భారతదేశంలో విద్యావ్యవస్థ వర్ణవ్యవస్థను పటిష్టం చేసేదిగా ఉండేది. మహమ్మదీయ పాలకులు విద్యాభివృద్ధి చేసిన దాఖలాలు కనపడవు. వర్ణవ్యవస్థకు అతీతమైన విద్యావ్యవస్థను భారతదేశంలో నెలకొల్పిన ఖ్యాతి బ్రిటిష్, ఫ్రెంచి పాలకులకు దక్కుతుంది. కారణాలేమైనప్పటికీ గుమస్తాలను తయారుచేయటానికే స్కూళ్ళను నెలకొల్పారు అన్న అపవాదును బ్రిటిష్‌వారు మూటకట్టుకొన్నారు. కానీ ఫ్రెంచి పాలకులు తమ స్థావరాలలో జరిపిన విద్యాసంస్కరణలు గమనిస్తే అటువంటి ఉద్దేశ్యాలు ఉన్నట్లు కనిపించవు. యానాం వంటి మారుమూల ప్రాంత ప్రజలు ఉన్నత విద్యనభ్యసించటానికి పాండిచేరి వెళ్లవలసివచ్చేది. వీరికి ఫ్రెంచి ప్రభుత్వం ప్రత్యేక స్కాలర్‌షిప్పులిచ్చేది. అలా యానాంనుంచి అనేకమంది విద్యార్ధులు పాండిచేరీ వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఉదాహరణకు 1924 లో నల్లం సత్యనారాయణ (పాండిచేరీలోని నల్లం క్లినిక్ అధినేత శ్రీ నల్లం బాబు తండ్రి గారు) అలా పాండిచేరీలో వైద్య విద్యను పొందారు. అలాగే శ్రీదడాల రఫేల్, శ్రీ అబ్దుల్ రజాక్, మలిపెద్ది వీరన్న, తోట నరసింహమూర్తి, వంటి యానాం విద్యార్ధులు ఆ విధంగా స్కాలర్‌షిప్పుల సదుపాయాన్ని వినియోగించుకొన్నారు.
Friday, September 12, 2025
ఫ్రెంచి యానాంలో విద్యావ్యవస్థ
1905 లో యానానికి చెందిన దున్నా వెంకటరత్నంకు పాండిచేరీ వెళ్ళి చదువుకోవటానికి ఏడాదికి 72 రూపాయిలచొప్పున స్కాలర్ షిప్ మంజూరు అయ్యింది. దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి స్కాలర్‌షిప్ పొందటం ఇదే ప్రథమం. అప్పట్లో పాండిచేరీలో ఉన్నత విద్య ముగిసినతరువాత యూనివర్సిటీ చదువు చదవాలనుకొనేవారిని ఫ్రెంచి ప్రభుత్వం స్వంత ఖర్చులతో ఫ్రాన్స్ పంపించేది. ఈవిధంగా ఎంతోమంది పాండిచేరీ, కారైకాల్ ల నుంచి ఫ్రాన్స్ వెళ్ళి పెద్దచదువులు చదువుకొన్నారు.
యానాంనుంచి ఆ విధంగా ఫ్రాన్స్ వెళ్ళి చదువుకొన్న వారిలో శ్రీదున్నా వెంకటరత్నం గారు ప్రముఖులు. వీరు కాంబోడియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేసి రిటైర్ అయినతరువాత యానాంలో స్థిరపడ్డారు.
1. తొలినాటి విద్యారంగం
1787 మే, 31న పాండిచేరీలో మొట్టమొదటి ఫ్రెంచి మిషనరీ స్కూలు స్థాపించబడినా, చాన్నాళ్ళకు కానీ దానిలో తెలుగుభోధన ఆరంభం కాలేదు. 1828 లో పాండిచేరీలో తెలుగును మాతృభాషగా కలిగిన వారి కోసం ఫ్రెంచిప్రభుత్వం పాఠశాల టైమ్‌టేబుల్ లో తెలుగుభాష పీరియడ్‌ను ప్రారంభించారు. 1840 నాటికి దీనిలో 26 మంది తెలుగు నేర్చుకొనే విద్యార్ధులుండేవారు. ఇక యానాం విషయానికి వస్తే, 1848 ఫిబ్రవరి, 17న అప్పటి ఫ్రెంచి గవర్నర్ శ్రీ పుజోల్ యానానికి ‘ఉచిత’ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు ఉత్తర్వులు జారీచేసారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. (రి: జె.బి.పి. మోర్)
ఇక్కడ ఉచిత అనే మాటనుబట్టి అప్పట్లో యానాంలో ప్రైవేటు స్కూళ్ళు ఉండేవని ఊహించుకొనవచ్చును. ఇదే విషయం యానాంలో 1880 ల ప్రాంతంలో విద్యనభ్యసించిన శ్రీ చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి రచించిన ‘కథలు`గాధలు’ అనే పుస్తకం (పేజీ నం: 403) లో కనపడుతుంది.
