Wednesday, May 25, 2016

పక్షులపై మిర్చీలు


శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన "పక్షులపై మిర్చీలు" అన్న పుస్తకం పేరు నన్ను ఆకర్షించింది. (జువాలజీ టీచర్ ని కదా!). "తేలిక పదాలతో వ్యంగ్యంతో, హాస్యంతో , సాగతీయకుండా సారంచెప్పటమే మిర్చీ ప్రక్రియ" అని మిర్చీలగురించి వారే వివరణ ఇచ్చారు.
ఈ రోజు కవిత్వం ఎస్.ఎమ్.ఎస్ లేదా వాట్సప్ ల అవసరాలకు అనుగుణంగా సంక్షిప్తరూపాన్ని పొంది, ఫొటో జతతీసుకొని విస్త్రుతంగా షేర్ అవుతుండటం చూస్తున్నాం. అది కవిత్వమా కాదా అన్న మిమాంస పక్కన పెడితే, హృదయాన్ని తాకి, ఆలోచనను రేకెత్తిస్తూ, అన్యాపదేశంగా ఒక ఉత్తమ భావనను చెప్పగలిగే ప్రతీ వాక్యమూ కవిత్వమే అని భావిస్తాను.
సామెతలుగా, గోడనినాదాలుగా, సభలలో ఉపన్యసించేటపుడు సిసింద్రీలలలా, సంభాషణలలో చమత్కార మెరుపులుగా, వ్యాసాలలో చక్కని ఉటంకింపులుగా, - ఇంకా అనేక రకాలుగా మిర్చీలను చక్కగా ఉపయోగించుకోవచ్చు.
పక్షులపై మిర్చీలు పుస్తకం లో పక్షులను ప్రకృతికి ప్రతీకగా చేసినట్లు తెలుస్తుంది. వీరు క్లుప్తంగా వెలిబుచ్చిన భావాలు చాలా చోట్ల అంత్యప్రాసతో, అనుప్రాసలతో నడిచి చదివేటపుడు రమ్యతాభావాన్ని కలిగిస్తాయి.

"ఆడదుప్పులతో కలిసే కాలంలో మగదుప్పులకి కొమ్ములు రాలిపోతాయి, మళ్ళీ వస్తాయి. కొమ్ములు కుమ్ములాటలకే కానీ ప్రేమకు పనికి రావు".

ఒక చక్కని జంతుశాస్త్ర అంశానికి మానవారోపణ చేసి  గొప్ప జీవితసత్యాన్ని ఆవిష్కరిస్తారు శ్రీ అప్పారావు గారు ఇక్కడ. నిజమే, బలప్రయోగం యుద్దంలో విజయానికే కానీ ప్రేమను పొందటానికి పనికిరాదు కదా!

"ఆవులు అద్దెకి దొరికినట్టు కాకులూ అద్దెకి దొరికితే, మనకి మనశ్శాంతి! పోయిన మనిషికి ఆత్మశాంతి!!!"
ఇది నగరజీవితంపై కవి ఎత్తిపెట్టిన వ్యంగ్యాస్త్రం. కొన్ని మతవిశ్వాసాలకు సంబంధించింది. టౌనులలో గృహప్రవేశాలకు ఆవును అద్దెకు ఇవ్వటం ఒక వ్యాపారంగా మారింది. చనిపోయిన వ్యక్తి పేరిట పెట్టిన పిండాన్ని కాకితింటే వారికి ముట్టినట్లుగా సంబంధీకులు భావిస్తారు. ఆవు అద్దెకు దొరికినట్లు కాకికూడా అద్దెకు దొరికితే బాగుణ్ణు అనటం, ప్రస్తుత జీవనంలో ఏర్పడిన శూన్యతను, కాకులకు కూడ నిలువనీడ లేకుండా నిర్మించుకొన్న కాంక్రీట్ జంగిల్స్ గురించి చేసిన చక్కని వ్యాఖ్య ఈ మిర్చీ.

"ఎలకలకు బోను, పందికొక్కులకు చేను - మన వ్యవస్థ"
అంతే కదా నేడు జరుగుతున్నది. బలహీనులకే అన్నిచట్టాలు వర్తిస్తాయి. బలిసినవారి అవి చుట్టాల్లా వ్యవహరిస్తాయి.

