Thursday, September 4, 2025

నిత్య యవ్వనమే’ సాధు సందేశం!


.
నేను ఒక ఏడాది క్రితం నా ఫేస్ బుక్ వాల్ పై మృత్యువు గురించి రాసిన ఒక కవితకు స్పందిస్తూ సాధు సుబ్రహ్మణ్య శర్మ ఇలా కామెంట్ చేసారు.
 
“As age increases try to become younger. Don't await death. let death take one unawares while fully immersed in executing a huge project , as in a battlefield!-- Sadhu Sarma.” (వయసు పెరిగే కొద్దీ పడుచువారయ్యేందుకు ప్రయత్నించండి. చావుకోసం ఎదురుచూడవద్దు. ఏదో ఒక పెద్దకార్యంలో పూర్తిగా నిమగ్నమై ఉండగా చావు మనకే తెలీకుండా వచ్చి మనల్ని లాక్కెళ్ళిపోవాలి, యుద్ధరంగంలో లాగ- సాధుశర్మ)

సాధుశర్మ పరిపూర్ణ జీవితం ఆస్వాదించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమించారు. తన చుట్టూ ఉన్న పిల్లలను ప్రోత్సహించారు. 90 ఏళ్ళు వయసులో కూడా ఈ ప్రపంచాన్ని మార్చటానికి కొత్తకొత్త తాత్త్వికభూమికల గురించి అన్వేషిస్తూ, తాను కనుగొన్న సత్యాలను ప్రపంచంతో పంచుకొంటూ జీవించారు. పైన ఆయనే చెప్పినట్లు మరణించే సమయంలో కూడా ఏదో పెద్దప్రోజెక్టును ఊహిస్తూ ఉండి ఉంటారు
 
శ్రీ సాధు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సాధు లక్ష్మీనరసింహ శర్మ శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు 6-3-1932న జన్మించారు. వీరి ప్రాధమిక చదువు బళ్ళారిలోను, కాలేజి చదువు అనంతపురం, హైదరాబాద్ లోను జరిగాయి. వీరు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖలో వివిధ హోదాలలో పనిచేసి, చివరకు జెనరల్ మేనేజర్ ఇన్ చార్జిగా 1990, మార్చి 31న పదవీవిరమణ చేసారు. 2025, జూలై 18న 93 ఏళ్ళ వయసులో కాకినాడలోని స్వగృహంలో పరమపదించారు.
శ్రీ సాధు సుబ్రహ్మణ్య శర్మ గొప్ప మేధోసంపన్నులు, వారి జ్ఞానదాహం అపారమైనది. ఒక వ్యక్తి కవిత్వం, చరిత్ర, భాషాసంబంధ పరిశోధన, తత్త్వశాస్త్రం వంటి వివిధ రంగాలలో వారు చేసిన ప్రామాణిక రచనలు అసాధారణమైనవి. ఇది వారి అసామాన్య ప్రతిభ, బహుముఖీన పాండిత్యానికి, అవిశ్రాంత శ్రమకు నిదర్శనం.

వీరి రచనలు

“సాధువాడిమాట-నవసహస్రాబ్ది బాట” అనే మకుటంతో సమకాలీన అంశాలు, నైతిక విలువలపై రాసిన పద్యాలు. కాలవాహిని పేరుతో కవిత్వం సాధుబాల శిక్ష - అక్షరాలు దిద్దనవసరం లేకుండా తెలుగును బోధించేందుకు రచించిన పాఠ్యపుస్తకం.
New Frontiers of Philosophy for an Alternate model of society or the Human Manifesto. ఈ పుస్తకంలో మానవజాతి ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పర్యావరణ సంక్షోభాలను చర్చించారు. ప్రాచీనభారతదేశ తత్త్వసారాన్ని ఆధునిక సమాజానికి అన్వయిస్తూ చేసిన ప్రతిపాదనలు ఇవి. సమకాలీన సమాజాన్ని, మానవజీవనాన్ని పునర్నిర్మించే దిశలో ఒక గొప్ప మేధావి చేసిన ఆలోచనలు ఇవి.

Dialectics of Evolution, Systems Approach and New frontiers of Philosophy అనే పేరుతో 2015 లో రచించారు. 590 పేజీలు. దీనిని Partridge India వారు ముద్రించారు. చరిత్రను ఒక కొత్త తాత్విక దృష్టితో ఎలా చూడాలో ఈ పుస్తకంలో సుబ్రహ్మణ్య శర్మ వివరించారు. మరింత శాంతిమయ భవిష్యత్తు, శ్రేయస్సుతో కూడిన సమాజాన్ని సాధించేందుకు ఒక విన్-విన్ వ్యూహాన్ని దీనిలో ప్రతిపాదించారు. చరిత్రలో సామాన్యమానవుడు కేవలం విధేయతకలిగిన వస్తువుగానే ఉన్నాడని అతను మరింత తెలివైన పాత్రపోషించాలి అని అంటారు.
 
మేటి భారతదేశం - మన చరిత్ర మూలాలను అన్వేషిస్తూ వ్రాసిన విశ్లేషణాత్మక 770 పేజీల గ్రంధం. Fight for peace and struggle for an Ideal society అనే పుస్తకంలో ఆధునిక సమాజం, హింస యుద్ధాలనుండి ఎలా విముక్తి చెంది శాంతివైపు ప్రయనించాలో చర్చించారు.
బంకోలా నవల. సాధు సుబ్రహ్మణ్య శర్మ తెలుగు పాఠకులకు ఎక్కువగా తెలిసింది బంకోలా నవల ద్వారా. బంకోలా అంటే లైట్ హౌస్ అని అర్ధం.
 
అది విదేశీయులు వ్యాపారనిమిత్తమై వచ్చి దేశరాజకీయాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకొంటున్న కాలం. స్వదేశీయులు మూడురకాలుగా విడిపోయారు. ఈ మార్పుని తమకు అనుకూలంగా మలచుకొని బాగుపడాలనుకొన్నవారు. రాజెవ్వడైతే మాత్రం నా కష్టమే కదా నాకు దిక్కు అనుకొని తటస్థంగా ఉండిపోయినవారు. రాబోతున్న ఉపద్రవాన్ని పసిగట్టి సమాజాన్ని అప్రమత్తం చేయటానికి ప్రయత్నించిన ఆలోచనా పరులు మరోపక్క.
 
వీరందరి మధ్యా సంఘర్షణ ఫలితంగా జరిగిన నాటకీయపరిణామాలే బంకోలా నవల.
కథానాయకుడు భైరి, ఓడల యజమాని నరసింహనాయకర్ కొడుకు. భైరి ఆలోచనాపరుడు, ఆంగ్లేయ స్నేహితుల నుంచి ప్రపంచ విజ్ఞానం గ్రహిస్తాడు, బ్రిటిష్ రాజకీయ ఆధిపత్య ఆలోచనలను గుర్తిస్తాడు. యానాం ఫ్రెంచివారి వద్ద గుమస్తాగా పనిచేస్తూ వారి దాష్టీకాలను ఎదిరించి గొడవపడతాడు. మంజరి అనే వేశ్యద్వారా విదేశీయుల దోపిడీని తెలుసుకొని ఢిల్లీ సుల్తానును కలిసి విదేశీయులను నిలువరించమని కోరటానికని ఢిల్లీ వెళతాడు. అక్కడ ఎవరూ ఇతని మాట ఖాతరు చేయకపోవటంతో తిరిగి కోరంగి వచ్చేస్తాడు. మరదలు పరదేశిని పెళ్ళాడి వ్యాపారంలో విజయం సాధిస్తాడు. అయితే బ్రిటిష్ వ్యతిరేక భావాలతో ఉన్నందుకు భైరి కొడుకును బ్రిటిష్ వారు హతమారుస్తారు. చివరకు, 1789 డిసెంబర్ 10న వచ్చిన కోరంగి సునామీలో భైరి, పరదేశి కొట్టుకుపోయి మరణించటంతో నవల ముగుస్తుంది.

ఈ రచనలో సుబ్రహ్మణ్య శర్మ ఆ కాలపు సామాజిక సంఘర్షణను నేపథ్యంగా తీసుకోవటం వల్ల ఇది గొప్ప చారిత్రిక నవలగా రూపుదిద్దుకొంది. తెలుగులో ఈ కాలానికి సంబంధించి సామాన్యుల జీవితాలను ప్రతిబింబించే సాహిత్యం పెద్దగా లేదు. ఆ లోటు ఈ పుస్తకం తీర్చటంతో తెలుగు పాఠకులు దీనిని అపూర్వంగా ఆదరించారు. తెలుగువారు గర్వించదగిన గొప్ప తాత్త్విక రచనలను సుబ్రహ్మణ్య శర్మ చేసారు. వాటిపట్ల తెలుగునాట పెద్దగా చర్చ జరగకపోవటం నిజంగా బాధాకరం.
ఇవే కాక జహిశత్రుల మహాబాహో - మెట్టవేదాంతాన్ని విడనాడి శాస్త్రీయ మార్గం అవలంబించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపే రచన. History of Freedom Struggle. శ్రీసాధు సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రతిపాదించిన "స్వల్ప సంకేతాలతో సకల భాషలను వ్రాసే విశ్వజనీన లిపి" కి సోమనాథ కళాపీఠం వారు "స్వచ్ఛంద భాషా సేవా పురస్కారం" ను 2010 లో ప్రదానం చేసారు. ఈ విశ్వజనీన లిపి లాంటివి ఇంకా అముద్రితాలే.
 
సాధు సుబ్రహ్మణ్య శర్మ సాధు ప్రైవేట్ లైబ్రేరిని స్థాపించి స్కూల్ విద్యార్ధుల కొరకు స్వయంగా నడిపారు. పిల్లలు ఆటలు ఆడుకోవటానికి ఒక ఇల్లును అద్దెకు తీసుకొని అన్ని రకాల ఆటవస్తువులను వారికి అందుబాటులో ఉంచారు. నిత్యయవ్వనంతో జీవించటమే ఆ గొప్ప తత్త్వవేత్త మనకిచ్చిన సందేశం.
 
(ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ప్రచురింపబడింది ఎడిటర్ గారికి, మెహర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

బొల్లోజు బాబా



No comments:

Post a Comment