Saturday, July 30, 2016

“చంద్రవర్షం” లో తడిచిన అందమైన వాక్యాలు – భగ్వాన్ కవిత్వం


వడ్లబండి, బల్లకట్టు వంటి చక్కని కవితా సంపుటులను వెలువరించిన శ్రీ భగ్వాన్ తాజాగా “చంద్రవర్షం” పేరుతో వ్రాసిన కొత్త కవిత్వసంపుటి, జూలై 24 న, కొత్తపేటలో ఆవిష్కరణ జరగనుంది.

ఒక కవి తాను సృష్టించే కవిత్వంలో అతని ప్రాంతం ప్రతిబింబిస్తుంది. ఒక మెట్రోకవి పట్టుకొనే వస్తువులకూ, కనీసం పట్టణీకరణ కూడా చెందని ఊరిలో ఉండే కవి కవిత్వీకరించే వస్తువులకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడాని వారి వారి కవిత్వం ఇట్టే పట్టిచ్చేస్తుంది. భగ్వాన్ కవిత్వంలో కనిపించే ప్రతీకలు, పదచిత్రాలు పల్లెటూరి మట్టి పరిమళాల్ని కలిగి ఉంటాయి. నది, చెట్టు, పిట్ట, ఎండ, వాన, చలి, కాలువలు, తోటలు, జీవితానుభవాలు….. ఇవే ఈ “చంద్రవర్షం” లో కనిపించే చినుకులు, కవిసమయాలూ.

ప్రకృతికి చెట్టు పిట్టా ఎంతముఖ్యమో, కవిత్వానికి కూడా అవి అంతే ముఖ్యమన్న రహస్యాన్ని “చంద్రవర్షం” చెపుతుంది.

జీవితంలోంచి తోడుకొనే కవిత్వానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. సార్వజనీనం చేయబడిన అనుభవం ఎక్కువమందికి కనక్ట్ అవుతుంది. అవే భగ్వాన్ కవిత్వానికి శక్తిని, కాంతిని ఇచ్చే అంశాలు.

ఒక సాదాసీదా అనుభవాన్ని కవిత్వం చేయటం ఎంతో ప్రతిభ ఉంటే కానీ సాధ్యం కాదు. దీన్ని భగ్వాన్ అనేక కవితలలో అలవోకగా సాధిస్తారు.

“పాత పుస్తకం” అనే కవితలో …… ఒక పాతపుస్తకాలు కొనుక్కొనే వ్యక్తి సైకిల్ పై వెళుతుంటే, అతని సంచిలోంచి ఓ పుస్తకం జారి పడిందట. ఆ వెనుకే వెళ్తున్న కవి అది చూసి, ఆ వ్యక్తిని ఎంతపిలచినా అతను వినిపించుకోకుండా వెళిపోయాడట. కవిత ఇలా ముగుస్తుంది.
నేనా పుస్తకాన్ని తీసి
భద్రంగా దాచాను
తరువాత రోజుల్లో అది
నన్ను మనిషిని చేసే పుస్తకమవుతుందని
అప్పుడు ….. నాకు తెలియదు.
----- అని. ఇక్కడ ఆ పుస్తకమేమిటో చెప్పకుండా వదిలివేయటం వల్లే ఇది కవిత్వమైంది. ఒక వేళ “ భగవద్గీత లేదా చేగువెరా” పుస్తకం అనో ఏదో ఓ పేరుని కవి చెప్పాడా “కవిత ఫెయిల్ అయి ఉండేది”. ఈ కవిత చదివిన ప్రతిపాఠకుడూ అలా తనను ప్రభావితం చేసిన పుస్తకాన్ని, అది తన చేతుల్లోకి వచ్చిన సందర్భాన్ని ఒక సారి గుర్తుచేసుకొని, తనలోనికి కాసేపు ప్రయాణిస్తాడు. అదే కదా కవిత్వం చేయాల్సిన పని.
ఈ సంపుటిలో చాలా కవితలు నేరేటివ్ పద్దతిలో ఉంటాయి. ఉదాహరణకు, టీచర్ అయిన కవి తరగతి గదిలోకి కిటికీ గుండా ఒక పిచ్చుక వచ్చి మేజాబల్లపై గెంతులాడి దాదాపు అరగంట సేపు అక్కడే సంచరించి, తుర్రుమని ఎగిరిపోయిందట. ఆ కవితను….
పిచ్చుక ఎగిరిపోయాకా నాకనిపించింది
నేను చెప్పాలనుకున్న పాఠం
తను చెప్పి పోయిందని
…… అంటూ ముగిస్తారు. ఈ కవితాశీర్షిక “పాఠం పేరు పర్యావరణం”. ఉత్త శీర్షిక ద్వారా, ఒక సాదా సీదా సంఘటనను అసాధారణమైన సందర్భంగా మార్చి కవిత్వీకరించిన తీరు అబ్బురపరుస్తుంది.