"కాకి ఊరుమిత్ర, పాము రైతుమిత్ర"
నిజానికి కాకికి సాహిత్యపరంగా కోకిలకు దక్కినంత గౌరవం దక్కలేదు. కాకులు నివాసస్థలాలలోని జీవవ్యర్ధాలను తొలగించి, శుభ్రం చేయటం ద్వారా పరిణామక్రమంలో మానవునికి చేరువైన జీవులు. అలాగే పాములు పంటలకు హానికలిగించే ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచి రైతుకు మేలుచేస్తాయి. ఇదొ సమతుల్యతా వ్యవస్థ.

"అడవులే స్వర్గం, నరికితే నరకం" వంటి కొన్ని మిర్చీలు సాధారణంగా, ఉత్తవాచ్యంగా ఉన్నాయి.
"అవ్వ, గువ్వ ఒకేతీరు. ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు, ఎంతపిట్టకు అంతరెట్ట" లాంటి ప్రయోగాలను అంతగా ఆస్వాదించలేకపోయాను.
శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు రచించిన ఈ పుస్తకాన్నిశ్రీ ముక్తేవి రవీంద్రనాథ్ గారికి అంకితమిచ్చారు. సరదా చమత్కారం, వ్యంగ్యం తో కూడి, ఆలోచింపచేసే మంచి వ్యాక్యాలను ఇష్టపడేవారికి ఈ పుస్తకం నచ్చుతుంది.

భవదీయుడు
బొల్లోజు బాబా

ఈ పుస్తకాన్ని ఈ క్రింది లింకులో దిగుమతి చేసుకొనవచ్చును'
https://www.scribd.com/doc/313438477/పక-షులపై-మిర-చీలు-e-book-pdf

Tuesday, May 24, 2016

థాంక్యూ మిత్రమా

నా కొత్త పుస్తకాల బాక్ పేజ్ కొరకు ప్రముఖ చిత్రకారుడు Chinnari Mummidi చేసి ఇచ్చిన డిజిటల్ పొట్రైట్. థాంక్యూ మిత్రమా



