నా మూడవ పుస్తకం “ఫ్రెంచి పాలనలో యానాం”
(2012). యానాంలో ఫ్రెంచివారి కలోనియల్ చరిత్ర
గురించి. ఈ పుస్తకం ఫ్రెంచివారు ఈ నేలపై అడుగుపెట్టిన
1723 తో మొదలై, వారు విడిచివెళ్ళిన 1954 తో పూర్తవుతుంది.
ఆనాటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలను
ఈ పుస్తకం చర్చిస్తుంది. ఈ క్రింది వ్యాసం
ఆనాటి రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.
ఆనాటి నాయకులు, గ్రూపులు, ఎన్నికలు, కోర్టుకేసులు లాంటి అంశాల క్రోడీకరణ ఇది.
ఇంతసమగ్రంగా వ్యాసం రావటానికి ఫ్రెంచి ప్రభుత్వ ఆర్చైవ్స్ కారణం. చరిత్రకు సంబంధించి
చిన్న చిత్తుకాగితమైనా భద్రపరచిన వారి చారిత్రిక స్పృహ గొప్పది.
ఈ వ్యాసంలో ఎంతమంది వ్యక్తులను ఉటంకించానో
పునరుక్తులను మినహాయించి చెప్పు అని చాట్ జిపిటి ని అడిగితే 137 మంది అని లెక్కగట్టి
లిస్టు ఇచ్చింది. వీరిలో ప్రారంభంలో 8 మంచి ఫ్రెంచ్ దేశస్థులు ఉన్నారు. మొత్తం మీద
ఏడుమంది ముస్లిములు, నలుగురు బ్రాహ్మణులు, ఆరుగురు వైశ్యులు, ఆరుగురు దళితులు, ముగ్గురు
బిసీలు ఉండటం మిగిలినవారందరూ కాపు సామాజిక వర్గానికి చెందటం ఉజ్జాయింపుగా గమనించవచ్చు.
ఐరనీ ఏమిటంటే అప్పట్లోనే ముప్పై వేల రూపాయల
వెచ్చించి ముద్రించిన ఈ పుస్తకాన్ని 137 మందికాదు కదా ఆ సంఖ్యలో సగం మంది కూడా యానాంలో
కొనుక్కోలేదు.
బొల్లోజు బాబా
.
ఫ్రెంచి యానాం రాజకీయ చిత్రం
యూరోపియన్‌లు భారతదేశాన్ని తమ కాలనీలుగా చేసుకోవటానికి
మొదట్లో వారిని ఆకర్షించింది ‘పత్తి’ అంటే ఆశ్చర్యం కలుగక మానదు. పత్తి పంట యూరప్‌దేశాలలో
ఉండదు. వారి దుస్తులు ఊలు తో
తయారయ్యేవి. కాటన్ దుస్తులలో వారికి
‘ఉజ్జ్వలమైన వ్యాపార భవిష్యత్తు’ కనిపించింది.
ఇక్కడ తయారయ్యిన కాటన్ వస్త్రాలను యూరప్ మార్కెట్లకు తీసుకువెళ్ళి
అధికధరలకు విక్రయించి విపరీతంగా
లాభాలార్జించటం మొదలుపెట్టారు. తమ
వ్యాపార స్థిరీకరణ కోసమని స్థానిక రాజులకు బహుమతులిచ్చి ‘మంచి’ చేసుకోవటం ద్వారా
స్థానిక రాజకీయాలలో వేలు పెట్టటం మొదలెట్టారు.
ఈ జోక్యం ఎంతవరకూ వెళ్ళిందంటే ఇంగ్లీషు వారు ‘బ్రిటిష్ ఇండియా’ ను
ఫ్రెంచివారు ‘ఫ్రెంచి ఇండియా’ ను నిర్మించేటంత వరకూ సాగింది.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న రీతిలో ఇంగ్లీషువారు, ఫ్రెంచివారు
ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు చేసుకొన్నారు. డూప్లే కాలంలో ఫ్రెంచి వారిదే
పైచేయి గా ఉన్నప్పటికీ, చివరకు ఇంగ్లీషువారు వివిధ ఒప్పందాల ద్వారా వీరిని
భారతదేశంలో పాండిచేరీ, మాహే, కారైకాల్, చంద్రనాగూర్, మచిలీపట్నం యానాం వంటి
ప్రాంతాలకు పరిమితం చేయగలిగారు. యానాం, మచిలీపట్నం
వంటి ప్రాంతాల వల్ల ఫ్రెంచి ఇండియా ప్రభుత్వానికి ఒకానొక దశలో ఏవిధమైన ఆర్ధికలాభం
లేకపోయినా వాటిని తమ ‘గౌరవచిహ్నాలు’ గా భావించుకొంది. వీటిని వదిలించుకోవటం అంటే ఫ్రెంచి ఇండియా
నిర్మాణ సమయంలో వేల సంఖ్యలో అసువులు బాసిన ఫ్రెంచిసైనికుల బలిదానానికి అర్ధం
లేకుండా పోతుందని తలచింది.
1701 లో జారీ చేసిన ఒక రాజశాసనం ద్వారా పాండిచేరీలోని గవర్నరుకు పరిపాలన విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం సర్వాధికారాలు కట్టపెట్టింది. చాలా కాలంవరకూ గవర్నరే పాలనా వ్యవహారాలు నడిపించేవారు.
ఫ్రెంచి గవర్నరుకు పరిపాలనా వ్యవహారాలలో సూచనలు ఇవ్వటానికని, 1790 లో 27 మంది పౌరులతో కూడిన ఒక జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఫ్రెంచి ఇండియాలో మొదటిసారిగా పరిపాలనలో పౌరుల భాగస్వామ్యం మొదలయ్యిందని చెప్పవచ్చును. 1791 జూలై 5 న పాండిచేరి ప్రజలు సమావేశమయి, ఆ సంఖ్యను 21 కి కుదించి ఆ కూటమికి ‘కలోనియల్ అసెంబ్లీ’ అని పేరు పెట్టారు. వీరందరూ ఫ్రెంచి దేశస్థులే. ఈ 21 మందిలో 15 మంది పాండిచేరీ నుంచి, ముగ్గురు చంద్రనాగూరునుంచి, మాహే కారైకాల్ యానాంల నుంచి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్ధులుండాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఇతర ఫ్రెంచికాలనీలుగా ఉన్న సూరత్, కాలికట్, మచిలీపట్నం ల నుండి ప్రాతినిధ్యం లేకపోవటంతో వాటిని యానానికి అనుసంధానం చేసారు.
ఈ కలోనియల్ అసెంబ్లీకి యానాం నుంచి ఒక ప్రతినిధి
ఉండేవాడు. పాండిచేరీలో జరుగుతున్న ఈ
రాజకీయ ప్రక్రియలపట్ల ఉత్తేజితులైన కొంతమంది యానాం పౌరులు ఇక్కడ కూడా ‘యానాం
కలోనియల్ అసెంబ్లీ’ ని ఏర్పాటు చేసుకొన్నారు.
దీనికి Marietta ను ప్రెసిడెంటుగాను, Pithois ను వైస్ ప్రెసిడెంటుగాను ఎన్నుకొన్నారు. 1791లో యానాం కలోనియల్ అసెంబ్లీ కి ‘యాక్టివ్ సిటిజెన్స్
అసెంబ్లీ’ గా పేరు మార్చారు. ఈ అసెంబ్లీకి
అప్పటి పెద్దొర సొన్నరెట్ కు మధ్య అనేక వివాదాలు నడిచాయి. 1793 లో ఫ్రెంచి కాలనీలను బ్రిటిష్ వారు ఆక్రమించుకోవటంతో ఈ మొత్తం వ్యవస్థ
తుదిరూపు దిద్దుకోకముందే అదృశ్యమైపోయింది.
స్థానికమండలి మున్సిపల్ కౌన్సిల్ ఆవిర్భావాలు
ఆనాటి యానాం రాజకీయ చిత్రంలో రెండు వ్యవస్థలుండేవి. నలుగురు సభ్యులతో ఉండే స్థానిక మండలి మరియు 12 మంది మెంబర్లతో ఉండే మున్సిపల్ కౌన్సిలు. ఇంతమంది ఉన్నా వీరి పాత్ర పర్యవేక్షణకే తప్ప
నిర్ణయాధికారాలు ఏమీ లేవు. ట్రెజరీ, విద్యావ్యవస్థ, ప్రజాపనులు, పన్నులు, పోలీసు, వైద్యం, రవాణా వంటి వివిధ
శాఖలకు సంబంధించిన విశిష్టాధికారాలు అన్నీ పెద్దొర చేతిలో ఉండేవి. ప్రజలచే
ఎన్నుకొన్న ఈ మొత్తం 16 మంది ప్రతినిధుల
పాత్ర సలహాలు, సంప్రదింపులకే పరిమితం.
25 జనవరి, 1871 న ఫ్రెంచి
ప్రభుత్వం జారీ చేసిన ఒక డిక్రీ కి అనుగుణంగా యానాంలో స్థానిక మండలి (Local Council) ఏర్పాటు జరిగింది. దీనిలో నలుగురు మెంబర్లు
మరియు వారినుంచి ఒక అధ్యక్ష్యుడు ఉంటారు. 21 సంవత్సరములు దాటిన పౌరులు ఈ మెంబర్లను ఎన్నుకొంటారు. ఈ నలుగురిలో ఒకరు
పాండిచేరీలో కల జనరల్ కౌన్సిల్‌కు యానాం తరపు మెంబరుగా పంపబడేవాడు. 28 మంది
సభ్యులుండే పాండిచేరీ జనరల్ కౌన్సిల్ తరపున ఫ్రాన్స్ లోని ఫ్రెంచి సెనేట్ కు
ఒక ప్రతినిధిని పంపించేవారు. ఇదీ అప్పటి రాజకీయ వ్యవస్థ.
1880 లో ఫ్రెంచి ప్రభుత్వం మరో డిక్రీ ద్వారా స్థానిక పరిపాలన
కొరకు మున్సిపాలిటీలను ఏర్పాటుచేసింది. ఆ విధంగా 1880 మార్చి, 12 న యానాం మున్సిపాలిటి పన్నెండు వార్డులతో ఏర్పడిరది. ఈ పన్నెండు వార్డులకు సాధారణ ఎన్నికల ద్వారా 12 మంది మెంబర్లు
ఎన్నికవుతారు. వీరిలో ఒకరు మేయర్ గా
ఎన్నిక కాబడి స్థానిక పరిపాలనను పర్యవేక్షిస్తాడు.
స్థానికమండలి మొదటి ఎలక్షన్లు
భారతదేశానికి ప్రజాస్వామ్యపు తొలిరోజులవి. 1872 లో 21 సంవత్సరములు నిండిన అర్హత కలిగిన 1394 మందితో కూడిన యానాం ఓటర్ల లిస్టు తయారయ్యింది. ఫ్రెంచి దేశస్థులకు, భారతీయులకు విడివిడిగా ఓటరు లిస్టులుండేవి. ఆనాటి యానాంలో అతికొద్ది సంఖ్యలో ఫ్రెంచి
దేశస్థులున్నప్పటికీ స్థానిక మండలిలో వారి ప్రాతినిధ్యానికేమీ లోటులేకుండా
చూసుకొనేవారు.
1872 లో యానాంలో ప్రప్రథమంగా స్థానిక మండలి ఎలక్షన్లు జరిగాయి.
ప్రజలకు ఎలక్షన్ల పట్ల ఏ మాత్రమూ అవగాహన
లేని కారణంగా అభ్యర్ధులను పోటీ చేయమని బ్రతిమాలవలసి వచ్చిందట. ఈ ఎన్నికలలో కవల
వెంకట చలపతి, పైడికొండల కృష్ణయ్య నాయుడు, కంతేటి సత్యప్రసన్నం, డకోస్టా
జార్జ్‌స్ అనే నలుగురు మెంబర్లతో అప్పటి పెద్దొర Bayot అధ్యక్షతన యానాంలో మొదటి స్థానిక మండలి ఏర్పడిరది. 1878 లో కవల వెంకటసుబ్బారాయుడు, పైడికొండల కృష్ణయ్యనాయుడు, డకోస్టా జార్జ్‌స్
ల స్థానాలలో సమతం వెంకట సుబ్బారాయుడు, కొమండూరి
జియన్న,
పైడికొండల సుబ్బారాయుడులు ఎన్నికయ్యారు. ఆ తరువాత కొమండూరి జియన్న స్థానంలో బెజవాడ
బాపనయ్య నాయుడు ఎన్నికయి కొంతకాలం స్థానిక మండలి అధ్యక్ష్యునిగా పనిచేసారు.
1879`1884 లలో యానాం నుంచి Le Faucheur మరియు పైడికొండల సుబ్బారాయుడులు పాండిచేరీలోని జనరల్ కౌన్సిల్ కు
పంపించబడ్డారు. 1884 లో లె ఫాషర్ స్థానాన్ని బెజవాడ బాపనయ్య నాయుడు కైవసం
చేసుకొన్నారు.
మున్సిపల్ కౌన్సిల్ మొదటి ఎలక్షన్లు
1880 మార్చి లో జరిగిన యానాం ప్రథమ మున్సిపల్ ఎన్నికలలో బెజవాడ
బాపనయ్యనాయుడు విజయ ఢంకా మోగించారు.
కంతేటి సత్యప్రసన్నం, పైడికొండల కృష్ణయ్య, కసిరెడ్డి
బ్రహ్మానందం, కోన నరసయ్య, సిదరాల సన్యాసయ్య, అబ్దుల
రెహ్మాన్, కసిరెడ్డి తిమ్మన్న, ఎర్రంశెట్టి వెంకట రామయ్య, Pharamond లు మెంబర్లుగా ఎన్నికయ్యారు.
వివిధ సార్వత్రిక ఎన్నికలు ` గెలుపోటములు
బెజవాడ బాపనయ్యనాయుడు అశేషప్రజల అభిమానం చూరగొన్నప్పటికీ, ఆయనకు 25 సంవత్సరములు నిండని
కారణంగా మేయర్ పదవికి అనర్హుడంటూ ప్రత్యర్ధులైన పైడికొండల సుబ్బారాయుడు, కామిశెట్టి పేరమనాయుడులు చేసిన అభియోగాలు బజువు కావటంతో ఆయన ఎన్నిక చెల్లదంటూ యానాం కోర్టు
తీర్పుచెప్పింది. దరిమిలా యానాంలో మరలా
మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
1883 ఎలక్షన్లలో పైడికొండల సుబ్బయ్య మేయర్ గా విజయం సాధించారు.
