ప్రాచీన భారతదేశంలో న్యాయాధికారం రాజుగారి వద్దే ఉండేది. మనుస్మృతి అర్ధశాస్త్రాలలో చెప్పిన పద్దతులకనుగుణంగా నేరాలకు శిక్షలు విధించబడేవి. ఇక గ్రామాలలో కుల పెద్దలతో కూడిన పంచాయితీలలో స్థానిక విచారణలు జరిగేవి. ఇక్కడకూడా పైన చెప్పబడిన శాస్త్రాలననుసరించే తీర్పులు చెప్పేవారు. బ్రిటిష్ వారి రాకతో ఈ పద్దతికి తెరపడి ఆధునిక న్యాయవ్యవస్థ అవతరించింది. 1661 లో ఈస్ట్‌ఇండియా కంపనీ తన ఉద్యోగులకొరకు కొన్ని చట్టాల్ని, శిక్షల్ని సొంతంగా ఏర్పాటుచేసుకొంది. కాల క్రమేణా ఈ చట్టాల పరిధిలోకి సామాన్య ప్రజలను కూడా తీసుకురావటం జరిగింది.
1701 లో ఫ్రాన్స్ జారీచేసిన ఒక రాజశాసనం ద్వారా పాండిచేరీలోని
గవర్నర్ కౌన్సిల్ కు సంపూర్ణ జుడిషియల్ హక్కులు కల్పించబడ్డాయి. 1766 నుండి 1827 వరకూ పాండిచేరీలో ''Chaudrie'' అనే పేరుతో ఫ్రెంచి ఇండియా జుడిషియల్ వ్యవస్థ
రూపుదిద్దుకొంది. చాద్రిలను నేటి
కోర్టులతో పోల్చవచ్చును. (ఈ పదానికి
క్రియాసారూప్యం కలిగిన చావడి, సత్రం అనే
తెలుగు పదాలుండటం గమనార్హం) ఇక్కడ సివిలు, క్రిమినలు, శాంతిభద్రతలకు
సంబంధించిన అనేక విషయాలపై ఫ్రెంచి జడ్జిలు విచారణలు జరిపి తీర్పులు
ఇచ్చేవారు. ఈ తీర్పులు ఎక్కువగా భారతీయ
ప్రాచీన శిక్షాస్మృతులను ఆధారంగానే చేసేవారు. (రి. ఆనందరంగ పిళ్ళై డైరీలు.
పిళ్ళై కూడా ఒక చాద్రికి జడ్జిగా వ్యవహరించేవాడు) ఆ కాలంలో ఇవ్వబడిన తీర్పులను “Jugements du tribunal de la Chaudrie de Pondicherry - 1766 to 1817” అనే పేరుతో Jean Bonnan అనే ఆయన పుస్తకరూపంలోకి తీసుకొచ్చాడు. 1775 లో బ్రిటిష్ ఇండియాలో వార్న్ హేస్టింగ్స్ భారతీయ
శిక్షాస్మృతులను అనుసరించి ‘‘హిందూ లా’’ ను తయారుచేయించి ప్రవేశపెట్టాడు. కాగా
ఫ్రెంచి ప్రభుత్వం 1735 లోనే ఒక కమిటీ వేసి
స్థానిక శిక్షాస్మృతులను అధ్యయనం
చేయించింది. తదనుగుణంగానే చాద్రిలు తీర్పులు చెప్పేవి.
ఇక యానాం విషయానికి వస్తే ఇక్కడ అలాంటి చాద్రిలు
పనిచేసినట్లు తెలియరాదు. (రి. జె.బి.పి. మోర్)
1819 జనవరి, 6 న Compte Dupoy (ఫ్రెంచి గవర్నరు) ‘‘క్రిష్టియన్లు, ముస్లిములు లేక హిందువులు ఎవరైనప్పటికీ వారి వారి ఆచార
వ్యవహారాలను బట్టి విచారణ జరపవలసి
ఉంటుంది’’ అన్నాడు. ఇక్కడి ప్రజల
బాల్యవివాహాలు, వారసత్వ వ్యవహారాలు వంటివి ఫ్రెంచి
చట్టాలకు భిన్నగా ఉన్నప్పటికీ కూడా ఫ్రెంచి ప్రభుత్వం ఇక్కడి ప్రజల మనోభావాలకు
వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అలా చేస్తే
వారి వ్యాపారమనుగడ దెబ్బతింటుందన్న ఆలోచనలు కూడా
ఉండవచ్చు.
