Wednesday, December 4, 2019

గాథాసప్తశతి - తాజా అనువాదాల పార్ట్ 1
రెండువేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా జీవించారో గాధాసప్తశతిలోని అనేక గాథలలో కనిపిస్తుంది. భార్యా, పిల్లలను గ్రామంలో ఉంచి పనుల నిమిత్తమో, వ్యాపారం కోసమో దూరదేశాలు ప్రయాణించటం ఒక జీవనవిధానంగా ఉండేది.
ఈ నేపథ్యంలోంచి వ్రాసిన అనేక గాథలు ఆనాటి ప్రజల జీవితాలను, అనుభవాలను, ఉద్వేగాలను నేటికీ మనకళ్లకు కడతాయి.
అలా పొరుగూరు వెళ్ళిన భర్తలు వానాకాలం సమీపించేలోగా సొంత ఊర్లకు చేరుకొనేవారు ఎందుకంటే వానాకాలంలో వాగులు, నదులూ పొంగి దారులన్నీ మూసుకుపోతాయి. లేకపోతే వరదలు తగ్గేదాకా కనీసం రెండు మూడు నెలలు ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సి వచ్చేది.
1. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి వానలు సమీపించకముందే ఇంటికి చేరాలని ఎంత ఆత్రపడుతున్నాడో ఈ గాథలో చూడవచ్చు.
వానాకాలం సమీపిస్తుండటంతో
ఇంటికి త్వరగా చేరుకోవాలని
ఆ బాటసారి దారిని చుట్టి మూటకట్టేస్తాడు
దానిని ముక్కలు చేసి ఒక్క గుక్కలో మింగేస్తాడు. (696)
2. వానాకాలం వచ్చేసిందేమో, ఇక భర్త మరో మూడునెలలపాటు రాడేమో అని ఆందోళన పడుతున్న ఒక విరహోత్కంఠితను బహుసా ఆమె అత్త ఎలా ఓదార్చుతుందో ఈ గాథ చెపుతుంది.
వింధ్య పర్వత శిఖరాలపై నీవు చూసేది
వేసవి కార్చిచ్చు వలన రేగిన నల్లని బూడిద
కారు మబ్బులు కావు
నీ భర్త రాక గురించి దిగులు చెందకు. [70]
3. బహుసా పై గాథలోని అమ్మాయినే మరో సందర్భంలో ఇలా సముదాయించి, ఆమె బాధను పంచుకొన్న విధానం కరుణాత్మకంగా ఉంటుంది.
'చూడు అమ్మాయి! ఏడవకు
అతను వస్తాడు. ఈరోజు జరుగుతున్న తీర్థానికి
అతను ఏనాడూ లేకుండా లేడు'
అంటూ బోలు మాటలతో కోడల్ని ఓదార్చి
పక్కకు తిరిగి కనులనీరు తుడుచుకొంటోందామె.
4. మనసుకు ఇష్టమైనవారు దూరమైనప్పుడు అనుభవించే అనుభూతిని విరహం అంటాం. ఇప్పట్లా, ఫోనులు, విడియోకాల్ లు లేవు. భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడొస్తాడో తెలియదు. అసలు వస్తాడో రాడో కూడా అంతకన్నా తెలియదు. అందుకనే అప్పట్లో ఏడు సంవత్సరాలు వరకూ రాకపోతే అతను మరణించినట్లు పరిగణించి, కర్మకాండలు, ఆస్తిపంపకాలు చేసుకోవచ్చని చాణుక్యుని అర్థశాస్త్రం చెపుతుంది. . (ఇది ఈనాటికీ అంతే అనుకొంటాను మిస్సింగ్ కేసులలో)
ఈ క్రింది గాథలో ఒక భార్య ఇరవైరోజులకే ఎంత ఆందోళనపడుతోందో గమనించవచ్చు.
భర్త దూరదేశమేగాకా
ఆమె మొదట చేతివేళ్లతో రోజులు లెక్కవేసుకొంది
అవి అయిపోయాకా కాలివేళ్లతో లెక్కించుకొంది
అవీ అయిపోయాకా ఇక ఎలా లెక్కించాలో తెలీక
భోరున ఏడవటం మొదలెట్టింది. [307]
5. వానాకాలం వచ్చేసింది. భర్త మరో మూడునాలుగునెలలు రాడని నిశ్చయమైపోయింది. ఒకవైపు వాననీరు, మరొకవైపు కన్నీరు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని ఎంత గొప్పగా చెపుతున్నాడీ పూర్వకవి.
చూరునుండి కారుతున్న నీటి ధారలలో
ఆమె తల తడుస్తున్నా
కొడుకుని ఒళ్ళోకి తీసుకొని కాపాడుతోంది
పాపం మగని వియోగంచే కలిగిన కన్నీళ్ళతో
వాడు అప్పటికే నిండా తడిచిపోయాడని
గమనించటం లేదామె [623]
6. వర్షాకాలం మొదలయ్యాకా కూడా భర్త రాకకోసం ఇంకా ఎదురుచూసే ఒక స్త్రీ ని సముదాయిస్తూ, చిరుకోపం ప్రదర్శించటంలో ఉన్న ఆనాటి మానవ సంబంధాలను "ఫ్రీజ్ షాట్" తీసిన కవిని అభినందించకుండా ఉండలేం.
పిచ్చిదానా
మేఘాలు గర్జిస్తున్నాయి
దారులలో గడ్డిమొలిచింది
నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి
ఇంకా నీ భర్త కోసం ఎదురుచూస్తున్నావు [729]
7. భర్త చెంతలేకపోవటవల్ల ప్రేమరాహిత్యంతోనో, జీవిక కోసమో ఆమె ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఉంటుంది..... ఒకే ఒక ఆశతో.... మగడు ఇంటికి ఎంతో కొంత డబ్బునో, సంపదలనో తీసుకొస్తాడని. భర్త ఉత్తచేతులతో వస్తే ........ ..
అతను లేకపోవటం కన్నా
ఇక్కడ నేను పడ్డ దురవస్థ కన్నా
తను ఏ ప్రయోజనమూ సాధించకుండా
తిరిగి రావటమే నన్నెక్కువ బాధిస్తున్నది [76]
గాథాసప్తశతి లో రెండువేల సంవత్సరాల నాటి అనుభూతుల ప్రాసంగిత ఈనాటికీ చెక్కుచెదరలేదు. అవి నేటికీ పదే పదే ఇతర ప్రపంచ భాషలలోకి అనువదించబడుతున్నాయి అంటే కారణం వాటిలోని ఉద్వేగాలు, కవిత్వమూ అనుకొంటాను.
అనువాదం: బొల్లోజు బాబా

ఒక..... పురా.... ప్రకాశం....

శివారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
(నేను అభిమానించే ముగ్గురు కవుల్ని ఇలా ఓ కవితలో చూసుకొని మురిసిపోతూంటాను....)
ఒక..... పురా.... ప్రకాశం....
ఒక సభానంతర సంభాషణలో
శివుని చుట్టూ చీమలు మూగాయి
చలి కాచుకొనేందుకు
చలిమంట జలపాతాన్ని ఆవిష్కరించిన
శివుడు తానే చలిమంటై
నృత్యం చేయనారంభించాడు
పుల్లలని ఎగదోసే మిషతో
తానూ చలిమంటలో లయమైపోయాడు
మణుల శిఖుడు
చలిమంట వెలుగుల్ని తొడుక్కొన్న
ఎడతెగని ప్రయాణం
కవిత్వంలో సంగమించింది
*******
కాళిదాసు,భవభూతి, దండి ఏనాడో
చంద్రుని చలిమంటగా కాచుకొనే ఉంటారు
ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి దోచుకొన్న ముత్యాలలో
ఒకరినొకరు చూసుకొని మురిసిపోయే ఉంటారు.
లిప్తపాటు మెరిసిమాయమయ్యే దీపశిఖ వెలుగుల్లో
అనంతంగా ప్రకాశిస్తూనే ఉన్నారు
చలిమంటై....... నేటికీ.....
బొల్లోజు బాబా
(గోదారి పలకరింపు పుస్తకావిష్కరణ సందర్భంగా 2018)

కాశ్మీరీ కవిత్వం

కాశ్మీరీ కవిత్వం
కాశ్మీర్ కవులు వెలువరించే కవిత్వం ఇదివరలో చదివాను. పోస్ట్ ఆఫీస్ లో పెన్షన్ కొరకు ఎదురుచూసే ఒక వృద్ధవనిత కవితను అనువదించాలని సేవ్ చేసుకొన్నాను. నచ్చక చేయలేదు. గత రెండురోజులుగా సమకాలీన కాశ్మీరీ కవిత్వం చదువుతున్నాను. నేను చదివిన మేరకు వాళ్ల కవిత్వంలో వేదన, యుద్ధబీభత్సం, హింస, జీవితం పట్ల అభద్రత, శాంతికాముకత కనిపించాయి. వస్తువుని కవిత్వం చేయటం కూడా అద్భుతంగా అనిపించింది. పాత మాటే అయినా వస్తువే శిల్పంగా మారిపోయిన క్రమం తెలుస్తుంది. మానవోద్వేగాలను కవిత్వం మాత్రమే ప్రకటించగలదన్న విషయం మరోసారి అర్ధమైంది. నాకు నచ్చిన కొన్ని కవితల అనువాదాలు. (ఇవి తాజాపరిస్థితులకు సంబంధించినవి కావు, పాతవి).
***
Qaisar Bashir (The Cry of Wounded Souls కవిత్వ సంపుటి నుంచి)
.
తంకా - Tanka
ఆకుల్లేని కొమ్మపై
ఒక కోయిల కూర్చొని
అత్యంత చేదుపాట పాడుతోంది
తన వనాన్ని స్మరించుకొంటూ.
స్వరం పెరిగింది: వెక్కిళ్ళు, కన్నీళ్ళు, వ్యధలు
Quatrains
1.
ఆగష్టునెలలో ఒక వానవెలసిన మధ్యాహ్నపు వేళ
ఇంద్రధనస్సు కనిపించింది. దానినుంచి
ఎర్ర సిరాను అడిగి, దుఃఖిస్తూ ఇలా రాసుకొన్నాను
“ఎందుకు మా పిట్టలు (పసితనంలోనే) నేలకూలిపోతున్నాయి?
2.
చాలాకాలంగా నాకు తెలిసిన ఒక గాయకుడు ఇంటికి వచ్చాడు.
మా వాగ్గేయకారుడు Habba Khatoon గీతాలను అతను
దాల్ సరస్సు చినార్ వృక్షాలపై వాలిన బుల్ బుల్ పిట్టలా గానం చేస్తుంటే
వాటిని నేను ఎలా ఆస్వాదించగలనూ? యుద్ధం మధ్యలో!
Qaisar Bashir కాశ్మీర్ యూనివర్సిటీ లో ఎమ్.ఎ. లిటరేచర్ చదివారు. ఉపాద్యాయ వృత్తిలో ఉన్నారు. కవి అనువాదకుడు.
Habba Khatoon: Habba Khatoon also known as the Nightingale of Kashmir (1554–1609), was an important Kashmiri Muslim poet and ascetic
********
యుద్ధం ముగిసాకా (When the War is over by Shabir Ahmad Mir)
యుద్ధం ముగిసాకా
నువ్వు ఇలా వస్తే
బుల్లెట్లు, పెల్లెట్లు చేసిన రంద్రాలను
నీకు నేను చూపిస్తాను
నీ చేతివేళ్లతో తడిమి చూస్తే
నీకే అర్ధమౌతుంది వాళ్లెంత గాయపరచారో
యుద్ధం ముగిసాకా
శిధిలాల మధ్య భయం భయంగా వికసిస్తోన్న
ప్రిమ్ రోజెస్ పూల వాసన నీకు చూపిస్తాను
ఎంతటి దివ్యసౌందర్యం ఉండేదిక్కడ!
యుద్ధం ముగిసాకా
మా అఖండ పురాతన గిరుల మధ్య ప్రవహించే
సెలయేళ్ల గలగలల్ని నీకు వినిపిస్తాను
వాటి గొంతును కోపోద్రిక్త సరిహద్దుల చప్పుళ్ళు
ఇకపై అణచలేవు.
యుద్ధం ముగిసాకా
నేను నిన్ను దగ్గరుండి తీసుకెల్తాను
వెరినాగ్ నీటి చెలమలో నీ పాదాలను తడుపుకో
సుఖనాగ్ నీటిబుగ్గలోని నీళ్ళు దోసెళ్ళతో తాగు
ఏ భద్రతా లేకుండానే దాల్ సరస్సులో
పడవ షికారు చేస్తూ చేతిని నీళ్ళలో ఆడించు
ఇదెంత ప్రశాంత ప్రదేశమో నీకే తెలుస్తుంది,
యుద్ధం ముగిసాకా
భాష్పవాయువులు, పెప్పర్ స్ప్రేలు
సైరన్ లు, అరుపులు, మూలుగులు లేని
స్వేచ్ఛాగాలుల్ని శ్వాసించే మంచు శిల్పాలు
ఎంత అందంగా ఉంటాయో నీకు తెలిసేలా చేస్తాను.
నువ్వే చూస్తావు! నువ్వే చూస్తావు!
ఈ సువిశాల మంచు లోకపు ప్రశాంతత
అకాల సమాధులు తవ్వటానికై భగ్నం చేయకుండా ఉన్నప్పుడు
ఎంత అందంగా ఉంటుందో!
యుద్ధం ముగిసాకా
మా Wanwun బృందగానానికి తీసుకెళతాను, గొంతుకలుపు
వెండి వెన్నెల రాత్రివేళ
మా Rouff బృందనాట్యంలో చేరి ఆడుదుగాని.
మేము సంతోషంగా ఉండటం నీకూ సంతోషమేనని
నీకే తెలుస్తుంది.
యుద్ధం ముగిసాకా
నిన్ను టీ కి ఆహ్వానిస్తాను
కలిసి టీ తాగుదాం
ఉప్పని రుచితో, కుంకుమ రంగు కలిగిన టీ
నీకే తెలుస్తుంది
నేనేనాడూ నీకు శత్రువుని కానని.
Shabir Ahmad Mir ప్రముఖ కాశ్మీరీ కవి.
.
Wanwun కాశ్మిర్ సాంప్రదాయ బృందగానం
Rouff కాశ్మిర్ సాంప్రదాయ బృందనృత్యం.
అనువాదం: బొల్లోజు బాబా