బొల్లోజు బాబా

Friday, May 20, 2016

ఆశిష్ ఠాకుర్ కవిత్వం - కొన్ని అనువాదాలు

ఆశిష్ ఠాకుర్ కవిత్వం - కొన్ని అనువాదాలు గతనెల అంతర్జాల సంతలో తప్పిపోయి “ఆశిష్ ఠాకుర్” అనే ఓ కలల వ్యాపారికి బంధీగా ఉండిపోయాను కొంతకాలం. ఆ కబంధ హస్తాలనుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టింది. ఆయన కొన్ని కవితలను తెలుగులోకి అనువదించటం ద్వారా నేను అనుభవించిన తీయనిబాధను దించుకొంటున్నాను. కవిత్వం పట్ల ఆశిష్ ఠాకుర్ కి ఉన్న అభిప్రాయాలు నిశ్చితమైనవి. ఈ కవితలో కవిత్వము-సమాజము పట్ల ఇతని దృక్పధం గమనించవచ్చు. కవిత్వమనేది ఎవర్నో ఉద్దరించటానికి కాక జీవన సౌందర్యాలను, అనుభవాలను అక్షరీకరించటానికి అని సూటిగా స్పష్టంగా చెపుతాడు ఈ కవితలో మనకు కావలసిందల్లా! అతను అనుకొంటాడు తన కవితలకు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉందని యుగాంతం వరకూ అవి శ్వాసిస్తూ ఉండగలవని కానీ వాస్తవమేమిటంటే యావత్ ప్రపంచం కూడా మార్పు తేవాలి, కాలాన్ని బంధించాలి అనే కోర్కెతో ఇప్పటికే పొట్టపగిలేట్టు ఉంది మనకు కావలసిందల్లా సబ్బు నీటిబుడగలో ఇంద్రధనసును దర్శించే కళ. -- (All We Need! By Ashish Thakur) మనపూర్వీకులు ఆహార,నిద్రా, మైధునాలను జీవలక్షణాలుగా నిర్వచించారు. ఆ మూడో లక్షణం పరస్పరసమ్మతితో ఉండాలి తప్ప ఏకపక్ష క్రియగా ఉండకూడదన్న చిన్నవిషయాన్ని అద్భుతంగా ఇముడ్చుకొందీ ఈ కవిత. అంతే కాక ఆ క్రియ దేహాత్మల కలయిక అని చెపుతుంది. Sex? నువ్వన్నావూ “నా దేహం చాలా ఆకలితో ఉంది దాన్ని తినాలని ఉంది” అని అలాగే, కలిసి తిందాం. నేనన్నానూ “నా ఆత్మ చాలా దాహంతో ఉంది దాన్ని తాగాలని ఉంది” అని అలాగే, కలిసి తాగుదాం. (Sex? – by Ashish Thakur) కవిచుట్టూ ఉండే సమాజంలో అంతా సౌందర్యమే ఉండదు. ఒక్కోసారి భీతావహ పరిస్థితులు గగుర్పాటు కలిగిస్తాయి. అలాంటప్పుడు కవి నిస్తేజంగా ఉండలేడు. ఆశిష్ ఠాకుర్ కూడా నేడు సమాజంలో స్త్రీలపై జరుగుతున్న క్రూరత్వాలను ఈ కవితలో వర్ణించిన తీరు చూస్తే ఒక విధమైన జలదరింపు కలుగక మానదు. అమ్మాయిలు ధరిస్తున్న దుస్తులవల్లే రేప్ లు జరుగుతున్నాయని వాదించే వారికి గొప్ప సమాధానం ఈ కవిత. ఓ అమ్మాయికి పట్టులాంటి మృధువైన చర్మం అక్కర్లేదట, ఒళ్ళంతా రోమాలు మొలవాలని కోరుకొంటోంది- అంటూ మొదలౌతుంది ఈ కవిత. ఒంటినిండా దుస్తులు వేసుకొన్నా అనాచ్ఛాదితంగా ఉన్న అరచేతులు, పాదాలు మగవారిలో కోర్కెలు రేకెత్తిస్తున్నాయి అనటం, అటువంటి అమ్మాయిని ఒక టెర్రరిస్టుతో పోల్చటం వంటివి-- ఒకరకంగా ఈ కవితను తారాస్థాయికి తీసుకెళ్ళి వదలటమే. ఈ కవితలో గొప్ప శిల్పం, లోతైన పదచిత్రాలు, అద్భుతమైన తర్కం ఉత్తమ స్థాయిలో వ్యక్తీకరింపబడ్డాయి. ఆమె మృధువైన చర్మాన్ని కోరుకోవటం లేదు అనుక్షణం భయపడే ఉడతలా బతికే ఆమె ఓ పేదదేశానికి చెందిన అమ్మాయి సురక్షితంగా ఉండటానికి ఆమెకు ఒంటినిండా రోమాలు కావాలి. ప్రతీచోటా గెట్టోలు, గులాగ్ లు, కాన్సంట్రేషన్ కాంపులు. మారువేషమేసుకొన్న ఆమ్లం మరుగుతూంటుంది వేడి టీ గా ఆమె పరువు ఆమె మౌనం లో ఉంటుంది సగర్వంగా నడవటానికి ఆమె తలదించుకోవాలి. గెంతటం నిషేదింపబడిన జింకపిల్ల ఆమె ఆమెకు స్వేచ్ఛా శృంఖలాలను బహూకరించాయి హైనాలు. అంతే కాదు వీధులనిండా పోస్టర్లు “ఆడ టెర్రరిస్టు కావలెను... ప్రాణాలతో లేదా శవంగానైనా ఆమె అనాచ్చాదిత చేతులపై, నగ్న పాదాలపై కోర్కెలు రేకెత్తించే ప్రేలుడు పదార్ధాలతో తిరుగుతుంది”.. అంటో ------ She doesn’t want smooth skin by Aashish Thakur కవిత్వంలో ఉద్వేగాల్ని పలికించటం చాలా క్లిష్టమైన పని. ఈ కవితచదివినపుడు ఒక ఎడారితనం, నిరీహత, దాహం, రసహీనత వంటి అనేక భావాలు ముప్పిరిగొనుపుతాయి. ఎండిన ఆకులను ఎండిన చేతివేళ్ళుగా వర్ణించటం మొత్తం కవితను ఒక అనార్ధ్రలోకానికి తీసుకుపోతుంది. వేసవి వేసవి ఉంది పిచ్చుకలు లేవు నాలో వేనవేల ఎండిన చేతివేళ్లతో ఓ చెట్టు హృదయం ఒక ఏకాకి శిఖరం నేత్రాలు ఒక ఎండిన చెలమ లోనికి తెరచుకొనే కిటికీలు ఇంకా సూర్యునిచే కాల్చబడిన ఆకాశం ఓ దాహమెత్తిన నుయ్యి చెప్పటానికి ఏమీ లేదు ఉత్త ఎండు కవితలు వానకోసం ఎదురుచూస్తూ (Summer by Ashish Thakur) పై కవిత లానే ఒంటరితనాన్ని, వేదనను ప్రతిభావంతంగా వ్యక్తీకరిస్తుంది ఈ కవిత ..... రాత్రి నీ పేరుని పలకలేని నా హృదయ స్పందనల్లా మౌనంగా ఉందీ రాత్రి నా కళ్ళకు శత్రువైన అద్దంలా మౌనంగా ఉందీ రాత్రి ఆశలకన్నా సుదీర్ఘంగా ఉండే ఒంటరితనాన్ని మోసే అమ్మలాగే ఈ రాత్రి ఏనాడూ నవ్వదు ఓ రాత్రీ! నా స్నేహితునిగా ఉండవా నేను ఇప్పటికే పగలుని కోల్పోయాను. – Night by Ashish Thakur కవిత్వలక్షణాల్ని అనేకమంది కవులు అనేక రకాలుగా తమ కవిత్వంలో పొందుపరచారు. కవిత్వానికి “నిజాయితీ”, “స్పష్టతతో నేలమీదే ఉండటం” అనే లక్షణాలు ఎంత అవసరమో రెండే రెండు అద్భుతపదచిత్రాలలో పట్టిచూపుతాడు ఆశిష్ ఠాకుర్ ఈ కవితలో.. విశ్వం కన్నా పెద్దదైన చిన్న కవిత రెండు పదాల మధ్య దూరం ఓ లక్ష సంవత్సరాల కన్న ఎక్కువ ఉండొచ్చు కానీ గుండెకు గొంతుకు మధ్య ఉండే దూరం కన్నా తక్కువ ఉండాలి ఒక వాక్యం పొడుగులో సముద్రాలు ఇమిడిపోవచ్చు కానీ దాని లోతు మాత్రం పచ్చని గడ్డిపోచ ఎత్తుకన్నా తక్కువుండాలి. ..... A short poem bigger than the universe by Ashish Thakur. తాత్వికత కవిత్వానికి కొత్త అందాలు తెస్తుంది. కొత్తలోతుల్ని తెచ్చిపెడుతుంది. కొత్త అర్ధాల్ని ఇస్తుంది. కానీ ఇదంతా తేటగా అందుతూ ఉండాలి. చదువరికి అర్ధంకానంత అస్పష్టత కవితలోకి చొరబడకూడదు. అందుకు ఒక మార్గం మూర్తపదచిత్రాలను ఎంచుకోవటం. మూర్తపదచిత్రాలతో ఎంతటి అమూర్తభావననైనా కళాత్మకంగా చెప్పటానికి వీలవుతుంది. ఈ క్రింది కవిత ఆ టెక్నిక్ కు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. గదిమూలలు ఖాళీగా ఉంచాలి ఎందుకంటే ఒక గోడ మరోక గోడకు ముద్దులెలా పంపిస్తుందో చూడొచ్చు వాటి అన్యోన్య ప్రేమ వల్లే మన తలలమీద ఇంటి పైకప్పులు నిలిచి ఉన్నాయి. ఖాళీగా ఉంచిన గది మూలలో సాలీడు గూడు కట్టుకోవటానికి వీలవుతుంది మనమందరం ఒకరితో ఒకరం కలపబడి ఉన్నామన్న విషయం ఆ సాలె గూడు గుర్తు చేస్తూంటుంది. గాయపడ్డ ఆశలకు మూలలే ఆశ్రయమిస్తాయి వాళ్ళంటారూ మన హృదయాలలో కూడా మూలల్ని ఖాళీగా ఉంచమని ఎందుకంటే ప్రపంచాన్ని జయించగలిగే ప్రేమకు కూడా ఎదగటానికి కాస్త చోటు కావాలి మొదట్లో ... Corners should be kept empty – by Ashish Thakur ఆశిష్ ఠాకుర్ కవిత్వం గురించి మాట్లాడుతూ, “వైద్యం, వ్యాపారం, ఇంజనీరింగ్ వంటి గొప్ప విద్యలు ప్రాణాల్ని నిలపటానికి అవసరం అయినప్పటికీ, మనం బ్రతికేది మాత్రం కవిత్వం, సౌందర్యం, ప్రేమ, కాల్పనికతల కోసమే” అంటాడు. గొప్ప స్వాప్నికుడు మాత్రమే అనగలిగే మాటలు. అంతే కాదు ఇతని కవిత్వంలో ఈ తత్వం ఒక అంతర్జలలా ప్రవహిస్తూంటుంది. చక్కని అభివ్యక్తి, అపూర్వ కల్పనా చాతుర్యము, ఉత్కృష్టమైన ఇంటిలిజెంట్ ప్లే ఇతని కవిత్వాన్ని మహిమాన్వితం చేస్తాయి, Top Class Poetry గా నిలుపుతాయి. బొల్లోజు బాబా పి.ఎస్. ఇంతగొప్ప కవిత్వం వ్రాస్తున్న శ్రీ ఆశిష్ కుమార్ ఫొటో కానీ, అతని గురించిన సమాచారం కానీ అంతర్జాలంలో ఎంతవెతికినా లభించలేదు. (You may correct me if I am wrong)