సనాతన కుటుంబానికి చెందిన శ్రీ చెళ్ళపిల్ల వారు యానాం ప్రభుత్వస్కూలులో మాలమాదిగల సరసన కూర్చోవలసి రావటం ఇష్టంలేక యానాం స్కూలును విడిచి కొంతకాలం నీలపల్లి స్కూలులో చదువు ముగించుకొని, తిరిగి మరలా యానాంలో శ్రీ చక్రవర్తుల బాపయ్య గారిచే నడపే ఓ ప్రెవేటుస్కూలులో చేరారట. అంతేకాక అప్పటి ఫ్రెంచిస్కూలును వర్ణిస్తూ ‘‘ఇక్కడ పిల్లలు జీతమివ్వక్కర లేదు. పయిగా ఎక్కువ తెలివితేటలుంటే ప్రెజెంట్లు కూడా ఇచ్చేవారని’’ చెప్పుకొచ్చారు. దీనినిబట్టి ఫ్రెంచివారు స్కూళ్ళు స్థాపించక మునుపు యానాంలో బ్రాహ్మలచే నడపబడే ప్రెవేటుస్కూళ్ళు ఉండేవని భావించుకోవచ్చు. కానీ వీటిలో లభించే విద్య సమాజంలోని అగ్రవర్ణాలకే దక్కేదనటంలో మాత్రం సందేహపడక్కరలేదు.
2. యానానికి కన్యస్త్రీల సేవలు
యానాం విద్యారంగంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విత్తనాలు నాటటానికి 1849 డిసంబరు, 5 న ర్. st. Joseph of Lyon చెందిన నలుగురు ంఱర్‌వతీం యానాం వచ్చారు. (సెయింట్ జోసెఫ్ ఆఫ్ లియోన్ అనేది ఫ్రాన్స్ లోని లియోన్ అనే ప్రాంతానికి చెందిన ఒక క్రిష్టియన్ ధార్మిక సంస్థ. ఈ సంస్థ 1807 లో ‘మదర్ సెయింట్ ఫాంట్‌బొన్నే’ అనే ఆవిడ ఆధ్వర్యంలో నడిచేది. ఈ సంస్థ మెంబర్లుగా ఉండే సిస్టర్స్/కన్యస్త్రీలు ప్రపంచవ్యాప్తంగా స్కూళ్ళు, ఆసుపత్రులను నడుపుతూ మానవజాతికి మహూెెన్నతమైన సేవలు చేస్తున్నారు ఇప్పటికీ). అలా వచ్చిన వారి చేతిలో కులమతాలకతీతంగా యానాంలోని విద్యార్ధులకు విద్యను భోదించమని ఫ్రెంచిప్రభుత్వం 1849 నవంబరు,10న ఇచ్చిన ఉత్తర్వు మాత్రమే ఉంది. కానీ మనసులో వజ్రతుల్యమైన సేవాదృక్పధం, మానవజాతి పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నాయి. వీరికి యానాం ప్రజలు ఘనస్వాగతం పలికారు.
1850 లో వీరు రెండు స్కూళ్ళు ప్రారంభించారు. ఒకటి ఆడపిల్లల కొరకు మరొకటి చిన్నారి బాలికలు మరియు అనాధుల కొరకు. భారతదేశంలో మొదటి బాలికల స్కూలు 1848 జనవరి, 1 న సావిత్రిభాయి ఫూలే స్థాపించినట్లు చరిత్ర చెపుతుంది. కానీ దాదాపు అదే కాలంలో యానాంలో బాలికల కొరకు స్కూలు స్థాపించబడటం సామాన్యమైన విషయం కాదు.
st. Joseph of Lyon Sisters
1. Sister Saint Claire D’ugine - Superior
2. Sister Saint francois de Desingy
3. Sister Saint Justine de Thairy
4. Sister Marie Placide d’Annecy
వీరే కాక ఇతర సిస్టర్స్ కూడా యానాం విద్యారంగానికి తమసేవలందించారు. వారిలోSister Lucile, Sister Denice ,Sister Marie Theophile, Sister Augustin వంటి వారు ఇక్కడే గతించి పోయారు. (వీరి సమాధులు యానాంలోనే కలవు. చూడుడు ఫొటో)
Sister Casimir (Fillion Melanie) ఈమె ఫ్రాన్స్‌లోని Lyaud అనే ప్రాంతంలో జన్మించింది. 1890 లలో యానాంలో కొంతకాలం టీచర్ గా పనిచేసింది. ఇదే సమయంలో యానాం కోర్టు నోటరీ గా పనిచేసిన M. Casimir కు ఈమె బంధువు కావొచ్చు.
Sister Clotilda (Francoise Dunoyer) 1837 లో Nouglard అనే ప్రాంతంలో జన్మించిన ఈమె కొంతకాలం యానాంలో సేవలందించారు.
Sister Mary Amelia (1858-?) ఈమె 1890 లలో యానాంలో కొంతకాలం టీచర్ గా పనిచేసింది.
Sister Mary Eleonor (Deleaval Susan) ఈమె ఏప్రిల్ 13, 1861 న చదువు పూర్తి కాగానే యానానికి టీచరుగా నియామకం పొందింది.
Sister Rose Alexin 1871లో జన్మించిన ఈమె 1900 లో యానాం టీచర్ గా పని చేసింది.
Sister Ursula (Bossom Eugenie) 1831లో పుట్టిన ఈమె 1851 జూలైలో టీచరుగా పనిచేయటానికి యానాం రావటం జరిగింది.
1850`1854 మధ్య అప్పటి చర్చిఫాదరయిన డ్యూపాంట్ బాలురకోసం ఒక స్కూలు నడిపేవారు. దీనిలో ఫ్రెంచి, తెలుగులను డ్యూపాంటే బోధించేవారు. (బోధించగలిగే స్థాయికి తెలుగును ఒక ఫ్రెంచి దేశస్థుడు నేర్చుకోవటం ఆశక్తికరం).
1866 వచ్చేసరికి యానాంలో మొత్తం 5 స్కూళ్ళు ఉండేవి. వీటిలో మూడు బాలికల కొరకు రెండు బాలుర కొరకు. బాలికల పాఠశాలలను సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ నిర్వహించేవారు. ఈ స్కూళ్ళను స్థానికులు ’కన్యస్త్రీల బడి’ లని పిలుచుకొనేవారు. ఈ మూడు బాలికల స్కూళ్ళలో ఒకటి ఫ్రెంచి, ఫ్రాంకో ఇండియన్ మరియు ఉన్నత వర్గాల పిల్లల కొరకు, రెండవది అన్ని కులాల పిల్లల కొరకు, మూడవది అనాధ బాలికల కొరకు ఉద్దేశింపబడినవి. మొదటి రెండు స్కూళ్ళలో ఫ్రెంచి, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, జాగ్రఫీ, డ్రాయింగు వంటివి బోధనాంశాలుగా ఉండేవి. మూడవ స్కూలులో కుట్లు అల్లికలు నేర్పేవారు.
3. స్థానిక టీచర్ల ప్రవేశం
అబ్బాయిలకొరకు ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలలో ఒకటి ఫ్రెంచిమిషనరీకి చెందిన ఒక బ్రదర్ ఆధ్వర్యంలోను రెండవది ఆనాటి యానాం సమాజంలోని కాపు కులపెద్ద అయిన శ్రీ బెజవాడ చినపేరయ్యచే నడపబడేది. యానాం ప్రభుత్వ స్కూలులో పనిచేసిన మొదటి తెలుగు టీచర్ ఈయనే. ఎందుకంటే అంతవరకూ యానాం స్కూళ్ళలో ఫ్రెంచి దేశస్థులే ఉపాద్యాయులుగా ఉండేవారు. ఆఖరుకు తెలుగుభాషను భోదించాల్సివచ్చినా సరే.