కాశ్మీరీ కవిత్వం

కాశ్మీరీ కవిత్వం
కాశ్మీరి కవులు మతాన్ని ఏ దృష్టితో చూస్తున్నారు అని వెతగ్గా ఈ కవిత కనిపించింది. ఇది అందరి అభిప్రాయం అని నేను భావించను. ఒక అభిప్రాయం ఇలాకూడా ఉంది అనుకొంటాను. ఈ కవిత పైకి చాలా సింపుల్ గా అనిపిస్తున్నా కవిత చివరలో అంతా దైవదత్తమే అనుకోవటంలోని తాత్వికత చాలా లోతైనది.
కవితా శిల్పం గమనిస్తే, సంభాషణలు, దృశ్యవర్ణనా, ఉద్వేగాలు, తర్కం, సమకాలీన స్పృహ ఇవన్నీ పెనవేసుకొని ఉన్నాయి.
మతంపైన ఒక బలమైన వ్యాఖ్యానాన్ని మెత్తమెత్తగా గుండెలో బాకులా దింపినట్లనిపించిందీ కవిత చదివాకా. అదీ నేటితరానికి చెందిన కవి గొంతులోంచి రావటం ఇంకా ఆశ్చర్యం కలిగించింది.
****
మతం - Religion by Fazili Zabirah
మొన్నోరోజు మనం
Hazratbal దర్గా Park లో కూర్చొన్నప్పుడు
ఎండపడేవైపు తిరిగి నువ్వు సిగరెట్ వెలిగించావు.
నీ మొఖంపై పడిన కిరణాలు మరింత వెలుగు చిందాయి
"మతం ప్రజలకు opium లాంటిది" అన్న నీ మాట
హాస్పటల్ ICU లో ప్రాణాలతో పోరాడుతున్న
నా సోదరి గురించిన గాఢ ఆలోచనలల్లోంచి
నన్ను బయటకు తీసుకొచ్చింది
"అవును, మతం, నీకు తెలుసు కదా opium లాంటిది
అది మనుషుల్ని ఉన్మత్తుల్ని చేస్తుంది"
నేను నవ్వాను. అంగీకరించి కాదు.
నీ అమాయకత్వానికి, బోళాతనానికి.
"Coleridge చాలా పెద్ద కవి
ఆయన కవిత్వం నువ్వూ చదివే ఉంటావు"
నేనన్నది నీకు అర్ధం కాలేదని నువ్వు నాకేసి చూసిన
చూపుద్వారా అనిపించింది
"అందమైన కవిత్వాన్ని అతను opium మత్తులో ఉండి రాసేవాడు
అది అతనికి చాలా పేరు తెచ్చింది"
అనంగీకరంతో నువ్వూ తిరిగి నవ్వావు
"మతం, చూస్తున్నావు కదూ, ప్రపంచాన్ని ఎలా కలవరపెడుతోందో.
దాని పేరు చెప్పి
ప్రజలు చంపుకొంటున్నారు,
ప్రజలు లూటీలు చేస్తున్నారు,
ప్రజలు మానవత్వం మరచిపోతున్నారు"
ఇదివరకు కూడా నువ్వు ఇదే విషయాన్ని చెప్పిన సంగతి గుర్తొచ్చింది
అప్పుడు అంగీకరించాను కూడా .
కానీ ఆరోజు ఇంటికెళ్ళాకా పవిత్ర గ్రంథాన్ని తిరగేసాను
వాక్య వాక్యం పట్టి పట్టి చదివాను
హింస, రక్తపాతం, యుద్ధాలు ఉన్న వాక్యాలన్నింటినీ.
"నీకు తెలుసా నువ్వుచెపుతున్న అన్నింటినీ మతం ఖండించింది
నిలిచేవి శాంతి, సౌభ్రాతృత్వం
అవే కీర్తించబడ్డాయి" అన్నాను
"మతాలు ద్వేషాన్ని పెంపొందించవు
మానవ మృగాలు మాత్రమే చేస్తాయి
మతం పేరు చెప్పి
నువ్వూ నేనూ ఈ ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నాం.
ఉత్త అవకాశవాదం అంతే"
నువ్వు అంగీకరించలేదు.
దేవుని గురించి మాట్లాడుకొన్నాం.
రాత్రి మాపై నీడలా పరచుకొనేవరకూ
మా సంభాషణ గంటలకొద్దీ నడిచింది.
"అలా ఐతే మనల్ని ఎవరు సృష్టించారు? ఈ కుక్కని? ఆ ఆకాశాన్ని?
ఈ భూమిని? నదుల్ని? అన్నింటినీ" ప్రశ్నించాను
నువ్వు నవ్వేసి "మరో రోజు మాట్లాడుకొందాం" అని
సిగరెట్ వెలిగించుకొంటూ పైకి లేచావు.
మృత్యువు నిశ్చయమైపోయిన నా చెల్లెల్ని
చివరిసారిగా చూడటానికి నేనూ కదిలాను.
నవ్వుతూ ఆమె మొఖాన్ని స్పృశించాను ప్రేమతో
దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాను
పంతొమ్మిది ఏళ్లపాటు ఆమె సమక్షాన్ని, స్నేహాన్ని నేను ఆనందించాను
గతించిన ప్రతీ క్షణాన్ని నేను స్మృతిగా నిక్షిప్తం చేసుకొన్నాను
ఆకాశం వైపు చూసాను
ఈ అందమైన పంతొమ్మిది సంవత్సరాలను ఇచ్చినందుకు
దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను
నా హృదయం బిగ్గరగా అరచింది
“Fa’bi’ayyi aala hi rubbikumaa tu kazzibaan”
"నీ ప్రభువు అనుగ్రహాలను వేటిని నువ్వు కాదనగలవు"
.
Source: Religion by Fazili Zabirah
అనువాదం: బొల్లోజు బాబా
Fazili Zabirah శ్రీనగర్ కు చెందిన యువ కవయిత్రి. ఆమె కాశ్మీర్ యూనివర్సిటీలో ఎమ్మె ఇంగ్లీషు చదివారు.
Hazratbal - శ్రీనగర్ దాల్ సరస్సు ఒడ్డున గల ప్రముఖ మసీదు
పై కవితలోని ఖురాన్ వాక్యానికి అర్ధం చెప్పిన వాహెద్ భాయ్ కి ధన్యవాదాలు