Tuesday, May 3, 2016

గాథాసప్తశతి - అనువాదం

ఇదివరలో నేను చేసిన గాథాసప్తశతి అనువాదాలు అన్నీ ఇ.బుక్ రూపంలో ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. 
భవదీయుడు 
బొల్లోజు బాబా


Tuesday, April 26, 2016

రూమీ వాక్యాలు


ఈ ప్రాతఃకాల గాలులు ఏవో రహస్యాలు నీతో చెపుతాయట, తిరిగి నిద్రమత్తులోకి జారిపోకు -- రూమీ
నీ చేతిలో కలం, నా హృదయం. సంతోషంగానో, విషాదంగానో నన్నెలా లిఖిస్తావో నీ ఇష్టం – రూమీ
ఈ ప్రపంచంలో ప్రేమను అన్వేషిస్తూ అలసిపోయాను. చివరకు ప్రేమ లోయలో లొంగిపోయి స్వేచ్ఛనొందాను – రూమీ
ఒక దివ్వె గా మారు లేక పడవ లేదూ ఒక నిచ్చెన. ఎవరో ఒకరి ఆత్మ స్వస్థపడటానికి సహాయపడు. నీ ఇంటినుండి ఒక గొర్రెలకాపరిలా బయటపడు -- రూమీ
కలయిక, విడిపోవటాల గురించి చాలా చర్చే జరుగుతున్నది. కానీ, ఏనాడూ వేరుగా లేనిది తిరిగి ఎలా కలవగలదూ? -- రూమీ
బొల్లోజు బాబా
(మరిన్ని కొరకు "రూమీ వాక్యాలు" గ్రూపులో)

Monday, April 25, 2016

రెండు నాల్కల పద్యం


ఆధునిక ప్రపంచానికి
నువ్వెవరో అనవసరం
నువ్వేం మాట్లాడుతున్నావు’ అనేదే
ముఖ్యం
జేజేలు కొడితే మెచ్చుకోళ్లు
డౌన్ డౌన్ అంటే ఇక్కట్లు

నువ్వు కేవలం ఒక సంఖ్యవు అంతే!

*******

ఆధునిక ప్రపంచానికి
నువ్వేం మాట్లాడుతున్నావో అనవసరం
నువ్వెవరో తెలిసితీరాలి
కులం మతం ప్రాంతం తోకలతో

నువ్వు ఉత్త విభజన రేఖవు అంతే!


బొల్లోజు బాబా

Friday, April 22, 2016

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

సారంగలో మీనా కందసామి వ్రాసిన ఒక కవితానువాదం

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.
కవిత ఈ లింకులో చదువుకొనగలరు

http://magazine.saarangabooks.com/2016/04/21/రేపు-నిన్ను-ఎవరో-అరెష్టు/



బొల్లోజు బాబా

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.

ప్రముఖ కవయిత్రి,  మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం. అదీ ఈ కవితకు నేపథ్యం.

ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది.  ఆ ‘నువ్వు’  లో ‘నేను’  లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే. చివర్లో  నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.

*******

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు.  నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు.  పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పిటిషన్ పై  వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ చిట్టితల్లి UAPA  అంటే ఏమిటో తెలుసుకొంటుంది.  నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి,  లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి.  ఎవరూ మాట్లాడరు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు.  ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నిన్ను హెచ్చరిస్తారు.  నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు-  కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు.  నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు.  మాట్లాడకు.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది.  మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు

రేపు  ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు.  నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు.  ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.

నిశ్శబ్దమా వర్ధిల్లు!

మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)     – తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Monday, April 18, 2016

రూమీ వాక్యాలు

రూమీ వాక్యాలు

నీ హృదయానికి త్రోవ తెలుసు.  ఆ దిశలో పరిగెత్తు  – రూమీ

రోజా పూవు రాలి, శకలాలై, సుగంధమై విస్తరిస్తుంది.  నీవుకూడా ప్రతీ ఇంటికి కిటికీగా మారతావు.  ప్రతీ మైదానంలో ఓ రోజావనం గా మొలకెత్తుతావు. – రూమీ

రాపిడులకే చికాకు పడుతుంటే, నీకు మెఱుగు ఎలా పెట్టేదీ?  – రూమీ

చివరకు మిగిలే సౌందర్యం, హృదయసౌందర్యం మాత్రమే – రూమీ

నీ హృదయం నుంచి నాకు ఒక దారి ఉంది  – రూమీ

ప్రేమికుల ఇళ్ళలో  సంగీతం ఎన్నడూ ఆగిపోదు
గోడలు పాటలతో, నేల నృత్యాలతో చేయబడి ఉంటాయి  – రూమీ

గాయం ద్వారా కాంతి నీలోకి ప్రవేశిస్తుంది   – రూమీ

నన్ను నీలో చూడలేకపోతే నన్నెప్పటికీ చూడలేవు, ఎందుకంటే ఆదినుంచీ నేను నీలోనే ఉన్నాను  – రూమీ

బొల్లోజు బాబా
(మరిన్ని "రూమీ వాక్యాలు" గ్రూపులో")
https://www.facebook.com/groups/1286654614695032/

Friday, April 15, 2016

ఆ తరువాతేం జరిగిందంటే.....

తెల్లని కాంతులీనే కొంగొకటి ఓ ఊరి చెరువుగట్టుపై వాలింది గొప్ప తేజస్సుతో, రాజసంతో ప్రకాశిస్తోన్న దాని చుట్టూ ఊరి కొంగలు చేరాయి. 'ఎక్కడనుంచి వచ్చావు నీవు?' 'హిమాలయాలలోని మానససరోవరం నుంచి' 'మీ ఊరి విశేషాలు చెప్పు' 'సమీపాన రజతకాంతుల కైలాసశిఖరం పవిత్ర జలాలతో నిండిన సరోవరం దేవతలు స్నానించే నెలవు ఒడ్డున కొలువుదీరిన కల్పవృక్షం దివ్యకొలనునిండా స్వర్ణ పద్మాలు, మంచి ముత్యాలు' 'మరి నత్తలు... నత్తలుంటాయా మీ ఊరి చెరువులో' 'నత్తలు అంటే?' 'నత్తలంటే తెలియదా.... హవ్వ...' అంటూ పకపకా నవ్వుకొంటూ ఎగిరిపోయాయి ఊరికొంగలు కొన్నాళ్లకు అమృతజలాలు లభించక నత్తల్నెలా పగలగొట్టుకొని తినాలో తెలియక మానససరోవరపు కొంగ కృశించి కృశించి ఆ చెరువు గట్టునే చచ్చిపోయింది. బొల్లోజు బాబా