Pharamond బెజవాడ బాపనయ్యనాయుడు, సిదరాల సన్యాసయ్య, కసిరెడ్డి
బ్రహ్మానందం, వర్ధినీడి కొండలనాయుడు, సమతం వెంకటసుబ్బారాయుడు, అబ్దుల్
రెహ్మాన్Kerjean Theophile లు మెంబర్లు గా ఎన్నికయ్యారు. బెజవాడ బాపనయ్యనాయుడు 1885 లో మేయరు పదవిని తిరిగి దక్కించుకొన్నారు. పైడికొండల సుబ్బయ్య 1886 లో చనిపోవటాన్ని బట్టి ఆయన బహుసా అనారోగ్యకారణాల వల్ల 1885లోనే మేయరు పదవినుంచి వైదొలగి ఉండవచ్చు. బెజవాడ బాపనయ్యనాయుడు కౌన్సిల్ లో
విజే (చెళ్ళపిల్ల వారు తాను యానాంలో
చదువుకొనేటపుడు, విజే అనే ఒక టీచర్ ఉండేవారు అని
చెప్పింది వీరి గురించే) కాళ్ళ రాయపురాజు
అనే ఇద్దరు కొత్త మెంబర్లు చేరారు.
సమతం వెంకటసుబ్బారాయుడు 1886 లో కొంతకాలం మేయర్ పదవి అధిష్టించారు.
వీరినుంచి మరలా బెజవాడ బాపనయ్యనాయుడు అదే సంవత్సరంలోనే
మేయర్ పదవిని స్వీకరించి 1890 డిశంబరు 19 న జరిగిన స్థానిక కౌన్సిల్ కు మొదటి మెంబరుగా
ఎన్నికయ్యేవరకూ కొనసాగారు. ఈ ఎన్నికలలో ఆనాటి యానాం మొత్తం ఓటర్లు 1103 లో 715 మంది తమ ఓటు
హక్కును వినియోగించుకొన్నారు. బెజవాడ
బాపనయ్య 429 ఓట్లను సంపాదించుకొని విజయం సాధించారు. ఇదే ఎలక్షన్లలో పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు
కూడా విజయం సాధించి రెండవమెంబరు స్థానాన్ని కైవశంచేసుకొన్నారు.
1891 లో జరిగిన ఎలక్షన్లలో కోన నరసయ్య మేయరు గా, పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు, బెజవాడ బాపనయ్యనాయుడు, కాళ్ల
రాయపురాజు, సమతం కృష్ణయ్య, వెలగలపూడి లింగయ్య, కాపగంటి
చినసారయ్య, కూనపురెడ్డి కృష్ణ, గిరి సుబ్బారాయుడు, సాత్తార్
సాహెబ్,
వంకాయల వీరన్న, వంటెద్దు
వెంకటస్వామి లు మెంబర్లుగాను ఎన్నికయ్యారు.
వీరిలో కూనపురెడ్డి కృష్ణమ, సత్తర్ సాహెబ్ లు గతించటం వలన మరియు వంకాయల వీరన్న రాజీనామా చేయటంతో ఖాళీలను
బర్తీచేయటానికి 1892, డిశంబరు 4 న మధ్యంతర ఎన్నికలు జరిగాయి. మొత్తం 1115 ఓటర్లకు గాను 382 మంది మాత్రమే
ఓటుహక్కు వినియోగించుకోవటం గమనార్హం.
కొల్లూరి భీమయ్య, కశిరెడ్డి వెంకయ్య, బళ్ళ లక్ష్మయ్య లు కొత్త మెంబర్లుగా ఎన్నికయ్యారు.
1894 లో బెజవాడ బాపనయ్య నాయుడు మేయర్ పదవి దక్కించుకొని చాలాకాలం కొనసాగారు. 1899 ఎలక్షన్లలో బెజవాడ బాపనయ్యనాయుడు తన మేయర్ పదవిని నిలబెట్టుకొన్నారు.
1903నాటి యానాం మున్సిపల్ కౌన్సిల్ కు మేయరుగా బెజవాడ బాపనయ్య
నాయుడు,
సమతం వెంకట సుబ్బారాయుడు, కోన సత్తియ్య, ఇబ్రహిం ఖాన్, కాపగంటి సత్తిరాజు, కూనపురెడ్డి
సుబ్బారాయుడు, కోన కృష్ణ, బళ్ళా వెంకట రత్నం, పుణ్యమూర్తుల
వెంకట సుబ్బారాయుడు, వంటెద్దు వెంకట
స్వామి లు మెంబర్లుగాను ఉన్నారు.
1912 లో అప్పటి మేయరయిన సమతం వెంకటసుబ్బారాయుడు
అనారోగ్యకారణాలతో పదవినుండి వైదొలగడంతో ఆయన కుమారుడు సమతం లక్ష్మీనర్సయ్య మేయర్
పదవిని పొందారు.
బెజవాడ బాపనయ్యనాయుడు 1914 లో తాను చనిపోయేవరకూ యానాం కౌన్సిల్ మెంబరుగా కొనసాగారు. ఆయన మరణంతో వారి
కుమార్డు బెజవాడ వెంకటరెడ్డి రాజకీయాలలో ప్రవేశించారు. వీరు పిన్నవయసులో చనిపోవటంచే వీరి కుమారుడు
బెజవాడ బాపన్నాయుడు (తాత గారి పేరు) ప్రవేశించి 1922 లో మున్సిపల్ మెంబరుగా ఎన్నికయ్యారు.
1922 లో కామిశెట్టి అయ్యప్పనాయుడు మేయరు పదవి
దక్కించుకొన్నారు. 1881 నుంచి కామిశెట్టి
పేరమనాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరి కుమార్డు కామిశెట్టి
వేణుగోపాలరావునాయుడు 1922 ఎలక్షన్లలో స్థానిక
మండలి మెంబరుగా ఎన్నికయ్యారు.
1925 లో కాపగంటి మంగయ్య, ఇబ్రహిం ఖాన్, కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, కాళ్ళ వెంకటరత్నం లు స్థానిక మండలి మెంబర్లుగా
ఉన్నారు. ఇదే సమయంలో బెజవాడ బాపన్నాయుడు
మున్సిపల్ మేయర్ గాను, కొత్త వెంకటరత్నం, మాజేటి సోమరాజు, కాపగంటి
సత్తిరాజు, సమతం లక్ష్మీనరసయ్య, గిరిమాధవరావు, దవులూరి
చినవీరాస్వామి, కనకాల బ్రాహ్మడు, కోన వెంకటరాజు, ఉడతా
రెడ్డినాయుడు, సాదనాల వెంకన్నలు మెంబర్లుగాను
ఉన్నారు.
1925 ఎన్నికలలో పరాజయం పాలయిన అభ్యర్ధులలో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, ఎర్రా జగన్నాథరావు, వెలగలపూడి
వీరయ్య,
మహమ్మద్ ఉస్మాన్, నాగసూరి
కామరాజు,
కనకాల చిన నరసయ్య, తిక్కిరెడ్డి
సత్యానందం తదితరులు ఉన్నారు. 1930 లో మహమ్మద్
ఉస్మాన్ స్థానంలో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు వచ్చి చేరారు.
పాండిచేరి నాయకులకు యానాం నాయకులకు మధ్య సత్సంబంధాలు
ఉండేవి. 1928 లో బెజవాడ బాపన్నాయుడు పాండిచేరి కి చెందిన సెల్వరాజు
చెట్టియార్ ను యానాం నుంచి పోటీ చేయించి, గెలిపించి
పాండిచేరి కౌన్సిల్ కు పంపించటం జరిగింది.