తుపాకి మాట్లాడితే

తుపాకి మాట్లాడితే
రిత్రను రికార్డు చేయటం కూడా కవిత్వానికి  బాధ్యతే.
ప్రశాంతతలో జ్ఞాపకం చేసుకొనే ఉద్వేగాలలోంచి కవిత్వం పుడుతుందన్న వర్డ్స్ వర్త్ మాట – నిత్యం జాతి వివక్షతో ప్రజలు సామూహిక ఊచకోతకు బలి అయ్యే  సందర్భాలలో వర్తించదనే విషయం, జీన్ అరసనాయగం బ్లాక్ జులై గురించి  వ్రాసిన Apocalypse 83 సంపుటిలోని కవిత్వం చదివితే అర్ధమౌతుంది.
శ్రీలంకలో తమిళులపై  జులై, 1983 లో జరిగిన మూక దాడులను ‘బ్లాక్ జులై’  అంటున్నారు చరిత్రకారులు.  ఈ దాడులలో దాదాపు మూడువేలమంది  ప్రాణాలు కోల్పోయారు. తమిళులకు చెందిన సుమారు ఎనిమిదివేల ఇళ్ళను, ఆరువేలకుపైగా షాపులను తగలబెట్టారు.   లక్షా యాభైవేలమంది నిర్వాసితులయ్యారు.  ఇదంతా చరిత్ర.    చరిత్రపుస్తకాలలో పైన చెప్పిన తారీఖులు, లెక్కలు, కారణాలు మాత్రమే ఉంటాయి.   ఆనాటి బాధితుల మనోద్వేగాలు, హంతకుల ఉన్మత్తత,  తటస్థుల ప్రవర్తన  లాంటివి ఒక్క కవిత్వంలో మాత్రమే లభిస్తాయి. జీన్ అరసనాయగం ఆ దాడులలో  ఒక బాధితురాలు కనుక అవన్నీ ఆమె కవిత్వంలో  ప్రతిబింబించాయి. చివరి వూపిరిదాకా శ్రీలంక వ్యథని కవిత్వం చేస్తూనే వున్న ఆమె ఈ నెలలో కన్నుమూశారు. ఆమెకి నివాళిగా ఈ అనువాదాలు.
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగ ఎక్కడ వివక్షతో ఊచకోత జరిగినా  అరసనాయగం కవిత్వాన్ని గుర్తుచేసుకొనే పరిస్థితి ఉంది.
*
1.    తుపాకి మాట్లాడితే – If the gun speaks

తుపాకి మట్లాడితే
అంతా నిశ్శబ్దమే
భయం తాలూకు నిశ్శబ్దం
రక్తంతో, బుల్లెట్లతో తుపాకి మాట్లాడితే.

గణేష్ విగ్రహ తొండానికి గుచ్చిన
ఎర్ర మందారం
ఒక రక్తవాంతులా ఉంది

చేతులపై, కాళ్ళవద్దా ఉంచిన
ప్రతీ పువ్వూ
ఒక తెరిచిన గాయం

నల్లూరు ఆలయవీధిలో బంగారు రథాన్ని
తాళ్ళతో లాగుతున్నారు మనుషులు
ఇసుకలో మెల్లగా కదులుతోందది

ఠాప్ మనే శబ్దాలు
ఓ వేయి కొబ్బరికాయలు పగిలుంటాయి
వాటి తీయని నీరు
అనాచ్ఛాదిత దేహాలపై, తలలపై
ప్రవహించింది

తుపాకుల శబ్దాలు నిలచిపోయాకా
అంతా నిశ్శబ్దం
మంటల చిటపటలు
అగ్నిసముద్రంలా వ్యాపించాయి

చిధ్రమైన బూడిద నేలపై
ఓ వేయి చితులు కాల్తున్నాయి.
(నల్లూరు- ఊరిపేరు. ఇక్కడ పోలీసుల ఫైరింగ్ లో అనేకమంది చనిపోయారు.
అరసనాయకం కవిత్వంలో భక్తిని, మనిషి చేస్తున్న హింసను పారలల్ గా నిలపటం చాలాకవితల్లో కనిపిస్తుంది. నువ్వు సృష్తించిన మానవుడు ఇంత హింసను చేస్తుంటే అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది)

2.   భయం     Fear

గొంతులో భయం అడ్డుపడుతుంది
మాటలు బయటకు రావు
అల్లరి మూకల భయం
రాత్రి భయం
వెలుగు భయం
శత్రువుని చూపించే,
పగలంటే భయం
గజగజ వణుకుతూన్న దేహం మొత్తం
భయంగా మారుతుంది
మంటలు, మంటలు, మంటలు.

మృత్యు దృశ్యాలతో కిక్కిరిసిన నేత్రాలు
జ్వరంతో, దిగ్భ్రమతో
రాయిలా అంధత్వం పొందుతాయి.
నిద్రలో భయం, కలల్లో భయం
మాట్లాడితే భయం
వీధులో నడిస్తే భయం
మనవైపు ఎవరైనా
తేరిపార చూస్తే భయం
ప్రతి చూపులో, భంగిమలో భయం,
అడుగువేయాలంటే భయం
వాళ్ళు మమ్మల్ని చంపటానికి
వస్తున్నారంటే భయం
పారిపోవాలంటే భయం

మోకరిల్లటానికి ఇంకేమాత్రమూ శక్తి లేని దేహంతో
ఇంకా ఇక్కడే ఉంటున్నందుకు
నా ఆత్మలో ఏ కొంతైనా సారం మిగిలి ఉంటుందా?


