Friday, May 15, 2009

పుస్తకం.నెట్ లో రవీంద్రుని క్రిసెంట్ మూన్ పై నా వ్యాసం

Crescent Moon అనే వచన గీతాల సంకలనం 1903 లో రవీంద్రనాధ్ టాగోర్ రచించిన “శిశు అనే బెంగాలీ రచనకు స్వీయ ఇంగ్లీషు అనువాదం.

ఈ గీతాలలో టాగోర్ ఒక అద్భుతమైన చిన్నారి ప్రపంచాన్ని సృష్టించి అనేక పాత్రల్ని అందులో సంచరింపచేస్తాడు. ..............

పూర్తి వ్యాసాన్ని, కొన్ని గీతాల అనువాదాన్ని ఇక్కడ చదవండి.


http://pustakam.net/?p=976


క్రిసెట్ మూన్ లో మొత్తం నలభై గీతాలున్నాయి. వాటి తెలుగు అనువాదం పూర్తయింది. త్వరలోనే వాటిని మీతో పంచుకొంటాను.

భవదీయుడు

బొల్లోజు బాబా


Sunday, May 10, 2009

పోలవరం కవితలు

గోదావరి నది పై ప్రయాణించటం ఒక మంచి అనుభూతి. ఇంతవరకూ బస్సులోనో, రైల్లోనో ప్రయాణిస్తూ గోదావరిని దాటటం తప్ప బోట్ పై పాపికొండల వరకూ వెళ్లటం జరగలేదు. మొన్న సాధ్యపడింది. ఎత్తైన కొండలు, వాటిమధ్య పరవళ్లుతొక్కుతూ ప్రవహించే అఖండ గోదావరి, దారిపొడుగునా ఒడ్డుపై కనిపించే పల్లెటూర్లు, అక్కడక్కడా కనువిందు చేసే పక్షుల నడుమ సాగిన మా ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.

బహుసా ఈ అనుభూతి ఇంత డీప్ గా ఉండటానికి కారణం పోలవరం ప్రోజెక్టు కావొచ్చు. ఎందుకంటే దాని నిర్మాణం పూర్తయ్యే సరికి సుమారు 450 గ్రామాలు నీటమునిగి, ఇప్పుడు కనిపిస్తున్న పాపికొండల అందాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.

ఆ సందర్భంగా నాలో కలిగిన ఆలోచనల శకలాలను ఇలా మీతో పంచుకోవాలనిపించి........

బోటు ఎక్కగానే నది నీటిని చూస్తున్నప్పుడు, రాజమండ్రిలో పుట్టి, గతించిన మా పూర్వీకులు జ్ఞాపకం వచ్చారు. భద్రాచలంలో ఆలయ పునర్నిర్మాణంలో పన్నెండేళ్ల పాటు శిల్పిగా పనిచేసిన మా తాతగారి రూపం కదలాడింది. ధవళేశ్వరంలో పుట్టిన మా అమ్మమ్మ తలపుల్లోకి వచ్చింది. వీళ్లందరకూ ఈ గోదావరి తెలుసు/గోదావరికి వీళ్లందరూ తెలుసు అనిపించింది.
అలా ఎన్ని కోట్ల జీవితాలతో ఈ గోదావరి పెనవేసుకుపోయి ఉంటుందో కదా అన్ ఊహకు .......

ఆమెను తాకగానే,
ఓ నీటి బిందువులోంచి
నా ప్రవర వినిపించింది.
ఇక్కడి ప్రజల గుండెల్లో
గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో!

*********

నదిపై లారీ టైర్లలో గాలినింపి దానిపై ఒక చెక్కవేసుకొని కూర్చొని చేపలు పడుతున్న జాలరులను చూసి ముచ్చటేసింది. చిన్నప్పుడు మా వూరి చర్చి ఫాదరు జేబునిండా చాకలేట్ లు వేసుకొని, స్కూలు నించి వచ్చే మాకు పంచిపెట్టేవారు. మేము కూడా స్కూలు అవ్వగానే బిళ్లలకోసం చర్చివీధి గుండా ఇళ్లకు చేరేవాళ్లం. నదినీ, జాలర్లను చూసినపుడు ఎందుకో నది చాక్లెట్లిచ్చే చర్చి ఫాదరులాగా కనిపించింది.