యూట్యూబ్ లో పిచ్చుక శబ్దాన్ని
ఇయర్ ఫోన్ లో వినే నేను
కిటికీలోంచి ఒక పిచ్చుకైనా కనిపిస్తుందని
ఆరాటపడటంలో తప్పేమీలేదనుకొంటాను//
(కిటికీ దగ్గర/శ్రీ విరించి విరివింటి) అంటూ ఆర్థ్రంగా పలికే ఓ పట్టణ కవి, అప్పుడప్పుడూ పిచ్చుకలని చూసే భగ్వాన్ లాంటి ఓ గ్రామీణ కవి - ఒకే వస్తువును దర్శించిన తీరు, అభివ్యక్తీకరించిన భిన్న కోణాలు ఇక్కడ గమనార్హం.

కొత్తగా ఎక్కడైనా వంతెన నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం చాలా వేగంగా మార్పులకు గురవుతుంది. యానాం వంతెన కట్టాకా అక్కడి ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులను డైరెక్టర్ వంశీ ఓ కథలో అద్భుతంగా చెప్పుకొస్తాడు. భగ్వాన్ కూడా “ఒక వాస్తవం” అనే కవితలో కొత్తగా కట్టిన వంతెన గురించి వ్రాస్తూ….
అంత వరదలోనూ
అటూ ఇటూ పడవలు నడిపిన
సాహస వీరులెక్కడ//
ప్రయాణికుల పలకరింతలతో
పులకరించిన రేవుకిపుడు
మాట పడిపోయింది// -
--- అన్న వాక్యాలలో నాస్టాల్జియాలోకి వెళిపోయినట్లు అనిపించినా
వంతెన్ని కాదని నాగరికత విలసిల్లలేదు
వంతెన్ని కాదని ఊరు విశాలంగా విస్తరించలేదు.
ఇప్పుడు వంతెన ఒక వాస్తవం//…
.. అంటూ ఒక సమకాలీన సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.
వస్తువైవిధ్యం ఈ కవితలకు మంచి పఠనీయతను కలిగించింది. కరంటుపోయిన రాత్రి, మాస్టారి కుర్చీ, ఒక రోజు బస్సు ప్రయాణం, నిద్రలేవటం, బస్సు నడపటం, నేనో పిచ్చుకను చూసాను, తోటకు వీడ్కోలు, ప్రవాహం వంటి వివిధ దైనందిక విషయాలు కవిత్వమై మెరిసాయి ఈ సంపుటిలో.

పుస్తకావిష్కరణ సభ విజయవంతంగా జరగాలని కోరుకొంటూ- భగ్వాన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు…..

భగ్వాన్ గారి ఫోన్ నంబరు: 9393533336
భవదీయుడు
బొల్లోజు బాబా

అనుభూతి పరిమళాలు అద్దుకొన్న "ద్విభాషితాలు”


"తెలుగు కవిత్వం ప్రధానంగా రీతి కవిత్వం. ఇది బహుసా సంస్కృత సాహిత్యం నుంచి కూడా మనకు వచ్చిఉంటాది. రీతి కవిత్వం అంటే ఏదైనా కూడా వర్ణణాత్మకంగా ఉండాలి, వివరంగా ఉండాలి, ధారాళంగా ఉండాలి, కవిత్వ ధార ఉండాలి. – వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రముఖ కవి, విమర్శకులు." 

ప్రముఖ వైణిక విద్వాంసుడు శ్రీ ద్విభాష్యం నగేష్ బాబు రచించిన “ద్విభాషితాలు” కవిత్వ సంపుటిలోని కవితలను పరిశీలించినట్లయితే- వీరభద్రుడు గారు అన్నటువంటి ధార కనిపిస్తుంది. అక్షర విన్యాసం, వివరణాత్మక వర్ణణలు ఈ కవితలను సౌందర్యభరితం చేసాయి. అదే సమయంలో గుండెను తడిపే ఆర్థ్రత అంతర్జలలా ప్రవహిస్తూంటుంది.
మనం రోజూ చూసే దృశ్యాలు, కలిగే అనుభవాలు, పొందే అనుభూతులు శ్రీ నగేష్ బాబు కలం లోంచి జాలువారి చక్కని కవితావాక్యాలుగా శిల్పీకరించుకొన్నాయి. సరళమైన శైలి, వస్తువైవిద్యం, సౌందర్యాన్ని పట్టిచ్చే సూక్ష్మ దృష్టి, మారుతున్న మానవవిలువలను గుర్తించి వాటిని నిలుపుకోవటానికి చేసే ప్రయత్నం, కల్మషమెరుగని హృదయం ప్రకటించే సామాజిక స్పృహ, ఏదైనా ఒక సత్యవాక్యమో సుందరస్వప్నమో దొరకకపోతుందా అంటూ లోలోపలికి చేసుకొనే అంతర్వీక్షణా – ఇవీ శ్రీ నగేష్ బాబు కవితా లక్షణాలు.

సౌందర్యం అనేది ఈ కవిని వెంటాడే లౌల్యం. అనేక కవితలలో ఈ విషయం తెలుస్తూంటుంది. అందుకనే ….

“ఉదయాస్తమయాల అంచులు
వర్ణరంజితమైనప్పుడు
దృశ్యమే ఐశ్వర్యం (అమృతవర్షం) అంటూ రంగులద్దుకొన్న సంధ్యలను వర్ణిస్తాడు. 


నవ వధువు లజ్జాభరిత వదనంలా
సరస్సులో కలువలు
హిమస్నాన కేళీవిలాసంలో తడిసి
మలయపవనంలో… దేహాల్ని ఆరబెట్టుకొంటున్న పైర్లు
(లోపలిస్పర్శ) అంటూ సుందర దృశ్యాన్ని మన కళ్లముందు నిలుపుతాడు.

వెలుగు పడమటిపొలం మలుపు తిరిగినప్పుడు…
పక్షుల రెక్కలపై వాలి… గూడు చేరుతుంది రాత్రి (రాత్రిగీతం)
అంటూ చీకటిపడేవేళని అద్బుతపదచిత్రంగా లిఖిస్తాడు.

వేడెక్కిన సముద్రం ఎల్ నినో ప్రయోగించి…
నగర వీధుల్లో పడవల్ని తిప్పుతోంది (సంవత్సరోత్సవం)
అన్న వాక్యాల్లో నేడు ఆధునిక మానవుడు చేస్తున్న ప్రకృతివిధ్వంశాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తాడు.

మంచి ఎత్తుగడ, నడక, ముగింపులతో సాగిన “వైణికుని సాధన” అనే కవిత, స్వయంగా వైణికవిద్వాంసుడయిన శ్రీ నగేష్ బాబు మాత్రమే వ్రాయగలిగే కవిత.

ఇంట్లో గోడవారన నిలబెట్టిన వీణను చూస్తే….
నానుంచి నేను విడిపోయి..
నాకోసం నిరీక్షిస్తున్నట్లుంది
తరాల సంస్కృతిని నాకు ఉపదేశం చేయడానికి
నా ముందు ప్రత్యక్షమై
దీక్షలో కూర్చొన్న మహారుషిలా వుంది…….
అంటూ మొదలైన కవిత “వీణ నా తపస్సు/వీణ నా యశస్సు// నాకు వరంగా దొరికిన ధనస్సు!” అంటూ ముగుస్తుంది. సునాదవైణికునిగా పలు జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలెన్నో ఇచ్చిన ఒక విద్వాంసుని జీవితంతో వీణావాద్యం ఎలా పెనవేసుకుపోయిందో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుందీ కవిత.

“అద్దం మీద పిచుక” కవితలో- అద్దంమీద పిచుక తన ప్రతిబింబాన్ని ఎలాగైతే శోధించుకొంటుందో అలాగే మనిషికూడా ఒక్కసారైనా అద్దంమీద పిచుక కావాలి, తనని తాను తవ్వుకోవాలి అంటారు నగేష్ బాబు. Know Thyself అని సోక్రటిస్ అన్న మాటకు ఒక చక్కని Alligory ను జోడించి గొప్ప తాత్విక భావాన్ని హృద్యంగా వర్ణించారు.

“నాన్న” అనే శీర్షిక పెట్టి “అమ్మ” పై వ్రాసిన కవిత చాలా కరుణరసార్థ్ర భరితంగా ఉంది. చాలా మంచి కవిత ఇది.
“లోపలి స్పర్శ” కవితలో కనిపించే అంతర్వీక్షణం, “దర్శనం” లో చూపించిన దైవత్వం, “మెరుపు” లో పలికిన మౌనప్రేమ, “మూడు కాళ్ళ కుందేలు” కవితలో వ్యక్తమైన వ్యంగ్యం, – వంటివి “ద్విభాషితాలను” ఉత్తమ కవిత్వంగా నిరూపిస్తాయి.

రచయిత ఫోన్.నం: 9849439170
మెయిల్: nageshbabuveena@gmail.com
*****
29-7-2016 న పల్లెపాలెంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో, శ్రీ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అదృష్ట దీపక్, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, శ్రీ శిఖామణి లు పాల్గొన్నారు.
బొల్లోజు బాబా

అనుకరణ -- by Palestinian poet Fady Joudah

చిన్నపిల్లలతో సంభాషిస్తున్నట్లు చెప్పే కవిత్వం పైకి సరళంగా కన్పిస్తున్నా లోతైన అర్ధాల్ని పొదువుకొని ఉంటుంది. ఇలాంటి కవితలలో మనం మరచిపోతున్న మానవత్వాన్ని చిన్నపిల్లల ప్రశ్నల ద్వారా లేదా పనుల ద్వారా మన ముందుంచుతాడు కవి. చాలా గడుసుగా మనల్ని దోషుల్ని చేస్తాడు. అదొక మంచి కవిత్వసంవిధానం.
Fady Joudah పాలెస్తీనాకు చెందినవాడు కనుక ఇదేదో పాలెస్తీనా నిర్వాసితుల గొడవలా అనిపించినా, మనప్రభువులు చేస్తూన్న అశ్వమేధయాగం లాంటి భూసేకరణల నిర్వాసితులకూ వర్తించే ఒక సార్వజనీన అంశం కూడా.
కాలానికి, ప్రాంతానికి అతీతంగా ఉండటం గొప్పకవిత్వ లక్షణం కాదూ?


అనుకరణ -- by Palestinian poet Fady Joudah

తన సైకిల్ హేండిల్స్ మధ్య
గూడుకట్టుకొన్నసాలెపురుగుని
రెండువారాలుగా
అదిలించ లేదు మా అమ్మాయి
దానంతట అదే వెళిపోయే వరకూ
ఎదురుచూసింది. 


నీవు దాని గూటిని తొలగించి ఉన్నట్లయితే
అది తెలుసుకొనేది కదా "ఈ ప్రదేశం తన ఇల్లు కాదని;
నీవూ చక్కగా సైకిల్ తొక్కుకొని ఉండేదానవు" అన్నాను నేను


మనచుట్టూ ఎంతోమంది
నిరాశ్రయులు అవుతున్నది అలానే కదూ?'
అంది మా అమ్మాయి. 


Poem by Palestinian poet Fady Joudah
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Friday, July 22, 2016

ప్రణయం


అంతవరకూ
ఇరుకిరుగ్గా ప్రయాణించిన కెరటం
తీరం పెదాలపై
నురగ పువ్వులుగా విచ్చుకొంది
నీటి నవ్వులుగా పరుచుకొంది.
బొరియలోకి దూరింది కుర్రపీత
భూమిని మరోసారి ప్రేమించటానికి


బొల్లోజు బాబా

Sunday, July 3, 2016

మిత్రులకు ఆహ్వానం
10-07-2016 ఆదివారం షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ నందు, నా రెండు పుస్తకాల ఆవిష్కరణ జరగనుంది.
ఈ సభకు అధ్యక్ష్యత శ్రీ శిఖామణీ గారు, ఆవిష్కర్త శ్రీ శివారెడ్డిగారు, వక్తలు శ్రీ ఎం.నారాయణశర్మగారు, శ్రీ సత్యశ్రీనివాస్ గారు. సభానిర్వహణ శ్రీ యాకూబ్ గారు.
...
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కవిసంగమం, కవిసంథ్య లకు అనేకానేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
చక్కని ఆహ్వాన పత్రికను డిజైన్ చేసిన శ్రీ బంగారు బ్రహ్మం గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులం నలుగురూ కలిసి నాలుగు మాటలు మాట్లాడుకొనే సందర్భంగా దీన్ని నేను భావిస్తాను. అవకాశం, అందుబాటు ఉన్న మిత్రులు వస్తారని, అక్కడ కలుద్దామని ఆశిస్తూ…..
భవదీయుడు
బొల్లోజు బాబా

Tuesday, June 7, 2016

రూమీ వాక్యాలు


తరువులా జీవించు. మృతపత్రాల్ని రాలిపోనీ -- రూమీ

నీ చిన్ని మడుగులోంచి బయటకు ఈదుకొని రా -- రూమీ

నేనో గులాబిరేకను, నీవు నా కొండగాలివి. నన్ను విహారానికి తీసుకెళ్ళు -- రూమీ

మానవరూపంలో నన్ను చూడాలనుకోకు. నేను నువుచూసే చూపులోనే ఉంటాను -- రూమీ

నీ అస్థిత్వాన్ని మరచిపోయేలా ఈశ్వరుని ధ్యానించు. పిలిచే వాడు పిలవబడేవాడు అదృశ్యమయ్యేలా ఆ పిలుపులో నిన్ను నువ్వు కరిగించుకో -- రూమీ