1898 లెక్కల ప్రకారం కేవలం 30 మంది విద్యార్ధినులు మాత్రమే ఉండటం గమనార్హం. దీనికి ప్రధానకారణం 1849 లో యానాం స్కూలు స్థాపించటానికి వచ్చిన నలుగురు సిస్టర్స్ క్రమక్రమంగా గతించటమే కావొచ్చు. వీరిలో చివరగా డెనిస్ (1842`1899) మరణంతో యానాంలో బాలికల విద్యావ్యాప్తికి తీవ్రవిఘాతం ఏర్పడిఉంటుందని పై గణాంకాలను బట్టి భావించవచ్చును. అంతే కాక సాంప్రదాయ హిందూ కుటుంబాలలో స్త్రీవిద్య పట్ల ఉండే చులకన మరియు కన్యస్త్రీల బడి అనగానే తల్లిదండ్రులకు విద్యార్థినులకు కొంత భద్రతాభావం ఉండటం వంటివి ఇతర కారణాలు కావొచ్చు.
వారి తదనంతరం అంతే నమ్మకాన్ని యానాం విద్యార్ధినుల తల్లిదండ్రులలో కలిగించటానికి చాలాకాలం పట్టింది. ఈ విషయంలో 1930 లలో యానాం బాలికల స్కూలు టీచర్లయిన కంతేటి మంగమ్మ, చిక్కం మాతయ్య, పాలెపు వెంకట సుబ్బారావులు ముఖ్యులు. వీరి కృషి వలన 1933 లో విద్యార్ధినుల సంఖ్య 109 కి పెరిగింది. (యానానికి సంబంధించి శ్రీమతి కంతేటి మంగమ్మ మొదటి స్థానిక మహిళా టీచర్ కావొచ్చు)
1873 లో యానాం జమిందారు శ్రీ మన్యం కనకయ్య బాలికల స్కూలు నిర్మాణం కొరకు భారీ నిధులను సమకూర్చారు. కనకాల పేటలో 1880 లో ఒక బాయిస్ స్కూలు నెలకొల్పారు. దీనిలో కొమండూరి/సాతాను జియన్న, వర్ధినీడి అయ్యప్పనాయుడులు టీచర్లుగా పనిచేసారు. ఈ స్కూలు 1902 నుంచి కొంతకాలం మూసివేసి మరలా 1931 లో తిరిగి తెరిచారు. పంపన వీరాస్వామి అప్పట్లో దీనిలో టీచర్ గా పనిచేసారు. కురసాం పేటలో 1892 లో ప్రారంభించిన స్కూలు కొంతకాలం మూతబడి తిరిగి తెరువబడింది.
1908లో అడివిపొలంలో చిక్కం మాతయ్య అనే టీచరు ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు స్కూలు నడిచేది. ఈ స్కూలు దళిత విద్యార్ధుల కొరకు బాగా ఉపయోగపడుతున్నదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందించి దానిని ప్రభుత్వస్కూలుగా మార్చివేసింది. ఈ స్కూలుకు హెడ్‌మాస్టర్లుగా 1932 లో ఎమ్.వి.వి. కొండయ్యనాయుడు, 1937లో గెల్లా శ్రీనివాసులు పనిచేసారు. ఈ స్కూలులో మధ్యాహ్నభోజన పధకం కూడా ఉండేది.
ఆనాటి విద్యాకమిటీలు
యానాంలోని విద్యావ్యవస్థను నడిపించటానికి 7 గురు సభ్యులుకలిగిన ఒక కమిటీ ని ప్రభుత్వం నియమించేది. యానానికి సంబంధించి 1880 లో మొదటిసారిగా ఏర్పడిన విద్యాకమిటీకి పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు బెజవాడ బాపనయ్య లు ప్రారంభ సభ్యులుగా వ్యవహరించారు. ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభదశలో స్కూలు కమిటీకి సమతం వెంకటసుబ్బారాయుడు, గిరితాతయ్య, అబ్దుల్ రెహ్మాన్ , పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు, సమతం కృష్ణయ్య, పుణ్యమూర్తుల నరసింహమూర్తి, గిరి మాధవరావు నాయుడు, శింగంశెట్టి వెంకటరత్నం వంటివారు సభ్యులుగా తమ సేవలందించారు.
4. సెంట్రల్ బాయిస్ స్కూల్ ప్రాముఖ్యత
అప్పట్లో యానాం విద్యావ్యవస్థకు సెంట్రల్ బాయస్ స్కూల్ (జదీూ) కేంద్ర బిందువుగా ఉండేది. (ఈ స్కూలు పునర్నిర్మాణం జరిగినా ఆనాటి ‘గేట్ ఆర్చ్’ ను అలాగే ఉంచటం జరిగింది). యానాంలోని మిగిలిన స్కూళ్ళన్నీ దీనికి అనుబంధ సంస్థలుగా ఉండేవి. ఇక్కడి హెడ్ మాస్టర్ మిగిలిన స్కూళ్ళ పర్యవేక్షణ జరిపేవాడు. 1901 లెక్కల ప్రకారం నలుగురు టీచర్లు 177 మంది విద్యార్ధులతో ఈ స్కూలు నడిచింది. 1911`12 లలో జదీూ కు ణaఙఱశ్‌ీ అనే ఫ్రెంచిదొర హెడ్మాష్టరుగాను, మద్దింశెట్టి బాపన్న, తోట నరసింహ స్వామి, మహేంద్రవాడ సూర్యనారాయణ మూర్తి లు టీచర్లు గాను ఉండేవారు. 1916`17 లలో ణవ జతీబఓ ుష్ట్రశీఎaం సి.బి.ఎస్ కు హెడ్‌మాష్టరుగా వ్యవహరించారు. ఈ స్కూలుకు మొదటసారిగా స్థానిక వ్యక్తి హెడ్‌మాష్టరు గా పనిచేయటం 1918 లో గిరి తాతయ్య తో మొదలైంది. ఆ తరువాత 1923 లో మలిపెద్ది వీరన్న సి.బి.ఎస్ కు సారధ్యం వహించారు.
1934 లో సి.బి.ఎస్ లో మలిపెద్ది అంకయ్య హెడ్‌మాస్టరుగాను, గిరిలక్ష్మినారాయణ, మహేంద్రవాడ వీర గణపతి శాస్త్రులు, మద్దింశెట్టి సత్యనారాయణ మూర్తి, నల్లం సుబ్బారాయుడులు టీచర్లుగా పనిచేసారు.
1938`39 లలో సి.బి.ఎస్ కు గిరి లక్ష్మీనారాయణ హెడ్‌మాస్టరుగాను, మద్దింశెట్టి సత్యనారాయణ మూర్తి ఫ్రెంచి టీచరుగా (తెలుగును కూడా ఫ్రెంచివారే బోధించే స్థితినుండి తెలుగువారే ఫ్రెంచిని బోధించే స్థాయికి యానాం విద్యావ్యవస్థ చేరుకోవటం గమనార్హం), మద్దింశెట్టి సత్తిరాజు, మహేంద్రవాడ వీర గణపతి శాస్త్రులు, నల్లం సుబ్బారాయుడు లు ఇతర టీచర్లుగాను పనిచేసేవారు.
విద్యారంగానికి విశిష్టసేవలందించినందుకు గాను మద్దింశెట్టి సత్యనారాయణ మూర్తికి ఫ్రెంచిప్రభుత్వం 1954లో ‘షెవాలియర్’ బిరుదు ప్రధానం చేసింది. ఉన్నత చదువులకోసం ఎంతో మంది యానాం విద్యార్ధులు పాండిచేరీ వెళ్ళేవారు. వీరికి ఫ్రెంచి ప్రభుత్వం స్కాలర్‌షిప్పులు ఇచ్చేది. 19 శతాబ్దం చివరలో అలా వెళ్ళి ‘లా’ చదువుకొన్న గిరి వెంకన్న, పుణ్యమూర్తుల వెంకట సుబ్బారాయుడులు యానాం కోర్టులో సహాయజడ్జీ లు గా పనిచేసారు. అదే విధంగా నల్లం సత్యనారాయణ, ఆశెపు భైరవస్వామి లు వైద్యవిద్యనభ్యసించి స్థానిక ఆసుపత్రిలో డాక్టర్లుగా నియమితులయ్యారు.
5. పరీక్షలు ` సర్టిఫికేట్లు
యానాంలో ప్రాథమిక విద్య రెండు దశలలో జరిగేది. మొదటి దశను ‘సత్వికా’ అనేవారు. ఇది పూర్తిచేసిన వారికి “Brevet de langue Indigene” అనే సర్టిఫికెట్ ఇచ్చేవారు. దీని తరువాత స్థాయిని ‘బ్రెవే’ అంటారు. ఇది పాస్ అయితే నిదీతీవఙవ్ సవ శ్రీaఅస్త్రబవ Iఅసఱస్త్రవఅవు అనే సర్టిఫికెట్ వచ్చేది. బ్రెవే పాస్ అయినవారు ఇంకా తమ విద్యను కొనసాగించాలంటే పాండిచేరీ వెళ్లవలసివచ్చేది. అమ్మాయిల చదువు సాధారణంగా సత్వికా కోర్సుతో ఆగిపోయేది. బ్రెవే చదువుకొన్నవారికి ప్రభుత్వ శాఖలలో టీచర్లు, టాక్స్ కలక్టర్లు వంటి ఉద్యోగాలు వచ్చేవి.
6. విద్యా విధానం
1880 ప్రాంతంలో యానాం ఫ్రెంచి స్కూలులో చదివిన చెళ్ళపిళ్ళవెంకటశాస్త్రి వ్రాసిన ‘నా గురు పరంపర’ (కృష్ణా పత్రిక 1934) అనే వ్యాసంలో తన అనుభవాలను ఇలా వర్ణించారు.
పదేండ్ల వయసులో చెళ్ళపిళ్ళ వారి చదువు ఫ్రెంచి టవును యానాంకు మార్చబడిరది. సాతాని జియ్యన్న గారు తెలుగు మాస్టారు. ఫర్మా, విజే అను ఇద్దరు ఫ్రెంచి దొరలు ఇతర టీచర్లుగా ఉండేవారు. వీరిలో ఫర్మా గారు హెడ్ మాష్టారు. ఆ మాష్టారు వీరిని ‘సెలపిల ఎంకత సలం’ అని పిలిచే వారట. మాల మాదిగలు స్కూలులో ఉన్నప్పటికీ ఎవరి బెంచీ వారిదే. గురువారం, ఆదివారం స్కూలుకు శలవుదినాలు.
పిల్లలు తప్పు చేస్తే వారానికొకమారు టేబుల్ పై పడుకోబెట్టి బెత్తంతో కొన్నిదెబ్బలు కొట్టేవారు. అలా చేయటాన్ని ‘పటుసారి’ అనేవారు. ఆల్ఫాబెత్తు అనే పుస్తకం పూర్తయిందో లేదో, మాల మాదిగలు అందరితో కలసి కూర్చోనివ్వాలి అనే రూలు వచ్చింది. దానితో చాలామంది పిల్లలు స్కూలు మానేసారు. వారిలో చెళ్ళపిళ్ళ వారు ఉన్నారు. పొరుగునున్న నీలపల్లి అనే బ్రిటిష్ గ్రామంలోని స్కూలులో వీరు తమ విద్యను కొనసాగించారు.
పై వివరాలను బట్టి యానాం స్కూలులో విద్యాబోధన ఏ విధంగా ఉండేదో అర్ధం చేసుకొనవచ్చును. మరీ ముఖ్యంగా ఫ్రెంచివారు అన్ని వర్ణాలవారిని సమానంగా చూసేవారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సనాతన కుటుంబానికి చెందిన చెళ్ళపిల్ల వారు నీలపల్లిలో విద్యాభ్యాసం సాగించటాన్నిబట్టి అక్కడ అటువంటి పరిస్థితి లేదనే భావించాలి.
స్కూలు బోధనాంశాలలో మోరల్ ఎడ్యుకేషను (నీతి విద్య) అన్నితరగతులకు తప్పనిసరిగా ఉండేది. దీనికొరకు టైమ్ టేబుల్ లో తప్పనిసరిగా ఒక పీరియడ్ ఉండేది.
స్కూళ్ళ సెలవుల షెడ్యూల్‌కు కూడా గవర్నరు స్థాయిలో నిర్ణయాలు జరిగేవి. స్కూలు సెలవులు క్రిష్టమస్, సంక్రాంతికి కలిపి సుమారు నెలన్నర రోజులపాటు ఉండేవి. వేసవి సెలవులు మాత్రం తక్కువగా ఇరవైరోజుల ఉండేవి. వారానికి అయిదురోజులు మాత్రమే స్కూల్స్ ఉండేవి. ప్రతి గురువారం, ఆదివారం శలవులు. హిందువుల పండుగలకు మొత్తం స్కూలుకు సెలవు ఉండేది. అదే ముస్లిముల పండుగలకు ఒక్క ముస్లిము విద్యార్ధులకు మాత్రమే సెలవు ఉండటం ఆశ్చర్యం కలిగించేవిషయం.