పిల్లలకు చాక్లెట్లు
పంచిపెట్టే చర్చి ఫాదర్ లా
జాలర్లకు చేపలు
పంచిపెడుతోంది, నది.
********

పాపికొండల మధ్య ఒక చోట గోదావరి దాదాపు తొంభై డిగ్రీల టర్న్ తీసుకొంటుంది. దూరంనుంచి చూస్తుంటే నదికి అడ్డంగా ఓ పెద్ద కొండ ఉన్నట్టు అనిపిస్తుంది. నది అక్కడతో అంతం అయినట్లు అనిపిస్తుంది. దానినే చిన్న చిన్న మాటలలో ఇలా.

నదికి అడ్డంగా పెద్ద కొండ.
ప్రవాహం ఆగలేదు
మలుపు తీసుకొంది.

ఇక్కడ నదీ ప్రవాహం జీవితం కావొచ్చు. అడ్డంకుల వద్ద జీవితం ఆగిపోదుగా. మలుపు తీసుకోవటమూ ఒక వ్యూహమే. అలా మలుపు తీసుకొన్నచోట గోదావరి లోతు వంద మీటర్ల పైన ఉంటుందట. మన జీవన మార్గాన్ని మళ్లించే ఏ అనుభవమైనా ఆ మాత్రం లోతుగానే ఉంటుంది.
**********

పర్యావరణ విచ్చిన్నం వలన వర్షాలు పడకపోవటం, ఎక్కడికక్కడ డాములు కట్టటమూ వంటి కారణాల వల్ల నదుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పరిణామం.

తమిళ కవి వైరముత్తు వ్రాసిన ఒక అద్బుతమైన కవితలో తన ఊరి నది గురించి వర్ణిస్తూ --- 1967 లో పాలనురుగులాంటి పౌర్ణమి రాత్రుల్లో వెన్నెల కరిగించుకొని తెల్లగా ప్రవహించిందని, 1977 లో కాల ప్రవాహంలో కాలువలా మారిందని, 1987 లో జలదానం కోల్పోవటంతో ఇసుక దానం చేస్తున్నదనీ, 1997 ఎక్కడకు మాయమయ్యావో చెప్పవా నదీ --- అంటూ ఆర్తిగా ప్రశ్నిస్తారు.

గోదావరికి కూడా నీటి కరువు వచ్చి (ప్రస్తుత ఎండాకాలం కాదు ప్రధాన కారణం) అక్కడక్కడా నదీ గర్భం బయట పడి వికృతంగా కనిపించటం ఒక విషాద దృశ్యం. దాని పదచిత్రం ఇలా....

నీరులేక బయటపడ్డ నదీగర్భం.
రాచపుండు గుంతల్లోంచి
కనిపించే వెన్నెముకలా ఉంది.
**********


ఈ నదిపై డామ్ నిర్మాణం పూర్తయితే ఇలా ప్రవహించే ఈ అఖండ గోదావరి జలాలు రిజర్వాయిర్ లో మురిగిపోవాల్సిఉంటుందేమో. అవసరాలకు తగ్గట్టుగా వేసిన కూడికలు తీసివేతల ప్రకారం ప్రవహించవలసి ఉంటుంది. ఇప్పటి స్వేచ్ఛ, విశృంఖలత్వం ఉండదు. అలాంటి పరిస్థితి ఊహకు వచ్చి, ఇలా

డామ్ సంకెళ్లు
వేయించుకోబోతున్న
ఈ నదీ ప్రవాహాన్ని
చూస్తూంటే జాలేస్తుంది.