1931 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కామిశెట్టి వేణుగోపాలరావు
నాయుడు మేయర్ పదవిని దక్కించుకొన్నారు.
తోట రామన్న, నాగసూరి వెంకటరాజు, చిక్కాల సీతయ్య, తిక్కిరెడ్డి సత్యానందం, షేక్ అహ్మద్, కొమ్మిరెడ్డి రామన్న, కొత్త వెంకట
రత్నం,
బెజవాడ బాపన్నాయుడు, కనకాల
బ్రాహ్మడు, కోన వెంకట రాజులు విజయం సాధించారు.
1934 లో మరలా జరిగిన ఎన్నికలలో కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు
బృందం ఘనవిజయం సాధించింది. బెజవాడ
బాపన్నాయుడుకు కుడిభుజమైన సమతం లక్ష్మీనరసయ్య 1933 లో మరణించటంతో ఆయన ఒంటరిపోరు సలపవలసి వచ్చింది. ఈ ఎలక్షన్లలో తోట నరసింహస్వామి, కోన సుబ్బారావు, చింతా
బ్రహ్మానందం, చిక్కాల సూర్యనారాయణ, కామిరెడ్డి వెంకటస్వామి, కుంచం రావి
వంటి కొత్త నాయకులు మున్సిపల్ మెంబర్లుగా తెరపైకి వచ్చారు.
ప్రతిపక్షాల ఐక్యత
1931 నుంచి కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు వర్గం రాజకీయంగా
రోజు రోజుకూ బలపడుతూండటంతో, ప్రతిపక్షాలు ఒకానొక
దశలో ఏమీచేయలేక నిస్సహాయులైపోవలసి వచ్చింది. రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. అధికారాన్ని అనుభవిస్తున్న కామిశెట్టి
ఈ సమయంలో అనేక ఆరోపణలను ఎదుర్కోవలసివచ్చింది.
అంతవరకూ బెజవాడ వర్గంలో ప్రధాన పాత్రవహించిన తోట రామన్న వంటి వారు
కామిశెట్టి పక్షాన చేరిపోయారు. 1935 లో జరిగిన కౌన్సిల్
ఎన్నికలలో బెజవాడ వర్గం తరపున పోటీ చేసిన మద్దింశెట్టి సత్యనారాయణ (ఫ్రెంచి టీచరు)
అయిదు ఓట్లు మాత్రమే పొందగలిగారు. బెజవాడ
బాపన్నాయుడు కూడా ఈ ఎన్నికలలో పోటీచేయగా ఆయనకు కూడా అయిదు ఓట్లు మాత్రమే రావటం, ఆయన ప్రత్యర్ధికి 587 ఓట్లు రావటం అనేది కామిశెట్టి వర్గం ఆధిపత్యాన్ని తెలియచేస్తుంది. ఈ
ఎన్నికలలో భారీస్థాయిలో రిగ్గింగు జరిగిందని బెజవాడ బాపన్నాయుడు వేసిన కోర్టు కేసు
కొట్టివేయబడిరది.
ఈ సమయంలో కామిశెట్టి వ్యతిరేక వర్గం చేతులుముడుచుకొని
కూర్చోక అధికార పక్షం కనుసన్నల్లో జరిగే అనేక అవకతవకలను ప్రభుత్వం దృష్టికి
తీసుకువచ్చేది.
అప్పటికి 17 నెలలుగా వెల్ఫేర్
కమిటీ నెల నెలా ఇచ్చే ప్రభుత్వ పించనులను
పంపిణీ చేయటం లేదని ఆ సొమ్ము స్వాహా అయిపోతున్నదని, పించనులు అందక లబ్దిదారులు బిక్షాటన చేసుకొంటున్నారని, కొంతమంది ఆకలితో చచ్చిపోయారంటూ` ప్రతిపక్షం పాండిచేరీకి పిర్యాదులు చేసింది.
అప్పటి యానాం అడ్మినిస్ట్రేటరు అయిన జీవరత్నం, కామిశెట్టికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షానికి చెందిన వారిపై
అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని బెజవాడ వర్గం ఆరోపించింది. బెజవాడ
అనుచరుడైన దున్నా కమలనాభం ఇంటిపై కామిశెట్టి వర్గానికి చెందిన వారు దాడిచేసి
ఆయనను,
కుటుంబసభ్యులను గాయపరచారని తెలిపారు.
కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడుకి ఫ్రెంచి రాదు కనుక ఆయన
మేయర్ పదవికి అనర్హుడంటూ కోర్టులో కేసు వేయటం జరిగింది.
కామిశెట్టి ఆర్ధిక పరిస్థితి అంత బాగాలేని కారణంగా (453 రూపాయిల బాకీ చెల్లించని కారణంగా ఇంటిలోని వస్తువులను
జప్తు చేయటం జరిగింది) పదివేల రూపాయిల మున్సిపల్ బడ్జెట్టును నిర్వహించే అర్హత
అతనికి లేదని కూడా పిర్యాదు చేసారు.
యానాం నుంచి పదే పదే వస్తున్న పిర్యాదుల నేపధ్యంలో, విచారణ జరపమని పాండిచేరీ కోర్టు జడ్జి వీతీ. Mr. Philippon, ఇన్‌స్పెక్టర్ బసవా
సుబ్బారాయుడు లను ఫ్రెంచి ప్రభుత్వం
నియమించి డిశంబరు 1933 లో యానాం
పంపించింది. వీరి విచారణలో ఈ అవకతవకలకు, ఘర్షణలకు
కారణం అడ్మినిస్ట్రేటర్ జీవరత్నమని తేల్చటంతో, జీవరత్నాన్ని
బదిలీచేసి కొమరన్ ను యానాం అడ్మినిస్ట్రేటర్‌గా నియమించటం జరిగింది.
ఇలాంటి ఉద్రిక్త రాజకీయపరిస్థితుల నడుమ జనవరి 1935 లో ఫ్రెంచి
గవర్నరు యానాం పర్యటనకు వచ్చారు. ఆయన గౌరవార్ధం మేయర్ హోదాలో కామిశెట్టి ఇచ్చిన
విందుకు,
బెజవాడ వర్గానికి చెందిన కౌన్సిల్ మెంబర్లను ఎవరినీ
ఆహ్వానించలేదు. దీనికి ప్రతిచర్యగా బెజవాడ బాపన్నాయుడు తన ఇంటివద్ద ఒక రీడిరగ్ రూమ్ శంఖుస్థాపన కొరకు గవర్నరుగారిని
ఆహ్వానించి ఆయననే తన ఇంటికి రప్పించుకొన్నారు. కామిశెట్టితో విభేదించి బయటకు
వచ్చేసిన యర్రా జగన్నాధరావు, గవర్నరుగారిని కలసి
మేయరు పాలనలో జరుగుతున్న అవకతవకల గురించి పిర్యాదు చేసారు.
ఇదే సమయంలో యర్రా జగన్నాధరావు ఆధ్వర్యంలో ఒక గొప్ప విందు
జరిగింది. కామిశెట్టి వ్యతిరేక వర్గం
చేసిన ఒక రకమైన బలప్రదర్శనగా ఈ విందు నిలచింది.