యానాంలోని స్కూళ్ళ నిర్వహణకు ఫ్రెంచి ప్రభుత్వం గణనీయమైన నిధులను వెచ్చించినట్లు రికార్డులు చెపుతున్నాయి. (చూడుడు టేబుల్)
ఆ మొత్తాలు ఆనాటి యానాం స్థూల ఆదాయంలో 12 నుంచి 27 శాతం వరకూ ఉండటం గొప్ప విషయమే. పై టేబుల్‌ను గమనిస్తే ఫ్రెంచ్ టీచర్ల జీతాలు గణనీయంగా పెరిగాయి కానీ తెలుగు/స్థానిక టీచర్ జీతం మాత్రం పెరగలేదన్న విషయం తెలుస్తుంది. కన్యస్త్రీ టీచర్ల లో మొదట్లో ఇద్దరికి మాత్రమే ప్రభుత్వం జీతం చెల్లించేది. మిగిలిన వారు వాలంటరీగా పనిచేసేవారు. 1862 నుంచి మరో కన్యస్త్రీ టీచరుకు కూడా ఫ్రెంచి ప్రభుత్వం జీతం ఇవ్వటం మొదలెట్టింది.
యానాం పెద్దొర ప్రతీ స్కూలును నెలకు రెండుసార్లు చొప్పున తణిఖీలు నిర్వహించినట్లు 1864 నుంచి ఉన్న రికార్డులు చెబుతున్నాయి.
1920 లో Valmry అనే ఫ్రెంచి అధికారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ యానాం విద్యా వ్యవస్థను అధ్యయనం చేసినపుడు అక్షరాస్యతా 28 శాతం ఉంది. అంటే అప్పటి మొత్తం 5823 మంది జనాభాలో 3949 మంది నిరక్షరాస్యులే. 1951 నాటికి యానాం అక్షరాస్యత 33 శాతానికి పెరిగింది.
7. ముగింపు
ఆనాటి విద్యావిధానంలో ఫ్రెంచి మరియు తెలుగు మీడియం లలో బోధన జరిగేది. తెలుగు మీడియం విద్యార్ధులకు ఫ్రెంచిభాష నేర్చుకోవటం తప్పనిసరి. ముస్లిం విద్యార్థులకొరకు ఉర్దూ ఉండేది. 1898 నాటి లెక్కల ప్రకారం మొత్తం టీచర్ల సంఖ్య 24 కాగా, వారిలో 8 మంది ఫ్రెంచి టీచర్లు, 13 మంది తెలుగు టీచర్లు, (అంటే తెలుగులో బోధించే టీచర్లు అని` కొంతమంది ఫ్రెంచి దేశస్థులు కూడా తెలుగును నేర్చుకొని బోధన జరిపేవారు), ఇద్దరు కన్య స్త్రీ/సిస్టర్ టీచర్లు, ఒక ఉర్దూ టీచరు (Mr. Fathidine) ఉన్నారు. అప్పట్లో మిషనరీ సిస్టర్‌లచే నడపబడిన కాన్వెంటు ప్రస్తుతం మిని సివిల్ స్టేషను ఉన్న ప్రాంతంలో ఉండేది.
ఏది ఏమైనప్పటికీ యానాంలోని ఆధునిక విద్యావ్యవస్థ ప్రారంభదశలలో ఫ్రెంచి మిషనరీలు చేసిన సేవలు గణనీయమైనవి. ఆనాటి కన్యస్త్రీల సమాధులు నేటికీ యానాంలోని ఫ్రెంచి సెమెటరీలో చూడవచ్చును. ఫ్రెంచి వారు యానాంలో మిగిలిన శాఖల కన్నా విద్యావ్యాప్తికే ఎక్కువ నిధులు కేటాయించారన్న విషయం కూడా గమనించదగ్గది.
కుల మతాలకు అతీతంగా విద్యనందించటంలో ఫ్రెంచి వారు పొరుగునున్న బ్రిటిష్ వారికన్నా ముందున్నారు. యానానికి చెందిన ప్రముఖ కవి శిఖామణి ఒక చోట ‘‘నేను యానాంలో పుట్టి పెరగటం వలన కులపరమైన వివక్షను పెద్దగా ఎదుర్కొన లేదు’’ అని అన్నారు. బహుసా ఆ వ్యాఖ్యకు మూలాలు పై వ్యాసంలో దొరుకుతాయి.
(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (2010) నుండి)
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment