యానాం అనేది 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాచే ఆవరింపబడిన ఒక చిన్న ప్రాంతం. ఇక్కడి ప్రజల మాతృభాష తెలుగు. వీరి సంస్కృతి సాంప్రదాయాల మూలాలు పొరుగునున్న తెలుగువారితో ముడిపడి ఉన్నాయి. అలాంటప్పుడు యానాం భారతావనిలో విలీనమైనపుడు సమీప ఆంధ్రా లో ఎందుకు కలిపేయలేదన్న ప్రశ్న సహజంగా ప్రతిఒక్కరికీ కలుగుతుంది.
1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే సమయానికి యానాం ఫ్రెంచివారి పాలనలో ఉంది. ఆ తరువాత 1956 లో భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయానికి ఫ్రెంచి వారు ఇక్కడ నుంచి భౌతికంగా నిష్క్రమించినా, యానాంపై భారతదేశానికి చట్టపరమైన హక్కు ఇంకా రాలేదు. కనుక ఆ సమయాలలో యానాన్ని సమీప తూర్పుగోదావరిజిల్లాలో అంతర్భాగం చేయాలన్న ఆలోచనే ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికింకా యానాం అనేది ఫ్రాన్స్ అంతర్భాగం. భారతదేశంలో విలీనం కాలేదు. యానాం ఫ్రెంచిపాలననుంచి విమోచనం చెంది భారతావనిలో విలీనమైన తరువాత కూడా దీనిని సమీప ఆంధ్రప్రదేశ్ లో కలపకుండా ప్రత్యేకంగా ఉంచటానికి ప్రధాన కారణం ఫ్రెంచివారు వెళిపోయేముందు భారత ప్రభుత్వంతో చేసుకొన్న ఒక ఒప్పందం.
ట్రీటీ ఆఫ్ సెషన్
ఫ్రెంచివారు తమ కాలనీలైన యానాం, పాండిచేరీ, మాహె, కారైకాల్‌లను స్వతంత్య్ర భారతావనికి అప్పగించి వెళ్ళేప్పుడు, భారత ప్రభుత్వంతో 1956, మే 28 న ట్రీటీ ఆఫ్ సెషన్ (Traite de Cession) ను చేసుకొన్నారు.
ఈ ఒప్పందములో ఆర్టికల్ 2 ఇలా చెపుతుంది.
The Establishments will keep the benefit of the Special Administrative Status in force prior to 1 November 1954. Any consitutional changes in this Status which may be made subsequently shall be made after ascertaining the wishes of the people.
(సారాంశం: ఈ స్థావరాలన్నీ , 1 నవంబరు 1954 కు పూర్వము కలిగి ఉండినటువంటి ప్రత్యేక పరిపాలనా హోదా ను నిలుపుకుంటాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తెలుసుకొన్న తరువాతే రాజ్యాంగపరంగా ఈ హోదాను మార్చవలసి ఉంటుంది)
1954 కు పూర్వం ఈ ప్రాంతాలు స్వతంత్య్ర భారతావనిలో కలువకుండా ప్రత్యేకంగా ఫ్రెంచివారి పాలనలో ఉన్నాయి. భారత స్వాతంత్రానికి ముందుకూడా ఇవి బ్రిటిష్ వారి పాలనకు అతీతంగానే ఉన్నాయి. పై క్లాజులో ఆ ప్రత్యేకతను నిలబెట్టమని ఫ్రెంచిప్రభుత్వం కోరింది. అంటే ఈ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా హోదా కల్పించమని ఫ్రెంచివారు వెళ్ళిపోయేముందు అడిగిన చివరి కోరిక. ఈ హోదాను మార్చాలంటే ఈ ప్రాంతప్రజల అభిప్రాయాన్ని ఒక రిఫరెండం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా భారతప్రభుత్వం 1 జూలై, 1963 న జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరీగా ఏర్పరచింది. అలా వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరచి ప్రత్యేక హోదా కల్పించి ఫ్రెంచిప్రభుత్వానికి ఇచ్చిన మాటను భారతప్రభుత్వం నిలబెట్టుకొంది.
