విమర్శకులు కానీ జీవితంలో స్త్రీని అలా అనగలరా? కవిత్వానికి జీవితానికి ఉన్న సన్నని రేఖను చెరిపేసే శ్రీకాంత్ కి ఇవేమీ పట్టవు. అనుభవాన్ని కవిత్వీకరించటమొక్కటే తెలుసు
***
ఒక గృహిణి దైనందిన జీవితాన్ని వర్ణించే ఓ కవితను ఇలా ముగిస్తాడు

రాత్రి నిలువునా చీలిపోయింది. గదిలోని దీపం
సగంగా చిట్లిపోయింది. పగిలి పగిలి
నీ ముంగిట్లోకి తూలుతూ వచ్చింది నేనే

విరిగి విరిగి నిదురలేక తిరిగి లేచి, నన్నే
ఈ స్మశానాన్నే శుభ్రం చేసి
నా తల వద్ద ఒక ప్రమిదె వెలిగించినదీ నీవే

ఎన్నడైనా ఉన్నానా నేను నీకు
ఎన్నడైనా ఉన్నావా నువ్వు నాకు అని
నువ్వూ అడగలేదు-నేనూ చెప్పలేదు- (ఒక సాధారణ వచనం)

దృశ్యాన్ని కళ్లకు కట్టటం గొప్ప విద్య. ఆ టెక్నిక్ అంచుల్ని చూపించే నేర్పరి శ్రీకాంత్. పై సందర్భానికి నిలువునా చీలటం చిట్లిపోవటం స్మశానాన్ని శుభ్రం చేయటం, ప్రమిద వెలిగించటం లాంటి వర్ణణలు సందర్బంలోని ఉద్వేగాన్ని కళ్ళముందు నిలుపుతాయి. గగుర్పొడుస్తాయి కూడా. ఇక చివరి వాక్యాలలోని తర్కం ఎస్కేపిజాన్ని సూచిస్తున్నా వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది.
***

How was the day అని అడుగుదామని అనుకుంటాడు అతను తనని//
//నిస్సత్తువుగా కుర్చీలో జారగిలబడి, భుజాన బ్యాగుని పక్కకు వదిలి
కళ్ళలోని వాననీ
శరీరంలో వడలిన
పూలనీ, రేగే ధూళినీ తుడుచుకుంటూ, సొమ్ముసిల్లుతున్న నవ్వుతో
అతి కష్టం మీద
ఇలా అంటుంది
తను అప్పుడు
అతనితో;
“కొద్దిగా ఓ గ్లాసు మంచి నీళ్ళు అందిస్తావా?” -- (ఇవ్వాల్సినది)---

ఎంత సామాన్య దృశ్యమిదీ? ఎంత గొప్ప సజీవ సంబంధపు చిత్రీకరణ. కవితలో గొప్ప పదచిత్రాలు, తాత్విక చర్చలూ ఏమీ లేవు. ఉత్త వచనం. బయట పనిలో అలసి వచ్చిన భార్యో/ప్రియురాలో ఇంటికి వస్తే పూర్వకాలపు కవులలా చమట చుక్కలు వజ్రపుతునకల్లా మెరుస్తున్నాయనకుండా కాసిన్ని మంచినీళ్ళిస్తావా అనిపించటం కవిత్వాన్ని భూమార్గం పట్టించటం కాదూ? చాలా కవితల్లో ఇదే భావనను ఇంకా బలంగా వ్యక్తీకరిస్తాడు శ్రీకాంత్.
***

// “కొద్దిగా తోడు ఉండు నాకు. అప్పుడప్పుడూ చాలా బెంగగా ఉంటుంది – ఒంట్లో బావోలేదు. నాప్కిన్స్ తెచ్చుకోవటానికి ఓపిక లేదు. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది” అని తను ముడుచుకు పోతే, అప్పుడు నువ్వొక నిస్సహాయుడివి. నేలపై వ్యాపించే రాత్రివి. అంత నొప్పిలోనూ ఉదయం తనుకడిగిన ఇంట్లో తన శరీరం వాసన. ఎలెక్ట్రిక్ కుకర్లో ఉడుకుతున్న అన్నం వాసన. తెరచిన బాల్కనీలోంచి చీకటి వాసన//

//కడుపునొప్పికి మాత్రలు, వాలుతున్న తన కనురెప్పల కింద చలించే అరణ్యాలు, నుదిటిపై తెరలుగా వీచే పురాస్మృతులూ… ఇక అరచేతిలో తను నీ అరచేతిని గట్టిగా పట్టుకొని పడుకొంటే//…
//చదువరీ, ఇక ఇప్పటికి ఇదే జీవితం, ఇదే కవిత్వం; నువ్వే చెప్పు ఇక, ఇంతకు మించి వీటన్నిటినీ దాటి మిగిలేది ఏమిటి? నీకూ నాకూ – మనకూ (ఇక ఇప్పటికి)---

అసలు ఇలాంటి కవిత తెలుగులో ఇంతవరకూ వచ్చిందా అని అనుమానమే. ఇది కాదూ జీవితం.
కవిత్వం అంటే సంస్కృత పదాలతో బరువుగా ఉండాలనీ, అమూర్త భావనలతో లోతుగా ఉండాలనీ, ఏవేవో పెద్ద పెద్ద సిద్ధాంతాలను ప్రవచించాలని, సమాజాన్ని ఉద్దరించాలని, ప్రజల్ని గొప్పపనులకై కార్యోన్ముఖుల్ని చేయాలని, అభ్యుదయాన్ని కాంక్షించాలని ఎన్నెన్ని కుట్రలు చేసారూ, ఎన్నెన్ని కట్టుకథలు చెప్పారూ ఇంతవరకూ పెద్దలందరూ అనిపించక మానదు.
ఒక జీవితానుభవం. ఒక మానవీయ దుఃఖం. ఒక తడి సందర్భం. శ్రీకాంత్ వాక్యాల్లోనే చెప్పాలంటే ఇక ఇప్పటికి ఇదే జీవితం, ఇదే కవిత్వం.
***

“భయపడ్డావా” అంటూ తెగిన పెదాలపైనుంచి నెత్తురిని మెత్తగా నీ
తెల్లటి దుప్పట్టాతో తుడిచినా, నా లోపలి వొణుకు ఆగదు//
“ఇలా దగ్గరకు రా. కొరకనులే ఈ సారి. భయపడకు” అంటూ మళ్ళా తనే, నన్ను జాగ్రత్తగా
తన తల్లితనపు పాలిండ్లలో పొదువుకుంటే, ఇక అలా వెచ్చగా ఒదిగి
తన చుట్టూ చేతులు వేసి, తనని గాట్టిగా పట్టుకుని
ఆ చీకట్లలో నా ముఖం దాచుకుని, అలా పడుకుని
బయట కురిసే వానని, తన శరీరంలోని ప్రవాహాన్నీ
వింటుంటే అడుగుతుంది తను, స్ఖలించినంత హాయిగా;
“I like this night and
I like this Bacardi Rum
Do you” ----

ఒకానొక ప్రియురాలి ప్రేమోన్మత్తత. వివశో, పరవశో తెలియదు. కానీ అనుభవం కళ్ళముందు నిలుస్తుంది. శృంగారం ఇక్కడ బహుశా వివాహం వెలుపలది కావొచ్చేమో - జీవితంలో నిషిద్దవస్తువేం కాదుకదా. దాహం వేసినపుడు చల్లని నీళ్ళు తాగినపుడు కలిగే అనుభవాన్ని అద్భుతంగా చెప్పిన ఇస్మాయిల్ మరో చోట యుద్ధాంతాన/కళ్ళు తేలేసి/నిర్వికల్ప సమాధిలో/సర్వాంగాలూ స్తంభించే/యోగిని కూడాను (స్వారీ) అంటాడు. శ్రీకాంత్ కవిత్వం నేలమీదే సంచరిస్తుంది. జీవితంలోంచే వస్తువుల్ని ఏరుకొంటుంది. కథనాత్మకత శ్రీకాంత్ కవిత్వానికి ఆయువు. ఇతని కవిత్వం ఆడంబరాలను, హిపోక్రిసిని దుస్తులుగా ధరించదు.
***

అర్ధరాత్రి నిదురలోంచి లేచొచ్చి, ఒక మూడడుగుల మల్లెపూవు
నా పక్కగా వచ్చి ‘నాన్నా’ అంటో
నన్ను హత్తుకుని పడుకుంది. ఇక
ఆ చీకట్లో ఒక నెగడు రగిలి, పేరులేని సుగంధమేదో
గాలిలో వీయగా, ఎక్కడో కొమ్మల్లో గూళ్ళల్లో
పక్షులు రెక్కలు సర్దుకుంటున్న సవ్వడి://

//కొంత అలజడి, కొంత అబ్బురమూ కొంత
జీవితం పట్ల కృతజ్ఞతా, కొంత
కరుణా, బోల్డంత ఇష్టమూ (ఎలా నిదురోగలం?) --

ఈ కవిత చదివాకా "దినచర్య" అనే మరో కవితలో శ్రీకాంత్ చెప్పిన. “ఇంతా చదివి ఇదేమిటని మీరడిగితే, ఇక నేను ఏమీ చెప్పలేను. నిండుగా సజలమైన ఈ నా హృదయంలో మీ చేయి జార్చి ఒక అద్దాన్ని వెలికి తీసి మిమ్మల్ని మీరు చూసుకోమని చెప్పటం తప్ప” అనే వాక్యాలు గుర్తొస్తాయి.