దీనికి యానానికి చెందిన అనేకమంది ఆనాటి ప్రముఖులు హాజరయ్యారు. అలా హాజరయిన
వారిలో `
బెజవాడ బాపనయ్య, ఇబ్రహిం ఖాన్, కాపగంటి
సత్తిరాజు, నల్లం సుబ్బారావు, మహేంద్రవాడ వీరగణపతి శాస్త్రులు, కశిరెడ్డి వెంకటరామయ్య, దవులూరి చిన
వీరాస్వామి, దున్నా కమలనాభం, సమతం గోపాలం, పంపన
వీరాస్వామి, నల్లం సత్యనారాయణ, మద్దింశెట్టి సత్తిరాజు, దవులూరి
రాజారావు,
గల్లా శ్రీనివాసులు, మొహమ్మద్
ఉస్మాన్,
తోట నరశింహస్వామి, గిరి
మాధవరావునాయుడు, దవులూరి వెంకటరాజు, మొహమ్మద్ జిక్రియా, మలిపెద్ది
అంకయ్య,
గిరి లక్ష్మినారాయణ, మద్దింశెట్టి
సత్యనారాయణ మూర్తి, మద్దింశెట్టి బాపన్న
తదితరులు ఉన్నారు. (ఇరవయ్యవ శతాబ్దంలో ఫ్రెంచియానాంలో పేర్గాంచిన వ్యక్తులను
గూర్చి తెలుసుకొటానికి ఉపయోగ పడుతుందని మొత్తం లిస్టు ఇవ్వటం జరిగింది` రచయత)
యానాం రాజకీయచిత్రాన్ని మార్చివేసిన కలయిక
ఆనాటి యానాం నాయకులు పాండిచేరీలో ప్రధాన పాత్రవహించే
కూటములకు మద్దతు పలికేవారు. ఆ విధంగా బెజవాడ బాపన్నాయుడు వర్గం పాండిచేరీలోని
సెల్వరాజు చెట్టియార్ పక్షానికి మద్దతు ఇచ్చేది.
ఒకానొక సందర్భంలో సెల్వరాజు ను యానాంనుంచి గెలిపించటం కూడా జరిగింది. కామిశెట్టి వర్గం పాండిచేరీలోని జోసఫ్ డేవిడ్
పక్షాన నిలచేది. అలా యానాంలోని రెండు వర్గాలకు వారివారి గాడ్‌ఫాదర్ల
ఆశీస్సులు, అండదండలు ఉండేవి. 1936 లో పాండిచేరిలో రాజకీయాలలో జరిగిన
నాటకీయపరిణామాల వల్ల సెల్వరాజ చెట్టియార్, జోసఫ్
డేవిడ్ లు ఒకటైపోయారు. అందుచేత దాదాపు
అరవై సంవత్సరాలుగా రెండు వర్గాలుగా విడిపోయి యానాం రాజకీయాల్ని నిర్ధేశిస్తూ ఉన్న
బెజవాడ,
కామిశెట్టి లు కలిసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడిరది.
ఆ విధంగా వీరిరువురూ కలిసి 1937 ఎలక్షన్లలో పోటీ చేసి విజయకేతనం ఎగరేసారు.
వీరికి ప్రతిపక్షంగా ఎర్రా జగన్నాధరావు, తోట
నరసింహమూర్తి, సమతం కృష్ణయ్య, నాగసూరి వెంకటరాజులు పనిచేసారు.
భిన్న పక్షాలు చేరి కూటమి కట్టినపుడు, ఒక దానిని మరొకటి మింగివేయటమనేది రాజకీయాలలో ఒక
సహజపరిణామం. కామిశెట్టి వర్గం యానాం
రాజకీయాలలో ఆ తరువాత కాలంలో మరో అర్ధశతాబ్దం పాటు ఏక ఛత్రాధిపత్యంగా కొనసాగటం ఆ మాటను నిజం చేసింది.
మున్సిపల్ కమిషన్ పాలన
1937 ఎలక్షన్లలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావటంతో, ఫ్రెంచి ప్రభుత్వం 1938 లో ఈ ఎన్నికలను రద్దు చేసి, మున్సిపల్ కౌన్సిల్
స్థానంలో మున్సిపల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షునిగా మారిపళన్
ను,
ఉపాధ్యక్ష్యునిగా
ఎర్రా జగన్నాథరావును నియమించింది. ఈ కమిషన్ మెంబర్లు గా కోన వెంకటరాజు, మలిపెద్ది అంకయ్య, కామిశెట్టి
అయ్యప్పనాయుడు, శింగంశెట్టి కామరాజు లు
వ్యవహరించారు. కొంత కాలానికి శింగంశెట్టి
కామరాజు స్థానంలో ఉడతా సాంబశివరావు నియమితులయ్యారు. 1938 నుంచి 1946 లో మున్సిపల్
ఎన్నికలు జరిగే వరకూ యానాం మున్సిపల్ పరిపాలనా వ్యవహారాలను ఈ మున్సిపల్ కమిషనే
చూసింది.
మరలా ఎన్నికలు
ఫ్రెంచి ఇండియా ఎన్నికలకు రెండు రకాల వోటరు జాబితాలు
ఉండేవి. ఒకటి ఫ్రెంచి దేశస్థులకొరకు మరొకటి భారతీయుల కొరకు. 1946 లో జరిగిన ఎన్నికలకు ఈ పద్దతికి స్వస్థి పలికి మొత్తం
ఓటర్లందరినీ ఒకే జాబితా క్రిందకు తీసుకువచ్చారు. (యానాంలో ఫ్రెంచి దేశస్థుల సంఖ్య
తక్కువగా ఉండటం వల్ల వారికోసం ప్రత్యేక జాబితా తయారుచేయటం 1899 లోనే నిలిపివేసారు). 1946 జూన్ 23 న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో
ఎర్రా జగన్నాధరావు మేయరుగా ఎన్నికయ్యారు. వీరి పానెల్‌లో గిరి మాధవరావు, అబ్దుల్ వహీద్ ఖాన్, దవులూరి
వెంకటరాజు, తోట వెంకట వేణుగోపాలరావు, కాపగంటి సూర్యప్రకాశ రావు, నాటి చినవెంకన్న కామిశెట్టి
భాష్యకారులు నాయుడు తదితరులు ఉన్నారు. వీరికి ప్రత్యర్ధులుగా కసిరెడ్డి
బ్రహ్మానందం, కామిశెట్టి పరశురామరావు నాయుడు, మద్దింశెట్టి సత్యానందం, కాపగంటి
బులిమంగరాజు, గుర్రపు వెంకటరత్నం, రొక్కం వెంకటరెడ్డి వంటి ప్రముఖులు ఉండేవారు.
ఈ ఎలక్షన్లలో పోటీచేసి విజయం సాధించిన కామిశెట్టి పరశురాంకు
25 సంవత్సరములు నిండని కారణంగా ఆయన ఎన్నికను యానాం కోర్డు
రద్దు చేసింది. అదే విధంగా మద్దింశెట్టి
సత్యానందం పేరు ఓటర్ల లిస్టులో లేని కారణంగా ఆయన ఎన్నిక కూడా చెల్లదని
తీర్పుచెప్పింది. ఇవే కాక ఈ ఎన్నికలలో
అనేక అవకతవకలు జరిగినట్లు నిరూపణ కావటంతో, 1946 ఆగస్టు 12 నాటి ఈ ఎన్నికలను రద్దు పరుస్తూ
యానాం కోర్టు తీర్పు చెప్పింది.