సమీపరాష్ట్రాలలో విలీనం చేయటానికి జరిగిన ప్రయత్నాలు
ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేయ్యాలని మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నపుడు ఒక ప్రయత్నం జరిగింది. అంటే యానాన్ని ఆంధ్రాలోను, పుదుచ్చేరీ, కారైకాల్ లను తమిళనాడులోను, మాహేను కేరళలోను విలీనం చేయటానికి. ఆ ప్రతిపాదనను ఈ ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించారు. మురార్జీదేశాయ్ కూడా 1954 నాటి ఒప్పందాన్ని చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని అంటారు. ఎందుకంటే ఈ ఒప్పందం లోని 30వ ఆర్టికిల్‌లో ` ఈ ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించిన పిర్యాదుల పరిష్కారానికై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించబడిరది.
1990 లో పాండిచేరికి కొత్తగా నియమించబడిన గవర్నరు శ్రీమతి చంద్రావతి పాండిచేరిలో ఇంకా బతికిఉన్న ఫ్రెంచి సంస్కృతి, ఫ్రెంచి నేషనల్స్ అందుకొంటున్న ఫ్రెంచి పించనులు, ఫ్రాన్స్ పర్యవేక్షించే విద్యా సంస్థలు ఉండటాన్ని చూసి, ‘‘పోర్చుగీస్, బ్రిటన్‌పాలిత ప్రాంతాలలో ఆయా వలసపాలకుల ఉనికి కనిపించదని పాండిచేరీకి ఇంతటి స్వేచ్ఛ, ప్రత్యేకతను కల్పించటం ద్వారా నెహ్రూ తప్పు చేసాడేమోనని’’ వ్యాఖ్యానించారు.
ఆ తరువాత ఫ్రెంచి అంబాసిడర్ ఆండ్రూ లెవిన్ ఈమెను కలసి, పాండిచేరీ చారిత్రిక ప్రాముఖ్యతను, ఫ్రాన్స్ ఈ ప్రాంతాలను భారత్‌కు అప్పగించేటపుడు ఇరుదేశాలు చేసుకొన్న ట్రీటీ ఆఫ్ సిషన్ ను వివరించినపుడు ఆమె విస్మయానికి గురయ్యారట. ఇదే విషయాన్ని భారత మినిస్ట్రీఆఫ్ ఫారిన్ అఫైర్స్ శాఖాధికారుల వద్ద లెవిన్ ప్రస్తావించినపుడు, ‘‘1956 నాటి ట్రీటీకి వ్యతిరేకంగా ఆలోచనచేసే ఉద్దేశం భారత్ కు లేదని, ఆమెకు చారిత్రిక అవగాహన లేకపోవటం వల్ల అలా వ్యాఖ్యానించి ఉంటారు’’ అని వారు వివరణ ఇచ్చారట. ఈ అంశంపై అవగాహన కలిగిన విద్యావేత్తలు, చరిత్రకారులు అనేక మంది శ్రీమతి చంద్రావతి వ్యాఖ్యలను ఖండిరచారు. వారిలో 1954 లో పాండిచేరీలో భారత కమిషనర్‌గా పనిచేసిన భారత అధికారి అయిన కేవల్ సింగ్ వ్రాసిన "Pondicherry and Goa - Historical Contrast --Times of India 12 April, 1990” అనే వ్యాసం ప్రముఖమైనది. (DES ANCIENS COMPTOIRS DE L'INDE?/ Future of French India veterans? by Andrew Lewin published in CIDIF letters Nov 2010)
యానాన్ని ఆంధ్రలో కలపకుండా ప్రత్యేకంగా ఉంచటానికి మరొక ప్రధాన కారణం ఆనాటి స్థానిక నాయకుల దార్శనికత.
భారతావని నుంచి బ్రిటిష్ వారు వైదొలగిన తరువాత అందరి కళ్ళు ఫ్రెంచి వారిమీద పడ్డాయి. ఈ కాలనీలలో కూడా జాతీయవాద భావనలు బలపడి ఫ్రెంచి పాలననుండి విముక్తి పొందాలన్న ఆకాంక్ష ప్రజలలో పెరగసాగింది. అప్పటికే నెహ్రూ ‘‘ఫ్రెంచి కాలనీలు భారతదేశ ముఖంపై మొటిమల వలె ఉన్నాయని’’ వర్ణించాడు. భారతావనిలో తమకాలనీల మనుగడ ఇక అసాధ్యమన్న నిర్ణయానికి ఫ్రాన్స్ వచ్చేసింది. కానీ ఈ కాలనీలను భారత్‌కు అప్పగించటానికి వారి రాజ్యాంగంలోని ఆర్టికిల్ 27 ప్రకారం రిఫరెండం (ప్రజలందరి అభిప్రాయం తెలుసుకోవటం) తప్పనిసరి అని పట్టు పట్టింది.( Article 27 of the Constitution of the France Fourth Republic stipulates that “no surrender, no exchange, no addition of territory shall be valid without the consent of the peoples concerned” అని స్పష్టంగా చెపుతుంది.) వదులుకోవటం తప్పనిసరైతే హుందాగా అప్పచెప్పాలే తప్ప అవమానకర పరిస్థితులలో చేజార్చుకోకూడదని ఫ్రాన్స్ భావించింది.
ఈ పరిస్థితులలో 1948 లోనే భారత`ఫ్రెంచి ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకొన్నాయి. దీని ప్రకారం ఈ ప్రాంత ప్రజలు తాము భారతదేశంలో కలవాలా ఒద్దా అనే విషయాన్ని రిఫరెండం ద్వారా తేల్చుకోవాలి. ఈ రిఫరెండం తీర్పు అది జరిగిన ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. అంటే ఒక ప్రాంతం ఫ్రెంచివారితో ఉండాలనుకొంటే ఉండొచ్చు మరొక ప్రాంతం విడిపోవాలనుకొంటే విడిపోవచ్చు. అప్పటికి మొత్తం అయిదు ఫ్రెంచి కాలనీలుండేవి. అవి పాండిచేరి, మాహె, కారైకాల్, యానాం మరియు బెంగాల్‌వద్దకల చంద్రనాగూర్ లు. పై ఒప్పందానికి అనుగుణంగా చంద్రనాగూర్ 19, జూన్ 1949 న రిఫరెండం జరుపుకొంది. 7587 ఓట్లు భారతావనిలో విలీనానికి అనుకూలంగాను, 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్ అయ్యాయి. అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవటం వల్ల చంద్రనాగూర్ ఈనాడు ఈ అనంత భారతావనిలో ఉండే వేనవేల మునిసిపాలిటీలలో ఒకటిగా కనుమరుగైంది.
చంద్రనాగూర్ లోని స్థానిక నాయకులందరూ పొరుగునున్న బెంగాల్ రాష్ట్ర కమ్యూనిష్టు నాయకుల ప్రభావంలో ఉండి ఆ ప్రాంతాన్ని విదేశీపాలనా చెర నుండి విడిపించి పొరుగునున్న బెంగాల్ లో విలీనం చేయించటంలో కృతకృత్యులయ్యారు. కానీ అప్పటి యానాం నాయకులు పొరుగునున్న ఆంధ్రా నాయకుల ప్రభావంలో కాక పాండిచేరీ నాయకుల నాయకత్వంలో నడిచారు. దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్రావైపు ఎక్కువగా మొగ్గుచూపి ఉన్నట్లయితే చంద్రనాగూర్ వలెనే యానాం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ విశిష్టతా లేని ఒక పంచాయితీ గా మిగిలిపోయేది. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని భారతావనిలో కలిపేయాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందుచూపు కలిగి పాండిచేరీ తో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు. అపుడు మాత్రమే యానాం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. ఇది వారి దార్శనికతకు, రాజకీయ పరిణతికి నిదర్శనంగా చెప్పవచ్చు. పుదుచ్చేరీ నాయకులు కూడా యానాన్ని పాండిచేరీలో ఒక అంతర్భాగంగా చూసారు తప్ప వేరుగా చూడలేదు.
ఇక మిగిలిన నాలుగు ప్రాంతాల ప్రజలు ఫ్రెంచి వారిని అంత సులభంగా చేజార్చుకోవటానికి ఇష్టపడలేదు. భారతప్రభుత్వం కూడా పరిస్థితులు పక్వానికొచ్చే వరకూ ఎదురుచూసింది. హైదరాబాద్‌లోలా సైనిక పదఘట్టనలతో బలప్రయోగానికి సాహసించలేదు. అందునా ఇది దేశాల నడుమ వ్యవహారమాయె! 1948 డిసెంబరు, 19 న జైపూరులో జరిగిన కాంగ్రేసు ప్లీనరీసమావేశాలలో ‘‘స్వతంత్రభారతావని ఏర్పడినతరువాత, ఈ గడ్డపై విదేశీ పరిపాలన కొనసాగటం అసమంజసమే కాక దేశసమైక్యతకు భంగం కలిగించే విషయం’’ అని ఫ్రెంచివారినుద్దేశించి కాంగ్రేసు పార్టీ తీర్మానం చేసింది. ఆ తరువాత 1950 సెప్టెంబరు,21న నాసిక్ లో జరిగిన సమావేశాలలో కాంగ్రేసు పార్టీ మరలా ‘‘ దేశంలోని విదేశీ పాలిత ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో విలీనం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని’’ పునరుద్ఘాటించింది. 1952 నాటికి పాండిచేరీలో ప్రజలు ఫ్రెంచి వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోవటంతో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొనిఉంది. చిన్న చిన్న ఘర్షణలు, కొట్లాటలతో అట్టుడికి పోతూండేది. యానాంలో కూడా ఇదే పరిస్థితి ప్రతిబింబించేది. అక్టోబరు 22 న భారతభూభాగం నుంచి కొంతమంది సాయుధులు, పాండిచేరీలోకి ప్రవేశించి అక్కడి ఫ్రెంచి పౌరులపై దాడిచేసి గాయపరిచారు. ఈ ఉదంతాన్ని నెహ్రూ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన ‘‘ఫ్రెంచి వారు భేషరతుగా ఈ ప్రాంతాలను భారతదేశానికి స్వాధీనం చేయాలనీ, అలాచేసినట్లయితే ఈ ప్రాంతాల ప్రజల సాంస్కృతిక, భాషా, ఆచార, చట్టపరమైన హక్కులకు రక్షణ కల్పించగలనని’’ హామీ ఇచ్చాడు. ఫ్రెంచి వారు కోరుతున్నట్లుగా ఈ ప్రాంతాలలో రిఫరెండం జరిపించటానికి భారతప్రభుత్వం అంగీకరించక పోవటానికి కారణం కాశ్మీర్ లో కూడా ప్లెబిసైట్ (రిఫరెండం) జరపాలని పాకిస్తాన్ పట్టు పడుతుందన్న అనుమానం ఉండటం.
యానాం విమోచనం, డిఫాక్టో ట్రాన్సఫర్, ట్రీటీ ఆఫ్ సిషన్, డి జ్యూర్ ట్రాన్సఫర్ మరియు విలీనము
పై పదాలన్నీ ఒకే విధంగా అనిపించినప్పటికీ వాటి అర్ధాలలో చాలా వ్యత్యాసముంది. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు. యానాం ఎందుకు ఆంధ్రాలో విలీనం కాలేదో, యానాం ప్రత్యేకత ఏమిటో పై అంశాల ప్రాముఖ్యతను తెలుసుకొంటే మరింత అర్ధమౌతుంది.
విమోచనం: యానాంలో ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పతాక స్థాయిని చేరుకొని 1954, జూన్ 13 న ఉద్యమకారులు అప్పటి యానాం అడ్మినిష్ట్రేటరునుంచి అధికారాలను స్వాధీనపరచుకొని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తదుపరి ఫ్రెంచి జాతీయ జండాను అవనతం చేసి భారతదేశపతాకాన్ని ఎగురవేసి యానాం, ఫ్రెంచి పాలన నుండి ‘‘విమోచనం’’ చెందిందని ప్రకటించారు.
ఈ మొత్తం ఉద్యమంలో పాలుపంచుకొన్న ఆనాటి నాయకులలో, దడాల రఫేల్ రమణయ్య, మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, కామిశెట్టి వరప్రసాదరావు నాయుడు, కోన నరసయ్య, యర్రా సత్యనారాయణమూర్తి, భయంకరాచారి వంటివారు ప్రముఖులు. ఫ్రెంచి ప్రభుత్వం మాత్రం ఈ ఉద్యమాన్ని, ప్రభుత్వంపై జరిగిన ఒక ‘‘ముట్టడి’’ గా (Coup de’etat Yanaon) అభివర్ణించింది.