రాత్రివేళల పిల్లలు మనల్ని కావలించుకోవటమో, మనపైన కాళ్లువేసుకొని పడుకోవటమో ఎవరికి అనుభవంలోనికి రాని విషయాలు? ఎన్ని మెటఫర్లతో ఆ అనుభవాన్ని శ్రీకాంత్ మన అనుభవంలోకి తీసుకొస్తున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. మూడడుగుల మల్లెపూవు, పేరులేని సుగంధం, పక్షులు రెక్కలు సర్దుకోవటం, జీవితం పట్ల కృతజ్ఞత లాంటి ఉపమానాలు ఆ సంఘటనలోని భిన్న కోణాల్ని ఎంతో సటిల్ గా ఆవిష్కరిస్తాయి. ఈ కవిత్వం అంతా శ్రీకాంత్ హృదయంలోంచి తీసిన అద్దంలో మనల్ని మనం చూసుకోవటమే. కవిత్వానికి ఇంతకు మించిన పరమార్ధం ఏముంటుందీ?
***
అమ్మల పై వ్రాసిన కవితలు అనేకం ఈ సంపుటిలో కనిపిస్తాయి. ఒక్కో చోట ఒక్కో కొత్తకోణంలో అమ్మలు కనిపిస్తారు. చాలా చోట్ల ప్రేమ, కొన్ని చోట్ల అమ్మను సరిగ్గా చూసుకోలేకపోతున్నందుకు అపరాధనా భావన, అమ్మ ఎలాఉందో ఈ వేళ అంటూ చేసే ఊహలు.

తాగి వచ్చి సంజాయిషీ చెప్పుకొనే కొడుకుతో “పొద్దుపోయింది వెళ్ళు. వెళ్ళి ఇంత అన్నం తిను. ఖాళీ కడుపుతో పడుకోకు” అని చెపుతుంది అమ్మ ఓ కవితలో.

ఉండే ఉంటుంది తను ఇప్పటికీ – ఎక్కడో-
నన్ను తలుచుకుంటో
ఏ చింత చెట్ల నీడల కిందో
ఓ ఒంటరి గుమ్మం ముందో
కాన్సరొచ్చి కోసేసిన వక్షోజపు గాటుపై
ఓ చేయుంచుకుని నిమురుకుంటూ
తనలోనే తాను ఏదో గొణుక్కుంటూ (యిలా) -- అంటూ అమ్మ కవి జ్ఞాపకాలలో మెసలుతుంది మరో కవితలో. ఆ వక్షోజపు గాటు పట్టించుకోని కొడుక్కి ఒక మెటానొమి అనుకొంటే ఎంతటి భీతావహమైన ఊహ అది.

తనకొడుకులు వాళ్ళ అమ్మని “అమ్మా నువ్వు తినమ్మా. తిన్నావా లేదా?” అని అడిగినపుడు- అదే మాటను సరైన సమయంలో ఎన్నడైనా నా తల్లిని అడిగానా నేను” అని అమ్మ గుర్తుకొచ్చి వ్యాకుల పడతాడు కవి “ఒక క్షణం” కవితలో.

//ఏమీ లేదు
ఈ ఉదయం ఇంటికి వెళ్ళాను
ఒక అతిధివలే అమ్మని చూసి వచ్చాను// (అతిథి) అనే కవితలో అనివార్యమౌతున్న ఆధునిక జీవన భీభత్సాన్ని కళ్ళకు కడతాడు.
***

శ్రీకాంత్ కవిత్వంలో సమాజం నడుస్తున్న తీరుపట్ల ఆగ్రహం ఉంది. దాన్ని వ్యక్తీకరించిన విధానం కథనాత్మకంగా ఉంటుంది.

ఒక ముస్లిం వ్యక్తి వినాయక నిమజ్జనం రోజున ఇంటికి చేరుకోవటాన్ని వర్ణించిన తీరులో శ్రీకాంత్ జీవన వాస్తవికనుండి ఎస్కేప్ అయ్యే కవికాదు అని అర్ధమౌతుంది.

ఆ ముస్లిమ్ వ్యక్తి రోడ్డుపై ఇంటికి వెళుతున్నప్పుడు “//ఒక మస్జిద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరామ్ అని నినదించలేదు/గణగణగణమనే గంటలతో నుదిటిన త్రిశూలాలవంటి బొట్లతో ఎవరూ అతన్ని భయభ్రాంతుడిని చేయలేదు/అతని ఒళ్ళంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు// అంటాడు. ఒక్కో ఇమేజెరీ నేటి రాజకీయ వికృతక్రీడను శక్తివంతంగా అక్షరీకరిస్తుంది. ఇదే వస్తువుని డమడమల శబ్దాలతో వ్రాసే విధానానికి శ్రీకాంత్ ఎంచుకొన్న శిల్పానికి అసలు పోలిక తేలేం. ఒక సామాజిక అంశాన్ని శక్తివంతంగా చెప్పటానికి శిల్పం యొక్క అవసరం పై కవిత నిరూపిస్తుంది.
***

"పిల్లలు నిన్నుపట్టుకొని ఏడ్చినపుడు" అనే కవితలోని సందర్భం అపురూపమైనది.

“మృత్యువు నుంచి తప్పించుకు వచ్చిన అమ్మాయి” కవితా వస్తువు వినూత్నమైనది. ఆర్థ్రత హృదయాన్ని ద్రవింపచేస్తుంది.

"అమ్మ"అనే కవిత “ఆమె ఎవరైతేనేం?” కవితను స్ఫురింపచేస్తుంది.

"లమ్డికే" కవిత చెర్నకోలతో చరచినట్లుంటుంది.

“మహా మంత్రగత్తె” కవిత మంత్రముగ్ధంగా నడుస్తుంది.