3.   శరణార్ధి శిబిరం   – Refugee camp 1983

నేను ధరించిన ఒకే బట్ట
అది భరిస్తోన్న నా చమట, మురికి
నాకొక గుర్తింపు, హోదాను ఇస్తోంది
నేనెవరినో నాకు తెలిసింది

నేనెవరితో ఉన్నానో, మాట్లాడుతున్నానో
కలిసి దుఃఖపడుతున్నానో
మా అందరకూ ఒకటే పేరు
-శరణార్థి-
ఈ స్కూలు ఆవరణలో
రెండు చేతులు ముందుకు చాచి
ఈ ప్లేటులో వేయించుకొన్న గుప్పెడు మెతుకులు
నా ఆకలిని శాంతింప చేయొచ్చు
బహుసా నీది కూడా.
ఇదోరకమైన ఆకలి, తొందరగానే తీరుతుంది
ఏ భయము, ఏ అపాయమూ లేకుండా
జీవించాలనే ఆకలి అలా కాదు.

కొన్ని గుడ్డలేవో మడతపెట్టుకొని
తలగడగా చేసుకొని సిమెంటు నేలపై పడుకొంటాను
స్కూలు డెస్క్ లే నా పొలిమేరలు.
సురక్షిత ప్రాంతపు అంచుల్లో ఉండేదాన్ని
తటస్థ భూమి.
లక్షమందో ఇంకా ఎక్కువమందో ప్రజలతో పాటూ
నేనూ నిర్వాసితమయ్యాను
-అందరూ శరణార్థులే-

కాశ్మీరి కవిత్వం 4

కాశ్మీరి కవిత్వం 4
1. పచ్చబొట్లు, నిబద్దతలు Tattoos & Commitments by Abishake Koul
ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు కలిసాను
చినార్ ఆకును పచ్చబొట్టుగా వేయించుకొంది
ఆ ఆకుకు బుల్లెట్ రంద్రం ఉండేది
ఇప్పుడా పచ్చబొట్టు ఆకు కూడా వడిలిపోయింది

ఆమె దేహాన్ని రాసుకు తిరిగిన
తుపాకులగురించి మాట్లాడేటపుడు
ఆమె స్వరం గద్గదమైంది
వేలిపై వేయించుకొన్న ఆజాదీ అక్షరాల
పచ్చబొట్టును చూపించింది ఆమె.
2. వలస పోవటం - Abandonment by Daaniyal Hassan
శ్రీనగర్ ఎయిర్ పోర్టులో
ఎదురుచూసే ఫర్నిచర్ కి వేళ్ళు పెరిగి
మంచునేలలోకి చొచ్చుకుపోయాయి.
చెక్కపై ద్రాక్ష లతల్ని చెక్కిన
వడ్రంగి పదునైన ఉలి
నా అరచేతిపై ఏవో గీతల్ని మెత్తగా చెక్కుతుంది
మంచుతో కప్పబడిన తలుపులు తోసుకొని
జ్ఞాపకం ప్రవేశిస్తుంది తిరిగి వెళిపోవటానికి
ఈ మట్టిలో కూరుకుపోయిన నా కాళ్ళు, చేతులకు
ఈ నిష్క్రమణ కదలిక తెస్తుంది.
నన్నిక్కడనుంచి బయటకు మోసుకువెళ్ళటానికి
ఎంత బలమైన పాదాలు కావాలీ?
నా పాదముద్రలు వీధులలో శిధిలమౌతాయి మెల్లమెల్లగా
నా ధైర్యాన్నంతా గుప్పెట్లో పెట్టుకొని
మరో ఇల్లులేనితనం లోకి వలస పోవాలి
మా హృదయాలు అగ్నికి ఆహుతి అయ్యాకా
మిగిలిన బూడిద రూపమే
రన్ వే పై పరచుకొన్న ఈ వలస పొగమంచు
మేం కోల్పోతున్న మా మాతృభూమి స్పర్శ వెనుక
అస్థిపంజరాల వరుసలు,
చరిత్రతో, యుద్ధంతో తుప్పు పట్టిన ఇంటి రేకులు,
మిగిలినవన్నీ ఉత్త ఖాళీ మేఘాల జ్ఞాపకాలు
మూడు సార్లు విమానాలు కాన్సిల్ అయ్యాయి
'ఎవరో కుట్రలు చేస్తున్నారు' అంటుంది అమ్మ
మరో ఆరు ఇంచుల మంచు పెరిగి
నాళాలలో ఇంధనం గడ్డకట్టి
విమానాల గుండెలు ఆగిపోయాకా
ఒక్క విమానం కూడా ఎగరదు
అమ్మ ఎన్ని పూజలు చేసినా
వాటి ఇనుప రెక్కలు నిర్దయగా నిలిచిపోతాయి
మృత్యువు వదంతిలా వ్యాపిస్తుంది.
దేశ బహిష్కృతునికి అంతిమ సంస్కారాలు
ఎవరు చేస్తారూ?
అనుసృజన - బొల్లోజు బాబా

కోరంగి మాంగ్రోవ్స్....