1948 లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో కామిశెట్టి పరశురాం బృందం
విజయం సాధించి, ఆయన మేయర్ పదవి
దక్కించుకొన్నారు. చింతా బ్రహ్మానందం, ఉడతా సాంబశివరావు, కాపగంటి
బులిమంగరాజు, వెలగలపూడి వీరయ్య, అబ్దుల్ వహీద్ ఖాన్, కోటి సత్యం, మోకా మహలక్ష్మి, రొక్కం
వెంకటరెడ్డి, కోన నరసయ్య, కనకాల తాతయ్య,
యర్రా సత్యనారాయణమూర్తి లు (యర్రా జగన్నాథరావు కుమార్డు) మెంబర్లు గా నెగ్గారు.
యానాం రాజకీయ చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి, ఎందుకంటే, ఈ ఎన్నికలు
ప్రధానంగా ఫ్రెంచి అనుకూల, వ్యతిరేక వర్గాల
మధ్య జరిగాయి. కామిశెట్టి వర్గం ఫ్రెంచి
అనుకూల ధోరణి కలిగిన రిపబ్లిక్ పార్టీ తరపున, యర్రా వర్గం
ఫ్రెంచి వ్యతిరేక ధోరణి కలిగిన ప్రజా పార్టీ తరపున పోటీ చేసింది. వీటిలో కామిశెట్టి వర్గం అఖండ విజయం సాధించటంతో
యానాం ప్రజలందరూ ఫ్రెంచి పాలనకు అనుకూలమని ఫ్రెంచి ప్రభుత్వం తలచింది. ఈ ఎలక్షన్లలో భారీఎత్తున రిగ్గింగు జరిగిందన్న
ఆరోపణల కారణంగా ప్రభుత్వం ఈ ఎన్నికలను కూడా రద్దు చేసింది.
అంతర్జాతీయ పరిశీలనా బృందం`యానాం పర్యటన
బ్రిటిష్ వారు భారతదేశం నుండి నిష్క్రమించటంతో ఫ్రెంచి
వారిపై ఒత్తిడి పెరిగింది. వీరు కూడా
భారతదేశాన్ని విడిచిపెట్టి వెళిపోవాలన్న డిమాండ్ ప్రాధాన్యత సంతరించుకొంది. మరో
వర్గం ఫ్రెంచి వారికి అనుకూలంగా ఉంటూ వారు భారతదేశం నుండి వైదొలగరాదని కోరేది. ఇలాంటి పరిస్థితుల నడుమ 1947 లో ఫ్రెంచి ప్రభుత్వం తన కాలనీలకు, సముద్రానికి ఆవలనున్న ఫ్రాన్స్ యొక్క భూభాగం అనే అర్ధం
వచ్చెలా ‘ఫ్రెంచి ఓవర్ సీస్ టెరిటరీస్’
అని నామకరణం చేసింది. ఇలా చేయటం ద్వారా ఈ కాలనీలన్నీ ఫ్రాన్స్
అంతర్భాగాలని ప్రపంచానికి చెప్పటానికి ప్రయత్నించింది. ఫ్రెంచి కాలనీలు భారతదేశంలో
విలీనం కావాలంటే 1948 లో చేసుకొన్న భారత్`ఫ్రెంచి ఒప్పందం ప్రకారం ప్రజలందరూ పాల్గొనే సాధారణ ఎన్నికల
ద్వారా ‘రిఫరెండం’ జరగాలి. ఇట్టి రిఫరెండపు ఎన్నికలలో ఎప్పటిలానే రిగ్గింగులు, బెదిరింపులు ఉన్నట్లయితే ఆ విధంగా వచ్చే ఫలితం
ఫ్రెంచివారికి అనుకూలంగా ఉండవచ్చుననే అనుమానాలు తలెత్తాయి. అందువల్ల రిఫరెండం
జరపటానికి తగిన పరిస్థితులు ఈ ఫ్రెంచికాలనీలలో లేవని భారత్ అంతర్జాతీయంగా తన
నిరసనను తెలియచేసింది.
భారతదేశంలో ఫ్రెంచికాలనీలలో రిఫరెండం జరపటానికి తగిన
పరిస్థితులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అధ్యయనం చేయటానికి 5 సభ్యులున్న అంతర్జాతీయ బృందం మార్చి 1951 లో పాండిచేరీలో అడుగు పెట్టింది. భారతదేశం ఈ బృందానికి
అభ్యంతరం చెప్పకపోయినా ఈ బృందం ఇచ్చే రిపోర్టుకు కట్టుపడనని ముందే చెప్పేసింది. ఈ
బృందంలో ఒకరైన ఆండ్రసన్ ఏప్రిల్ లో రెండురోజులపాటు యానాంలో బసచేసి విచారణ
చేపట్టాడు. ఈయన కామిశెట్టి, మద్దింశెట్టి, గిరి మాధవరావునాయుడు, దవుళూరి
వెంకటరాజు, మహమ్మద్ జిక్రియా వంటి వారితో భేటీ
అయి యానాం ఆర్ధిక రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నాడు. 1948 ఎన్నికల సమయంలో జరిగిన అవకతవకల గురించి సమాచారం అడిగి
తెలుసుకొన్నాడు. యానాన్ని భారతావనిలో
విలీనం చేయాలని పోరాడుతున్న దడాల రఫేల్ రమణయ్య ఆండ్రసన్ ను కలిసి మెమొరాండం
సమర్పించారు.
యానాం చాలా ప్రశాంతంగా ఉందనీ, ఇక్కడి ప్రజలలో, అణగారిన వర్గాలకు
చెందిన కొంతమంది వ్యక్తులు తప్ప మిగిలిన పురప్రముఖులందరూ ఫ్రెంచి పాలన ఉండాలని
కోరుకొంటున్నారని ఆండ్రసన్ తన తన రిపోర్టులో పేర్కొన్నాడు. భారతదేశంలో రిఫరెండం జరిపే పరిస్థితులు లేవని ఈ
బృందం రిపోర్టు ఇచ్చింది.
యానాం మొదటి దళిత మేయరు
శ్రీ పాము రామమూర్తి గారు రచించిన ‘తూర్పుగోదావరి జిల్లా
ఆది ఆంధ్రప్రముఖుల జీవితచరిత్రలు’ అనే పుస్తకములో శ్రీ గుర్రపు వెంకటరత్నం గురించి
ఈ క్రింది విధంగా ఉంది.
//శ్రీ గుర్రపు వెంకటరత్నం గారు శ్రీ గుర్రపు సత్తెయ్యగారి కనిష్టపుత్రులు. యానాం పురపాలక సంఘ ఎన్నికలలో వీరు తొమ్మిది సంవత్సరములు జయము పొందినారు. ఒక ఎన్నికలో పాల్గొన్న ఇరుపార్టీలందును సమానముగా సభ్యులు ఎన్నికైరి. ప్రభుత్వ పద్దతి ప్రకారము అత్యధిక వోట్లు సంపాదించిన సభ్యుని మేయరుగా నిర్ణయించవలసి యున్నది. అట్టి నిబంధనల ననుసరించి వెంకటరత్నం గారు యానాం మేయరు పదవిని నలంకరించినారు//
పై వివరణలో ఏ సంవత్సరములో ఆ సంఘటన జరిగిందో, ఎంతకాలం వారు మేయరుగా పనిచేసారో వంటి వివరాలు
తెలియరావు. Journal officiel de l'Inde française అనే పేరుగల ఆనాటి ఫ్రెంచి ప్రభుత్వ పత్రిక యొక్క
1881 నుంచి 1943 వరకూ లభ్యంలోఉన్న
కాపీలలో ఈ సంఘటన ప్రస్థావన లేకపోవటాన్ని బట్టి ఇది బహుశా ఆ తరువాత కాలంలో జరిగి
ఉండొచ్చని భావించాలి. (పై పత్రికలను http://gallica.bnf.fr/
అనే వెబ్ సైటులో
చదువుకొనవచ్చును) 1930 లలో యానాంకు చెందిన
శ్రీ వెంకటరత్నం గారు ఫ్రెంచి ప్రభుత్వంచే మేయరుగా కొంతకాలం
నియమించబడ్డట్లు స్థానికులు చెపుతారు. ఎలా చూసినా శ్రీగుర్రపు వెంకటరత్నం గారు
ప్రజలచే ఎన్నుకోబడిన మొదటి దళిత మేయరు అన్న విషయం సుస్ఫష్టం.
కొన్ని విచిత్రమైన ఎన్నికలు
1900 సెప్టెంబరులో జరిగిన స్థానిక కౌన్సిల్ కు ఇద్దరు
సభ్యులకొరకు ఎన్నికలు జరిగాయి. ఓటరు
లిస్టులో ఓటర్ల సంఖ్య 859. వారిలో 288 మంది ఓట్
చేసారు. అలా బెజవాడ బాపనయ్య 288 ఓట్లతోను, సమతం కృష్ణమనాయుడు
కూడా 288 ఓట్లను పొంది విజేతలుగా నిలిచారు. ఓటు హక్కును వినియోగించుకొన్నవారు 288 మంది.
నెగ్గినవారికి సరిగ్గా 288 ఓట్లు మాత్రమే
రావటం వైష్ణవమాయగా అనిపించకమానదు. ఒక వేళ
ఇద్దరు అభ్యర్ధులు మాత్రమే పోటీ చేసారనుకొన్నా ఇద్దరికీ సమానంగా ఓట్లు రావటం కూడా
విడ్డూరమే!
1901 మే లో స్థానిక మండలికి
ఒక అభ్యర్ధి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక వివరాలను చూస్తే ఇవసలు ఎన్నికలా లేక
ఏకగ్రీవ ఎన్నికా అనేది అర్ధంకాదు. మొత్తం 847 ఓటర్లు కాగా వారిలో 430 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎంతమంది పోటీ చేసారో తెలియరాదు కానీ, సమతం లక్ష్మీనరసయ్య 429 ఓట్లతో పొంది విజయం సాధించినట్లు మాత్రమే రికార్డులు చెపుతున్నాయి. నెగ్గిన
అభ్యర్థికి తగ్గిన ఒక ఓటు చెల్లని ఓటు అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలలో
చెల్లని ఓట్లేమీ లేవట! బహుసా ఆ ఒక్క ఓటు
ఈయన పోటీ అభ్యర్ధికి పడిఉండాలి. అది ఆయన ఓటేమో పాపం!
అప్పట్లో ఎన్నికల లో జరిగే అవకతవకలను వైరి వర్గాలు
డేగకళ్ళతో వీక్షించేవారు. ఏ చిన్న లొసుగు ఉన్నా కోర్టును ఆశ్రయించేవారు. ప్రతీ ఎన్నిక అనంతరం తప్పనిసరిగా కోర్టు కేసులు
నడిచేవి. చాలా కేసులు కొట్టివేయబడినా కొన్ని నెగ్గిన సందర్భాలు కూడా
లేకపోలేదు.
ఫ్రెంచి ప్రభుత్వం జరిపిన చివరి ఎన్నికలు
1951 లో నిర్వహించిన ఎన్నికలే ఫ్రెంచి ప్రభుత్వం నిర్వహించిన
ఆఖరు ఎన్నికలు. భారతదేశంలో ఫ్రెంచి పాలన
కొనసాగాలా వద్దా అని నిర్ణయించటానికి జరిపిన ఎన్నికలు ఇవి. 1948 లో యానాం ఓటర్ల సంఖ్య
1200 లు ఉండగా ఈ ఎలక్షన్లకు ఆ సంఖ్య 1662 కు పెరిగింది. ఈ
ఎలక్షన్లలో కామిశెట్టి పరశురాం, యర్రాలు కలిసి
మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య లకు
వ్యతిరేకంగా పోటీ చేసారు.
ఈ ఎలక్షన్లలో కామిశెట్టి, యర్రాల వర్గం ఓడిపోయింది. మద్దింశెట్టి, కనకాల తాతయ్యలు విజయం సాధించారు.
వీరిలో మద్దింశెట్టి మేయర్ పదవి చేపట్టారు. ఈ ఎలక్షన్లలో నెగ్గిన మెంబర్లు వరుసగా, మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి వెంకటరాజారావు, గిరి
మాధవరావు నాయుడు, నాటి చినవెంకన్న, కశిరెడ్డి బ్రహ్మానందం, కోన నరసయ్య, సమతం కృష్ణయ్య, పంపన
వీరాస్వామి, గుర్రపు వెంకటరత్నం, జ్ఞానవేల్ నాచియప్పన్ మొదలగువారు.
1947 లో బ్రిటిష్ వారు ఇండియా విడిచిపోవటంతో ఫ్రెంచి కాలనీలలో
కూడా జాతీయభావనలు బలపడ్డాయి. తదనంతరం
జరిగిన అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఈ ఎన్నికలలో నెగ్గిన మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి
వెంకటరాజారావు, నాటి చినవెంకన్న మరియు కశిరెడ్డి
బ్రహ్మానందం తదితరులు, అక్టోబరు 18, 1954 న పాండిచేరీ వద్ద కల కీళూరు లో జరిగిన అభిప్రాయసేకరణ లో యానాం తరపున
పాల్గొని ` ఫ్రెంచి కాలనీలను భారతదేశంలో విలీనం
చేయాలని ఓట్ చేసారు. ఆ విధంగా యానాంలోని
ఫ్రెంచి పాలనకు చరమ గీతం పాడబడిరది.
భిన్న రాజకీయ వర్గాలు - వివిధ దశలు
యానాం చిన్నప్రాంతం అవ్వటం, అప్పటి నాయకులు కూడా ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవ్వటం వలన చాలా
సందర్భాలలో నెగ్గిన, ఓడిపోయిన పక్షాల
వారి మధ్య ఏదో విధమైన చుట్టరికాలు ఉండేవి.
అంతేకాక ఎన్నికలలో ఏ పానెల్ పై పోటీ చేసినప్పటికీ అవి ముగిసాక మేయర్
ఎన్నిక సమయంలో నెగ్గిన అభ్యర్ధుల రాజకీయ
పునర్వవస్థీకరణ జరిగేది. ఆ కారణంగా యానాం
రాజకీయపరంగా రెండు వర్గాలుగా స్థిరీకరణ జరగలేదు.
అయనప్పటికీ యానాం రాజకీయ చిత్రాన్ని మూడు దశలుగా గుర్తించవచ్చును.