“జణగణమన అంబానీ అను రిలయన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కవిత పల్చగా ఉంది.

“అనేక సార్లు పడుకొని ఉంటాను అతనితో” గొప్ప శక్తివంతమైన వ్యక్తీకరణ.

“ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు” లోతైన భావాలను పొదువుకొన్నది.

“అమ్మ చెప్పిన కథ” ఇంటలెక్చువల్ కవిత.

“ఒక రాత్రి”, “ఒక రోజు” ఇంకా మరికొన్ని కవితలలో హద్దుమీరిన బూతు వాంఛనీయం కాదనిపిస్తుంది. ఇదేమీ విక్టోరియన్ మొరాలిటీ సిద్ధాంత చర్చ కాదుకానీ, తెలుగు నేల ఇంకా ఆ స్థాయిని అందుకోలేదని అనుమానం. బహుశా తెలుగు కవిత్వంలో ఉన్న మోనోటనీని బద్దలుకొట్టటానికే ఆ కవితలు రాసాడేమో.

శ్రీకాంత్ అభివ్యక్తి విలక్షణమైనది. ఇతని వ్యక్తీకరణ పదునుగా, మేధోపరంగా ఉన్నత స్థాయిలో సాగుతుంది. వస్తువులు కూడా ప్రత్యేకమైనవి. విస్తృతి అధికం. మూడునాలుగు కవితలలో అధివాస్తవిక ధోరణులు కనిపించినా అస్పష్టత మాత్రం లేదు.

శ్రీకాంత్ కవిత్వపరంగా లోలోపలకు చేసిన ప్రయాణం సింహభాగంగా ఉంది. బయటకు చేసిన ప్రయాణం కొన్ని కవితలలో తెలుస్తున్నా వానిలో అనుభూతి సాంద్రత లోపించటం గమనిస్తాం. ఇతని కవిత్వాన్ని స్థూలంగా అంతర్ముఖత్వ కవిత్వంగా భావించవచ్చు. శ్రీకాంత్ కవిత్వంలో కథనాత్మకత ప్రముఖంగా కనిపించే శిల్పం. ఆ విషయంలో శ్రీకాంత్ కవిత్వాన్ని బుకోవ్ స్కీ కవిత్వంతో పోల్చవచ్చు.

విభిన్నమైన కవిత్వాన్ని ఇష్టపడేవారికి, అత్యాధునిక వ్యక్తీకరణను తెలుసుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం తప్పక నచ్చుతుంది.

సంపుటి పేరు “శ్రీకాంత్”. దీనిలో మొత్తం 210 కవితలు ఉన్నాయి. పేజీలు 312.

ఫోన్: 9848666846

బొల్లోజు బాబా

మూడో కన్నీటి చుక్క 6

Thank you Ryali Prasad gaaru for a nice words on my book.

ఒక జీవిత కాలపు వాగ్దానం.
సున్నిత స్వభావంతో నిండి
కర్కశ సమాజాన్ని ప్రక్షాళన చేసే కవిత్వం ' మూడో కన్నీటి చుక్క "

ఈ కాలం కవిత్వం. దీనిలో కొన్ని కవితలు ఆలోచింపచేస్తాయి.
కొన్ని ఆవేశపరుస్తాయి.

కొన్ని గుండెను పట్టుకుని పీడిస్తాయి.
మనసును వీడనని మొండికేస్తాయి.

థేంక్యూ గురూ.
మంచి కవిత్వం అందించినందుకు. ఆవిష్కరణలో నన్నూ భాగం చేసినందుకు.

by Ryali Prasad

మూడోకన్నీటిచుక్క 6

#మూడోకన్నీటిచుక్క గురించి ఆత్మీయవాక్యాలు పలికిన శ్రీ పక్కి రవీంద్రనాథ్ గారికి అనేక ధన్యవాదములతో
బొల్లోజు బాబా

ఇప్పుడే అతని పుస్తకాన్ని
నా చేతుల్లోకి తీసుకున్నాను
పావురం కన్నా మెత్తగా
నీరెండకన్నా వెచ్చగా
కవిగా బ్రతికిన క్షణాల వాసన వేస్తూ
అతని అక్షరాలు...

ఏవి అంతకు ముందు లేవో
వాటిని గొప్ప కాంక్షతో, దయతో
అన్వేషించి
అక్షరాల్లో మనోప్రపంచాల్ని
శిలల్లో భంగిమలని
రంగుల్లో ప్రవహించే దృశ్యాలను ఆవిష్కరిస్తూ అతను...
గొప్ప విభ్రమతో, లాలసతో
అలా చూస్తూనే నేను.

గొప్ప కవిత్వాన్ని కానుక చేసిన
ప్రముఖ కవి బొల్లోజు బాబాకు కృతజ్ఞతలు.

"మూడో కన్నీటిచుక్క"5

నా కవితా సంపుటి "మూడో కన్నీటిచుక్క" పై శ్రీ Abdul Rajahussain
గారి సమీక్ష. థాంక్యూ సర్
***

బొల్లోజు బాబా “ మూడో కన్నీటి చుక్క “ సమీక్ష !!