1819,
నవంబరు 22 న జారీ చేసిన ఒక
రాజ శాసనం ద్వారా ఫ్రెంచి ఇండియాలో ‘‘మాజిస్ట్రేట్ కోర్టులు’’
ప్రారంభించారు. వీటి ద్వారా
ఫ్రెంచిప్రభుత్వం తన కాలనీలలోని ప్రజలకు సమర్ధవంతమైన న్యాయాన్ని అందించే వ్యవస్థకు
శ్రీకారం చుట్టింది.
యానాం చాలా చిన్న ప్రాంతం కావటంచే సివిలు, క్రిమినల్, శాంతిభద్రత వ్యవహారాలన్నింటికీ కలిపి ఒకే జడ్జి
ఉండేవారు. మొదట్లో యానాం పెద్దొరే
(ఎడ్మినిస్ట్రేటర్) జడ్జిగా వ్యవహరించేవాడు.
ఆయనకు నోటరీ మరియు దుబాసీలు సహాయపడేవారు.
ఇక్కడ ఓడిపోయిన కేసులకు పాండిచేరీలో ఉన్న పెద్దకోర్టులో అప్పీలు చేసుకొనే
అవకాసం మొదట్లో ఉండేది కాదు. ఈ లొసుగును
ఉపయోగించుకొని Courson వంటి పెద్దొరలు నియంతలుగా
వ్యవహరించి కొంతకాలం యానాన్ని గడగడలాడిరచారు.
1784 లో చేసిన ఒక ఫ్రెంచి చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల్లో
జడ్జిమెంటు ఇచ్చేముందు ముగ్గురు స్థానిక ఫ్రెంచి పౌరుల సహాయంతో విచారణ జరపవలసి
ఉంటుంది. ఈ నిబంధన వలన యానాం కోర్టులో
క్రిమినల్ కేసుల విచారణ నత్తనడకన సాగుతూండేది.
ఎంపిక చేసిన స్థానిక న్యాయ సహాయకులలో ఒకరుంటే ఒకరుండని కారణంగా కేసులు
పదేపదే వాయిదా పడేవి. ఈ ప్రతిబంధకం వలన
చాలా కేసులు కోర్టు ఫైళ్ళలో మగ్గిపోతుండేవి.
1829 లో యానాంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. వీటిని అదుపుచేయటంలో అప్పటి పెద్దొర Delarche విఫలం కావటంతో
పాండిచేరీ నుంచి Lasparda ను యానాంకు
పెద్దొరగా అత్యవసరంగా పంపించారు. లెస్పార్డా వచ్చీరాగానే ‘‘తుదితీర్పులు
ఇవ్వటానికి యానాం పెద్దొరకు సంపూర్ణ అధికారాలు పాండిచేరీలో ఇవ్వబడ్డాయి’’ అన్న
తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ లో ప్రవేశపెట్టి ఆమోదింపచేయించుకొన్నాడు. దీనితో సహాయకుల అవసరం లేకుండా జడ్జిహోదాలో
పెద్దొర ఒక్కరే తీర్పులు ఇచ్చే అవకాశం ఏర్పడిరది. అలా లెస్పార్డా తనకు కొన్ని
విశిష్టాధికారాలను సృష్టించుకొని ఆనాటి యానాం అల్లర్లను అణచివేయగలిగాడు. (అది 1784 నాటి ఫ్రెంచి చట్ట వ్యతిరేకమైనప్పటికీ)
అప్పట్లో స్త్రీలు, పిల్లలు, ప్రభుత్వోద్యోగులు, చనిపోయినవారలకు
చెందిన కేసులకు ప్రథమ ప్రాధాన్యత ఉండి వారికి సంబంధించిన కేసులకు త్వరితగతిన
తీర్పులు చెప్పేవారు.