ఇంకా మరికొన్ని

సముద్రానికి దారెటని
అడిగిన వాన చినుకుకు
దారి చూపుతోంది, నది.
******

బరువైన దినాల మధ్య
ప్రవహించే నీ జ్ఞాపకాల్లా
చుట్టూ కొండల మధ్య
అఖండ గోదావరి.
*******

ఒక్క క్షణం ఆగానో లేదో
నది నన్ను దాటుకొని
నవ్వుకొంటూ వెళ్లిపోయింది.
*********


ప్రస్తుతానికి ఇంతే.
పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో ఏర్పడే వాక్యూం గురించి వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను.
అది కూడా త్వరలో.......

బొల్లోజు బాబా

పోలవరం కవితలు

1.
సముద్రానికి దారెటు అని
అడిగిన వాన చినుకుకు
దారి చూపుతోంది, నది.


2.
పిల్లలకు చాక్లెట్లు
పంచిపెట్టే చర్చి ఫాదర్ లా
జాలర్లకు చేపలు
పంచిపెడుతోంది నది.


3.
ఇక్కడి ప్రజల గుండెల్లో
గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో?
ఆమెను తాకగానే,
ఓ నీటి బిందువులోంచి
నా ప్రవర వినిపించింది.


4.
నీరులేక బయటపడ్డ నదీగర్భం.
రాచపుండు గుంతల్లోంచి
కనిపించే వెన్నెముకలా ఉంది

5.
నదికి అడ్డంగా పెద్ద కొండ.
ప్రవాహం ఆగలేదు
మలుపు తీసుకొంది.


6.
బరువైన దినాల మధ్య
ప్రవహించే నీ జ్ఞాపకాల్లా
చుట్టూ కొండల మధ్య
అఖండ గోదావరి.



7.
డామ్ సంకెళ్లు వేయించుకోబోతున్న
ఈ నదీ ప్రవాహాన్ని చూస్తూంటే
జాలేస్తుంది.


8.
ఒక్క క్షణం ఆగానో లేదో
నది నన్ను దాటుకొని
నవ్వుకొంటూ వెళ్లిపోయింది.

Sunday, May 3, 2009

జీవనమాధుర్యం


చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉంటాయి.

కెరటాలు ఒకదానివెనుక ఒకటి
పరుగులేడుతూనే ఉన్నాయి.
నెలనెలా వెన్నెల కుబుసం
ఆకాశం నుండి రాలిపడుతూనేఉంది.
వర్షాకాలంనుంచి తీసుకొన్న పగ్గాల్ని
వేసవికిచ్చేసి సాగిపోతుంది శీతాకాలం.

చేయాల్సిన పనులలా
పేరుకుపోతూనే ఉంటాయి.

కొన్నిపనులు
మరుపులోయల్లోకి జారినట్లే జారి
ఫీనిక్స్ పక్షుల్లా పైకి లేస్తున్నాయ్.

రేపు, వచ్చేఏడాది, ఎప్పటికైనా - అంటూ
చేయాల్సిన పనులు
భవిష్యత్తునిండా
చిక్కుడుపాదులా
అల్లుకొని బిగుసుకొన్నాయి.
జీవితాన్ని అడ్డంగా, నిలువుగా
అడ్డదిడ్డంగా పరుగులెట్టిస్తూన్నాయి.


రెండుకాళ్లపై నించొని
ఆకులనందుకో
యత్నించే మేకపిల్లలా
హృదయం శ్రమిస్తూనే ఉంది.

అయినా సరే
చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉన్నాయి.



బొల్లోజు బాబా

Saturday, May 2, 2009

శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా.......



అక్షరాలనిండా నమ్మకాన్ని
జనుల అగాధ గాధల్నీ నింపిన కవీ
నీవు లోహ స్వరంతో చేసిన
జయగీతాలాపన ఇప్పటికీ
అమృతవర్షిణియే.

పాదముద్రలూ, పనిముట్లూ
రక్తపుచుక్కా, రొట్టెముక్కా,
గద్దరెక్కా, చమట చుక్కా
మానవత్వం, కరుణలతో
జలజలలాడిన నీ కవిత్వం
మరో వందేళ్లయినా
నిత్యనూతనమే.

విరహ సుఖాలు, జ్ఞాపకాల శోకాలూ
ప్రణయవేదనలు, సానుభూతి ప్రవచనాలూ
లేకుండా నీవు చేసిన కొత్త టానిక్
జీవనయానపు జాడీలో ఊరే కొద్దీ
దాని విలువ పెరుగుతూనే ఉంది.

ఉదయాస్తమయాలను పొదువుకొన్న
నీ కవిత్వం కాలమున్నంత కాలమూ
జనహృదయాల మధ్య
ప్రవహిస్తూనే ఉంటుంది.

చుట్టూ దగా ఉందని హెచ్చరించి
ప్రజకు ముందూవెనుకా కవిత్వాన్ని నిలిపిన
కవీ, రవీ, నీకివే మా జోతలు.


బొల్లోజు బాబా

Friday, April 24, 2009

ముళ్ల గాయాలు

ఆకుల వలనుంచి
తప్పించుకొన్న కాంతి
చేతికిచిక్కని నీడల పొడల్ని
నేలపై చిత్రిస్తూంది.
అనంత జీవనానుభూతుల మధ్య
దొరక్కుండా ఆడించే
ఒకటో రెండో స్వప్నాల్లా.

నువ్వైనా నేనైనా
గుప్పెడు స్వప్నాలమే!
లేకుంటే పిడికెడు జ్ఞాపకాలము.
తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం


ఒంటరితనాన్ని గుర్తుచేసే
రాత్రి మళ్లా వచ్చేసింది.


పగటి కన్నీటి చారికల్ని
నిదుర వాన కడిగేసింది.

కనులు తెరచి సూర్యోదయాన్ని
నూత్న శిశువులా ఆహ్వానిద్దాం.

బొల్లోజు బాబా

Saturday, April 18, 2009

ఫ్రాగ్మెంట్స్ 3

1.
ఇక ఇప్పుడు
సంభాషణ అంటే
సెల్ పోను డిస్ప్లేలో
నంబరుచూసుకొని
టాక్ బటను నొక్కడమే!

నాగరికతా
నరకాన్ని ప్రేమిస్తాను
కొలిమిలోకి ఒంటరిగా సాగనీ.
******


2.

రాత్రినుంచి వానచినుకులు
మంత్రాల్ని జపిస్తూ,
ఆకులతో వల్లె వేయిస్తూన్నాయి.

వానచినుకుల
చుంబనాలతో అలసిన
తడితడి పూలపెదవులపై
వేకువ వెండివెలుగై పరచుకుంది.

*****


3
నీ నిష్క్రమణ
తరువాత రోజులన్నీ
ఒకేలా ఉన్నాయి.

మరోసారి
ఏడవటం తప్ప
మరేం చేయగలను చిన్నమ్మా!

*****


4
అలంకరణ అద్దం
ఆమె అందాన్నంతా
తిరిగిచ్చేసింది.


బొల్లోజు బాబా

Monday, April 13, 2009

ఏమంటావూ?

సోక్రటిస్ తాతా!
చావు, బతుకు లలో ఏది ఉత్తమ మార్గమో?
అంటూ గొప్ప సందేహాన్ని
మా మొహాలపై చల్లి పోయావు.
ఆ ప్రశ్నకు జవాబింకా దొరక లేదు.

కాల మౌన గిలిటిన్ అతిసున్నితంగా
తనపని చేసుకుపోతోంది తప్ప
ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు.
ఏ ఒక్క ఆత్మా తిరిగొచ్చి
"ఇదీ సంగతి" అని చెప్పిన పాపానా పోలేదు.

మృత్యు పాత్రిక ఒంపులలో జీవితం
సుబ్బరంగా ఇమిడిపోతూనే ఉంది.

కొత్త అనుభవాలను, ఆలోచనలనూ
యాచించే బిక్ష పాత్ర
రోజూ ఉదయిస్తూనే ఉంది.

స్వప్నాల హంసలు ఖాళీ గాలిలోకి
అలా అదృశ్యమౌతూనే ఉన్నాయి.

తాతా
కొంపతీసి అంతా మిథ్యే నంటావా?
అన్నీ ఇక్కడే నంటావా?

