శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన "పక్షులపై మిర్చీలు" అన్న పుస్తకం పేరు నన్ను ఆకర్షించింది. (జువాలజీ టీచర్ ని కదా!). "తేలిక పదాలతో వ్యంగ్యంతో, హాస్యంతో , సాగతీయకుండా సారంచెప్పటమే మిర్చీ ప్రక్రియ" అని మిర్చీలగురించి వారే వివరణ ఇచ్చారు.
ఈ రోజు కవిత్వం ఎస్.ఎమ్.ఎస్ లేదా వాట్సప్ ల అవసరాలకు అనుగుణంగా సంక్షిప్తరూపాన్ని పొంది, ఫొటో జతతీసుకొని విస్త్రుతంగా షేర్ అవుతుండటం చూస్తున్నాం. అది కవిత్వమా కాదా అన్న మిమాంస పక్కన పెడితే, హృదయాన్ని తాకి, ఆలోచనను రేకెత్తిస్తూ, అన్యాపదేశంగా ఒక ఉత్తమ భావనను చెప్పగలిగే ప్రతీ వాక్యమూ కవిత్వమే అని భావిస్తాను.
సామెతలుగా, గోడనినాదాలుగా, సభలలో ఉపన్యసించేటపుడు సిసింద్రీలలలా, సంభాషణలలో చమత్కార మెరుపులుగా, వ్యాసాలలో చక్కని ఉటంకింపులుగా, - ఇంకా అనేక రకాలుగా మిర్చీలను చక్కగా ఉపయోగించుకోవచ్చు.
పక్షులపై మిర్చీలు పుస్తకం లో పక్షులను ప్రకృతికి ప్రతీకగా చేసినట్లు తెలుస్తుంది. వీరు క్లుప్తంగా వెలిబుచ్చిన భావాలు చాలా చోట్ల అంత్యప్రాసతో, అనుప్రాసలతో నడిచి చదివేటపుడు రమ్యతాభావాన్ని కలిగిస్తాయి.
"ఆడదుప్పులతో కలిసే కాలంలో మగదుప్పులకి కొమ్ములు రాలిపోతాయి, మళ్ళీ వస్తాయి. కొమ్ములు కుమ్ములాటలకే కానీ ప్రేమకు పనికి రావు".
ఒక చక్కని జంతుశాస్త్ర అంశానికి మానవారోపణ చేసి గొప్ప జీవితసత్యాన్ని ఆవిష్కరిస్తారు శ్రీ అప్పారావు గారు ఇక్కడ. నిజమే, బలప్రయోగం యుద్దంలో విజయానికే కానీ ప్రేమను పొందటానికి పనికిరాదు కదా!
"ఆవులు అద్దెకి దొరికినట్టు కాకులూ అద్దెకి దొరికితే, మనకి మనశ్శాంతి! పోయిన మనిషికి ఆత్మశాంతి!!!"
ఇది నగరజీవితంపై కవి ఎత్తిపెట్టిన వ్యంగ్యాస్త్రం. కొన్ని మతవిశ్వాసాలకు సంబంధించింది. టౌనులలో గృహప్రవేశాలకు ఆవును అద్దెకు ఇవ్వటం ఒక వ్యాపారంగా మారింది. చనిపోయిన వ్యక్తి పేరిట పెట్టిన పిండాన్ని కాకితింటే వారికి ముట్టినట్లుగా సంబంధీకులు భావిస్తారు. ఆవు అద్దెకు దొరికినట్లు కాకికూడా అద్దెకు దొరికితే బాగుణ్ణు అనటం, ప్రస్తుత జీవనంలో ఏర్పడిన శూన్యతను, కాకులకు కూడ నిలువనీడ లేకుండా నిర్మించుకొన్న కాంక్రీట్ జంగిల్స్ గురించి చేసిన చక్కని వ్యాఖ్య ఈ మిర్చీ.
"ఎలకలకు బోను, పందికొక్కులకు చేను - మన వ్యవస్థ"
అంతే కదా నేడు జరుగుతున్నది. బలహీనులకే అన్నిచట్టాలు వర్తిస్తాయి. బలిసినవారి అవి చుట్టాల్లా వ్యవహరిస్తాయి.
"కాకి ఊరుమిత్ర, పాము రైతుమిత్ర"
నిజానికి కాకికి సాహిత్యపరంగా కోకిలకు దక్కినంత గౌరవం దక్కలేదు. కాకులు నివాసస్థలాలలోని జీవవ్యర్ధాలను తొలగించి, శుభ్రం చేయటం ద్వారా పరిణామక్రమంలో మానవునికి చేరువైన జీవులు. అలాగే పాములు పంటలకు హానికలిగించే ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచి రైతుకు మేలుచేస్తాయి. ఇదొ సమతుల్యతా వ్యవస్థ.
"అడవులే స్వర్గం, నరికితే నరకం" వంటి కొన్ని మిర్చీలు సాధారణంగా, ఉత్తవాచ్యంగా ఉన్నాయి.
"అవ్వ, గువ్వ ఒకేతీరు. ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు, ఎంతపిట్టకు అంతరెట్ట" లాంటి ప్రయోగాలను అంతగా ఆస్వాదించలేకపోయాను.
శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన ఈ పుస్తకాన్నిశ్రీ ముక్తేవి రవీంద్రనాథ్ గారికి అంకితమిచ్చారు. సరదా చమత్కారం, వ్యంగ్యం తో కూడి, ఆలోచింపచేసే మంచి వ్యాక్యాలను ఇష్టపడేవారికి ఈ పుస్తకం నచ్చుతుంది.
భవదీయుడు
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా
ఈ పుస్తకాన్ని ఈ క్రింది లింకులో దిగుమతి చేసుకొనవచ్చును'
No comments:
Post a Comment