Wednesday, April 13, 2016

"మహర్షి అంబేద్కర్" - శ్రీ గుర్రం ధర్మోజీ గారి పుస్తక పరిచయం

డా. బి.ఆర్.అంబేద్కర్ గారి 125 వ జయంతి సందర్భంగా ....
భారతదేశపు రాజకీయ చిత్రాన్ని, సామాజిక వ్యవస్థను ఒక జ్ఞాన సూర్యునిలా ప్రకాశింపచేసిన అజరామరుడు, ప్రాతఃస్మరణీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్. అలాంటి మహానుభావుని జీవితచరిత్రను "మహర్షి అంబేద్కర్" అనే పేరుతో గేయకావ్యాన్ని వెలువరించారు ప్రముఖ పద్యకవి శ్రీ గుర్రం ధర్మోజీ గారు.
శ్రీ గుర్రం ధర్మోజీ సంస్కృతాంధ్ర భాషలలో అనేక రచనలు చేసిన ప్రముఖ పద్యకవి. తెలుగులో అనేక ఉదాహరణ కావ్యాలు (ప్రత్యేకమైన చందోరీతి) రచించిన పండితుడు. "మహర్షి అంబేద్కర్" కావ్యంలో అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన 275 పద్యాలు ఉన్నాయి. ఇవి చక్కని నడకతో, మాత్రా చందస్సులో ఉంటూ అంబేద్కర్ మహాశయుని జీవితంలోని వివిధ అంశాలను గొప్పగా దృశ్యమానం చేస్తాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితచరిత్రను డా. బోయి భీమన్న, శ్రీ దాసి బసవయ్య, మొదలగు మహాత్తమ పండితులు మనకు వచనంలో అందించారు. ( శ్రీ గుర్రం ధర్మోజీ గారు కూడా ఇదివరలో సంస్కృత శ్లోకాలలో అంబేద్కర్ సుప్రభాతం రచించారు).
"మహర్షి అంబేద్కర్" రచన పాడటానికి లయబద్దంగా, సరళంగా గేయరూపంలో ఉంటుంది. గేయాల్లో కనిపించే చక్కని పదపొహళింపు, లయ, సందర్భోచితంగా పరిమళించే కవిత్వపు సుగంధాలు చకితుల్ని చేస్తాయి. పఠితులను ఆలోచింపచేసి చైతన్య పరుస్తాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ జననాన్ని చిన్న చిన్న పదాలతో వర్ణించే పద్యాలు ఇవి. వీటిలో అంబేద్కర్ ను భారతదేశ జ్ఞాన తిలకంగా, ఒక ఉదయించే సూర్యునిగా అభివర్ణించటం వారు జీవితపర్యంతం నెరపిన సేవకు, తగిన స్థానం కల్పించటంగా అర్ధం చేసుకోవాలి. చిక్కని చీకట్లు చీల్చటం అన్నప్రయోగం భావస్ఫోరకం.
విశాల భారతదేశపు
లలాట ఫలకస్థలాన
చలిత ప్రభాకలితము
జ్వలిత జ్ఞానతిలకము
బానిసత్వ బ్రతుకులందు
చిక్కని చీకట్లు చీల్చ
మహర్లందు మహర్షిగా
అంబేద్కర్ ఉదయించెను.
స్కూల్లో లెక్కల మాస్టారు ఇచ్చిన ఒక లెక్కకు విద్యార్ధులు జవాబు చెప్పలేనప్పుడు, తరగతి గది బయట ఉన్న అంబేద్కర్ దానికి సమాధానం ఇవ్వటానికి ముందుకొచ్చిన సందర్భంలో ధర్మోజీ గారు చెప్పిన ఈ పద్యం లోని పదాల నడక, పోతన 'అడిగెదనని కడువిడుజను' ... పద్యానికేమీ తీసిపోదు.
ఉత్త 'రా'కుమారులట్టులవారలు
ఉత్తరమీయకతత్తరపాటున
బిత్తరపోవుచునిస్సహాయులై
నిరుత్తరులౌచునిలుచుంటే (ఇది గేయ పద్యం, చందో బద్దం కాదు గమనించగలరు)
ఆతను అంటరానివాడు లోనికెట్లా వచ్చెదడని తోటి విద్యార్ధులు అభ్యంతరం పెట్టగా, బాల అంబేద్కర్ మనసులో చెలరేగిన ఆలోచనలు, తగిలిన గాయం ఎలా ఓ గేయంగా మారిందో చూడండి

నేనే? పాపం చేశాననుచు
చిన్నమనస్సునెన్నో ప్రశ్నలు
మెదడును తొలిచే పదునగుబాకులు
నెమ్మనమున ఉమ్మెత్తలగుత్తులు.
మొత్తం పద్యం బరువు అంతా పదునగుబాకులు, (తరువాతకాలంలో జాషువాగారిని గుచ్చిన బాకులే), ఉమ్మెత్తలగుత్తులు అన్న పదాల వద్ద ఉంది. ఆ బాకులు శరీరానికి తగిలినవి కాదు, మెదడుకి తగిలాయట. మనసున ఉమ్మెత్తలగుత్తులు మొలచాయట. ఎంత గొప్ప సందర్భోచిత ప్రయోగాలివి.
ఈ రోజు అసంఖ్యాక దళిత, బహుజన యువత అంబేద్కరిజం తమకు ఆదర్శమని ప్రకటించుకొంటున్నది. ఎందుకు అంటే కారణం ఈ చిన్ని పద్యంలో కనిపిస్తుంది
తనేకదా దళితులకు తలపు
తనేకదా పోరునకు పిలుపు
తనేకదా ఉద్యమపు గెలుపు
గుండెలలో సదా నిలుపు
దళితబహుజనేతరలకు కూడా అంబేద్కర్ ఆదర్శనీయుడే ఎందుకంటే ఈ రోజు ఆయన ఉపన్యాసాలను చదివితే, అంబేద్కర్ యొక్క రాజనీతిజ్ఞత, నిబద్దత, తర్కం, ముక్కుసూటిదనం, పోరాటపటిమ, సహనశీలత వంటి ఉదాత్త లక్షణాలెన్నో ఆశ్చర్యం కలిగించకమానవు. ఒక్క మనిషి ఇన్ని కోణాల్లో, అంతటి వ్యతిరేకతలో తన వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని ఎలా నిలుపుకోగలిగాడా, చివరివరకూ ఎలా కొనసాగించగలిగాడా అని ప్రస్తుతతరమే కాదు భావితరాలు కూడా చేతులుజోడించి నమస్కరించే మూర్తిమత్వం అంబేద్కర్ ది.
అలాంటి అంబేద్కర్ ఉపన్యాసం పై ధర్మోజీ గారు గొప్ప పద్యాలు వ్రాసారు
ఉపన్యాసమన ఉపన్యాసమా?
అంబేద్కరుని ఉపన్యాసము
అద్భుతమైన విన్యాసము
అచ్చెరువొందే ఉపన్యాసము
మాటలు కావవి మంటలు కాని
మాటలు కావవి ఈటెలు కాని
పదములు కావవి పదును కత్తులు
గాధకాదని బాధయెకాని
డా. బి.ఆర్. అంబేద్కర్ బాల్యము, అమెరికా లండన్ లలో ఆయన విద్యాభ్యాసము, మహద్ ఉదంతం, సైమన్ కమిషన్ ఎదుట వాదనలు, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాతినిధ్యం, బౌద్దమతస్వీకరణ, హిందూకోడ్ తిరస్కరణకు నిరసనగా రాజీనామా, రమాభాయి నిష్క్రమణ, రాజ్యాంగనిర్మాణం, మహాభినిష్క్రమణం వంటి అనేక అంశాలతో "మహర్షి అంబేద్కర్" పుస్తకం ఎంతో ఆసక్తికరంగా ఆ మహాశయుని సంపూర్ణ జీవితాన్ని మనకనుల ముందు నిలుపుతుంది.
డా. బి.ఆర్. అంబేద్కర్ 125 జయంతోత్సవాల సందర్భంగా వెలువరించిన ఈ పుస్తకం ఒక చక్కని స్మరణ, నివాళి.
ప్రతిఒక్కరు చదివి ప్రేరణనొంది, మరో పదిమందికి ఈ పుస్తకాన్ని బహూకరించి వారిలో కూడా ఉత్తేజాన్ని నింపాల్సిన సమయం ఇది.
శ్రీశ్రీ బుద్దమతావలంబసహితం, శ్రీభీమరాయం శుభం
శ్రీశ్రీ జ్ఞానవిధాన భాస్కరసమం శ్రీబాబసాహేబునం
శ్రీ సక్పాలసుతంనమామిసతతంసాంబేద్కరం భాసురం
భీమాబాయిసుతం సదా హితకరం శ్రీబుద్ద ధర్మాశ్రితం ..... అంటూ శ్రీ ధర్మోజి అంబేద్కర్ పై వ్రాసిన సంస్కృత శ్లోకంతో ఈ గేయసంపుటి మొదలై, మరో సంస్కృత మంగళాశాసనంతో ముగుస్తుంది.
*******
రచయిత గురించి
పేరు: గుర్రం ధర్మోజి
రచనలు: శ్రీ అంబేద్కర్ సుప్రభాతం (సంస్కృతం), శ్రీ భీమరాయ ప్రభాత గీతి (గేయం), శ్రీ భీమరాయ ఉదాహరణ కావ్యం, ఆంధ్రకేసరి ఉదాహరణ కావ్యం, క్రీస్తు సుప్రభాతం (సంస్కృతం), అయ్యప్ప సుప్రభాతం (సంస్కృతం), నాన్న (గేయకావ్యం), మహర్షి అంబేద్కర్ (గేయ కావ్యం)
వృత్తి: తెలుగు లెక్చరర్, రాజోలు డిగ్రీ కళాశాల
ఫోన్.నం.9949263267
వెల 10 రూ.
దొరకు చోటు
జి. ధర్మోజీ రావు, తెలుగు లెక్చరర్
ప్రభావతి పబ్లికేషన్స్
రాజోలు, తూ.గో.జిల్లా., ఆంధ్రప్రదేష్.
పి.ఎస్. ఈ పోస్టుకు లైకులు కామెంటులు చేయటం బదులు, వీలయితే ధర్మోజి గారికి ఫోన్ చేసి/మెసేజ్ పెట్టి (9949263267/dharmoji92@gmail.com) అభినందనలు తెలపండి.
తనకాలాన్ని, ఆలోచనల్ని కరిగించి కొన్ని వాక్యాల్ని సృష్టించి సమాజానికి ధారవోసే ఒక కవికి అంతకన్నా మనమేం ఇవ్వగలం!
బొల్లోజు బాబా