1956 మే, 28 న ఫ్రాన్స్`భారత దేశాల నడుమ జరిగిన ట్రీటీ ఆఫ్ సిషన్ ఒప్పందంలో ` యానానికి సంబంధించి 1954, జూన్ 13 తరువాత జరిగిన అన్ని అధికారిక/అనధికారిక వ్యవహారాలకు తనకు ఏ విధమైన సంబంధం లేదని విస్పష్టంగా చెప్పటాన్ని బట్టి యానాంలో ఫ్రెంచి పాలన 1954, జూన్ 13 తో చారిత్రికంగా ముగిసినట్లు భావించాలి.
డిఫాక్టో ట్రాన్సఫర్: ఫ్రెంచికాలనీల భవితవ్యం తేల్చటానికి 1954, అక్టోబరు 18న పాండిచేరీ లోని కీళూరు వద్ద ఈ కాలనీల ప్రజాప్రతినిధులతో జరిగిన రిఫరెండం లో ` ఫ్రెంచి పాలనను కోరుతూ 7 ఓట్లు, భారతదేశంలో విలీనానికి అనుకూలంగా 164 ఓట్లు రావటంతో ఫ్రెంచి ప్రభుత్వం ఈ కాలనీలను భారతదేశానికి యథాతథంగా అప్పగిస్తూ అక్టోబరు, 26న ఒక ఒప్పందం చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం 1954 నవంబరు, 1 న పాండిచేరీ, మాహే, కారైకాల్ మరియు యానాం లను భారత ప్రభుత్వానికి యథాతథ స్థితిలో అప్పగించింది. కనుక నవంబరు 1 ని డీఫాక్టో ట్రాన్సఫర్ దినంగా పరిగణిస్తారు.
ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం జరపాలని మొదట్లో పట్టు పట్టిన ఫ్రెంచి ప్రభుత్వం తన పట్టు సడలించుకొని, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొంటే చాలని సరిపుచ్చుకొంది. ప్రజలు పాల్గొనే రిఫరెండం లో ఫలితం తనకు అనుకూలంగా రాకపోతే విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుందన్న అనుమానంతో, భారత్ చేసిన ఒత్తిడి ఫలితమిది. (రి. అవర్ సీక్రెట్స్ ఇన్ అదర్స్ ట్రంక్స్` ఎ.జి. నూరాని, ఫ్రంట్ లైన్ పత్రిక జూలై 2005)
ట్రీటీ ఆఫ్ సిషన్: ఫ్రెంచి కాలనీలను భారత్ కు అప్పగించినా, అవి చట్ట పద్దతిలో భారతదేశంలో విలీనం కావటానికి మరో ఒప్పందం 1956 మే 28 న జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంత సార్వభౌమాధికారాలను భారతదేశానికి అప్పగించటం జరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా పాండిచేరీలో రెండు భవనాలను ఫ్రాన్స్ తన ఆధీనంలో ఉంచుకొని (అవి Rue de Marine లో ఫ్రెంచి కౌన్సిలేట్ కొరకు ఒక భవనం, Victor Simonel వీధిలో కల French College భవనము) మిగిలిన ప్రాంతాలను భారత్ కు ఇచ్చివేసింది. ఈ ఒప్పందానికి ఫ్రెంచిపార్లమెంటు వేయాల్సిన ఆమోదముద్ర ఫ్రాన్సు-అల్జీరియన్ యుద్ధం జరుగుతున్న కారణంగా ఆలస్యం జరిగింది. (అల్జీరియాకూడా ఒక ఫ్రెంచి కాలనీయే. ఇది స్వాతంత్య్రం కొరకు ఫ్రాన్స్ తో యుద్ధమే చేయవలసివచ్చింది).
డి జ్యూర్ ట్రాన్సఫర్: 1962 లో అల్జీరియా యుద్ధం ముగిసింది. 1962 లో ఫ్రెంచి పార్లమెంటు ట్రీటీ ఆఫ్ సిషనుకు ఆమోద ముద్రవేసింది. దరిమిలా 1962, ఆగష్టు 16 న ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ కాలనీల ‘‘సార్వభౌమాధికారాల్ని’’ భారత ప్రభుత్వానికి బదలాయించింది. కనుక ఆగష్టు 16 ను డి జ్యూర్ ట్రాన్సఫర్ దినమని పిలుస్తారు. ఇది పుదుచేరి ప్రభుత్వ అధికారిక స్వాతంత్య్రదినం. ఆ విధంగా ఈ కాలనీల ప్రజలు రెండు స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటారు. ఒకటి భారత స్వాతంత్య్రదినమైన ఆగష్టు 15 రెండవది ఆగష్టు 16 న జరుపుకొనే డి జ్యూర్ ట్రాన్సఫర్ దినం.
విలీనము: ఈ ప్రాంతాల ఫ్రెంచి సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షిస్తానని ఫ్రెంచి ప్రభుత్వానికి ఇచ్చిన హామీలకనుగుణంగా భారతప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, ఈ నాలుగు ప్రాంతాలను 1963 జూలై, 1న యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరీగా ప్రకటించింది. ఈ ప్రక్రియతో ఈ ఫ్రెంచికాలనీలు భారతావనిలో విలీనం కావటం పూర్తయింది.
ముగింపు
పదహారవ శతాబ్దం నుంచీ ఫ్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా కాలనీలను నిర్మించటం మొదలెట్టింది. ఇరవయ్యవ శతాబ్దం నాటికి ప్రపంచం మొత్తం మీద 8.5% భూమిని చేజిక్కించుకొంది. స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు అనేక ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి తప్పుకొంది. కానీ కొన్ని కాలనీలు ఈనాటికీ ఫ్రాన్స్ పరిపాలనలోనే కొనసాతున్నాయి. ఒకప్పటి ఈ ఫ్రెంచికాలనీలు పారిస్ కు కొన్ని వేల మైళ్ళదూరంలో ఉన్నప్పటికీ, ‘ఫ్రెంచ్ ఓవర్‌సీస్ డిపార్ట్‌మెంట్స్’ అనే పేరుతో పిలువబడుతూ నేడు యూరోపియన్ యూనియన్‌లో ఫ్రాన్స్ అంతర్భాగాలుగా పరిగణింపబడుతున్నాయి. ఇవి మార్టినిక్, గాడెలూప్, రీయూనియన్, ఫ్రెంచ్ గయానా లు. ఈ ప్రాంతాల జీవనప్రమాణాలు ఫ్రాన్స్‌లోని ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవు. ఇక్కడి యువకులు ఉన్నతచదువులకు పారిస్ వెళుతూంటారు. పారిస్‌లో ఆవిష్కరింపబడిన కొత్త ‘ఫాషన్‌లు’ తెల్లారేసరికల్లా ఇక్కడ ప్రత్యక్ష్యమవుతాయి. ఈ ప్రాంతం నుండి ఫ్రెంచి సెనేట్ కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉంది.
ఇక భారతదేశంలోని ఫ్రెంచికాలనీల విషయానికి వచ్చేసరికి 1947 లోనే ఫ్రెంచి ప్రభుత్వం వీటిని ఫ్రెంచి ఓవర్‌సీస్ టెరిటరీస్ లు అని (సముద్రాంతర ఫ్రాన్స్ భూభాగాలు) నామకరణం చేసింది. ఇలా చేయటం ద్వారా ఈ కాలనీలన్నీ ఫ్రాన్స్ అంతర్భాగాలని ప్రపంచానికి చెప్పటానికి ప్రయత్నించింది. కానీ 1954 లో ఈ ప్రాంతాల ప్రజలు ప్రదర్శించిన అచంచలమైన భారతదేశభక్తి కి ఫ్రెంచి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. భారతప్రభుత్వం కూడా సంయమనం పాటించి దౌత్యపరంగానే ఈ ప్రాంతాలను ఫ్రాన్స్ నుంచి పొందింది.
పాండిచేరీ, మాహే, కారైకాల్ మరియు యానాంలలో ప్రథమంగా యానామే ‘‘విమోచనం’’ చెందినట్లు ప్రకటించుకొంది. (ఆ తరువాత మాహే). పాండిచేరీ, కారైకాల్ లలో అలా జరగలేదు. ఈ విషయంలో ఈ ఫ్రెంచి కాలనీలలో ‘‘విమోచనం’’ అనేది ఒక్క యానాం, మాహే లకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ప్రాంతవాసులు డిఫాక్టో ట్రాన్‌ఫర్ దినం మాత్రమే జరుపుకొంటారు. ఆ విధంగా యానాం ‘‘క్రాంత దర్శి’’ గా చరిత్రకెక్కింది.
యానాం ని ఆంధ్రాలో కలపకపోవటం వెనుక ఇంతటి చరిత్ర దాగి ఉంది.
No comments:
Post a Comment