కోరంగి మాంగ్రోవ్స్....
ప్రతిరోజూ ఎంతో మంది వచ్చిపోతూంటారు
పిల్లలతో, ప్రియురాళ్లతో
ఒంటరిగా, సమూహాలుగా.....
చెక్కల వంతెనదారికి ఇరువైపులా పరచుకొన్న
సౌందర్యాన్ని ఆస్వాదించటానికి,
గుంపులు గుంపులుగా నిద్రిస్తోన్న నత్తలని
నిబిడాశ్చర్యంతో చూడటానికి,
చిక్కని ఆకులతో మడచెట్లు పట్టే గొడుగు నీడల
స్నానం చేయటానికి,
రాత్రిపూట ఏదో జంతువు వదిలిన పాదముద్రల్ని
డీకోడ్ చేసేందుకు,
అసౌందర్యాన్ని రాల్చి ఎటో ఎగిరిపోయిన తెల్లకొంగను
దృశ్యంగా బంధించటానికి
ప్రతిరోజూ ఎంతో మంది వచ్చిపోతూంటారు
వచ్చిన వాళ్ళే మరలా మరలా వస్తూంటారు
ఈ వనానికి ఎప్పుడో గుప్పెడు క్షణాలు రుణపడ్డట్లో
ఈ బురదనేలలో పోగొట్టుకొన్న ఏ స్వప్నాల్ని వెతుక్కోవటానికో
గాలిపీల్చుకోవటానికి భూమిపైకి వచ్చిన వేళ్ళలా
ఉరుకుల ఆయాసం తీరటానికి ఏ లోలోపలి ఊపిరికోసమో
వచ్చిన వాళ్ళని
పొన్నచెట్టు నీడలు, గుగ్గిలపు ఆకుల గలగలలూ
నవ్వుతూ పలకరిస్తాయి.
అభయారణ్యం మధ్యలో ఉన్న
క్షీణమైన పురాతన లైట్ హౌసు, దాని వలయాకార మెట్లు
ఏ కొద్దిమంది సాహసులనో ఆకర్షిస్తాయి
ఉత్సాహంగా ఉరకలు వేస్తూ, కేరింతలు కొడుతో
దానిపైకి ఎక్కి ఫొటోలు తీసుకొంటారు
వారిలో ఏ ఒకడో
దూరంగా కనిపించే సువిశాల సముద్రాన్నీ
లంగరు వేసిన ఓడల్ని, నగర హర్మ్యాల్ని
ఇంకా సుదూరంగా కనిపించే ఫాక్టరీ గొట్టాల్ని
శిధిలమైపోయిన ఒకనాటి కోరంగి మహానగరాన్ని
తదేకంగా చూసి
మౌన భారంతో మెట్లు దిగుతాడు
నదీపాయల నడుమ నారాయణ పక్షుల బారుని
డీజిల్ శబ్దం
చెల్లాచెదురు చేస్తుంది.
బొల్లోజు బాబా

Braille rainbow....

Braille rainbow....
దాహానికి పనికిరాని
ఉప్పునీరు
పరవళ్ళు తొక్కుతూ
ప్రవహిస్తుంది
నువు మాట్లాడని మాటలన్నీ కూడా
నీ అస్తిత్వమే అన్న స్పృహ
నిన్ను దారికాసి అడ్డగిస్తుంది
జ్ఞాపకాలతో అనంతమైన పెనుగులాట
LED కాంతుల సందోహంలో
ఎపుడు తెలవారిందో
గమనింపే ఉండదు
పిట్టలన్నీ దారితప్పి
సముద్రంలో కూలిపోతాయి.
హతుని పిడికిలిలోని వెంట్రుకలు
ఏ DNA పరీక్షలకూ అందవు.
గతమంతా
అంధుని ఇంద్రధనుసు వర్ణనలా
అనిపిస్తుంది చివరకు.
అంతా అయిపోయిందని
కాడి పారేస్తాం.
అపుడు గమనించం కానీ
నేలపగుళ్ళలో దాగిన విత్తనమో
ఎదురొచ్చి కాళ్ళకు చుట్టుకొనే
పసిపాప నవ్వో
ఏదో మిగిలే ఉంటుంది.
కర్రను చెక్కపై తిప్పగా తిప్పగా
నిప్పు పుట్టినట్లు
ఒక్కసారిగా లోలోపల ఏదో కొత్తకాంతి
విచ్చుకొంటుంది.
కొండలమధ్య ఎక్కడో ఓ ఖగరాజం
నోటికి అడ్డంగా పెరిగిన ముక్కును
రాళ్ళకేసి బాదుకొని బాదుకొని
పునర్జన్మ పొందుతుంది.
బొల్లోజు బాబా

వలస పోవటం....

వలస పోవటం....
"ఉండరా ఎదురు వస్తాను" అంది అమ్మ
"అవన్నీ మూఢనమ్మకాలమ్మా, నీ పిచ్చికానీ" అన్నాను
అమ్మ నవ్వుతూ ఎదురుగా వస్తూంటే
బేగ్ భుజాన వేసుకొని బయలుదేరాను
"జాగ్రత్తరా! ఉత్తరం రాయి" వెనుకనుంచి నాన్న
ముప్పై ఏళ్ళు గడిచిపోయాయి
అదంతా మళ్ళీ జీవించాల్సి వస్తే బహుసా
ఇలాంటి దారుల్లోనే సాగాల్సి వచ్చేదేమో!
కానీ ఖచ్చితంగా
"ఇది నీకు గొప్ప అవకాశమోయ్" అన్నప్పుడు
బాల్యం నుంచి తెచ్చుకొన్న నీలగోరింట మొక్కను
ఎడార్లకు అమ్ముకోకపోదును.
ఒక రాత్రివేళ గులాబి చేతుల్ని
విడిపించుకొని వచ్చేసేవాణ్ణికాదు.
మెట్లు ఎక్కుతున్న కొద్దీ నేలకు దూరమౌతున్నాననే
ఎరుకను మొదట్లోనే గ్రహించేవాడిని.
చీకటి జిప్పుతీసి ఒంటరితనాన్ని పదే పదే
చూపించే కిటికీని ధ్వంసం చేసి ఉండేవాడిని.
రెండుగా చీలిన దారిలో మరలా కుడివైపుకే
బహుసా కొంచెం ముందుగానే మళ్ళేవాడినేమో!
***
"ఉండరా ఎదురొస్తాను" అంటోంది నా భార్య
"అవన్నీ blind faiths అమ్మా" అంటున్నాడు కానీ
నా కొడుక్కూ అది ఇష్టమేనని నాకు తెలుసు.
ఆమె నవ్వుతూ ఎదురొస్తుంటే
ఓలాకాబ్ మెల్లగా ముందుకు కదిలింది
"ఫోన్ చేస్తూండు" అన్నాను కానీ
మాటలు గొంతుదాటాయో లేదో నాకే తెలీలేదు
చెంపలపై ఏదో జారినట్లనిపించింది
చేతికి వెచ్చగా కన్నీరు తగిలింది.
ముప్పై ఏళ్ల క్రితం ఇల్లు విడిచినపుడు
మా నాన్న కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయాను!
ఇందుకేనేమో!
బొల్లోజు బాబా