బుద్దికి అర్ధంకాని విషయాల్ని వినటానికే హృదయానికి చెవులు ఇవ్వబడ్డాయి -- రూమీ

(మరిన్ని రూమీ వాక్యాల కొరకు సందర్శించండి "రూమీ వాక్యాలు" గ్రూపు)
బొల్లోజు బాబా

Monday, June 6, 2016

పల్లెలో మా పాత ఇల్లు – ఇస్మాయిల్


dsc001381

“చెట్టు నా ఆదర్శం” అంటూ తన కవిత్వ హరిత కాంతుల్నిదశదిశలా ప్రసరింపచేసిన ఇస్మాయిల్ గారు పరిచయం అవసరం లేని కవి, మరీ ముఖ్యంగా అంతర్జాల పాఠకులకు.   ఎందుకంటే, ఏ ఆధునిక మహాకవి  సంపూర్ణ సాహిత్యం దాదాపు పూర్తిగా అంతర్జాలంలో లభ్యమవుతుందని చూస్తే, అది ఒక్క ఇస్మాయిల్ గారిదే.
ఇజాలు, వాదనలు లేకుండా,  మన దైనందిక విషయాలు, చిన్న చిన్న అనుభవాలు, ప్రకృతి కరుణించే సుందర అపురూప దృశ్యాలు, ఆయన కవితాలోకంలో,  కరుణ, తాత్వికలను అలంకరించుకొని సంచరిస్తూంటాయి.  అలాంటి కవిత్వం ఎవరికి ఇష్టముండదూ.

ఇస్మాయిల్ గారు 2003 నవంబరు, 25న, ఆయనే ఏదో కవితలో అన్నట్టు  ఓ విత్తనమై తనని తాను పాతుకొన్నారు.   ఆ మహా నిశ్శబ్ధంలోంచి మొలకెత్తిన ఓ తరువే “పల్లెలో మా పాత ఇల్లు” కవితా సంకలనం.  దీని ప్రధమ ముద్రణ నవంబరు, 2006.  ఇందులో వీరి  అముద్రిత రచనలు, కొన్ని అనువాదాలు ఉన్నాయి.

హైకూలను తెలుగు సాహితీలోకానికి పరిచయం చేసినట్లే “తంకా” లను (జపనీయ సాహితీ ప్రక్రియ) పరిచయం చేసే ప్రయత్నం చేసినట్లనిపిస్తుంది ఈ పుస్తకంలో.  ఇస్మాయిల్ గారు వ్రాసిన ఒక తంకా

స్టేషన్ రద్దీలో
బెంచీపై కూచుని
ముసిలాళ్లు ముచ్చటిస్తున్నారు.
ప్రవహించే నీటిలో
ప్రవహించని నీడలు.

ఈ పుస్తకంలో వలసపాక హైకూలు అన్న శీర్షికతో మొత్తం 72 హైకూలున్నాయి.  ఇస్మాయిల్ గారు తన జీవిత చరమాంకంలో,  టౌన్ లో ఉండే తమ ఇంటిని డెవెలప్ మెంట్ కిచ్చేసి, టౌనుకు దూరంగా వలసపాకల అనే ఊరిలో కొన్నాళ్లున్నారు..  శ్రీనాధుడు పాకనాటి వాడయితే నేను వలసపాకనాటి వాడినని ఎక్కడో చమత్కరించారు కూడా. ఆ కాలంలో  రాసిన హైకూలివి.  ఈ  హైకూలలో ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించే అదే సౌందర్యారాధనా, అదే ప్రకృతి పరిశీలనా, అదే తాత్వికతా, అదే నిశ్శబ్ధం,  పరిమళించే నెమలీకలై చదువరి మనసులను మృధువుగా తాకుతూ పరవశాన్ని కలిగిస్తాయి.

మచ్చుకు కొన్ని
ఇద్దరికీ సంబరమే
సముద్రపొడ్డున జనానికీ,
జనాల ఒడ్డున సముద్రానికీ.

సంజె వేళ
దీపాలు వెలిగించారు
ఎవరి దీపాలు వారివి.

కాకు లెగిరిపోయాయి
నల్లటి నిశ్శబ్ధాన్ని
వదిలి.

గిల్టు ప్రేమ
పెచ్చులు పెచ్చులుగా
ఊడుతోంది.

రాత్రి హోరున వర్షం
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు.