1833,
ఫిబ్రవరి 4 న జారీ చేసిన ఒక
డిక్రీ ద్వారా యానానికి ప్రత్యేక జడ్జి నియామకం జరగటం మొదలైంది. (రి.18 February
1833, Letter of De Melay to De Lesparda, COR.GLE, India V.31). ప్రజలకు సరైన న్యాయం అందించటం కోసం 1833 లో సుమారు పదిరకాల వివిధ మాన్యుయల్స్ ను ఫ్రెంచి
ప్రభుత్వం యానాం కోర్టుకు పంపించింది.
(మాన్యుయల్ ఆఫ్ జస్టిస్, మాన్యుయల్
ఆఫ్ క్రిమినల్ లా, సివిల ప్రొసీజర్
వంటివి)
క్రిమినల్ కేసుల విచారణ ముగ్గురు లేదా నలుగురు ఫ్రెంచి
దేశస్థుల సమక్షంలో జరగాలనే నిబంధనను సడలించి ముగ్గురు లేదా నలుగురు స్థానిక
పెద్దలను భాగస్వామ్యులను చెయ్యటం 1848 నుంచి మొదలయ్యింది. పెద్దొర
సిఫార్సుల మేరకు ఈ స్థానిక జడ్జిల నియామకం జరిగేది. ఆ విధంగా కామిశెట్టి పేరమ, బళ్ల సుబ్బయ్య, బులుసు
సుబ్రహ్మణ్య శాస్త్రులు, బెజవాడ బాపనయ్య,వర్ధినీడి అయ్యప్పనాయుడు, గిరి వెంకన్న, దరియాఖాన్ వంటి
స్థానికులు సహాయక జడ్జిలుగా పనిచేసారు.
1850 నాటి యానాం జుడిషియల్ వ్యవస్థలో ` ప్రధాన
న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రాసిక్యూటర్ (ఈయనే పోలీసు
ఉన్నతాధికారి కూడా), నోటరీ వంటి ప్రధాన
పదవులలో ఫ్రెంచి దేశస్థులు, వీరుకాక నలుగురు
స్థానిక సహాయకులు, ఒక దుబాసీ, ప్రమాణములు చేయించటానికి బ్రాహ్మణుడు, బంట్రోతు మరియు జైలరు ఒక్కొక్కరు చొప్పున ఉండేవారు. సుమారు ఇరవైమంది పోలీసులతో కూడిన పోలీసు
వ్యవస్థ కోర్టుకు అనుబంధంగా పనిచేసేది.
యానాం కోర్టులో 1833 లో పద్దెనిమిది కేసులు విచారణ జరగగా 1859 నాటికి వీటి సంఖ్య 118 కి పెరిగింది. ఇది ఆనాటి ప్రజలలో న్యాయవ్యవస్థపై పెరిగిన
నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకొనవచ్చును. కానీ 1833 లో ఒకే ఒక క్రిమినల్ కేసు నమోదు కాగా 1859 లో 83 క్రిమినల్ కేసులు
నమోదు కావటం గమనార్హం.
ప్రసిద్దిగాంచిన
కొన్ని కేసులు
యానాం కోర్టు ఏర్పడినపుడు దానికి ప్రథమ మాజిస్ట్రేట్ గా Emile Coet Morven నియమితుడయ్యాడు. ఇతని వ్యవహారశైలి తదనంతర
కాలంలో వివాదాస్పదమైంది. అక్టోబర్ 1833 లో మోర్వెన్ తన ఇంట్లో పనిచేసే అడపా వెంకటరెడ్డి తనకు
త్రాగటానికి మురికి నీరు ఇచ్చాడన్న కోపంతో అతను నాపై విషప్రయోగం చేసి
చంపాలనుకొంటున్నాడు అని కేసు బనాయించి పోలీసులచే చితక బాదించాడు. ముద్దాయిని పరిశీలించిన డా.పిథోస్ అతని ఒంటిపై
దారుణమైన దెబ్బలున్నాయని దృవీకరించాడు కూడా.