భూమికి పుట్టినరోజు” జరిపే ఆకెళ్ల రవి ప్రకాష్ కవిత్వం

నా కవిత్వం మీద మంచి రివ్యూ రాసిన బొల్లోజు బాబా (Bolloju Baba) కు దాన్ని ప్రచురించిన కవిసంధ్య ( Kavi Sandhya ) సంపాదకులకు నా వందనాలు - ఆకెళ్ళ రవిప్రకాష్ Ravi Prakash 🙏
భూమికి పుట్టినరోజు” జరిపే ఆకెళ్ల రవి ప్రకాష్ కవిత్వం
(ఈ వ్యాసం కవిసంధ్య పత్రికలో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)
.
‘కవిత్వం అనేది ఒక ఉత్పత్తి కాదు అదొక ప్రయాణం’ అనే సత్యాన్ని తెలిసిన కవి శ్రీ ఆకెళ్ల రవిప్రకాష్. మూడు దశాబ్దాలుగా కవిత్వంతో సహచరిస్తున్న రవిప్రకాష్ తాజా కవిత్వ సంపుటి పేరు “భూమి పుట్టినరోజు”. రవిప్రకాష్ కవిత్వం స్వేచ్ఛగా, సౌందర్యవంతంగా, తేటగా ఉంటూనే ప్రతి వాక్యం వెనుకా లోతైన అంతర్వీక్షణ, నిశిత దృష్టి, జీవన తాత్వికత పొటమరిస్తూంటాయి.
కవిత్వానికి కళాత్మకత, నూత్నదృష్టి రెండు నేత్రాల వంటివి. చక్కని నిర్మాణము, భావ పుష్టి, సందర్భోచిత అలంకారప్రయోగం లాంటివి కవితావస్తువును కళాత్మకం చేస్తాయి. అందరకూ పరిచితమైన విషయాన్నే చెపుతున్నప్పటికి దానిని ఒక నూతన దృష్టితో వ్యక్తీకరించటం మంచి కవిత్వ లక్షణం. దాన్ని చదివిన ప్రతిఒక్కరు ఇది నాకొరకే చెపుతున్నాడీ కవి అని ఉద్వేగపడాలి. ఈ రెండు లక్షణాలు రవిప్రకాష్ కవిత్వంలో పుష్కలంగా కనిపిస్తాయి.
రవిప్రకాష్ కవిత్వంలో మామూలు దృశ్యాలు గొప్ప సౌందర్యచిత్రాలుగా రూపుదిద్దుకోవటం అనేక కవితలలో చూడవచ్చు.
రాత్రి పక్షి ఆకాశాన్ని
చిట్టచివరి గుటకలో
ఎలా మింగేస్తుందో చూడు (రైలు ప్రయాణం)
పూర్తిగా చీకటి పడి ఆకాశం కనిపించకుండా పోయింది అనే దృశ్యాన్ని గొప్ప ఇమేజెరీతో సౌందర్యమయం చేస్తాడు.
సగం తీరం మీదా
సగం రాళ్లమీదా
ఆరేసిన తెల్లని ఎండ దుప్పటి (మధ్యాహ్నం)
తెల్లని తీరంపైనా, నల్లని రాళ్లపైనా ఎండ ఒకేలా, తెల్లగా ప్రకాశిస్తుంది. ఎండను దుప్పటిగా పోల్చటం అందమైన ఊహ.
కవితను చివరివాక్యాలలో అనూహ్యమలుపు తిప్పటం రవిప్రకాష్ కవిత్వలక్షణం. ఇది చాలా కవితలలో కనిపిస్తుంది. అంతవరకూ కవిత ఏదోమామూలు వైయక్తిక ఘటనను వర్ణిస్తున్నట్లుంటుండి ఒక్కసారిగా గంభీరతను సంతరించుకొంటుంది. “పాప మనసు” కవితలో ఆసుపత్రిలో ఒక పాప అదేపనిగా ఏడుస్తుండటం కవితా వస్తువు. ఏవరూ ఊరుకోబెట్టలేకపోతున్నారు, ఏవో పూర్వజన్మ జ్ఞాపకాలు కావొచ్చట, పాపమనసు నిద్రాతీరంలోకి కరగటంలేదట, రాగాలన్నీ విషాదమయ్యాయి, రంగులన్నీ దుఃఖవర్ణంలోకి ఇంకిపోయాయి అంటూ అనేక వర్ణనలతో ఆ దృశ్యాన్ని, దాని వెనుకున్న ఉద్వేగాలను అద్భుతంగా పలికిస్తారు. ఇక ఆ కవిత చివరవాక్యాలు ఇలా ముగుస్తాయి
దివారాత్రాల బేధాన్ని మర్చిపోయి
ఆగకుండా రోదిస్తున్న సముద్రంలా
పాప మనసు/ (పాప మనసు)
కవితముగియగానే ఆలోచనలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకొంటాయి. ఇంతకీ పాప ఎవరు? సముద్రమా, కాలమా, జీవితమా, కవి దుఃఖమా అంటూ అనేక కిటికీలు తెరచుకొంటాయి. ఇస్మాయిల్ గారు అన్న “తెరుచుకొన్న పద్యం” అంటే ఇదేననిపిస్తుంది.
ఈ సంపుటిలో వివిధ శీర్షికలతో లఘుకవితలను వ్రాసారు ఇది శిల్ప పరమైన విశేషంగానే భావించాలి ఎందుకంటే ఈ ప్రక్రియకో పేరు పెట్టి ఖ్యాతి నొందాలనే ఉద్దేశం కనిపించదు. వానాకాలం పద్యాలు, విమాన పద్యాలు, ప్రశ్నలు, విశాఖనగర పద్యాల శీర్షికలతో ఉన్న కవితలలో ఈ రీతి కనిపిస్తుంది.
ఎవరూ నడవని రోడ్లమీద
నడుస్తూ వర్షం (వానాకాలం పద్యాలు)
భోరున పడే వానను గమనిస్తే, వాన జల్లు రోడ్డుపై ఒక్కోసారి ధారల పాదాలతో ముందుకు కదులుతూన్నట్లు అనిపిస్తుంది. చాలా సున్నితమైన పరిశీలన ఇది.
రవి ప్రకాష్ “విమాన పద్యాలు” పేరుతో వ్రాసిన కవితలలోని వర్ణనలు కూడా అంతే హృద్యంగా ఉంటాయి.
ఆకాశంలో ఒకడే చంద్రుడు
సముద్రం మీద వేల లక్షల చంద్రుళ్ళు - ఈ లోకానికి చంద్రుడొక్కడే కానీ సాగరతరగలపై ప్రతిబింబించే లక్షల చంద్రుళ్ళను చూడాలంటే విమానం కిటికీ పక్క సీటు దక్కించుకోవాల్సిందే.
వీధి దీపాల్ని మెళ్లో వేసుకుని
మాయా ద్వీపంలా వెలుగుతూ నగరం - అనే విమానపద్యంలో “మాయా ద్వీపం” అన్న ఒక్క పదంతో నగరాన్ని- పుర్రెలు మెడలో ధరించిన రాక్షసునిగా ధ్వనింపచేస్తారు.
నగరం అంటే రవిప్రకాష్ కు లౌల్యం. నగరం అంటేనే కొత్త స్వరాలు, కొత్త ఘర్షణలు, కొత్త అనుభూతులు. ఇవే కదా కవిత్వానికి ముడిసరుకు. తన ప్రతి సంపుటిలోను నగరం పై నాలుగైదు కవితలు ఉంటాయి. “ఇసక గుడి” సంపుటిలో పాండిచేరి నగరంపై వ్రాసిన పెద్దకవిత, ఈ సంపుటిలో మద్రాసు నగరంపై వ్రాసిన “మద్రాసులో ఒక రాత్రి” అనే కవిత అన్నింటిలోకి మకుటాయమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రతికవితలోను నగరం కొత్తగా దర్శింపచేయటం కవి ప్రతిభ.
కవిత్వం ఉద్వేగాలకు అక్షరరూపం ఇస్తుంది. ఇది మనుషుల్ని దగ్గరచేస్తుంది. ఒకరి పట్ల ఒకరికి దయ ప్రేమ కరుణ లాంటి అనుభూతులు కలిగింపచేస్తుంది. మానవ సంబంధాలను పటిష్టపరుస్తుంది. ఈ సంపుటిలోని అనేక కవితలు మానవ సంబంధాలలోని ఆర్థ్రతను నిండారా ఆవిష్కరిస్తాయి.
“నాన్న ఉంగరం” కవితలో పద్దెమిదేళ్ళక్రితం గతించిన తండ్రిగారి ఉంగరాన్ని తను ప్రస్తుతం ధరించటం పై వ్రాసిన కవితలో…
జాలరి వలల చుట్టూ
గాఢమవుతున్న సాయింత్రపు నీడలా
నాన్న మౌనాన్ని కూడా
తనలోకి ఇముడ్చుకుందీ వుంగరం//
చిత్తం ఇసక తీరం మీద
మెత్తగా జారిపడిన పండుటాకులా
వెచ్చగా స్పర్శిస్తూవుంటుందీ వుంగరం - (నాన్న వుంగరం).
నాన్న ఉంగరాన్ని ధరించటం అంటే ఆ తరాన్ని, ఆ తరపు బాధ్యతల్ని వెచ్చని స్పర్శగా దాల్చటమే. ముందు తరానికి వారసులుగా మనం కొనసాగించాల్సిన పారంపర్యతకు ఉంగరాన్ని ప్రతీకగా చేస్తున్నాడు కవి. తాను కూడా గాఢమవుతున్న సాయింత్రాన్ని చేరుకొంటున్నాను అనే స్పృహ ధ్వనిస్తుందీ కవితలో. ఇదొక పునరావృత క్రీడ.
“జీవనదీ ఆరు ఉపనదులు” కవితలో “ఆడవాళ్లందరినీ వంటింట్లోకి /వెళ్లడాన్ని నిషేధించి /మనందరినీ పాలించమంటే /ఈ భూప్రపంచం /ఎంత మార్ధవంగా /ఎంత సున్నితంగా /ఎంత దయగా /ఎంత నిర్భయంగా /మారిపోతుందో చూడాలని ఉంది” అంటాడు. ఇది స్త్రీల సామర్ధ్యం పట్ల, స్త్రీలకు దక్కాల్సిన సాధికరత పట్ల కవికి ఉన్న సహానుభూతిని పట్టిచూపుతుంది.
ఊరినుంచి వస్తూ బహుమతులు తెచ్చే తండ్రిని గుర్తుచేసుకుంటూ వ్రాసిన “నాన్న జ్ఞాపకం”; ఆవిర్లు గక్కే వంటల్ని వడ్డించే అమ్మను తలచుకొంటూ వ్రాసిన “వంటిల్లు”; తన సహాద్యాయి మరణంపై వ్రాసిన “సూర్యుని మరణం” లాంటి కవితలలో మానవసంబంధాలు కరుణాత్మకంగా వ్యక్తీకరించబడ్డాయి.
ఈ లోకంపైనా, మనుషులపైనా, మనో వేదనలపట్లా, మానవ సంబంధాలపైనా అవ్యాజమైన అనురక్తే రవిప్రకాష్ కవిత్వ తత్వం. మానవాళిపై అచంచలమైన ప్రేమ అనేక కవితల అంతఃసూత్రం.
మానవాళి మొత్తం
ఒకే దేశంగా ఒకే మతంగా ఏకమయ్యి
ఒకర్ని పాలించాలనుకునే వాళ్లనీ
ఒకర్ని నియంత్రించాలనుకునే వాళ్ళనీ
భూగోళం మీంచి ఖాళీ చేసి
పంపాల్సిన రోజు
ఒకరోజు తప్పక వస్తుంది
ఆ రోజు కోసం మళ్ళీ
భూమి పుట్టిన రోజు కోసం
ఎదురుచూస్తూ - (భూమి పుట్టిన రోజు) అనే వాక్యాల ద్వారా- కవి యుద్ధాలు, నియంతలు, అడ్డుగోడలు లేని వసుధైక కుటుంబాన్ని స్వప్నిస్తున్నాడని అర్ధమౌతుంది.
ఈ క్రమంలో శాస్త్రీయత, మేధలను, కవి కలలు, ఊహలు డామినేట్ చేస్తున్నట్లు అనిపించినా ఇది ఒక బృహత్ స్వప్నం. ఎంతవరకూ వాస్తవలోకంలో జరుగుతుందో తెలియదు కానీ ప్రతి మనిషి మనోలోకంలో ఈ స్వప్నం సాకారం అయిన రోజు ఈ భూమికి నిజంగా పుట్టిన రోజే అవుతుంది.
రవిప్రకాష్ భావుకుడు, మానవతావాది, గజిబిజి జీవితంలోని సౌందర్యాన్ని ఒడిసిపట్టుకోగలిన బాహ్యనేత్రం; చిక్కులు పడిన ఆలోచనలల్లో మెరుపులా కనిపించి మాయమయ్యే జీవనతాత్విక వ్యాఖ్యానాన్ని దర్శించగలిగే అంతర్నేత్రం కలిగినవాడు, కవిత్వానికే కట్టుబడిన నైష్టికుడు.
ఈ పుస్తకానికి డా.రవూఫ్ ముందుమాట వ్రాసారు. కవితలకు శ్రీ గిరిధర్ వేసిన చక్కని చిత్రాలు కవితాత్మకు అలంకారంగా ఉన్నాయి. మంచి, సాంద్రమైన కవిత్వాన్ని ఇష్టపడేవారికి భూమిపుట్టిన రోజు తప్పక నచ్చుతుంది.
- బొల్లోజు బాబా