గుండె బీటలు పడితే
దిగుళ్లు తప్ప
అన్నీ కారిపోతాయి.

ఈ పుస్తకంలో శ్రీనివాస్ రాయప్రోల్, జీబనానంద దాస్, సుజాతా భట్, రేనర్ మరియు రిల్కే, పాబ్లో నెరుడా మరియు వివిధ జపనీయ కవయిత్రులు వంటి ముప్పై మంది  కవుల కవితల అనువాదాలు ఉన్నాయి.  చదువుతున్నపుడు అవి అనువాద రచనల్లా కాక, స్వతంత్ర రచనలుగా అనిపిస్తాయి.  దీపావళి రోజు అనే కవితలో పలికించిన విషాదం ఈ రోజు  తెలుగునాట చాలా ఇళ్లలో ప్రవహించేదే.

జీబనానంద దాస్ వ్రాసిన బనలతాసేన్ అనే పద్యానువాదంలో, ఇస్మాయిల్ గారి ట్రేడ్ మార్కయిన భాషా సరళత కనిపించదు. దీనికి కారణం బహుసా సంస్కృత భూయిష్టంగా ఉండే మూల కవితే.  అనువాదకుడు మూలానికి విధేయుడై ఉండాలి అనే నియమానికి ఈ కవితానువాదం సాక్షి గా నిలుస్తుంది.  ఇస్మాయిల్ గారికి  బెంగాలి కూడా వచ్చు.

చీనా వేదాంతి అన్న అనువాద కవిత ఇలా సాగుతుంది.
సరే, వాళ్ల చేతిలో ఓడిపోయాం;
ఐతే ఏమైంది?
టీ వచ్చింది తాగు.
మరో తొమ్మిది వందలేళ్లలో
వాళ్లూ ఓడిపోతారు
మరొకళ్ల చేతిలో.

ఈ పదిహేను పదాల కవితలో కవితలో మొత్తం మానవజాతి చరిత్ర ఇమిడిపోలేదూ?

రేబో అనే కవిత కవికి ఉండవలసిన నిబద్దతను అన్యాపదేశంగా, అద్బుతంగా ఆవిష్కరిస్తుంది.
అంతటి సర్రియల్ పాబ్లో నెరుడా ఇస్మాయిల్ చేతిలో పడి, అలతి అలతి పదాలలో, తేటగా, తేలికగా ప్రకాశించటం, “కృష్ణ పక్షం, ఏల ప్రేమింతు నిన్ను, పరిచ్యుతులు” అనే కవితల్లో చూడవచ్చు.  (వీటి మాతృకలను, మిత్రులెవరైనా తెలుపుతారని ఆశిస్తున్నాను – వ్యాసకర్త)

ద్వేషం మానవజాతిని అనాదిగా నాశనం చేస్తుంది అనే భావనను వ్యక్తీకరించే “ద్వేషం” అనే అనువాద కవిత అత్యద్బుతంగా ఉంటుంది. రకరకాల వాదాలతో కొట్టుకు చచ్చే ఈ లోకరీతిని నిరసిస్తూ, మానవత్వాన్ని అక్షరక్షరంలోనూ పలికించే కవిత ఇది.  అందులో ఒక చోట

మిగతా అనుభూతుల గురించి చెప్పకండి.
వట్టి నీరసప్పీనుగులు.
సౌభాతృత్వం పేరు చెపితే
ఎక్కడైనా జనం మూగారా?
జాలీ, దయా
ఎప్పుడైనా గెలిచాయా?
పని చేసి చూపించేది
ద్వేష మొక్కటే.

జపనీయ కవయిత్రుల అనువాదాలు చాలా సరళంగా హృద్యంగా సాగుతాయి.

అవ్యక్త వాంఛ
ఘనీభవించి
నా శరీరపులోతుల్లో
నల్లటి ముత్యంలా
మారుతోంది.

ఎన్ని ముద్దులు పెట్టుకొన్నా
ఎన్ని కబుర్లు చెప్పుకొన్నా
నువ్వు నువ్వే
నేను నేనే
వంటివి చదివిన చాలాకాలం వెంటాడతాయి.

ఇస్మాయిల్ గారు కేవలం అనువాదాలను వదిలిపోయారట; మూలంలో చాలామంది కవుల పేర్లను  శీ యదుకుల భూషణ్ గారు గుర్తించి, ఈ సంకలనాన్ని తీసుకురావటంలో ఎంతో సహాయపడ్డారు. అలా ఇస్మాయిల్ అభిమానులు తీసుకువచ్చిన పుస్తకం  “పల్లెలో మా పాత ఇల్లు”.

ఇజాలు, కులాలు, మతాలు, ప్రాంతీయతలు లేని సార్వజనీనమైన కవిత్వాన్ని అనుభవించి, పలవరించాలని కోరుకొనే వారందరికీ ఈ పుస్తకం నచ్చుతుంది.  ఇది ఇస్మాయిల్ గారి చివరి రచనల సంకలనం కనుక, ఆయన అభిమానులందరికీ మరింత అపురూపం.
బొల్లోజు బాబా


కాపీలకొరకు
1. విశాలాంద్ర, నవోదయా అన్ని బ్రాంచీలలో
2. Smt. Vadrevu VIralakshmidevi
Sephalika, 70-1/C-2
NFCL Road, Kakinada-533003
3. మరిన్ని వివరాలకు సంప్రదించండి:desibooks@gmail.com
వెల
50/- రూపాయిలు

(ఈ వ్యాసం September 1, 2009  పుస్తకం.నెట్, వెబ్ సైట్ లో ప్రచురించబడింది)

Sunday, May 29, 2016

రూమీ వాక్యాలు

నిన్ను నీవు పగలకొట్టుకొనేదాకా ఆడుతూనే ఉండు  -- రూమీ

నేను ఈ గాలిలో ఎక్కడో తప్పిపోయాను – రూమీ

నేను నవ్వుతున్నానో  ఏడుస్తున్నానో ఎవరూ చెప్పలేకపోతున్నారు, నాకే ఆశ్చర్యంగా ఉంది – రూమీ

తలుపలా తడుతూనే ఉండు
లోపలి ఆనందం కిటికీ తెరచి “ఎవరదీ?” అని చూసే దాకా! -- రూమీ 

ప్రేమ మతం ఒక్కటే ఇక్కడ రాసి ఉంది.  ఎవరు చెపుతారు ఈ మాట?
నువ్వు నన్ను తెలుసుకో, లోతుగా తెలుసుకో!  -- రూమీ

హృదయాన్ని జాగ్రత్తగా పోషించు.  ఎందుకంటే అది మాత్రమే స్వర్గానికి చేరుతుంది  -- రూమీ

నా ఒక్కని అంగీకారంతోనే నేనిక్కడికి రాలేదు, అలాగే వెళిపోనూ లేను.  ఎవరైతే నన్నిక్కడికి పంపించారో, ఆయనే నన్ను ఇంటికి తీసుకెళ్ళాలి – రూమీ

సూర్యకాంతిలో ధూళిరేణువుల్ని నేను
గుండ్రటి సూర్యబింబాన్ని నేను
ధూళి రేణువులతో నిలిచిపో
సూర్యునితో కదలిపో అన్నాను నేను
నేనే నీవు  -- రూమీ

దూరంనుంచి నీవు నా కాంతిని మాత్రమే చూస్తావు, దగ్గరకు రా... నేనే నీవని తెలుసుకొంటావు – రూమీ


నేను నా ప్రేయసితో నాట్యం చేస్తూ ఉన్నాను
నా హృదయంతో ఊసులాడుకొంటున్నాను

ఈశ్వరుడా
ఉదయాన్ని తెరచే తాళంచెవి
కనిపించకుండా చేయి ఈ రాత్రికి – రూమీ


ఈ రాత్రి నాగురించి వెతక్కు. ఈ రాత్రికి నేను లేను  -- రూమీ

Wednesday, May 25, 2016

పక్షులపై మిర్చీలు


శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన "పక్షులపై మిర్చీలు" అన్న పుస్తకం పేరు నన్ను ఆకర్షించింది. (జువాలజీ టీచర్ ని కదా!). "తేలిక పదాలతో వ్యంగ్యంతో, హాస్యంతో , సాగతీయకుండా సారంచెప్పటమే మిర్చీ ప్రక్రియ" అని మిర్చీలగురించి వారే వివరణ ఇచ్చారు.
ఈ రోజు కవిత్వం ఎస్.ఎమ్.ఎస్ లేదా వాట్సప్ ల అవసరాలకు అనుగుణంగా సంక్షిప్తరూపాన్ని పొంది, ఫొటో జతతీసుకొని విస్త్రుతంగా షేర్ అవుతుండటం చూస్తున్నాం. అది కవిత్వమా కాదా అన్న మిమాంస పక్కన పెడితే, హృదయాన్ని తాకి, ఆలోచనను రేకెత్తిస్తూ, అన్యాపదేశంగా ఒక ఉత్తమ భావనను చెప్పగలిగే ప్రతీ వాక్యమూ కవిత్వమే అని భావిస్తాను.
సామెతలుగా, గోడనినాదాలుగా, సభలలో ఉపన్యసించేటపుడు సిసింద్రీలలలా, సంభాషణలలో చమత్కార మెరుపులుగా, వ్యాసాలలో చక్కని ఉటంకింపులుగా, - ఇంకా అనేక రకాలుగా మిర్చీలను చక్కగా ఉపయోగించుకోవచ్చు.
పక్షులపై మిర్చీలు పుస్తకం లో పక్షులను ప్రకృతికి ప్రతీకగా చేసినట్లు తెలుస్తుంది. వీరు క్లుప్తంగా వెలిబుచ్చిన భావాలు చాలా చోట్ల అంత్యప్రాసతో, అనుప్రాసలతో నడిచి చదివేటపుడు రమ్యతాభావాన్ని కలిగిస్తాయి.

"ఆడదుప్పులతో కలిసే కాలంలో మగదుప్పులకి కొమ్ములు రాలిపోతాయి, మళ్ళీ వస్తాయి. కొమ్ములు కుమ్ములాటలకే కానీ ప్రేమకు పనికి రావు".

ఒక చక్కని జంతుశాస్త్ర అంశానికి మానవారోపణ చేసి  గొప్ప జీవితసత్యాన్ని ఆవిష్కరిస్తారు శ్రీ అప్పారావు గారు ఇక్కడ. నిజమే, బలప్రయోగం యుద్దంలో విజయానికే కానీ ప్రేమను పొందటానికి పనికిరాదు కదా!

"ఆవులు అద్దెకి దొరికినట్టు కాకులూ అద్దెకి దొరికితే, మనకి మనశ్శాంతి! పోయిన మనిషికి ఆత్మశాంతి!!!"
ఇది నగరజీవితంపై కవి ఎత్తిపెట్టిన వ్యంగ్యాస్త్రం. కొన్ని మతవిశ్వాసాలకు సంబంధించింది. టౌనులలో గృహప్రవేశాలకు ఆవును అద్దెకు ఇవ్వటం ఒక వ్యాపారంగా మారింది. చనిపోయిన వ్యక్తి పేరిట పెట్టిన పిండాన్ని కాకితింటే వారికి ముట్టినట్లుగా సంబంధీకులు భావిస్తారు. ఆవు అద్దెకు దొరికినట్లు కాకికూడా అద్దెకు దొరికితే బాగుణ్ణు అనటం, ప్రస్తుత జీవనంలో ఏర్పడిన శూన్యతను, కాకులకు కూడ నిలువనీడ లేకుండా నిర్మించుకొన్న కాంక్రీట్ జంగిల్స్ గురించి చేసిన చక్కని వ్యాఖ్య ఈ మిర్చీ.

"ఎలకలకు బోను, పందికొక్కులకు చేను - మన వ్యవస్థ"
అంతే కదా నేడు జరుగుతున్నది. బలహీనులకే అన్నిచట్టాలు వర్తిస్తాయి. బలిసినవారి అవి చుట్టాల్లా వ్యవహరిస్తాయి.

"కాకి ఊరుమిత్ర, పాము రైతుమిత్ర"
నిజానికి కాకికి సాహిత్యపరంగా కోకిలకు దక్కినంత గౌరవం దక్కలేదు. కాకులు నివాసస్థలాలలోని జీవవ్యర్ధాలను తొలగించి, శుభ్రం చేయటం ద్వారా పరిణామక్రమంలో మానవునికి చేరువైన జీవులు. అలాగే పాములు పంటలకు హానికలిగించే ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచి రైతుకు మేలుచేస్తాయి. ఇదొ సమతుల్యతా వ్యవస్థ.

"అడవులే స్వర్గం, నరికితే నరకం" వంటి కొన్ని మిర్చీలు సాధారణంగా, ఉత్తవాచ్యంగా ఉన్నాయి.
"అవ్వ, గువ్వ ఒకేతీరు. ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు, ఎంతపిట్టకు అంతరెట్ట" లాంటి ప్రయోగాలను అంతగా ఆస్వాదించలేకపోయాను.
శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన ఈ పుస్తకాన్నిశ్రీ ముక్తేవి రవీంద్రనాథ్ గారికి అంకితమిచ్చారు. సరదా చమత్కారం, వ్యంగ్యం తో కూడి, ఆలోచింపచేసే మంచి వ్యాక్యాలను ఇష్టపడేవారికి ఈ పుస్తకం నచ్చుతుంది.

భవదీయుడు
బొల్లోజు బాబా

ఈ పుస్తకాన్ని ఈ క్రింది లింకులో దిగుమతి చేసుకొనవచ్చును'
https://www.scribd.com/doc/313438477/పక-షులపై-మిర-చీలు-e-book-pdf