కళ్ళు రెండే...ఏడిస్తే మొదట రాలేవి రెండు కన్నీటి చుక్కలే... ఈ మూడో కన్నీటి చుక్క ఎక్కడిది? ఇదే ….ఈ జువాలజీ మేస్టారు చెప్పుదలుచుకున్న అసలు విషయం.

ఈ జువాలజీ మేస్టారు కప్పల్ని,బొద్దింకల్ని,వాన పాముల్ని డిసెక్షన్ చేసి ఏ పార్టు ఎక్కడుందో పిల్లలకు చూపించినట్లే..తన కవిత్వంతో ఈ సమాజాన్నిడిసెక్షన్ చేసి రుగ్మతల్ని డిటెక్ట్ చేస్తున్నాడు కవి బొల్లోజు బాబా.

బొల్లోజు బాబా నాకు చాలా కాలంగా తెలుసు. సాహిత్య కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కలుసుకోవడమేకానీ,ఎప్పుడూ సాహిత్య చర్చ చేయలేదు. కారణం ఐటువంటి సందర్భమేదీ రాలేదు. అయితే ఆయన కవిత్వంచదువుతూ వుంటాను, కానీ ఎప్పుడూ ఆయన కవిత్వంపై ఏదీ రాసినట్లు గుర్తులేదు. దాదాపు రాయలేదనే చెప్పాలి. దానికిప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. అలాంటి సందర్భం కానీ, ఆ సమయం కానీ రాకపోవడమే…!!

ఇదిగో ఇప్పుడు “ మూడో కన్నీటి చుక్క “ (డిసెంబర్ 2019 ) పేరుతో బొల్లోజు బాబా తాజా కవితా సంపుటిచదివాక ఇక రాయలేకుండా వుండలేకపోతున్నాను.కారణం ఆయన కవిత్వం అలాంటిది
మరి.ఓ సారిచదివాక మళ్ళీ మళ్ళీ చదవాలనిపించి చదివాను. ఇన్ని సార్లు చదివాక కూడా ఏమీ రాయక పోతే ..అది నా లోపం అవుతుంది. మంచి కవిత్వానికి అన్యాయం చేసినట్లవుతుంది.

బొల్లోజు బాబా..కేరాఫ్ యానాం.! నిజానికి కాకినాడలో నివాసం.అయితే ఆయన సాహిత్య ప్రస్థానమంతా యానాం తోనే ముడిపడి వుంది. ఎంతగా అంటే..”యానాం విమోచనోద్యమం “
(2007)‌ గురించి ఓ పరిశోథక గ్రంథం రాసినంతగా..!

“ఆకుపచ్చని తడి గీతం”(2009) పేరుతో గుండె తడిచేసే తొలి కవితా సంపుటి వెలువరించాడు.
ఆ తర్వాత “వెలుతురు తెర “ (2016 ) ద్వితీయ సంపుటిగా వచ్చింది.మళ్ళీ మూడేళ్ళకు గానీ …. ముచ్చటగా మూడోసంపుటి “మూడో కన్నీటి చుక్క “ (2019) వెలువడింది.
కవిత్వంలో కొంచెం ‘స్లో ‘ అయినా ..కళిత్వంలో ‘ఫ్లో ‘ మాత్రం మిస్ కానివ్వడు.
ఈలోగా అనువాదాలు ..2016లో రవీంద్ర కవీంద్రుని ‘ స్ట్రే బర్డ్స్ ‘ ను “స్వేచ్ఛా విహంగాలు “పేరుతో తెలుగులో అనువదించాడు.

అలాగే సూఫీకవుల కవిత్వాన్ని“ఎడారి అత్తరు" గా తెనుగీకరించాడు. ప్యాబ్లో నెరూడా. ఇరవై ప్రేమ కవితల్ని తెలుగు సేత చేశాడు.

అలాగే రవీంద్రుని “ క్రీసెంట్ మూన్, “గాధా సప్తశతి “ వంటి అనువాదాలు చేశాడు.అంటే ..సొంత కవిత్వం కంటే అనువాదాలే ఎక్కువన్నమాట.అయితే అనువాదాల్లో కూడా తన మార్క్ ను మిస్ కాకుండా జాగ్రత్త పడటం వల్ల, అనువాదాలన్నీ దాదాపుసొంత రచనల్లాగే కనబడతాయి.

నిజానికి జంతు శాస్త్ర మేస్టార్లకి హృదయం వుండదంటారు.కానీ బొల్లోజు బాబాఇందుకు మినహాయింపు. వృత్తి జువాలజీ బోధన..ప్రవృత్తి కవిత్వ రచన..పొంతన లేని వైవిధ్యాల మధ్య తనదైన ఉనికిని చాటుకుంటున్నాడు బొల్లోజు బాబా.

సమాజమే కాన్వాస్ గా….!!