బొల్లోజు బాబా




Wednesday, April 8, 2009

ఆవకాయ.కాం లో నా ఇంటర్వ్యూ

అంతర్జాల తెలుగు సాహిత్యరంగంలో ఆవకాయ.కాం యొక్క పాత్ర అందరికీ సుపరిచితమే.
ఉత్తమమైన ప్రమాణాలు కలిగిన సాహిత్యాన్ని అందించటంలో ఈ వెబ్ పత్రిక ప్రముఖ పాత్రవహిస్తున్నది. దీనికి ఉత్తమాభిరుచిగల పాఠకులు, నిశిత సద్విమర్శలు చేయగలిగిన విమర్శకులు ఉన్నారు. ఈ పత్రికలో కామెంటాలంటే ముందుగా రిజిస్టరు చేసుకోవటం తప్పని సరి.

ఆ పత్రిక ఎడిటర్ గారికి నాకు జరిగిన ఆన్ లైన్ ఇంటర్వ్యూ ను ఇక్కడ చదవండి.

http://www.scribd.com/doc/14064115/Avakaaya-Interview-With-Sri-Bolloju-Baba




భవదీయుడు

బొల్లోజు బాబా

Sunday, April 5, 2009

పాబ్లో నెరుడా "ONLY DEATH" తెలుగులో......


పాబ్లో నెరుడా (1904-1973) చిలీ దేశానికి చెందిన కవి. ఇరవయ్యవ శతాబ్ధపు సాహిత్యాన్ని ప్రకాశింపచేసిన ప్రముఖ కవిగా నెరుడా సుప్రసిద్దుడు. ఈతని సాహిత్యకృషికి, 1971 లో నోబుల్ ప్రైజు ఇవ్వటం జరిగింది.
నెరుడా కవిత్వం అద్బుతమైన మిస్టిక్ నెస్ తో గొప్ప ప్రతీకలతో నిండిఉంటుంది. కొన్ని కవితలు అధివాస్తవిక ధోరణులతో ఉంటాయి. ఇతడు సమకాలీనులచే ఇరవయ్యవశతాబ్ధపు ఉత్తమ కవిగా" కీర్తింపబడ్డాడు. నెరుడా వ్యక్తిగతంగా చిలియన్ కమ్యూనిష్టు పార్టీ తరపున పని చేసాడు. రాజకీయకారణాల వల్ల కొంతకాలం అజ్ఞాతంగా కూడా జీవించవలసివస్తుంది. ఈతని కవిత్వంలో కమ్యూనిష్టు పోకడలు పెద్దగా ఉండవు. నెరుడా కవిత్వంలో కరుణ, మానవత్వం తొంగిచూస్తుంటాయి. తన మెటఫర్ల్ లతో నెరుడా చదువరిని మరోలోకంలోకి తీసుకుపోతాడు. అతని పద్యం ఒక కలలా పాఠకుని వెంటాడేలా చేస్తాడు.

నెరుడా కవిత్వం అనేక ప్రపంచభాషలలోకి అనువదింపబడింది.
నెరుడా వ్రాసిన Only Death అనే పద్యానికి నేచేసిన అనువాదం ఇది.


మృత్యువు మాత్రమే


మూగ ఎముకలు నిండిన గోరీలతో
ఏకాకి స్మశానాలవిగో.

సొరంగం గుండా హృదయ యానం
నీడలు.... నీడలు.... నీడలు.
మనలోకే కూలిపోయే ఓడలా
మనం చనిపోతూంటాం.
హృదయంలోకే మునిగిపోయినట్లుగా
చర్మంనుండి ఆత్మదాకా
అనంతంగా జారిపోయినట్లుగా
మనం చనిపోతూంటాం.

గవ్వలు పేరుకొన్న శిలలపాదాలవిగో
అక్కడంతా మృతదేహాలు.

స్వచ్చమైన శబ్ధంలా ఎముకలలో మృత్యువుంది.
ఏ కుక్కా లేకుండా వినిపించే మొరుగులా
గంటలనుంచో, గోరీలనుంచో జనిస్తో, తేమలో ఉబ్బుతో
ఒక ఏడ్పులానో లేక వానలానో మృత్యువు శబ్దిస్తోంది.