ఈ కేసు విషయం అంతా ఫ్రెంచి గవర్నరు De malay కు తెలిసి అప్పటి పెద్దొర అయిన జోర్డైన్ కు ఈ విధంగా ఉత్తరం వ్రాయటం
జరిగింది.
.......
నేరం ఋజువు కాలేదు.
ఆ నీరు త్రాగి మోర్వెన్ అనారోగ్యం పాలయిన దాఖలాలూ లేవు. విషప్రయోగం అన్నది ఒట్టి ఊహాగానమే తప్ప మరేమీ
కాదు. అడపా వెంకటరెడ్డిని తక్షణం విడుదల
చెయ్యండి..... అందరికీ న్యాయాన్ని అందించాల్సిన న్యాయమూర్తే ఇలా అధికార
దుర్వినియోగానికి పాల్పడటం శోచనీయం....... అంటూ అక్షింతలు పెట్టాడు.
ఆ తరువాత కూడా మోర్వెన్ వ్యవహార శైలి మారలేదు. మోర్వెన్ అనేక రకాలైన అవమానాలకు, వేధింపులకు గురిచేస్తున్నాడని ఈతని ప్రవర్తన కంటక ప్రాయంగా
ఉందంటూ యానాం ప్రజలు 1834లో గవర్నరుకు
పిర్యాదులు చేసారు. ఆర్ధిక అవకతవకలకు పాల్పడి యానాంపెద్దొర ఉద్యోగాన్ని
పోగొట్టుకొన్న కుర్సన్‌కు ఈ మోర్వెన్ అల్లుడే కావటం ఇక్కడ విశేషం.
మన్యవోరి మేడలో మానవ బలి కేసు
యానాం మన్యవోరి మేడలో అభియోగింపబడిన మానవబలి పై పాండిచేరి
కోర్టు ప్రధాన న్యాయమూర్తి Ristle Hueber 17 నవంబరు 1858 మరియు 25 మార్చి 1859 తారీఖులలో జరిపిన
విచారణల అనంతరం సమర్పించిన రిపోర్టు సారాంశం ఈ విధంగా ఉంది (రి. ఇండియా కార్డు 463).
........
మన్యం వెంకటరత్నం యానాంలో పేరుమోసిన జమీందారు. ఇతనికి
ఫ్రెంచి దొరలకూ మధ్య అనేక ఆర్ధిక వ్యాపారలావాదేవీలు ఉండేవి. 1856 ప్రాంతంలో ఈతనికి వచ్చిన జబ్బు ఎన్ని మందులు వాడినా
తగ్గలేదు. దానితో వెంకటరత్నం, షేక్ లాలా, ఆదినారాయణుడు
మరియు బావాజి అనే ముగ్గురు మంత్రగాళ్ళను ఆశ్రయించాడు. వాళ్ళు ఇదంతా చేతబడి ప్రభావం అని జమిందారును
నమ్మించారు. మీకు చేతబడిచేసింది నిజమే
అయితే మేం చదివే మంత్రం పూర్తికాగానే మీ ఇంటిపై రాళ్ళు వర్షిస్తాయి అంటూ ఏవో
మంత్రాలు జపించగా` వెంకటరత్నం ఇంటిపై
రాళ్ళ వర్షం కురిసిందట. దానితో జమీందారు ఆ మంత్రగాళ్ళ మాటలకు లొంగిపోయాడు. వాళ్ళు
అలా జమీందారు ఇంట్లో ఎనిమిదిరోజుల పాటు క్షుద్రపూజలు చేసారు. తోట గవన్ను అనే ఆ ఇంటి పనివాడిపై దెయ్యాన్ని
ఆవహింపచేస్తే ‘‘నువ్వొక నెలరోజుల్లో చనిపోతావు ఇప్పటికే ఆలస్యమయ్యింది తొందరగా
భూతశాంతి చేయించు’’ అన్నదట. దీంతో
బెంబేలెత్తిపోయిన జమీందారు మంత్రగాళ్ళు చెప్పినట్లు ‘‘మానవ కన్య’’ ను బలి ఇవ్వటానికి సిద్దపడ్డాడు. ఆ మంత్రగాళ్ళ కన్ను ఆ ఇంటిలోనే పనిచేస్తున్న
తోట గవన్ను కూతురైన పదేళ్ళ మంగ పై పడ్డాయి.