మొదటి దశలో బెజవాడ బాపనయ్య, కంతేటి సత్యప్రసన్నం, సమతం
వెంకటసుబ్బారాయుడు, పుణ్యమూర్తుల వెంకట
సుబ్బారాయుడులు ఒక వర్గంగాను ` పైడికొండల సుబ్బయ్య, కామిశెట్టి పేరమనాయుడు, ఫారమాండ్ లు
మరో వర్గం గా రాజకీయాలు నడచాయి. మొదటి
వర్గంలోని బెజవాడ బాపనయ్య, పుణ్యమూర్తుల వెంకట
సుబ్బారాయుడు, సమతం వెంకటసుబ్బారాయుడు ల స్థానాలలోకి
వారి వారసులుగా బెజవాడ వెంకటరెడ్డి (కొంతకాలం మాత్రమే), పుణ్యమూర్తుల శ్రీవెంకట రమణప్రసాదరావు, సమతం లక్ష్మినరసయ్యలు రంగప్రవేశం చేసారు. కామిశెట్టి పేరమనాయుడు స్థానంలో వారి
కుమారుడు వేణుగోపాలరావునాయుడు రంగప్రవేశం
చేసారు. ఈ మొదటి దశకు చెందిన నాయకులు 1880`1920 ల మధ్య యానాం రాజకీయాల్ని నడిపించారు.
రెండవ దశలో బెజవాడ వెంకటరెడ్డి కుమారుడు బెజవాడ బాపన్నాయుడు, కొత్త వెంకటరత్నం, కాపగంటి
చినమంగరాజు, సమతం లక్ష్మినరసయ్య, కనకాల బ్రాహ్మడు, బులుసు
సుబ్రహ్మణ్యశాస్త్రి, మహేంద్రవాడ గణపతి
శాస్త్రులు, కసిరెడ్డి గోపాలం, మలిపెద్ది అంకయ్య, దున్నా
కమలనాభం,
మద్దింశెట్టి సత్యనారాయణ, గిరి మాధవరావునాయుడు వంటి ప్రభృతులు ఒక వర్గం కాగా ` కామిశెట్టి వేణుగోపాల రావు నాయుడు, యర్రా జగన్నాథరావు (వీరు తరువాత కామిశెట్టితో విభేదించి
విడిపోయారు), నాగసూరి కామరాజు, తిక్కిరెడ్డి సత్యానందం, కొల్లాటి
రెడ్డినాయుడు, గ్రంధి లక్ష్మయ్య, నాగసూరి వెంకటరాజు, వెలగలపూడి
వీరయ్య,
కోన సుబ్బారావు, చింతా
బ్రహ్మానందం, కామిరెడ్డి వెంకటస్వామి, కూనపురెడ్డి సుబ్బారాయుడు, దనార్లకోట వెంకటరాజాచారి తదితరులు మరో వర్గంగాను ఉండేవారు. ఈ రెండవతరం నాయకుల హవా 1920`1950 ల మధ్య నడిచింది.
మూడవ దశ ఫ్రెంచి యానాం రాజకీయ చరిత్రలో అత్యంతకీలక
మైనది. 1948 లో జరిగిన ఎన్నికలు ఫ్రెంచి కాలనీల భవిష్యత్తు నిర్ణయించటానికి జరిగాయి. (ఈ
ఎలక్షన్లనాటి ప్రధాన, వైరిపక్షాల వివరాలు
ఇదే వ్యాసంలో చూడవచ్చును) 1951 ఎలక్షన్లలో నెగ్గిన నాయకులు అచంచల పోరాట ఫలితంగా యానాంలో ఫ్రెంచి పాలనకు
తెరపడిరది.
ముగింపు
యానాం నాయకులు ప్రారంభదశ నుండి పాండిచేరీ నాయకులతోనే తాము
మమేకమయ్యారు. అలా చేయటం ద్వారా యానానికి
మరింత మేలు చేయవచ్చునని వీరు భావించారు.
యానాం ఎన్నికలలో మొదట్లో ఉండిన ఫ్రెంచి దేశస్థుల ప్రాతినిధ్యం క్రమక్రమంగా
తగ్గిపోయింది.
1872 లో ఇక్కడ జరిగిన ఎన్నికలు భారతదేశంలోనే ప్రప్రథమంగా జరిగిన
ప్రజాస్వామ్యయుత సాధారణ ఎన్నికలు.
బ్రిటిష్ ఇండియాలో 1919 నుండి కౌన్సిల్
మెంబర్లను కొద్దిమంది ఉన్నత వర్గాల ప్రజలు మాత్రమే ఎన్నుకొనేవారు. సామాన్య ప్రజలకు
ఓటుహక్కు ఉండేదికాదు. బ్రిటిష్ ప్రభుత్వం 1935 లో చేసిన చట్టం ద్వారా ఎన్నికలలో సామాన్య ప్రజలందరికీ
ఓటుహక్కు కల్పించబడిరది. ఆ విధంగా డబ్బయి
లక్షలుండే ఓటర్ల లిస్టు మూడున్నర కోట్లకు చేరింది. కానీ ఫ్రెంచ్ ఇండియాలో 1871 లోనే 21 సంవత్సరములు నిండిన ఓటర్లందరికీ ఓటుహక్కు కల్పించబడిరది.
ఎన్నికల ప్రక్రియపై అవగాహన లేకపోవటం వల్ల యానాం మొదటి
ఎన్నికలలో 1394 మంది ఓటర్లకు 12 ఓట్లు మాత్రమే పోల్ అవ్వటం ఆశక్తిదాయకం.
ఎన్నికల తంతు ముగిసిన వెంటనే ఓడిపోయిన అభ్యర్ధులు
నెగ్గినవారి ఎన్నిక చెల్లదని కోర్టుకేసులు వెయ్యటం రివాజుగా ఉండేది. ఏవో రెండుమూడు కేసులను తప్ప దాదాపు అన్నిసార్లూ
ఆయా కేసులను యానాం కోర్టు కొట్టివేసింది.
యానాం ఎన్నికలలో దళితుల ప్రాతినిధ్యం ప్రారంభంలో లేకపోయినా
వారి ఉనికి నెమ్మది నెమ్మదిగా బయటపడిరది.
దున్నా కమలనాభం, గుర్రపు వెంకట రత్నం, మోకా మహలక్ష్మి, రొక్కం
వెంకటరెడ్డి, కమిడి వెంకట స్వామి వంటివారు
మెంబర్లుగా ఎన్నికయ్యారు. యానాన్ని
భారతావనిలో విలీనం చేయటంలో శ్రీ దడాల రఫేల్ రమణయ్య పాత్ర అనన్యమైనది. ఫ్రెంచి ఇండియా ఎన్నికలలో ముస్లిముల పాతినిధ్యం
కూడా సముచితంగానే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక బి.సి. లకు సంబంధించిన వివరాలే నిరాశను కలిగిస్తాయి. నాటి చినవెంకన్న, పంపన వీరాస్వామి, వెలగలపూడి వీరయ్య వంటివారు మాత్రమే మెంబర్లు గా ఎన్నికయ్యారు. ఏతావాతా ఫ్రెంచి పాలనలో బి.సి. లు రాజకీయంగా ఒక శక్తిగా ఎదగలేక పోయారన్నది ఒక చారిత్రక సత్యంగా మిగిలిపోయింది.
ఈ పుస్తకానికి అందమైన కవర్ పేజ్ నా బాల్యమిత్రుడు చిన్నారి డిజైన్ చేసాడు.
I still believe this is my work. No other book crossed it in my sweat and satisfaction. Its like my first love with history. :-)
ఐరనీ ఏమిటంటే అప్పట్లోనే ముప్పై వేల రూపాయల వెచ్చించి ముద్రించిన ఈ పుస్తకాన్ని 137 మందికాదు కదా ఆ సంఖ్యలో సగం మంది కూడా యానాంలో కొనుక్కోలేదు.
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా
ఫిబ్రవరి, 2011
No comments:
Post a Comment