మూడో కన్నీటి చుక్క కవిత్వానికి సమాజాన్ని కాన్వాస్ గా తీసుకున్నాడు. ఇంతకు ముందే చెప్పినట్లు సమాజాన్నిచీల్చి చెండాడి (డిసెక్షన్ ) నిజాల్ని వెలికి తీశాడు. నిజం ఎంత నిష్టూరమైనా వెల్లడించడంలో వెనకాడలేదు. కాకపోతే టముకు కొట్టినట్లు కాక చాపకింద నీరులా నిశ్శబ్దంగానే దుర్మార్గాల భాండాల్ని బద్దలు చేశాడు. అవసరమనుకున్నచోట నేలకేసి కొట్టాడు. ఏది చేసినా, ఎలా చేసినా సత్యాన్ని ఆవిష్కరించి
పాఠకుడి ముందు పెడతాడు. ఆపై తీర్పు పాఠకులదే అంటాడు బొల్లోజు బాబా.

విద్యుల్లత ఈయన కవిత్వం…

బొల్లోజు కవిత్వం చదువుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది.ఉన్నట్టుండి నల్లని మబ్బును చీల్చుకుంటూ ఓ మెరుపు మెరిసినట్లు...సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కొరడా ఝళిపించి నపుడు మనకు తెలీకుండానే మన మస్తిష్కంలో ఓ విద్యుల్లత తళుక్కున మెరుస్తుంది. పాఠకుడు ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ..మెరుపు అనుభవాన్ని మిస్ అవుతాడు. అందుకే బొల్లోజు కవిత్వన్ని చదివేటపుడు బుర్ర దగ్గర పెట్టుకోవాలి.కవిత్వ మెరుపుల్ని ఒడిసిపట్టుకోవాలి. అనుభవించాలి.

ఉదాహరణకు ఈ కింది కవిత చూడండి.

భూమంటే విద్యుత్ కాంతుల్లో
బెల్లీ డాన్స్ చేసే ఆటకత్తె..వాడికి

భూమంటే..నొసటన దిద్దుకునే
ఆకు పచ్చని విభూతి పండు ...వీడికి

యుద్ధానంతరం
భూమికి వీరిద్దరూ
ఓ ఆరడుగుల బాధ్యత…!!” ( భూసేకరణ )

చూడ్డానికి ఈ కవిత చిన్నదే..కానీ వ్యక్తీకరణలో ఎంతో గొప్పది.

ఈ మధ్య సెజ్ ల పేరుతో,రాజధాని పేరుతో, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం భూసేకరణ చేయడం చూస్తూనే వున్నాం. రాజ్యం ఎప్పుడూ ఉన్నోడి పక్షమే వహిస్తుంది. లేనోడ్ని పీల్చి పిప్పిచేసి, రోడ్డుపైవిసిరేయడం మామూలే. కార్పొరేట్లను బాగు చేయడానికి ,రైతుల భూముల్ని సేకరించి “సెజ్“ ల పేర ధారాదత్తం చేయడం కొత్తేమీ కాదు. కాకినాడలో వుంటున్న బొల్లోజు బాబా కు “కాకినాడ సెజ్ “ కోసం ప్రభుత్వం చేసిన భూసేకరణ తతంగం తెలియంది కాదు.సెజ్ లలో పరిశ్రమలు పెట్టి ఇంతకు మరింత సంపాదిస్తాడు కార్పొరేట్. తనకు అన్నంపెట్టే నేలతల్లిని బలవంతంగా లాక్కొని కార్పొరేప్ కు కట్టబెడుతుంది ప్రభుత్వం. పరిహారం పేరుతో తూతూ మాత్రంగా రైతు కంట తడి తుడిచేట్లు నటిస్తుంది ప్రభుత్వం.

ఒకరికి (కార్పొరేట్ కు ) భూమి విద్యుత్ కాంతుల్లో బెల్లీ డాన్స్ చేసే ఓ ఆటకత్తె..మరొకరికి ( రైతుకు) భూమంటే నుదుటన దిద్దుకునే ఆకుపచ్చని విభూతి పండు “...భేదమల్లా చూసే చూపులోనే కాదు..అనుభవంలో,ఆస్వాదనలో కూడా.!

నిజానికి ఒకడికి చెలగాటం..ఇంకొకడికి ప్రాణ సంకటం. భూసేకరణ యుధ్ధం జరిగాక..జయాపజయాల్ని పక్కనబెడితే... వీరిద్దరికీ కావలసింది మాత్రం “ ఓ ఆరడుగుల నేల “ .ఓ ఆరడుగుల బాధ్యత మాత్రమే.

బొల్లోజు కవిత్వం గురించి ఇంకేం చెప్పాలి. ఈ ఒక్క కవిత చాలదా..! అన్నమంతా పట్టి చూడాలా? ఒక్క మెతుకు చాలదా అది ఉడికిందో లేదో తెలుసుకోడానికి. అలాగే బొల్లోజు కవిత్వం పండిందో లేదో తెలుసుకోడానికి ఈ ఒక్క కవిత చాలదా? ఇంకా ఏం కావాలి?

క్షతగాత్ర నదీ.!.!

నది ప్రవాహ శీలి.జీవనది నిరంతరం ప్రవహించే జీవధార.కానీ మానవుడి స్వార్థం నదుల్నే ఎండబెడుతోంది. నదులు జీవం కోల్పోతున్నాయి. ఎండిన కన్నీటి చారికలా తమ గుర్తుల్ని
వదిలేసి కనుమరుగవుతున్నాయి.

ఎడారి నగరాల నిర్మాణాల కోసం
నదిలోని ఇసుకను
యూనిట్లు యూనిట్లుగా తరలిస్తున్నారు.

ఇసుక నుండి కావలసినంత తైలం (సొమ్ము) పిండుకుంటున్నారు. ఇదంతా మనకు తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ దుర్మార్గాన్ని “క్షతగాత్రనది “ గా అభివర్ణించాడు బొల్లొజు బాబా. ఈ కవిత ముగింపులో అద్భుతమైన ప్రతిభను చూపాడు కవి.

“అపుడెపుడో మేసిన వెన్నెల్ని
చందమామ రజనుగా రోడ్డుపై కార్చుకుంటూ
క్షతగాత్ర నది
ట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోంది
నగరం వైపు …”

నిజానికి ఎన్నెల మేసి ఏరులు, నదులు, నెమరేయాలి. కానీ ఇసుకాసురుల వల్ల నదీ గర్భాలు ఒట్టి పోతున్నాయి. ప్రవాహాలకు ఆటంకం కలిగి ఎండోపోతున్నాయి. ఇప్పుడు నదుల్లో నీళ్ళు లేవు. నీళ్ళల్లో వెన్నెల లేదు.ఉన్నదల్లా ఇసుక. ఆ ఇసుకను లారీలకు లారీలు నింపి నగరాలవైపుకు ... తరలించుకు పోతున్నారు. నీళ్ళున్నప్పుడు మేసిన వెన్నెల్ని చందమామ రజనుగా కార్చుకుంటూ క్షతగాత్ర నది ట్రక్కులు ట్రక్కులుగా నగరం వైపుకు ప్రవహిస్తోందంటాడు కవి. ఎంత అద్భుతమైన భావన.!

మనుషులూ..జీవితం..!!

మనుషుల్ని,జీవితాన్ని ఇంతగా అర్థం చేసుకున్న కవిని నేనిప్పుడు చూశాను.
జీవితాన్ని వైభోగంగా కాక అనుభవంగా మలుచుకున్న వాళ్ళు మాత్రమే నిజమైన జీవితాన్ని అర్థం చేసుకుంటారు.బొల్లోజు బాబా జీవితాన్ని దగ్గరగా చూశాడు. స్పృశించాడు. అనుభవించాడు. అనుభవాన్ని అక్షరాల కవిత్వం చేశాడు ..!

*జీవితం ముందుకే తప్ప వెనక్కు
ప్రవహించదన్న సంగతిని
ఏ స్వప్నమో నేర్పుతుందిలే “(పాఠం )

*”సర్దుకు పోవడమంటే
చచ్చిపోకుండా వుండటం అంతే
చరిత్రలో
మనిషేనాడూ సర్దుకు పోలేదు “(ఉదయకాంతి )

*”జీవిత పర్యంతమూ
పరిమళించీ పరిమళించీ
పూదోటగా విస్తరించడానికే
నువ్విక్కడకొచ్చావు “(పూలతోట )

*”జీవించడం అంటే
ప్రేమించిన ఒక్కొక్కరినీ కోల్పోవడం కాదూ..!” (Alone but together)

*”జీవితం
అప్పుడప్పుడు కాస్సేపాగి
తన సెల్ఫీ తానే తీసుకొంటోంది
ఒక్కో ఫోటో
రక్తమూ కన్నీళ్ళు నింపుకున్న
కవిత్వమై చరిత్రలో ఇంకిపోతోంది “..(సెల్ఫీ )

*”గొర్రెల మధ్య గొర్రెలా
నక్కల మధ్య నక్కలా బతకడం
చాలా సులువు
మనిషిలా
బతకాలనుకోవడం కన్నా !”.

ఏ కవికైనా అనుభవం నేర్పే పాఠాలే కవిత్వం గా తన్నుకొని బయటకు వస్తాయనడానికి ఇంతకంటే రుజువులు అవసరమా?

ఈ సంపుటిలో చాలా కవితలు Narrative గా సాగుతాయి. సాధారణంగా Narration ను కథల్లో,నవలల్లో చూస్తాం. కవిత్వంలో అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రాస్తున్న వారిలో చాలామంది Narration పట్ల మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ నరేషన్లో కవిత్వం లేకపోతే తేలిపోతుంది. శుద్ధ వచనంలా మిగిలిపోతుంది.
ఈవిషయంలో బొల్లోజు బాబా చాలా జాగ్రత్తపడ్డాడు. “Message in train, ”నన్ను క్షమించవూ, ప్రయాణం, ఒక..పురా..ప్రకాశం “,
“Alone but together, ఒక apocalypse అనంతరం, “ ఏం పని వుంటుంది నీకు?” తదతర కవితల్లో Narration ను చూడొచ్చు.

ఈ కవికి మానవ బంబంధాల పట్ల గౌరవం వుంది.ఈ కింది ఫ్రాగ్మెంట్ చూడండి .

“సామాన్లు సర్దుతుంటే
పాత ఫోను కనిపించింది
ఆన్ అయింది చిత్రంగా
కాంటాక్ట్స్ లో అమ్మ నంబరు
అలాగే వుంది “.

ఈ సృష్టిలో అనంతమైంది అమ్మ ప్రేమ ఒక్కటే.అలాంటి అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం ఎంత నిర్లక్ష్యం చేసినా అమ్మ ప్రేమ మాత్రం అలాగే వుంటుంది అనడానికిది నిదర్శనం.
ఈ విషయాన్ని ఎంత గుంభనంగా చెప్పాడో బొల్లోజు బాబా చూశారుగా. ఇలాంటి వ్యక్తీకరణలే కవి స్థాయిని పెంచుతాయి.

“గురుదేవులకు వందనాలు “ కవితలో గురు శిష్య సంబంధాన్ని గొప్పగా చెప్పాడు.

*“స్కూలు అంటేనే గురువులు
గురువులంటే నిన్నూ నన్నూ
గురిచూసి సంధించే విలుకాళ్ళు “.

గురువులను విలుకాళ్ళుగా భావించడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా..

" స్త్రీ " అనే కవితలో చివరి స్టాంజా కంట తడిపెట్టిస్తుంది.

తన స్వప్నాల్ని బతికించుకోడానికి
ఓ కుర్రాడు నేత్రాల్ని అమ్ముకొని అంథత్వాన్ని,
హృదయాన్ని అమ్ముకొని అల్పత్వాన్ని
కొనుక్కుంటాడు.
నువ్వు ఇదివరకటి లా లేవు అంటుంది ఆమె.
కాలికింద నేల కూలినట్లు
అనిపిస్తుందతనికి..

*”ఆమె ఒళ్ళో చేరి
వలవలా ఏడ్చేస్తాడు
ఆమె
తన స్తన్యాన్ని అతని
నోటికి అందించి
ఓదారుస్తుంది “!

త్యాగానికి ప్రతీక స్త్రీ మూర్తి. స్త్రీ స్తన్యం అమృతమనే దివ్యౌషధాన్నిచ్చే ప్రేమ కడలి.

ఇలాంటిదే మరొకటి.. ”గుండె పూడిక ఎవరైనా తీస్తే బావుండు".. వంటి ప్రయోగాలు హృదయానికి హత్తుకొని ఆలోచింపజేస్తాయి.

వ్యక్తిత్వాన్ని గౌరవించే ఈ కవి..”ఇంకొకరి అభిప్రాయంగా వుండే కన్నా.! నువ్వే ఓ సిద్ధాంతంలా మారు “ అంటాడు.

”ఇప్పుడీ దేశానికేమైంది? ఎవరిని వధశాలలకు పంపటానికి ఇది కుట్రలు పన్నుతోంది?” వంటి పదునైన పద ప్రయోగాలతో వర్తమాన పరిస్థితుల్ని కళ్ళముందు నిలిపాడు!

ఒకటా..రెండా? ఎన్నని చెప్పేది.మీరే చదివి తెలుసుకుంటే మరింత రస స్ఫూర్తి కలుగుతుంది.

చివరగా...ఈ మూడో కన్నీటి చుక్క ఏమిటో చెప్పి ముగిస్తాను.

*”ఏ రెండు
కన్నీటి చుక్కలు ఒకేలా వుండవు
వాటిని చూసినపుడు
జారిన మూడో కన్నీటి చుక్క
కవిత్వం !!

ఇప్పుడర్థమైందిగా..సమాజాన్ని చూసి,అనుభవించి రాసిన కవిత్వమే..!”మూడో కన్నీటి చుక్క “!
ఈ కన్నీటి చుక్క చాలా చిక్కనైనది..మంచి రంగు కలది..రుచికరమైంది.
రుచి చూడటం ఇక మీ వంతు.!!

*మూడో కన్నీటి చుక్క ,కవితా సంపుటి
వెల.రూ.100/ పేజీలు.119.
కాపీల కొరకు
బొల్లోజు బాబా
30.7.31
సూర్యనారాయణ పురం
కాకినాడ,తూ.గో.జి
ఆంధ్రప్రదేశ్
ఫోన్.9849320443
0884..2368189

"మూడో కన్నీటిచుక్క" 4

"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటిపై మెత్తని హృదయకవి Telugu Venkatesh గారు వ్రాసిన ప్రేమపూర్వక వాక్యాలు
థాంక్యూ వెంకటేష్ గారు...
***

తనను తాను శిల్పంనుంచి శిలగా రూపం మార్చుకొని
అవరోహన దారిలో స్పష్టంగా పరిచయమయ్యాడు బాబ

దుర్గమారణ్యాల తప్పిపోతలు లేవు. గడ్డకట్టిన మంచు లేదు. వణికించే శీతలం లేదు.

సాయంత్రపు నీరెండలు...గోరువెచ్చటి పలకరింపులు..
దప్పికతీర్చే చెలిమ ఈ కన్నీటిచుక్క...

అలా కూర్చొని ఓ కాఫి కప్పుతో బాబ తేట ఆలోచనల్ని...గాలి మంద్రంగా వీస్తున్నంత నిశ్శబ్దంగా మదిలోకి ఆహ్వానించుకోవచ్చు.

తెలుగు వెంకటేష్