తోట గవన్నుకు తెలియకుండా బలి ఇవ్వటానికి ఆమెను ఎంచుకొన్నారు.
15 మే, 1856 న మంత్రగాళ్ళు
ఆమెను పెరట్లోకి తీసుకు వెళ్ళి ఏవో పదార్ధాలను ఆమెచే తాగించారు. అవి తాగాకా ఆమె ఇంటికి వెళ్ళి అపస్మారక
స్థితికి చేరి రెండురోజుల తరువాత మరణించింది.
కూతురు మరణించటం పట్ల ఆగ్రహించిన తోట గవన్ను కొంతమంది పెద్దల సహాయంతో, మన్యం వెంకటరత్నం మరియు ఆ ముగ్గురు మంత్రగాళ్ళపై యానాం
కోర్టులో కేసువేసాడు..... అంటూ రిజెల్ హూబర్ రిపోర్టు మొత్తం జరిగిన ఉదంతాన్ని
క్రోడీకరించింది.
అక్కడినుంచి మొదలైంది అసలు కధ. తోటగవన్ను ఇచ్చిన కంప్లైంట్
ఆధారంగా ఈ బలి ఉదంతంపై విచారణ జరిగింది. ఆ
అమ్మాయికి విషాన్ని పట్టించారన్న ఆరోపణ నిజానిజాలు నిర్ధారించటానికి వీలుపడలేదు, ఎందుకంటే అప్పటికే శవదహనం జరిగిపోయింది. అందుచేత
అప్పటి యానాం కోర్టు జడ్జి ణవ De Saint Hilaire ఈ కేసును కొట్టివేసి ముగ్గురు మంత్రగాళ్ళు నిర్ధోషులని విడుదల
చేసేసాడు. ఈ తీర్పు పట్ల యానాంలో పెద్ద
ఎత్తున నిరసన వ్యక్తమయింది. మన్యం
వెంకటరత్నం తన పలుకుబడిని ఉపయోగించి కేసును కొట్టివేయించాడని యానాం నుంచి
పిర్యాదులు అందటంతో ` పాండిచేరీ కోర్టు
ప్రధాన న్యాయమూర్తి రిజెల్ హ్యూబర్ మొత్తం కేసును పునర్విచారణ స్వయంగా చేపట్టి ఆ
మంత్రగాళ్ళకు మూడునెలల జైలు శిక్ష మరియు మంగ తల్లికి వెయ్యిరూపాయిల పరిహారాన్ని
ఇప్పిస్తూ తీర్పు చెప్పాడు.
ఈ మొత్తం ఉదంతంలో ఫ్రెంచి ప్రభుత్వం అప్పట్లో యానాంలో అన్ని
రంగాలలో ఆధిక్యతలో ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచటానికే ఆ
నిందితులకు నామ మాత్రపు శిక్షలు విధించినట్లు అనిపించక మానదు.
చెళ్లపిళ్ల
వారి కేసు
తొలితరం ప్రముఖ ఆధునిక తెలుగుకవి చెళ్లపిల్ల వెంకటశాస్త్రి
యానాంలో 1880 లలో విద్యనభ్యసించారు. చెళ్లపిల్ల వారు అల్లే కవిత్వంలో
తమను గరించి దూషణలు ఉన్నాయని కొంతమంది స్థానికులు కొంతమంది వీరిపై యానాం కోర్టులో కేసువేసారట. ఆ కేసు విచారణ చేసిన జడ్జిగారు నూనూగు
మీసాలైనా లేని చెళ్లపిల్ల వారిని చూసి ‘‘వీడు పొయెట్ అంటే నేను ఒప్పుకోను’’ అని
కేసు కొట్టివేసాట్ట. (రి. చెళ్లపిల్ల వారు రచించిన కధలు`గాధలు పుస్తకం). ఆ తరువాత కాలంలో శ్రీచెళ్లపిల్ల వారు
ఆంధ్రదేశం గర్వించదగ్గ కవిగా పేర్గాంచారు.
ఈ సందర్భంలో చెళ్లపిల్ల వారి తరపున వాదించిన లాయర్ యొక్క సామర్ధ్యం
మెచ్చుకోదగ్గది ఎందుకంటే నిజంగానే నందిని పందిగా చేయగలిగాడీ కేసులో.
ఎన్నికల
కేసులు
యానాంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఓడిపోయిన అభ్యర్ధులు
విజేతలపై కేసులువేయటం పరిపాటిగా ఉండేది. 1880 మేలో జరిగిన ఎన్నికలలో బెజవాడ బాపనయ్య మేయరుగా
ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక చెల్లదంటూ
ప్రత్యర్ధులు కేసు పెట్టారు. మేయర్ పదవి
చేపట్టటానికి బెజవాడ బాపనయ్యకు 25 సంవత్సరముల
వయసులేని కారణంగా ఆయన మేయర్ ఎన్నిక చెల్లదంటూ యానాం కోర్టు తీర్పుచెప్పింది.
1922 లో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు స్థానిక మండలి
సభ్యునిగా ఎన్నికయినపుడు ఆయనకు ఫ్రెంచిరాదనీ, ఆ ఎన్నిక
చెల్లదంటూ గిరి తాతయ్య కేసు వేసారు.
కోర్టువారు విచారణ జరిపి కామిశెట్టికి తగినంత ఫ్రెంచి వచ్చు కనుక అతని
ఎన్నిక చెల్లుతుందని తీర్పుచెప్పారు.
గ్రామ
బహిష్కరణ తీర్పు
ఫ్రెంచి కోర్టు తీర్పులలో గ్రామబహిష్కరణ కూడా ఒక
శిక్షావిధానంగా ఉండేది. ఉదాహరణకు యానానికి చెందిన సత్తర్ సాహేబ్ అనే ఫ్రెంచి
పౌరుడు దొంగతనం చేసినట్లు ఋజువు కావటంతో
అతని కేసులో 1913, జూన 27 న ఇచ్చిన తీర్పులో` మూడునెలల జైలు
శిక్ష,
25 ఫ్రాంకుల జురిమానా మరియు ఒక సంవత్సరం పాటు గ్రామ
బహిష్కరణ శిక్షలు విధించటం జరిగింది. ఈ
గ్రామ బహిష్కరణ ఒక్క యానానికి మాత్రమే పరిమితం కాక మిగిలిన అన్ని ఫ్రెంచి కాలనీలకు
కూడా వర్తిస్తుంది.
యానాం
విమోచనం లో జడ్జి పాత్ర
1954లో యానాంను ఫ్రెంచి పాలననుండి విముక్తం చేయటానికి
విమోచనోద్యమం ముమ్మరంగా జరిగింది. ఆ సందర్భంలో
ఫ్రెంచి దేశస్థుడయిన జార్జిసాలా యానాం అడ్మినిస్ట్రేటరుగా కొనసాగటం
మంచిదికాదన్న ఉద్ధేశ్యంతో ఫ్రెంచి ప్రభుత్వం ఆయనను పాండిచేరీ పిలిపించివేసింది.
అప్పటి యానాం కోర్టు న్యాయమూర్తి అయిన శ్రీ శివా గారికి యానాం అడ్మినిస్ట్రేటరు బాధ్యతలను అప్పచెప్పేరు. 1954 జూన్, 13న వేల సంఖ్యలో
విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటరు బంగళాను చేరుకొని ఇంచార్జ్ అడ్మినిస్ట్రేటరు
అయిన శ్రీ శివా నుండి అధికారాలను స్వాధీనపరచుకొని, యానాం రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి విముక్తమైందని ప్రకటించారు. శ్రీ శివా
పరిస్థితిని సమీక్షించి ప్రతిఘటించినట్లయితే తలెత్తే శాంతిభద్రతల సమస్యను
దూరాలోచనచేసి అధికారాలను ఉద్యమకారులకు బదలాయించారు. ఆ విధంగా యానాంలోని ఫ్రెంచిపాలనకు స్వస్థి
వాక్యం పలకబడిరది. వలసపాలకుల నుండి రాజ్యాధికారం స్థానికులకు అందించటంలో యానాం
జడ్జి పాత్ర ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయింది.
ముగింపు
యానాం మేజిస్ట్రేట్ కోర్టువారి అధికారిక వెబ్‌సైటు లో
యానాం కోర్టు 1725 కు పూర్వం డచ్చివారిచే
నిర్మింపబడిరదని, 1725 లో ఫ్రెంచివారి
చేతుల్లోకి వెళ్ళిందని ఉంది. ఇది మొదట డచ్చి కోర్టు అనీ తరువాత ఫ్రెంచి కోర్టుగా
రూపాంతరం చెందినట్లు వ్రాయబడిరది. ఏ
ఆధారాలతో ఒక ప్రభుత్వ వెబ్ సైటులో అలాంటి సమాచారాన్ని పొందుపరచారో ఆశ్చర్యం
కలిగించక మానదు.
యానాన్ని డచ్చివారు పరిపాలించినట్లు కానీ ఇక్కడ తమ
స్థావరాల్ని ఏర్పాటుచేసుకొన్నట్లు కానీ ఎక్కడా చారిత్రిక ఆధారాలు కనిపించవు.
డచ్చివారు పరిపాలించిన ప్రదేశాలైన పాలకొల్లు, జగన్నాధపురం
వంటి ప్రాంతాలలో ఎక్కడా ఏ విధమైన కోర్టులు నిర్మించలేదు. పాపం వారికి పదిహేడవ శతాబ్దం అంతా స్థానికరాజుల
నుండి వ్యాపారానుమతులు పొందటంతోనే సరిపోయింది.
పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పోటీ పడలేక కనుమరుగయిపోయారు. ఇంగ్లీషు, ఫ్రెంచివారిలాగా
డచ్చివారికి స్థానిక పరిపాలనలో పాలుపంచుకొనే అవకాశమే రాలేదు. కనుక ప్రస్తుతకోర్టు డచ్చివారిచే
నిర్మించబడిరదనటం సత్యదూరం.
యానాంలో చాద్రిలు లేవని జె.బి.పి. మోర్
అభిప్రాయపడినప్పటికీ పాండిచేరీలో వాటి నిర్వహణ
1717 నుంచీ సమర్ధవంతంగా ఉన్నది కనుక, యానాంలో కూడా 1723`1758 మధ్య కాలంలో పెద్దొరలుగా పనిచేసిన Guillard, Choisy, Saifray వంటి ప్రభృతులు వాటిని నిర్వహించి ఉండవచ్చుననే
భావించవచ్చును. ఏది ఏమైనప్పటికీ 1833 నుంచి మాత్రం ఒక పూర్తిస్థాయి జడ్జితో యానాం కోర్టు
నడిచిందన్నది ఒక చారిత్రక సత్యం.
(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం (2010) నుండి. Pdf ఆర్కైవ్స్ లో కలదు)
No comments:
Post a Comment