ఒంటరిగా ఒక్కోసారి నేను చూస్తుంటాను
తెరచాప నీడలో శవపేటికల్ని.
మృతుల, మృత జడల జవ్వనుల
తెల్లని దేవదూతల్లాంటి వంటవాళ్ల,
గుమస్తాలను పెండ్లాడిన శోక యవ్వనిల
లంగరు బరువును మోస్తోన్న
శవపేటికలను చూస్తూంటాను.

నిలువెత్తు మృత్యునదిలో
ఎర్రగా ఒరిసిపోయిన ఆ నదిలో
ప్రవాహానికి ఎదురొడ్డుతూ
మృత్యు సంగీతపు అలలతో శ్రుతి కలుపుతూ
మృత్యు మౌన కెరటాల సవ్వడితో జతకలుపుతూ
శవపేటికలు ఎగప్రాకటం
ఒక్కోసారి నేను గమనిస్తూంటాను.

మృత్యువు కనిపించదు, దాని శబ్ధమే నడిపిస్తూంటుంది.
పాదం కనిపించని బూటులా, దేహం అగుపించని సూటులా.
రాతితో కానీ, చేతితో కానీ చేయబడని
గణగణ మనే ఘంటారావం లా మృత్యువు వినిపిస్తుంది.

మృత్యువుకు నోరు లేదు, నాలుక లేదు, గొంతుకా లేదూ,
కానీ, మృత్యు పిలుపు వినిపిస్తూంటుంది.
సందేహం లేదు, నీవు మృత్యు పదఘట్టనలని
దాని దుస్తుల రెపరెపల్నీ, ఒక వృక్షంలా మౌనంగా వినగలవు.

మృత్యువు మాయా తివాచీపై కూర్చొని
నేలను నాకుతూ, మృతులకై వెతుకుతూ
భూమిని చుడుతూ ఉంటుంది.
మాయా తివాచీయే మృత్యువు.
దాని మృత్యు నాలిక మృతులను వెతుకుతూంటుంది.
తివాచీ నేసుకోవటానికి దారాలను వెతుక్కొంటూంది.

నాకు తెలియదు
నాకు కొంచెమే అర్ధమయింది
దృశ్యం అస్పష్టంగానే ఉంది, కానీ
మృత్యు గీతం అనేది తడిచిన నల్లకలువల వర్ణమని
నేను నమ్ముతున్నాను.
అవును
మట్టికి అలవాటు పడిన నల్లకలువ వర్ణమే!
ఎందుకంటే
మృత్యువు యొక్క ముఖం ఆకుపచ్చన.
ఎందుకంటే
నల్లకలువ దళపు పదునైన తడితోనూ
దాని గంభీరవర్ణపు శీతాకాల అసహనంతోనూ సారించే మృత్యువు యొక్క తీక్షణ చూపులు ఆకుపచ్చనే మరి.

మంచాలపై మృత్యువుంది
మెత్తని పరుపులపై, నల్లని దుప్పట్లలోనూ ఉంది.
దుస్తుల మడతలలో మృత్యువు విస్తరించి
అకస్మాత్తుగా పేలుతుంది.
దుప్పట్ల మధ్య నల్లటి శబ్ధం వ్యాపిస్తుంది.
మంచాలు ఓడరేవుకై ప్రయాణం సాగిస్తూంటాయి.

అక్కడ
యుద్దఓడల అధిపతి దుస్తులు ధరించిన
మృత్యువు ఎదురుచూస్తుంటుంది.

బొల్లోజు బాబా



ఆశక్తి ఉన్నట్లయితే అంతర్జాలంలో ఈ క్రింది లింకులలోని నెరుడా కవితల అనువాదాల్ని కూడా చదవండి బాగున్నాయి.

http://prajakala.org/mag/2008/02/pablo_neruda1

http://www.eemaata.com/em/issues/200209/595.html

http://www.pranahita.org/2007/08/nee_navvu/