ఆశిష్ ఠాకుర్ కవిత్వం - కొన్ని అనువాదాలు
గతనెల అంతర్జాల సంతలో తప్పిపోయి “ఆశిష్ ఠాకుర్” అనే ఓ కలల వ్యాపారికి బంధీగా ఉండిపోయాను కొంతకాలం. ఆ కబంధ హస్తాలనుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టింది. ఆయన కొన్ని కవితలను తెలుగులోకి అనువదించటం ద్వారా నేను అనుభవించిన తీయనిబాధను దించుకొంటున్నాను.
కవిత్వం పట్ల ఆశిష్ ఠాకుర్ కి ఉన్న అభిప్రాయాలు నిశ్చితమైనవి. ఈ కవితలో కవిత్వము-సమాజము పట్ల ఇతని దృక్పధం గమనించవచ్చు. కవిత్వమనేది ఎవర్నో ఉద్దరించటానికి కాక జీవన సౌందర్యాలను, అనుభవాలను అక్షరీకరించటానికి అని సూటిగా స్పష్టంగా చెపుతాడు ఈ కవితలో
మనకు కావలసిందల్లా!
అతను అనుకొంటాడు
తన కవితలకు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉందని
యుగాంతం వరకూ అవి శ్వాసిస్తూ ఉండగలవని
కానీ వాస్తవమేమిటంటే
యావత్ ప్రపంచం కూడా
మార్పు తేవాలి, కాలాన్ని బంధించాలి అనే కోర్కెతో
ఇప్పటికే పొట్టపగిలేట్టు ఉంది
మనకు కావలసిందల్లా
సబ్బు నీటిబుడగలో ఇంద్రధనసును దర్శించే కళ. -- (All We Need! By Ashish Thakur)
మనపూర్వీకులు ఆహార,నిద్రా, మైధునాలను జీవలక్షణాలుగా నిర్వచించారు. ఆ మూడో లక్షణం పరస్పరసమ్మతితో ఉండాలి తప్ప ఏకపక్ష క్రియగా ఉండకూడదన్న చిన్నవిషయాన్ని అద్భుతంగా ఇముడ్చుకొందీ ఈ కవిత. అంతే కాక ఆ క్రియ దేహాత్మల కలయిక అని చెపుతుంది.
Sex?
నువ్వన్నావూ
“నా దేహం చాలా ఆకలితో ఉంది
దాన్ని తినాలని ఉంది” అని
అలాగే, కలిసి తిందాం.
నేనన్నానూ
“నా ఆత్మ చాలా దాహంతో ఉంది
దాన్ని తాగాలని ఉంది” అని
అలాగే, కలిసి తాగుదాం. (Sex? – by Ashish Thakur)
కవిచుట్టూ ఉండే సమాజంలో అంతా సౌందర్యమే ఉండదు. ఒక్కోసారి భీతావహ పరిస్థితులు గగుర్పాటు కలిగిస్తాయి. అలాంటప్పుడు కవి నిస్తేజంగా ఉండలేడు. ఆశిష్ ఠాకుర్ కూడా నేడు సమాజంలో స్త్రీలపై జరుగుతున్న క్రూరత్వాలను ఈ కవితలో వర్ణించిన తీరు చూస్తే ఒక విధమైన జలదరింపు కలుగక మానదు.
అమ్మాయిలు ధరిస్తున్న దుస్తులవల్లే రేప్ లు జరుగుతున్నాయని వాదించే వారికి గొప్ప సమాధానం ఈ కవిత. ఓ అమ్మాయికి పట్టులాంటి మృధువైన చర్మం అక్కర్లేదట, ఒళ్ళంతా రోమాలు మొలవాలని కోరుకొంటోంది- అంటూ మొదలౌతుంది ఈ కవిత. ఒంటినిండా దుస్తులు వేసుకొన్నా అనాచ్ఛాదితంగా ఉన్న అరచేతులు, పాదాలు మగవారిలో కోర్కెలు రేకెత్తిస్తున్నాయి అనటం, అటువంటి అమ్మాయిని ఒక టెర్రరిస్టుతో పోల్చటం వంటివి-- ఒకరకంగా ఈ కవితను తారాస్థాయికి తీసుకెళ్ళి వదలటమే. ఈ కవితలో గొప్ప శిల్పం, లోతైన పదచిత్రాలు, అద్భుతమైన తర్కం ఉత్తమ స్థాయిలో వ్యక్తీకరింపబడ్డాయి.
ఆమె మృధువైన చర్మాన్ని కోరుకోవటం లేదు
అనుక్షణం భయపడే ఉడతలా బతికే ఆమె
ఓ పేదదేశానికి చెందిన అమ్మాయి
సురక్షితంగా ఉండటానికి
ఆమెకు ఒంటినిండా రోమాలు కావాలి.
ప్రతీచోటా
గెట్టోలు, గులాగ్ లు, కాన్సంట్రేషన్ కాంపులు.
మారువేషమేసుకొన్న ఆమ్లం మరుగుతూంటుంది వేడి టీ గా
ఆమె పరువు ఆమె మౌనం లో ఉంటుంది
సగర్వంగా నడవటానికి ఆమె తలదించుకోవాలి.
గెంతటం నిషేదింపబడిన జింకపిల్ల ఆమె
ఆమెకు స్వేచ్ఛా శృంఖలాలను
బహూకరించాయి హైనాలు.
అంతే కాదు
వీధులనిండా పోస్టర్లు
“ఆడ టెర్రరిస్టు కావలెను... ప్రాణాలతో లేదా శవంగానైనా
ఆమె అనాచ్చాదిత చేతులపై, నగ్న పాదాలపై
కోర్కెలు రేకెత్తించే ప్రేలుడు పదార్ధాలతో తిరుగుతుంది”.. అంటో ------ She doesn’t want smooth skin by Aashish Thakur
కవిత్వంలో ఉద్వేగాల్ని పలికించటం చాలా క్లిష్టమైన పని. ఈ కవితచదివినపుడు ఒక ఎడారితనం, నిరీహత, దాహం, రసహీనత వంటి అనేక భావాలు ముప్పిరిగొనుపుతాయి. ఎండిన ఆకులను ఎండిన చేతివేళ్ళుగా వర్ణించటం మొత్తం కవితను ఒక అనార్ధ్రలోకానికి తీసుకుపోతుంది.
వేసవి
వేసవి ఉంది
పిచ్చుకలు లేవు
నాలో
వేనవేల ఎండిన చేతివేళ్లతో
ఓ చెట్టు
హృదయం ఒక ఏకాకి శిఖరం
నేత్రాలు ఒక ఎండిన చెలమ
లోనికి తెరచుకొనే కిటికీలు
ఇంకా
సూర్యునిచే కాల్చబడిన ఆకాశం
ఓ దాహమెత్తిన నుయ్యి
చెప్పటానికి ఏమీ లేదు
ఉత్త ఎండు కవితలు
వానకోసం ఎదురుచూస్తూ (Summer by Ashish Thakur)
పై కవిత లానే ఒంటరితనాన్ని, వేదనను ప్రతిభావంతంగా వ్యక్తీకరిస్తుంది ఈ కవిత .....
రాత్రి
నీ పేరుని పలకలేని
నా హృదయ స్పందనల్లా
మౌనంగా ఉందీ రాత్రి
నా కళ్ళకు శత్రువైన అద్దంలా
మౌనంగా ఉందీ రాత్రి
ఆశలకన్నా సుదీర్ఘంగా ఉండే
ఒంటరితనాన్ని మోసే అమ్మలాగే
ఈ రాత్రి ఏనాడూ నవ్వదు
ఓ రాత్రీ!
నా స్నేహితునిగా ఉండవా
నేను ఇప్పటికే పగలుని కోల్పోయాను. – Night by Ashish Thakur
కవిత్వలక్షణాల్ని అనేకమంది కవులు అనేక రకాలుగా తమ కవిత్వంలో పొందుపరచారు. కవిత్వానికి “నిజాయితీ”, “స్పష్టతతో నేలమీదే ఉండటం” అనే లక్షణాలు ఎంత అవసరమో రెండే రెండు అద్భుతపదచిత్రాలలో పట్టిచూపుతాడు ఆశిష్ ఠాకుర్ ఈ కవితలో..
విశ్వం కన్నా పెద్దదైన చిన్న కవిత
రెండు పదాల మధ్య దూరం
ఓ లక్ష సంవత్సరాల కన్న ఎక్కువ ఉండొచ్చు
కానీ
గుండెకు గొంతుకు మధ్య ఉండే
దూరం కన్నా తక్కువ ఉండాలి
ఒక వాక్యం పొడుగులో
సముద్రాలు ఇమిడిపోవచ్చు
కానీ
దాని లోతు మాత్రం
పచ్చని గడ్డిపోచ ఎత్తుకన్నా తక్కువుండాలి. ..... A short poem bigger than the universe by Ashish Thakur.
తాత్వికత కవిత్వానికి కొత్త అందాలు తెస్తుంది. కొత్తలోతుల్ని తెచ్చిపెడుతుంది. కొత్త అర్ధాల్ని ఇస్తుంది. కానీ ఇదంతా తేటగా అందుతూ ఉండాలి. చదువరికి అర్ధంకానంత అస్పష్టత కవితలోకి చొరబడకూడదు. అందుకు ఒక మార్గం మూర్తపదచిత్రాలను ఎంచుకోవటం. మూర్తపదచిత్రాలతో ఎంతటి అమూర్తభావననైనా కళాత్మకంగా చెప్పటానికి వీలవుతుంది. ఈ క్రింది కవిత ఆ టెక్నిక్ కు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
గదిమూలలు ఖాళీగా ఉంచాలి
ఎందుకంటే
ఒక గోడ మరోక గోడకు ముద్దులెలా పంపిస్తుందో చూడొచ్చు
వాటి అన్యోన్య ప్రేమ వల్లే
మన తలలమీద ఇంటి పైకప్పులు నిలిచి ఉన్నాయి.
ఖాళీగా ఉంచిన గది మూలలో
సాలీడు గూడు కట్టుకోవటానికి వీలవుతుంది
మనమందరం ఒకరితో ఒకరం కలపబడి ఉన్నామన్న విషయం
ఆ సాలె గూడు గుర్తు చేస్తూంటుంది.
గాయపడ్డ ఆశలకు మూలలే ఆశ్రయమిస్తాయి
వాళ్ళంటారూ
మన హృదయాలలో కూడా మూలల్ని ఖాళీగా ఉంచమని
ఎందుకంటే
ప్రపంచాన్ని జయించగలిగే ప్రేమకు కూడా
ఎదగటానికి కాస్త చోటు కావాలి మొదట్లో ... Corners should be kept empty – by Ashish Thakur
ఆశిష్ ఠాకుర్ కవిత్వం గురించి మాట్లాడుతూ, “వైద్యం, వ్యాపారం, ఇంజనీరింగ్ వంటి గొప్ప విద్యలు ప్రాణాల్ని నిలపటానికి అవసరం అయినప్పటికీ, మనం బ్రతికేది మాత్రం కవిత్వం, సౌందర్యం, ప్రేమ, కాల్పనికతల కోసమే” అంటాడు. గొప్ప స్వాప్నికుడు మాత్రమే అనగలిగే మాటలు. అంతే కాదు ఇతని కవిత్వంలో ఈ తత్వం ఒక అంతర్జలలా ప్రవహిస్తూంటుంది. చక్కని అభివ్యక్తి, అపూర్వ కల్పనా చాతుర్యము, ఉత్కృష్టమైన ఇంటిలిజెంట్ ప్లే ఇతని కవిత్వాన్ని మహిమాన్వితం చేస్తాయి, Top Class Poetry గా నిలుపుతాయి.
బొల్లోజు బాబా
పి.ఎస్. ఇంతగొప్ప కవిత్వం వ్రాస్తున్న శ్రీ ఆశిష్ కుమార్ ఫొటో కానీ, అతని గురించిన సమాచారం కానీ అంతర్జాలంలో ఎంతవెతికినా లభించలేదు. (You may correct me if I am wrong)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment